ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆర్థిక సర్వే 2025-26 ఉపోద్ఘాతం
· ‘అనిశ్చిత పరిస్థితుల్లోనూ వ్యవస్థాపక దృక్పథంతో విధాన రూపకల్పన’ ప్రభుత్వానికి ఆవశ్యకం
· భారత్ ఒకేసారి మారథాన్‌లోనూ, స్ప్రింట్‌లోనూ పరుగులు పెట్టాలి.. లేదా మారథాన్‌లోనే స్ప్రింట్ వేగంతో ఉరకలు వేయాలి: ఆర్థిక సర్వే
· నియంత్రణల నుంచి ప్రోత్సాహం దిశగా ప్రభుత్వ యంత్రాంగం పునర్నిర్మితమవుతుందనీ, అది లక్ష్యాలను నిర్దేశించుకోగలదనీ ఆశాభావం వ్యక్తపరిచిన ఆర్థిక సర్వే... గత ఏడాది కాలంలో రాష్ట్రాలు చేపట్టిన నియంత్రణల సడలింపు, తెలివైన నియంత్రణ కార్యక్రమాలు ఇందుకు దోహదం చేస్తాయని వెల్లడి
· వికసిత భారత్ సాధన, ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని చూపే దిశగా... ప్రభుత్వ సమర్థత, సమాజం, నియంత్రణల సడలింపు అంశాలన్నింటినీ ఒకచోట చేర్చిన ఆర్థిక సర్వే
· భౌగోళిక రాజకీయ మార్పులు పెట్టుబడులు, సరఫరా వ్యవస్థలు, వృద్ధి అవకాశాలను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో.. నిలదొక్కుకుని నిలవడం, నిరంతర ఆవిష్కరణలు, వికసిత భారత్ దిశగా స్థిరంగా అడుగులు వేయడం ద్వారా భారత్‌కు అపార ప్రయోజనాలు
· 17 అధ్యాయాలతో 2025-26 ఆర్థిక సర్వే పునర్వ్యవస్థీకరణ... దేశ ప్రాధాన్యాల విస్తృతి, నేటి కాలానికి వాటి ఔచిత్యాలే ప్రాతిపదిక
प्रविष्टि तिथि:
29 JAN 2026 2:18PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2025-26 ఉపోద్ఘాతంలో ప్రభుత్వ విధాన రూపకల్పనలో రావాల్సిన మార్పును స్పష్టంగా పేర్కొన్నారు. ‘‘అనిశ్చిత పరిస్థితుల్లో వ్యవస్థాపక దృక్పథంతో విధాన రూపకల్పన దిశగా ప్రభుత్వ చర్యల్లో బలమైన మార్పులు రావాలి. స్పష్టత వచ్చే వరకు వేచి చూడకుండా.. ముందే కార్యాచరణకు దిగాలి. సంకటాలకు వెరసి వెనకడుగు వేయకుండా నిర్మాణాత్మకంగా వాటిని ఎదుర్కోవాలి. ప్రయోగాలు చేస్తూ క్రమపద్ధతిలో పాఠాలు నేర్చుకోవాలి. ఎలాంటి స్తబ్ధతా లేకుండా గమనాన్ని సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలి’’ అని వ్యాఖ్యానించారు.
ఇది ఓ ‘సంగ్రహమైన ఆకాంక్ష’ మాత్రమే కాదనీ, ఈ విధానం దేశంలో ఇప్పటికే ఆచరణలో కనిపిస్తోందని ఆర్థిక సర్వే ఉపోద్ఘాతం స్పష్టం చేసింది. ‘‘సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో నిర్దిష్ట లక్ష్యాలతో కూడిన వేదికల ఏర్పాటు నుంచి.. దేశీయంగా ఆవిష్కరణలను ప్రోత్సహించేలా మొదటిసారి ప్రభుత్వ కొనుగోలు ప్రక్రియను పునర్నిర్మించడం వరకు ఈ మార్పు కనిపిస్తోంది. అలాగే, తనిఖీల ఆధారిత నియంత్రణ స్థానంలో నమ్మకంపై ఆధారపడిన నిబంధనల అమలును ప్రవేశపెట్టడం వంటి రాష్ట్ర స్థాయి సంస్కరణల్లోనూ దీన్ని గమనించవచ్చు. వ్యవస్థాపక ధోరణి గల ప్రభుత్వం నిబంధనల అమలుకే పరిమితం కాకుండా, సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్న విధానానికి ఇవి తొలి సంకేతాలు’’ అని ఉపోద్ఘాతం వ్యాఖ్యానించింది.
కోవిడ్ అనంతర కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్న వరుస సవాళ్లను ఆర్థిక సర్వే ప్రస్తావించింది. ఇన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ అసాధారణమైన పునరుద్ధరణను సాధించిందని సర్వే వ్యాఖ్యానించింది. ముఖ్యంగా దేశ పటిష్టమైన స్థూల ఆర్థిక పనితీరును వివరించింది. 2025 ఏప్రిల్‌లో అమెరికా విధించిన సుంకాల నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన విధానపరమైన, ఆర్థిక సంస్కరణలను కూడా పేర్కొన్నది. సంస్కరణల ఆవశ్యకతను గుర్తించిన ప్రభుత్వంలో ఒక నూతన ఉత్తేజం ఏర్పడింది. అయిదు నెలలు కాలాన్ని గమనిస్తే.. ప్రస్తుత పూర్తి ఆర్థిక సంవత్సరంలో భారత్ 7 శాతానికి పైగా వాస్తవ వృద్ధి రేటును నమోదు చేస్తుందనీ, వచ్చే ఏడాదిలో కూడా 7 శాతం లేదా దానికి చేరువలో వృద్ధి కొనసాగుతుందని ఆర్థిక సర్వే అంచనా వేస్తోంది.
2025లో ఆర్థిక స్థితిగతుల్లో చిత్రమైన వైరుధ్యం ఉందని ఆర్థి సర్వే పేర్కొన్నది. కొన్ని దశాబ్దాల్లో బలమైన స్థూల ఆర్థిక పనితీరును భారత్ ప్రదర్శిస్తున్నప్పటికీ.. విపరీత అంతర్జాతీయ పరిస్థితులతో తలపడాల్సి వస్తోంది. దాంతో స్థూల ఆర్థిక విజయాల వల్ల ఒనగూరే- కరెన్సీ స్థిరత్వం, దేశంలోకి మూలధన ప్రవాహాలు, వ్యూహాత్మక వెసులుబాటు వంటి ప్రయోజనాలు లభించడం లేదని సర్వే విశ్లేషించింది.
దేశీయ ఆకాంక్షలకూ, అంతర్జాతీయ పరిస్థితులకూ మధ్య ఉన్న సంబంధాన్ని ప్రస్తావిస్తూ ఆర్థిక సర్వే ఇలా పేర్కొన్నది: ‘‘భారత్ 145 కోట్ల మంది జనాభా కలిగిన దేశం. ఒకే తరంలో.. అదీ ప్రజాస్వామ్య చట్రంలోనే సంపన్న దేశంగా ఎదగాలని ఇక్కడి ప్రజలు కాంక్షిస్తున్నారు. భారత్ పరిమాణం, ఇక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థ దృష్ట్యా.. మనం అనుకరించదగ్గ నమూనాలు ఎక్కడా లేవు. ప్రపంచ అగ్రగామి ఆర్థిక శక్తి తన ఆర్థిక, ఇతర కట్టుబాట్లూ, ప్రాధాన్యాలను మార్చుకుంటుండటంతో.. అంతర్జాతీయ వాణిజ్యం అనిశ్చితిలో పడింది. ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలూ, విభేదాలూ పెరుగుతున్న ఈ తరుణంలో, భారత ఆర్థిక ఆశయాలు బలమైన ఎదురుగాలిని ఎదుర్కొంటున్నాయి. అయితే ప్రభుత్వం, ప్రైవేటు రంగం, గృహ రంగాలు సమన్వయంతో సాగుతూ, వాటిని అనుకూలంగా మలచుకొంటూ, అంకిత భావంతో నేటి పరిస్థితులకు తగిన విధంగా కృషి చేయడానికి సిద్ధపడితే.. ఆ ప్రతికూలతలను మనకు అనుకూల పవనాలుగా మార్చుకోవచ్చు. ఈ పని అంత సులభమైనదీ, అంత సౌకర్యవంతమైనదీ కాదు.. కానీ ఇది అనివార్యం.
వాస్తవిక పరిస్థితులను బేరీజు వేస్తూ, 2026లో ప్రపంచవ్యాప్తంగా తలెత్తే అవకాశమున్న మూడు రకాల పరిణామాలను ఆర్థిక సర్వే ప్రతిపాదించింది:
1. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ, ఆర్థిక అస్థిరతల ప్రతికూల ప్రభావాలు కొంత కాలం తర్వాత బయటపడవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచ దేశాల మధ్య సమన్వయం తగ్గడం, రిస్కు తీసుకోవడానికి వెనుకాడడం, స్వల్ప మార్పులకే భారీ పరిణామాలు సంభవించే ప్రమాదం ఉండే ప్రపంచ పరిస్థితులను ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. ప్రతికూల పరిణామాలను తట్టుకునే వెసులుబాటు తగ్గిపోవచ్చు. పరిస్థితులు ప్రశాంతంగా సాగడం కన్నా కూడా.. ఒక రకమైన ‘నియంత్రిత అస్తవ్యస్తత’ కొనసాగేలా కనిపిస్తోంది. దేశాలు ఏకీకృతంగా ఉన్నప్పటికీ.. అపనమ్మకం పెరుగుతున్న ప్రపంచంలో ముందుకు సాగాల్సి రావచ్చు.
2. క్రమరహితమైన బహుళ ధ్రువ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం గణనీయంగా పెరుగుతోంది. దీనిని కేవలం ఒక అరుదైన ముప్పుగా కొట్టిపారేయలేం. ఈ పరిస్థితుల్లో వ్యూహాత్మక పోటీ తీవ్రతరమవుతుంది... వాణిజ్యం మరింత బలవంతపు చర్యగా మారుతుంది. ఆంక్షలూ, వాటికి ప్రతిచర్యలూ వెల్లువెత్తుతాయి. రాజకీయ ఒత్తిళ్లతో సరఫరా వ్యవస్థలు మారిపోతాయి. ఆర్థిక ఒత్తిళ్లు సరిహద్దులు దాటి వ్యాపిస్తాయి. వీటిని అడ్డుకునే రక్షణ వ్యవస్థలు, సంస్థాగత వ్యవస్థలు బలహీనపడతాయి. ఇలాంటి ప్రపంచంలో విధాన నిర్ణయాలు దేశ ప్రయోజనాలకే మరింతగా పరిమితమవుతాయి. స్వయంప్రతిపత్తి, వృద్ధి, స్థిరత్వాల్లో దేన్ని ఎంచుకోవాలో తెలియని క్లిష్ట పరిస్థితులను దేశాలు ఎదుర్కోవాల్సి ఉండొచ్చు.
3. ఆర్థిక, సాంకేతిక, భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు విడివిడిగా కాకుండా- ఒకదానితో ఒకటి కలిసి, ప్రభావాలను తీవ్రతరం చేస్తూ.. వ్యవస్థాగత సంక్షోభాలు ముంచెత్తే ముప్పు పొంచి ఉంది. ఈ పరిస్థితి తలెత్తే అవకాశం తక్కువగానే ఉన్నప్పటికీ.. ఇది ఏర్పడితే మాత్రం, దాని పరిణామాలు అత్యంత అస్తవ్యస్తంగా ఉంటాయి. స్థూల ఆర్థిక పరిణామాలు 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం కన్నా దారుణంగా ఉండే అవకాశముంది.
పైన పేర్కొన్న మూడు పరిస్థితుల్లో ఏది తలెత్తినా.. పటిష్టమైన స్థూల ఆర్థిక పునాదుల కారణంగా మిగతా చాలా దేశాల కన్నా భారత్ మెరుగైన స్థితిలోనే ఉంటుందని ఆర్థిక సర్వే చెబుతోంది. అయితే, అంతమాత్రాన వాటి ప్రభావం మనపై అస్సలు ఉండదన్న భరోసా ఇవ్వలేమనీ హెచ్చరించింది. విశాలమైన దేశీయ మార్కెట్, తక్కువ ఆర్థికీకరణతో కూడిన వృద్ధి నమూనా, పటిష్టమైన విదేశీ మారక నిల్వలు, విశ్వసనీయ స్థాయిలోని వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి వంటివి భారత్‌కు కలిసొచ్చే ప్రధానమైన అంశాలని సర్వే పేర్కొన్నది. ఆర్థిక అస్థిరత పొంచి ఉన్న, భౌగోళిక రాజకీయ అనిశ్చితి శాశ్వతంగా మారిన నేటి వాతావరణంలో.. ఈ ప్రత్యేక లక్షణాలు మన దేశానికి పటిష్టమైన రక్షణగా నిలుస్తాయి.
అదేవిధంగా ఆర్థిక సర్వే ఇలా పేర్కొన్నది: ‘‘పై మూడు పరిస్థితుల్లోనూ భారత్‌కు ఓ ఉమ్మడి ముప్పు ఉంది. అది- మూలధన ప్రవాహాలకు అంతరాయం కలగడం, రూపాయి విలువపై దాని ప్రభావం పడడం. దాని తీవ్రత, కాలపరిమితి మాత్రమే మారుతుంటాయి. భౌగోళిక రాజకీయ అస్థిరతలతో కూడిన నేటి ప్రపంచంలో ఈ సమస్య కేవలం ఒక ఏడాదికే పరిమితం కాకుండా.. సుదీర్ఘకాలం కొనసాగే అంశంగా మారవచ్చు.
మారథాన్, స్ప్రింట్.. రెండూ ఒకేసారి
ప్రతిగా మరో వాదనను ఆర్థిక సర్వే వినిపించింది.. దేశీయీకరణ ప్రయత్నాలు ఎంత విజయవంతమైనప్పటికీ, దేశంలో ఆదాయాలు పెరిగే కొద్దీ దిగుమతులు కూడా తప్పనిసరిగా పెరుగుతాయి. కాబట్టి, ఆ పెరుగుతున్న దిగుమతుల బిల్లులకు అనుగుణంగా.. అవసరమైన విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించేలా, భారత్ తగినంత ఎగుమతి ఆదాయాన్ని, పెట్టుబడిదారుల ఆసక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది.
సరఫరా స్థిరత్వం, వనరుల నిల్వలను సృష్టించడం, వాణిజ్య మార్గాలతోపాటు చెల్లింపు వ్యవస్థల్లో వైవిధ్యీకరణపై దృష్టి సారించాలని ఆర్థిక సర్వే సూచించింది. 2026 సంవత్సరానికి సరైన విధానం వ్యూహాత్మక సంయమనమే తప్ప.. ఆత్మరక్షణ ధోరణితో కూడిన నైరాశ్యం కాదని వ్యాఖ్యానించింది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో భారత్ తన దేశీయ వృద్ధిని గరిష్టీకరించుకోవడంతోపాటు, బాహ్య కుదుపులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఆర్థిక సర్వే సూచించింది. ఇందులో భాగంగా రక్షణ వ్యవస్థలు, అదనపు వనరుల లభ్యత, ద్రవ్య లభ్యతలకు గతంలో కన్నా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.
మరో మాటలో చెప్పాలంటే.. ‘‘భారత్ ఒకే సమయంలో మారథాన్, స్ప్రింట్ రెండింటినీ పూర్తి చేయాలి. లేదా మారథాన్‌నే స్ప్రింట్ వేగంతో పరుగెత్తాలి’’ అని ఆర్థిక సర్వే స్పష్టంగా పేర్కొన్నది.
భారత్ ముందున్న సవాలు: విధానం, ప్రక్రియా సంస్కరణలు
వరుస ఆర్థిక కుదుపులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేటి ప్రపంచంలో.. భారత్ ముందున్న సవాలు కేవలం మెరుగైన విధానాలను రూపొందించడం మాత్రమే కాదనీ.. మన నిబంధనలు, ప్రోత్సాహకాలు, పాలనపరమైన ప్రతిస్పందనలన్నీ భారత్ నిలదొక్కుకునే శక్తిని పెంపొందించేలా ఉండటమే అసలైన సవాలు అనీ ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. విధాన సంస్కరణలు ముఖ్యమైనవే. ప్రక్రియా సంస్కరణలు నిస్సందేహంగా మరింత ముఖ్యమైనవి. ప్రభుత్వమూ, పౌరుల మధ్య సంబంధాలను ప్రక్రియలే నిర్ణయిస్తాయి. కాబట్టి విధానాల ఉద్దేశమూ, సంస్కరణల విజయానికైనా, వైఫల్యానికైనా అవే కీలకమవుతాయి. సంకేతాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. గత ఏడాదిలో వివిధ రాష్ట్రాలు చేపట్టిన నిబంధనల సడలింపు, తెలివైన నియంత్రణ చర్యలు గొప్ప ఆశావహ దృక్పథాన్ని కలిగిస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం తనను తాను పునర్నిర్మించుకోగలదనీ, నియంత్రణ - అదుపు నుంచి ప్రోత్సాహం దిశగా తన లక్ష్యాన్ని మార్చుకోగలదని ఇవి నిరూపిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్కరణలూ, ఇతర విధానపరమైన కార్యక్రమాలూ కలిసి.. దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల తీవ్రతను, వాటిని అధిగమించాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వ యంత్రాంగం గుర్తించిందని ఇది సంకేతమిస్తోంది. ఆ సవాళ్లకు దీటుగా ఎదగాల్సిన అవసరాన్ని ప్రభుత్వం అర్థం చేసుకుందని ఆర్థిక సర్వే సూచించింది.
వికసిత భారత్ సాధనలో, ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపేలా సాగే ప్రయాణంలో.. ప్రభుత్వ సామర్థ్యం, సమాజం, నియంత్రణల సడలింపు అనే మూడు అంశాలను ఆర్థిక సర్వే ఏకతాటిపైకి తెచ్చింది. అంతిమంగా ఒక ప్రజాస్వామ్యంలో.. అభివృద్ధిని అందించే అధికారం ఉన్న, ఆ అభివృద్ధి సాధనకు బాధ్యతను భుజాన వేసుకున్న ఏకైక సంస్థ ప్రభుత్వమేనని ఆర్థిక సర్వే వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తన లక్ష్యాలను చేరుకోవాలంటే నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. అలాగే మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త నైపుణ్యాలను అలవర్చుకోవాలి. అలాగే సరికొత్త వ్యూహాన్ని అమలు చేసేందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా, సవాళ్లతో కూడినవిగా ఉన్నాయి. పాత నియమాలు ఇక చెల్లుబాటు కావు. కొత్త నియమాలు పూర్తిస్థాయిలో రూపొందలేదు.
ప్రపంచవ్యాప్తంగా అనేక సంక్షోభాలు తలెత్తే అవకాశం ఉంది. దీనిని ఒక అవకాశంగా మలుచుకుని, భవిష్యత్తులో ఏర్పడబోయే నూతన ప్రపంచ వ్యవస్థను రూపొందించడంలో భారత్ అర్థవంతమైన పాత్రను పోషించవచ్చు. దీనికోసం.. స్వాతంత్ర్యానంతరం ముందెన్నడూ ప్రదర్శించనంత వేగవంతమైన, సరళమైన, దృఢసంకల్పంతో కూడిన పరిపాలనను భారత్ అందించాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే వ్యాఖ్యానించింది.
మరో మాటలో చెప్పాలంటే.. మనమందరం తక్షణ సుఖాలను వదులుకుని దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పనిచేయాలని సంకల్పిస్తే దేశం అపారంగా లబ్ధి పొందుతుందని సర్వే పేర్కొన్నది. భౌగోళిక రాజకీయ పునర్వ్యవస్థీకరణల వల్ల అంతర్జాతీయ వాతావరణం ఇప్పుడు కొత్త రూపు సంతరించుకుంటోంది. ఇవి రాబోయే కాలంలో పెట్టుబడులను, సరఫరా వ్యవస్థలను, వృద్ధి అవకాశాలను ప్రభావితం చేస్తాయి. నేటి ప్రపంచ అస్థిరతల నడుమ.. భారత్ తక్షణ, స్వల్పకాలిక ఒత్తిళ్లకు లొంగి తాత్కాలిక పరిష్కారాల వెంట పడకూడదని సర్వే చెప్పింది. దానికి బదులు నిలదొక్కుకునే శక్తిని పెంపొందించుకోవాలనీ, నిరంతరం ఆవిష్కరణలు చేయాలనీ, వికసిత్ భారత్ దిశగా తన ప్రయాణంలో స్థిరంగా సాగాలని స్పష్టం చేసింది.
ఆర్థిక సర్వే సరికొత్త నిర్దేశం
గత కొన్నేళ్లుగా అనుసరిస్తున్న ప్రామాణిక పద్ధతి నుంచి ఆర్థిక సర్వే ఈ దఫా దిశను మార్చుకుంది. ఈ సంచిక విశ్లేషణలో మునుపెన్నడూ లేనంత లోతును, అలాగే చర్చించే అంశాల పరిధిని మరింతగా విస్తరించుకుంది. ఈ ఎడిషన్ ఆర్థిక సర్వే లోతూ, పరిధీ విస్తృతంగా ఉన్నాయి. ఇందులో 17 అధ్యాయాలను పునర్వ్యవస్థీకరించారు. గతంలో అధ్యాయాల అమరిక కేవలం పద్ధతులపైనే ఆధారపడేది. కానీ ఇప్పుడు దేశ ప్రాధాన్యాల విస్తృతి, ప్రస్తుత కాలానికి వాటి ఔచిత్యం ఆధారంగా ఈ క్రమాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఈ సారి ఆర్థిక సర్వే గతంలో కన్నా సుదీర్ఘంగా ఉంది. అనేక అంశాలను ఇందులో చర్చించడమే దీనికి కారణం. చివరిగా భారత మధ్యస్థం నుంచి దీర్ఘకాలిక ప్రయోజనాలున్న మూడు అంశాలను ప్రత్యేక వ్యాసాల్లో ఈ సర్వే చర్చిస్తోంది. అవి: కృత్రిమ మేధ పరిణామం, భారతీయ నగరాల్లో జీవన ప్రమాణాల్లో సవాలు, వ్యూహాత్మకంగా నిలదొక్కుకునే శక్తినీ వ్యూహాత్మక ఆవశ్యకతనూ సాధించడంలో ప్రభుత్వ సామర్థ్యమూ, ప్రైవేటు రంగమూ (గృహాలు సహా) పోషించగల పాత్రలు.
***
(रिलीज़ आईडी: 2220621)
आगंतुक पटल : 56