ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వారణాసిలోని రుద్రాకాశి కన్వెన్షన్ సెంటర్‌లో ‘వన్ వరల్డ్ టీబీ సమ్మిట్’లో ప్రధాని ప్రసంగం

నాడు పోస్టు చేయడమైనది: 24 MAR 2023 2:33PM by PIB Hyderabad

హరహర మహాదేవ!

ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ గారు, ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ మాన్సుఖ్ మాండవీయ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బ్రిజేశ్ పాఠక్ గారు, వివిధ దేశాల ఆరోగ్య మంత్రులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ డైరెక్టర్ గారు, ఇతర ప్రముఖులు, స్టాప్ టీబీ పార్ట్‌నర్‌షిప్‌ సహా వివిధ సంస్థల ప్రతినిధులు, సోదరీ సోదరులారా!

‘వన్ వరల్డ్ టీబీ సమ్మిట్’ కాశీలో జరుగుతుండటం నాకు చాలా సంతోషాన్నిచ్చే విషయం. అదృష్టవశాత్తూ నేను కాశీ పార్లమెంటు సభ్యుడిని కూడా. కాశీ నగరం వేలాది సంవత్సరాలుగా మానవాళి కృషికి, ప్రయత్నాలకు సాక్ష్యంగా నిలిచిన ఒక శాశ్వత వాహిని. సవాలు ఎంత పెద్దదైనప్పటికీ.. సమష్టి కృషితో పరిష్కారం లభిస్తుందని కాశీ రుజువు చేస్తుంది. టీబీ వంటి వ్యాధి నిర్మూలన దిశగా అంతర్జాతీయ సంకల్పానికి కాశీ ఓ కొత్త ప్రేరణ ఇస్తుందని నేను నిశ్చితంగా విశ్వసిస్తున్నాను.

‘వన్ వరల్డ్ టీబీ సమ్మిట్’ కోసం భారత్‌తోపాటు దేశదేశాల నుంచి కాశీకి విచ్చేసిన అతిథులందరికీ హృదయపూర్వక స్వాగతం, అభినందనలు.

మిత్రులారా,

ఒక దేశంగా భారత సైద్ధాంతిక స్ఫూర్తి ‘వసుధైవ కుటుంబకం’ భావనలో ప్రతిబింబిస్తుంది. అంటే యావత్ ప్రపంచమే ఒక కుటుంబం! ఈ ప్రాచీన విశ్వాసం నేటి ఆధునిక ప్రపంచానికి సమగ్ర దృక్పథాన్ని, సమగ్ర పరిష్కారాలను అందిస్తోంది. అందుకే, జీ 20 శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న భారత్.. ‘ఒకే ప్రపంచం, ఒకే కుటుంబం, ఒకే భవిత’ అనే ఇతివృత్తాన్ని ప్రతిపాదించింది! ఒకే కుటుంబంగా యావత్ప్రపంచ ఉమ్మడి భవితకు సంకల్పమిది. ఇటీవల ‘వన్ ఎర్త్, వన్ హెల్త్’ దార్శనికతను ముందుకు తీసుకెళ్లేలా కూడా భారత్ చొరవ తీసుకుంది. ఇప్పుడు ‘వన్ వరల్డ్ టీబీ సమ్మిట్’ ద్వారా ప్రపంచ శ్రేయస్సు కోసం మరో బాధ్యతను భారత్ నెరవేరుస్తోంది.

మిత్రులారా,

2014 నుంచి క్షయ నిర్మూలన కోసం భారత్ ప్రారంభించిన కొత్త ఆలోచన, విధానం నిజంగా అపూర్వమైనది. భారత్ కృషిని నేడు ప్రపంచం తెలుసుకోవాలి. ఎందుకంటే క్షయపై అంతర్జాతీయ పోరాటంలో ఇదొక కొత్త నమూనా. గత తొమ్మిది సంవత్సరాలుగా క్షయపై సాగుతున్న ఈ పోరాటంలో అనేక రంగాల్లో భారత్ కలిసి పనిచేసింది. ఉదాహరణకు ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన జన భాగీదారి కార్యక్రమం. పోషకాహారం కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమమిది. చికిత్సలో సరికొత్త వ్యూహాల కోసం చికిత్సాపరమైన ఆవిష్కరణలు. అలాగే సాంకేతికతను గరిష్టంగా వినియోగించుకునేలా సాంకేతిక ఏకీకరణ. ఆరోగ్యం, వ్యాధి నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం కోసం ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా, యోగా మొదలైన కార్యక్రమాలు.

మిత్రులారా,

క్షయపై పోరులో భారత అసాధారణమైన కృషి ప్రజల భాగస్వామ్యం. ఈ విశిష్ట కార్యక్రమాన్ని భారత్ ఎలా ప్రారంభించిందో తెలుసుకోవడం విదేశాల నుంచి వచ్చిన మా అతిథులకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

మిత్రులారా,

‘నిక్షయ మిత్ర’లుగా మారి ‘టీబీ ముక్త భారత్’ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని దేశ ప్రజలకు మేం పిలుపునిచ్చాం. భారత్‌లో ‘క్షయ’ అన్నది టీబీకి వాడుకలో ఉన్న పదం. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి దేశ ప్రజలు దాదాపు 10 లక్షల టీబీ రోగులను దత్తత తీసుకున్నారు. భారత్‌లో 10 -12 ఏళ్ల పిల్లలు కూడా ‘నిక్షయ మిత్ర’లుగా మారి టీబీపై పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చాలా మంది పిల్లలు తమ ‘పిగ్గీ బ్యాంక్‌’లను పగలగొట్టి టీబీ రోగులను దత్తత తీసుకున్నారు. ఈ ‘నిక్షయ మిత్ర’లు టీబీ రోగులకు అందించిన ఆర్థిక సాయం 1,000 కోట్ల రూపాయలు దాటింది. టీబీపై ఇంత భారీ సామాజిక కార్యక్రమాన్ని నడపడం నిజంగా స్ఫూర్తిదాయకం. పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు కూడా ఇందులో భాగస్వాములవడం సంతోషాన్నిస్తోంది. మీకు కూడా నా కృతజ్ఞతలు. ఈ రోజు వారణాసికి చెందిన అయిదుగురిని దత్తత తీసుకుంటున్నట్లు మీరిప్పుడే ప్రకటించారు.

మిత్రులారా,

క్షయ వ్యాధిగ్రస్తులు ఒక పెద్ద సవాలును ఎదుర్కోవడంలో ఈ ‘నిక్షయ మిత్ర’ కార్యక్రమం వారికెంతగానో సహాయపడింది. క్షయ వ్యాధిగ్రస్తుల పోషకాహారాన్ని పొందడమే ఆ సవాలు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని.. 2018లో క్షయ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యక్ష నగదు బదిలీని మేం ప్రకటించాం. అప్పటి నుంచి దాదాపు 2,000 కోట్ల రూపాయలను నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే బదిలీ చేశాం. ఈ పథకం ద్వారా సుమారు 75 లక్షల మంది లబ్ధి పొందారు. ఇప్పుడు ‘నిక్షయ మిత్ర’ పథకం క్షయ వ్యాధిగ్రస్తులకు కొత్త శక్తినిస్తోంది.

మిత్రులారా,

పాత పద్ధతినే కొనసాగిస్తూ మెరుగైన ఫలితాలను సాధించడం చాలా కష్టం. ఏ ఒక్క క్షయ రోగి కూడా చికిత్సకు దూరం కాకుండా ఉండేలా ఒక కొత్త వ్యూహాన్ని మేం రూపొందించాం. క్షయ రోగుల పరీక్ష, చికిత్సను ఆయుష్మాన్ భారత్ పథకంతో అనుసంధానించాం. ఉచిత క్షయ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా ప్రయోగశాలల సంఖ్యను పెంచాం. క్షయ రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తాం. ‘క్షయ రహిత పంచాయతీ’ అనేది ఈ దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు. దీనికింద ప్రతి గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు తమ ఊర్లో ఒక్క టీబీ రోగి కూడా ఉండకూడదని తీర్మానించి, అందరూ ఆరోగ్యంగా ఉండేలా చూస్తారు. సాధారణంగా ఉండే ఆరు నెలల కోర్సుకు బదులు.. క్షయ వ్యాధి నివారణ కోసం మూడు నెలల చికిత్సను కూడా మేం ప్రారంభిస్తున్నాం. గతంలో రోగులు ఆరు నెలల పాటు ప్రతిరోజూ మందులు తీసుకోవలసి వచ్చేది. కొత్త పద్ధతిలో రోగులు వారానికి ఒక్కసారి మందులు తీసుకుంటే సరిపోతుంది. ఇది రోగులకు ఉపశమనాన్నివ్వడమే కాకుండా, వాడాల్సిన ఔషధాల సంఖ్యను కూడా తగ్గిస్తుంది.

మిత్రులారా,

ఈ క్షయ రహిత ప్రచారం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్ట స్థాయిలో ఉపయోగించడంపైనా భారత్ దృష్టి సారిస్తోంది. ప్రతి క్షయ రోగి కోసం మేం నిక్షయ పోర్టలును రూపొందించాం. ఇది వారి సంరక్షణను పర్యవేక్షిస్తుంది. డేటా సైన్స్‌ను కూడా అత్యంత ఆధునిక పద్ధతుల్లో మేం ఉపయోగిస్తున్నాం. జాతీయ స్థాయి కన్నా దిగువ స్థాయిలోనూ వ్యాధుల పర్యవేక్షణ కోసం.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసిఎంఆర్ సంయుక్తంగా ఓ కొత్త పద్ధతిని రూపొందించాయి. అంతర్జాతీయ స్థాయిలో డబ్ల్యూహెచ్‌వో కాకుండా.. ఇలాంటి నమూనాను అభివృద్ధి చేసిన ఏకైక దేశం భారత్ మాత్రమే.

మిత్రులారా,

ఇలాంటి చర్యల వల్ల నేడు భారత్‌లో క్షయ వ్యాధిగ్రస్తుల సంఖ్య వేగంగా తగ్గుతోంది. కర్ణాటక, జమ్మూ కాశ్మీర్‌లు టీబీ రహిత పురస్కారాలను పొందాయి. జిల్లా స్థాయిల్లోనూ ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి పురస్కారాలు అందించాం. ఈ విజయాన్ని సాధించిన వారందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. ఈ ఫలితాల స్ఫూర్తితో భారత్ ఓ దృఢ సంకల్పాన్ని తీసుకుంది. 2030 నాటికి క్షయవ్యాధి నిర్మూలన అంతర్జాతీయ లక్ష్యం. కాగా 2025 నాటికి క్షయవ్యాధిని నిర్మూలించాలన్న లక్ష్యంతో భారత్ ప్రస్తుతం పనిచేస్తోంది. అంతర్జాతీయ లక్ష్యం కన్నా అయిదేళ్ల ముందే.. అదీ ఇంత పెద్ద దేశంలో ఇలాంటి భారీ తీర్మానం! దేశ ప్రజల నమ్మకమే ఈ తీర్మానానికి ఆధారం. దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల సామర్థ్యం కోవిడ్ సమయంలో మెరుగుపడింది. గుర్తింపు, పరీక్ష, నిర్ధారణ, చికిత్స, సాంకేతికత వ్యూహాన్ని మేం అవలంబిస్తున్నాం. టీబీపై పోరులో ఈ వ్యూహం మనకెంతగానో సహాయపడుతుంది. భారత అనుసరిస్తున్న ఈ దేశీయ విధానానికి అంతర్జాతీయంగానూ అపారమైన సామర్థ్యముంది. మనం దీన్ని సమష్టిగా ఉపయోగించుకోవాలి. క్షయ వ్యాధి చికిత్సకు అవసరమైన మందుల్లో 80 శాతం ప్రస్తుతం భారత్‌లోనే తయారవుతున్నాయి. భారతీయ ఫార్మా కంపెనీల ఈ సామర్థ్యం.. క్షయపై ప్రపంచవ్యాప్త పోరాటానికి గొప్ప బలాన్నిస్తుంది. అంతర్జాతీయ శ్రేయస్సుకు కట్టుబడి ఉన్న భారత్.. ఈ కార్యక్రమాలు, ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతికత వల్ల మరిన్ని దేశాలు ప్రయోజనం పొందాలని కాంక్షిస్తోంది. ఈ సదస్సులో పాల్గొన్న దేశాలన్నీ ఇందుకోసం ఓ యంత్రాంగాన్ని రూపొందించవచ్చు. ‘‘అవును, మనం టీబీని అంతం చేయగలం’’ అన్న మా సంకల్పం తప్పక నెరవేరుతుందన్న విశ్వాసం నాకుంది. ‘‘టీబీ ఓడుతుంది, భారత్ గెలుస్తుంది’’, మీరన్నట్టు.. ‘‘టీబీ ఓడుతుంది, ప్రపంచం గెలుస్తుంది’’.

మిత్రులారా,

మీతో మాట్లాడుతుండగా ఓ పాత సంఘటన నాకు గుర్తొచ్చింది. దాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. జాతిపిత మహాత్మా గాంధీ కుష్ఠు వ్యాధి నిర్మూలనకు ఎంతో కృషి చేశారని మీ అందరికీ తెలుసు. సబర్మతి ఆశ్రమంలో ఉంటున్న సమయంలో అహ్మదాబాద్‌లో ఓ కుష్ఠు వ్యాధి ఆస్పత్రిని ప్రారంభించడానికి ఆయనను ఆహ్వానించారు. అప్పుడాయన దాన్ని ప్రారంభించడానికి నిరాకరించారు. గాంధీజీకి ఒక ప్రత్యేకత ఉంది. తాను ప్రారంభోత్సవానికి రానని, కానీ ఆ ఆస్పత్రిని మూసివేయడానికి పిలిస్తే సంతోషిస్తానని ఆయన అన్నారు. మరో మాటలో చెప్పాలంటే.. కుష్ఠు వ్యాధిని నిర్మూలించడం ద్వారా ఆ ఆస్పత్రినే మూసివేయాలని ఆయన కోరుకున్నారు. గాంధీజీ మరణానంతరం కూడా దశాబ్దాల పాటు ఆ ఆస్పత్రి నడిచింది. 2001లో గుజరాత్‌ ప్రజలు నాకు సేవ చేసే అవకాశాన్నిచ్చినప్పుడు.. ఆస్పత్రిని మూసేయాలన్న గాంధీజీ కోరిక నెరవేర్చేందుకు ప్రయత్నించాను. కుష్ఠువ్యాధికి వ్యతిరేకంగా సాగే ప్రచారానికి కొత్త ఊపునిచ్చాం. ఫలితంగా గుజరాత్‌లో వ్యాధి రేటు 23 శాతం నుంచి 1 శాతం కన్నా తక్కువకు చేరింది. నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2007లో ఆ ఆస్పత్రిని మూసివేశాం. గాంధీజీ కల నెరవేరింది. అనేక సామాజిక సంస్థలు, ప్రజల భాగస్వామ్యం ఈ విషయంలో కీలక పాత్ర పోషించాయి. అందుకే, క్షయవ్యాధిని భారత్ జయిస్తుందన్న విషయంలో నాకు పూర్తి నమ్మకముంది.

నేటి నవభారత్ లక్ష్యసాధనకు ప్రసిద్ధి. బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా మారాలని సంకల్పించిన భారత్.. దాన్ని సాధించింది. భారత్ సౌర విద్యుదుత్పత్తి సామర్థ్య లక్ష్యాన్ని కూడా ముందుగానే సాధించింది. పెట్రోలులో నిర్దిష్ట శాతంలో ఇథనాల్ కలిపే లక్ష్యాన్ని కూడా భారత్ నిర్ణీత గడువు కన్నా ముందుగానే సాధించింది. ప్రజా భాగస్వామ్యానికి గల ఈ శక్తి యావత్ప్రపంచపు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. క్షయపై పోరాటంలో భారత్ సాధిస్తున్న విజయం కూడా ప్రజాభాగస్వామ్యం వల్లే సాధ్యపడింది. అవును.. నేను మరో అంశాన్ని కూడా మీ అందరికీ విన్నవిస్తున్నాను. క్షయ వ్యాధిగ్రస్తుల్లో చాలావరకు అవగాహన లోపం ఉంటుంది. సమాజంలో బలంగా పాతుకుపోయిన పాత ఆలోచనా విధానం వల్ల వారు చాలావరకూ ఈ వ్యాధిని దాచి ఉంచేందుకు ప్రయత్నిస్తారు. అందుకే, రోగుల్లో అవగాహన పెంచడంపైనా మనం అంతే శ్రద్ధ పెట్టాలి.

మిత్రులారా,

కొన్నేళ్లుగా కాశీలో ఆరోగ్య సేవల వేగవంతమైన విస్తరణ క్షయ సహా వివిధ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఉపయోగపడింది. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం వారణాసి శాఖకు నేడిక్కడ శంకుస్థాపన చేశాం. ప్రజారోగ్య నిఘా విభాగం కూడా పనిచేయడం మొదలైంది. ఈ రోజు బీహెచ్‌యూలోని శిశు సంరక్షణ సంస్థ, బ్లడ్ బ్యాంక్ ఆధునికీకరణ, ఆధునిక ట్రామా సెంటర్ నిర్మాణం, సూపర్ స్పెషాలిటీ విభాగం లాంటి సదుపాయాలు బనారస్ వాసులకు సేవలందిస్తున్నాయి. ఇప్పటివరకు పండిత మదన్ మోహన మాలవ్య క్యాన్సర్ చికిత్స కేంద్రంలో 70,000 మందికి పైగా చికిత్స పొందారు. ఇక్కడి ప్రజలు చికిత్స కోసం లక్నోకో, ఢిల్లీకో లేదా ముంబయికో వెళ్లాల్సిన అవసరం రాలేదు. అదేవిధంగా కబీర్ చౌరా ఆస్పత్రి, జిల్లా ఆసుపత్రి, డయాలసిస్, సీటీ స్కాన్ వంటి అనేక సదుపాయాలను బనారస్‌లో విస్తరించాం. కాశీ ప్రాంతంలోని గ్రామాల్లో కూడా ఆధునిక ఆరోగ్య సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నాం. ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు, ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలోని ఆరోగ్య, సంక్షేమ కేంద్రాల్లోనూ అనేక సదుపాయాలను కల్పించాం. లక్షన్నర మందికి పైగా బనారస్‌ వాసులు ఆయుష్మాన్ భారత్ యోజన కింద ఈ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా చికిత్స పొందారు. దాదాపు 70 జనఔషధి కేంద్రాల నుంచి రోగులకు తక్కువ ధరలకే ఔషధాలు కూడా లభిస్తున్నాయి. ఈ చర్యలన్నింటి వల్ల పూర్వాంచల్, పొరుగున ఉన్న బీహార్ ప్రజలు కూడా ప్రయోజనం పొందుతున్నారు.

మిత్రులారా,

తన అనుభవం, నైపుణ్యం, సంకల్ప బలంతో క్షయ నిర్మూలనలో భారత్ నిమగ్నమై ఉంది. ప్రతి దేశంతో భుజం భుజం కలిపి పనిచేయడానికి కూడా భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంది. సమష్టి కృషితోనే క్షయపై మన పోరాటం విజయవంతమవుతుంది. మన ప్రయత్నాలు మన సురక్షిత భవితకు బలమైన పునాది వేస్తాయని, భవిష్యత్ తరాలకు ఒక మెరుగైన ప్రపంచాన్ని మనం అందించగలమని నేను బలంగా విశ్వసిస్తున్నాను. భారత్‌ను ఇంతగా ఆదరించి, నన్ను ఆహ్వానించిన మీ అందరికీ చాలా కృతజ్ఞుడిని. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ శుభప్రదమైన ప్రారంభంతో, ప్రపంచ టీబీ దినం సందర్భంగా వ్యాధి నిర్మూలన దిశగా మన కృషి సఫలీకృతం కావాలని శుభాకాంక్షలు తెలుపుతూ.. దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు!

గమనిక: ప్రధానమంత్రి ప్రసంగానికి ఇది ఇంచుమించు అనువాదం. మూల ప్రసంగం హిందీలో ఉంది.

 

***


(రిలీజ్ ఐడి: 2210042) సందర్శకుల సూచీ సంఖ్య : : 15