ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సమగ్ర వృద్ధిని ముందుకు తీసుకెళ్లటం, కోట్ల మంది ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడంలో 'వికసిత్ భారత్' లక్ష్య సాధనకు కేంద్రబిందువుగా వ్యవసాయ రంగం: ఆర్థిక సర్వే


గత 5 ఏళ్లలో 4.4 శాతం సగటు వార్షిక వృద్ధి రేటును నమోదు చేసిన వ్యవసాయ రంగం

2016 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 వరకు దశాబ్ద కాల వృద్ధి 4.45 శాతం

గత దశాబ్దాలతో పోలిస్తే ఇదే అత్యధిక పదేళ్ల వృద్ధి

2024-25 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 3,577.3 లక్షల మిలియన్ టన్నులకు (ఎల్ఎంటీ) చేరుకున్న ఆహార ధాన్యాల ఉత్పత్తి

వ్యవసాయ స్థూల విలువ జోడింపులో (జీవీఏ) సుమారు 33 శాతంతో ఒక ఆశాకిరణంగా ఆవిర్భవించిన ఉద్యానవన రంగం

2013–14లోని 280.70 మిలియన్ టన్నుల నుంచి 2024-25 నాటికి 367.72 మిలియన్ టన్నులకు పెరిగిన ఉద్యానవన పంటల ఉత్పత్తి

प्रविष्टि तिथि: 29 JAN 2026 2:03PM by PIB Hyderabad

భారత వ్యవసాయ రంగం పటిష్ఠమైన దృఢత్వాన్ని ప్రదర్శించటంతో పాటు అనుబంధ రంగాల నుంచి లభించిన ప్రధాన తోడ్పాటుతో స్థిరమైన వృద్ధిని నమోదు చేసినట్లు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2025-26 ఆర్థిక సర్వే తెలిపింది.  

ఇటీవలి కాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగినప్పటికీ ఆదాయ అవకాశాలను పెంపొందించడంలో, గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడంలో పశుపోషణ, మత్స్య సంపద, ఉద్యానవన పంటల వంటి అధిక విలువ కలిగిన అనుబంధ రంగాలు మరింత కీలక పాత్ర పోషిస్తున్నాయని సర్వే వెల్లడించింది. 

సర్వే ప్రకారం గత ఐదేళ్లలో స్థిర ధరల వద్ద వ్యవసాయం, అనుబంధ రంగాల సగటు వార్షిక వృద్ధి రేటు సుమారు 4.4 శాతంగా ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వ్యవసాయ రంగం 3.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2015-16 నుంచి 2024-25 వరకు దశాబ్ద వృద్ధి 4.45 శాతంగా ఉంది. క్రితం దశాబ్దాలతో పోల్చితే ఇదే అత్యధికం. పశుపోషణ (7.1 శాతం), మత్స్య సంపద -  ఆక్వాకల్చర్ (8.8 శాతం) రంగాల బలమైన పనితీరు వల్ల ఇది సాధ్యమైంది. వీటి తర్వాత పంటల రంగం 3.5 శాతం వృద్ధిని సాధించింది.

2014-15, 2023-2024 ఆర్థిక సంవత్సరాల మధ్య పశుపోషణ రంగం భారీ వృద్ధిని నమోదు చేసింది. దీని జీవీఏ ప్రస్తుత ధరల వద్ద దాదాపు 195 శాతం పెరిగిoది. ఈ రంగం 12.77 శాతం సమ్మేళన వార్షిక వృద్ధి రేటును (సీఏజీఆర్) నమోదు చేసింది. మత్స్య రంగం కూడా అద్భుతమైన ప్రదర్శనను కనబరిచింది. 2004-14తో పోలిస్తే 2014-2025లో చేపల ఉత్పత్తి 140 శాతం కంటే ఎక్కువ (88.14 లక్షల టన్నులు) పెరిగింది. ఈ విధంగా రైతు ఆదాయాన్ని పెంచడంలో అనుబంధ రంగాలు ముఖ్యమైన వృద్ధి చోదక శక్తులు, కీలక సహకార రంగాలగా ఆవిర్భవిస్తున్నాయి. 

భారతదేశ ఆహార ధాన్యాల ఉత్పత్తి స్థిరమైన వృద్ధిని సాధించింది. 2024–25 వ్యవసాయ సంవత్సరంలో ఇది 3,577.3 లక్షల మెట్రిక్ టన్నులకు (ఎల్‌ఎంటీ) చేరుకుందన్న అంచనా ఉన్నట్లు సర్వే తెలిపింది. గత ఏడాదితో పోల్చితే ఇది 254.3 ఎల్ఎంటీ ఎక్కువ. బియ్యం, గోధుమలు, మొక్కజొన్న, తృణధాన్యాల (శ్రీ అన్న) అధిక దిగుబడి కారణంగా ఈ వృద్ధి సాధ్యమైంది.

వ్యవసాయ జీవీఏలో సుమారు 33 శాతం వాటా కలిగిన ఉద్యానవన రంగం.. దేశ వ్యవసాయ వృద్ధి పథంలో ఒక ముఖ్యమైన ఉపరంగంగా అవతరించింది. 2024-25లో అంచనావేసిన 362. 08 ఎంటీల ఆహార ధాన్యాల ఉత్పత్తిని అధిగమిస్తూ ఉద్యానవన ఉత్పత్తి 362.08 ఎంటీలకు చేరుకుంది. ఆగస్టు 2025 నాటి వరకు ఉన్న గణాంకాల ప్రకారం 2013–14లో 280.70 మిలియన్ టన్నులుగా ఉన్న ఉద్యానవన ఉత్పత్తి.. 2024–25 నాటికి 367.72 మిలియన్ టన్నులకు పెరిగింది. 

ఈ వృద్ధి అన్ని రంగాల్లో కనిపించింది. ఈ సంవత్సరంలో 114.51 మిలియన్ టన్నుల పండ్లు, 219.67 మిలియన్ టన్నుల కూరగాయలు, 33.54 మిలియన్ టన్నుల ఇతర ఉద్యానవన పంటల ఉత్పత్తి నమోదైంది. ఇది వ్యవసాయ ఉత్పత్తి, విలువలో ఈ రంగానికి పెరుగుతున్న వాటాను తెలియజేస్తోంది. 

వీటితో పాటు దాదాపు 25 శాతం అంతర్జాతీయ వాటాతో భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ఎండు ఉల్లి ఉత్పత్తిదారుగా ఉంది. కూరగాయలు, పండ్లు, బంగాళదుంపల ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఇందులోని ప్రతి విభాగంలో అంతర్జాతీయ ఉత్పత్తిలో దేశం సుమారు 12-13 శాతం వాటాను కలిగి ఉంది. ఈ విజయాలు ఉద్యానవన రంగంలో దేశానికి ఉన్న బలమైన ఉనికిని, ప్రపంచ ఆహార డిమాండ్‌ను తీర్చడంలో  పెరుగుతున్న భారత్ పాత్రను,అధిక విలువ కలిగిన పంటల ఉత్పత్తిలోని అవకాశాలను ప్రధానంగా తెలియజేస్తున్నాయి. 

సమగ్ర వృద్ధిని ముందుకు తీసుకెళ్లటం, కోట్ల మంది ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడంలో 'వికసిత్ భారత్' లక్ష్య సాధనకు వ్యవసాయం కేంద్రబిందువుగా ఉంటుందన్న వ్యాఖ్యతో సర్వేలోని వ్యవసాయ విభాగం ముగిసింది. దేశ జీడీపీకి గణనీయంగా సహకరిస్తున్న పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం, మత్స్య సంపద, ఉద్యానవన రంగాల వంటి కీలక విభాగాలలో వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంలో భారతదేశం గణనీయమైన పురోగతిని సాధించింది.

 

***


(रिलीज़ आईडी: 2220376) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , English , Urdu , हिन्दी , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam