ఆర్థిక మంత్రిత్వ శాఖ
క్రీడా వస్తువుల తయారీ, పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రతిపాదించిన కేంద్ర బడ్జెట్
అధిక నాణ్యత కలిగిన, అందుబాటు ధరల్లోని క్రీడా వస్తువులకు ప్రపంచ కేంద్రంగా అవతరించేందుకు భారత్‌కు ఉన్న సామర్థ్యాన్ని బలోపేతం చేయనున్న కార్యక్రమం
రాబోయే దశాబ్ద కాలంలో క్రీడా రంగాన్ని సమూలంగా మార్చడానికి 'ఖేలో ఇండియా మిషన్' ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి
ఖేలో ఇండియా కార్యక్రమం ప్రారంభించిన క్రీడాకారులను క్రమపద్ధతిలో పెంపొందించే ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లనున్న 'ఖేలో ఇండియా మిషన్'
నాడు పోస్టు చేయడమైనది:
01 FEB 2026 12:43PM by PIB Hyderabad
అధిక నాణ్యత కలిగిన, అందుబాటు ధరల్లోని క్రీడా వస్తువులకు ప్రపంచ కేంద్రంగా అవతరించడానికి భారత్‌కు ఉన్న సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటూ దేశంలో క్రీడా వస్తువులకు సంబంధించిన ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు నేడు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
క్రీడా వస్తువులకు సంబంధించిన ఈ ప్రకటన ఈ ఏడాది బడ్జెట్‌లో పేర్కొన్న మూడు కర్తవ్యాలలో మొదటిదైన ‘ఉత్పాదకత, పోటీతత్వాన్ని పెంపొందించడం ద్వారా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, స్థిరంగా కొనసాగించడం.. అలాగే అస్థిరమైన ప్రపంచ పరిస్థితులకు తట్టుకోగల సామర్థ్యాన్ని నిర్మించటం’ అనే అంశంపై కేంద్రీకృతమై ఉంది. పరికరాల రూపకల్పన, పదార్థ విజ్ఞానం.. రెండింటిలోనూ తయారీ, పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడమే ఈ క్రీడా వస్తువుల కార్యక్రమానికి ఉన్న ముఖ్య ఉద్దేశ్యం.
భారత క్రీడా వ్యవస్థను బలోపేతం చేసే మరో కీలక ప్రతిపాదనను కూడా కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. “క్రీడా రంగం ఉపాధి, నైపుణ్యం, ఉద్యోగ అవకాశాల కోసం బహుళ మార్గాలను అందిస్తుంది. ఖేలో ఇండియా కార్యక్రమం ప్రారంభించిన క్రీడాకారుల నైపుణ్యాలను క్రమపద్ధతిలో పెంపొందించే ప్రక్రియను ముందుకు తీసుకెళ్తూ రాబోయే దశాబ్ద కాలంలో క్రీడా రంగాన్ని సమూలంగా మార్చడానికి నేను ఖేలో ఇండియా మిషన్ ప్రారంభించాలని ప్రతిపాదిస్తున్నాను” అని కేంద్ర ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు. ఇది బడ్జెట్ నిర్దేశించిన రెండో కర్తవ్యమైన ‘ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా భారత అభివృద్ధి పథంలో వారిని బలమైన భాగస్వాములుగా మార్చడం’ అనే లక్ష్యానికి అనుగుణంగా ఉంది.
కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పిన దాని ప్రకారం ఇండియా మిషన్ ద్వారా క్రీడా రంగానికి లభించే ప్రయోజనాలు:
* ప్రాథమిక, మధ్యస్థ, ఉన్నత స్థాయిలలో శిక్షణ కేంద్రాల మద్దతుతో ఒక సమగ్ర నైపుణ్యాభివృద్ధి మార్గాన్ని ఖేలో ఇండియా మిషన్ సులభతరం చేస్తుంది.
* కోచ్లు, సహాయక సిబ్బందిని క్రమపద్ధతిలో ఇది అభివృద్ధి చేస్తుంది.
* క్రీడా శాస్త్రం, సాంకేతికతను ఈ వ్యవస్థలో అనుసంధానించనుంది.
* క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి, క్రీడాకారులకు తగిన వేదికలను అందించడానికి వివిధ పోటీలు, లీగ్లను ఇది నిర్వహించనుంది.
* శిక్షణ, పోటీల కోసం క్రీడా మౌలిక సదుపాయాలను ఇది అభివృద్ధి చేస్తుంది.

***
(రిలీజ్ ఐడి: 2221609)
సందర్శకుల సూచీ సంఖ్య : : 82
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam