సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రసార-వినోద రంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించేలా ఐఐటీ-ఢిల్లీ పరిధిలోని ఎఫ్‌ఐటీటీతో సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘వేవ్‌ఎక్స్‌’ అవగాహన ఒప్పందం


మీడియా సాంకేతికత వ్యవస్థాపనను వేగవంతం చేసే ఒప్పందం

प्रविष्टि तिथि: 06 JAN 2026 6:26PM by PIB Hyderabad

దేశంలో మీడియా, వినోదం, ప్రసార-సమాచార సాంకేతికతలలో ఆవిష్కరణ, సంపోషణ (ఇంక్యుబేషన్), వ్యవస్థాపనల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ దిశగా ఐఐటీ-ఢిల్లీ పరిధిలోని ‘ఫౌండేషన్ ఫర్ ఇన్నొవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌’ (ఎఫ్‌ఐటీటీ)తో కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని అంకుర సంస్థల సంవర్ధక సంస్థ (స్టార్టప్ యాక్సిలరేటర్) ‘వేవ్‌ఎక్స్‌’ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ మేరకు న్యూఢిల్లీలోని శాస్త్రి భవన్‌లో మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు సమక్షంలో ‘వేవ్‌ఎక్స్‌’, ‘ఎఫ్‌ఐటీటీ’ బృందాలు ఒప్పందంపై సంతకం చేశాయి.

దేశవ్యాప్తంగా ఇంక్యుబేషన్ కేంద్రాల ఏర్పాటు-బలోపేతం ద్వారా ఆవిష్కరణ-వ్యవస్థాపను ప్రోత్సహించే లక్ష్యంతో జాతీయ స్థాయిలో చేపట్టిన ‘వేవ్‌ఎక్స్‌’ కార్యక్రమం అమలు-విస్తరణకు ‘ఎఫ్‌ఐటీటీ’ తోడ్పడుతుంది. ముఖ్యంగా ఇంక్యుబేటర్ల ఏర్పాటులో ‘ఎఫ్‌ఐటీటీ'’వ్యూహాత్మక-కార్యాచరణ మార్గదర్శక మద్దతిస్తుంది. తద్వారా ఇతర ఐఐటీలు, ఆవిష్కరణ కేంద్రాలతో సంబంధాల సౌలభ్యం కల్పిస్తుంది. ‘సాంకేతిక నైపుణ్యం, పరిశోధన సౌకర్యాలు, మెంటర్‌షిప్, ఐపీ’ల పరంగానూ చేయూతనిస్తుంది. దీంతోపాటు అంకుర సంస్థలు, ఇంక్యుబేషన్ నిర్వాహక సామర్థ్య వికాస కార్యక్రమాల వెసులుబాటు కల్పిస్తుంది.

సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘వేవ్‌ఎక్స్‌’ ద్వారా ఆర్థిక సహాయంతోపాటు విధాన మార్గనిర్దేశం, జాతీయ ప్రాచుర్యం లభిస్తాయి. తద్వారా అంకుర సంస్థలకు నిధుల లభ్యత, మార్గదర్శకత్వం, మౌలిక సదుపాయాల సౌలభ్యం, పారిశ్రామిక భాగస్వామ్యాలు, పెట్టుబడిదారులు, ప్రపంచ మార్కెట్లతో సంధానానికి తోడ్పడుతుంది. దీని వల్ల భవిష్యత్‌ సంసిద్ధ మీడియా, వినోద సాంకేతికావరణ వ్యవస్థ వృద్ధికి దోహదం చేస్తుంది.

ఈ సందర్భంగా శ్రీ జాజు మాట్లాడుతూ- “మీడియా-వినోద రంగాల్లో సాంకేతికత ఆవిష్కరణకు జాతీయ స్ఫూర్తిప్రదాతగా ‘వేవ్‌ఎక్స్‌’ రూపొందింది. మీడియా పరిశ్రమలో ప్రధాన సాంకేతికల ఆవిర్భావానికి కృషి చేసే అంకుర సంస్థల స్థాపనను వేగవంతం చేస్తుంది. అంతేగాక ఇప్పటికే గల సాంకేతిక వేదికలపై కొత్త అనువర్తనాలను రూపొందించే ఆవిష్కరణ సంస్థల స్థాపనకు తోడ్పడుతుంది. విస్తృత వ్యవస్థల స్థాపనకు చేయూతనివ్వడం, మీడియా-వినోద అంకుర సంస్థల కోసం అంతర్జాతీయ స్థాయి ఇంక్యుబేషన్ సౌకర్యాల కల్పన దీని లక్ష్యం” అని తెలిపారు.

అనంతరం ఎఫ్‌ఐటీటీ తరపున అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ అగర్వాల్ ప్రసంగిస్తూ- “వర్ధమాన, సృజనాత్మక సాంకేతిక రంగాల్లో సాంకేతికత ఆధారిత వ్యవస్థాపకనను ప్రోత్సహించడంలో ‘వేవ్‌ఎక్స్‌’తో భాగస్వామ్యం ‘ఎఫ్‌ఐటీటీ'’నిబద్ధతకు నిదర్శనం. విధాన మద్దతు, విద్యా నైపుణ్యం పరిశ్రమతో సంధానం ద్వారా మీడియా, సాంకేతికత, ఆవిష్కరణల కేంద్రాల్లో పనిచేసే అంకుర సంస్థలకు మద్దతచ్చే బలమైన జాతీయ ఇంక్యుబేషన్ వేదిక సృష్టి మా లక్ష్యం.” అని చెప్పారు.

విద్య, పరిశోధన, ఆవిష్కరణలలో ఐఐటీ-ఢిల్లీ సామర్థ్యాన్ని వినియోగించుకుంటూ ‘వేవ్‌ఎక్స్’ చట్రం కింద అంకుర సంస్థల వృద్ధి, సాంకేతిక వాణిజ్యీకరణలను వేగిరపరచడంతోపాటు దేశీయ మీడియా-వినోద ఆవిష్కరణావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఈ భాగస్వామ్యాన్ని కీలక మలుపుగా పరిగణించవచ్చు.

ఎఫ్‌ఐటీటీ

ఆవిష్కరణ, వ్యవస్థాపన, సాంకేతిక వాణిజ్యీకరణల సౌలభ్యం లక్ష్యంగా ఐఐటీ-ఢిల్లీ పరిధిలో ‘ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్’ (ఎఫ్‌ఐటీటీ) ఏర్పాటైంది. ఐఐటీ-ఢిల్లీ పరిధిలోనూ, వెలుపల కూడా ఇంక్యుబేషన్, పరిశ్రమల భాగస్వామ్యం, పరిశోధనలకు సహకారం, మేధో సంపత్తి హక్కు నిర్వహణ, అంకురావరణ వ్యవస్థ అభివృద్ధిలో ‘ఎఫ్‌ఐటీటీ'’కీలక పాత్ర పోషిస్తుంది.

వేవ్‌ఎక్స్‌

కేంద్ర ప్రభుత్వ సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన జాతీయ మీడియా-వినోద రంగాల్లో సాంకేతిక ఆవిష్కరణ-సంపోషణ కార్యక్రమంగా ‘నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా అమలవుతున్న కార్యక్రమమే ‘వేవ్‌ఎక్స్‌’. తదనుగుణంగా నిర్మాణాత్మక ఇంక్యుబేషన్ మద్దతు, పరిశ్రమలతో సంధానం, మెంటర్‌షి సహా జాతీయ-అంతర్జాతీయ ప్రాచుర్యం కల్పనకు దోహదం చేస్తుంది. తద్వారా ప్రసార-సమాచార, మీడియా సహా ఆధునిక సాంకేతికతల రంగంలోని అంకుర సంస్థలతోపాటు వ్యవస్థాపకులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.


(रिलीज़ आईडी: 2212282) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam