ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జనవరి 11న రాజ్‌కోట్‌‌లో పర్యటించనున్న ప్రధానమంత్రి


కచ్ఛ్, సౌరాష్ట్ర ప్రాంతాల కోసం ఉద్దేశించిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశాన్ని ప్రారంభించనున్న ప్రధానమంత్రి

పశ్చిమ గుజరాత్‌లో పెట్టుబడులకీ, పారిశ్రామిక అభివృద్ధికీ కొత్త వేగాన్ని అందించనున్న వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశం

సిరమిక్స్, ఇంజినీరింగ్, ఓడరేవులు, ఆధునిక వస్తు రవాణా వ్యవస్థ, హరిత ఇంధనం, పర్యాటకం తదితర కీలక రంగాలపై సమావేశంలో ప్రత్యేక శ్రద్ధ

ఫలప్రదమైన వైబ్రెంట్ గుజరాత్ నమూనా వ్యాప్తినీ, ప్రభావాన్నీ పెంచే ఉద్దేశంతో
గుజరాత్‌ నలుమూలలా నాలుగు వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశాల నిర్వహణ ప్రణాళిక

ప్రాంతాల వారీ పారిశ్రామిక అభివృద్ధి, వేర్వేరు రంగాల్లోకి పెట్టుబడులను ఆకర్షించడం,
ప్రపంచ దేశాలతో అనుబంధాన్ని పెంచుకోవడం ఈ ప్రాంతీయ సమావేశాల లక్ష్యం

प्रविष्टि तिथि: 09 JAN 2026 12:07PM by PIB Hyderabad

ప్ర‌ధానమంత్రి 2026 జనవరి 11న రాజ్‌కోట్‌ను సందర్శిస్తారు. కచ్ఛ్, సౌరాష్ట్ర ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశంలో  ఆయన పాల్గొంటారు. ఈ సమావేశంలో భాగంగా నిర్వహించే ట్రేడ్ షో ను మధ్యాహ్నం సుమారు 1:30 గంటలకు ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఆ తరువాత,  మధ్యాహ్నం దాదాపు 2 గంటలకు రాజ్‌కోట్‌ లోని మార్వాడీ విశ్వవిద్యాలయంలో కచ్ఛ్, సౌరాష్ట్ర ప్రాంతాలకు ఉద్దేశించిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి  ఆయన ప్రసంగిస్తారు. 13 గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ గుజరాత్ పారిశ్రామికాభివృద్ధి సంస్థ (జీఐడీసీ) ఎస్టేట్లను అభివృద్ధి చేస్తున్నట్లు  ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రకటించడంతో పాటు, రాజ్‌కోట్‌లోనే జీఐడీసీ వైద్య పరికరాల పార్కును కూడా ప్రారంభిస్తారు.    
కచ్ఛ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లోని 12 జిల్లాల అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశాన్ని 2026 జనవరి 11, 12 తేదీల్లో నిర్వహిస్తున్నారు. పశ్చిమ గుజరాత్‌లో పెట్టుబడికీ, పారిశ్రామిక అభివృద్ధికీ సరికొత్త వేగాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా ఈ ప్రాంతాల కోసమే  ఈ సమావేశాన్ని  ఏర్పాటు చేశారు. సిరమిక్స్, ఇంజినీరింగ్, ఓడరేవులు, ఆధునిక రవాణా వ్యవస్థ, మత్స్యపోషణ, పెట్రోకెమికల్స్, వ్యవసాయ, ఆహార శుద్ధి, ఖనిజాలు, హరిత ఇంధన అనుబంధ విస్తారిత వ్యవస్థ, నైపుణ్యాభివృద్ధి, అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈలు, పర్యటకం, సంస్కృతి, తదితర రంగాలపై ఈ సమావేశంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటారు. జపాన్, దక్షిణ కొరియా, రువాండా, ఉక్రెయిన్  ఈ సమావేశంలో భాగస్వామ్య దేశాలుగా వ్యవహరిస్తాయి.  

విజయవంతమైన వైబ్రెంట్ గుజరాత్ నమూనాను, దీని ప్రభావాన్నీ మరింత విస్తరించడానికి రాష్ట్రమంతటా నాలుగు వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తర గుజరాత్ ప్రాంతానికి సంబంధించిన మొదటి ప్రాంతీయ సమావేశాన్ని 2025 అక్టోబరు 9, 10 తేదీల్లో మెహసానాలో నిర్వహించారు. ఇక కచ్ఛ్, సౌరాష్ట్ర ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దక్షిణ గుజరాత్‌ కోసం ఉద్దేశించిన ప్రాంతీయ సమావేశాన్ని  సూరత్‌ లో   (2026 ఏప్రిల్ 9, 10 తేదీల్లో), మధ్య గుజరాత్ కోసం ఉద్దేశించిన ప్రాంతీయ సమావేశాన్ని  వడోదర లో (2026 జూన్ 10, 11 తేదీల్లో)  నిర్వహిస్తారు.

భారత్‌ను 2047 కల్లా అభివృద్ధి చెందిన భారత్‌గా రూపొందించాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ సాఫల్యాన్నీ, వారసత్వాన్నీ ఈ ప్రాంతీయ సమావేశాలు ముందుకు నడిపిస్తాయి. ఆయా ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించి విభిన్న రంగాల్లోకి పెట్టుబడులను ఆకట్టుకోవడంతో పాటు ప్రపంచ దేశాలతో అనుబంధాన్ని పెంపొందించాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నాయి.
వైబ్రెంట్ గుజరాత్ వేదికను ప్రాంతాలకు చేరువగా తీసుకుపోయి, వికేంద్రీకృత అభివృద్ధికి తోడ్పడాలని, వ్యాపార నిర్వహణను సులభతరం చేయాలని, నవకల్పన ప్రధానమైన అభివృద్ధిని సాధించాలని, సుస్థిర ఉపాధి అవకాశాల్ని కల్పించాలనే లక్ష్యాలకు ప్రధానమంత్రి ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఇవి ప్రతిబింబిస్తున్నాయి.
ప్రాంతీయ విజయాలను చాటిచెప్పేందుకూ, కొత్త కార్యక్రమాలను ప్రకటించేందుకూ ఓ వేదికగా  ఈ ప్రాంతీయ సమావేశాలు ఉపయోగపడతాయి,. ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలకు సాధికారితను కల్పించడం, నవ కల్పనను ప్రోత్సహించడం, రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో వ్యూహాత్మక పెట్టుబడికి మార్గాన్ని సుగమం చేసి గుజరాత్ అభివృద్ధిని సాకారం చేసేందుకు కూడా ఈ సమావేశాలు తోడ్పడతాయి. ఈ ప్రాంతీయ సమావేశాల్లో సాధించిన విజయాలను 2027 జనవరిలో నిర్వహించనున్న వైబ్రెంట్ గుజరాత్ ప్రపంచ శిఖరాగ్ర సదస్సులో వివరిస్తారు. 

 

***


(रिलीज़ आईडी: 2212921) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , Assamese , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam