ప్రధాన మంత్రి కార్యాలయం
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఇండియా-ఈయూ బిజినెస్ ఫోరమ్‌లో ప్రధానమంతి ప్రసంగానికి తెలుగు అనువాదం
प्रविष्टि तिथि:
27 JAN 2026 8:05PM by PIB Hyderabad
గౌరవనీయులైన అధ్యక్షురాలికి,
భారతదేశానికి, యూరోపియన్ యూనియన్‌కు చెందిన వ్యాపారవేత్తలకు, నా శుభాకాంక్షలు.
ఇండియన్-యూరోపియన్ యూనియన్ బిజినెస్ ఫోరమ్‌లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. భారత్‌లో యూరోపియన్ యూనియన్ మండలి, కమిషన్ అధ్యక్షుల పర్యటన సాధారణ దౌత్య పర్యటన కాదు. ఇది భారత్-యూరోపియన్ యూనియన్ సంబంధాల్లో కొత్త శకానికి నాంది పలికింది. భారత గణతంత్ర దినోత్సవాల్లో యూరోపియన్ యూనియన్ నాయకులు ముఖ్య అతిధులుగా పాల్గొనడం ఇదే తొలిసారి. భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కుదరిన ఒప్పందం దేశ చరిత్రలోనే అతి పెద్ద ఎఫ్‌టీఏ. ఈ రోజు ఇండియా-యూరోపియన్ యూనియన్ బిజినెస్ ఫోరమ్‌లో పెద్ద సంఖ్యలో సీఈవోలు పాల్గొన్నారు. ఈ విజయాలన్నీ ప్రపంచంలోనే రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య శక్తుల మధ్య ఏర్పడిన అపూర్వమైన సమన్వయానికి చిహ్నాలుగా నిలుస్తున్నాయి.
స్నేహితులారా,
ఈ ఒప్పందం యాదృచ్ఛికంగా జరిగినది కాదు. మార్కెట్ ఆర్థిక వ్యవస్థలుగా, మనకి ఉమ్మడి విలువలున్నాయి. అంతర్జాతీయ స్థిరత్వం దిశగా ఉమ్మడి ప్రాధాన్యాలు మనకున్నాయి. అలాగే మన ప్రజల మధ్య సహజసిద్ధమైన సంబంధాలున్నాయి. ఈ బలమైన పునాదిపై ఆధారపడి మన భాగస్వామ్యం నూతన శిఖరాలకు చేరుకుంటుంది. దీనిని ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన భాగస్వామ్యాల్లో ఒకటిగా మనం తీర్చిదిద్దుతున్నాం. ఈ ఫలితాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గడచిన పదేళ్లలో మన వాణిజ్యం రెట్టింపై 180 బిలియన్ యూరోలకు చేరుకుంది. దాదాపు 6,000 కంటే ఎక్కువ యూరోపియన్ సంస్థలు భారత్‌లో పనిచేస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ నుంచి భారత్‌కు 120 బిలియన్ యూరోలకు పైగా పెట్టుబడులు వచ్చాయి. యూరోపియన్ యూనియన్‌లో 1,500 భారతీయ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. భారత్ పెట్టుబడులు 40 బిలియన్ యూరోలకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆర్ అండ్ డీ, తయారీ, సేవలు - ఇలా ప్రతి రంగంలోనూ భారత్, యూరోపియన్ సంస్థల మధ్య బలమైన సహకారం ఉంది. దీనిని అమలు చేసేదీ, దాని ప్రయోజనాలను పొందేదీ మీరేనంటూ వ్యాపారవేత్తలకు చెప్పారు.
స్నేహితులారా,
ఈ భాగస్వామ్యాన్ని ‘‘ఏకోన్ముఖ సామాజిక భాగస్వామ్యం’’గా మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ ఆలోచనతోనే సమగ్ర ఎఫ్‌టీఏను ఈ రోజు పూర్తి చేశాం. దీని ద్వారా భారత్‌కు చెందిన కార్మిక శక్తి ఆధారిత ఉత్పత్తులు యూరోపియన్ యూనియన్ మార్కెట్లలో సులభంగా ప్రవేశిస్తాయి. వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, వాహన విడిభాగాలు, ఇంజినీరింగ్ పరికరాలు వీటిలో ఉన్నాయి. పండ్లు, కూరగాయలు, శుద్ధి చేసిన ఆహారం, సముద్ర ఉత్పత్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. దీని ద్వారా నేరుగా మన రైతులు, మత్స్యకారులకు ప్రత్యక్ష లబ్ధి చేకూరుతుంది. ప్రత్యేకంగా ఐటీ, విద్య, సంప్రదాయ వైద్యం, వ్యాపార సేవలు ప్రయోజనం పొందుతాయి.
స్నేహితులారా,
ఈ రోజు అంతర్జాతీయ వ్యాపార రంగంలో గందరగోళం నెలకొంది. ప్రతి సంస్థ మార్కెట్ వ్యూహం, భాగస్వామ్యాలను పరిశీలిస్తోంది. ఇలాంటి సమయంలో వ్యాపార ప్రపంచానికి స్పష్టమైన, సానుకూలమైన సందేశాన్ని ఈ ఎఫ్‌టీఏ అందిస్తోంది. ఇది సమర్థమైన, విశ్వసనీయమైన, భవిష్యత్తు ఆధారిత భాగస్వామ్యాలను ఇరువైపులా ఏర్పాటు చేసుకోవడానికి వ్యాపార సమూహాలకు లభించిన ఆహ్వానం. ఈ ఎఫ్‌టీఏ అందించే ప్రయోజనాలను మీరంతా సద్వినియోగం చేసుకుంటారనే పూర్తి విశ్వాసం నాకుంది.
స్నేహితులారా,
అనేక ప్రాధాన్యాల నుంచి భారత్, యూరోపియన్ యూనియన్ వ్యాపార భాగస్వామ్యం లబ్ధి పొందుతుంది. ఈ నేపథ్యంలో నేను మూడు ప్రాధాన్యాల గురించి చెబుతాను. మొదటిది, ప్రస్తుతం ప్రపంచంలో వాణిజ్యం, సాంకేతికత, కీలకమైన ఖనిజాలు ఆయుధాలుగా మారాయి. ఇతరులపై ఆధారపడి ఉండటం వల్ల ఎదురయ్యే సమస్యలను తగ్గించడానికి మనం సమష్టిగా పనిచేయాల్సి ఉంటుంది. ఈవీలు, బ్యాటరీలు, చిప్పులు, ఏపీఐల విషయంలో ఇతరులపై ఆధారపడటాన్ని మన వ్యాపార సమూహం సమష్టి కృషితో తగ్గించగలదా? నమ్మకమైన సరఫరా వ్యవస్థకు ఉమ్మడి ప్రత్యామ్నాయాన్ని మనం ఏర్పాటు చేయగలమా? రెండోది, రక్షణ పరిశ్రమలు, యుద్ధ సాంకేతికతలపై భారత్, యూరోపియన్ యూనియన్ రెండూ దృష్టి సారించాయి. రక్షణ, అంతరిక్షం, టెలికాం, ఏఐ రంగాల్లో భాగస్వామ్యాలను పెంపొందించుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మూడోది, స్వచ్ఛమైన, సుస్థిరమైన భవిష్యత్తే ఉభయపక్షాలకు ప్రాధాన్యం కావాలి. హరిత హైడ్రోజన్ నుంచి సౌర విద్యుత్, స్మార్ట్ గ్రిడ్‌ల వరకు.. ప్రతి రంగంలోనూ ఉమ్మడి పరిశోధనను, పెట్టుబడులను మనం పెంపొందించాలి. చిన్న మాడ్యులర్ రియాక్టర్లు, సుస్థిరమైన రవాణా వ్యవస్థల విషయంలో ఇరు పరిశ్రమలు కలసి పనిచేయాలి. వీటితో పాటుగా, ప్రతి రంగంలోనూ జల నిర్వహణ, పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ, సుస్థిరమైన వ్యవసాయంలో పరిష్కారాలను సంయుక్తంగా అభివృద్ధి చేయాలి.
స్నేహితులారా,
ఈ రోజు తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాల తర్వాత, మీ అందరిపై ప్రత్యేక బాధ్యత ఉంది. ఇప్పుడు వ్యాపార సమూహం తర్వాతి దశను చేపట్టాలి. ఇప్పుడు బాల్ మీ కోర్టులో ఉంది. పరస్పర సహకారం ద్వారా మాత్రమే మన భాగస్వామ్యం విశ్వాసాన్నీ, పరిధినీ, స్థాయినీ పొందుతుంది. మీ ప్రయత్నాల ద్వారా ఉమ్మడి సంక్షేమాన్ని మనం సాధించగలుగుతాం. మన సామర్థ్యాలను ఏకం చేసి ప్రపంచాభివృద్ధికి డబుల్ ఇంజిన్‌గా మారుదాం.
ధన్యవాదాలు.
***
(रिलीज़ आईडी: 2219511)
आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Odia
,
Kannada
,
Malayalam