ప్రధాన మంత్రి కార్యాలయం
అస్సాంలోని కలియాబోర్‌లో రూ.6,950 కోట్లకు పైగా విలువైన కాజీరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు భూమిపూజ చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
కాజీరంగా జాతీయోద్యానవనం మాత్రమే కాదు - అది అస్సాం ఆత్మ.. భారత జీవ వైవిధ్యంలో అమూల్యమైన ఆభరణం: యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన చోటు
ప్రకృతిని సంరక్షిస్తే అవకాశాల్లోనూ పెరుగుదల: కాజీరంగాలో ఇటీవల స్థిరంగా వృద్ధి చెందుతున్న పర్యాటకం... వసతి గృహాలు (హోమ్ స్టేలు), గైడ్ సేవలు, రవాణా, హస్తకళలు, చిన్న తరహా పరిశ్రమల ద్వారా స్థానిక యువతకు సరికొత్త ఉపాధి అవకాశాలు
ప్రకృతి, పురోగతి పరస్పర విరుద్ధాలనీ, అవి ఒకేసారి కలిసి సాగలేవనీ చాలా కాలంగా ఉన్న భావనను పటాపంచలు చేస్తున్న భారత్... రెండూ కలిసి పురోగమించవచ్చని ప్రపంచానికి చాటుతున్న భారత్
ఈశాన్య ప్రాంతం ఇకపై అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండబోదు.. దేశ హృదయానికీ, స్వయానా ఢిల్లీకీ అదిప్పుడు మరింత దగ్గరైంది: ప్రధాని
प्रविष्टि तिथि:
18 JAN 2026 12:49PM by PIB Hyderabad
అస్సాంలోని కలియాబోర్‌లో రూ. 6,950 కోట్లకు పైగా విలువైన కాజీరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు (జాతీయ రహదారి- 715లోని కలియాబోర్ - నుమాలీగఢ్ విభాగపు 4 వరుసల విస్తరణ)కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి మాట్లాడుతూ.. పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరై తనకు ఆశిస్సులందించిన ప్రజలకు శ్రీ మోదీ ధన్యవాదాలు తెలిపారు. వారికెంతో కృతజ్ఞుడిగా ఉంటానన్నారు. రెండేళ్ల కిందట కాజీరంగాలో గడిపిన క్షణాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. తన జీవితంలో అత్యంత విశేషమైన అనుభవాల్లో ఒకటిగా ఆ పర్యటన నిలిచిపోయిందన్నారు. మరోసారి కాజీరంగాను సందర్శిస్తున్న ఈ వేళ.. గత పర్యటన స్మృతులు మళ్లీ తన కళ్లెదుట కదలాడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఒక రాత్రి తాను కాజరంగా జాతీయోద్యానవనంలో బస చేశాననీ, మరునాడు ఉదయం ఏనుగు సఫారీ చేస్తూ ఈ ప్రాంత సౌందర్యాన్ని ఎంతో దగ్గరగా వీక్షించి అద్భుతానుభూతిని పొందాననీ ప్రధానమంత్రి శ్రీ మోదీ వివరించారు.
అస్సాం పర్యటన తనకెంతో ఉత్సాహాన్నిస్తుందన్న శ్రీ మోదీ.. ఇది వీరభూమి అని కొనియాడారు. అస్సాం బిడ్డలు ప్రతి రంగంలోనూ ప్రతిభను చాటుతున్నారంటూ ప్రశంసించారు. నిన్ననే గువహటిలో నిర్వహించిన బగురుంబా ధహోవ్ వేడుకలో పాల్గొన్నాననీ, అక్కడ బోడో బిడ్డలు తమ ప్రదర్శనతో ఓ సరికొత్త రికార్డు నెలకొల్పారని ఆయన చెప్పారు. పదివేలకు పైగా కళాకారుల ఉత్తేజం, ఖామ్ లయ, శ్రావ్యమైన సిఫుంగ్ స్వరాలు మేళవించిన బగురుంబా అద్భుత ప్రదర్శన అందరినీ మంత్రముగ్ధులను చేసిందని ప్రధానమంత్రి శ్రీ మోదీ కొనియాడారు. బగురుంబా అనుభవం చూడముచ్చటగా ఉందనీ, హృదయాన్ని హత్తుకుందనీ ఆయన వ్యాఖ్యానించారు. అస్సాం కళాకారుల అద్భుత కృషి, సన్నద్ధత, సమన్వయాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. నిజంగా ఇది అద్భుతమని కొనియాడారు. బగురుంబా ధహోవ్ ఉత్సవంలో పాల్గొన్న కళాకారులందరినీ మరోసారి అభినందించారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఈ కార్యక్రమాన్ని చేరవేసేలా ప్రచారం చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లకు, టీవీ మీడియాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
గతేడాది ఝుమోర్ మహోత్సవంలో తాను పాల్గొన్న విషయాన్ని గుర్తుచేసుకున్న శ్రీ మోదీ.. ఈసారి మాఘ్ బిహు సమయంలో అస్సాంను సందర్శించే అవకాశం లభించిందన్నారు. నెల రోజుల కిందటే తాను ఇక్కడికి వచ్చి.. గువహటిలో లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించాననీ, అలాగే నామరూప్‌లోని అమ్మోనియా యూరియా కాంప్లెక్సుకు శంకుస్థాపన చేశాననీ వివరించారు. ఇలాంటి తమ ప్రభుత్వానికి మంత్రప్రదమైన ‘వికాస్ భీ, విరాసత్ భీ’ని ఇలాంటి కార్యక్రమాలు మరింత బలోపేతం చేశాయని ఆయన వ్యాఖ్యానించారు.
అస్సాం గతం, వర్తమానం, భవిష్యత్తులో కలియాబోర్ చారిత్రక ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ... ఇది కాజీరంగా జాతీయోద్యానవనానికి ప్రవేశ ద్వారమనీ, ఎగువ అస్సాంకు అనుసంధాన కేంద్రంగా ఉందని ప్రధానమంత్రి చెప్పారు. మొఘల్ ఆక్రమణదారులను తరిమికొట్టేందుకు వీర యోధుడు లచిత్ బోర్ఫుకాన్ ఈ కలియాబోర్ నుంచే వ్యూహరచన చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. బోర్ఫుకాన్ నాయకత్వంలో అస్సాం ప్రజలు ధైర్యసాహసాలు, ఐక్యత, పట్టుదలతో మొఘల్ సైన్యాన్ని ఓడించారని శ్రీ మోదీ కొనియాడారు. ఇది కేవలం సైనిక విజయం మాత్రమే కాదనీ.. ఇది అస్సాం ఆత్మగౌరవ, ఆత్మవిశ్వాస ప్రకటన అనీ శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. అహోం రాజుల కాలం నుంచీ కలియాబోర్‌కు వ్యూహాత్మక ప్రాధాన్యం ఉందన్నారు. నేడు తమ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతం రవాణాలో, అభివృద్ధిలో ముఖ్య కేంద్రంగా మారుతుండడంపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
నేడు దేశవ్యాప్తంగా ప్రజల మొదటి ఎంపికగా తమ పార్టీ నిలిచిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఏడాదిన్నర కాలంగా పార్టీపై ప్రజల్లో నమ్మకం క్రమంగా పెరుగుతూ వస్తోందన్నారు. ఇటీవలి బీహార్ ఎన్నికల్లో.. 20 ఏళ్ల తర్వాత కూడా ప్రజలు తమకు రికార్డు స్థాయిలో ఓట్లు, సీట్లు ఇచ్చారని వివరించారు. రెండు రోజుల కిందటే మహారాష్ట్రలోని ప్రధాన నగరాల్లో మేయర్, కౌన్సిలర్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయని గుర్తుచేస్తూ.. ప్రపంచంలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్లలో ఒకటైన ముంబయిలో చరిత్రలో మొదటిసారిగా తమ పార్టీకి ప్రజలు రికార్డు స్థాయి మెజారిటీని అందించారని శ్రీ మోదీ తెలిపారు. మహారాష్ట్రలోని చాలా నగరాల్లో ప్రజలు తమకు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
అంతకుముందు కేరళ ప్రజలు తమ పార్టీకి గణనీయమైన మద్దతునిచ్చారని, రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో మొదటిసారి మేయర్ పదవిని పార్టీ గెలుచుకుందని ప్రధానమంత్రి చెప్పారు. పురోగతి, వారసత్వం రెండింటిపైనా దృష్టి సారించిన సుపరిపాలన, అభివృద్ధిని ఓటర్లు కోరుకుంటున్న విషయం దేశవ్యాప్తంగా ఇటీవలి ఎన్నికల ఫలితాలతో స్పష్టమైందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. అందుకే ప్రజలు తమను ఎన్నుకుంటున్నారని స్పష్టం చేశారు.
ప్రతిపక్షపు ప్రతికూల రాజకీయాలను దేశం ఎప్పటికప్పుడు తిరస్కరిస్తోందన్న సందేశాన్ని కూడా ఈ ఎన్నికలు అందించాయని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. ప్రతిపక్షం జన్మస్థలమైన ముంబయి నగరంలో అదిప్పుడు నాలుగో లేదా అయిదో స్థానానికి పడిపోయిందనీ, దశాబ్దాల పాటు తాము పరిపాలించిన మహారాష్ట్రలో అది పూర్తిగా కుంచించుకుపోయిందనీ ఆయన గుర్తు చేశారు. ఎలాంటి అభివృద్ధి ప్రణాళికా లేదు కాబట్టే ప్రతిపక్షం దేశ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందనీ, అలాంటి పార్టీ అస్సాం లేదా కాజీరంగా ప్రయోజనాల కోసం ఎన్నటికీ పనిచేయలేదని శ్రీ మోదీ అన్నారు.
భారతరత్న డాక్టర్ భూపేన్ హజారికా మాటలను ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. కాజీరంగా సౌందర్యాన్ని గాఢమైన ప్రేమతో ఆయన వర్ణించారన్నారు. కాజీరంగాపై ప్రేమను, ప్రకృతితో అస్సాం ప్రజల అనుబంధాన్ని ఆయన మాటలు ప్రతిబింబించాయని పేర్కొన్నారు. కాజీరంగా ఓ జాతీయోద్యానవనం మాత్రమే కాదనీ, ఇది అస్సాం ఆత్మ అనీ, భారత జీవవైవిధ్యానికి అమూల్యమైన ఆభరణమనీ ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిందన్నారు. కాజీరంగానూ, దాని వన్యప్రాణులను రక్షించడం పర్యావరణ సంరక్షణ మాత్రమే కాదనీ.. అస్సాం భవిష్యత్తు, భావి తరాల పట్ల బాధ్యత అనీ శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. అస్సాం గడ్డపై నుంచి పలు నూతన ప్రాజెక్టుల ప్రారంభాన్ని శ్రీ మోదీ ప్రకటించారు. విస్తృత ప్రభావాన్ని చూపే కార్యక్రమాలకు గాను ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు కాజీరంగా నిలయమని ప్రధానమంత్రి గుర్తుచేశారు. వరదలు వచ్చినప్పుడు వన్యప్రాణులు ఎదుర్కొనే సవాళ్లను వివరించారు. వరద సమయంలో సురక్షితమైన ఎత్తైన ప్రాంతాలకు వెళ్లే క్రమంలో జంతువులు జాతీయ రహదారిని దాటాల్సి ఉంటుందనీ, ఆ సమయంలో అవి తరచూ ప్రమాదాల్లో చిక్కుకుపోతున్నాయనీ ఆవేదన వ్యక్తం చేశారు. అడవిని సురక్షితంగా ఉంచుతూనే.. ట్రాఫిక్ సజావుగా సాగేలా చూసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ లక్ష్యంతోనే దాదాపు రూ. 7,000 కోట్ల వ్యయంతో కలియాబోర్ నుంచి నుమాలిగఢ్ వరకు 90 కిలోమీటర్ల కారిడార్‌ను అభివృద్ధి చేస్తున్నామని, 35 కిలోమీటర్ల ఎలివేటెడ్ వన్యప్రాణి కారిడార్ ఇందులో భాగంగా ఉందని ఆయన తెలిపారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ పైనుంచి వాహనాలు వెళ్తుంటే, కింద జంతువుల సంచారానికి ఎలాంటి అడ్డంకులూ ఉండవు. ముఖ్యంగా ఖడ్గమృగాలు, ఏనుగులు, పులులు ఎప్పుడూ సంచరించే మార్గాలను దృష్టిలో పెట్టుకుని ఈ డిజైన్‌ను రూపొందించారు. ఈ కారిడార్ ఎగువ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ మధ్య అనుసంధానాన్ని కూడా మెరుగుపరుస్తుందని, కొత్త రైలు సర్వీసులతోపాటు ప్రజలకు సరికొత్త అవకాశాలను అందిస్తుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ ముఖ్యమైన ప్రాజెక్టుల నేపథ్యంలో అస్సాం ప్రజలకు, దేశానికి ఆయన అభినందనలు తెలిపారు.
ప్రకృతిని పరిరక్షిస్తే అవకాశాలు కూడా పెరుగుతాయని చెబుతూ.. ఇటీవలి సంవత్సరాల్లో కాజీరంగాలో పర్యాటకం స్థిరంగా పెరుగుతోందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. వసతి గృహాలు (హోమ్ స్టేలు), గైడ్ సేవలు, రవాణా, హస్తకళలు, చిన్న వ్యాపారాల ద్వారా స్థానిక యువతకు సరికొత్త ఆదాయ మార్గాలు లభిస్తున్నాయన్నారు.
అస్సాం ప్రజలు, ప్రభుత్వం సాధించిన మరో ఘనతను శ్రీ మోదీ ప్రస్తావించారు. ఒకప్పుడు ఖడ్గమృగాల వేట తీవ్ర ఆందోళన కలిగించేదని గుర్తుచేశారు. 2013, 2014 సంవత్సరాల్లో డజన్ల సంఖ్యలో ఒంటికొమ్ము ఖడ్గమృగాలను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖడ్గమృగాల వేట కొనసాగడానికి వీల్లేదని తమ ప్రభుత్వం నిర్ణయించుకుందని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా భద్రతా ఏర్పాట్లను కఠినతరం చేయడమే కాకుండా.. అటవీ శాఖకు ఆధునిక వనరులను సమకూర్చామన్నారు. నిఘా వ్యవస్థను మెరుగుపరిచామనీ, ముఖ్యంగా 'వన దుర్గ' పేరుతో అటవీ రక్షణలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచామనీ శ్రీ మోదీ వివరించారు. ఫలితంగా 2025లో ఖడ్గమృగాల వేటకు సంబంధించి ఒక్క సంఘటన కూడా నమోదు కాలేదని తెలిపారు. ప్రభుత్వ రాజకీయ సంకల్పం, అస్సాం ప్రజల కృషి వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు.
ప్రకృతి, అభివృద్ధి పరస్పర విరుద్ధమని చాలాకాలంగా భావించేవారన్న శ్రీ మోదీ.. ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం రెండూ ఏకకాలంలో పురోగమించగలవని భారత్ నేడు ప్రపంచానికి చాటుతోందన్నారు. గత దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా అడవుల విస్తీర్ణం, పచ్చదనం పెరిగాయని ఆయన గుర్తుచేశారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారనీ.. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 260 కోట్లకు పైగా మొక్కలు నాటారనీ శ్రీ మోదీ వివరించారు. 2014 నుంచి దేశంలో పులులు, ఏనుగుల సంరక్షణ కేంద్రాల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. అలాగే, రక్షిత ప్రాంతాలు, సామాజిక అటవీ ప్రాంతాల విస్తీర్ణం కూడా పెరిగిందన్నారు. ఒకప్పుడు భారతదేశంలో అంతరించిపోయిన చీతాలను ఇప్పుడు తిరిగి తీసుకొచ్చామని, అవి కొత్త ఆకర్షణగా నిలిచాయని శ్రీ మోదీ చెప్పారు. చిత్తడి నేలల సంరక్షణ కోసం భారత్ నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. నేడు మన దేశం ఆసియాలో అతిపెద్ద రామ్‌సర్ వ్యవస్థగా అవతరించిందనీ, రామ్‌సర్ ప్రాంతాల సంఖ్య పరంగా ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచిందని వివరించారు. వారసత్వ పరిరక్షణ, ప్రకృతి సంరక్షణతోపాటే అభివృద్ధిని ఎలా ముందుకు తీసుకెళ్లవచ్చో అస్సాం కూడా ప్రపంచానికి చాటుతోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
‘దూరమే’ ఎప్పుడూ ఈశాన్య రాష్ట్రాలకు ప్రధాన సమస్యగా ఉందనీ.. అది కేవలం ప్రాంతాల మధ్య దూరమే కాకుండా, మనసుల మధ్య దూరం కూడా అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఎక్కడెక్కడో అభివృద్ధి జరుగుతోందని, తాము మాత్రం వెనుకబడిపోతున్నామనే భావన దశాబ్దాల తరబడి ఈ ప్రాంత ప్రజల్లో ఉండేదన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థనే కాకుండా, ప్రభుత్వంపై నమ్మకాన్ని కూడా దెబ్బతీసిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఈశాన్య ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ.. తమ పార్టీ ఈ భావనను మార్చేసిందని తెలిపారు. రహదారులు, రైల్వేలు, వాయు మార్గాలు, జల మార్గాల ద్వారా అస్సాంను అనుసంధానించే పనులు ఏకకాలంలో మొదలయ్యాయని ఆయన గుర్తుచేశారు.
రైలు రవాణా విస్తరణతో సామాజికంగా, ఆర్థికంగా ఎంతో మేలు కలుగుతుందనీ.. ఈశాన్య రాష్ట్రాలకు ఇది చాలా కీలకమనీ శ్రీ మోదీ పేర్కొన్నారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రస్తుత ప్రతిపక్షం ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. వారి హయాంలో అస్సాం రైల్వే బడ్జెట్ కేవలం రూ. 2,000 కోట్లు మాత్రమే ఉండగా.. తమ ప్రభుత్వ హయాంలో దానిని ఏటా దాదాపు రూ. 10,000 కోట్లకు పెంచామని తెలిపారు. అంటే గతంతో పోలిస్తే అయిదు రెట్లు ఎక్కువ నిధులు కేటాయిస్తున్నామని వివరించారు. పెరిగిన ఈ పెట్టుబడుల వల్ల భారీ స్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి జరిగిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, లైన్ల డబ్లింగ్, విద్యుదీకరణ వల్ల రైల్వే సామర్థ్యం పెరగడమే కాకుండా, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. కలియాబోర్ నుంచి మూడు కొత్త రైలు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు శ్రీ మోదీ ప్రకటించారు. అస్సాం రైల్వే అనుసంధాన విస్తరణలో ఇదొక ముఖ్య ఘట్టమన్నారు. గువహటి నుంచి కలకత్తా మధ్య వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వస్తుందనీ, దీనివల్ల సుదీర్ఘ ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా మారుతాయనీ ఆయన తెలిపారు. వీటితోపాటు రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని కీలక స్టేషన్లను కలుపుతాయనీ.. తద్వారా లక్షలాది మంది ప్రయాణికులకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందని శ్రీ మోదీ వివరించారు. ఈ రైళ్లు కొత్త మార్కెట్లతో అస్సాం వ్యాపారాలను అనుసంధానిస్తాయనీ, విద్యార్థులకు విద్యావకాశాలను పెంచుతాయనీ అన్నారు. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రయాణాన్ని మరింత సరళతరం చేస్తాయని తెలిపారు. ఈశాన్య భారతం ఇకపై అభివృద్ధికి ఆమడ దూరంలో లేదనీ.. అదెక్కడో మారుమూల ప్రాంతం కాదనీ భావించే సరికొత్త విశ్వాసం ఈ రవాణా సదుపాయాల విస్తరణతో ప్రజల్లో కలుగుతుందన్నారు. ఢిల్లీకి, మనందరి హృదయాలకు ఈశాన్య ప్రాంతం నేడు ఎంతో దగ్గరైందని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
అస్సాం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు.. అస్తిత్వాన్నీ, సంస్కృతినీ కాపాడుకోవడంపైనా ప్రధానమంత్రి ప్రసంగించారు. చొరబాటును అడ్డుకోవడంలోనూ, అడవులు - చారిత్రక సాంస్కృతిక ప్రదేశాలను, ప్రజల భూములను అక్రమ ఆక్రమణల నుంచి విముక్తి చేయడంలోనూ అస్సాం ప్రభుత్వం చూపుతున్న చొరవను ప్రశంసించారు. ప్రభుత్వ చర్యల పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ప్రతిపక్షాల హయాంతో ఈ విషయాన్ని పోల్చి చూపిస్తూ.. దశాబ్దాల తరబడి వారు కేవలం ఓట్ల కోసం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం అస్సాం భూమిని చొరబాటుదారులకు అప్పగించారని ప్రధానమంత్రి శ్రీ మోదీ విమర్శించారు. నేటి ప్రతిపక్షం ప్రభుత్వంలో ఉన్న సంయలో చొరబాట్లు నిరంతరం పెరిగాయన్నారు. అస్సాం చరిత్ర, సంస్కృతి, విశ్వాసాలపై ఏమాత్రం గౌరవం లేని ఆ చొరబాటుదారులు విస్తృతంగా ఆక్రమణలకు పాల్పడ్డారని విమర్శించారు. చొరబాట్ల వల్ల జంతువులు సంచరించే మార్గాల్లో ఆక్రమణలు పెరిగాయనీ, వాటి వేట పెరిగిందనీ, స్మగ్లింగూ, ఇతర నేరాలూ పెరిగాయనీ అన్నారు.
చొరబాటుదారులు అస్సాం జనాభా సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నారని శ్రీ మోదీ హెచ్చరించారు. వారు ఇక్కడి సంస్కృతిపై దాడి చేయడమే కాకుండా.. పేదలు, యువతకు దక్కాల్సిన ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లోని భూములను మోసపూరితంగా ఆక్రమిస్తున్నారని, ఇది అస్సాం భద్రతకే కాకుండా దేశ భద్రతకు కూడా పెను ముప్పుగా వాటిల్లుతోందని హెచ్చరించారు. ప్రతిపక్షం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలను హెచ్చరించారు. చొరబాటుదారులను రక్షించడం, అధికారాన్ని చేజిక్కించుకోవడమే దాని ఏకైక విధానమని విమర్శించారు. ప్రతిపక్షాలూ, వారి మిత్రపక్షాలు దేశవ్యాప్తంగా ఇదే పంథాను అనుసరిస్తున్నాయని శ్రీ మోదీ చెప్పారు. బీహార్‌ను ఇందుకు ఉదాహరణగా చూపిస్తూ.. అక్కడ చొరబాటుదారులకు మద్దతుగా వారు నిరసనలు, ర్యాలీలు చేశారని గుర్తు చేశారు. కానీ బీహార్ ప్రజలు వారిని పూర్తిగా తిరస్కరించారని స్పష్టం చేశారు. అస్సాం ప్రజలు కూడా ప్రతిపక్షానికి గట్టి సమాధానం ఇస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అస్సాం అభివృద్ధి మొత్తం ఈశాన్య భారత పురోభివృద్ధికి సరికొత్త ద్వారాలను తెరుస్తోందని, అలాగే మన ‘యాక్ట్ ఈస్ట్ విధానా’నికి దిశానిర్దేశం చేస్తోందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. అస్సాం అభివృద్ధి చెందితే ఈశాన్య భారతం పురోగమిస్తుందన్నారు. ప్రభుత్వ కృషి, ప్రజల విశ్వాసాలతో ఈ ప్రాంతం సరికొత్త శిఖరాలను అధిరోహిస్తుందని స్పష్టం చేశారు. ఈ రోజు ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా మరోసారి ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపుతూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
అస్సాం గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రులు శ్రీ సర్బానంద సోనోవాల్, శ్రీ పబిత్రా మార్గరీటా, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
రూ. 6,950 కోట్లకు పైగా విలువైన కాజీరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు (జాతీయ రహదారి 715లోని కలియాబోర్ - నుమాలీగఢ్ విభాగంలో 4 వరుసల విస్తరణ)కు ప్రధానమంత్రి భూమిపూజ చేశారు.
86 కిలోమీటర్ల పొడవైన కాజీరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు పర్యావరణ స్పృహతో చేపట్టిన జాతీయ రహదారి ప్రాజెక్టు. కాజీరంగా జాతీయోద్యానవనం గుండా వెళ్లే 35 కిలోమీటర్ల ఎలివేటెడ్ వన్యప్రాణి కారిడార్, 21 కిలోమీటర్ల బైపాస్ సెక్షన్, జాతీయ రహదారి 715లోని 30 కిలోమీటర్ల మేర ప్రస్తుతమున్న రెండు వరుసల నుంచి నాలుగు వరుసలకు విస్తరించడం ఈ ప్రాజెక్టు ముఖ్యాంశాలు. ఈ జాతీయోద్యానవనంలోని అపారమైన జీవవైవిధ్యాన్ని సంరక్షిస్తూనే.. ప్రాంతీయ అనుసంధానాన్ని మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.
నాగావ్, కర్బీ అంగ్లాంగ్, గోలాఘాట్ జిల్లాల గుండా వెళ్లే ఈ ప్రాజెక్టు.. ఎగువ అస్సాంకు, ముఖ్యంగా దిబ్రూగఢ్, తీన్సుకియాకు రవాణాను విశేషంగా మెరుగుపరుస్తుంది. ఎలివేటెడ్ వన్యప్రాణి కారిడార్ ద్వారా జంతువుల స్వేచ్ఛా సంచారానికి ఎలాంటి అంతరాయమూ కలగదు. అలాగే మానవ - వన్యప్రాణి ఘర్షణను కూడా ఇది తగ్గిస్తుంది. ఇది రోడ్డు భద్రతను మెరుగుపరచడమే కాకుండా.. ప్రయాణ సమయాన్నీ, ప్రమాదాల రేటునూ తగ్గిస్తుంది. అలాగే పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి, సరుకు రవాణాకు ఈ ప్రాజెక్టు ఎంతో తోడ్పడుతుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా జాఖలబంద, బోకాఖాట్ వద్ద బైపాస్‌లను అభివృద్ధి చేస్తారు. ఇవి పట్టణాల్లో రద్దీని తగ్గించడానికి, పట్టణ రవాణాను మెరుగుపరచడానికి, స్థానికుల జీవన నాణ్యతను పెంచడానికి సహాయపడతాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా రెండు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లు.. గౌహతి (కామాఖ్య) - రోహ్తక్, దిబ్రూఘర్ - లక్నో (గోమతి నగర్) రైళ్లను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ కొత్త రైలు సర్వీసులు ఈశాన్య, ఉత్తర భారతాల మధ్య రైల్వే అనుసంధానాన్ని బలోపేతం చేస్తాయి. తద్వారా ప్రజలకు సురక్షితమైన, మరింత సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయాలు లభిస్తాయి.
***
(रिलीज़ आईडी: 2215910)
आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Nepali
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam