ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరాఖండ్‌లోని పిథోరగఢ్‌లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

నాడు పోస్టు చేయడమైనది: 12 OCT 2023 9:12PM by PIB Hyderabad

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

ఉత్తరాఖండ్ రాష్ట్ర యువ ముఖ్యమంత్రి భాయ్ పుష్కర్ సింగ్ ధామి గారు, కేంద్ర మంత్రి శ్రీ అజయ్ భట్ గారు, మాజీ ముఖ్యమంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేంద్ర భట్ గారు, ఉత్తరాఖండ్ ప్రభుత్వ మంత్రులు, అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు, దేవభూమి కుటుంబ సభ్యులారా! ఈ రోజు ఉత్తరాఖండ్ అద్భుతాలు చేసింది. బహుశా ఇంతకు ముందు ఎవరూ ఇలాంటి దృశ్యాన్ని చూసి ఉండకపోవచ్చు. ఉదయం నుంచి నేను ఉత్తరాఖండ్ అంతటా ఎక్కడికి వెళ్ళినా ఇక్కడి ప్రజలు నాపై అపారమైన ప్రేమ, ఆశీర్వాదాలు కురిపించారు. మీ ప్రేమ నదీ (గంగా) ప్రవాహంలా అనిపించింది.

ఆధ్యాత్మికత, అసమాన ధైర్యసాహసాలు కలిగిన ఈ భూమికి నేను వందనం చేస్తున్నా. ముఖ్యంగా ధైర్యవంతులైన ఇక్కడి తల్లులకు నేను వందనం చేస్తున్నా. బద్రీనాథ్ ధామ్‌లో "జై బద్రీ-విశాల్" యుద్ధ నినాదం వినిపించగానే గర్హ్వాల్ రైఫిల్స్‌కు చెందిన ధైర్యవంతుల స్ఫూర్తి, శక్తి పెరుగుతుంది. గంగోలిహాట్‌లోని కాళికా ఆలయం గంటలు "జై మహాకాళి" యుద్ధ నినాదంతో ప్రతిధ్వనించగానే... కుమావున్ రెజిమెంట్ వీరుల్లో అజేయమైన ధైర్యం ప్రవహించడం ప్రారంభమవుతుంది. ఇక్కడ మానస్‌ఖండ్‌లోని బాగేశ్వర్, బైజ్‌నాథ్, నందా దేవి, గోలు దేవత, పూర్ణగిరి, కాసర్ దేవి, కైంచి ధామ్, కతర్మల్, నానక్‌మట్ట, రీతా సాహిబ్ సహా లెక్కలేనన్ని పుణ్యక్షేత్రాల వైభవం మనకు ఉంది. మనకు గొప్ప వారసత్వం ఉంది. నేను దేశ రక్షణ, ఆధ్యాత్మికతలకు కేంద్రమైన ఈ పుణ్యక్షేత్రానికి వచ్చినపుడల్లా... మీ గురించి ఆలోచించినప్పుడల్లా... నేను ధన్యుడిని అని భావిస్తాను.

నా కుటుంబ సభ్యులారా,

ఇక్కడికి రావడానికి ముందు పార్వతీ కుండ్, జగేశ్వర్ ధామ్‌లలో పూజలు చేసే భాగ్యం నాకు లభించింది. దేశ ప్రజలందరి ఆరోగ్యం బాగుండాలని, అభివృద్ధి చెందిన భారత్ కోసం సంకల్పాన్ని బలోపేతం చేయాలని, నా ఉత్తరాఖండ్ కలలు, సంకల్పాలు నెరవేరాలని నేను కోరుకున్నాను. కొద్దిసేపటి కిందటే నేను మన సరిహద్దు గార్డులు, సైనికులనూ కలిశాను. స్థానిక కళలు, స్వయం సహాయక బృందాలతో అనుబంధం కలిగిన మన సోదరీ సోదరులందరినీ కలిసే అవకాశమూ నాకు లభించింది. ఈ విధంగా నా కొత్త రకమైన ప్రయాణం భారత సంస్కృతి, భారత భద్రత, భారత శ్రేయస్సుకు సంబంధించిన ఈ మూడు అంశాలతో ముడిపడి ఉంది. ఈ ఒకే ప్రయాణంలో నేను ప్రతీది దర్శించాను. ఈ ఉత్తరాఖండ్ బలం అద్భుతమైనది, అసమానమైనది. అందుకే నేను బాబా కేదార్ పాదాల వద్ద ఒక నమ్మకాన్ని వ్యక్తం చేసాను. ఈ దశాబ్దం ఉత్తరాఖండ్ దశాబ్దం అవుతుందని నేను నమ్ముతున్నాను. ఈ రోజు నేను ఆది కైలాసానికీ వెళ్ళాను. కాబట్టి నా నమ్మకాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాను.

ఉత్తరాఖండ్ అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేరుకునేలా... మీ జీవితాన్ని సులభతరం చేయడానికి మా ప్రభుత్వం పూర్తి నిజాయితీతో, పూర్తి అంకితభావంతో, ఒకే ఒక లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేస్తోంది. ప్రస్తుతం, రూ. 4,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించుకున్నాం, శంకుస్థాపనలూ చేసుకున్నాం. ఒకే కార్యక్రమంలో రూ. 4,000 కోట్లు! ఉత్తరాఖండ్ సోదరీ సోదరులారా మీరు ఊహించగలరా? ఈ ప్రాజెక్టుల కోసం మీ అందరినీ నేను అభినందిస్తున్నాను.

నా కుటుంబ సభ్యులారా,

ఈ మార్గాలు నాకూ కొత్తవి కాదు... మీకూ కొత్తవి కాదు. ఉత్తరాఖండ్‌లో భాగమనే భావన ఎల్లప్పుడూ నాలో ఉంటుంది. మీరూ అదే అనుబంధం, ఆప్యాయతలతో నాతో అనుసంధానమవడం నేను చూశాను. ఉత్తరాఖండ్‌లోని సుదూర గ్రామాల నుంచీ చాలా మంది మిత్రులు నాకు లేఖలు రాస్తున్నారు. వారు మంచి సమయాల్లో... కష్ట సమయాల్లోనూ నాతో ఉంటారు. కుటుంబంలో కొత్త సభ్యులు జన్మించినప్పుడు వారు నాకు వార్తను పంపుతారు. వారి కుమార్తె చదువులో మంచి ప్రతిభ చూపినప్పుడూ వారు లేఖలు రాస్తారు. అంటే మొత్తం ఉత్తరాఖండ్ కుటుంబంలో నన్ను సభ్యునిగా భావిస్తూ ఉత్తరాఖండ్ అంతా ఇప్పుడు నాతో అనుసంధానమై ఉంది.

దేశం ఏదైనా గొప్ప విజయం సాధించినప్పుడు మీరు కూడా ఆనందాన్ని పంచుకుంటారు. మీరు ఏదైనా అభివృద్ధికి అవకాశం చూస్తే... ఆ విషయాన్ని నాకు చెప్పడానికి మీరు ఎప్పుడూ వెనుకాడరు. ఇటీవలే దేశం లోక్‌సభ, అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వ్ చేయాలని ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 30, 40 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ పనిని మీ సోదరుడు.. మీ కొడుకు నా తల్లులు, సోదరీమణుల ఆశీర్వాదంతో సాధించారు. ఆసక్తికరమైన విషయ ఏమిటంటే... ఆ సమయంలోనూ ఇక్కడి సోదరీమణులు నాకు అనేక లేఖలు పంపారు.

నా కుటుంబ సభ్యులారా,

మీ అందరి ఆశీస్సులతో ఈ రోజు భారత్ అభివృద్ధిలో కొత్త శిఖరాల వైపు పయనిస్తోంది. భారత్, భారతీయులు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇది జరుగుతోందా, లేదా? ప్రపంచవ్యాప్తంగా భారత్ పేరు వినిపిస్తోందా, లేదా? ఒకప్పుడు అంతటా నిరాశావాద వాతావరణం ఉండేది. దేశం మొత్తం నిరాశలో మునిగిపోయినట్లు అనిపించింది. ఆ సమయంలో మనం ప్రతి ఆలయానికీ వెళ్లి భారత్ తన సవాళ్ల నుంచి వీలైనంత త్వరగా బయటపడాలని ప్రార్థించేవాళ్ళం. ప్రతి భారతీయుడు వేల కోట్ల మోసాల నుంచి దేశాన్ని విముక్తి చేయాలని కోరుకున్నాడు. భారత్ కీర్తినీ, ప్రజాదరణనూ పొందాలని అందరూ కోరుకున్నారు.

ఈ ప్రపంచం ఇప్పుడు వివిధ సవాళ్లతో సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రపంచ పరిస్థితిని మీరూ చూస్తున్నారు. కానీ సవాళ్లతో సతమతమవుతున్న ప్రపంచంలో భారత్ గళం దృఢంగా మారుతోంది. కొన్ని వారాల కిందటే జీ20 వంటి గొప్ప కార్యక్రమం ఇక్కడ జరిగింది. అక్కడ కూడా ప్రపంచం మన భారతీయుల బలాన్ని ఎలా గుర్తించిందో మీరు చూశారు. మీరు నాకు చెప్పండి... ప్రపంచం భారత్‌ను ప్రశంసించినప్పుడు, భారత్ గళం ప్రపంచంలో ప్రతిధ్వనించినప్పుడు... అది మీకు నచ్చిందా? మీరు నాకు సమాధానం ఇస్తారా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను... మీరు నాకు చెబుతారా? ప్రపంచంలో భారత్ పేరు ప్రకాశవంతంగా ప్రకాశించినప్పుడు అది మీకు నచ్చిందా? బిగ్గరగా చెప్పండి, మీకు నచ్చిందా? భారత్ ప్రపంచానికి దిశానిర్దేశం చేసినప్పుడు అది మీకు నచ్చిందా?

ఇదంతా ఎవరు చేశారు? ఇదంతా ఎవరు చేశారు? మోదీ చేయలేదు. ఇదంతా మీరే అంటే నా కుటుంబ సభ్యులే చేశారు. దీని ఘనత మీ అందరికీ.. అంటే ప్రజలకు చెందుతుంది. ఎందుకు? గుర్తుంచుకోండి! ఎందుకంటే 30 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో సుస్థిరమైన, బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మీకు సేవ చేసే అవకాశం మీరు నాకు ఇచ్చారు. మీ ఓటులో శక్తి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన వ్యక్తులతో నేను కరచాలనం చేసినప్పుడు... నేను వారి కళ్లలోకి సూటిగా చూడడం మీరు చూసే ఉంటారు. కానీ వారు నన్ను చూసినప్పుడు... వారికి నేను కాదు... 140 కోట్ల మంది భారతీయులు కనిపిస్తారు.

నా కుటుంబ సభ్యులారా,

సుదూర పర్వత ప్రాంతాల్లో, దేశంలోని ప్రతి మారుమూల గ్రామాల్లో నివసించే ప్రజల గురించీ మేం ఆలోచించాం. అందుకే కేవలం 5 సంవత్సరాల్లోనే దేశంలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. 13.5 కోట్ల మంది - ఈ సంఖ్య మీకు గుర్తుందా? మీకు ఈ సంఖ్య గుర్తుందా? ఐదు సంవత్సరాల్లో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడటం ప్రపంచానికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ 13.5 కోట్ల మంది ఎవరు? ఈ ప్రజల్లో చాలా మంది మీలాగే పర్వత ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్నారు. భారత్ తన పేదరికాన్ని నిర్మూలించగలదనే వాస్తవానికి ఈ 13.5 కోట్ల మంది ఒక ఉదాహరణ.

మిత్రులారా,

గతంలోనూ 'గరీబీ హటావో' నినాదం వినిపించినా... వారు పేదరికాన్ని నిర్మూలించమని మిమ్మల్ని కోరారు. కానీ మోదీ కలిసికట్టుగా మనం పేదరికాన్ని నిర్మూలించడం కొనసాగిద్దామని చెబుతున్నారు. మేం బాధ్యతను స్వీకరిస్తాం... మా ప్రయత్నాలన్నింటినీ అత్యంత నిజాయితీతో పూర్తి చేస్తాం. మన త్రివర్ణ పతాకం ప్రతి రంగంలో మరింత ఎత్తుగా రెపరెపలాడుతోంది. మన చంద్రయాన్ ప్రపంచంలోని మరే దేశం చేరుకోలేని స్థాయికి చేరుకుంది. చంద్రయాన్ చేరిన ఆ ప్రదేశానికి భారత్ శివ-శక్తి అని పేరు పెట్టింది. నా ఉత్తరాఖండ్ ప్రజలారా... శివ-శక్తి ఆలోచనతో మీరు సంతోషంగా ఉన్నారా లేదా? అంటే నా ఉత్తరాఖండ్ గుర్తింపు కూడా అక్కడికి చేరుకుంది. శివశక్తిల ఏకీకరణ అంటే ఏమిటో ఉత్తరాఖండ్‌లో వివరించే అవసరం లేదు. ఇక్కడ అడుగడుగునా అది స్పష్టంగా కనిపిస్తుంది.

మిత్రులారా,

అంతరిక్షంలోనే కాకుండా క్రీడల్లోనూ భారత్ బలాన్ని ప్రపంచం చూస్తోంది. ఇటీవలే ఆసియా క్రీడలు ముగిశాయి. ఈ క్రీడల్లోనూ భారత్ అన్ని చారిత్రక రికార్డులను బద్దలు కొట్టింది. మొదటిసారిగా భారత ఆటగాళ్ళు సెంచరీ సాధించి 100కి పైగా పతకాలు గెలుచుకుని రికార్డును సృష్టించారు. దయచేసి కొంచెం బిగ్గరగా చప్పట్లు కొట్టండి. ఉత్తరాఖండ్‌కు చెందిన 8 మంది కుమారులు, కుమార్తెలూ తమ సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ఆసియా క్రీడల్లో పాల్గొన్నారు. మన లక్ష్య సేన్ జట్టు పతకం గెలుచుకుంది. వందన కటారియా నేతృత్వంలోని హాకీ జట్టు దేశానికి పతకం తెచ్చిపెట్టింది. ఉత్తరాఖండ్ పిల్లలు అద్భుతాలు చేశారు! మీరు ఒక పని చేస్తారా? మీ మొబైల్ ఫోన్‌లను తీసి వాటి ఫ్లాష్‌లైట్‌లను ఆన్ చేయండి. ఈ ఆటగాళ్లందరినీ మీ ఫ్లాష్‌లైట్‌లను ఉపయోగించి అభినందించండి. అందరూ మీ మొబైల్ ఫోన్‌లను తీసి ఫ్లాష్‌లైట్‌లను ఆన్ చేయండి. బాగా చేశారు. ఉత్తరాఖండ్ పిల్లలకు, మన ఆటగాళ్లకు ఇవి మన అభినందనలు. దేవభూమికి చెందిన ఈ ఆటగాళ్లను నేను మరోసారి అభినందిస్తున్నాను. మీరు ఈ రోజు భారత కీర్తి కిరీటంలో మరో మణిని జోడించారు.

మిత్రులారా,

కూర్చోండి… నేను మీకు చాలా కృతజ్ఞుడను. భారత క్రీడాకారులు దేశంలో, ప్రపంచవ్యాప్తంగా గొప్ప విజయ శిఖరాలను చేరుకోవడానికి ప్రభుత్వం వారికి పూర్తి మద్దతునిస్తోంది. ఆటగాళ్ల ఆహారం నుంచి ఆధునిక శిక్షణ వరకు... ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. ఇది నిజం కానీ దీనికి విరుద్ధం కూడా నిజమే. ప్రభుత్వం ఆటగాళ్ల కోసం ఇదంతా చేస్తోంది. లక్ష్య విజయం సాధించినప్పుడల్లా లక్ష్య కుటుంబం, లక్ష్య కూడా నా కోసం ప్రత్యేకంగా మిఠాయిలు తెస్తారు. ఆటగాళ్ళు చాలా దూరం ప్రయాణించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం వివిధ ప్రదేశాల్లో క్రీడా మైదానాలనూ నిర్మిస్తోంది. ఈ రోజే హల్ద్వానీలోని హాకీ మైదానం... రుద్రపూర్‌లోని వెలోడ్రోమ్ స్టేడియం పనులకు పునాది పడింది. యువకులారా, పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి. మీ కోసం పని జరుగుతోంది. నా ఉత్తరాఖండ్ యువత దీని నుంచి ప్రయోజనం పొందుతారు. జాతీయ క్రీడలకు ఉత్సాహంగా సిద్ధమవుతున్న ధామి జీ, అతని బృందాన్నీ నేను అభినందిస్తున్నాను. మీకు, మీ బృందానికీ చాలా అభినందనలు!

నా కుటుంబ సభ్యులారా,

ఉత్తరాఖండ్‌లోని ప్రతి గ్రామంలోనూ దేశ రక్షకులు ఉన్నారు. ఇక్కడి ధైర్యవంతులైన తల్లులు దేశాన్ని కాపాడుతున్న ధైర్యవంతులైన కుమారులకు జన్మనిచ్చారు. దశాబ్దాల నాటి వారి 'వన్ ర్యాంక్ వన్ పెన్షన్' డిమాండ్‌ను మన ప్రభుత్వం నెరవేర్చింది. ఇప్పటివరకు, మా ప్రభుత్వం వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కింద మాజీ సైనికులకు రూ. 70 వేల కోట్లకు పైగా అందించింది. ఉత్తరాఖండ్‌లోని 75,000 మందికి పైగా మాజీ సైనికుల కుటుంబాలూ దీని ద్వారా ప్రయోజనం పొందాయి. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి మా ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యాల్లో ఒకటిగా ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో సౌకర్యాల నిర్మాణం ఇప్పుడు చాలా వేగంగా జరుగుతోంది. మీ తప్పు ఏమిటని మీరు ఆలోచిస్తూ ఉండాలి. మునుపటి ప్రభుత్వాలు దీన్ని ఎందుకు చేయలేదు? అది మీ తప్పు కాదు. శత్రువులు దీనిని ఉపయోగించుకుని సరిహద్దులోకి చొచ్చుకుపోతారనే భయంతో సరిహద్దు ప్రాంతాలను అభివృద్ధి చేయలేదని మునుపటి ప్రభుత్వాలు వాదించాయి. మునుపటి ప్రభుత్వాల ఈ భయానక ఆలోచనను వదిలేసి నేటి నవ భారతం ముందుకు సాగుతోంది. మేం భయపడం... ప్రజలనూ భయపెట్టం.

భారత సరిహద్దు అంతటా మేం ఆధునిక రహదారులు, సొరంగాలు, వంతెనలను నిర్మిస్తున్నాం. గత 9 సంవత్సరాల్లో, సరిహద్దు ప్రాంతాల్లోనే 4200 కిలోమీటర్లకు పైగా పొడవైన రహదారులు నిర్మించాం. సరిహద్దు వెంబడి దాదాపు 250 ప్రధాన వంతెనలు, 22 సొరంగాలనూ నిర్మించాం. ఈనాటి కార్యక్రమంలో అనేక కొత్త వంతెనలకు పునాది రాయి వేశాం. ఇప్పుడు మేం సరిహద్దు ప్రాంతాలకు రైళ్లనూ తీసుకురావడానికీ సిద్ధమవుతున్నాం. ఈ మారిన మనస్తత్వం ప్రయోజనాన్ని ఉత్తరాఖండ్ పొందుతుంది.

నా కుటుంబ సభ్యులారా,

గతంలో సరిహద్దు ప్రాంతాలను, గ్రామాలను దేశంలోని చివరి గ్రామాలుగా పరిగణించేవారు. చివరిదిగా భావించే వాటికి అభివృద్ధి పరంగా తక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇది కూడా పాత ఆలోచనే. సరిహద్దు గ్రామాలను మేం చివరి గ్రామాలుగా కాకుండా దేశంలోని మొదటి గ్రామాలుగా అభివృద్ధి చేయడం ప్రారంభించాం. వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్ కింద ఇలాంటి సరిహద్దు గ్రామాలను అభివృద్ధి చేస్తున్నాం. ఇక్కడి నుంచి వలస వెళ్లిన ప్రజలు తిరిగి రావాలని మా ప్రయత్నం. ఈ గ్రామాల్లో పర్యాటకం విస్తరించాలని, పుణ్యక్షేత్రాలను విస్తరించాలనీ మేం కోరుకుంటున్నాం.

నా కుటుంబ సభ్యులారా,

'కొండ ప్రాంతాల జల శక్తి, యువశక్తిని ఆ కొండ ప్రాంతం సాధారణంగా ఉపయోగించుకోదు' అనే పాత సామెత ఉంది. ఈ భావననూ నేను మార్చాలని నిర్ణయించుకున్నాను. గతంలోని తప్పుడు విధానాల కారణంగానే ఉత్తరాఖండ్‌లోని అనేక గ్రామాలు నిర్జనమైపోవడం మీరూ చూశారు. రహదారులు, విద్యుత్, నీరు, విద్య, వైద్యం, ఆదాయం ఏదీ సరిగా లేదు. సౌకర్యాల కొరత కారణంగా ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో కొత్త అవకాశాలు, కొత్త సౌకర్యాలు అభివృద్ధి చెందుతున్నందున చాలా మంది మిత్రులు తమ గ్రామాలకు తిరిగి రావడం ప్రారంభించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ప్రయత్నం కారణంగానే ప్రజలు గ్రామాలకు తిరిగి రావడానికి సహాయపడే ఈ పని వేగంగా జరుగుతోంది. అందుకే ఈ రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులు, ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలతో పాటు మొబైల్ ఫోన్ టవర్లపై ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. వీటికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు ఈ రోజు ఇక్కడ ప్రారంభించుకున్నాం.

ఇక్కడ ఆపిల్ తోటలు, పండ్లు, కూరగాయలు పెంచడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ రహదారుల నిర్మాణం జరుగుతోంది... నీటి సరఫరా జరుగుతోంది... నా రైతు సోదరీ సోదరులకు ప్రోత్సాహం అందుతోంది. పాలీహౌస్ నిర్మించడానికి, ఆపిల్ తోటను అభివృద్ధి చేయడానికి పథకాలూ ప్రారంభమయ్యాయి. ఈ పథకాలపై రూ. 1,100 కోట్లు పెట్టుబడి పెడుతున్నాం. ఉత్తరాఖండ్‌లోని మన చిన్న రైతుల జీవితాలను మెరుగుపరచడానికి చాలా నిధులు కేటాయించాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఉత్తరాఖండ్ రైతులు ఇప్పటివరకు రూ. 2200 కోట్లకు పైగా అందుకున్నారు.

మిత్రులారా,

చిరు ధాన్యాలు, 'శ్రీ అన్నా' అనేక తరాలుగా ఇక్కడ పండిస్తున్నారు. నేను ఇక్కడ నివసించినప్పుడు మీతో చాలా సమయం గడిపాను. అప్పట్లో ప్రతి ఇంట్లో చిరు ధాన్యాలు సమృద్ధిగా వినియోగించేవారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ చిరు ధాన్యాలను ప్రపంచంలోని ప్రతి మూలకు తీసుకెళ్లాలని కోరుకుంటోంది. దీని కోసం దేశవ్యాప్తంగా ఒక ప్రచారం ప్రారంభించాం. ఉత్తరాఖండ్‌లోని మన చిన్న రైతులు కూడా ఈ చర్యల నుంచి చాలా ప్రయోజనం పొందబోతున్నారు.

నా కుటుంబ సభ్యులారా,

తల్లులు, సోదరీమణుల ప్రతి సమస్యను, ప్రతి అసౌకర్యాన్నీ తొలగించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే మా ప్రభుత్వం పేద సోదరీమణులకు పక్కా ఇళ్ళను ఇచ్చింది. మా సోదరీమణులు, కుమార్తెల కోసం మేం మరుగుదొడ్లు నిర్మించాం, వారికి గ్యాస్ కనెక్షన్లు, బ్యాంకు ఖాతాలు ఇచ్చాం, ఉచిత చికిత్సనూ అందించాం. పేదల ఇంట్లో వంట ఆగకుండా నేటికీ ఉచిత రేషన్ కార్యక్రమం కొనసాగుతోంది.

హర్ ఘర్ జల్ యోజన కింద ఉత్తరాఖండ్‌లోని 11 లక్షల కుటుంబాల సోదరీమణులకు పైపుల ద్వారా నీటి సౌకర్యాలు లభిస్తున్నాయి. ఇప్పుడు సోదరీమణుల కోసం మరో పని జరుగుతోంది. మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్‌లను అందిస్తున్నట్లు ఈ సంవత్సరం ఎర్రకోట నుంచి నేను ప్రకటించాను. డ్రోన్‌ల సహాయంతో పొలాల్లో పురుగుమందులు, ఎరువులు, విత్తనాలు వేయడం సహా ఇలాంటి అనేక పనులకు ఉపయోగించవచ్చు. ఇప్పుడు పండ్లు, కూరగాయలను సమీపంలోని కూరగాయల మార్కెట్‌కు సరఫరా చేయగల డ్రోన్‌లనూ తయారు చేస్తున్నారు. పర్వత ప్రాంతాల్లో డ్రోన్‌లతో మందులను త్వరగా పంపిణీ చేయవచ్చు. అంటే, మహిళా స్వయం సహాయక బృందాలకు అందించిన ఈ డ్రోన్‌లు ఉత్తరాఖండ్‌ను ఆధునికతలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లబోతున్నాయి.

నా కుటుంబ సభ్యులారా,

ఉత్తరాఖండ్‌లో ప్రతి గ్రామంలో గంగ, గంగోత్రి ఉన్నాయి. శివుడు, నందుడు ఇక్కడ మంచుతో కప్పబడిన శిఖరాలపై నివసిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని జాతరలు, కౌతిగ్, థాల్, పాటలు, సంగీతం, ఆహారం సొంతంగా ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్నాయి. ఈ భూమి పాండవ నృత్యం, చోలియా నృత్యం, మంగళ్ గీత్, ఫూల్ దేయ్ ఉత్సవం, హరేలా, బాగ్వాల్, రమ్మాన్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో సమృద్ధిగా ఉంది. రోట్, ఆర్సే, ఝంగోర్ కి ఖీర్, కఫులి, పకోరా, రైతా, అల్మోరా బాల్ మిఠాయి, సింగోరి వంటి జానపద జీవిత రుచులను ఎవరు మరచిపోగలరు. నాకు ఈ కాళి గంగా భూమితో బలమైన సంబంధం ఉంది. చంపావత్‌లో ఉన్న అద్వైత ఆశ్రమంతోనూ నాకు లోతైన సంబంధం ఉంది. అది నా జీవితంలో ఒక అధ్యాయం.

నా జ్ఞాపకాలు ఇక్కడ ప్రతి అంగుళం మీద చెక్కబడి ఉన్నాయి. ఈ సారి నేను నిజంగా ఈ దివ్య ప్రాంతంలో ఎక్కువ సమయం గడపాలని కోరుకున్నాను. కానీ రేపు ఢిల్లీలో జీ-20కి సంబంధించిన మరో ప్రధాన సమావేశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీ20 దేశాల పార్లమెంటు స్పీకర్లు ఒక ప్రధాన శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. దాని కారణంగా నేను చంపావత్‌లోని అద్వైత ఆశ్రమానికి వెళ్లలేకపోతున్నాను. ఈ ఆశ్రమాన్ని మళ్ళీ సందర్శించే అవకాశం నాకు త్వరలో లభించాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను.

నా కుటుంబ సభ్యులారా,

ఉత్తరాఖండ్‌లో పర్యాటకం, పుణ్యక్షేత్రాల అభివృద్ధికి సంబంధించి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలించాయి. ఈ సంవత్సరం ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రకు వచ్చే భక్తుల సంఖ్య దాదాపు 50 లక్షలకు పెరిగింది. అన్ని రికార్డులు బద్దలయ్యాయి. బాబా కేదార్ ఆశీస్సులతో కేదార్‌నాథ్ ధామ్ పునర్నిర్మాణానికి సంబంధించిన మొదటి దశ పూర్తయింది. వందల కోట్ల రూపాయల వ్యయంతో శ్రీ బద్రీనాథ్ ధామ్‌లో చేపట్టిన అనేక ప్రాజెక్టులూ పూర్తవుతున్నాయి. కేదార్‌నాథ్ ధామ్, శ్రీ హేమకుండ్ సాహిబ్‌లలో రోప్‌వే పనులు పూర్తయిన వెంటనే... దివ్యాంగులు, వృద్ధ యాత్రికులు చాలా ప్రయోజనాలను పొందుతారు. మా ప్రభుత్వం కేదార్‌ఖండ్‌తో పాటు మానస్‌ఖండ్‌నూ కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తోంది. అందుకే నేను ఈ రోజు ఇక్కడికి వచ్చాను. కేదార్‌ఖండ్, మానస్‌ఖండ్ అనుసంధానం కోసమూ మేం గొప్ప ప్రాధాన్యం ఇస్తున్నాం. కేదార్‌నాథ్, బద్రీనాథ్ ధామ్‌ను సందర్శించే వారు జగేశ్వర్ ధామ్, ఆది కైలాష్, ఓం పర్వతాలనూ సులభంగా సందర్శించగలిగేలా పనులు జరుగుతున్నాయి. మానస్‌ఖండ్ మందిర్ మాల మిషన్ కారణంగా కుమావున్‌లోని అనేక దేవాలయాలను చేరుకోవడం చాలా సులభం అవుతోంది.

నా అనుభవం ప్రకారం... బద్రీనాథ్, కేదార్‌నాథ్‌కు వచ్చే ప్రజలు భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని కచ్చితంగా సందర్శిస్తారు. వారికి ఈ ప్రాంతం గురించి తెలియదు. మోదీ ఈ రోజు ఈ స్థలాన్ని సందర్శించిన వీడియోను టీవీలో ప్రజలు చూసినప్పుడు, వారు 'ఈ స్థలంలో ఏదో ప్రత్యేకత ఉంది' అని అనుకుంటారు. మీరు సిద్ధంగా ఉండాలి... సందర్శకుల సంఖ్య చాలా రెట్లు పెరుగుతుంది. మానస్‌ఖండ్ జనంతో నిండి ఉంటుంది.

మిత్రులారా,

ఉత్తరాఖండ్‌లో పెరుగుతున్న కనెక్టివిటీ ఇక్కడి అభివృద్ధిని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది. చార్ ధామ్ మహా పరియోజన, అన్ని వాతావరణాలకు అనువైన రహదారి ద్వారా మీరు చాలా ప్రయోజనం పొందారు. రిషికేశ్-కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఈ ప్రాంతమంతా పునరుద్ధరణ జరుగుతుంది. ఉడాన్ పథకం కింద ఈ ప్రాంతం అంతటా సరసమైన విమాన సేవలనూ విస్తరిస్తున్నాం. ఈ రోజే బాగేశ్వర్ నుంచి కనాలిచిన్నా, గంగోలిహాట్ నుంచి అల్మోరా, తనక్‌పూర్ ఘాట్ నుంచి పిథోరగఢ్ వరకు రహదారి పనులు ప్రారంభమయ్యాయి. ఇది సామాన్య ప్రజలకు సౌకర్యాన్ని అందించడమే కాకుండా పర్యాటకం ద్వారా ఆదాయ అవకాశాలనూ మెరుగుపరుస్తుంది. ఇక్కడి ప్రభుత్వం హోమ్‌స్టేలను ప్రోత్సహించడం సంతోషం కలిగిస్తుంది. పర్యాటకం అనేది గరిష్ట ఉపాధి గల, తక్కువ మూలధనం అవసరమయ్యే రంగం. రాబోయే కాలంలో పర్యాటక రంగం చాలా విస్తరించబోతోంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం భారత్‌కు రావాలనీ, భారత్‌ను అన్వేషించాలని, భారత్‌ను గురించి తెలుసుకోవాలని కోరుకుంటోంది. భారత్‌ను సందర్శించాలనుకునే వారు ఉత్తరాఖండ్‌కు రాకుండా వారి ప్రయాణం పూర్తి కాదు.

నా కుటుంబ సభ్యులారా,

గతంలో ఉత్తరాఖండ్ ప్రకృతి వైపరీత్యాలతో ఎలా అల్లకల్లోలమైందో నాకు బాగా తెలుసు. మనం మన ప్రియమైన వారిని చాలా మందిని కోల్పోయాం. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి మన సంసిద్ధతను మెరుగుపరుచుకుంటూ ఉండాలి... మనం అలా చేస్తూనే ఉంటాం. దీని కోసం, రాబోయే 4-5 సంవత్సరాల్లో ఉత్తరాఖండ్‌లో రూ. 4000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. విపత్తు సంభవించినప్పుడు సహాయక, రక్షణ పనులు త్వరగా పూర్తి చేయడానికి ఉత్తరాఖండ్‌లో ఇటువంటి సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నాం.

నా కుటుంబ సభ్యులారా,

ఇది భారత్ కోసం 'అమృతకాలం'. ఈ 'అమృతకాలం' దేశంలోని ప్రతి ప్రాంతాన్నీ, ప్రతి భాగాన్నీ సౌకర్యాలు, గౌరవం, శ్రేయస్సుతో అనుసంధానించే కాలం. బాబా కేదార్, బద్రీ విశాల్, ఆది కైలాష్ ఆశీర్వాదాలతో మనం మన సంకల్పాలను త్వరగా నెరవేర్చుకోగలమని నేను విశ్వసిస్తున్నాను. నాకు ఇంత ప్రేమను పంచినందుకు మరోసారి ధన్యవాదాలు! నిజంగా, నా భావనను వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు. హెలికాప్టర్ దిగిన తర్వాత ఇక్కడికి రావడానికి నేను 7 కిలోమీటర్లు ప్రయాణించాను. ఆ 7 కిలోమీటర్ల ప్రయాణంలో రెండు వైపులా నిలబడి ఉన్న ప్రజలందరినీ పలకరిస్తూ రావడం వల్ల ఆలస్యం అయింది. కుటుంబంలో పండగ ఉన్నట్లుగా జనసమూహం ఉంది. అందరూ పండగ దుస్తులు ధరించారు. ఇది శుభప్రదమైన పండగ వాతావరణంలా కనిపించింది. తల్లులు తమ హారతులతో, చేతుల్లో పుష్పగుచ్ఛాలతో ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవి నాకు చాలా భావోద్వేగ క్షణాలు. ఈ రోజు నా మానసఖండం నాపై అంత ప్రేమ, ఉత్సాహాన్ని చూపించింది. కాబట్టి పిథోరగఢ్‌కు, పిథోరగఢ్ జిల్లా ప్రజలందరికీ, ఈ మొత్తం ప్రాంతానికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు... నమస్కారాలు తెలియజేస్తున్నాను.

మరోసారి మీ అందరికీ నా శుభాకాంక్షలు! నాతో పాటు బిగ్గరగా చెప్పండి. మీ రెండు చేతులనూ పైకెత్తి మీ శక్తినంతా ఉపయోగించి చెప్పండి -

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

చాలా ధన్యవాదాలు!

గమనిక – ఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి అనువాదం.

 

***


(రిలీజ్ ఐడి: 2197704) సందర్శకుల సూచీ సంఖ్య : : 18