ప్రధాన మంత్రి కార్యాలయం
ఇథియోపియా పార్లమెంటు సంయుక్త సమావేశంలో ప్రధాని ప్రసంగ పాఠం
प्रविष्टि तिथि:
17 DEC 2025 3:08PM by PIB Hyderabad
గౌరవ పార్లమెంటు ఉభయ సభల స్పీకర్లు,
గౌరవ సభ్యులు,
మహాశయులారా,
ప్రియమైన ఇథియోపియా సోదరీ సోదరులారా...
ఈ రోజు మీ అందరి ఎదుట ఉండడం గౌరవంగా భావిస్తున్నాను. సింహాల దేశమైన ఇథియోపియాకు రావడం అద్భుత అనుభూతినిస్తోంది. ఇది నా సొంతింటిలాగే ఉంది. ఎందుకంటే భారత్ లోని నా స్వరాష్ట్రమైన గుజరాత్ కూడా సింహాలకు నిలయం.
పురాతన విజ్ఞానమూ, ఆధునిక ఆకాంక్షలూ కలిగిన ఒక దేశపు హృదయం వంటి ఈ ప్రజాస్వామ్య దేవాలయంలో ఉండడం గౌరవంగా భావిస్తున్నాను. మీ పార్లమెంటు పట్ల, మీ ప్రజల పట్ల, మీ ప్రజాస్వామ్య ప్రస్థానం పట్ల ప్రగాఢ గౌరవంతో నేను మీ వద్దకు వచ్చాను. 140 కోట్ల భారతీయుల తరఫున స్నేహం, సద్భావన, సౌభ్రాతృత్వంతో కూడిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
తెనా ఇస్తీల్లీన్
సలాం
గౌరవ సభ్యులారా,
ఈ మహోన్నత భవనంలోనే మీ చట్టాలు రూపుదిద్దుకుంటాయి. ప్రజల సంకల్పం ఇక్కడే ప్రభుత్వ సంకల్పంగా మారుతుంది. ప్రభుత్వ సంకల్పం, ప్రజల సంకల్పం ఒకటే అయినప్పుడు.. అభివృద్ధి చక్రం ఆశతో, లక్ష్యంతో పరుగులు పెడుతుంది.
పొలాల్లో ఉన్న మీ రైతులతో, కొత్త భావాలను ఆవిష్కరిస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో, సమాజాన్నీ సంస్థలనూ ముందుండి నడుపుతూ గర్వకారణంగా నిలుస్తున్న మహిళలతో, భవితను తీర్చిదిద్దుతున్న ఇథియోపియా యువతతో... మీ ద్వారా నేను మాట్లాడుతున్నాను. ఇంతటి విశేష గౌరవాన్నందించిన మీకు ధన్యవాదాలు.
నా ప్రియ మిత్రుడు, ప్రధానమంత్రి డాక్టర్ అబియ్ అహ్మద్ చేతుల మీదుగా అత్యున్నత పురస్కారం ‘నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ను స్వీకరించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. భారతదేశ ప్రజల తరపున.. చేతులు జోడించి, వినమ్రపూర్వకంగా నేను ఈ పురస్కారాన్ని స్వీకరిస్తున్నాను.
आम सग्नालो
గౌరవ సభ్యులారా,
మానవ చరిత్రలోని అత్యంత ప్రాచీన నాగరికతలలో ఇథియోపియా ఒకటి. ఇక్కడి పర్వతాల్లో, లోయల్లో, ఇథియోపియా ప్రజల హృదయాల్లో చరిత్ర సజీవంగా ఉంది. మూలాలు బలంగా వేళ్లూనుకుని ఉండడమే ఈ రోజు ఇథియోపియా ఉన్నతంగా నిలబడడానికి కారణం. ఇథియోపియా గడ్డపై నిలబడడమంటే... గతాన్ని గౌరవించే చోట, వర్తమానం ఒక స్పష్టమైన లక్ష్యంతో నిండి ఉన్న చోట, నిండు హృదయంతో భవితను ఆహ్వానించే చోట నిలవడమే.
ఈ కొత్త పాతల కలయిక.. ప్రాచీన విజ్ఞానమూ, ఆధునిక ఆశయాల మధ్య ఈ సమతౌల్యం... ఇదే ఇథియోపియా నిజమైన బలం.
మేడెమర్ లేదా సమన్వయం అనే ఈ స్ఫూర్తి భారత్ లో చాలా సుపరిచితమైనది. లాలిబేలాలోని ఏకశిలా చర్చిల మాదిరిగానే.. భారత్ లో తమిళనాడులో ఉన్న ప్రాచీన శిలాలయాలు కూడా రాతిలో చెక్కిన ప్రార్థనాలయాలే. మాది కూడా భవిష్యత్తులోకి ఆత్మవిశ్వాసంతో అడుగుపెడుతున్న ప్రాచీన నాగరికతే.
సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే పిలుపుతో... అందరి వికాసం కోసం, అందరి విశ్వాసంతో, సమష్టి కృషితో ఐక్యంగా ముందుకు సాగుతున్నాం. మన మాతృభూమి పట్ల మనకున్న ఉద్వేగాలు కూడా.. మన ఉమ్మడి భావ సారూప్యాన్ని ప్రతిబింబిస్తాయి.
భారత జాతీయ గేయం వందేమాతరం, ఇథియోపియా జాతీయ గీతం రెండూ మాతృభూమిని తల్లిగా వర్ణిస్తాయి. మన వారసత్వం, సంస్కృతి, ప్రకృతి సౌందర్యం పట్ల గర్వించేలా, మాతృభూమిని రక్షించేలా అవి మనకు స్ఫూర్తినిస్తాయి.
గౌరవ సభ్యులారా,
మన జాతి తొలి అడుగుజాడల్లో కొన్ని ఇథియోపియాలో ఉన్నట్టు విజ్ఞానశాస్త్రం గుర్తించింది. లూసీ గురించి, దిన్కినేష్ గురించి ప్రపంచం మాట్లాడుతుంటే.. అది కేవలం ఓ శిలాజం గురించి మాత్రమే కాదు... ఓ ఆరంభం గురించి వారు చెబుతున్నారు. మనం అడిస్ అబాబాలో ఉన్నా, అయోధ్యలో ఉన్నా... మనందరి ఆరంభమూ అది.
భారత్ లో మేం వసుధైక కుటుంబమని చెబుతాం. అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబమని. రాజకీయాలకు, సరిహద్దులకు, భేదాలకు అతీతంగా.. మనమందరికీ ఒక ఉమ్మడి మూలం ఉందన్న విషయాన్ని ఇది మనకు గుర్తు చేస్తుంది. మన ఆరంభం ఉమ్మడిగా ఉందంటే.. మన గమ్యం కూడా ఉమ్మడిగానే ఉండాలి.
గౌరవ సభ్యులారా,
భారత్, ఇథియోపియాల వెచ్చని వాతావరణంలో మాత్రమే కాదు.. ఆత్మీయతా స్ఫూర్తిలోనూ ఇరుదేశాలకూ సారూప్యముంది. దాదాపు రెండు వేల ఏళ్ల కిందటే మన పూర్వీకులు విశాలమైన సముద్రాల మీదుగా సంబంధాలను విస్తరించుకున్నారు. సుగంధ ద్రవ్యాలు, పత్తి, కాఫీ, బంగారంతో హిందూ మహాసముద్రం మీదుగా వ్యాపారులు ప్రయాణించేవారు. అయితే వారు చేసింది కేవలం వస్తు పరమైన వాణిజ్యం మాత్రమే కాదు.. భావాలను, గాథలను, జీవన విధానాలను కూడా వారు ఇచ్చిపుచ్చుకున్నారు. అదూలిస్, ధోలేరా వంటి ఓడరేవులు కేవలం వాణిజ్య కేంద్రాలు మాత్రమే కాదు. అవి నాగరికతల మధ్య వారధులుగా ఉండేవి.
ఆధునిక కాలంలో మన సంబంధం కొత్త శకంలోకి ప్రవేశించింది. 1941లో ఇథియోపియా విముక్తి కోసం భారతీయ సైనికులు ఇథియోపియన్లతో కలిసి పోరాడారు. భారత్ కు స్వాతంత్య్రం వచ్చిన అనతికాలంలోనే మన అధికారిక దౌత్య సంబంధాలు ప్రారంభమయ్యాయి.
అయితే రాయబార కార్యాలయాలు ఏర్పడకముందే.. మన ప్రజలంతా కలసి సమష్టిగా ఓ కొత్త అధ్యాయాన్ని రాయడం ప్రారంభించారు. వేలాది మంది భారతీయ ఉపాధ్యాయులు ఇథియోపియాకు వచ్చారు. వారు ఆడిస్ అబాబాలో, దిరే దావాలో, బాహిర్ దార్ నుంచి మెకెలే వరకు పిల్లలకు బోధించారు. వారు ఇథియోపియన్ పాఠశాలలకు చేరుకున్నారు. ఇథియోపియన్ల హృదయాల్లోకి ప్రవేశించారు. నేటికీ చాలా మంది ఇథియోపియా తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దిన భారతీయ ఉపాధ్యాయుల గురించి ఆత్మీయంగా చెబుతారు.
భారతీయ ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చినట్టే.. ఇథియోపియా విద్యార్థులు కూడా జ్ఞానాన్నీ, స్నేహాన్నీ అన్వేషిస్తూ భారత్ కు వచ్చారు. వారు విద్యార్థులుగా భారతదేశానికి వెళ్లి, ఆధునిక ఇథియోపియా నిర్మాతలుగా స్వదేశానికి తిరిగొచ్చారు. గౌరవ స్పీకర్ తాగే సే చాఫో సహా.. వారిలో కొందరు ప్రస్తుతం ఈ పార్లమెంటులో ఉన్నారని నాకు చెప్పారు!
మన ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించడంలో కూడా వారు ప్రత్యేక పాత్ర పోషించారు. ఎందుకంటే వారు భారతదేశంలో ఇథియోపియన్ వంటకాలను పరిచయం చేశారు. భారత్లో రాగి, బజ్రా వంటి ‘శ్రీ అన్న’ చిరుధాన్యాలను తినేందుకు కూడా ఇష్టపడతాం. అందుకే ఇథియోపియన్ ‘టెఫ్’ రుచి మాకెంతో సుపరిచితంగా ఉంటుంది. మేం భారతీయ థాలీని తినడాన్ని ఇష్టపడినట్టే.. ఇథియోపియా బేయా-నైతూ కూడా సౌకర్యంగా అనిపిస్తాయి.
గౌరవ సభ్యులారా,
నేడు భారతీయ కంపెనీలు ఇథియోపియాలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారులలో ఒకటిగా ఉన్నాయి. అవి వస్త్రాలు, ఉత్పాదక రంగం, వ్యవసాయం, ఆరోగ్యం వంటి వివిధ రంగాల్లో అయిదు బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టాయి. వాటితో స్థానికంగా 75 వేలకు పైగా ఉద్యోగావకాశాలు లభించాయి.
అయితే, మన భాగస్వామ్యానికి మరింత సామర్థ్యమున్న విషయాన్ని మనమందరం కచ్చితంగా అంగీకరిస్తామని భావిస్తున్నాను. అందుకే నేను, ప్రధానమంత్రి డాక్టర్ అబియ్ అహ్మద్ నిన్న ఓ పెద్ద ముందడుగు వేశాం. మన ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచాలని మేం నిర్ణయించాం.
సాంకేతికత, ఆవిష్కరణలు, గనుల తవ్వకం, సుస్థిరత, శుద్ధ ఇంధన రంగాల్లో సహకారం ద్వారా ఇది మన ఆర్థిక వ్యవస్థల సామర్థ్యాన్ని ఆవిష్కరిస్తుంది. ఆహార భద్రత, ఆరోగ్య భద్రత, సామర్థ్యాభివృద్ధిలో సహకారం ద్వారా.. మన ప్రజల భవితను సురక్షితం చేయడానికి కూడా ఇది దోహదపడుతుంది. అంతేకాకుండా వాణిజ్యం, పెట్టుబడి సహకారంతోపాటు రక్షణ, భద్రతా అంశాల్లోనూ మన సహకారాన్ని పెంపొందించుకుంటాం.
గౌరవ సభ్యులారా,
అభివృద్ధి చెందుతున్న దేశాలుగా.. మనం ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవచ్చు, అలాగే ఒకరికి ఒకరం ఎంతో అందించుకోవచ్చు. వ్యవసాయం మన రెండు దేశాలకూ వెన్నుముకగా నిలుస్తుంది. అది మన ప్రజలకు ఆహారాన్ని అందిస్తుంది. మన రైతుల జీవనాధారంగా నిలుస్తుంది. ఇది సంప్రదాయాన్ని నవీనతతో అనుసంధానిస్తుంది. మెరుగైన విత్తనాలు, నీటిపారుదల వ్యవస్థలు, నేల ఆరోగ్య సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి మనం కలిసి పనిచేయవచ్చు.
వర్షపాతం, పంట కాలాలపై వాతావరణ మార్పులు ప్రభావం చూపుతున్న ఈ సమయంలో.. వాతావరణానికి తట్టుకునే వ్యవసాయంపై జ్ఞానాన్ని పరస్పరం పంచుకోవచ్చు. పాడి వ్యవసాయం నుంచి వ్యవసాయ యాంత్రీకరణ వరకు, సిరిధాన్యాల పరిశోధన నుంచి ఆహార శుద్ది వరకు కలిసి పనిచేస్తే మన రైతులు అభివృద్ధి చెందడానికి తోడ్పడగలం.
గౌరవ సభ్యులారా,
భారత్ లో మేం బలమైన డిజిటల్ ప్రజా మౌలిక వసతులను నిర్మించాం. ఇది సేవలను అందించే విధానాన్ని, ప్రజలు వాటిని పొందే తీరును పూర్తిగా మార్చేసింది. నేడు భారత్ లో ప్రతి పౌరుడు చెల్లింపులు, గుర్తింపు, ప్రభుత్వ సేవల కోసం సాంకేతికతను వినియోగించగలుగుతున్నాడు. ప్రపంచంలో సగానికి పైగా వాస్తవిక డిజిటల్ చెల్లింపులు నేడు భారతదేశంలోనే జరుగుతున్నాయి.
500 బిలియన్ డాలర్లకు పైగా విలువైన సంక్షేమ ప్రయోజనాలు ఎలాంటి లీకేజీలు, అవినీతి లేకుండా నేరుగా వందల మిలియన్ల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి చేరాయి. ప్రతి సంవత్సరం మూడుసార్లు దాదాపు 100 మిలియన్ల రైతులు ఒక బటన్ నొక్కగానే ఆర్థిక సహాయాన్ని పొందుతున్నారు.
మీరు డిజిటల్ ఇథియోపియా 2025 వ్యూహాన్ని అమలు చేస్తున్న సందర్భంలో.. మా అనుభవాన్ని, నైపుణ్యాన్ని ఇథియోపియాతో పంచుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అలాగే మీ విదేశాంగ మంత్రిత్వ శాఖ కోసం డేటా సెంటర్ అభివృద్ధి చేయడానికి భారత్ ను నమ్మకమైన భాగస్వామిగా ఎంచుకున్నందుకు మాకు గౌరవంగా ఉంది.
గౌరవ సభ్యులారా,
ప్రపంచానికి భారత్ ఔషధశాలగా ప్రసిద్ధి చెందింది. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచమంతా ఆందోళనకు లోనైంది. అది అత్యంత కఠినమైన కాలం. పరిమిత వనరులు ఉన్నప్పటికీ ఇతరులకు సహాయం చేయడానికి సాధ్యమైన ప్రతి చర్య తీసుకోవడం మానవత్వానికి మా పవిత్ర కర్తవ్యమని మేం భావించాం.
భారతదేశం 150కు పైగా దేశాలకు ఔషధాలు, వ్యాక్సీన్లను పంపింది. ఇథియోపియాకు 40 లక్షలకుపైగా టీకా మోతాదులను సరఫరా చేయడం భారత్ కు గర్వకారణం. డాక్టర్ టెడరోస్ నేతృత్వంలో ప్రపంచ ఆరోగ్య సంస్థతో భాగస్వామ్యం అవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాం. భారత్ లో ఇథియోపియాకు గర్వకారణమైన ఆయన్ను ప్రేమగా తులసీ భాయ్ అని పిలుస్తారు.
ఔషధాల నుంచి ఆసుపత్రుల వరకు, సంప్రదాయ వైద్యం నుంచి టెలీమెడిసిన్ వరకు మన ఆరోగ్య రంగ సహకారం విస్తరిస్తుండడం నాకు సంతోషంగా ఉంది. ఆసుపత్రుల్లో కొత్త పరికరాల ఏర్పాటు నుంచి, ఆరోగ్య సంరక్షణ నిపుణుల సామర్థ్య వృద్ధి వరకు మన ఆరోగ్య భద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం.
గౌరవ సభ్యులారా,
ఇథియోపియా ఆఫ్రికా ఖండంలో అత్యంత కీలక స్థానంలో ఉంది. భారతదేశం హిందూ మహాసముద్రానికి కేంద్రంగా నిలిచింది. ప్రాంతీయ శాంతి, భద్రత, అనుసంధానంలో మనం సహజ భాగస్వాములం.
ఈ సంవత్సరం ప్రారంభంలో కుదిరిన రక్షణ సహకార ఒప్పందంతో పరస్పర భద్రతపై మా నిబద్దత మరింత బలపడింది. ఈ ఒప్పందం సన్నిహిత సైనిక సహకారంపై దృష్టి సారిస్తుంది. ఇందులో సైబర్ భద్రత, రక్షణ పరిశ్రమలు, ఉమ్మడి పరిశోధన, సామర్థ్యాభివృద్ధి వంటి రంగాల్లో సహకారం ఉంటుంది.
ఏప్రిల్ లో భారత్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత మీరు వ్యక్తం చేసిన సంఘీభావానికి ఇథియోపియాకు ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా ఆల్ పార్టీ పార్లమెంటరీ ప్రతినిధి బృందాన్ని ఎంతో ఆత్మీయంగా స్వాగతించినందుకు, ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని మరోసారి స్పష్టం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.
గౌరవ సభ్యులారా,
శక్తిమంతమైన, వైవిధ్యభరిత ప్రజాస్వామ్యాలుగా మన రెండు దేశాలకు ప్రజాస్వామ్యం ఒక జీవన విధానమని, అది నిరంతర ప్రయాణమని బాగా తెలుసు. అది కొన్నిసార్లు చర్చల ద్వారా, కొన్నిసార్లు విభేదాల ద్వారా రూపుదిద్దుకుంటుంది. కానీ ఎప్పుడూ చట్టబద్దమైనపాలనపై, ప్రజల సంకల్పంపై విశ్వాసంతో ఏర్పడుతుంది.
మన రెండు రాజ్యాంగాలు కూడా ఈ స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి. భారతదేశ రాజ్యాంగం ‘‘మేం, భారత ప్రజలు’’ అనే పదాలతో ప్రారంభమవుతుంది. ఇథియోపియా రాజ్యాంగం ‘‘మేం, ఇథియోపియా దేశాలు, జాతులు, ప్రజలు’’ అని ప్రారంభమవుతుంది. వీటి సందేశం ఒకే విధంగా ఉంది. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది.
ఈ ఉదయం ఆడ్వా విజయ స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి ఘటించే గౌరవం నాకు లభించింది. ఈ స్మారక చిహ్నం ఆత్మ గౌరవం, స్వేచ్ఛ కోసం పోరాటాన్ని, ఇథియోపియా విజయాన్ని ఎల్లప్పుడూ గుర్తుచేస్తుంది. సంక్షోభ సమయాల్లో దక్షిణ దేశాల ప్రజలు తమ కోసం తాము నిలబడగలరని ఇది గుర్తు చేస్తుంది.
గౌరవ సభ్యులారా,
మహాత్మా గాంధీ మనకు ట్రస్టీషిప్ భావనను ఇచ్చారు. ఈ అందమైన ప్రపంచం వనరులు మన సొంతం కాదు. మనం వాటి సంరక్షకులం. కాబట్టి వాటిని జాగ్రత్తగా మన పిల్లలకు అందించాలి. భారత్ చేపట్టిన ‘‘ఎ ట్రీ ఫర్ మదర్’’ కార్యక్రమం ..ఇథియోపియాకు చెందిన గ్రీన్ లెగసీ కార్యక్రమం కూడా ట్రస్టీషిప్ స్ఫూర్తిని స్పష్టంగా ప్రతిబింబిస్తుంది.
మాతృభూమిని పరిరరక్షించాలనే భావనను రెండు దేశాలు విశ్వసిస్తాయి. ప్రకృతికి తిరిగి ఇచ్చే బాధ్యతలోనూ నమ్మకం కలిగి ఉన్నాయి. పునరుత్పాదక ఇంధనం, పర్యావరణ అనుకూల ఉద్యోగాలపై మనం కలిసి పని చేద్దాం. విపత్తులను తట్టుకోగల మౌలిక సదుపాయాలు, జీవ ఇంధనాలపై పని చేద్దాం. వాతావరణ న్యాయం కోసం గట్టిగా గళం విప్పుదాం. 2027లో జరిగే సీఓపీ-32 సదస్సులో దక్షిణ దేశాల కోసం శక్తిమంతమైన స్వరాన్ని అందించడానికి ఇథియోపియా చేసే ప్రయత్నాలకు భారత్ మద్దతిస్తుంది.
గౌరవ సభ్యులారా,
ఇథియోపియాలో ఒక సామెత ఉందని నాకు చెప్పారు. ‘‘సాలెగూళ్లు ఏకమైతే, అవి సింహాన్ని కూడా కట్టివేయగలవు’’.. భారత్ లో కూడా ‘‘మనసులు కలిస్తే పర్వతాలు కూడా దారి ఇస్తాయి’’ అని నమ్ముతాం.
నిజానికి సంఘీభావమే బలం. సహకారమే శక్తి. నేడు దక్షిణ దేశాలుగా, ప్రాచీన నాగరికతలుగా, స్నేహితులుగా, భారత్ ఇథియోపియా కలిసి నిలిచాయి. మనం ఒకే కుటుంబ సభ్యులుగా కలిసి నిలుస్తున్నాం. మరింత న్యాయమైన, మరింత సమానమైన, మరింత శాంతియుతమైన ప్రపంచం కోసం కలిసి కృషి చేస్తున్నాం.
ఆఫ్రికా ఐక్యత కలలు ఇక్కడే అడిస్ అబాబాలోనే ఒక రూపాన్ని సంతరించుకున్నాయి. ఈ అద్భుతమైన నగరంలోని అనేక వీధులకు ఆఫ్రికా దేశాల పేర్లతోనే ఉన్నాయని నాకు చెప్పారు.
జీ20లో ఆఫ్రికన్ యూనియన్ ను శాశ్వత సభ్యునిగా ఆహ్వానించే గౌరవం భారత్ కు న్యూఢిల్లీలో లభించింది. గత సంవత్సరం ఇథియోపియాను బ్రిక్స్ కూటమిలో పూర్తి సభ్యునిగా చేర్చడం మరో చారిత్రక పరిణామం.
వాస్తవానికి, మా ప్రభుత్వం గత 11 సంవత్సరాల్లో భారత్–ఆఫ్రికా మధ్య సంబంధాలు అనేక రెట్లు పెరిగాయి. ఈ సమయంలో దేశాధినేతలు, ప్రభుత్వాధినేతల స్థాయిలో 100కు పైగా పరస్పర పర్యటనలు జరిగాయి.
గౌరవ సభ్యులారా,
దక్షిణ ప్రపంచ దేశాలు తమ గమ్యాన్ని తామే రాసుకుంటున్నాయి. ఈ దిశలో భారత్-ఇథియోపియా ఒకే దార్శనికతను పంచుకుంటున్నాయి. దక్షిణ దేశాలు ఎవరికీ వ్యతిరేకంగా కాదు. అందరి శ్రేయస్సు కోసం ఎదిగే ప్రపంచం, అదే మా దార్శనికత.
అభివృద్ధి న్యాయంగా జరిగే, సాంకేతికత అందరికీ అందుబాటులో ఉండే, సార్వభౌమత్వానికి గౌరవం ఇచ్చే ప్రపంచం. సంపద పంచుకునే, శాంతి రక్షించే ప్రపంచం. నిర్ణయాలు 1945 నాటి ప్రపంచాన్ని కాకుండా, నేటి వాస్తవాలను ప్రతిబింబించే ప్రపంచం. ఎందుకంటే, వ్యవస్థలు గతంలోనే బంధించి ఉంటే, ప్రపంచం ముందుకు సాగలేదు.
అందుకే భారత్ ప్రపంచ అభివృద్ధి ఒప్పందంపై దృష్టి పెట్టింది. ఇది సుస్థిర అభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞాన విస్తరణ, సరసమైన ఆర్థిక సహాయం, సామర్థ్య నిర్మాణం, వాణిజ్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే నవంబర్ లో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో ఒక మిలియన్ మంది శిక్షకులను తయారు చేయాలనే లక్ష్యంతో ‘‘ఆఫ్రికా స్కిల్స్ మల్టిప్లైయర్ ఇనీషియేటివ్’’ కార్యక్రమాన్ని ప్రతిపాదించాను. ఇది స్థానిక సామర్థ్యాలను బలోపేతం చేసి, సమగ్రమైన, సుస్థిర అభివృద్ధి దిశగా మీ ప్రయత్నాలకు సహాయపడుతుంది.
గౌరవనీయ సభ్యులారా,
టీతో నాకున్న అనుబంధం అందరికీ తెలిసిందే. కానీ, ఇథియోపియాకు వచ్చి కాఫీ గురించి ప్రస్తావించకుండా ఉండటం అసాధ్యం! ఇది మీరు ప్రపంచానికి అందించిన గొప్ప బహుమతుల్లో ఒకటి.
ఇథియోపియన్ కాఫీ వేడుకలో ప్రజలు కలిసి కూర్చుంటారు. కాలం నెమ్మదిగా సాగుతుంది, స్నేహాలు బలపడతాయి. భారత్ లో కూడా ఒక కప్పు టీ అనేది మాట్లాడటానికి, పంచుకోవడానికి, అనుబంధాన్ని పెంచుకోవడానికి ఒక ఆహ్వానం. ఇథియోపియన్ కాఫీ, భారతీయ టీ లాగే మన స్నేహం కూడా మరింత బలపడుతోంది.
సోదరసోదరీలైన మీ మధ్య నేడు హృదయపూర్వకమైన కృతజ్ఞతా భావంతో, భవిష్యత్తుపై ఉజ్వల ఆశలతో నిలబడి ఉన్నాను. భవిష్యత్తు మనల్ని పిలుస్తోంది. ఆ పిలుపునకు సమాధానం ఇచ్చేందుకు భారత్, ఇథియోపియా సిద్ధంగా ఉన్నాయి.
గౌరవ సభ్యులారా,
ముగింపుగా..మనం కలిసి నడుస్తాం. భాగస్వాములుగా కలిసి నిర్మిస్తాం. మిత్రులుగా కలిసి విజయాన్ని సాధిస్తాం అని నేను మీకు మాట ఇస్తున్నాను.
ఈ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించే గౌరవాన్ని కల్పించినందుకు మీకు ధన్యవాదాలు. మీ స్నేహానికి ధన్యవాదాలు. మీ నమ్మకానికి ధన్యవాదాలు.
మీకు ఆశీస్సులు,
క్షేమంగా ఉండండి,
ధన్యవాదాలు,
***
(रिलीज़ आईडी: 2205985)
आगंतुक पटल : 2
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam