ఆర్థిక మంత్రిత్వ శాఖ
వినియోగం, పెట్టుబడుల ద్వంద్వ చోదక శక్తుల ప్రభావంతో 2026 ఆర్థిక సంవత్సరానికి భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 7.4 శాతంగా అంచనా.
2027 ఆర్థిక సంవత్సరానికి వాస్తవ జీడీపీ వృద్ధి 6.8 నుంచి 7.2 శాతం మధ్యగా అంచనా.
2026 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 61.5 శాతానికి పెరిగిన ప్రైవేట్ తుది వినియోగ వ్యయం వాటా
2026 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం, అనుబంధ రంగాలు 3.1 శాతం వృద్ధి చెందుతాయని అంచనా.
2026 ఆర్థిక సంవత్సరపు తొలి అర్ధభాగంలో తయారీ రంగంలో 8.4 శాతం వృద్ధితో పారిశ్రామిక రంగం బలపడుతున్న సంకేతాలు
2026 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో సేవా రంగ స్థూల విలువ జోడింపు 9.3 శాతానికి పెరుగుదల
గడచిన దశాబ్దాలలోనే అత్యంత కనిష్ట స్థాయి 2.2 శాతానికి తగ్గిన స్థూల నిరర్ధక ఆస్తుల నిష్పత్తి
2025 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 825.3 బిలియన్ డాలర్లకు చేరిన భారత్ మొత్తం ఎగుమతులు (వస్తు,సేవలు)
మూడు సంవత్సరాల చర్చల అనంతరం యూరోపియన్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసిన భారత్
प्रविष्टि तिथि:
29 JAN 2026 2:19PM by PIB Hyderabad
వినియోగం, పెట్టుబడుల రెట్టింపు శక్తుల ప్రభావంతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారత గరిష్ట దేసియోత్పత్తి వృద్ధిని 7.4 శాతంగా అంచనా. వేశారు. ఇది వరుసగా నాలుగో ఏడాది కూడా వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత స్థితిని పునరుద్ఘాటించింది. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2025-26 ఆర్థిక సర్వే లో ఇది ముఖ్యాంశంగా నిలిచింది.
2027 ఆర్థిక సంవత్సరానికి వాస్తవ జిడిపి వృద్ధి 6.8-7.2 శాతంగా ఉండవచ్చని, అదే సమయంలో భారత అవకాశ వృద్ధి సుమారు 7 శాతంగా ఉంటుందని సర్వే పేర్కొంది.
2026 ఆర్థిక సంవత్సరంలో దేశీయ డిమాండ్ ఆర్థిక వృద్ధికి వెన్నుముకగా నిలిచిందని సర్వే పేర్కొంది. తొలి ముందస్తు అంచనాల ప్రకారం, జిడిపిలో ప్రైవేట్ తుది వినియోగ వ్యయం (పీఎఫ్సీఈ) వాటా 61.5 శాతానికి పెరిగింది. వినియోగంలో ఈ బలం, తక్కువ ద్రవ్యోల్బణం, స్థిరమైన ఉపాధి పరిస్థితులు, పెరుగుతున్న వాస్తవ కొనుగోలు శక్తి వంటి లక్షణాలతో కూడిన అనుకూలమైన స్థూల ఆర్థిక వాతావరణాన్ని ప్రతిబింబిస్తోంది. అంతేకాకుండా, పటిష్టమైన వ్యవసాయ పనితీరుతో స్థిరపడిన గ్రామీణ వినియోగం, ప్రత్యక్ష, పరోక్ష పన్నుల హేతుబద్ధీకరణతో క్రమంగా మెరుగుపడిన పట్టణ వినియోగం కలసి వినియోగ డిమాండ్ అన్ని రంగాల్లో విస్తృతంగా ఉందని స్పష్టం చేస్తున్నాయి.
వినియోగంతో పాటు, పెట్టుబడులు కూడా 2026 సంవత్సరంలో వృద్ధికి ఊతంగా కొనసాగాయి. స్థూల స్థిర మూలధన నిర్మాణం (జీఎఫ్సిఎఫ్) వాటా ను 30.0 శాతంగా అంచనా వేశారు. సంవత్సరం అర్ధభాగంలో పెట్టుబడి కార్యకలాపాలు మరింత పుంజుకున్నాయి. ఈ కాలంలో జీఎఫ్సీఎఫ్ 7.6 శాతం వృద్ధి చెందింది, ఇది గత సంవత్సరం ఇదే కాలంలో నమోదైన వేగాన్ని మించి, మహమ్మారికి ముందు సగటు అయిన 7.1 శాతం కంటే ఎక్కువగా ఉంది.
2026 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం, అనుబంధ రంగాలు 3.1 శాతం వృద్ధి చెందుతాయని సర్వే ప్రముఖంగా పేర్కొంది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో అనుకూలమైన రుతుపవనాలు వ్యవసాయ కార్యకలాపాలకు మద్దతునిచ్చాయి. వ్యవసాయ జీవీఏ 3.6 శాతం వృద్ధిని సాధించింది. ఇది 2025 ఆర్థిక సంవత్సర తొలి అర్ధభాగంలో నమోదైన 2.7 శాతం వృద్ధి కంటే ఎక్కువే అయినా దీర్ఘకాలిక సగటు వృద్ధి రేటు అయిన 4.5 శాతం కంటే తక్కువగానే ఉంది. అనుబంధ కార్యకలాపాలు, ముఖ్యంగా పశుసంవర్ధక, మత్స్య రంగాలు సుమారు 5-6 శాతం స్థిరమైన వృద్ధి రేటును నమోదు చేశాయి. వ్యవసాయ స్థూల విలువ జోడింపు (జీవీఏ) లో వీటి వాటా పెరగడంతో, మొత్తం వ్యవసాయ వృద్ధి అస్థిరమైన పంటల దిగుబడి, సాపేక్షంగా స్థిరమైన అనుబంధ రంగాల విస్తరణపై ఆధారపడి ఉంది.
2026 ఆర్థిక సంవత్సర తొలి అర్ధభాగంలో తయారీ రంగం సాధించిన 8.4 శాతం వృద్ధి పారిశ్రామిక రంగం పటిష్టతను చాటుతోందని సర్వే పేర్కొంది. ఇది 2026 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన 7.0 శాతం వృద్ధిని అధిగమించింది. దీనికి తోడు, ప్రభుత్వ మూలధన వ్యయం కొనసాగడం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగవంతంగా సాగుతుండటంతో నిర్మాణ రంగం సుస్థిరంగా నిలిచింది. . వాస్తవ ధరల పరంగా తయారీ రంగం వాటా 17-18 శాతం వద్ద స్థిరంగా కొనసాగుతోంది. తయారీ రంగ స్థూల ఉత్పత్తి విలువ (జీవీఓ) సుమారు 38 శాతంగా ఉంది. ఇది సేవా రంగంతో సమానంగా ఉంటూ, ఉత్పత్తి స్థిరత్వాన్ని సూచిస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక రంగం కూడా మరింత పుంజుకుని, 2025 ఆర్థిక సంవత్సరంలోని 5.9 శాతం వృద్ధి నుంచి 6.2 శాతానికి చేరుకుంటుందని అంచనా. పీఎంఐ మాన్యుఫ్యాక్చరింగ్, ఐఐపీ మాన్యుఫ్యాక్చరింగ్, ఈ-వే బిల్లుల జారీ వంటి 2026 ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసిక గణాంకాలు తయారీ రంగం పటిష్టమైన డిమాండ్‌తో బలోపేతం అవుతున్నట్లు సూచిస్తున్నాయి. ఉక్కు వినియోగం, సిమెంట్ ఉత్పత్తి వంటి నిర్మాణ రంగ సూచికలు స్థిరమైన వృద్ధిని కనబరిచాయి. రాబోయే కాలంలో జిఎస్‌టి హేతుబద్ధీకరణ, సానుకూల డిమాండ్ అంచనాల కారణంగా పారిశ్రామిక కార్యకలాపాలు మరింత ప్రోత్సాహకరంగా కొనసాగవచ్చని అంచనా.
సరఫరా పరంగా సేవా రంగం ఆర్థిక వృద్ధికి ప్రధాన చోదక శక్తిగా ఉందని ఆర్థిక సర్వే స్పష్టంగా పేర్కొంది. 2026 ఆర్థిక సంవత్సర తొలి అర్ధభాగంలో సేవా రంగ స్థూల విలువ జోడింపు(జివీఏ) 9.3 శాతం పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఇది 9.1 శాతంగా ఉంటుందని అంచనా. ఈ ధోరణి సేవా రంగం అంతటా విస్తృతమైన విస్తరణను సూచిస్తోంది. సేవా రంగంలో, కోవిడ్ ప్రభావానికి గురైన ‘వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్, ఇతర సంబంధిత సేవలు’ మినహా మిగిలిన అన్ని ఉప రంగాలు 9 శాతం కంటే ఎక్కువ వృద్ధి సాధించాయి. ఈ నిర్దిష్ట రంగం మాత్రం కరోనాకు ముందు ఉన్న సగటు వృద్ధికి ఇంకా 50 బేసిస్ పాయింట్ల దూరంలో ఉంది.
ఆర్థిక వ్యవస్థ డిమాండ్ ఆధారిత వృద్ధి, ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గడంతో కలిసి సాగిందని ఆర్థిక సర్వే పేర్కొంది. ఇది వాస్తవ కొనుగోలు శక్తిని మెరుగుపరచడమే కాకుండా వినియోగానికి మద్దతునిచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్య దేశీయ ద్రవ్యోల్బణ పరిస్థితులు, ఆహార ధరలు భారీగా తగ్గడం ధరల ఒత్తిడి అన్ని రంగాల్లో తగ్గుముఖం పట్టినట్లు సూచిస్తున్నాయి. అనుకూలమైన వ్యవసాయ పరిస్థితులు, సరఫరా పరంగా తీసుకున్న చర్యలు, బలమైన మూలం ప్రభావం కారణంగా ప్రధానంగా కూరగాయలు, పప్పుధాన్యాల ధరలు తగ్గడంతో ప్రధాన (సీపీఐ) ద్రవ్యోల్బణం 1.7 శాతానికి పడిపోయింది. ప్రధాన ద్రవ్యోల్బణం స్థిరత్వాన్ని చూపించినప్పటికీ, ఇది ముఖ్యంగా విలువైన లోహాల ధరల పెరుగుదలతో ప్రభావితం అయింది; వీటిని మినహాయించి చూస్తే, అంతర్లీన ద్రవ్యోల్బణ ఒత్తిడి గణనీయంగా తక్కువగా ఉందని, ఇది డిమాండ్ పరంగా ఎటువంటి అతి తీవ్రత లేదని సూచిస్తోంది. భవిష్యత్తును పరిశీలిస్తే, అనుకూలమైన సరఫరా పరిస్థితులు, జీఎస్‌టి రేట్ల హేతుబద్ధీకరణ ప్రభావం క్రమంగా చేరడం వల్ల ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంటుందని అంచనా.
2026 ఆర్థిక సంవత్సరంలో కనిపించిన దేశీయ డిమాండ్, మూలధన కల్పనలోని వేగం వివేకవంతమైన ఆర్థిక విధానం వల్ల సాధ్యమైందని సర్వే పేర్కొంది. ఇది స్థిరమైన ఆదాయ సమీకరణ, క్రమబద్ధమైన వ్యయ హేతుబద్ధీకరణ వంటి లక్షణాలతో కూడి ఉంది. ఈ ఏడాది స్థూల పన్ను వసూళ్లు పటిష్టంగా కొనసాగుతున్నాయి; 2025 నవంబర్ నాటికే ప్రత్యక్ష పన్ను వసూళ్లు వార్షిక బడ్జెట్ లక్ష్యంలో దాదాపు 53 శాతానికి చేరుకున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గడం, దిగుమతులలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ పరోక్ష పన్ను వసూళ్లు బలంగా కొనసాగాయి. స్థూల జీఎస్‌టి వసూళ్లు ఈ ఏడాదిలో పలుమార్లు రికార్డు స్థాయి గరిష్టాలను నమోదు చేశాయి. వ్యక్తిగత ఆదాయ పన్ను పునర్వ్యవస్థీకరణ, జీఎస్‌టి రేట్ల హేతుబద్ధీకరణ వంటి ఇటీవలి పన్ను సంస్కరణలు ఆదాయాన్ని స్థిరంగా ఉంచుతూనే వినియోగ డిమాండ్‌కు తోడ్పడ్డాయి. వ్యయాల విషయానికొస్తే, మూలధన వ్యయం ఏడాది ప్రాతిపదికన బలమైన వృద్ధిని కనబరిచింది. నవంబర్ 2025 నాటికే ఇది బడ్జెట్ కేటాయింపుల్లో దాదాపు 60 శాతానికి చేరుకుంది. అలాగే, రెవెన్యూ వ్యయ వృద్ధి నియంత్రణలో ఉండటం ప్రభుత్వ వ్యయ ప్రమాణాలను మరింత పెంచింది.
ప్రభుత్వం పాటిస్తున్న ఆర్థిక క్రమశిక్షణను మార్కెట్లు గుర్తించి ప్రోత్సహించాయి. దీని ఫలితంగా సార్వత్రిక బాండ్ రాబడులు తగ్గాయి. అమెరికా బాండ్‌లతో పోలిస్తే వీటి మధ్య వ్యత్యాసం సగానికంటే ఎక్కువ తగ్గింది. రెపో రేటు తగ్గడంతో పాటు, ఆర్థిక వ్యవస్థలో రుణ ఖర్చులకు ప్రాతిపదికగా ఉండే ఈ రాబడులు తగ్గడం స్వయంగా ఒక ఆర్థిక ఉద్దీపనలా పనిచేస్తుంది. ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్‌పి భారత ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణను, నిర్దేశించుకున్న ఆర్థిక లోటు లక్ష్యాల పట్ల చూపిస్తున్న నిబద్ధతను గుర్తించింది. ఈ క్రమంలో భారత రేటింగ్‌ను ‘ బీబీబీ- నుంచి బీబీబీకి పెంచింది. అదేవిధంగా, కేర్ఎడ్జ్ గ్లోబల్ సంస్థ కూడా భారత పటిష్టమైన ఆర్థిక పనితీరును, ఆర్థిక క్రమశిక్షణను ప్రశంసిస్తూ తన తొలి రేటింగ్‌లో బీబీబీ+ను కేటాయించింది.
ప్రభుత్వ మౌలిక సదుపాయాల వ్యయం, పన్ను తగ్గింపుల ద్వారా లభించిన ఆర్థిక ఉద్దీపనతో పాటు ద్రవ్యపరమైన తోడ్పాటు కూడా లభించింది. ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గడంతో ఫిబ్రవరి 2025 నుంచి పాలసీ రెపో రేటును మొత్తంగా 125 బేసిస్ పాయింట్లు తగ్గించారు. దీనికి అదనంగా నగదు నిల్వల నిష్పత్తి (సిఆర్ఆర్ కోత ద్వారా రూ.2.5 లక్షల కోట్లు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంఓ) ద్వారా రూ. 6.95 లక్షల కోట్లు, సుమారు 25 బిలియన్ డాలర్ల ఫారెక్స్ మార్పిడి (స్వాప్) రూపంలో శాశ్వత లిక్విడిటీని వ్యవస్థలోకి ప్రవేశపెట్టారు. ఈ చర్యల ప్రభావం బ్యాంకింగ్ వ్యవస్థలోకి సమర్థవంతంగా బదిలీ అయింది. ఫిబ్రవరి, నవంబర్ 2025 మధ్య కాలంలో, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ఇచ్చే కొత్త రూపాయి రుణాలపై వెయిటెడ్ యావరేజ్ లెండింగ్ రేటు (డబ్ల్యూఏఎల్ఆర్) 59 బేసిస్ పాయింట్లు తగ్గింది. అదేవిధంగా, ఇప్పటికే ఉన్న బకాయి రుణాలపై డబ్ల్యూఏఎల్ఆర్ 69 బేసిస్ పాయింట్లు తగ్గింది.దీనికి సమాంతరంగా, బ్యాంకింగ్ రంగం తన బ్యాలెన్స్ షీట్లను మరింత పటిష్టం చేసుకుంది. స్థూల నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) నిష్పత్తి గత అనేక దశాబ్దాల కాలంలోనే అత్యంత కనిష్ట స్థాయి అయిన 2.2 శాతానికి పడిపోయింది. అర్ధ వార్షిక స్లిప్పేజ్ నిష్పత్తి 0.7 శాతం వద్ద స్థిరంగా ఉంది. పన్ను తర్వాత లాభాలు పెరగడం, నికర వడ్డీ మార్జిన్లు (ఎన్ఐఎం బలంగా ఉండటంతో బ్యాంకుల లాభదాయకత మెరుగుపడింది.
ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య అనిశ్చితి నెలకొన్నప్పటికీ, 2025 ఆర్థిక సంవత్సరంలో భారత మొత్తం ఎగుమతులు (వస్తువులు, సేవలు) రికార్డు స్థాయిలో 825.3 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని, 2026 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే వేగం కొనసాగుతోందని ఆర్థిక సర్వే పేర్కొంది. అమెరికా విధించిన అధిక సుంకాల వల్ల సవాళ్లు ఎదురైనప్పటికీ, ఏప్రిల్-డిసెంబర్ 2025 కాలంలో వస్తువుల ఎగుమతులు 2.4 శాతం పెరిగాయి. ఇదే సమయంలో సేవల ఎగుమతులు 6.5 శాతం వృద్ధిని సాధించాయి. 2025 ఏప్రిల్-డిసెంబర్ కాలంలో వస్తువుల దిగుమతులు 5.9 శాతం పెరిగాయి. గత సంవత్సరాల ధోరణిని అనుసరిస్తూ, వస్తు వాణిజ్య లోటు పెరిగినప్పటికీ సేవా రంగానికి సంబంధించిన వాణిజ్య మిగులు దానిని సమతుల్యం చేసింది. విదేశాల నుంచి భారతీయులు పంపే నిధుల పెరుగుదల ఈ సమతుల్యతకు మరింత ఊతాన్నిచ్చింది. చాలా ఏళ్లలో, స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కంటే ఈ నిధుల రాక ఎక్కువగా ఉండటం గమనార్హం. విదేశీ నిధుల వనరుగా వీటి ప్రాముఖ్యతను ఇది స్పష్టం చేస్తోంది. ఫలితంగా, 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ) జీడీపీలో 0.8 శాతం వద్ద పరిమితంగా ఉంది.
భారత విదేశీ రంగం మరి కొంతకాలానికి సురక్షితమైన స్థితిలో ఉంది. 2026 జనవరి 16 నాటికి ఉన్న విదేశీ మారక నిల్వలు 11 నెలలకు పైగా దిగుమతులకు సరిపోతాయి. ఇవి 2025 సెప్టెంబర్ చివరి నాటికి ఉన్న మొత్తం విదేశీ అప్పులలో సుమారు 94.0 శాతానికి సమానంగా ఉంటూ, తగినంత లిక్విడిటీ రక్షణను కల్పిస్తున్నాయి. విభిన్న వాణిజ్య వ్యూహాలను అనుసరించడం ద్వారా భారత్ తన ఎగుమతులను బలోపేతం చేసుకుంటోంది. బ్రిటన్, ఒమన్, న్యూజిలాండ్‌లతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడమే దీనికి నిదర్శనం. ముఖ్యంగా, మూడు సంవత్సరాల చర్చల తర్వాత ఇటీవల యూరోపియన్ యూనియన్ (ఈయూ) తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) ఒక మైలురాయిగా నిలిచింది. దీనిని 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'గా అభివర్ణిస్తున్నారు. ఇది ప్రస్తుతం యూరోపియన్ పార్లమెంట్ ఆమోదం పొందవలసి ఉంది. దీనితో పాటు అమెరికాతో జరుగుతున్న చురుకైన చర్చలు కూడా భారత ఎగుమతులకు శుభసూచకంగా మారాయి.
కేంద్ర ప్రభుత్వం కార్మిక కోడ్ ల అమలును నోటిఫై చేయడం నియంత్రణ వ్యవస్థలో ఒక చారిత్రాత్మక సంస్కరణ. 29 కేంద్ర చట్టాలను నాలుగు కార్మిక చట్టాలుగా ఏకీకృతం చేయడం ద్వారా నిబంధనల అమలును సరళతరం చేయడం, కార్మిక మార్కెట్‌లో సౌలభ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. వేతనాలు, వృత్తిపరమైన భద్రత, సామాజిక భద్రత వంటి రక్షణలను కొనసాగిస్తూనే, శ్రామిక శక్తిలోని మెజారిటీ విభాగానికి భద్రతను విస్తరించడం దీని ప్రధాన ఉద్దేశం.
2025-26 ఆర్థిక సంవత్సరం విదేశీ రంగానికి సంబంధించి ఆర్థిక వ్యవస్థ అసాధారణమైన సవాళ్లను ఎదుర్కొన్న సంవత్సరమని సర్వే పేర్కొంది. ప్రపంచ వాణిజ్యంలో పెరిగిన అనిశ్చితి, విదేశాలు విధించిన అధిక శిక్షాత్మక సుంకాలు తయారీదారులపై, ముఖ్యంగా ఎగుమతిదారులపై తీవ్ర ఒత్తిడిని కలిగించాయి. ఇది వ్యాపార విశ్వాసాన్ని కూడా ప్రభావితం చేసింది. అయితే, ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని జీఎస్‌టి హేతుబద్ధీకరణ, నియంత్రణల సడలింపు, వివిధ రంగాల్లో నిబంధనల అమలును మరింత సరళతరం చేయడం వంటి కీలక చర్యలను వేగవంతం చేసింది. అందువల్ల 2027 ఆర్థిక సంవత్సరం ఒక సర్దుబాటు సంవత్సరంగా ఉంటుందని అంచనా. ఈ మార్పులకు అనుగుణంగా సంస్థలు, కుటుంబాలు తమను తాము మలచుకోవడంతో దేశీయ డిమాండ్, పెట్టుబడులు పుంజుకుంటాయి. అయితే, బాహ్య వాతావరణం ఇప్పటికీ అనిశ్చితంగానే ఉందని, ఇది మొత్తం ఆర్థిక దృక్పధాన్ని ప్రభావితం చేస్తుందని గుర్తించాలి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొంతకాలం మందకొడిగానే ఉంటుందని, ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని సర్వే హెచ్చరించింది. ప్రపంచ స్థాయిలో వృద్ధి నామమాత్రంగానే ఉండవచ్చని, దీనివల్ల వస్తువుల ధరలు దాదాపు స్థిరంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వివిధ దేశాల్లో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో, కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించి వృద్ధికి మద్దతు ఇచ్చే 'సరళ ద్రవ్య విధానాలను' అనుసరిస్తాయని అంచనా వేసింది.
ప్రపంచవ్యాప్త పరిస్థితులు ఇప్పటికీ అస్థిరంగానే ఉన్నాయని, వృద్ధి అంచనాల కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య విభజన, ఆర్థికపరమైన లోపాలు ప్రమాదకరంగా మారాయని సర్వే తెలిపింది. ఈ ప్రతికూల ప్రభావాలు కొంత సమయం తర్వాత బయటపడే అవకాశం ఉంది. అయితే, భారత్ కు సంబంధించి ఈ ప్రపంచ పరిస్థితులు తక్షణ స్థూల ఆర్థిక ఒత్తిడిని కలిగించకపోయినా, బాహ్య అనిశ్చితులకు మాత్రం దారితీస్తాయని సర్వే విశ్లేషించింది. ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాల్లో వృద్ధి మందగించడం, సుంకాల వల్ల వాణిజ్యానికి ఆటంకాలు కలగడం, మూలధన ప్రవాహాల్లో ఒడిదుడుకులు ఎగుమతులపైన, ఇన్వెస్టర్ల విశ్వాసంపైన అప్పుడప్పుడు ఒత్తిడిని కలిగించవచ్చు. అదే సమయంలో, అమెరికాతో జరుగుతున్న వాణిజ్య చర్చలు ఈ ఏడాదే ముగిసే అవకాశం ఉండటం బాహ్య రంగంలో నెలకొన్న అనిశ్చితిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ ముప్పులు అదుపులో ఉన్నప్పటికీ, తగినంత బఫర్ నిల్వలను కలిగి ఉండటం, విధానపరమైన విశ్వసనీయతను కాపాడుకోవడం చాలా ముఖ్యమని సర్వే స్పష్టం చేసింది.
అంతర్జాతీయంగా అనిశ్చితులు ఉన్నప్పటికీ, భారత అంతర్గత ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన స్థితిలో ఉందని ఆర్థిక సర్వే 2025-26 స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణం చారిత్రక కనిష్ట స్థాయిలకు చేరుకోవడం, బ్యాంకులు, కార్పొరేట్ సంస్థల బ్యాలెన్స్ షీట్లు బలోపేతం కావడం దేశ ఆర్థిక శక్తికి నిదర్శనంగా నిలిచాయి. దేశీయ వినియోగ డిమాండ్ పటిష్టంగా ఉండటం, ప్రైవేట్ పెట్టుబడులు పుంజుకోవడం వంటి అంశాలు బాహ్య సంక్షోభాల నుంచి మన ఆర్థిక వ్యవస్థను రక్షించడమే కాకుండా, వృద్ధి వేగాన్ని కొనసాగించడానికి తోడ్పడతాయి. అయితే, రాబోయే ఏడాదిలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) లో వచ్చే మార్పులు ద్రవ్యోల్బణ అంచనాలపై కీలక ప్రభావం చూపుతాయని సర్వే పేర్కొంది.
గత కొన్ని సంవత్సరాలుగా చేపట్టిన వరుస విధానపరమైన సంస్కరణల ఫలితంగా, భారత ఆర్థిక వ్యవస్థ మధ్యకాలిక వృద్ధి సామర్థ్యం ఇప్పుడు 7 శాతానికి దగ్గరగా పెరిగింది. దేశీయ అంశాలే వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుండటం, స్థూల ఆర్థిక స్థిరత్వం పటిష్టంగా ఉండటంతో వృద్ధికి సంబంధించిన ప్రతికూలతలు ప్రస్తుతం సమతుల్యంగా ఉన్నాయి. ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటూ, ఆర్థిక సర్వే 2026–27 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ వృద్ధిని 6.8 నుంచి 7.2 శాతం మధ్యగా అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్ స్థిరమైన వృద్ధిని సాధిస్తుందని ఇది తెలియజేస్తోంది. ఇది జాగ్రత్త అవసరం ఉన్న పరిస్థితి అయినప్పటికీ నిరుత్సాహంగా ఉండాల్సిన అవసరం లేదని సర్వే స్పష్టం చేసింది.
****
(रिलीज़ आईडी: 2220509)
आगंतुक पटल : 30
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Khasi
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Nepali
,
Bengali
,
Gujarati
,
Kannada
,
Malayalam