ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ. 12.2 లక్షల కోట్ల ప్రజా మూలధన వ్యయాన్ని ప్రతిపాదించిన బడ్జెట్


7 హై-స్పీడ్ రైలు కారిడార్లు, ఒక ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ సహా 20 కొత్త జాతీయ జలమార్గాలకు ప్రతిపాదనలు

ప్రైవేట్ డెవలపర్ల విశ్వాసం పెంపొందించేందుకు మౌలిక సదుపాయాల రిస్క్ గ్యారంటీ ఫండ్

స్వదేశీ సీప్లేన్ తయారీ ప్రోత్సహానికి సీప్లేన్ వీజీఎఫ్ పథకం

प्रविष्टि तिथि: 01 FEB 2026 12:56PM by PIB Hyderabad

"ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంపొందిస్తూ... వ్యాపార సంస్థలు, ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ అస్థిరతలను ఎదుర్కొంటూ సమర్థంగా అభివృద్ధి చెందేలా చేయడం ద్వారా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, స్థిరంగా కొనసాగించడం మా మొదటి కర్తవ్యం" అని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో 2026-27 కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తూ వ్యాఖ్యానించారు.

2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ. 2 లక్షల కోట్లుగా ఉన్న ప్రజా మూలధన వ్యయం 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 11.2 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే ఊపును కొనసాగించడానికి దానిని రూ. 12.2 లక్షల కోట్లకు పెంచాలని ప్రతిపాదించినట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. గత దశాబ్దంలో, మౌలిక సదుపాయాల పెట్టుబడి ట్రస్టులు (ఇన్విట్‌లు), రియల్ ఎస్టేట్ పెట్టుబడి ట్రస్టులు (ఆర్ఈఐటీలు), ఎన్ఐఐఎఫ్, ఎన్ఏబీఎఫ్ఐడీ వంటి ఆర్థిక సాయం అందించే కొత్త సాధనాల ద్వారా ప్రజా మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని ఆమె పార్లమెంటుకు తెలిపారు. సంవత్సరాలుగా, ఆర్ఈఐటీలు నూతన ఆదాయ మార్గాలను సృష్టించే విజయవంతమైన సాధనంగా మారాయి. ప్రత్యేక ఆర్ఈఐటీల ఏర్పాటు ద్వారా సీపీఎస్ఈల కీలక రియల్ ఎస్టేట్ ఆస్తుల రీసైక్లింగ్‌ను వేగవంతం చేయాలని 2026-27 బడ్జెట్ ప్రతిపాదించింది.

 

మౌలికసదుపాయాల రిస్క్ గ్యారంటీ ఫండ్

మౌలిక సదుపాయాల అభివృద్ధి, నిర్మాణ దశలో నష్టాలకు సంబంధించి ప్రైవేట్ డెవలపర్ల విశ్వాసాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా రుణదాతలకు విచక్షణతో క్రమాంకనం చేసిన పాక్షిక క్రెడిట్ హామీలను అందించడానికి మౌలిక సదుపాయాల రిస్క్ గ్యారంటీ ఫండ్ ఏర్పాటును ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.

పర్యావరణ సుస్థిరతతో సరుకు రవాణా

ఈ లక్ష్యాన్ని ప్రోత్సహించడానికి గానూ తూర్పున ఉన్న డాంకుని నుంచి పశ్చిమాన గల సూరత్‌ను కలుపుతూ కొత్తగా ప్రత్యేక సరుకు రవాణా కారిడార్‌లను ఏర్పాటు చేయాలని బడ్జెట్ ప్రతిపాదించింది. రాబోయే 5 సంవత్సరాల్లో 20 కొత్త జాతీయ జలమార్గాల (ఎన్‌డబ్ల్యూల) కార్యకలాపాలను ప్రారంభించాలని ప్రతిపాదించింది. ఒడిశాలోని ఎన్‌డబ్ల్యూ-5తో ప్రారంభించి... ఖనిజ సంపద పుష్కలంగా ఉన్న ప్రాంతాలైన తాల్చేర్, అంగుల్, కళింగ నగర్ వంటి పారిశ్రామిక కేంద్రాలను పారాదీప్, ధమ్రా ఓడరేవులతో అనుసంధానించాలని యోచిస్తోంది. 2047 నాటికి దేశీయ జలమార్గాలు, తీరప్రాంత జల రవాణా వాటాను 6 శాతం నుంచి 12 శాతానికి పెంచడం కోసం రైలు మార్గం నుంచి రోడ్డు మార్గానికి మోడల్ మార్పును ప్రోత్సహించేందుకు తీరప్రాంత సరుకు రవాణా ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.

శ్రీమతి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ... దీని కోసం అవసరమైన నిపుణులను అభివృద్ధి చేయడానికి శిక్షణా సంస్థలను ప్రాంతీయ కేంద్రాలుగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇది జలమార్గాల వెంబడి నివసిస్తున్న యువత తగిన శిక్షణను, నైపుణ్యాలను పొందడంలో ప్రయోజనకరంగా ఉంటుందని ఆమె అన్నారు. దేశీయ జలమార్గాలకు అనుగుణంగా వారణాసి, పాట్నాలో ఓడల మరమ్మతు వ్యవస్థను ఏర్పాటు చేయాలనీ ప్రతిపాదించారు.

7 హై-స్పీడ్ రైలు కారిడార్లు

పర్యావరణపరంగా సుస్థిరమైన ప్రయాణికుల రవాణా వ్యవస్థలను ప్రోత్సహించడం కోసం నగరాల మధ్య ఏడు హై-స్పీడ్ రైలు కారిడార్లను 'వృద్ధి అనుసంధానాలు'గా అభివృద్ధి చేయాలని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రతిపాదించారు. అవి i) ముంబయి-పూణే, ii) పూణే-హైదరాబాద్, iii) హైదరాబాద్-బెంగళూరు, iv) హైదరాబాద్-చెన్నై, v) చెన్నై-బెంగళూరు, vi) ఢిల్లీ-వారణాసి, vii) వారణాసి-సిలిగురి.

సీప్లేన్ వీజీఎఫ్ పథకం

చివరి మైలు వరకు, మూరుమూల ప్రాంతాల అనుసంధానాన్ని మెరుగుపరచడానికి... పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి... శ్రీమతి నిర్మలా సీతారామన్ స్వదేశీ సీప్లేన్ల తయారీకి ప్రోత్సాహకాలు అందించాలని ప్రతిపాదించారు. ఈ కార్యకలాపాలకు మద్దతునివ్వడానికి సీప్లేన్ వీజీఎఫ్ పథకాన్ని ప్రవేశపెడతామని తెలిపారు.

కార్బన్ క్యాప్చర్ యుటిలైజేషన్ అండ్ స్టోరేజ్ (సీసీయూఎస్)

2025 డిసెంబరులో ప్రారంభించిన రోడ్‌మ్యాప్‌కు అనుగుణంగా విద్యుత్, ఉక్కు, సిమెంట్, శుద్ధి కర్మాగారాలు, రసాయనాలు సహా ఐదు పారిశ్రామిక రంగాల తుది వినియోగ అనువర్తనాల్లో సీసీయూఎస్ సాంకేతికతలు అధిక సంసిద్ధత స్థాయిలను సాధిస్తాయని ఆర్థిక మంత్రి చెప్పారు. దీని కోసం రాబోయే 5 సంవత్సరాల్లో రూ.20,000 కోట్ల వ్యయాన్ని బడ్జెట్ ప్రతిపాదిస్తోంది.

సిటీ ఎకనమిక్ రీజియన్స్

నగరాలను భారత వృద్ధి, ఆవిష్కరణలు, అవకాశాలకు చోదకాలుగా ఆర్థిక మంత్రి అభివర్ణించారు. ఆధునిక మౌలిక సదుపాయాలు, ప్రాథమిక సదుపాయాలు అవసరమయ్యే టయర్ II, టయర్ III నగరాలతో పాటు ప్రముఖ ఆలయాలు గల పట్టణాలపైనా ప్రధానంగా దృష్టి సారించాలని ఇది ప్రతిపాదిస్తోంది. సముదాయాల ఆర్థిక శక్తిని అందించడం కోసం సిటీ ఎకనమిక్ రీజియన్ (సీఈఆర్) లను వాటి నిర్దిష్ట వృద్ధి చోదకాల ఆధారంగా మ్యాప్ చేస్తారు. దీని అమలు కోసం రానున్న 5 సంవత్సరాల్లో ప్రతి సీఈఆర్ కోసం రూ. 5000 కోట్లు కేటాయించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.

 

***


(रिलीज़ आईडी: 2221592) आगंतुक पटल : 23
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Malayalam , Kannada , Bengali , Urdu , हिन्दी , Punjabi , Gujarati