|
ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
प्रविष्टि तिथि:
27 JUL 2023 8:08PM by PIB Hyderabad
మీరందరూ ఎలా ఉన్నారు? అంతా కుశలమేనా!
వేదికను అలంకరించిన గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపానీ, శ్రీ సి.ఆర్.పాటిల్ తదితర ప్రముఖులకు నా అభివాదం...
మిత్రులారా!
రాజ్‌కోట్‌లో నేడు ఈ సభకు ఇంత భారీగా హాజరైన ప్రజలందర్నీ చూడటం నాకెంతో ఆనందంగా ఉంది. మరోవైపు ఇప్పుడిక్కడ శ్రీ విజయ్ నా చెవిలో గుసగుసగా చెబుతున్నారు. సాధారణంగా, ఇవాళ... అదీ వారం మధ్యలో... అందునా మధ్యాహ్నం వేళ రాజ్‌కోట్‌లో ఏ కార్యక్రమమైనా నిర్వహించే ఆలోచన చేయరు. అయినప్పటికీ, భారీగా... ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడం ద్వారా ఈ నగరం అన్ని రికార్డులనూ బద్దలు కొట్టింది. ఈ నగరంలో ఎలాంటి కార్యక్రమమైనా, రాత్రి 8 గంటల తర్వాతే నిర్వహించడం ఉత్తమమని నా అభిప్రాయం. ఎందుకంటే- ఎన్నో ఏళ్ల మన అనుభవం ప్రకారం మధ్యాహ్నం వేళ ఓ కునుకు తీయడం రాజ్‌కోట్ వాసులకు ఆనవాయితీ!
రాజ్‌కోట్, సౌరాష్ట్ర సహా యావత్ గుజరాత్‌కు ఇదొక ముఖ్యమైన రోజు. అయితే, ముందుగా ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. కొన్ని రోజుల కిందటే ఈ ప్రాంతాన్ని తుఫాను కుదిపేసింది... మరోవైపు వరదలు విధ్వంసం సృష్టించాయి. ఇలాంటి సంక్షోభ సమయంలో ప్రభుత్వం, ప్రజలు మరోసారి కలసికట్టుగా కష్టనష్టాలకు ఎదురీదారు. బాధిత కుటుంబాల జీవితాలు వీలైనంత త్వరగా సాధారణ స్థాయికి చేరేవిధంగా భూపేంద్ర భాయ్ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. అదేవిధంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా సహాయసహకారాలు అందిస్తోంది.
సోదరీసోదరులారా!
ఈ నగరం కొన్నేళ్లుగా అన్నిరంగాల్లో పురోగమించడం మనం చూస్తున్నాం. ఇప్పుడీ ప్రాంతం సౌరాష్ట్ర ప్రగతికి చోదకశక్తిగానూ గుర్తింపు పొందుతోంది. ఇక్కడ పరిశ్రమలు, వ్యాపారాలు, సంస్కృతి, ఆహారం వంటి ఎన్నో అంశాలున్నాయి. కానీ, ఇక్కడేదో లోపించిందని భావిస్తున్న మీరంతా పదేపదే ఆ లోటు తీర్చాలని నన్ను కోరుతూ వచ్చారు... ఆ కోరికేదో చివరకు ఇవాళ నెరవేరింది.
ఇక్కడికి రావడానికి ముందు కొత్త విమానాశ్రయంలో మీ స్వప్నం సాకారమైన ఆనందాన్ని నేను కూడా అనుభవించాను. నేనెప్పుడూ చెబుతున్నట్టే- రాజ్‌కోట్ నాకు చాలా విషయాలు నేర్పిందని ఇప్పుడు మరోసారి చెబుతున్నాను. నన్ను తొలిసారి ఎమ్మెల్యేని చేసి, నా రాజకీయ ప్రస్థానానికి నాంది పలికిన ప్రదేశం ఈ నగరం. అందుకే, రాజ్‌కోట్‌కు ఎంతో రుణపడిన నేను, దాన్ని కొద్దికొద్దిగా తీర్చడానికి ప్రయత్నిస్తున్నాను.
ఈ నగరానికి నేడు ఓ పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం సమకూరింది. రాజ్‌కోట్ నుంచి దేశవిదేశాల్లోని అనేక నగరాలకు నేరుగా విమాన ప్రయాణ సౌలభ్యం కలిగింది. ఇక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే వెసులుబాటు వల్ల ఈ ప్రాంతంలోని పరిశ్రమలన్నీ కూడా ఎంతో లబ్ధి పొందుతాయి. అయితే, నేను ముఖ్యమంత్రినైన తొలి నాళ్లలో నాకు రాజకీయ అనుభవం పెద్దగా లేదు. ఈ నగరం “ఓ చిన్న జపాన్‌గా మారుతోంది" అని ఓ సందర్భంలో నేను చెప్పాను. అప్పుడు అందరూ హేళన చేశారుగానీ, ఈ రోజున నా మాటలు నిజమని మీరంతా నిరూపించారు.
మిత్రులారా!
ఇక్కడి రైతులు నేడు తాము పండించే కూరగాయలు, పండ్లు తదితర ఉత్పత్తులను దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేయడమేగాక విదేశాలకు సులభంగా ఎగుమతి చేయగలుగుతారు. అంటే- రాజ్‌కోట్ నగరానికి లభించింది కేవలం విమానాశ్రయం కాదు... ఈ ప్రాంతం అభివృద్ధికి నవ్యోత్తేజమిచ్చి కొత్త రెక్కలు తొడిగే ఒక శక్తి కూడలి.
ఈ నగరంలో ‘సౌనీ యోజన’ కింద అనేక ప్రాజెక్టులను కూడా ప్రారంభించాం. ఇవన్నీ పూర్తయితే సౌరాష్ట్రలోని అనేక గ్రామాల రైతులకు సాగునీరు, ప్రజలందరికీ తాగునీరు అందుబాటులోకి వస్తుంది. ఇదే కాకుండా ఇవాళ ఇక్కడ వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించే అవకాశం నాకు లభించింది. ఈ నేపథ్యంలో మీకందరికీ నా అభినందనలు.
మిత్రులారా!
కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో ప్రతి ప్రాంతంతోపాటు సమాజంలోని ప్రతి వర్గానికీ జీవన సౌలభ్యం కల్పించేలా ముమ్మర కృషి చేసింది. అలాగే, సుపరిపాలనపై ఇచ్చిన హామీని మేమివాళ నెరవేరుస్తున్నాం. పేదలు, దళితులు, వెనుకబడిన తరగతులు లేదా గిరిజనులు సహా సమాజంలోని ప్రతి ఒక్కరి జీవితం మెరుగుకు మేము నిర్విరామ కృషి చేశాం.
మా ప్రభుత్వ కృషి ఫలితంగా దేశంలో పేదరికం వేగంగా తగ్గుతూ, ఇటీవలి ఓ నివేదిక ప్రకారం- కేవలం ఐదేళ్ల పాలనలో 13.5 కోట్ల మంది ప్రజలు పేదరికం విముక్తులయ్యారు. అంటే- ఈ రోజున దేశంలో ఓ కొత్త మధ్యతరగతి వర్గం రూపొందుతోంది. అందుకే, మధ్యతరగతి, కొత్త మధ్యతరగతి అని కాకుండా ప్రాథమికంగా యావత మధ్యతరగతికీ మా ప్రభుత్వ ప్రాధాన్యాలలో స్థానముంది.
మిత్రులారా!
దేశంలో 2014కు ముందు మధ్యతరగతి నుంచి సర్వసాధారణంగా వినిపించే ఒక ఫిర్యాదును ఓ సారి గుర్తుచేసుకునే ప్రయత్నం చేయండి! అనుసంధాన లోపం ఫలితంగా తమ సమయంలో అధికశాతం ప్రయాణంలోనే గడిచిపోతున్నదని ప్రజలు వాపోయేవారు. విదేశాలకు వెళ్లి వచ్చేవారు, టీవీల్లో వాటిని చూసేవారు కొందరు మన దేశంలో అలాంటి సదుపాయాలు లభించే రోజు ఎప్పుడొస్తుందోనని నిట్టూర్చేవారు. అలాంటి రహదారులు, విమానాశ్రయాలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో? అని కలత పడేవారు. దేశంలో అనుసంధానం సవ్యంగా లేనందున పాఠశాలలు-కార్యాలయాలకు వెళ్లాలన్నా, వ్యాపారం చేయాలన్నా ఇబ్బందులే. కానీ, తొమ్మిదేళ్ల మా పాలనలో ఈ సమస్య పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేశాం. కాబట్టే, 2014లో కేవలం 4 నగరాలకు మాత్రమే పరిమితమైన మెట్రో నెట్‌వర్క్ నేడు 20కి పైగా నగరాలకు విస్తరించింది. దేశంలో ఇప్పుడు వందే భారత్ వంటి ఆధునిక రైళ్లు 25 మార్గాల్లో నడుస్తున్నాయి. ఇక 2014 నాటికి విమానాశ్రయాల సంఖ్య దాదాపు 70 కాగా, ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపు దాటింది.
దేశంలో విమాన సేవల విస్తరణతో భారత విమానయాన రంగం కొత్త ఎత్తులకు చేరింది. మన దేశ విమానయాన సంస్థలు రూ.లక్షల కోట్ల విలువైన కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్లిచ్చాయి. ఓ కొత్త కారు, స్కూటర్, చివరకు ఓ కొత్త సైకిల్ కొన్నా మనకొక వార్తే. కానీ, ఇవాళ వెయ్యి కొత్త విమానాలకు ఆర్డర్ ఇవ్వగా, త్వరలోనే 2,000 విమానాలకు ఆర్డర్ ఇచ్చే అవకాశాలున్నాయి. గుజరాత్ ఎన్నికల సమయంలో నేనొక మాట చెప్పాను... మీకు గుర్తుందా? నేనైతే మరచిపోలేదు. “గుజరాత్ విమానాలను తయారుచేసే రోజు ఇక ఎంతో దూరంలో లేదు” అని ఆ రోజున చేను చెప్పాను. అందుకు అనుగుణంగా ఇవాళ రాష్ట్రం వేగంగా పురోగమిస్తోంది.
సోదరీసోదరులారా!
మా ప్రభుత్వ ప్రాథమ్యాలలో జనజీవన సౌలభ్యం, జీవన నాణ్యత కల్పన అత్యంత కీలకమైనవి. దేశ ప్రజలు లోగడ ఎదుర్కొన్న సమస్యలను విస్మరించలేం. విద్యుత్, నీటి సరఫరా బిల్లులు చెల్లింపు నిమిత్తం మీరు బారులుతీరి నిలబడాల్సి వచ్చేది. ఆస్పత్రులలో చికిత్స తెగబారెడు పొడవైన వరుసలో వేచి ఉండాల్సిన దుస్థితి ఉండేది. అలాగే బీమా, పెన్షన్ వంటి వాటికోసం మరిన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చేది. చివరకు పన్ను రిటర్నుల దాఖలులోనూ ఎన్నో అగచాట్లు తప్పేవి కావు. అయితే, డిజిటల్ ఇండియా కార్యక్రమంతో మేమీ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపాం. ఇంతకుముందు బ్యాంకుకు వెళ్లి పని చేసుకు రావాలంటే ఎంతో సమయం, శక్తి వృథా తప్పేది కాదు. ఇప్పుడు బ్యాంకు మీ మొబైల్‌లోకి వచ్చేసింది... చివరిసారిగా బ్యాంకుకు వెళ్లిందెప్పుడో చాలామందికి గుర్తుకు రానంతగా సౌలభ్యం ఇనుమడించింది.
మిత్రులారా!
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు ఓ పెద్ద సమస్యగా భావించే రోజులను ఓ సారి గుర్తు తెచ్చుకోండి. ఆ గజిబిజి గందరగోళంతో అయోమయంలో పడి, మీరు చాలా చోట్లకు తిరిగి, ఎవరో ఒకరిని పట్టుకోవాల్సిన దురవస్థ ఉండేది. కానీ, ఇవాళ మీరు ఏ సమయంలోనైనా సరళంగా, సులువుగా ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో దాఖలు చేసేయవచ్చు. మీరు కట్టిన పన్ను వాపసు రావాల్సి ఉంటే, లోగడ కొన్ని నెలలపాటు ఎదురుచూసే పరిస్థితి ఉండగా, ఇప్పుడు కేవలం రోజుల వ్యవధిలోనే వాపసు సొమ్ము మీ ఖాతాలో జమ అవుతోంది.
మిత్రులారా!
మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చడంపై గత ప్రభుత్వాలు ఎన్నడూ దృష్టి సారించింది లేదు. అయితే, మేం పేదల కోసం పక్కా ఇళ్ల నిర్మాణమే కాకుండా మధ్యతరగతి సొంతింటి కల తీర్చడానికి కృషి చేశాం. ‘పీఎం ఆవాస్ యోజన’ కింద ఇంటి నిర్మాణానికి ప్రత్యేక రాయితీతో ఆర్థిక సహాయం అందిస్తున్నాం. ఆ మేరకు రూ.18 లక్షల వార్షికాదాయంగల కుటుంబాలకు చేయూతనిస్తున్నాం. దేశంలోని 6 లక్షలకు పైగా మధ్యతరగతి కుటుంబాలు ఇప్పటిదాకా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నాయి. గుజరాత్ విషయానికొస్తే- 60 వేలకు పైగా కుటుంబాలు ఈ కేంద్ర ప్రభుత్వ పథకంతో ప్రయోజనం పొందాయి.
మిత్రులారా!
కేంద్రంలో గత ప్రభుత్వాల పాలన కింద స్తిరాస్థి నిర్మాణ సంస్థలు ఇళ్ల విషయంలో తరచూ ఏదో ఒక రకంగా మోసం చేయడం గురించి వింటూండేవాళ్లం. ఏళ్ల తరబడి ఎదురుచూసినా, ఇళ్లు స్వాధీనం చేస్తారన్న ఆశ నెరవేరేది కాదు. అందుకు తగిన చట్టాలు లేవు సరికదా... అసలు ప్రశ్నించే గళం ఎక్కడా వినిపించేది కాదు. కానీ, మా ప్రభుత్వం ప్రజాప్రయోజన పరిరక్షణార్థం ‘స్థిరాస్తి సంస్థల నియంత్రణ చట్టం’ (రెరా) తెచ్చింది. దీనివల్ల నేడు మోసపూరిత సంస్థల చేతిలో లక్షలాది మంది ప్రజలు నష్టపోయే దుస్థితి తప్పింది.
సోదరీసోదరులారా!
అభివృద్ధి కార్యక్రమాలు ఇంత విస్తృతంగా సాగుతూ, దేశం నేడు శరవేగంగా పురోగమిస్తుండటం చూసి కొందరు ఇష్టపడక పోవడం సహజం. తమ అవసరాలు తీరే రోజు కోసం ఆదుర్దాగా ప్రజలు ఎదురుచూసే దుస్థితి కల్పించిన, ప్రజల అవసరాలు-ఆకాంక్షలు ఏమాత్రం పట్టించుకోని వారికి, ఇవాళ జనం కలలు నెరవేరడం చూసి అసంతృప్తి కలగడం మామూలే!
అందుకే, ఈ అవినీతిపరులు, వంశపారంపర్య రాజకీయాలు చేసేవారు తమ పార్టీ పేరును కూడా మార్చేసుకోవడం మీరు గమనించవచ్చు. అవే ముఖాలు... అవే పాపాలు.. పద్ధతులూ అవే.. కానీ, పార్టీ పేరు మారింది. అలాగే, వారి పని సంస్కృతి పాతదే.. ఉద్దేశాలు కూడా పాతమే.. మధ్యతరగతికి ఏదైనా తక్కువ ధరకు దొరికితే, రైతుకు సరైన ధర లభించడం లేదంటారు. రైతుకు గిట్టుబాటు ధర లభిస్తే, ద్రవ్యోల్బణమే అందుకు కారణమంటూ ద్వంద్వ ప్రమాణాల రాజకీయం చేస్తారు.
ద్రవ్యోల్బణం విషయంలో వారి రికార్డు ఎలా ఉండేదంటే- కేంద్రంలో వారు అధికారంలో ఉండగా 10 శాతానికి చేరిన ద్రవ్యోల్బణాన్ని మా హయాంలో నియంత్రించి ఉండకపోతే, దేశంలో ధరలు నేడు ఆకాశాన్నంటేవి. గత ప్రభుత్వం ఇంకా అధికారంలో కొనసాగి ఉంటే, లీటరు పాలకు రూ.300, కిలో పప్పులు రూ.500 వంతున అమ్ముడవుతూండేవి. పిల్లల పాఠశాల ఫీజుల నుంచి ప్రయాణ చార్జీల దాకా అన్నీ చుక్కలు చూపించేవి.
అయితే, మిత్రులారా... కరోనా మహమ్మారి బెడద, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి పరిస్థితుల్లోనూ మా ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసింది. అందుకే, మన పొరుగు దేశాలలో ద్రవ్యోల్బణం ఇవాళ 25-30 శాతం వంతున పెరుగుతున్నా మన దేశంలో ఆ పరిస్థితి లేదు. మేమిప్పుడు ద్రవ్యోల్బణ నియంత్రణకు సునిశితంగా కృషి చేస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులోనూ దీన్ని కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నాం.
సోదరీసోదరులారా!
దేశంలోని పేదలు-మధ్యతరగతి వారి ఖర్చుల ఆదా సహా మధ్యతరగతి జేబుల్లో గరిష్ఠ పొదుపు దిశగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు తొమ్మిదేళ్ల కిందటిదాకా రూ.2 లక్షల వార్షికాదాయంపైనా పన్ను విధించే దుస్థితి ఉండేది. కానీ, ఇవాళ రూ.7 లక్షల దాకా సంపాదించినా పన్ను సున్నా! అంటే- రూ.7 లక్షల వార్షికాదాయం ఉన్నవారికి పన్ను లేదు. దీనివల్ల ముఖ్యంగా నగరాల్లో నివసించే మధ్యతరగతి కుటుంబాలకు ఏటా రూ.వేలలో ఆదా అవుతోంది. అలాగే, చిన్న పొదుపు మొత్తాలకు అధిక వడ్డీ లభించేలా కూడా మేం చర్యలు తీసుకున్నాం. ఇందులో భాగంగా ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌వో)లో వారి చందా మొత్తంపై వడ్డీని 8.25 శాతంగా నిర్ణయించాం.
మిత్రులారా!
మా ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలతో మీ డబ్బు ఆదా అవుతున్న తీరును చెప్పడానికి మీ మొబైల్ ఫోన్ ఒక నిదర్శనం. ఎలాగంటే- ఇవాళ ధనిక, పేద తేడా లేకుండా చాలా మంది చేతిలో స్మార్ట్ ఫోన్ దర్శనమిస్తోంది. అంతేగాక ప్రతి భారతీయుడు సగటున నెలకు సుమారు 20 జీబీ డేటా వాడుతున్నారు. మీకు గుర్తుందా... 2014లో 1 జీబీ డేటా కోసం రూ.300 చెల్లించాల్సి వచ్చేది. నాటి ప్రభుత్వమే ఇవాళ అధికారంలో ఉండి ఉంటే, మీరు కేవలం మొబైల్ బిల్లు కింద ప్రతి నెలా కనీసం రూ.6,000 చెల్లించాల్సి వచ్చేది. కానీ, ఇవాళ మీరు 20 జీబీ డేటా కోసం చెల్లిస్తున్నది కేవలం రూ.300 నుంచి 400 మాత్రమే. అంటే- ఇప్పుడు మొబైల్ వాడే ప్రతి ఒక్కరికీ నెలకు దాదాపు రూ.5000 దాకా ఆదా అవుతోంది.
మిత్రులారా!
ఇక వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడే వృద్ధులు, వృద్ధ తల్లిదండ్రులున్న కుటుంబాలకు నెలవారీ మందుల బిల్లు భారం తప్పదు. కాబట్టి, వారికి ఆ భారం తప్పిస్తూ మా ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా చౌక ధరకు మందులు లభించేలా చర్యలు తీసుకుంది. దీనివల్ల ఇంతకుముందు మార్కెట్‌లో అధిక ధర చెల్లించాల్సిన మందులు ఇప్పుడు మేం ప్రవేశపెట్టిన జనౌషధి కేంద్రాలలో చౌకగా లభిస్తున్నాయి. దీంతో పేదలు, మధ్య తరగతివారికి వ్యయం తగ్గి, మరింత పొదుపు సాధ్యమైంది. మొత్తంమీద దేశవ్యాప్తంగా వారికి ఏటా రూ.20,000 కోట్ల దాకా ఆదా అవుతోంది. పేదలు, మధ్యతరగతి వారి సమస్యలను సానుభూతితో అర్థం చేసుకున్న మా ప్రభుత్వం సాధారణ పౌరుల ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ ఒకదాని తర్వాత ఒకటిగా చర్యలు తీసుకుంటోంది.
సోదరీసోదరులారా!
అదే తరహాలో గుజరాత్, సౌరాష్ట్ర అభివృద్ధి దిశగానూ మన ప్రభుత్వం సునిశిత దృష్టితో పనిచేస్తోంది. నీటి కొరత సమస్య ఎంత తీవ్రమైనదో ఇక్కడి ప్రజలకు బాగా తెలుసు. అటువంటి దుస్థితి నుంచి ‘సౌనీ యోజన’ ఎంతటి పరిణామాత్మక మార్పు తెచ్చిందో సౌరాష్ట్ర ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తోంది. ఈ ప్రాంతం ఇవాళ ఎన్నో ఆనకట్టలు, చెక్ డ్యామ్‌లతో జల సమృద్ధంగా మారింది. ‘ఇంటింటికీ నీరు’ (హర్ ఘర్ జల్) పథకం కింద గుజరాత్‌లోని కోట్లాది కుటుంబాలకు ఇప్పుడు కొళాయి నీరందుతోంది.
మిత్రులారా!
ఇదే సుపరిపాలన నామూనా... గడచిన తొమ్మిదేళ్లుగా దేశం ఒక్కో అడుగు ముందుకెళ్తూ సామాన్యులకు సేవలందిస్తూ, వారి అవసరాలను తీరుస్తూ ఈ నమూనాను మేం విజయవంతంగా అమలు చేశాం. సమాజంలోని ప్రతి వర్గం, ప్రతి కుటుంబం అవసరాలు, ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకునే సుపరిపాలన నమూనా ఇది. వికసిత భారత్ రూపకల్పన దిశగా ఇదొక చక్కని మార్గం. ఈ బాటలో సాగుతూ, మనం ‘అమృతకాలం’ సంకల్పాలను సాకారం చేసుకోవాలి.
గుజరాత్‌లోని నా సౌరాష్ట్ర, రాజ్‌కోట్ ప్రజలకు అంతర్జాతీయ కొత్త విమానాశ్రయం సహా అనేక ప్రాజెక్టుల కానుక లభించింది. దీనికితోడు మీరందరూ ఇంత పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి ప్రాజెక్టులన్నింటిపైనా మీకు నా అభినందనలు... శుభాకాంక్షలు. మీ ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి భూపేంద్ర భాయ్ ప్రభుత్వం ఏ చిన్న అవకాశాన్నీ విడిచిపెట్టదని నాకు పూర్తి నమ్మకం ఉంది.
మీ సాదర స్వాగతానికి, మీరు చూపిన ప్రేమాదరాలకు మరోసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
అనేకానేక ధన్యవాదాలు!
గమనిక: ప్రధానమంత్రి హిందీ-గుజరాతీ భాషలు రెండింటిలో చేసిన ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే.
***
(रिलीज़ आईडी: 2204515)
|