|
ప్రధాన మంత్రి కార్యాలయం
రెండు దశాబ్దాల ‘వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్’ సంస్మరణ సభలో ప్రధానమంత్రి ప్రసంగం
प्रविष्टि तिथि:
27 SEP 2023 3:27PM by PIB Hyderabad
వేదికను అలంకరించిన గుజరాత్ గవర్నర్ ఆచార్య శ్రీ దేవవ్రత్, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, పార్లమెంటులో నా సహచరుడు-బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శ్రీ సి.ఆర్.పాటిల్, రాష్ట్ర మంత్రులు, పారిశ్రామిక ప్రపంచ అగ్రగాములు, ఇతర ప్రముఖులు, కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులారా! మనం 20 ఏళ్ల కిందట ‘వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్’ పేరిట ఓ చిన్న విత్తనం నాటాం.. అది నేడు ఊడలు పరచుకుని, శక్తిమంతమైన మహా వటవృక్షంగా విస్తరించింది. ఈ కార్యక్రమానికి రెండు దశాబ్దాలు పూర్తయిన నేపథ్యంలో నిర్వహిస్తున్న సభలో ఇవాళ మీతో మమేకం కావడం నాకెంతో సంతోషాన్నిస్తోంది. నాకు గుర్తున్నంత మేరకు- కొన్నేళ్ల కిందట వైబ్రంట్ గుజరాత్ ఒక బ్రాండింగ్‌కు పరిమితమైనది కాదని, ఇదొక అనుబంధం ఏర్పరచే కార్యక్రమమని చెప్పాను. విజయవంతమైన ఈ శిఖరాగ్ర సమావేశం ప్రపంచానికి ఒక బ్రాండ్‌గా కనిపించవచ్చు. కానీ, నాకు మాత్రం ఇదొక బలమైన బంధానికి ప్రతీక. గుజరాత్‌లోని 7 కోట్ల మంది పౌరులు-వారి సామర్థ్యాలతో నాకున్న అనుబంధం. నా మీద వారి అవ్యాజ ప్రేమానురాగాలపై ఆధారపడిన సంబంధం.
మిత్రులారా!
ఏ మహత్కార్యమైనా మూడు దశల్లో సాగాలని స్వామి వివేకానంద చెప్పిన మాటలు నాకు ఈ రోజు గుర్తుకొస్తున్నాయి. తొలిదశలో... ప్రత్యేకించి మన ఆలోచనలకు కాలంకన్నా ముందున్నపుడు కొందరు హేళన చేస్తారు... అవి ఆచరణ రూపం దాల్చాక మలిదశలో వ్యతిరేకిస్తారు.. అంతిమంగా అంగీకరిస్తారని ఆయన ప్రవచించారు. ఇక 20 ఏళ్లకుముందు... 2001నాటి పెను భూకంపం తర్వాత గుజరాత్‌లో నెలకొన్న బీభత్స పరిస్థితుల గురించి నేటి యువతరానికి తెలియకపోవచ్చు. వాస్తవానికి భూకంపం సంభవించక ముందు కూడా గుజరాత్ చాలాకాలం తీవ్ర కరువును ఎదుర్కొంటూ వచ్చింది. అటుపైన భూకంపం వేలాది ప్రజానీకాన్ని బలిగొన్నది. లక్షలాదిగా జనం సర్వం కోల్పో్యి వీధుల పాలయ్యారు. ఆ సమయంలో కరువులు, భూకంపం కాకుండా మరో పెద్ద దుర్ఘటన కూడా రాష్ట్రంలో చోటుచేసుకుంది. అదేమిటంటే- మాధవపురా మర్కంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ కుప్పకూలింది. దీనివల్ల మరో 133 సహకార బ్యాంకులు ప్రభావితమై, ఒక విధంగా యావత్ గుజరాత్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అప్పట్లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నేను ముఖ్యమంత్రి బాధ్యతను స్వీకరించాల్సి వచ్చింది. ఆ పాత్ర నాకు కొత్త.. ప్రభుత్వాన్ని నడిపించిన అనుభవం లేదు.. కానీ, నాటి పరిస్థితులు నాకొక పెను సవాలు. ఇది చాలదన్నట్లు గోద్రా హృదయవిదారక దుర్ఘటన మరొక ఉత్పాతంలా తాకింది. అనంతర పరిస్థితులలో గుజరాత్‌లో హింసా జ్వాలలు చెలరేగగా, అంతటి దారుణ స్థితిని ఎవరూ ఊహించలేదు. ముఖ్యమంత్రిగా నాకు పెద్దగా అనుభవం లేకపోయినా ఈ రాష్ట్రంపైనా, ప్రజల మీదా నాకు అచంచల విశ్వాసం ఉంది. అయితే, ఒక దుష్ట యోచనను మోస్తున్న వారు అలాంటి క్లిష్ట సమయంలోనూ నాటి సంఘటనలను తమదైన శైలిలో విశ్లేషిస్తూ పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నారు. గుజరాత్ నుంచి యువత.. పరిశ్రమలు.. వ్యాపారవేత్తలు మొత్తం వెళ్లిపోవడం ఖాయమని, గుజరాత్ నాశనమై.. దేశానికి పెనుభారం కాగలదని జోస్యం చెప్పారు. ప్రపంచం ముందు గుజరాత్‌ను అప్రతిష్ఠ పాల్జేసే కుట్ర పన్నారు. ప్రజల హృదయాల్లో నిరాశానిస్పృహల సృష్టికి ప్రయత్నించారు. గుజరాత్ ఎప్పటికీ తన కాళ్లపై తాను నిలవజాలదని దుష్ప్రచారం చేశారు. అంతటి సంక్షోభంలోనూ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, గుజరాత్‌ను గట్టెక్కించాలని నేను కృతనిశ్చయం పూనాను. గుజరాత్ పునర్నిర్మాణం గురించి మాత్రమేగాక దాని భవిష్యత్తుపైనా ఆలోచన చేశాం. ఆ దిశగా ‘వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్’ను ఓ కీలక మాధ్యమంగా రూపొందించాం. గుజరాత్ ఆత్మవిశ్వాసం ఇనుమడించడమే కాకుండా తద్వారా ప్రపంచంతో ప్రత్యక్షంగా సంబంధాలకూ అదొక మార్గంగా రూపొందింది. గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాత్మక ప్రక్రియలు, నిశిత విధానాలను యావత్ ప్రపంచానికీ ప్రదర్శించే ఉపకరణంగా మారింది. గుజరాత్ సహా భారత పారిశ్రామిక రంగ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటేందుకు ఇదొక మాధ్యమమైంది. దేశంలోని వివిధ రంగాల్లోగల అపార అవకాశాలను కళ్లకు కట్టడానికీ మాధ్యమంగా మారింది. భారత ప్రతిభను సద్వినియోగం చేసుకునే మాధ్యమంగా మారింది. అలాగే, ప్రపంచం ముందు భారత్ వైభవం, ప్రతిష్ఠ, సాంస్కృతిక వారసత్వాల ప్రదర్శనకు మరొక మాధ్యమంగా మారింది. మేమెంత సన్నిహితంగా కృషి చేశామో వైబ్రంట్ గుజరాత్ నిర్వహణ సమయం కూడా నిరూపిస్తుంది. ఎలాగంటే- రాష్ట్రంలో ఒకవైపు నవరాత్రి, గర్బా వేడుకలు జోరుగా సాగుతున్నపుడు ‘వైబ్రంట్ గుజరాత్’ను పారిశ్రామిక పండుగలా వాటిలో భాగం చేశాం.
మిత్రులారా!
మీకందరికీ ఇవాళ నేను మరో విషయం గుర్తుచేస్తున్నాను... ఇప్పటికి 20 ఏళ్లు గడిచిపోయినా అన్ని రకాల తీపి-చేదు జ్ఞాపకాలు మెదలుతూనే ఉండటం సహజం. ప్రపంచం ఈ రోజున వైబ్రంట్ గుజరాత్ విజయాన్ని చూస్తోంది కానీ, అప్పటి కేంద్ర ప్రభుత్వం కూడా గుజరాత్ అభివృద్ధిపై ఉదాసీనత ప్రదర్శించింది. ఇటువంటి వాతావరణం నడుమ వైబ్రంట్ గుజరాత్ కార్యక్రమం నిర్వహించాం. గుజరాత్ రాష్ట్రం దేశాభివృద్ధికీ దోహదం చేస్తుందని నేనెప్పుడూ చెబుతూనే వచ్చాను. కానీ, ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిన వారు కూడా గుజరాత్ ప్రగతికి రాజకీయాలతో ముడిపెట్టారు. కాబట్టే, ‘వైబ్రంట్ గుజరాత్’కు ఆహ్వానిస్తే, కచ్చితంగా హాజరవుతామని కేంద్ర మంత్రులు వ్యక్తిగతంగా చెప్పినా, తర్వాత ఉన్నతాధికారుల ఒత్తిడితో గైర్హాజరయ్యే వారు. సహకరించే మాట అటుంచి, అడ్డంకుల సృష్టికి ముమ్మర వ్యూహాలు పన్నేవారు. గుజరాత్‌కు వెళ్లవద్దని విదేశీ పెట్టుబడిదారులను బెదిరించారు. ఎంతగా బెదిరించినా విదేశీ పెట్టుబడిదారులు గుజరాత్‌కు వచ్చారు. అయితే, వారికి మేమెలాంటి ప్రత్యేక ప్రోత్సాహకాలివ్వలేదు. వారు దైనందిన జీవితంలో విధానాధారిత, నిష్పాక్షిక, సమదృష్టి సమన్విత, సమాన వృద్ధి, పారదర్శక సుపరిపాలనను అనుభవించారు కాబట్టే, వారిక్కడికే వచ్చేవారు. ‘వైబ్రంట్ గుజరాత్’ ప్రారంభమైన నాడు అంతమంది విదేశీ అతిథుల బసకు తగిన సదుపాయాలు.. అంటే- పెద్ద హోటళ్లు లేవని ఊహించడం కష్టమేమీ కాదు. దీంతో ప్రభుత్వ అతిథి గృహాలన్నీ నిండిపోయాక, వారికి బస ఎలాగన్నది మా ముందున్న ప్రధాన ప్రశ్న. అలాంటి పరిస్థితిలో- వ్యాపార సంస్థల అతిథి గృహాలను కేటాయించాలని నేను అభ్యర్థించాను. చివరకు మేమిక్కడి విశ్వవిద్యాలయాల అతిథి గృహాలను కూడా ఉపయోగించుకున్నాం. కొందరు బరోడాలో కూడా బస చేయాల్సి వచ్చింది.
మిత్రులారా!
మేం 2009లో ‘వైబ్రంట్ గుజరాత్’ నిర్వహించినపుడు ప్రపంచంలో ఆర్థిక మాంద్యం నెలకొన్న సంగతి నాకిప్పటికీ గుర్తుంది. ఈ కారణంగా వైబ్రంట్ గుజరాత్‌ను వాయిదా వేస్తే మంచిదని మా అధికారులు సహా అందరూ సూచిస్తున్నారు. ఎవరూ హాజరు కాకపోతే వైఫల్యం తప్పదని వారు భావించారు. కానీ, నేనెంత మాత్రం సందేహించ లేదు. “లేదు.. ఇది ఆగదు.. నిర్వహించి తీరుతాం.. ఇది విఫలమైనా, విమర్శలు వచ్చినా ఈ కార్యక్రమ నిర్వహణ క్రమం తప్పకూడదు” అని స్పష్టం చేశాను. ప్రపంచం ఆర్థిక మాంద్యం గుప్పిట్లో విలవిలలాడుతున్నా, ‘సమ్మిట్’ నిర్వహించడమే కాదు... దానికో కొత్త అధ్యాయాన్ని విజయవంతంగా జోడించాం.
మిత్రులారా!
వైబ్రంట్ గుజరాత్ విజయాన్ని దాని ప్రగతి పయనం రూపంలోనూ అవగతం చేసుకోవచ్చు. తొలిసారి 2003లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది భాగస్వాములు, ప్రతినిధులు పాల్గొన్నారు. నాటి ఆ కార్యక్రమ స్థాయి చాలా స్వల్పం కాగా, నేటి ఈ సదస్సులో 40,000 మందికి పైగా భాగస్వాములు, ప్రతినిధులు పాల్గొన్నారు. తొలి సదస్సులో కొన్ని దేశాలు మాత్రమే పాలు పంచుకోగా, నేడు 135 దేశాలు పాల్గొంటున్నాయి. ఇక 2003లో దాదాపు 30 మంది ఎగ్జిబిటర్లు రాగా, ఇప్పుడు 2000 మందికి పైగా వస్తున్నారు.
మిత్రులారా!
ఈ విజయానికి దోహదం చేసిన కారణాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా... ఆలోచన, అంచనా, అమలు ప్రధానాంశాలు. ఆలోచన గురించి ప్రస్తావిస్తే- ‘వైబ్రంట్ గుజరాత్’ అనేది ఓ ప్రత్యేక భావన. ఆనాడు దేశంలో ఈ మాట విన్నవారు చాలా తక్కువమందే ఉంటారు. కాలక్రమేణా అది సాధించిన విజయంతో దాని ప్రాధాన్యమేమిటో అందరికీ అర్థమైంది. కొంతకాలం గడిచాక ఇతర రాష్ట్రాలు కూడా వ్యాపారాలు, పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఇలాంటి శిఖరాగ్ర సదస్సుల నిర్వహణకు శ్రీకారం చుట్టాయి. రెండో కీలకాంశం- అంచనా... ఆ రోజుల్లో మేము విభిన్నంగా ఆలోచించే సాహసం చేశాం. రాష్ట్ర స్థాయిలోనే కాదు.. జాతీయ స్థాయిలోనూ అలాంటి కార్యక్రమ నిర్వహణ దాదాపు అసాధ్యం. కానీ, ఒక చిన్న రాష్ట్రం ప్రపంచ దేశాలతో భాగస్వామ్యానికి ధైర్యం చేసింది. ఆనాటి ఆలోచన ఈనాడు వింతగా అనిపించవచ్చు... ఇంత పెద్ద దేశంలోని ఓ రాష్ట్రానికి ఇదో బృహత్కార్యమే అయినా, మా నిర్వహణ సామర్థ్యాన్ని ఆచరణాత్మకంగా రుజువు చేశాం.
మిత్రులారా!
ఆలోచన.. అంచనాలు ఎంత గొప్పవైనా, వ్యవస్థ మొత్తాన్నీ సమీకరించడం, ఫలితాలు రాబట్టడం అత్యంత ప్రధానం. ఇంత భారీ స్థాయిలో క్ష కార్యక్రమాన్ని నిర్వహించడానికి- విస్తృత ప్రణాళిక, సామర్థ్య వికాసంపై దృష్టి, ప్రతి చిన్న అంశంపైనా శ్రద్ధ, నిర్విరామ కృషి అవశ్యం. వెనక్కులాగిన యంత్రాంగం గురించి ఇంతకుముందే చెప్పాను... కానీ, అదే అధికారులు, వనరులు, నిబంధనలతో ఎవరూ.. ఎన్నడూ ఊహించని మహత్కార్యాన్ని మేం పూర్తిచేశాం!
మిత్రులారా!
వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌కు మరో గుర్తింపు ఉంది... అదేమిటంటే- ఒకనాటి కార్యక్రమ స్థాయి నుంచి నేడు ప్రభుత్వం లోపల... వెలుపల ఏడాది పొడవునా, స్వయంచలితంగా కొనసాగే వ్యవస్థగా ఇది రూపొందింది. ముఖ్యమంత్రులు మారడమే కాకుండా, నాటి అధికారులలో ఎందరో ఉద్యోగ విరమణ చేశారు. ఉద్యోగ జీవితారంభంలో తొలిసారి 2001లో గుజరాత్‌లో బాధ్యతలు స్వీకరించిన అధికారులు ఇవాళ సీనియర్ అధికారులయ్యారు. కాలం ఎంతగానో మారిపోయింది... కానీ, మారనిది ఒకటే- ఏటా వైబ్రంట్ గుజరాత్ విజయ శిఖరాలను అందుకుంటూనే ఉంది. ప్రక్రియల సంస్థాగతీకరణ వల్ల ఇది సాధ్యం కావచ్చుగానీ, స్థిరంగా విజయపథంలో సాగటానికి కారణం ఈ బలమే. ఈ దిశగా మౌలిక సదుపాయాలకూ అదే ప్రాధాన్యం ఇచ్చాం. కొన్ని సందర్భాల్లో ఈ కార్యక్రమాలు ఠాగూర్ హాల్‌లో, మరికొన్ని సార్లు సైన్స్ సిటీలో టెంట్లతో నిర్వహించగా, ఇవాళ మహాత్మా మందిర్ అందుకు వేదికగా మారింది.
మిత్రులారా!
వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌ను మేం నడిపించిన స్ఫూర్తి దేశంలో చాలా అరుదు. గుజరాత్‌లో నిర్వహించే ఈ సదస్సు ద్వారా ప్రతి రాష్ట్రానికీ ప్రయోజనం చేకూర్చాలని మేం భావించాం. అయితే, నేటికీ మా ఆలోచనలను అర్థం చేసుకోగలిగిన వారి సంఖ్య స్వల్పమే. వారు తమ సొంత పరిధిలో ముడుచుకు కూర్చున్నారు. అలాంటి సమయంలో మీరు కూడా స్టాళ్లు ఏర్పాటు చేసుకోవచ్చునని, సెమినార్లు నిర్వహించవచ్చునని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు గుజరాత్ ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. రాష్ట్రాలను ఆహ్వానించి, తమ శక్తిసామర్థ్యాలను చాటుకుంటూ ప్రయోనం పొందాల్సిందిగా సూచించాం. మేం రాష్ట్రాల స్థాయి సదస్సు నిర్వహించినపుడు అనేక రాష్ట్రాలు వచ్చాయి. అదే తరహాలో వైబ్రంట్ సమ్మిట్ సమయంలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, హర్యానా లేదా జమ్మూకాశ్మీర్ కూడా సదస్సులు నిర్వహిస్తున్నాయి. ఇక గుజరాత్‌లో జాతీయ ఆయుర్వేద శిఖరాగ్ర సదస్సు, ప్రగతిశీల భాగస్వాముల భారీ సదస్సు, అఖిల భారత న్యాయవాదుల సదస్సు వంటివి నిర్వహించాం. ఈ విధంగా రకరకాల సదస్సులను మేం నిర్వహిస్తూ వచ్చాం. అందులో భాగంగానే జాతీయ దృష్టితో గుజరాత్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నాం.
మిత్రులారా!
ఇరవయ్యో శతాబ్దంలో గుజరాత్ గుర్తింపు ఏమిటి? ఒకచోట ఉత్పత్తుల కొనుగోలు, మరొక చోట విక్రయం చేసే వర్తక రాష్ట్రంగా పరిగణనలో ఉండేది. ఈ లావాదేవీల ద్వారా లభించే కమిషన్‌పైనే వారి జీవనం ఆధారపడి ఉండేది. అప్పట్లో మన స్వరూపస్వభావాలివే... కానీ, దాన్ని పక్కనబెడితే 21వ శతాబ్దంలో వాణిజ్యంతోపాటు వ్యవసాయ, ఆర్థిక కేంద్రకంగానే కాకుండా పారిశ్రామిక-తయారీ వ్యవస్థగా ఈ రాష్ట్రం తన గుర్తింపును విస్తరింపజేసుకుంది. గుజరాత్ వర్తకాధారిత ప్రతిష్ఠ కూడా ఎంతో బలం పుంజుకుంది. వీటన్నిటి వెనుక ఆలోచనలు, ఆవిష్కరణలు, పరిశ్రమలకు పునాది వంటి వైబ్రంట్ గుజరాత్ తరహా కార్యక్రమాల విజయం ఉంది. ఇలాంటి విజయగాథలు, ఉదాహరణలు గత 20 ఏళ్ల నుంచి మనకెన్నో ఉన్నాయి. సమర్థ విధాన రూపకల్పన, ప్రాజెక్టు అమలుతోనే ఇదంతా సాకారమైంది. వస్త్ర-దుస్తుల పరిశ్రమలలో పెట్టుబడులు, ఉపాధిలో అపార పెరుగుదల నమోదయ్యాయి. దీంతో ఎగుమతులలోనూ కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. గడచిన రెండు దశాబ్దాలుగా అనేక రంగాల్లో మనం ఉన్నత శిఖరాలను అధిరోహించాం. ఆ మేరకు 2001తో పోలిస్తే ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులు దాదాపు 9 రెట్లు, తయారీ రంగంలో ఉత్పాదన 12 రెట్లు పెరుగుదల నమోదైంది. ఇక రసాయన రంగంలో జాతీయంగా, అంతర్జాతీయంగా అనేక కంపెనీలకు గుజరాత్ ప్రధానమైనదిగా మారింది. తదనుగుణంగా జాతీయంగా రంగులు-ఇంటర్మీడియరీ ఉత్పత్తుల తయారీలో గుజరాత్ వాటా దాదాపు 75 శాతంగా ఉంది.
జాతీయ వ్యవసాయ, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలో గుజరాత్ వాటాయే అత్యధికం. రాష్ట్రంలో ఇప్పుడు 30,000కుపైగా ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు పనిచేస్తున్నాయి. అలాగే ఔషధ రంగంలో ఆవిష్కరణ చోదక, జ్ఞాన కేంద్రక ఫార్మా పరిశ్రమకు నిలయంగా గుజరాత్ పురోగమిస్తోంది. వైద్య పరికరాల తయారీలో 50 శాతానికి పైగా, కార్డియాక్ స్టెంట్ల తయారీలో దాదాపు 80 శాతం వాటా గుజరాత్‌దే. రత్నాలు, వజ్రాభరణాల పరిశ్రమలో గుజరాత్ విజయం అత్యంత అద్భుతం. అంతర్జాతీయ వజ్రశుద్ధి ప్రక్రియ రీత్యా గుజరాత్ వాటా 70 శాతానికి పైగా ఉంటుంది. అలాగే దేశం నుంచి వజ్రాల ఎగుమతిలో గుజరాత్ వాటా 80 శాతంగా ఉంది. జాతీయ పింగాణీ మార్కెట్‌లో గుజరాత్‌లోని ఒక్క మోర్బీ ప్రాంతానికి 90 శాతం వాటా ఉంది. ఈ రాష్ట్రంలో సిరామిక్ టైల్స్, శానిటరీ ఉత్పత్తులు, వివిధ పింగాణీ ఉత్పత్తుల తయారీ యూనిట్లు దాదాపు 10,000 దాకా ఉన్నాయి. దేశం నుంచి పింగాణీ ఉత్పత్తుల ఎగుమతిలోనూ సహజంగా గుజరాత్ అగ్రస్థానంలో నిలిచింది. నిరుడు రాష్ట్రం నుంచి వివిధ ఉత్పత్తుల ఎగుమతుల విలువ సుమారు 200 కోట్ల డాలర్లకు పైమాటే! రాబోయే కాలంలో రక్షణ తయారీలోనూ గుజరాత్ ప్రధాన భూమిక పోషించగలదు.
మిత్రులారా!
వైబ్రంట్ గుజరాత్ కార్యక్రమం ప్రారంభించినపుడు ఈ రాష్ట్రం దేశ ప్రగతికి వృద్ధి చోదకంగా రూపొందాలన్నది మా లక్ష్యం. నేనేమంటున్నానో మీకు అర్థమైందా? ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు నాకొక దార్శనికత ఉంది... అదేమిటంటే దేశ పురోగమనానికి గుజరాత్ సారథ్యం వహించగలదని విశ్వసించాం. ఈ విషయాన్ని కొంతమంది అర్థం చేసుకుని ఉంటారని భావిస్తున్నాను. ఈ దార్శనికత వాస్తవంగా రూపుదాల్చడాన్ని దేశం చూసింది. అటుపైన 2014లో దేశానికి సేవ చేసే అవకాశం లభించినప్పుడు, నా లక్ష్యం కూడా విస్తరించింది. ఆ మేరకు భారత్‌ను యావత్ ప్రపంచానికి వృద్ధి చోదకంగా మార్చడమే మా ధ్యేయం. అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు, నిపుణుల గళం కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచంలో శరవేగంగా పురోగమించే ఆర్థిక వ్యవస్థగా అంతర్జాతీయ ఆర్థిక శక్తి కూడలిగా మారే మార్గంలో భారత్ నేడు కీలక మలుపును చేరింది. ఇప్పుడు ప్రపంచానికి భారత్ హామీ... మీకు నా వాగ్దానం.. కొన్నేళ్లలోనే భారత్ ప్రపంచ తొలి 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలవడం మీరు ప్రత్యక్షంగా చూస్తారు. అందుకే, ఇవాళ ఈ కార్యక్రమానికి హాజరైన భారత పారిశ్రామికులకు, అతిథులకు నాదొక విజ్ఞప్తి. భారత్ తనకంటూ కొత్త అవకాశాలను సృష్టించుకోగల లేదా తన స్థానాన్ని మరింత ఉన్నతీకరించగల రంగాల గురించి మీరంతా యోచించాలి. అలాగే ఈ లక్ష్యానికి వైబ్రంట్ గుజరాత్ ఏ విధంగా ఉత్తేజమివ్వగలదో కూడా మనం ఆలోచించాలి. సుస్థిరత విషయంలో భారత్ నేడు ప్రపంచ సారథ్యం వహిస్తున్న తీరులోనే మన అంకురావరణ వ్యవస్థ ఈ శిఖరాగ్ర సదస్సు నుంచి గరిష్ఠ ప్రయోజనాలను పొందగలగడంపైనా మనం దృష్టి సారించాలి. వ్యవసాయ సాంకేతికత ఇవాళ ఒక పురోగమన రంగం. ఆహార ప్రాసెసింగ్ రంగం కూడా వేగంగా విస్తరిస్తోంది. శ్రీ అన్న (చిరుధాన్యాల) వాడకం పెరుగుతున్న నేపథ్యంలో మన చిరు ధాన్యాలు నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజల నిత్యాహారంలో సగర్వంగా దర్శనమిస్తున్నాయి. దీనివల్ల కొత్త అవకాశాల సృష్టి సహా ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, ప్రపంచ మార్కెట్‌కు చేర్చే మార్గాల్లో మార్పులు అనేక కొత్త అవకాశాలకు బాటలు వేశాయి.
ప్రపంచవ్యాప్తంగా అనుసంధానం కొత్త ఎత్తులకు చేరుతున్న నేటి పరిస్థితులలో ఆర్థిక సహకార సంస్థల అవసరం కూడా వేగంగా పెరుగుతోంది. తదనుగుణంగా గుజరాత్‌లోగల ‘గిఫ్ట్ సిటీ’ ఔచిత్యం నానాటికీ పెరుగుతోంది. ఇది మన ఏకోన్ముఖ ప్రభుత్వ విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ కేంద్రం, రాష్ట్రం, ‘ఐఎఫ్‌ఎస్‌సి’ అధికారులు ప్రపంచంలోనే అత్యుత్తమ నియంత్రణ వాతావరణ సృష్టికి సంయుక్తంగా కృషి చేస్తున్నారు. దీన్నిప్పుడు ప్రపంచవ్యాప్త పోటీతత్వ ఆర్థిక మార్కెట్‌గా మార్చే ప్రయత్నాలను మనం ముమ్మరం చేయాలి. ఈ దిశగా మన భారీ దేశీయ డిమాండ్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. కాబట్టి, వైబ్రంట్ గుజరాత్ ప్రస్తుత లక్ష్యం ‘గిఫ్ట్ సిటీ’ని' మరింత బలోపేతం చేయడం.. తద్వారా ప్రపంచంలో దాని గుర్తింపు విస్తరిస్తుంది.
మిత్రులారా!
‘వైబ్రంట్ గుజరాత్’ విజయం గురించి చర్చిస్తున్న ఈ సమయంలో, దీన్ని ఆపివేయడానికి ఇది తరుణం కాదన్నది నా మాట. గడచిన రెండు దశాబ్దాలతో పోలిస్తే, రాబోయే 20 ఏళ్లు చాలా ముఖ్యం. అలా ఈ కార్యక్రమం 40 ఏళ్లు పూర్తి చేసుకునే సరికి, భారత స్వాతంత్ర్య శతాబ్ది వేడుకల సమయం ఆసన్నమవుతుంది. అందువల్ల 2047 నాటికి వికసిత-స్వయంసమృద్ధ భారత్‌ను ప్రపంచం ముందు నిలిపే భవిష్యత్ ప్రణాళికను రూపొందించాల్సిన సమయమిదే. ఈ నేపథ్యంలో మీరంతా ఈ దిశగా కృషి చేస్తారని, అవసరమైన చర్యలు చేపట్టేందుకు ముందుకొస్తారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. వచ్చే ఏడాది జనవరిలో మళ్లీ ‘వైబ్రంట్ సమ్మిట్’ నిర్వహించాల్సి ఉంది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఇక్కడి పారిశ్రామిక మిత్రులు తమ శక్తియుక్తులను ఈ దిశగా కేంద్రీకరిస్తుంటారు. అయితే, నేటి కార్యక్రమానికి మీరు నన్ను ఆహ్వానించడం, నేనిక్కడికి రావడం నా వయసు ఓ 20 ఏళ్లు వెనక్కు వెళ్లినట్లయింది. నాటి భయంకర స్థితిగతుల నుంచి గుజరాత్ బయటపడి, నేడు సమున్నత స్థాయికి చేరడం దాకా నా మదిలో జ్ఞాపకాలు ముసురుకున్నాయి. జీవితంలో ఇంతకన్నా గొప్ప సంతృప్తి మరేముంటుంది మిత్రులారా! ఇలా 20 ఏళ్లు వెనక్కు వెళ్లే అవకాశం కల్పించిన గుజరాత్ ప్రభుత్వానికి మరోసారి నా అభినందనలు. ఇవాళ మీ మధ్య గడపటం ద్వారా నాటి అనుభూతులను తిరిగి అనుభవించే వీలు కల్పించిన మీకందరికీ నా కృతజ్ఞతలు... శుభాకాంక్షలు!
గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే.
****
(रिलीज़ आईडी: 2200658)
|