ప్రధాన మంత్రి కార్యాలయం
గోవాలో జరుగుతున్న 37వ జాతీయ క్రీడల్లో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
प्रविष्टि तिथि:
26 OCT 2023 10:44PM by PIB Hyderabad
భారత్ మాతాకీ - జై!
భారత్ మాతాకీ - జై!
భారత్ మాతాకీ - జై!
గౌరవనీయులైన గోవా గవర్నర్ శ్రీ పీఎస్ శ్రీధరన్ పిళ్లై గారు, ప్రజాదరణ పొందిన, డైనమిక్ ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గారు, క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, కేంద్ర క్యాబినెట్లో నా సహచర మంత్రులు, వేదికపై ఉన్న ప్రతినిధులు, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష గారు, క్రీడాకారులు, సహాయ సిబ్బంది, ఇతర అధికారులు, దేశం నలుమూలల నుంచి వచ్చిన యువ స్నేహితులకు, అద్భుతమైన భారత క్రీడా కార్నివాల్ ప్రయాణం ఇప్పుడు గోవాకు చేరుకుంది. ఇక్కడి వర్ణాలు, తరంగాలు, ఉత్సాహం ప్రతిచోటా ఉన్నాయి. గోవా గాలిలో ఏదో ప్రత్యేకత ఉంది. 37వ జాతీయ క్రీడల సందర్భంగా మీ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు.
స్నేహితులారా,
ఎంతోమంది గొప్ప క్రీడాకారులను దేశానికి అందించిన రాష్ట్రం గోవా. ఫుట్‌బాల్ మీద ప్రేమ గోవాలోని ప్రతి వీధిలోనూ కనిపిస్తుంది. దేశంలో అత్యంత పురాతనమైన ఫుట్‌బాల్ క్లబ్బులు గోవాలో ఉన్నాయి. క్రీడలను ఆదరించే గోవాలో జాతీయ క్రీడలను నిర్వహించడం అందరికీ కొత్త శక్తినిస్తోంది.
నా కుటుంబ సభ్యులారా,
భారత్‌లో క్రీడలు సరికొత్త విజయ శిఖరాలను అధిరోహిస్తున్న సమయంలో ఈ జాతీయ క్రీడలు జరుగుతున్నాయి. 70 ఏళ్ల క్రితం చేయలేకపోయిన దానిని ఈ ఆసియా క్రీడల్లో మనం చేశాం. ఇప్పుడు ఆసియా పారా క్రీడలు జరుగుతున్నాయి. ఇందులో సైతం భారత అథ్లెట్లు ఇప్పటి వరకు 70 పతకాలను సాధించి రికార్డులను బద్దలు కొట్టారు. దీని కంటే ముందు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల క్రీడలు జరిగాయి. ఇక్కడ కూడా భారత్ కొత్త చరిత్రను లిఖించింది. ఈ విజయాలన్నీ ఇక్కడకు వచ్చిన క్రీడాకారులకు స్ఫూర్తినిస్తాయి. మీకు, యువతకు, క్రీడాకారులకు ఈ జాతీయ క్రీడలు.. ల్యాంచ్ ప్యాడ్‌లా పనిచేస్తాయి. మీ ముందున్న అవకాశాలను దృష్టిలో ఉంచుకొని దృఢ సంకల్పంతో మీ అత్యుత్తమ ప్రదర్శనను ఇవ్వాలి. మీరు అది చేస్తారు కదా? కచ్చితంగా చేస్తారా? పాత రికార్డులను బద్దలు కొడతారా? నా ఆశీస్సులు మీతో ఉన్నాయి.
నా యువ స్నేహితులారా,
భారత్‌లోని గ్రామాలు, వీధుల్లో ప్రతిభకు ఎలాంటి కొరతా లేదు. ఎలాంటి వనరులు అందుబాటులో లేని సమయంలో కూడా భారత్ ఛాంపియన్లను తయారు చేసిందని మన చరిత్ర చెబుతోంది. ఈ వేదికపై నాతో పాటు పీటీ ఉష గారు ఉన్నారు. ఇప్పటికీ ఏదో లోటు ఉందని ప్రతి పౌరుడు భావిస్తారు. అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పతకాల వేటలో మన దేశం వెనకబడి ఉంది. ఈ బాధ నుంచి దేశానికి ఉపశమనం కలిగించడానికి 2014 తర్వాత ఓ సంకల్పం తీసుకున్నాం. క్రీడా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాం. ఎంపిక ప్రక్రియలో మార్పులు చేశాం. దానిని మరింత పారదర్శక విధానంగా మలిచాం. అథ్లెట్లకు ఆర్థికసాయం, శిక్షణ అందించే పథకాల్లో మార్పులు తీసుకువచ్చాం. సమాజం ఆలోచనా దృక్పథంలోనూ మార్పు తెచ్చాం. సమాజంలోని పాత ఆలోచనలు, విధానాల వల్ల క్రీడా వ్యవస్థలో ఏర్పడిన అడ్డంకులను తొలగించడం ప్రారంభించాం. ప్రతిభావంతులైన అథ్లెట్లను గుర్తించి వారిని ఒలింపిక్ పోడియం వరకు నడిపించడానికి ప్రభుత్వం ఓ ప్రణాళికను సిద్ధం చేసింది. దాని ఫలితాలను ఇప్పుడు మన దేశమంతా చూస్తున్నాం.
స్నేహితులారా,
గత ప్రభుత్వాల హయాంలో క్రీడలకు బడ్జెట్ కేటాయించడానికి సంకోచించేవారు. క్రీడలే కదా దాని కోసం ఖర్చు పెట్టడం దేనికని భావించేవారు. మా ప్రభుత్వం ఈ ఆలోచనను సైతం మార్చింది. క్రీడల కోసం కేటాయించే బడ్జెట్‌ను మేం పెంచాం. తొమ్మిదేళ్ల క్రితం కేటాయించిన దానితో పోలిస్తే ఇప్పుడు కేంద్ర క్రీడా బడ్జెట్ మూడు రెట్లు కంటే ఎక్కువగా పెరిగింది. దేశంలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఖేలో ఇండియా నుంచి టాప్స్ పథకం వరకు ప్రత్యేక వ్యవస్థను ప్రభుత్వం రూపొందించింది. ఈ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలో ప్రతిభావంతులను గుర్తిస్తున్నాం. వారికి శిక్షణ ఇవ్వడానికి, ఆహారం, ఇతర ఖర్చుల కోసం ప్రభుత్వం పెద్ద మొత్తాన్ని వెచ్చిస్తోంది. టాప్స్ అంటే టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం ద్వారా దేశంలోని అగ్ర క్రీడాకారులకు ప్రపంచంలోనే అత్యుత్తమమైన శిక్షణ లభిస్తుంది. ఖేలో ఇండియా పథకం ద్వారా దేశంలో 3,000 మందికి పైగా యువతకు ప్రస్తుతం శిక్షణ ఇస్తున్నాం. ఇంత పెద్ద స్థాయిలో క్రీడాకారులు సిద్ధమవుతున్నారు. ఒక్కో క్రీడాకారునికి ఏడాదికి రూ. 6 లక్షల చొప్పున ఉపకార వేతనాన్ని అందిస్తున్నాం. ఖేలో ఇండియా పథకం నుంచి వచ్చిన దాదాపు 125 క్రీడాకారులు ఆసియా క్రీడల్లో పాల్గొంటున్నారు. వీరు 36 పతకాలను సాధించారు. ఖేలో ఇండియా ద్వారా క్రీడాకారులను గుర్తించడం, సన్నద్ధం చేయడం, ఆ తర్వాత ఒలింపిక్ పోడియం చేరుకోవడానికి వారికి శిక్షణ ఇవ్వడం, సిద్ధం చేయడమే టాప్స్ లక్ష్యం.
నా యువ స్నేహితులారా,
ఏ దేశంలోనైనా క్రీడారంగం ప్రగతి నేరుగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ఆధారపడి ఉంటుంది. ఒక దేశంలో ప్రతికూల ధోరణి, నిరుత్సాహం, నిరాశావాదం ఉంటే.. దాని ప్రభావం మైదానంలోనూ.. జీవితంలోని ప్రతి అంశంలోనూ కనిపిస్తుంది. భారత్ సాధించిన విజయ గాథ నుంచి క్రీడల గెలుపు కథ విడదీయరానిది. ప్రస్తుతం ప్రతి రంగంలోనూ భారత్ ముందుకెళుతోంది. సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. భారత్ వేగంతో, స్థాయితో పోటీపడటం సవాలుతో కూడుకున్నదే. గత 30 రోజుల్లో సాధించిన విజయాలు, పనుల గురించి తెలుసుకుంటే భారత్ ఎలా ముందుకు సాగుతోందో మీరు ఓ అంచనాకి రాగలుగుతారు.
స్నేహితులారా,
నేను మీ సమయాన్ని ఎక్కువ తీసుకోను. మీ ఉజ్వలమైన భవిష్యత్తు ఎలా సిద్ధమవుతోందో ఒకసారి ఆలోచించండి. గడచిన 30 రోజుల్లో మనం సాధించిన వాటి గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాను. గత 30-35 రోజుల్లో ఏం జరిగిందో మీరు చూడండి.. మన దేశం ఈ వేగంతో, స్థాయిలో ముందుకు వెళుతుంటే.. మీ భవిష్యత్తుకు మోదీ గ్యారంటీ ఉందని మీరు భావిస్తారు.
గడచిన 30 – 35 రోజుల్లో:
-
నారీ శక్తి వందన్ అధీనియం చట్టంగా మారింది.
-
గగన్‌యాన్‌కు సంబంధించిన పరీక్ష విజయవంతంగా పూర్తయింది.
-
నమో భారత్ - మొదటి ప్రాంతీయ ర్యాపిడ్ రైలును భారత్ సిద్ధం చేసింది.
-
బెంగళూరులో మెట్రో సేవలు విస్తరించాం.
-
జమ్మూ కాశ్మీర్లో మొదటి విస్టాడోమ్ రైలు సేవలు ప్రారంభమయ్యాయి.
-
ఈ 30 రోజుల్లోనై ఢిల్లీ-వడోదరా ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభమైంది.
-
జీ20 దేశాల పార్లమెంటేరియన్లు, స్పీకర్ల సదస్సు భారత్‌లో జరిగింది.
-
అంతర్జాతీయ సముద్ర వాణిజ్య సదస్సు భారత్‌లో జరిగింది. ఇక్కడ 6 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి.
-
ఇజ్రాయెల్ నుంచి భారతీయులను తరలించడానికి ఆపరేషన్ అజయ్ ప్రారంభమైంది.
-
భారత్, శ్రీలంక మధ్య 40 ఏళ్ల తర్వాత ఫెర్రీ సేవలు ప్రారంభమయ్యాయి.
-
అత్యధిక 5జీ వినియోగదారుల సంఖ్యలో ఐరోపాను అధిగమించి ప్రపంచంలోని మూడు అగ్రదేశాల జాబితాలోకి భారత్ ప్రవేశించింది.
-
యాపిల్ తర్వాత గూగుల్ సైతం భారత్‌లో స్మార్ట ఫోన్ల తయారు చేస్తానని ప్రకటించింది.
-
ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో కొత్త రికార్డులను మన దేశం నెలకొల్పింది.
స్నేహితులారా,
ఇవి సగం మాత్రమే. చెప్పాల్సినవి ఇంకా ఉన్నాయి. మహారాష్ట్రలో గత 50 ఏళ్లుగా నిలిచిపోయిన నీల్వాండే ప్రాజెక్టుకు ఈ రోజు నేను భూమి పూజ చేశాను.
-
గత 30 రోజుల్లో తెలంగాణలో రూ.6,000 కోట్ల వ్యయంతో సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రారంభమైంది.
-
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో రూ.24,000 కోట్ల రూపాయల విలువైన ఆధునిక ఉక్కు కర్మాగారం ప్రారంభమైంది.
-
రాజస్థాన్‌లో మెహసనా-భటిండా-గుర్‌దాస్‌పూర్ గ్యాస్ పైప్‌లైన్ సెక్షన్ ప్రారంభమైంది.
-
జోధ్‌పూర్లో కొత్త ఎయిర్పోర్టు టెర్మినల్, ఐఐటీ ప్రాంగణాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం జరిగాయి.
-
గడచిన 30 రోజుల్లో మహారాష్ట్రలో 500 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ప్రారంభమయ్యాయి.
-
ఇటీవలే..గుజరాత్‌లోని ఢోర్డో గ్రామానికి ఉత్తమ పర్యాటక గ్రామ పురస్కారం లభించింది.
-
వీరాంగణ రాణీ దుర్గావతి స్మారక నిర్మాణానికి జబల్పూర్‌లో భూమి పూజ జరిగింది.
-
పసుపు రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించాం.
-
తెలంగాణలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి అనుమతి లభించింది.
-
మధ్యప్రదేశ్‌లో పీఎం ఆవాస్ యోజన ద్వారా 2.25 లక్షలకు పైగా గృహాలు పేదలకు సమకూరాయి.
-
ఈ 30 రోజుల్లో పీఎం స్వామిత్వ యోజన లబ్ధిదారుల సంఖ్య 50 లక్షలకు చేరుకుంది.
-
ఆయుష్మాన్ భారత్ యోజన పరిధిలో 26 కోట్ల కార్డులను విజయవంతంగా జారీ చేశాం.
-
ఆకాంక్షాత్మక జిల్లాల అనంతరం దేశంలో ఆకాంక్షాత్మక బ్లాకుల అభివృద్ధి కోసం ప్రచారం ప్రారంభమైంది.
-
గాంధీ జయంతినాడు ఢిల్లీలోని ఓ ఖాదీ దుకాణంలో అమ్మకాలు రూ.1.5 కోట్లను అధిగమించాయి.
స్నేహితులారా,
ఈ 30 రోజుల్లో క్రీడా ప్రపంచంలో చాలా సాధించాం.
-
ఆసియా క్రీడల్లో 100కు పైగా పతకాలను భారత్ సాధించింది.
-
అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం 40 ఏళ్ల తర్వాత భారత్‌లో సమావేశం నిర్వహించింది.
-
ఉత్తరాఖండ్లో హాకీ ఆస్ట్రో-టర్ఫ్, వెలోడ్రోమ్ స్టేడియం ఏర్పాటయ్యాయి.
-
వారణాసిలో ఆధునిక క్రికెట్ స్టేడియం పనులు ప్రారంభమయ్యాయి.
-
గ్వాలియర్‌కు అటల్ బిహారీ వాజపేయి క్రీడా కేంద్రం మంజూరయింది.
-
ఇక్కడ, ఈ గోవాలో జాతీయ క్రీడలు జరుగుతున్నాయి.
ఆలోచించండి.. నా యువ మిత్రులారా, ఈ విజయాలన్నీ గడచిన 30 రోజుల్లో సాధించినవే. నేను మీకు చిన్న వివరణ మాత్రమే ఇచ్చాను. ప్రస్తుతం మన దేశంలోని ప్రతి రంగంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ మునుపెన్నడూ లేని రీతిలో అభివృద్ధి జరుగుతోంది. అభివృద్ధి చెందిన భారత్ కోసం ప్రతి ఒక్కరూ తమ సహకారం అందిస్తున్నారు.
స్నేహితులారా,
నా దేశ యువత, భారత యువత ఈ పనులన్నింటికీ ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ రోజు భారత యువత అపూర్వమైన ఆత్మవిశ్వాసంతో ఉంది. భారత యువత ఆత్మవిశ్వాసాన్ని దేశ ఆకాంక్షలతో అనుసంధానించే ఓ ప్రత్యేకమైన కార్యక్రమం ఇటీవలే ప్రారంభమైంది. మై యువ భారత్ లేదా మై భారత్ కొత్త వేదికగా గుర్తింపు పొందింది. గ్రామీణ, పట్టణ ప్రాంత యువత ఒకరితో ఒకరు, ప్రభుత్వంతో అనుసంధానమవడానికి వన్ స్టాప్ సెంటర్‌గా ఇది పని చేస్తుంది. వారి ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి, జాతి నిర్మాణానికి దోహదపడడానికి వీలైనన్ని అవకాశాలను ఇది వారికి అందిస్తుంది. భారత్ అభివృద్ధి కోసం యువత సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి వేదికగా ఇది పనిచేస్తుంది. అక్టోబర్ 31న మనం ‘ఏక్తా దివస్’ను నిర్వహించుకొంటున్నాం. నేను మై భారత్ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాను. ఐక్యతా పరుగుతో అక్టోబర్ 31న సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని నిర్వహించుకొంటున్నామని ప్రజలకు తెలుసు. దేశ ఐక్యత కోసం గోవాతో పాటు దేశంలోని ప్రతి మూలలోనూ ఐక్యతా పరుగు జరగాలని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
స్నేహితులారా,
ప్రస్తుతం భారత్ నిబద్ధత, ప్రయత్నాలు రెండూ గొప్పగా ఉన్నప్పుడు, దేశ ఆకాంక్షలు కూడా ఉన్నతంగానే ఉంటాయి. అందుకే ఐఓసీ సమావేశంలో 1.4 బిలియన్ల భారతీయుల ఆకాంక్షలను నేను వివరించాను. 2030 యూత్ ఒలింపిక్స్, 2036 ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఒలింపిక్స్ సుప్రీం కమిటీకి నేను హామీ ఇచ్చాను.
స్నేహితులారా,
ఒలింపిక్స్ నిర్వహించాలన్న మన ఆకాంక్ష కేవలం భావోద్వేగానికి మాత్రమే పరిమితం కాదు. దీని వెనుక బలమైన కారణాలున్నాయి. ఇంచుమించు 13 ఏళ్లలో 2036 నాటికి.. ప్రపంచంలో అతి పెద్ధ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఎదుగుతుంది. ఆ సమయానికి.. ప్రతి భారతీయుని ఆదాయం ఇప్పుడున్న దానికంటే అనేక రెట్లు ఎక్కువగా ఉంటుంది. అప్పటికి మన దేశంలో అతి పెద్ద మధ్యతరగతి వర్గం ఉంటుంది. క్రీడల నుంచి అంతరిక్షం వరకు త్రివర్ణ పతాకం గర్వంగా రెపరెపలాడుతుంది. ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యమివ్వడానికి రవాణా అనుసంధానం, ఇతర ఆధునిక మౌలిక వసతులు అవసరం. ప్రస్తుతం రూ.100 లక్షల కోట్లకు పైగా మొత్తాన్ని ఆధునిక మౌలిక వసతుల కోసం ఖర్చు చేసేందుకు భారత్ సిద్ధమవుతోంది. తద్వారా మనం సులభంగా ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వగలుగుతాం.
స్నేహితులారా,
‘ఏక్ భారత్, శ్రేష్ట భారత్’కు మన జాతీయ క్రీడలు చిహ్నంగా ఉన్నాయి. తన సామర్థ్యాలను ప్రదర్శించేందుకు ప్రతి రాష్ట్రానికి ఇది గొప్ప వేదిక. ఈ సారి, గోవాకు ఈ అవకాశం లభించింది. గోవా ప్రభుత్వం, గోవా ప్రజలు దీనికోసం చేసిన ఏర్పాట్లు ప్రశంసనీయం. ఇక్కడ నిర్మించిన క్రీడా సౌకర్యాలు కొన్ని దశాబ్దాల పాటు గోవా యువతకు ప్రయోజనం చేకూరుస్తాయి. జాతీయ, అంతర్జాతీయ క్రీడలను నిర్వహించేలా, ఎంతో మంది క్రీడాకారులు ఇక్కడ నుంచి వస్తారు. ఇటీవలి కాలంలో రవాణాతో అనుసంధానమైన ఆధునిక మౌలిక వసతులను గోవా అభివృద్ధి చేసింది. ఈ జాతీయ క్రీడలు గోవాలో పర్యాటకాన్ని పెంపొందించడమే కాకుండా.. స్థానిక ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తాయి.
స్నేహితులారా,
పండగలు, ఉత్సవాలకు గోవా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు అంతర్జాతీయ చలనచిత్రోత్సవంతో గోవా అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకుంటోంది. అంతర్జాతీయ కాన్ఫరెన్సులు, సమావేశాలు, సదస్సుల నిర్వహణకు తగిన కేంద్రంగా గోవాను మా ప్రభుత్వం తయారుచేస్తోంది. 2016లో బ్రిక్స్ సదస్సును, జీ20కి సంబంధించిన ఇతర కీలక సమావేశాలను సైతం గోవాలోనే మేం నిర్వహించాం. సుస్థిరాభివృద్ధిపై దృష్టి సారించి పర్యాటకం కోసం గోవా రూపొందించిన ప్రణాళికను జీ20 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఇది గోవాకు గర్వకారణం. అలాగే భారత పర్యాటక రంగానికి కూడా గొప్ప విషయమే.
స్నేహితులారా,
మైదానంలో ఎలాంటి సవాలు ఎదురైనా, ప్రతి సందర్భంలోనూ మన అత్యుత్తమ ప్రదర్శన చేయాలి. ఈ అవకాశాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఈ పిలుపుతో.. 37వ జాతీయ క్రీడలు ప్రారంభమయ్యాయని నేను ప్రకటిస్తున్నాను. మరోసారి క్రీడాకారులు అందరికీ నా శుభాకాంక్షలు! గోవా సిద్ధంగా ఉంది. ధన్యవాదాలు.
***
(रिलीज़ आईडी: 2197366)
आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam