సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
భారత ప్రభుత్వ క్యాలెండరు- 2026ను ఆవిష్కరించిన కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్
· క్యాలెండరు ఇతివృత్తం: ‘భారత్@2026: సేవ, సుపరిపాలన, సమృద్ధి’
· దేశ పరివర్తనను చాటేలా భారత్@2026 క్యాలెండరు: సమాచార, ప్రసార కార్యదర్శి సంజయ్ జాజు
प्रविष्टि तिथि:
31 DEC 2025 2:25PM by PIB Hyderabad
కేంద్ర సమాచార - ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ఈ రోజు భారత ప్రభుత్వ 2026 క్యాలెండరును ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్ కేవలం తేదీలు, నెలల వార్షిక ప్రచురణ మాత్రమే కాదని.. భారత్ పరివర్తనకు ప్రతిబింబమని, ప్రభుత్వ అగ్ర ప్రాధాన్యాలను చాటే మాధ్యమమని మంత్రి వ్యాఖ్యానించారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాకారం చేసుకోవాలన్న మనందరి సమష్టి సంకల్పాన్ని ఇది పునరుద్ఘాటిస్తోందన్నారు.
క్యాలెండరు ఇతివృత్తం ‘భారత్@2026: సేవ, సుపరిపాలన, సమృద్ధి’. అస్తిత్వం విషయంలో సురక్షితమైన, సంస్థాగతంగా బలమైన, దీర్ఘకాలిక దృక్పథంలో స్పష్టతతో ఉన్న భారత్‌ను ఇది ఆవిష్కరిస్తుంది. ప్రజా కేంద్రీకృత పాలనను, మెరుగైన సేవలను, సులభతర ప్రక్రియల ద్వారా ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచే సంస్కరణలపై ప్రజల విశ్వాసాన్ని ఈ క్యాలెండర్ ప్రతిబింబిస్తుందని మంత్రి చెప్పారు.
2025లో చేపట్టిన కీలక సంస్కరణలను ప్రస్తావిస్తూ.. నిర్మాణాత్మక చర్యలు దేశ ఆర్థిక శక్తిని బలోపేతం చేశాయని, అదే సమయంలో అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా దోహదపడ్డాయని డాక్టర్ మురుగన్ అన్నారు. కొత్త పన్ను విధానం కింద పన్ను ఉపశమనం, జీఎస్టీ 2.0 హేతుబద్ధీకరణ, నాలుగు కార్మిక చట్టాల అమలు, ఉపాధి కల్పన కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలు ఉత్పాదకతకు, జీవన సౌలభ్యానికి, అన్ని వర్గాల శ్రేయస్సుకు ఊతమిచ్చాయని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు మాట్లాడుతూ.. భారత ప్రభుత్వ క్యాలెండర్ వాస్తవంగా ప్రభుత్వ ప్రాధాన్యాలను తెలియజేస్తోందని, దేశ ప్రాధాన్యాలు, విలువలను ప్రతిబింబించే శక్తిమంతమైన ప్రచార సాధనంగా మారిందని అన్నారు. ‘భారత్@2026: సేవ, సుపరిపాలన, సమృద్ధి’ అన్న ఇతివృత్తంతో 2026 క్యాలెండరు.. సంస్కరణ, సమ్మిళితత్వం, ఆకాంక్షల ద్వారా ఆత్మవిశ్వాసంతో కూడిన భారత సమగ్రతను ప్రతిబింబిస్తోందన్నారు.
ఈ 2026 క్యాలెండర్‌లోని పన్నెండు నెలల పుటలు.. దేశ పురోగతికి మూలస్తంభాల వంటి పన్నెండు కీలక అంశాలను అద్భుతంగా ఆవిష్కరిస్తున్నాయి. ఇవి మారుతున్న భారత్ స్ఫూర్తికి అద్దం పడుతున్నాయి. ఆత్మనిర్భరతా సే ఆత్మవిశ్వాస్ (జనవరి)- అన్ని రంగాల్లో దేశ స్వావలంబనను చాటుతోంది. సమృద్ధ కిసాన్, సమృద్ధ భారత్ (ఫిబ్రవరి)- రైతుల ప్రాధాన్యాన్ని చాటేలా ఉంది. నవ భారతం కోసం నారీ శక్తి (మార్చి)- ఆధునిక భారత నిర్మాతలుగా మహిళల ప్రాధాన్యాన్ని చాటిచెబుతోంది. సరళీకరణ్ సే సశక్తికరణ్ (ఏప్రిల్)- సరళీకరణ, పాలన సంస్కరణలను ప్రతిబింబిస్తోంది. ఇవే కాకుండా.. భారత సాయుధ దళాల ధైర్యమూ, త్యాగాలకు గౌరవంగా వీరతా సే విజయ్ తక్: ఆపరేషన్ సిందూర్ (మే), స్వస్థ భారత్.. సమృద్ధ భారత్ (జూన్), అత్యంత బలహీన వర్గాల సంక్షేమం, గౌరవాలకు ప్రాధాన్యమిస్తూ వంచితోన్ కా సమ్మాన్ (జూలై), యువశక్తితోపాటు భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణను ప్రతింబించేలా ఉన్న - యువశక్తి.. రాష్ట్ర శక్తి (ఆగస్టు), గతి.. శక్తి.. ప్రగతి (సెప్టెంబరు), భారతదేశ నాగరికత విలువలకు, సమ్మిళిత వికాసానికి నిలువుటద్దంగా ఉండేలా పరంపరా సే ప్రగతి తక్ (అక్టోబరు), సబ్ కా సాత్.. సబ్ కా సమ్మాన్ (నవంబరు); బాధ్యతాయుత, విశ్వసనీయ అంతర్జతీయ భాగస్వామిగా భారత్ పాత్రను చాటే విశ్వబంధు భారత్ (డిసెంబరు) అంశాలు కూడా ఇతివృత్తాల్లో ఉన్నాయి.
13 భారతీయ భాషల్లో క్యాలెండరును ముద్రిస్తున్నట్టు సీబీసీ డైరెక్టర్ జనరల్ శ్రీమతి కాంచన్ ప్రసాద్ వెల్లడించారు. ప్రతి భాషా, సాంస్కృతిక నేపథ్యానికి చెందిన ప్రజలతో అనుసంధానమవ్వాలన్న ప్రభుత్వ దృక్పథాన్ని.. ఈ క్యాలెండరులోని సమ్మిళిత ధోరణి ప్రతిబింబిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార, ప్రసార శాఖ అదనపు కార్యదర్శి శ్రీ ప్రభాత్, పీఐబీ డైరెక్టర్ జనరల్ శ్రీమతి అనుపమా భట్నాగర్, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ప్రముఖులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సమృద్ధ, సమ్మిళిత, ఆత్మవిశ్వాసంతో కూడిన భారత్ దిశగా 2026 సంవత్సరం మరో నిశ్చయాత్మక అడుగుగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
భారత ప్రభుత్వ క్యాలెండరు- 2026ను డౌన్లోడ్ చేసుకోవడం కోసం కింది క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి:
***
(रिलीज़ आईडी: 2210760)
आगंतुक पटल : 27
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali-TR
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam