ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భగవాన్ బుద్ధుడికి సంబంధించిన పవిత్ర పిప్రహ్వా అవశేషాల భారీ అంతర్జాతీయ ప్రదర్శనను న్యూఢిల్లీలో ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


భగవాన్ బుద్ధుడి అవశేషాలు భారత్‌కు కేవలం పురాతన వస్తువులు మాత్రమే కాదు.. మన గౌరవప్రదమైన వారసత్వంలో భాగం, నాగరికతలో అంతర్భాగం: పీఎం

భగవాన్ బుద్ధుడు ప్రసాదించిన జ్ఞానం, చూపిన మార్గం యావత్ మానవాళి సొంతం: పీఎం

అందరివాడు, అందరినీ ఏకం చేయగలవాడు భగవాన్ బుద్ధుడు: పీఎం

భారతదేశం కేవలం భగవాన్ బుద్ధుడి పవిత్ర అవశేషాల నిలయమే కాదు.. కాలాతీత సంప్రదాయానికి సజీవ సాక్ష్యం: పీఎం

ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ వారసత్వ ప్రాంతాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న భారత్: పీఎం

పాలీ భాషలో భగవాన్ బుద్ధుడి బోధనలను, పాలీ భాషను ప్రజలకు మరింత చేరువ చేయటమే మా లక్ష్యం.. ఈ ప్రయత్నాల్లో భాగంగా పాలీ భాషకు శాస్త్రీయ భాష హోదా: పీఎం

प्रविष्टि तिथि: 03 JAN 2026 1:48PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని రాయ్ పిథోరా కల్చరల్ కాంప్లెక్స్‌లో ఇవాళ "ద లైట్ అండ్ ద లోటస్: రిలిక్స్ ఆఫ్ ద అవేకెన్డ్ వన్" పేరిట భగవాన్ బుద్ధునికి సంబంధించిన పవిత్రమైన పిప్రహ్వా అవశేషాల భారీ అంతర్జాతీయ ప్రదర్శనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. 125 ఏళ్ల తర్వాత భారత వారసత్వం తిరిగి వచ్చిందని, దేశ సంపద పునరాగమనం చేసిందన్నారు. నేటి నుంచి భారత ప్రజలు గౌతమ బుద్ధుడి పవిత్ర అవశేషాలను దర్శించుకుని, ఆయన ఆశీస్సులు పొందవచ్చని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ శుభ సందర్భంగా అతిథులకు స్వాగతం పలికిన శ్రీ నరేంద్ర మోదీ, శుభాకాంక్షలు తెలియజేశారు. బౌద్ధ సన్యాసులు, ధర్మ ఆచార‌్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రణామాలు తెలియజేశారు. వారి ఉనికి కార్యక్రమానికి కొత్త శక్తినిచ్చిందని తెలిపారు. 2026 ప్రారంభంలోనే ఈ పవిత్ర వేడుక జరగటం స్ఫూర్తిదాయకమని ప్రధానమంత్రి అన్నారు. భగవాన్ బుద్ధుని ఆశీస్సులతో 2026వ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా శాంతి, సంపద, సామరస్యంతో నవశకానికి నాంది పలకాలని ఆకాంక్షించారు.

ఈ ప్రదర్శన ఏర్పాటు చేసిన ప్రదేశం ఎంతో ప్రత్యేకమైనదని ప్రధానమంత్రి అన్నారు. భారతదేశ గొప్ప చరిత్రకు ఖిల్లా రాయ్ పిథోరా ప్రాంతం నిదర్శనమని, దాదాపు వెయ్యేళ్ల క్రితం పటిష్టమైన, సురక్షితమైన గోడలతో ఇక్కడి పాలకులు నగరాన్ని నిర్మించారని గుర్తు చేశారు. అదే చారిత్రక నగర ప్రాంగణానికి ఇవాళ ఆధ్యాత్మిక, పవిత్రమైన అధ్యాయాన్ని జోడించినట్లు అయిందని ఆయన అన్నారు. తాను ఇక్కడికి వచ్చే ముందుగానే ఈ చారిత్రక ప్రదర్శనను సమగ్రంగా వీక్షించినట్లు శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాలు మన మధ్య ఉండటం ఆశీర్వచనమని వ్యాఖ్యానించారు. ఈ అవశేషాలు భారత్ నుంచి వెళ్లటం, తిరిగి దేశానికి చేరుకోవటం మనకు ముఖ్యమైన పాఠాలను నేర్పతాయన్నారు. బానిసత్వం కేవలం రాజకీయ, ఆర్థికపరమైన అంశం మాత్రమే కాదని, అది మన వారసత్వాన్ని నాశనం చేస్తుందని అన్నారు. భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాల విషయంలోనూ ఇదే జరిగిందని, బానిస పాలనలో దేశం దాటిపోయిన అవశేషాలు.. దాదాపు 125 ఏళ్లపాటు దేశానికి దూరంగా ఉన్నాయని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. వీటిని తీసుకెళ్లిన వారికి, వారి వారసులకు ఈ అవశేషాలు కేవలం ప్రాణం లేని పురాతన వస్తువులు మాత్రమేనని.. అందుకే వాటిని అంతర్జాతీయ మార్కెట్లో వేలం వేయటానికి ప్రయత్నించారని చెప్పారు. భారత్‌కు మాత్రం ఈ అవశేషాలు ఆరాధ్య దైవమని, నాగరికతలో అంతర్భాగమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి బహిరంగ వేలానికి భారత్ అనుమతించదని వెల్లడించారు. ఈ విషయంలో సహకరించిన గోద్రెజ్ గ్రూపు సంస్థకు శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. వారి సహకారంతోనే భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాలను కర్మభూమికి, ఆయన తపోభూమికి, మహాబోధి భూమికి, మహాపరినిర్వాణ భూమికి తిరిగి తీసుకురాగలిగినట్లు తెలిపారు.
"భగవాన్ బుద్ధుడు ప్రసాదించిన జ్ఞానం, చూపిన మార్గం యావత్ మానవాళి సొంతం" అని, కొన్ని నెలలుగా ఈ భావన అనుభవపూర్వకంగా నిరూపితమవుతోందని ప్రధానమంత్రి తెలిపారు. ఇటీవల కాలంలో భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాలు వెళ్లిన చోటల్లా భక్తిశ్రద్ధలు వెల్లువెత్తాయని గుర్తుచేశారు. థాయ్‌లాండ్‌లోని పలు ప్రాంతాల్లో ఈ పవిత్ర అవశేషాలను ఉంచినపుడు, కేవలం నెల రోజుల్లోనే దాదాపు 40 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. వియత్నాంలో ప్రదర్శన సమాయాన్ని పొడిగించాల్సి వచ్చిందని వెల్లడించారు. అక్కడ తొమ్మిది నగరాల్లో సుమారు 1.75 కోట్ల మంది ప్రజలు ఆ పవిత్ర అవశేషాలకు నివాళులర్పించారని తెలిపారు. మంగోలియాలో వేలాది మంది ప్రజలు గండన్ మొనాస్టరీ బయట గంటల తరబడి వేచి ఉన్నారని, బుద్ధుడు పుట్టిన గడ్డ భారత్ నుంచి వచ్చిన ప్రతినిధులను తాకేందుకు కూడా ఎంతో మంది ఆరాటపడ్డారని మోదీ తెలిపారు. రష్యాలోని కల్మికియాలో కేవలం ఒక వారంలో 1.5 లక్షల మందికి పైగా భక్తులు పవిత్ర అవశేషాలను దర్శించుకున్నారని, ఈ సంఖ్య అక్కడి స్థానిక జనాభాలో సగానికి పైగా ఉంటుందని చెప్పారు. వివిధ దేశాల్లో జరిగిన కార్యక్రమాల్లో సామాన్య పౌరుడి నుంచి ప్రభుత్వాధినేతల వరకు అందరూ భక్తిభావంతో ఏకమయ్యారని, భగవాన్ బుద్ధుడు అందరివాడని, అందరినీ ఏకం చేస్తాడని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
భగవాన్ బుద్ధుడి ప్రభావం తన జీవితంపై ఎంతో ఉందని, అందుకు ఎంతో అదృష్టవంతుడిని అని ప్రధానమంత్రి అన్నారు. ఆయన జన్మస్థలమైన వడోదరా ఒకప్పుడు బౌద్ధ విద్యా కేంద్రంగా విరాజిల్లిందని, బుద్ధుడు మొదటగా బోధనలు చేసిన సారనాథ్ కర్మభూమి అని గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వ బాధ్యతల్లో లేని సమయంలోనూ యాత్రికుడిలా అనేక బౌద్ధ క్షేత్రాలను సందర్శించినట్లు చెప్పారు. ప్రధానమంత్రిగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో బౌద్ధ క్షేత్రాలను దర్శించుకునే భాగ్యం కలిగిందని తెలిపారు. నేపాల్‌లోని లుంబినీ వద్ద మాయాదేవి ఆలయంలో ప్రణమిల్లటం అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందన్నారు. జపాన్‌లోని తో-జి, కింకాకు-జి ఆలయాలను సందర్శించినప్పుడు బుద్ధుని సందేశం కాలానికి అతీతమైనదని అనిపించిందని శ్రీ నరేంద్ర మోదీ గుర్తుచేసుకున్నారు. చైనాలోని క్సియాన్‌లోని జైంట్ వైల్డ్ గూస్ పగోడాను సందర్శించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అక్కడి నుంచే బౌద్ధ గ్రంథాలు ఆసియా వ్యాప్తంగా విస్తరించాయని, ఆ విషయంలో భారత్ పాత్రను ఇప్పటికీ గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. మంగోలియాలోని గాండన్ మఠాన్ని సందర్శించినప్పుడు, బుద్ధుని వారసత్వంతో అక్కడి ప్రజలకు విడదీయరాని భావోద్వేగ బంధాన్ని చూసినట్లు చెప్పారు. శ్రీలంకలోని అనురాధపురలో జయశ్రీ మహాబోధిని దర్శించుకోవటం, చక్రవర్తి అశోకుడు, భిక్కు మహిందుడు, సంఘమిత్రలు నాటిన సంప్రదాయంతో మమేకమయ్యే అనుభూతిని ఇచ్చిందని తెలిపారు. థాయ్‌లాండ్‌లోని వాట్ ఫో, సింగపూర్‌లోని బుద్ధ టూత్ రెలిక్ టెంపుల్‌ సందర్శనలు భగవాన్ బుద్ధుని బోధనల ప్రభావంపై అవగాహనను మరింత పటిష్టం చేశాయని ప్రధానమంత్రి చెప్పారు.
తాను ప్రపంచంలోని ఎక్కడికి వెళ్లినా, భగవాన్ బుద్ధుడి వారసత్వానికి చెందిన ఒక ప్రతీకను తప్పకుండా భారత్‌కు తీసుకురావడానికి ప్రయత్నించానని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. చైనా, జపాన్, కొరియా, మంగోలియా దేశాల నుంచి బోధి వృక్షం మొక్కలను తీసుకువచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అణుబాంబు దాడితో పూర్తిగా విధ్వంసమైన హిరోషిమా నగరంలోని వృక్ష ఉద్యానవనంలో ఒక బోధివృక్షం నిలిచినప్పుడు, అది మానవాళికి ఇచ్చే లోతైన సందేశాన్ని మనం ఊహించవచ్చని తెలిపారు.
బుద్ధుడికి సంబంధించిన ఈ సాంప్రదాయ వారసత్వం ద్వారా భారత్‌ ప్రపంచంతో కేవలం రాజకీయాలు, దౌత్యం, ఆర్థిక వ్యవస్థల ద్వారానే కాకుండా మరింత లోతైన బంధాలతో అనుసంధానమై ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారత్ మనస్సులతో, భావోద్వేగాలతో, విశ్వాసం, ఆధ్యాత్మికతతో ప్రపంచంతో అనుసంధానమై ఉందని అన్నారు. భారత్ కేవలం బుద్ధుడి పవిత్ర అవశేషాల సంరక్షక దేశం మాత్రమే కాదు.. ఆయన సంప్రదాయాన్ని సజివంగా కొనసాగిస్తున్న దేశం కూడా అని ఆయన అన్నారు. పిప్రహ్వా, వైశాలి, దేవ్ని మోరి, నాగార్జునకొండల్లో లభించిన బుద్ధుడి అవశేషాలు ఆయన సందేశానికి సజీవ సాక్ష్యాలని ప్రధాని పేర్కొన్నారు. శాస్త్రం, ఆధ్యాత్మికత ద్వారా భారత్ ఈ అవశేషాలను ప్రతి రూపంలో సంరక్షించి, కాపాడుతూ వచ్చిందని స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ వారసత్వ ప్రదేశాల అభివృద్ధికి భారత్‌ నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. నేపాల్‌లో సంభవించిన వినాశకరమైన భూకంపం వల్ల పురాతన బౌద్ధ స్థూపం దెబ్బతిన్నప్పుడు, దాని పునర్నిర్మాణానికి భారత్‌ పూర్తి మద్దతు అందించిందని గుర్తు చేశారు. మయన్మార్‌లోని బాగన్ ప్రాంతంలో భూకంపం తర్వాత అక్కడి 11 కంటే ఎక్కువ పగోడాల పరిరక్షణ బాధ్యతను భారత్ చేపట్టిందని ఆయన చెప్పారు. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయని అన్నారు. భారత్‌లో కూడా బౌద్ధ సంప్రదాయానికి సంబంధించిన ప్రదేశాలు, అవశేషాల అన్వేషణ, సంరక్షణ నిరంతరం కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. తన జన్మస్థలమైన వాద్‌నగర్ ఒకప్పుడు బౌద్ధ సంప్రదాయానికి ప్రధాన కేంద్రంగా ఉండేదని ప్రధాని తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్కడ వేలాది బౌద్ధ అవశేషాలు బయటపడ్డాయని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం వాటిని సంరక్షించడమే కాకుండా, నేటి తరానికి ఆ చరిత్రను పరిచయం చేస్తోందని పేర్కొన్నారు. అక్కడ దాదాపు 2500 ఏళ్ల చరిత్రను కళ్లకు కట్టేలా ఒక అద్భుతమైన అనుభవ మ్యూజియాన్ని నిర్మించినట్లు తెలిపారు. కొన్ని నెలల క్రితమే జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లాలో బౌద్ధ యుగానికి చెందిన ఒక ప్రధాన ప్రదేశం కనుగొన్నట్లు చెప్పారు. దాని పరిరక్షణ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.
గడిచిన పది పదకొండు ఏళ్లలో భారత్‌ బౌద్ధ క్షేత్రాలను ఆధునికతతో అనుసంధానించడానికి చేసిన కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరించారు. బోధ్‌ గయలో ఒక కన్వెన్షన్ సెంటర్, ధ్యానం, అనుభవ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సారనాథ్‌లోని ధమేక్ స్థూపం వద్ద లైట్ అండ్ సౌండ్ షో, బుద్ధ థీమ్ పార్కును అభివృద్ధి చేశారని, శ్రావస్తి, కపిలవస్తు, కుశీనగర్ ప్రాంతాల్లో పర్యాటకుల కోసం ఆధునిక వసతులను కల్పించినట్లు చెప్పారు. తెలంగాణలోని నల్గొండలో డిజిటల్ అనుభవ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు... సాంచి,నాగార్జున సాగర్, అమరావతిలలో యాత్రికుల కోసం కొత్త సౌకర్యాలను అభివృద్ధి చేసినట్లు ఆయన తెలిపారు.  దేశంలోని అన్ని బౌద్ధ యాత్రా స్థలాల మధ్య మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించేందుకు బౌద్ధ సర్క్యూట్‌ను  రూపొందిస్తున్నట్లు ప్రధానమంత్రి వెల్లడించారు. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారని ఆయన అన్నారు.
‘‘బౌద్ధ వారసత్వాన్ని సహజ సిద్ధమైన రీతిలో భవిష్యత్తు తరాలకు అందించడమే దేశ లక్ష్యం’’ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రపంచ బౌద్ధ సమావేశం, వైశాఖ, ఆషాఢ పౌర్ణమి వంటి అంతర్జాతీయ కార్యక్రమాలను కూడా ఈ ఆలోచనతోనే నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. భగవాన్ బుద్ధుని బోధనలు, అభిధమ్మ అసలు రూపం పాళీ భాషలో ఉన్నాయని గుర్తు చేస్తూ, సాధారణ ప్రజలకు ఈ భాషను చేరువ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. అందుకే పాళీ భాషకు ప్రాచీన భాష హోదా కల్పించామని, ఇది బుద్ధుని ధర్మాన్ని దాని అసలు సారాంశంతో అర్థం చేసుకోవడానికి ఎంతో దోహదపడుతుందని మోదీ తెలిపారు. బౌద్ధ సంప్రదాయానికి అనుసంధానించిన పరిశోధనలను కూడా బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
బుద్ద భగవానుడి పవిత్ర అవశేషాలు భారతదేశ వారసత్వ సంపదని, దాదాపు శతాబ్ద కాలం నిరీక్షణ తర్వాత ఇవి తిరిగి స్వదేశానికి చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ వచ్చి ఈ పవిత్ర అవశేషాలను దర్శించుకోవాలని, బుద్ధుని ఉన్నతమైన ఆలోచనలతో మమేకం కావాలని కోరారు. జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రదేశాన్ని సందర్శించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పాఠశాల విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, యువతీ యువకులు తప్పకుండా ఈ ప్రదర్శనను చూడాలని కోరారు. మన గత వైభవాన్ని భవిష్యత్తు కలలతో అనుసంధానించడానికి ఈ ప్రదర్శన ఒక అద్భుతమైన మాధ్యమమని ప్రధాని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ ప్రదర్శనలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ, ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, శ్రీ కిరణ్ రిజిజు, శ్రీ రామ్ దాస్ అథవాలే, శ్రీ రావు ఇంద్రజిత్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ సక్సేనాతో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
నేపథ్యం
శతాబ్ద కాలం తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన పిప్రహ్వా అవశేషాలను, ప్రస్తుతం న్యూఢిల్లీలోని జాతీయ మ్యూజియం, కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియాల్లో భద్రపరచిన పిప్రహ్వా పురావస్తు సంపదతో కలిపి తొలిసారి ఒకేచోట ప్రజల కోసం ప్రదర్శిస్తున్నారు.
1898లో కనుగొన్న పిప్రహ్వా అవశేషాలు ప్రారంభ బౌద్దమత పురావస్తు అధ్యయనంలో అత్యంత కీలక స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఇవి భగవాన్ బుద్దునికి నేరుగా సంబంధం ఉన్న అత్యంత ప్రాచీన, చారిత్రకంగా ముఖ్యమైన అవశేషాలలో ఒకటిగా గుర్తింపు పొందాయి. పురావస్తు ఆధారాలు పిప్రహ్వా ప్రదేశాన్ని ప్రాచీన కపిలవాస్తు నగరంతో అనుసంధానిస్తున్నాయి. కపిలవస్తు అనేది సన్యాసం స్వీకరించే ముందు భగవాన్ బుద్ధ తన ప్రారంభ జీవితం గడిపిన ప్రాంతంగా గుర్తింపు పొందింది.
ఈ ప్రదర్శన భగవాన్ బుద్దుని బోధనలతో భారత్‌కు ఉన్న లోతైన, నాగరిక సంబంధాన్ని తెలియజేస్తుంది. దేశ గొప్ప ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించాలనే ప్రధానమంత్రి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ప్రభుత్వం నిరంతర కృషి, సంస్థాగత సహకారం, వినూత్న ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా ఈ అవశేషాలను ఇటీవల తిరిగి స్వదేశానికి తీసుకురావడం సాధ్యమైంది.
ఈ ప్రదర్శనను వివిధ ఇతివృత్తాల ఆధారంగా ఏర్పాటు చేశారు. సాంచి స్తూపం నుంచి స్పూర్తి పొందిన పునర్నిర్మిత వ్యాఖ్యానాత్మక నమూనా దీనికి ప్రధాన ఆకర్షణ. ఇందులో జాతీయ సేకరణల నుంచి తీసుకొచ్చన అసలైన అవశేషాలు, అరుదైన వస్తువులను ఒకచోట ప్రదర్శించనున్నారు. ఇతర విభాగాల్లో పిప్రహ్వా పురావస్తు విశేషాల పునశ్చరణ, బుద్ధుని జీవితంలోని ముఖ్య ఘట్టాలు, దృశ్యాదృశ్యాలు: బౌద్ధ బోధనల సౌందర్య భాష, సరిహద్దులు దాటి విస్తరించిన బౌద్ధ కళలు, ఆదర్శాలు, సాంస్కృతిక కళాఖండాల స్వదేశ పునరాగమనం: నిరంతర ప్రయత్నం వంటివి ఉన్నాయి.
సాధారణ ప్రజలకు ఈ అవశేషాల ప్రాముఖ్యత సులభంగా అర్థం కావడానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇందులో లీనమయ్యే చిత్రాలు, డిజిటల్ పునర్నిర్మాణాలు, మల్టీమీడియా ప్రదర్శనలు ఉన్నాయి. ఈ అంశాలు భగవాన్ బుద్దుని జీవితం, పిప్రహ్వా అవశేషాల ఆవిష్కరణ, అవి ప్రాంతాల మధ్య ప్రయాణించిన విధానం, వాటికి సంబంధించిన కళా సంప్రదాయాలపై సులభంగా అర్థమయ్యేలా అవగాహనను అందిస్తాయి.


(रिलीज़ आईडी: 2211494) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam