|
భారత ఎన్నికల సంఘం
జనవరి 21 నుంచి 23 వరకూ ‘ఐఐసీడీఈఎం-26’కు ‘ఈసీఐ’ ఆతిథ్యం
ప్రపంచంలోని 70కిపైగా దేశాల నుంచి సుమారు 100 మంది ప్రతినిధుల రాక మూడు రోజుల కార్యక్రమంలో 40కిపైగా ద్వైపాక్షిక సమావేశాలు.. 36 చర్చాగోష్ఠుల నిర్వహణ
प्रविष्टि तिथि:
19 JAN 2026 11:39AM by PIB Hyderabad
1. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తొలి ‘ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్-2026’ (ఐఐసీడీఈఎం) నిర్వహణకు సన్నాహాలు పూర్తిచేసింది. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ నెల 21 నుంచి 23 వరకూ ‘ఇండియా ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్’ (ఐఐఐసీడీఈఎం) ఈ సదస్సును నిర్వహిస్తుంది.
2. ‘ప్రజాస్వామ్యం-ఎన్నికల నిర్వహణ’పై భారత్ ఆధ్వర్యాన సాగే ‘ఐఐసీడీఈఎం-2026’, ఈ తరహాలో నిర్వహించే అతిపెద్ద ప్రపంచ సదస్సుగా నిలుస్తుంది. ప్రపంచంలోని 70కి పైగా దేశాల నుంచి సుమారు 100 మంది సహా వివిధ అంతర్జాతీయ సంస్థల, భారత్‌లోని విదేశీ రాయబార కార్యాలయాల ప్రతినిధులు, ఎన్నికల రంగంతో ముడిపడిన విద్యావేత్తలు, నిపుణులు కూడా ఇందులో పాల్గొంటారు.
3. ఈ నెల 21న సదస్సు ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషిలతో కలిసి ప్రతినిధులందరికీ స్వాగతం పలికి, కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
4. ఈ మూడు రోజుల కార్యక్రమంలో ప్రారంభ సమావేశం సహా ఎన్నికల నిర్వహణ సంస్థలు (ఈఎంబీ), వాటి అధిపతుల, కార్యాచరణ బృందాల సమావేశాలను కూడా నిర్వహిస్తారు. అలాగే, ప్రపంచ ఎన్నికల అంశాలు, ఆదర్శప్రాయ అంతర్జాతీయ ఎన్నికల ప్రమాణాలు, ఎన్నికల ప్రక్రియలో ఆవిష్కరణలు, ఉత్తమ పద్ధతుల వంటి నిర్దిష్ట అంశాలపై చర్చా గోష్ఠులు కూడా ఉంటాయి.
5. ఈ సదస్సులో భాగంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ‘సీఈఓ’ల నేతృత్వాన జాతీయ-అంతర్జాతీయ విద్యా నిపుణుల సహకారంతో మొత్తం 36 ఇతివృత్త బృందాలు కూలంకష చర్చల్లో పాల్గొంటాయి. దేశంలోని 4 ‘ఐఐటీ’లు, 6 ‘ఐఐఎం’లు, 12 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు (ఎన్‌ఎల్‌యూ), ‘ఐఐఎంసి’ సహా ప్రసిద్ధ విద్యా సంస్థలు వీటి నిర్వహణలో పాలుపంచుకుంటాయి.
6. ప్రపంచవ్యాప్తంగా ‘ఈఎంబీ’లకు ఎదురవుతున్న వివిధ సవాళ్లపై చర్చలు, సంబంధిత అంశాల్లో పరస్పర సహకారం పెంపు లక్ష్యంగా ఆయా ఎన్నిలక నిర్వహణ సంస్థలతో 40కి పైగా ద్వైపాక్షిక సమావేశాలను ‘ఈసీఐ’ నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ఎన్నికల సంబంధిత సకల సమాచారం-సేవలన్నీ ఒకేచోట లభించేలా ‘ఈసీఐనెట్’ పేరిట ఒక డిజిటల్ వేదికను కూడా ‘ఈసీఐ’ అధికారికంగా ప్రారంభిస్తుంది.
7. ఈ సదస్సులో భాగంగా ‘భారత్‌లో ఎన్నికల పరిమాణం-నిర్వహణలో సంక్లిష్టత’ను వివరించే ప్రదర్శన సహా ఎన్నికల వ్యవస్థకు రెండు మూలస్తంభాలైన ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ ప్రక్రియల బలోపేతంపై ‘ఈసీఐ’ ఇటీవల చేపట్టిన కార్యక్రమాలపైనా ప్రదర్శన ఉంటుంది.
8. ప్రపంచంలోనే అత్యంత భారీ ప్రక్రియగా నమోదైన ‘2024 లోక్‌సభ ఎన్నికల’ నిర్వహణ ప్రధానాంశంగా ‘ఐఐసీడీఈఎం-2026’లో తొలి రోజు “ఇండియా డిసైడ్స్” శీర్షికన టీవీ కార్యక్రమాలను ప్రదర్శిస్తారు.
***
(रिलीज़ आईडी: 2216403)
|