|
ప్రధాన మంత్రి కార్యాలయం
‘వైబ్రంట్ గుజరాత్’ కచ్.. సౌరాష్ట్ర ప్రాంతీయ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
प्रविष्टि तिथि:
11 JAN 2026 6:00PM by PIB Hyderabad
అందరికీ నమస్కారం!
గౌరవనీయులైన గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, ఉప ముఖ్యమంత్రి శ్రీ హర్ష్ సంఘవి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాననీయులు, పారిశ్రామిక ప్రతినిధులు, విశిష్ట అతిథులు, సోదరీసోదరులారా!
ఈ కొత్త సంవత్సరం (2026)లో ఇదే నా గుజరాత్ తొలి పర్యటన. ఈ ఏడాది నా ప్రస్థానం సోమనాథ్ దాదా పాదాల వద్ద శిరసాభివందనంతో మొదలైంది కాబట్టి ఇది మరింత శుభప్రదం. ఇప్పుడు, నేనిక్కడ రాజ్‌కోట్‌లో ఈ అద్భుత కార్యక్రమంలో భాగస్వామినయ్యాను. వారసత్వ సహిత ప్రగతి మంత్రం నేడు ఎల్లెడలా ప్రతిధ్వనిస్తోంది. ఈ నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సుకు హాజరైన మీకందరికీ సాదర స్వాగతం పలుకుతూ, శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
మిత్రులారా!
వైబ్రెంట్ గుజరాత్ సదస్సు వేదిక సన్నద్ధమైన ప్రతి సందర్భంలో దాన్ని నేనొక సదస్సుగా మాత్రమే కాకుండా 21వ శతాబ్దంలో నవ భారత్ పయనంగా పరిగణిస్తాను. ఒక కలతో ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు అచలిత విశ్వాస స్థాయికి చేరింది. రెండు దశాబ్దాల కాలంలో, వైబ్రంట్ గుజరాత్ ప్రస్థానం ఒక ప్రపంచ ప్రమాణంగా రూపొందింది. ఇప్పటిదాకా పది సార్లు నిర్వహించగా, ప్రతిసారి ఈ సదస్సు గుర్తింపు, పాత్ర మరింత బలోపేతమవుతూనే ఉన్నాయి.
మిత్రులారా!
వైబ్రెంట్ గుజరాత్ సదస్సు ఆరంభం నుంచి ఆ దృక్కోణంతో నా అనుబంధం విడదీయరానిది. తొలినాళ్లలో రాష్ట్ర సామర్థ్యమేమిటో ప్రపంచానికి తెలియజేయడం, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం ద్వారా పెట్టుబడులను ప్రోత్సహించడం మా లక్ష్యం. తద్వారా భారత్ సహా ప్రపంచ పెట్టుబడిదారులూ ప్రయోజనం పొందుతారు. అయితే, ఇవాళ ఈ సదస్సు పెట్టుబడులకు అతీతంగా ఎదిగి ప్రపంచ వృద్ధి, అంతర్జాతీయ సహకారం, భాగస్వామ్యాలకు బలమైన వేదికగా రూపొందింది. ఏళ్లు గడుస్తున్నకొద్దీ, ప్రపంచ భాగస్వాముల సంఖ్య క్రమంగా పెరుగుతూ కాలక్రమంలో సమ్మిళితత్వానికి ఈ సదస్సు ఓ గొప్ప ఉదాహరణగా కూడా మారింది. ఇక్కడ, కార్పొరేట్ సమూహాలు, సహకార సంస్థలు, ‘ఎంఎస్‌ఎంఈ’లు, అంకుర సంస్థలు, బహుపాక్షిక, ద్వైపాక్షిక సంస్థలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు... అన్నీ మమేకమై సంభాషణలు, చర్చల్లో పాల్గొనడమే కాకుండా గుజరాత్ ప్రగతిలో భుజం కలిపి సాగుతాయి.
మిత్రులారా!
రెండు దశాబ్దాలుగా అవిచ్ఛిన్నంగా సాగుతున్న ఈ సదస్సు ఏటా ఏదో ఒక కొత్తదనాన్ని, ప్రత్యేకతను పరిచయం చేస్తూనే ఉంది. ఈ క్రమంలో నేటి వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు ఒకటి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నిబిడీకృత సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడంపై ఇది దృష్టి సారిస్తుంది. ఉదాహరణకు కొన్ని ప్రాంతాలకు తీర ప్రాంతమే ఒక పెద్ద బలం... మరి కొన్నింటికి సుదీర్ఘ గిరిజన ప్రాంతం ఉంటే, ఇంకొన్నింటికి పారిశ్రామిక సముదాయాల భారీ వ్యవస్థ అండగా నిలుస్తోంది. ఇంకా కొన్ని ప్రాంతాలు వ్యవసాయం-పశుపోషణ రంగాలకు పట్టుగొమ్మలు. ఒక్కమాటలో చెబితే, గుజరాత్‌లోని ప్రతి ప్రాంతానికి తనదైన ప్రత్యేక బలం, సామర్థ్యం ఉన్నాయి. ఇలాంటి ప్రాంతీయ అవకాశాలపై దృష్టి సారిస్తూ వైబ్రంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు అప్రతిహతంగా ముందడుగు వేస్తోంది.
మిత్రులారా!
ప్రస్తుత 21వ శతాబ్దంలో నాలుగో వంతు ఇప్పటికే గడిచిపోయినప్పటికీ, దేశం వేగంగా ప్రగతి సాధించింది. ఈ పురోగమనంలో గుజరాత్ సహా మీరంతా కీలక పాత్రధారులే. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్ శరవేగంగా పయనిస్తోంది. మన దేశంపై ప్రపంచం అంచనాలు నానాటికీ పెరుగుతుండటాన్ని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా పురోగమిస్తున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ ద్రవ్యోల్బణం అదుపులో ఉండగా, వ్యవసాయోత్పత్తిలో దేశం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. పాల ఉత్పత్తిలోనే కాకుండా జనరిక్ ఔషధాల తయారీలోనూ భారత్ ఇప్పటికే అగ్రస్థానం చేరింది. ఇక వ్యాక్సిన్ల తయారీ విషయానికొస్తే, ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో టీకాలు ఉత్పత్తి చేస్తున్నది భారత దేశమే.
మిత్రులారా!
భారత్ వృద్ధి నివేదిక ‘సంస్కరణ.. సామర్థ్యం.. సమూల మార్పు’ మంత్రంతో రూపొందిన విజయ గాథ. గత 11 ఏళ్లలో మన దేశం ప్రపంచంలో అతి పెద్ద మొబైల్ డేటా వినియోగదారుగా మారింది. ఇక మన ‘యూపీఐ’ కూడా ప్రపంచంలో అగ్రస్థానంలోగల ప్రత్యక్ష డిజిటల్ లావాదేవీల వేదికగా అవతరించింది. ఒకప్పుడు దేశంలో వాడే 10 మొబైల్ ఫోన్లలో 9 దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. ఇవాళ భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారుగా ఆవిర్భవించింది. అంతేకాదు... భారత్ ఇప్పుడు ప్రపంచంలో మూడో అతి పెద్ద అంకురావరణ వ్యవస్థగా మారింది. సౌర విద్యుదుత్పాదనలోనూ ప్రపంచ తొలి మూడు దేశాల జాబితాలో చేరింది. అలాగే మనం మూడో అతి పెద్ద విమానయాన మార్కెట్‌గా ఉండటమేగాక, మెట్రో నెట్‌వర్క్ పరంగా ప్రపంచంలోని తొలి మూడు దేశాలలో ఒకటిగా ఉన్నాం.
మిత్రులారా!
ప్రతి ప్రపంచ నిపుణుడు, సంస్థ భారత్‌పై నేడు సానుకూల దృక్పథం ప్రదర్శిస్తున్నాయి. ‘ఐఎంఎఫ్’ భారత్‌ను ప్రపంచ వృద్ధికి చోదక శక్తిగా అభివర్ణిస్తోంది. ‘ఎస్ అండ్ పి’ సంస్థ 18 ఏళ్ల తర్వాత మన రేటింగ్‌ను ఉన్నతీకరించింది. ‘ఫిచ్’ సంస్థ తన రేటింగ్‌లో భారత స్థూల ఆర్థిక స్థిరత్వం, ద్రవ్య విశ్వసనీయతను ప్రశంసించింది. ప్రపంచవ్యాప్త మందగమనంలోనూ భారత్ అద్భుత నిలకడను ప్రదర్శించడమే భారత్‌పై ప్రపంచానికి ఈ నమ్మకం ఏర్పడింది. భారత్‌లో రాజకీయ స్థిరత్వం, విధానాల కొనసాగింపు, పెరుగుతున్న కొనుగోలు శక్తితో నవ్య మధ్యతరగతి విస్తరణ ఇందులో ప్రధాన పాత్ర పోషించాయి. ఇవన్నీ భారత్‌ను అపార అవకాశాల గడ్డగా మార్చాయి. నేను ఎర్రకోటపై నుంచి ప్రకటించినట్లుగా- ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో దేశ విదేశీ పెట్టుబడిదారులందరికీ ఇదే సమయం.. ఇదే తగిన తరుణం! వైబ్రంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు కూడా పెట్టుబడిదారులకు ఇదే సందేశాన్నిస్తోంది. కాబట్టి, సౌరాష్ట్ర-కచ్‌లలో పెట్టుబడులు పెట్టండి... ఇదే అందుకు సముచిత సమయం.
మిత్రులారా!
సవాలు ఎంత పెద్దదైనా, నిజాయితీతో శ్రమిస్తే విజయం తథ్యమని వాస్తవాన్ని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలు మనకు స్పష్టం చేస్తాయన్నది మీకందరికీ తెలిసిందే. ఇదే కచ్ ప్రాంతం ఈ శతాబ్దారంభంలో ఒక విధ్వంసక భూకంపాన్ని తట్టుకుని నిలిచింది. అదేవిధంగా ఏళ్ల తరబడి తాండవించిన కరవును అధిగమించి సౌరాష్ట్ర ముందడుగు వేసింది. ఒకనాడు తల్లులు, అక్కచెల్లెళ్లు తాగునీటి కోసం మైళ్ల కొద్దీ దూరం నడవాల్సి వచ్చేది. విద్యుత్ సరఫరా అనిశ్చితంగా.. కష్టాలు సర్వత్రా కనిపిస్తూండేవి.
మిత్రులారా!
ఇప్పటి 20-25 ఏళ్ల యువతకు అప్పటి కథలు మాత్రమే తెలిసి ఉంటాయి. వాస్తవానికి కచ్ లేదా సౌరాష్ట్రలో ఎక్కువ కాలం ఉండాలంటే ప్రజలు ఇచ్చగించేవారు కారు. ఈ దుస్థితి ఎన్నటికీ మారదేమోనని ఆనాడు అనిపించేది. కానీ, కాలం మారుతుంది.. మార్పు తప్పక వస్తుందని చరిత్ర సాక్ష్యమిచ్చింది. ఆ మేరకు సౌరాష్ట్ర, కచ్ ప్రాంత ప్రజానీకం తమ రెక్కల కష్టంతో విధిరాతను తిరగరాశారు.
మిత్రులారా!
కనుక... సౌరాష్ట్ర, కచ్ ఈ రోజున కేవలం అపార అవకాశాల నెలవులు మాత్రమే కాదు.. దేశ వృద్ధికి కీలక ప్రాంతాలయ్యాయి. స్వయం సమృద్ధ భారత్ కార్యక్రమానికి సారథ్యం వహించే ప్రధాన కూడళ్లుగా ఆవిర్భవిస్తున్నాయి. దేశాన్ని ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా మార్చడంలో ఈ రెండు ప్రాంతాలూ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఈ పాత్ర మార్కెట్ ఆధారితం.. పెట్టుబడిదారులకు లభించే గొప్ప హామీ ఇదే. ఇక్కడే రాజ్‌కోట్‌లో 2,50,000కుపైగా ‘ఎంఎస్‌ఎంఈ’లు ఉన్నాయి. విభిన్న పారిశ్రామిక సముదాయాల్లో స్క్రూడ్రైవర్ల నుంచి ఆటో విడిభాగాలు, యంత్ర పరికరాలు, లగ్జరీ కార్ లైనర్లు, విమానం, ఫైటర్ జెట్, రాకెట్ విడి భాగాలదాకా ప్రతి ఒక్కటీ ఇక్కడ తయారవుతోంది. స్వల్ప వ్యయంతో తయారీ నుంచి అత్యంత కచ్చితమైన-సాంకేతిక తయారీ దాకా ఈ ప్రాంతం యావత్తూ విలువ వ్యవస్థకు మద్దతిస్తుంది. ఇక్కడి ఆభరణాల పరిశ్రమ ప్రపంచ ప్రసిద్ధం కాగా- ఈ రంగం స్థాయి, నైపుణ్యం, ప్రపంచ అనుసంధానానికి ఒక ఉజ్వల నిదర్శనం.
మిత్రులారా!
రాష్ట్రంలోని అలాంగ్ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద షిప్ బ్రేకింగ్ యార్డ్. ప్రపంచంలో మూడింట ఒక వంతు ఓడలు ఇక్కడ రీసైకిల్ అవుతాయి. వర్తుల ఆర్థిక వ్యవస్థలో భారత్ అగ్రస్థానానికి ఇదొక రుజువు. టైల్స్ ఉత్పత్తి చేసే అతి పెద్ద దేశాలలో భారత్ కూడా ఒకటి కాగా, ఇందులో గుజరాత్‌లోని మోర్బి జిల్లాకు భారీ వాటా ఉంది. తయారీ వ్యయంలో పోటీకి ఈ ప్రాంతం ఒక ప్రపంచ ప్రమాణంగా మారింది. నాకు బాగా గుర్తుంది.. అలాగే మీలో చాలామంది సౌరాష్ట్ర పాత్రికేయులకూ గుర్తుండే ఉంటుంది- ఓ సందర్భంలో నేనిక్కడ ప్రసంగిస్తూ మోర్బి, జామ్‌నగర్, రాజ్‌కోట్ ఒక సూక్ష్మ జపాన్ తరహా త్రిభుజాన్ని ఏర్పరుస్తాయని చెప్పాను. ఆనాడు నన్ను చాలామంది హేళన చేశారు... నాటి నా దృక్కోణం ఇవాళ నా కళ్లముందు వాస్తవ రూపం దాల్చడం స్పష్టంగా కనిపిస్తోంది. ధోలేరా ప్రత్యేక పెట్టుబడి ప్రాంతం విషయంలోనూ నేనెంతో గర్విస్తున్నాను. ఈ నగరం ఇవాళ ఆధునిక తయారీకి ప్రధాన కేంద్రంగా రూపొందుతోంది. దేశంలో తొలి సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ సౌకర్యం ధోలేరాలో రూపుదిద్దుకుంటోంది. భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాలలో భారత్‌కు ఇది తొలి సానుకూల ప్రయోజనాన్నిస్తుంది. మీ పెట్టుబడులకు తగిన మౌలిక సదుపాయాలన్నీ ఇక్కడున్నాయి. మాది దీర్ఘకాలిక దృక్పథం మాత్రమేగాక అనూహ్య విధానాలకు తావుండదు.
మిత్రులారా!
భారత కాలుష్య రహిత వృద్ధి, రవాణా, ఇంధన భద్రతకు సౌరాష్ట్ర, కచ్ ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. ఈ మేరకు కచ్‌లో 30 గిగావాట్ల సామర్థ్యంతో పునరుత్పాదక ఇంధన పార్క్ నిర్మితమవుతోంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద హైబ్రిడ్ ఇంధన పార్క్... ఎంత పెద్దదంటే ఇది పారిస్ నగరంకన్నా 5 రెట్లు పెద్దదిగా ఉంటుంది. పరిశుభ్ర ఇంధనం మాకు ఒక నిబద్ధత మాత్రమే కాదు.. వాణిజ్య స్థాయి వాస్తవికత. గ్రీన్ హైడ్రోజన్ సామర్థ్యమేమిటో మీకందరికీ తెలిసిందే... ఈ దిశగా భారత్ అనూహ్య వేగం, భారీ స్థాయిలో పయనిస్తోంది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి కచ్, జామ్‌నగర్ ప్రధాన కూడళ్లుగా రూపొందుతున్నాయి. కచ్‌లో భారీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్‌ఎస్) కూడా సిద్ధమవుతోంది. తద్వారా పునరుత్పాదక ఇంధనంతోపాటు గ్రిడ్ స్థిరత్వం, విశ్వసనీయతకు భరోసా లభిస్తుంది.
మిత్రులారా!
భారత ప్రపంచ స్థాయి ఓడరేవులు ఉండటం కచ్, సౌరాష్ట్ర ప్రాంతాలకు మరో గొప్ప బలం. దేశ ఎగుమతుల్లో అత్యధిక శాతం ఇక్కడి నుంచే సాగుతుంది. పిపావావ్, ముంద్రా వంటి రేవులు భారత ఆటోమొబైల్ ఎగుమతులకు ప్రధాన కూడళ్లు. గత సంవత్సరం దాదాపు 1,75,000 వాహనాలు గుజరాత్ ఓడరేవుల ద్వారా ఎగుమతి కావడం ఇందుకు నిదర్శనం. ఇదంతా కేవలం రవాణాకు పరిమితం కాదు... పోర్టు ఆధారిత అభివృద్ధి నేపథ్యంలో ప్రతి అంశంలోనూ పెట్టుబడి అవకాశాలు అపారం. దీంతోపాటు గుజరాత్ ప్రభుత్వం మత్స్య రంగానికీ ప్రత్యేక ప్రాధాన్యమిస్తోంది. ఇందుకు తగిన మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో కృషి సాగింది. సముద్ర ఆహార ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడి పెట్టేవారి కోసం ఇక్కడ బలమైన వ్యవస్థ సిద్ధంగా ఉంది.
మిత్రులారా!
పెట్టుబడులు పెట్టాలంటే మౌలిక సదుపాయాలే కాకుండా పరిశ్రమ సంసిద్ధ కార్మిక శక్తి లభ్యత కూడా నేడు అత్యంత అవశ్యం. ఈ విషయంలో పెట్టుబడిదారులకు గుజరాత్ పూర్తి భరోసా ఇస్తుంది. ఇక్కడ విద్య, నైపుణ్యాభివృద్ధి సంబంధిత అంతర్జాతీయ వ్యవస్థ ఉంది. ఆస్ట్రేలియా, సింగపూర్ విశ్వవిద్యాలయాలతో సంయుక్తంగా గుజరాత్ నైపుణ్య విశ్వవిద్యాలయం యువతను భవిష్యత్ నైపుణ్యాలతో రూపుదిద్దుతోంది. నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ భారత తొలి జాతీయ స్థాయి రక్షణ రంగ విశ్వవిద్యాలయం. ఇక రహదారులు, రైల్వే, గగన-జలమార్గాలు, రవాణా వంటి ప్రతి రంగానికీ తగిన నిపుణ మానవశక్తిని గతిశక్తి విశ్వవిద్యాలయం సిద్ధం చేస్తోంది. అంటే- పెట్టుబడితోపాటు ప్రతిభావంతుల లభ్యతకూ ఇవన్నీ హామీ ఇస్తున్నాయి. అలాగే, భారత్‌లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్న అనేక విదేశీ విశ్వవిద్యాలయాలకు గుజరాత్ అభిలషిత గమ్యంగా మారుతోంది. ఈ మేరకు ఆస్ట్రేలియాలోని 2 ప్రధాన విశ్వవిద్యాలయాలు ఇప్పటికే ఇక్కడ తమ ప్రాంగణాలను ప్రారంభించగా, త్వరలో వీటి సంఖ్య మరింత పెరుగుతుంది.
మిత్రులారా!
ప్రకృతి సౌందర్యం, సాహస క్రీడలు, సంస్కృతి-వారసత్వాలకు గుజరాత్ నెలవు. మీరు కోరుకునే పర్యాటక అనుభవం ఏదైనా ఇక్కడ లభిస్తుంది. ఈ మేరకు 4,500 ఏళ్ల భారత ప్రాచీన సముద్రయాన వారసత్వానికి లోథాల్ ప్రతీకగా నిలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత పురాతన మానవ నిర్మిత ఓడరేవు ఇక్కడ బయల్పడింది. అంతేకాకుండా జాతీయ సముద్ర వారసత్వ ప్రాంగణం ఇక్కడ నిర్మితమవుతోంది. ఈ సీజన్‌లో నిర్వహించే కచ్ రాన్ ఉత్సవానందాన్ని ఆస్వాదించడంలో భాగంగా అక్కడి టెంట్ సిటీలో బస చేయడం ఒక ప్రత్యేక అనుభవమనడంలో సందేహం లేదు.
వన్యప్రాణి ప్రేమికులకు ఇక్కడి గిర్ అడవులలో ఠీవిగా సంచరించే ఆసియా సింహాలను చూడటాన్ని మించిన ఆనందం మరేముంటుంది? ఏటా 9 లక్షల మందికిపైగా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇక సముద్రతీర వ్యాహ్యాళిని ఇష్టపడేవారికి, ‘బ్లూ ఫ్లాగ్’ ధ్రువీకరణగల శివరాజ్‌పూర్ బీచ్ ఉంది. అలాగే మాండ్వీ, సోమనాథ్, ద్వారక కూడా బీచ్ పర్యాటక రంగానికి అపార అవకాశాలు కల్పిస్తాయి. సమీపంలోని డయ్యూ వాటర్ స్పోర్ట్స్, బీచ్ ఆటలకు అద్భుత గమ్యంగా రూపొందుతోంది. మొత్తం మీద ఈ ప్రాంతం యావత్తూ పెట్టుబడిదారులకు బలమైన అవకాశాలను కల్పిస్తుంది. ఈ సానుకూలతలను సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. నేను చాలా కాలం నుంచీ ఈ మాట చెబుతున్నాను... కాబట్టి- మీ ఆలస్యానికి నన్ను నిందించే పరిస్థితి రాకుండా ముందడుగు వేయండి. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో మీరు పెట్టే పెట్టుబడి ప్రతి ఒక్కటీ గుజరాత్ అభివృద్ధితోపాటు భారత ప్రగతిని వేగిరపరుస్తుంది.
సౌరాష్ట్ర సామర్థ్యమేమిటో విదేశాల్లోనూ స్పష్టమవుతుంది. రువాండా హైకమిషనర్ ఇటీవల ఒక విషయాన్ని గుర్తు చేసుకున్నారు... అదేమిటంటే- రువాండా పర్యటన సందర్భంగా ఆ దేశానికి నేను 200 గిర్ ఆవులను కానుకగా అందజేశాను. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక షరతు ఉంది.. ఈ ఆవులను స్వీకరించిన వారు వాటికి పుట్టే తొలి పెయ్య దూడను తిరిగి ప్రభుత్వానికి ఇస్తే, దాన్ని మరొక కుటుంబానికి ఇస్తారు. ఈ షరతు వల్ల నేను బహూకరించిన 200 ఆవులకు పుట్టిన దూడల పంపిణీ ద్వారా నేడు రువాండాలో వేలాది కుటుంబాలకు కనీసం ఒక ఆవు ఉంది. దాదాపు ప్రతి ఇంట్లో గిర్ ఆవు కనిపిస్తుండగా, అక్కడి గ్రామీణార్థిక వ్యవస్థకు ఇవి గొప్ప బలాన్నిస్తున్నాయి. ఇదీ సౌరాష్ట్ర స్ఫూర్తి!
మిత్రులారా!
దేశం ఇప్పుడు వికసిత భారత్ సంకల్ప సాకారం వైపు శరవేగంగా పయనిస్తోంది. ఈ లక్ష్య సాధనలో సంస్కరణల రథానికే ప్రధాన పాత్ర... అంటే- ప్రతి రంగంలోనూ భావితరం సంస్కరణలు అవశ్యం. ఈ మేరకు భారత్ ఇటీవలే ‘జీఎస్‌టీ’లో అటువంటి సంస్కరణలను అమలు చేసింది. వీటి సానుకూల ప్రభావం అన్ని రంగాలలో స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా మన ‘ఎంఎస్‌ఎంఈ’లకు ఎంతో ప్రయోజనం చేకూరింది. బీమా రంగంలో ఒక ప్రధాన సంస్కరణ కింద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 100 శాతం అనుమతించాం. దీంతో పౌరులకు సార్వత్రిక బీమా రక్షణ లభించే కార్యక్రమం వేగం పుంజుకుంటుంది. అలాగే దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత ఆదాయపు పన్ను చట్టాన్ని ఆధునికీకరించడంతో లక్షలాది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కలిగింది. అంతేకాదు... భారత్ చారిత్రక కార్మిక సంస్కరణలను కూడా అమలు చేయడంతో పరిశ్రమలకు ఏకీకృత చట్రంతోపాటు కార్మికులకు వేతనాల మెరుగుదల, సామాజిక భద్రత లభించాయి. అటు కార్మికులు, ఇటు పరిశ్రమలకూ దీనితో ప్రయోజనం కలుగుతోంది.
మిత్రులారా!
భారత్ నేడు డేటా ఆధారిత ఆవిష్కరణ, ఏఐ పరిశోధన, సెమీకండక్టర్ తయారీ రంగాల్లో ప్రపంచ కూడలిగా రూపొందుతోంది. దేశంలో విద్యుత్ డిమాండ్ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అందుకు తగిన సరఫరాకు హామీ ఇవ్వడం అవశ్యం. అయితే, ఇందుకు ప్రధాన వనరు అణుశక్తి కాబట్టి, దీన్ని దృష్టిలో ఉంచుకుని, అణు విద్యుత్ రంగంలో భవిష్యత్ తరం సంస్కరణలు తెచ్చాం. గత పార్లమెంటు సమావేశాల సందర్భంగా ‘శాంతి’ చట్టం ద్వారా పౌర అణుశక్తిలో ప్రైవేట్ భాగస్వామ్యానికి అవకాశం కల్పించాం. పెట్టుబడిదారులకు ఇదీ ఒక గొప్ప అవకాశమే.
మిత్రులారా!
ప్రస్తుతం ఇక్కడున్న పెట్టుబడిదారులందరికీ ఇదే నా హామీ- మా సంస్కరణల రథం మరింత వేగం పుంజుకుంటుంది. ఈ మేరకు మా ప్రస్థానం సంస్థాగత పరిణామం వైపు ముందడుగు వేస్తోంది.
మీరిక్కడికి కేవలం ఒక అవగాహన ఒప్పందంతో కాకుండా సౌరాష్ట్ర-కచ్ అభివృద్ధి-వారసత్వంతో సంధానం కోసం వచ్చారు. మీ పెట్టుబడిలో ప్రతి రూపాయి ఇక్కడ అద్భుత రాబడినిస్తుందని మీకు వాగ్దానం చేస్తున్నాను. మరోసారి మీకందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. అలాగే, గుజరాత్ ప్రభుత్వం, దాని బృందం కృషిని ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను. రాబోయే 2027 వైబ్రంట్ సదస్సుకు ముందు నిర్వహించిన ఈ ప్రాంతీయ శిఖరాగ్ర సదస్సు ఒక విలువైన ప్రయోగంగా నిరూపితమవుతోంది. నేను ప్రారంభించిన పనిని, ఇప్పుడు నా సహచరులు మరింత విస్తరిస్తూ నవ్యోత్తేజం నింపుతుండటం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. దీనివల్ల నా ఆనందాన్ని అనేక రెట్లు ఇనుమడిస్తుంది. చివరగా, మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందనలు...
శుభాకాంక్షలు.
ధన్యవాదాలు!
(रिलीज़ आईडी: 2213629)
|