ప్రధాన మంత్రి కార్యాలయం
జూలై 7, 8 తేదీలలో నాలుగు రాష్ట్రాల పర్యటనకు ప్రధానమంత్రి రూ. 50,000 కోట్ల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన
జూలై 7న ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలోనూ, జూలై 8న తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాలలోనూ ప్రధానమంత్రి పర్యటన
రాయ్‌పూర్‌లో సుమారు రూ. 7,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి
ఛత్తీస్‌గఢ్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, ఐదు జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన
గోరఖ్‌పూర్ లో గీతా ప్రెస్ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొననున్న ప్రధానమంత్రి
గోరఖ్‌పూర్ - లక్నో, జోధ్‌పూర్ - అహ్మదాబాద్ (సబర్మతి) నగరాలను కలుపుతూ నడిచే రెండు వందే భారత్ రైళ్లకు ప్రారంభోత్సవం
గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులకు శంకుస్థాపన
వారణాసిలో రూ. 12,100 కోట్ల పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి
డెడికేటెడ్ రవాణా కారిడార్‌లోని పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ - సోన్ నగర్ రైలు మార్గానికి ప్రారంభోత్సవం
వారణాసి - లక్నో ప్రయాణాన్ని మరింత వేగవంతం, సులభతరం చేస్తూ, జాతీయ రహదారి 56 లో నాలుగు వరసలుగా విస్తరించిన వారణాసి-జౌన్‌పూర్ మార్గాన్ని జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి
మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్‌ల పునరాభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఉత్తరప్రదేశ్ లో లబ్ధిదారులకు పీఎం స్వనిధి రుణాలు, పీఎంఏవై (గ్రామీణ) గృహాల తాళాలు, ఆయుష్మాన్ కార్డుల పంపిణీ
వరంగల్‌లో సుమారు రూ. 6,100 కోట్ల విలువైన పలు రోడ్డు, రైలు మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి
బికనీర్‌లో రూ. 24,300 కోట్ల పైగా విలువ గల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన
అమృత్‌సర్ - జామ్‌నగర్ ఆర్థిక కారిడార్‌లోని ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే విభాగాన్ని, గ్రీన్ ఎనర్జీ కారిడార్ కోసం అంతర్ రాష్ట్ర ప్రసార మార్గం మొదటి దశను జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి
బికనీర్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులకు శంకుస్థాపన
నాడు పోస్టు చేయడమైనది:
05 JUL 2023 11:48AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జూలై 7-8 తేదీలలో నాలుగు రాష్ట్రాలలో పర్యటిస్తారు. జూలై 7న ఛత్తీస్‌గఢ్, ఉత్తర్ ప్రదేశ్‌లను; 8న తెలంగాణ, రాజస్థాన్‌లను ఆయన సందర్శిస్తారు.
జూలై 7న ఉదయం 10:45 గంటలకు ప్రధానమంత్రి రాయ్‌పూర్‌లో జరిగే కార్యక్రమంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం తర్వాత మధ్యాహ్నం 2:30 గంటలకు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చేరుకుని, గీతా ప్రెస్ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలలో పాల్గొంటారు, గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రి వారణాసి చేరుకుని, బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవంతో పాటు కొన్నింటిని జాతికి అంకితం చేస్తారు.
జూలై 8వ తేదీ ఉదయం 10:45 గంటలకు ప్రధానమంత్రి తెలంగాణలోని వరంగల్ చేరుకుని, అక్కడ జరిగే బహిరంగ సభలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4:15 గంటలకు రాజస్థాన్‌లోని బికనీర్ చేరుకుని, అక్కడ పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, కొన్నింటిని జాతికి అంకితం చేస్తారు.
రాయ్‌పూర్‌లో ప్రధానమంత్రి కార్యక్రమం
మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, ప్రధానమంత్రి దాదాపు రూ. 6,400 కోట్ల విలువైన ఐదు జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన, కొన్నింటిని జాతికి అంకితం చేస్తారు. జాతికి అంకితం చేయనున్న ప్రాజెక్టులలో జబల్‌పూర్-జగదల్‌పూర్ జాతీయ రహదారిలో 33 కిలోమీటర్ల పొడవున 4- లేన్లుగా విస్తరించిన రాయ్‌పూర్ - కోడెబోడ్ సెక్షన్ కూడా ఉంది. ఈ విభాగం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడమే కాక, జగదల్‌పూర్ సమీపంలోని ఉక్కు కర్మాగారాల ముడిసరుకులు, తయారైన వస్తువుల రవాణాకు కీలకం. ఇది ఇనుప ఖనిజం సమృద్ధిగా ఉన్న ప్రాంతాలకు మెరుగైన అనుసంధానం అందిస్తుంది. జాతీయ రహదారి 130 లోని బిలాస్‌పూర్ - అంబికాపూర్ సెక్షన్‌లో 53 కిలోమీటర్ల పొడవైన నాలుగు లేన్ల బిలాస్‌పూర్-పత్రపాలి విభాగాన్ని కూడా ప్రధానమంత్రి దేశానికి అంకితం చేస్తారు. ఇది ఛత్తీస్‌గఢ్‌కు ఉత్తర ప్రదేశ్‌తో అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. సమీప ప్రాంతాలలోని బొగ్గు గనులకు కనెక్టివిటీని అందించడం ద్వారా బొగ్గు రవాణాను పెంచుతుంది.
ఆరు వరసల గ్రీన్‌ఫీల్డ్ రాయ్‌పూర్ - విశాఖపట్నం కారిడార్లోని ఛత్తీస్‌గఢ్ సెక్షన్ కోసం మూడు జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు ఎన్.హెచ్. 130 సిడిలోని 43 కిలోమీటర్ల పొడవైన ఆరు వరుసల ఝాంకి-సర్గి సెక్షన్ అభివృద్ధి, ఎన్.హెచ్. 130 సిడిలోని 57 కిలోమీటర్ల పొడవైన ఆరు వరుసల సర్గి-బసన్‌వాహి సెక్షన్ అభివృద్ధి, ఎన్.హెచ్. 130 సిడిలోని 25 కిలోమీటర్ల పొడవైన ఆరు వరుసల బసన్‌వాహి-మరంగ్‌పురి సెక్షన్ అభివృద్ధి ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో ముఖ్యమైన భాగంగా ఉడంతి వన్యప్రాణి అభయారణ్యం పరిధిలో వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించేందుకు 2.8 కిలోమీటర్ల పొడవైన ఆరు లైన్ల సొరంగం, అలాగే 27 జంతు మార్గాలు, కోతుల కోసం 17 కెనోపీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు ధంతరిలోని రైస్ మిల్లులకు, కాంకేర్‌లోని బాక్సైట్ సమృద్ధిగా ఉన్న ప్రాంతాలకు మెరుగైన అనుసంధానం అందిస్తాయి. అలాగే కొండగావ్‌లోని చేతివృత్తుల పరిశ్రమకు ప్రయోజనం చేకూరుస్తాయి. మొత్తంమీద, ఈ ప్రాజెక్టులు ఈ ప్రాంతం సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ప్రధాన చోదక శక్తిగా నిలుస్తాయి.
రాయ్‌పూర్ - ఖరియార్ రోడ్ రైలు మార్గం డబ్లింగ్‌ను కూడా ప్రధానమంత్రి దేశానికి అంకితం చేస్తారు. దీనిని 750 కోట్ల వ్యయంతో 103 కిలోమీటర్ల పొడవున నిర్మించారు. ఈ మార్గం ఛత్తీస్‌గఢ్‌లోని పరిశ్రమల కోసం ఓడరేవుల నుంచి బొగ్గు, ఉక్కు, ఎరువులు ఇతర వస్తువుల రవాణాను సులభతరం చేస్తుంది. కియోతీ- అంటాగఢ్ ను కలుపుతూ నిర్మించిన 17 కిలోమీటర్ల పొడవైన కొత్త రైలు మార్గాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. రూ. 290 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ కొత్త రైలు మార్గం భిలాయ్ ఉక్కు కర్మాగారాన్ని దల్లి రాజ్‌హరా, రాఘాట్ ప్రాంతాలలోని ఇనుప ఖనిజం గనులతో అనుసంధానిస్తుంది. ఇది దట్టమైన అడవుల మీదుగా సాగుతూ దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని మారుమూల ప్రాంతాలకు అనుసంధానం కల్పిస్తుంది.
కోర్బాలో రూ. 130 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) బాట్లింగ్ ప్లాంట్‌ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. దీని వార్షిక సామర్థ్యం 60 వేల మెట్రిక్ టన్నులు. ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులకు 75 లక్షల కార్డుల పంపిణీని కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.
గోరఖ్‌పూర్‌లో ప్రధానమంత్రి కార్యక్రమం
గోరఖ్‌పూర్‌లోని గీతా ప్రెస్‌ను ప్రధానమంత్రి సందర్శిస్తారు. ఈ చారిత్రక ప్రింటింగ్ ప్రెస్ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఆయన చిత్రమయ శివ పురాణ గ్రంథాన్ని విడుదల చేస్తారు. గీతా ప్రెస్‌లోని లీలా చిత్ర మందిరాన్ని కూడా ప్రధానమంత్రి సందర్శిస్తారు.
గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ నుంచి గోరఖ్‌పూర్ - లక్నో, జోధ్‌పూర్ - అహ్మదాబాద్ (సబర్మతి) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.
గోరఖ్‌పూర్ - లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అయోధ్య మీదుగా ప్రయాణిస్తుంది. ఇది రాష్ట్రంలోని ముఖ్య నగరాలకు అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. పర్యాటక రంగానికి మరింత ఊతం ఇస్తుంది. జోధ్‌పూర్ - సబర్మతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ జోధ్‌పూర్, అబూ రోడ్, అహ్మదాబాద్ వంటి ప్రముఖ ప్రదేశాలకు మెరుగైన అనుసంధానం అందిస్తుంది. ఇది ఆ ప్రాంత సామాజిక, ఆర్థిక అభివృద్ధిని పెంచుతుంది.
గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ స్టేషన్‌ను దాదాపు రూ. 498 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి చేస్తారు. ఇది ప్రయాణీకులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సౌకర్యాలను అందిస్తుంది.
వారణాసిలో ప్రధాని
వారణాసిలో జరిగే బహిరంగ కార్యక్రమంలో రూ. 12,100 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ - సోన్ నగర్ డెడికేటెడ్ రవాణా కారిడార్ రైలు మార్గాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. రూ. 6,760 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ కొత్త లైన్ వస్తువుల వేగవంతమైన, సమర్థవంతమైన రవాణాను సులభతరం చేస్తుంది. రూ. 990 కోట్లకు పైగా వ్యయంతో విద్యుద్దీకరణ/ డబ్లింగ్ పనులు పూర్తి అయిన మూడు రైల్వే లైన్లను కూడా ప్రధానమంత్రి దేశానికి అంకితం చేస్తారు. వీటిలో ఘాజీపూర్ సిటీ - ఔన్రిహార్ రైల్వే లైన్, ఔన్రిహార్ జౌన్‌పూర్ - రైల్వే లైన్, భట్నీ–ఔన్రిహార్ రైల్వే లైన్ ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ఉత్తరప్రదేశ్‌లో రైల్వే మార్గాల 100 శాతం విద్యుదీకరణ సాధించడంలో దోహదపడ్డాయి.
జాతీయ రహదారి 56 లో రూ. 2,750 కోట్లకు పైగా వ్యయంతో నాలుగు వరసలుగా విస్తరించిన వారణాసి-జౌన్‌పూర్ సెక్షన్ ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్ట్ వారణాసి నుంచి లక్నోకు ప్రయాణాన్ని సులభంగా, వేగంగా మారుస్తుంది.
వారణాసిలో ప్రధానమంత్రి ప్రారంభించే పలు ప్రాజెక్టులలో - 18 పీడబ్ల్యూడీ రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణ; బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆవరణలో అంతర్జాతీయ బాలికల హాస్టల్ భవనం; కర్సరలో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) వృత్తి శిక్షణా కేంద్రం; సింధౌరా పోలీస్ స్టేషన్, పీఏసీ భుల్లన్‌పూర్, పింద్రా అగ్నిమాపక కేంద్రం, తర్సాడా ప్రభుత్వ రెసిడెన్షియల్ నివాస పాఠశాలలో నివాస భవనాలు, సౌకర్యాలు; ఆర్థిక నేరాల పరిశోధనా సంస్థ భవనం; మోహన్ కట్రా నుంచి కోనియా ఘాట్ వరకు మురుగునీటి పైపులైన్, రామ్నా గ్రామంలో ఆధునిక సెప్టేజ్ నిర్వహణ వ్యవస్థ; 30 డబుల్-సైడెడ్ బ్యాక్‌లిట్ ఎల్ఈడీ యూనీపోల్స్; ఎన్డీడీబీ (ఎన్డీడీబీ) మిల్క్ ప్లాంట్, రామ్‌నగర్‌లో ఆవు పేడ ఆధారిత బయో గ్యాస్ ప్లాంట్; దశాశ్వమేధ్ ఘాట్ వద్ద గంగానదిలో భక్తులు స్నానం చేయడానికి సౌకర్యంగా ఉండేలా, ప్రత్యేకమైన తేలియాడే దుస్తులు మార్చుకునే గదులతో కూడిన జెట్టి ఉన్నాయి.
ప్రధానమంత్రి శంకుస్థాపన చేసే ప్రాజెక్టులలో - చౌఖండి, కదిపూర్, హరదత్తాపూర్ రైల్వే స్టేషన్ల సమీపంలో 3 రెండు వరుసల రైల్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం; వ్యాస్ నగర్ - పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం; 15 పీడబ్ల్యూడీ రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణ ఉన్నాయి. ఈ ప్రాజెక్టులను సుమారు రూ. 780 కోట్ల వ్యయంతో చేపడుతున్నారు.
జల్ జీవన్ మిషన్ కింద, రూ. 550 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్న 192 గ్రామీణ తాగునీటి పథకాలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ పథకాల ద్వారా 192 గ్రామాలలో 7 లక్షల మంది ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందుబాటులోకి వస్తుంది.
మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్‌ల పునర్‌రూపకల్పన, పునరాభివృద్ధికి కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. పునరాభివృద్ధి చేసిన ఈ ఘాట్‌లలో మరుగుదొడ్లు, వేచి ఉండే ప్రాంతాలు, కలప నిల్వ, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ అనుకూల దహన సంస్కార చితుల ఏర్పాటు ఉంటాయి.
దశాశ్వమేధ ఘాట్‌లోని తేలియాడే వస్త్రాలు మార్చుకునే జెట్టీల తరహాలో, వారణాసిలోని గంగానదిపై మతపరంగా ప్రాధాన్యం ఉన్న ఆరు స్నాన ఘట్టాల వద్ద తేలియాడే వస్త్రాలు మార్చుకునే జెట్టీల ఏర్పాటు, కర్సరలోని సీఐపీఈటీ ప్రాంగణంలో విద్యార్థుల హాస్టల్ నిర్మాణం వంటి ఇతర ప్రాజెక్టులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు.
ఈ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్‌లోని లబ్ధిదారులకు పీఎం స్వనిధి రుణాలను, పీఎంఏవై గ్రామీణ గృహాల తాళం చెవులను, ఆయుష్మాన్ భారత్ కార్డులను కూడా పంపిణీ చేస్తారు. దీని ద్వారా ఐదు లక్షలమంది పీఎంఏవై లబ్ధిదారుల గృహ ప్రవేశం, అర్హులైన 1.25 లక్షల మందికి పీఎం స్వనిధి రుణాల పంపిణీ, 2.88 కోట్ల ఆయుష్మాన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి.
వరంగల్ లో ప్రధాని
తెలంగాణలో పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సుమారు రూ. 6,100 కోట్ల విలువైన అనేక కీలక మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.
రూ. 5,550 కోట్లకు పైగా విలువైన 176 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇందులో నాగపూర్ - విజయవాడ కారిడార్‌లో భాగమైన 108 కిలోమీటర్ల మంచిర్యాల - వరంగల్ సెక్షన్ కూడా ఉంది. ఈ సెక్షన్ మంచిర్యాల, వరంగల్ మధ్య దూరాన్ని సుమారు 34 కిలోమీటర్లు తగ్గిస్తుంది. తద్వారా ప్రయాణ సమయం తగ్గుతుంది. ఎన్హెచ్-44, ఎన్హెచ్-65 పై రద్దీ తగ్గుతుంది. అంతేకాక, 68 కిలోమీటర్ల కరీంనగర్ - వరంగల్ సెక్షన్ (ఎన్హెచ్-563) ను ప్రస్తుతం ఉన్న రెండు వరుసల నుంచి నాలుగు వరుసల విస్తరణకు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఇది హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, వరంగల్‌లోని ఎస్ఈజెడ్లకు మెరుగైన అనుసంధానం అందించడానికి తోడ్పడుతుంది.
కాజీపేటలో రైల్వే తయారీ యూనిట్‌కు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. రూ. 500 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేయనున్న ఈ ఆధునిక తయారీ యూనిట్ మెరుగైన రోలింగ్ స్టాక్ ఉత్పాదక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది వ్యాగన్‌ల రోబోటిక్ పెయింటింగ్, అత్యాధునిక యంత్రాలు, ఆధునిక సామగ్రి నిల్వ, నిర్వహణ వంటి తాజా సాంకేతిక ప్రమాణాలు, సౌకర్యాలతో కూడిన ప్లాంట్‌ను కలిగి ఉంటుంది. ఈ యూనిట్ స్థానిక ఉద్యోగాల కల్పనకు, సమీప ప్రాంతాలలో అనుబంధ యూనిట్ల అభివృద్ధికి దోహదపడుతుంది.
బికనీర్‌లో ప్రధానమంత్రి
రాజస్థాన్ లోని బికనీర్‌లో ఆ ప్రాంత మౌలిక సదుపాయాలు, సంక్షేమాన్ని మెరుగుపరిచే రూ. 24,300 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతికి అంకితం చేస్తారు, కొన్నింటికి శంకుస్థాపన చేస్తారు.
అమృత్‌సర్ - జామ్‌నగర్ ఆర్థిక కారిడార్‌లో భాగమైన ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే విభాగాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. రాజస్థాన్‌లో 500 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఈ విభాగం, హనుమాన్‌గఢ్ జిల్లాలోని జాఖ్‌డవాలి గ్రామం నుంచి జలోర్ జిల్లాలోని ఖేత్రావాస్ గ్రామం వరకు ఉంటుంది. దీని నిర్మాణం కోసం సుమారు రూ. 11,125 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ప్రధాన నగరాలు, పారిశ్రామిక కారిడార్ల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే సరకుల రవాణాను సులభతరం చేయడమే కాకుండా, మార్గ మధ్య ప్రాంతాల్లో పర్యాటకం, ఆర్థిక అభివృద్ధిని కూడా పెంచుతుంది.
ప్రాంతీయ విద్యుత్ రంగానికి మరింత ప్రోత్సాహం ఇస్తూ, సుమారు రూ. 10,950 కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ కారిడార్ కోసం ఉద్దేశించిన అంతర్ రాష్ట్ర ట్రాన్స్‌మిషన్ లైన్ మొదటి దశను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. ఈ గ్రీన్ ఎనర్జీ కారిడార్ సుమారు ఆరు గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని గ్రిడ్ కు అనుసంధానం చేస్తుంది. పశ్చిమ ప్రాంతంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తితోనూ, ఉత్తర ప్రాంతంలో జలవిద్యుత్ ఉత్పత్తితోనూ పునరుత్పాదక విద్యుత్తును సమతూకం చేయడంలో ఈ గ్రిడ్ సహాయపడుతుంది. తద్వారా ఉత్తర ప్రాంతం, పశ్చిమ ప్రాంతం మధ్య ప్రసార సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. బికనీర్ - భివాడి ట్రాన్స్‌మిషన్ లైన్‌ను కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. పవర్ గ్రిడ్ సంస్థ సుమారు రూ. 1,340 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్న బికనీర్ - భివాడి ట్రాన్స్‌మిషన్ లైన్ రాజస్థాన్‌లో 8.1 గిగావాట్ల సౌర విద్యుత్‌ను తరలించడానికి సహాయపడుతుంది.
బికనీర్‌లో కొత్త 30 పడకల ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ (ఈఎస్ఐసీ)ఆసుపత్రిని ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. ఈ ఆసుపత్రి సామర్థ్యాన్ని 100 పడకల వరకు పెంచే అవకాశం ఉంది. ఈ ఆసుపత్రి స్థానిక సమాజ ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీరుస్తూ, అందుబాటు ధరలో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించేందుకు ఒక ముఖ్యమైన వైద్య కేంద్రంగా పనిచేస్తుంది.
బికనీర్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. సుమారు రూ. 450 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్న ఈ పునరాభివృద్ధి పనుల్లో భాగంగా రైల్వే స్టేషన్ ప్రస్తుత భవనం వారసత్వ హోదాను పరిరక్షిస్తూ, అన్ని ప్లాట్‌ఫారమ్‌ల అన్ని ప్లాట్‌ఫారమ్‌ల పునరుద్ధరణతో పాటు ఫ్లోరింగ్ , సీలింగ్ ఆధునికీకరణ పనులను కూడా చేపడతారు.
43 కిలోమీటర్ల పొడవైన చురు - రతన్‌గఢ్ సెక్షన్ రైల్వే లైన్ డబ్లింగ్‌కు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ రైల్వే లైన్ డబ్లింగ్ వల్ల అనుసంధానం మెరుగుపడుతుంది. అలాగే, బికనీర్ ప్రాంతం నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు జిప్సం, సున్నపురాయి, ఆహార ధాన్యాలు, ఎరువుల ఉత్పత్తుల రవాణా సులభతరం అవుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2204506)
సందర్శకుల సూచీ సంఖ్య : : 24
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Urdu
,
Odia
,
Assamese
,
English
,
Marathi
,
हिन्दी
,
Nepali
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam