ప్రధాన మంత్రి కార్యాలయం
ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన ప్రధాన కార్యదర్శుల అయిదో జాతీయ సదస్సు
· పరిపాలన, సేవల్లో ఉన్నతికీ, తయారీలో నాణ్యతకూ ‘వికసిత భారత్’ పర్యాయపదం
· యువశక్తితో నడిచే ‘సంస్కరణల ఎక్స్‌ప్రెస్’లో మొదలైన భారత ప్రయాణం
· వికసిత భారత్ దిశగా భారత ప్రస్థానాన్ని వేగవంతం చేయగల జనాభా ఆధిక్యత
· ప్రపంచస్థాయి నాణ్యతకు, పోటీతత్వానికి ప్రతీకగా ‘మేడిన్ ఇండియా’...
· స్వావలంబన బలోపేతం, ‘ఉద్గార రహిత, అత్యుత్తమ ఉత్పత్తులు (జీరో ఎఫెక్ట్, జీరో డిఫెక్ట్)’ అత్యావశ్యకం
· దిగుమతులపై ఆధీనతను తగ్గించడం, ఆర్థిక పునరుత్తేజం దిశగా దేశీయంగా తయారు చేయాల్సిన 100 ఉత్పత్తులను గుర్తించాలి
· త్వరలో ప్రారంభించబోయే జాతీయ తయారీ మిషన్‌కు ప్రతి రాష్ట్రం అత్యంత ప్రాధాన్యమివ్వాలి
· రాష్ట్రాలు తయారీని ప్రోత్సహించాలి, ‘సులభతర వాణిజ్యా’నికి ఊతమివ్వాలి, భారత్‌ను సేవల్లో అంతర్జాతీయ దిగ్గజంగా నిలపాలి
· అత్యాధునిక వ్యవసాయం దిశగా భారత్.. దేశం ప్రపంచ ఆహార భాండాగారంగా నిలవాలి
· ప్రపంచ స్థాయి పర్యాటక ప్రదేశాలను తీర్చిదిద్దేలా రాష్ట్రాలు ప్రణాళికలు సిద్ధం చేయాలి: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
28 DEC 2025 9:32PM by PIB Hyderabad
ఢిల్లీలో ఈ రోజు ఉదయం నిర్వహించిన ప్రధాన కార్యదర్శుల అయిదో జాతీయ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. 2025 డిసెంబరు 26 నుంచి 28 వరకు.. మొత్తం మూడు రోజులపాటు ఈ సదస్సు ఢిల్లీలోని పూసాలో జరిగింది.
వికసిత భారత్ లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశగా సహకార సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేయడంలోనూ, కేంద్రం - రాష్ట్రాల మధ్య భాగస్వామ్యాన్ని విస్తరించడంలోనూ ఈ సదస్సు ఓ నిశ్చయాత్మక ముందడుగు అని ప్రధానమంత్రి అన్నారు.
విజ్ఞానం, నైపుణ్యాలు, ఆరోగ్యం, సమర్థత కలిగిన మానవ వనరులే ఆర్థిక వికాసానికి, సామాజిక పురోగతికి ప్రధాన చోదక శక్తి అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఏకోన్ముఖ ప్రభుత్వ విధానం ద్వారా సమన్వయంతో వాటిని అభివృద్ధి చేయాలన్నారు.
‘వికసిత భారత్ కోసం మానవ వనరులు’ అన్న ప్రధాన ఇతివృత్తంపై ఈ సదస్సులో చర్చించారు. జనాభాపరంగా భారత్‌కు గల ఆధిక్యాన్ని గుర్తుచేస్తూ... జనాభాలో దాదాపు 70 శాతం మంది పని చేసే వయస్సులోనే ఉన్నారనీ, చరిత్రాత్మకమైన ఈ విశిష్ట అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రధానమంత్రి చెప్పారు. ఈ మానవ శక్తినీ, ఆర్థిక పురోగతినీ మేళవిస్తే.. వికసిత భారత్ దిశగా దేశ ప్రస్థానం మరింత వేగవంతమవుతుందని స్పష్టం చేశారు.
యువశక్తితో నడుస్తున్న ‘సంస్కరణల ఎక్స్‌ప్రెస్’లో భారత్ తన ప్రయాణాన్ని ప్రారంభించిందనీ, వారిని సాధికారులను చేసేందుకు ప్రభుత్వానికి అత్యంత ప్రధానమైన అంశమనీ ప్రధానమంత్రి అన్నారు. దేశంలో నవతరం సంస్కరణలను ప్రవేశపెడుతున్న వేళ.. ప్రధాన అంతర్జాతీయ ఆర్థికశక్తిగా ఎదిగే దిశగా స్థిరంగా పయనిస్తున్న సమయంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నామని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
నాణ్యతకూ, ఉన్నతికీ- వికసిత భారత్ పర్యాయపదమన్న ఆయన.. భాగస్వాములంతా సగటు ఫలితాలకు మించి ముందకుసాగాలని కోరారు. పరిపాలన, సేవలు, తయారీలో నాణ్యత అత్యావశ్యకమని పునరుద్ఘాటించారు. ‘మేడిన్ ఇండియా’ లేబుల్ నాణ్యతకూ, అంతర్జాతీయ పోటీతత్వానికీ ప్రతీకగా నిలవాలని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
లోపరహితమైన, పర్యావరణంపై అతి తక్కువ ప్రభావం చూపే ఉత్పత్తులతో భారత్ స్వావలంబన సాగించాలనీ.. తద్వారా ‘మేడిన్ ఇండియా’ లేబుల్‌ను నాణ్యతకు పర్యాపదంగా నిలిపి, ‘జీరో ఎఫెక్ట్, జీరో డిఫెక్ట్’ పట్ల మన నిబద్ధతను బలోపేతం చేయాలనీ ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా- దిగుమతులపై ఆధీనతను తగ్గించడంతోపాటు ఆర్థికంగా మరింత ఉత్తేజాన్నిచ్చేలా దేశీయంగా తయారీ కోసం కేంద్రం, రాష్ట్రాలు కలిసి 100 ఉత్పత్తులను సంయుక్తంగా గుర్తించాలని ఆయన కోరారు.
నైపుణ్యాభివృద్ధి వ్యూహాలను మరింత మెరుగ్గా రూపొందించడం కోసం రాష్ట్ర స్థాయిలోనూ, అంతర్జాతీయ స్థాయిలోనూ నైపుణ్యాల అవసరాన్ని గుర్తించాల్సిన ఆవశ్యకత ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఉన్నత విద్యారంగంలో కూడా.. అత్యుత్తమ ప్రతిభావంతులను తీర్చిదిద్దేలా విద్యాసంస్థలు, పరిశ్రమలు కలిసి పనిచేయాల్సిన అవసరముందని సూచించారు.
యువత జీవనోపాధిలో పర్యాటకం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు. భారత్‌కు గొప్ప వారసత్వం, చరిత్ర ఉన్నాయనీ.. ప్రపంచంలోని అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానాల్లో ఒకటిగా నిలిచే సామర్థ్యం మనకుందని ఆయన స్పష్టం చేశారు. ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రాన్ని తీర్చిదిద్ది, పూర్తిస్థాయిలో పర్యాటక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని శ్రీ మోదీ కోరారు.
అంతర్జాతీయ క్రీడా క్యాలెండరుకు అనుగుణంగా భారత జాతీయ క్రీడా క్యాలెండరు ఉండేలా చూసుకోవడం ముఖ్యమైన అంశమని ప్రధానమంత్రి మోదీ అన్నారు. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు భారత్ కృషి చేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా మౌలిక సదుపాయాలను, క్రీడా వ్యవస్థను భారత్ సిద్ధం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ సమయంలోనే పిల్లలను గుర్తించి, ప్రోత్సహించి, పోటీపడేలా శిక్షణ ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే పదేళ్ల కాలాన్ని క్రీడలపై వెచ్చించాలని ఆయన రాష్ట్రాలను కోరారు. అప్పుడే ఇలాంటి క్రీడా కార్యక్రమాల్లో భారత్‌కు ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. స్థానిక, జిల్లా స్థాయిల్లో క్రీడా కార్యక్రమాలు, టోర్నమెంట్లను నిర్వహించడం, ప్రోత్సహించడంతోపాటు ఆటగాళ్ల డేటాను సక్రమంగా నిర్వహించడం ద్వారా ఉత్తేజకరమైన క్రీడా వాతావరణాన్ని సృష్టించవచ్చన్నారు.
త్వరలోనే జాతీయ తయారీ మిషన్ (ఎన్ఎంఎం)ను భారత్ ప్రారంభించనున్నట్టు ప్రధానమంత్రి శ్రీ మోదీ తెలిపారు. ప్రతి రాష్ట్రమూ దీనికి ప్రథమ ప్రాధాన్యమిచ్చి, ప్రపంచ కంపెనీలను ఆకర్షించేలా మౌలిక సదుపాయాలను సృష్టించాలన్నారు. వాణిజ్య సౌలభ్యాన్ని మెరుగుపరచడంలో భాగంగా.. ముఖ్యంగా భూమి కేటాయింపులు, మౌలిక వసతులు, సామాజిక మౌలిక సదుపాయాల కల్పన కూడా ఇందులో భాగమేనని ఆయన వివరించారు. తయారీని ప్రోత్సహించాలని, ‘సులభతర వాణిజ్యా’నికి ఊతమివ్వాలని, సేవారంగాన్ని బలోపేతం చేయాలని రాష్ట్రాలకు ఆయన పిలుపునిచ్చారు. సేవల రంగంలో దేశాన్ని అంతర్జాతీయ దిగ్గజంగా తీర్చిదిద్దడం కోసం.. ఆరోగ్య రక్షణ, విద్య, రవాణా, పర్యాటకం, వృత్తిపరమైన సేవలు, ఏఐ మొదలైన రంగాలకు అధిక ప్రాధాన్యమివ్వాలని ప్రధానమంత్రి మోదీ సూచించారు.
ప్రపంచ ఆహార భాండాగారంగా నిలవాలని భారత్ ఆకాంక్షిస్తున్నందున.. మనం ఎగుమతులపై ప్రత్యేకంగా దృష్టి సారించి.. అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం, పాడి, మత్స్య పరిశ్రమల వైపు మళ్లాల్సిన ఆవశ్యకత ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి ధన ధాన్య పథకం ద్వారా తక్కువ ఉత్పాదకత ఉన్న 100 జిల్లాలను గుర్తించినట్టు ఆయన తెలిపారు. అదేవిధంగా క్షేత్రస్థాయి ఫలితాలకు సంబంధించి.. అత్యంత వెనుకబడిన 100 జిల్లాలను రాష్ట్రాలు గుర్తించి, సూచికలు తక్కువగా ఉండేందుకు కారణమైన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
రాతప్రతుల డిజిటలీకరణ కోసం జ్ఞానభారతం మిషన్‌ను వినియోగించుకోవాలని రాష్ట్రాలను ప్రధానమంత్రి కోరారు. రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న రాతప్రతుల డిజిటలీకరణ కోసం రాష్ట్రాలు ఒక అభియాన్‌ను ప్రారంభించవచ్చన్నారు. ఈ రాతప్రతుల డిజిటలీకరణ పూర్తయితే.. కృత్రిమ మేధను ఉపయోగించి వాటిలోని విజ్ఞానాన్ని క్రోడీకరించవచ్చు.
భారత సమష్టి ఆలోచనా విధానానికీ, నిర్మాణాత్మక విధాన చర్చలకూ ఈ సదస్సు ప్రతిబింబమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం సంస్థాగతంగా ఏర్పాటు చేసిన ఈ ముఖ్య కార్యదర్శుల సదస్సు.. సమష్టి చర్చలకు ఒక సమర్థ వేదికగా నిలిచిందన్నారు.
పరిపాలనను, అమలును బలోపేతం చేయడం కోసం.. ప్రధాన కార్యదర్శుల, డీజీపీల సమావేశాల్లోని చర్చలు, నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్రాలు కలిసి పనిచేయాలని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
అధికారులలో జాతీయ దృక్పథాన్ని పెంపొందించడానికి, వికసిత భారత లక్ష్య సాధన దిశగా పరిపాలన ఫలితాలను మెరుగుపరచడానికి శాఖా స్థాయిల్లోనూ ఇలాంటి సదస్సులను నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు.
కెపాసిటీ బిల్డింగ్ కమిషన్‌తో కలిసి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సామర్థ్యాభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రధానమంత్రి కోరారు. పాలనలో కృత్రిమ మేధ వినియోగం, సైబర్ భద్రతపై అవగాహన తక్షణ అవసరాలన్నారు. ప్రతి పౌరుడి భద్రత కోసం రాష్ట్రాలు, కేంద్రం సైబర్ భద్రతకు ప్రాధాన్యమివ్వాలని కోరారు.
మన జీవితంలోని అన్ని దశల్లోనూ సురక్షితమైన, స్థిరమైన పరిష్కారాలను సాంకేతికత అందించగలదని ప్రధానమంత్రి అన్నారు. పరిపాలనలో నాణ్యతను తెచ్చేందుకు సాంకేతికతను ఉపయోగించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
చివరిగా ఈ సదస్సులో జరిగిన చర్చల ఆధారంగా ప్రతి రాష్ట్రమూ 1, 2, 5, 10 సంవత్సరాల వంటి కాలపరిమితులతో.. పదేళ్ల కాలానికి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకోవాలనీ, ఇందులో క్రమబద్ధమైన పర్యవేక్షణ కోసం సాంకేతికతను ఉపయోగించుకోవాలని ప్రధానమంత్రి సూచించారు.
బాల్య విద్య, పాఠశాల విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్య, క్రీడలు, పాఠ్యేతర కార్యకలాపాలపై ఈ మూడు రోజుల సదస్సులో చర్చించారు. బలమైన, సమ్మిళిత, భవిష్యత్ సన్నద్ధ శ్రామిక శక్తిని నిర్మించడంలో వారి పాత్రకు గుర్తింపు ఇది.
సదస్సు సందర్భంగా చర్చలు
ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావాలన్న ఉమ్మడి సంకల్పంతో కేంద్రం, రాష్ట్రాలు కలిసి.. ఈ సమావేశంలో చేపట్టిన చర్చలు ‘టీమిండియా’ స్ఫూర్తిని ప్రతిబింబించాయి. నిర్ణయాలను నిర్ణీత కాల వ్యవధిలో అమలు చేయడం ఎంత ముఖ్యమో ఈ చర్చలు పునరుద్ఘాటించాయి. తద్వారా ‘వికసిత భారత్’ కల.. సామాన్యుల జీవితాల్లో ప్రత్యక్ష మార్పుగా సాకారమవుతుంది. మానవ వనరుల అభివృద్ధికి సంబంధించిన ప్రాధాన్య రంగాల్లో ప్రస్తుత పరిస్థితి, కీలక సవాళ్లు, సాధ్యమయ్యే పరిష్కారాలపై సమగ్ర అంచనాను ఈ సమావేశాలు అందించాయి.
వారసత్వ సంపద, రాతప్రతుల పరిరక్షణ, డిజిటలీకరణ, అలాగే ప్రాథమిక ఆరోగ్య సేవల్లో ‘ఆయుష్’ విజ్ఞానాన్ని ఏకీకరిస్తూ అందరికీ ఆరోగ్యాన్ని అందించే అంశాలపైనా ఈ సమావేశంలో భోజన సమయాల్లో వివరణాత్మక చర్చలు జరిగాయి.
అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయిలో స్పష్టమైన ఫలితాలను సాధించాలంటే.. సమర్థంగా సేవలు, ప్రజలే కేంద్రంగా పరిపాలన, ఫలితాల ఆధారంగా అమలు అత్యంత కీలకమని ఈ చర్చలు పునరుద్ఘాటించాయి. సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం, గణాంక ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థల ద్వారా సేవలను మెరుగుపరచాల్సిన ఆవశ్యకతను ఈ చర్చలు స్పష్టం చేశాయి. ప్రక్రియల సరళీకరణ, సాంకేతికత వినియోగం, క్షేత్రస్థాయి వ్యాప్తిపై ప్రధానంగా దృష్టి సారించారు. వికసిత భారత్ దార్శనికతకు అనుగుణంగా.. సకాలంలో, పారదర్శకంగా, సమ్మిళిత పద్ధతిలో ప్రతి పౌరుడికీ అభివృద్ధి ఫలాలు చేరుతాయి.
అన్ని రంగాలకు వర్తించే కీలక అంశాలపై, కొత్తగా ఉద్భవిస్తున్న ప్రాధాన్య అంశాలపై వివరణాత్మక చర్చలకు ఈ సమావేశంలో నిర్వహించిన ప్రత్యేక సదస్సులు వేదికగా నిలిచాయి. విధాన మార్గాలు, రాష్ట్రాల్లో నియంత్రణల సడలింపునకు సంబంధించి ఉత్తమ విధానాలు, పాలనలో సాంకేతికత: అవకాశాలు, ప్రమాదాలు – నివారణ, అధునాతన సరఫరా వ్యవస్థ, మార్కెట్ అనుసంధానం కోసం అగ్రిస్టాక్, ఒక రాష్ట్రం - ఒక ప్రపంచస్థాయి పర్యాటక ప్రదేశం, ఆత్మనిర్భర భారత్ – స్వదేశీ, వామపక్ష తీవ్రవాద అనంతర భవిత కోసం ప్రణాళికలను ఈ సదస్సుల్లో సమీక్షించారు. సహకార సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేయడం, వివిధ రాష్ట్రాల్లో విజయవంతమైన పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయడం, చర్చించిన అంశాలను నిర్ణీత గడువులోగా ఆచరణలోకి తెచ్చి స్పష్టమైన ఫలితాలను సాధించడం వంటి అంశాల ప్రాధాన్యాన్ని ఈ చర్చలు చాటాయి.
ఈ సదస్సులో అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, సీనియర్ అధికారులు, రంగాలవారీ నిపుణులు, కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2209691)
आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada