ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా అధ్యక్షురాలి భారత పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటన

నాడు పోస్టు చేయడమైనది: 09 OCT 2023 1:43PM by PIB Hyderabad

గౌరవ అధ్యక్షురాలు సమియా హస్సన్,  ఉభయ దేశాల ప్రతినిధులు, మీడియా మిత్రులకు 

నమస్కారం! 

ముందుగా, అధ్యక్షురాలికి, ఆమె ప్రతినిధి బృందానికి భారతదేశానికి హృదయపూర్వక స్వాగతం.  టాంజానియా అధ్యక్షురాలి హోదాలో ఆమె భారత్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి అయినప్పటికీ, ఆమెకు భారతదేశంతోనూ, ఇక్కడి ప్రజలతోనూ చాలా కాలంగా అనుబంధం ఉంది.

భారతదేశం పట్ల అధ్యక్షురాలికి ఉన్న ప్రగాఢ ప్రేమాభిమానాలు, అంకితభావం వివిధ రంగాలలో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మాకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ఆఫ్రికన్ యూనియన్ జీ20లో శాశ్వత సభ్యత్వం పొందిన తర్వాత, ఒక ఆఫ్రికన్ దేశాధినేతకు భారత్ లో ఆతిథ్యం ఇచ్చే అవకాశం మాకు లభించడం ఇదే తొలిసారి. అందువల్ల, ఈ పర్యటనకు మేం మరింత ప్రాధాన్యత ఇస్తున్నాం. 

మిత్రులారా,
 

భారత్-టాంజానియా సంబంధాలలో నేడు ఒక చరిత్రాత్మక ఘట్టం. శతాబ్దాలుగా కొనసాగుతున్న మన స్నేహాన్ని నేడు వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుతున్నాం. 

ఈ భవిష్యత్తు వ్యూహాత్మక భాగస్వామ్యానికి పునాది వేస్తూ నేటి సమావేశంలో మేం పలు కొత్త కార్యక్రమాలను గుర్తించాం. 

ద్వైపాక్షిక వాణిజ్యం,  పెట్టుబడుల పరంగా భారత్ టాంజానియా ముఖ్య భాగస్వాములు. 

స్థానిక కరెన్సీలలో వాణిజ్యాన్ని విస్తరించేందుకు ఇరు దేశాలు ఒక ఒప్పందంపై పనిచేస్తున్నాయి. మన ఆర్థిక సహకార పూర్తి సామర్థ్యాన్ని సాకారం చేయడానికి కొత్త అవకాశాలను అన్వేషిస్తూనే ఉంటాం.

ఆఫ్రికాలో భారత్‌కు టాంజానియా అతిపెద్ద అత్యంత సన్నిహిత అభివృద్ధి భాగస్వామి.

ఐసిటి కేంద్రాలు, వృత్తి విద్యా శిక్షణ, రక్షణ సంబంధ శిక్షణ, ఐటీఈసీ, ఐసీసీఆర్ స్కాలర్‌షిప్‌ల ద్వారా టాంజానియా నైపుణ్యాభివృద్ధి,  సామర్థ్య పెంపునకు భారత్ గణనీయంగా తోడ్పడింది. తాగునీరు, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి కీలక రంగాలలో సహకరించడం ద్వారా టాంజానియా ప్రజల జీవితాలలో సానుకూల మార్పు తీసుకురావడానికి కృషి చేశాం. ఇదే నిబద్ధతతో భవిష్యత్తులో కూడా మా ప్రయత్నాలను కొనసాగిస్తాం. 

జాంజిబార్‌లో ఐఐటీ మద్రాస్ క్యాంపస్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం రెండు దేశాల సంబంధంలో ఒక ముఖ్య మైలురాయిగా నిలుస్తుంది. ఇది టాంజానియాకే గాక, ఈ ప్రాంత దేశాల విద్యార్థులకు కూడా ప్రయోజనం చేకూర్చే విధంగా, ఉన్నత ప్రమాణాలు గల విద్యకు కేంద్రంగా మారుతుంది.

ఇరు దేశాల అభివృద్ధి ప్రయాణానికి సాంకేతికత ఒక ముఖ్యమైన ఆధారం.  డిజిటల్ పబ్లిక్ గూడ్స్ పంచుకునే ఒప్పందం మన భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. టాంజానియాలో యూపీఐ విజయగాథను అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలు చూసి నేను సంతోషిస్తున్నాను. 

మిత్రులారా,

రక్షణ రంగంలో ఐదేళ్ల  మార్గదర్శక  ప్రణాళికపై అంగీకారం కుదిరింది. ఇది సైనిక శిక్షణ, సముద్ర సహకారం, సామర్థ్య పెంపు,  రక్షణ పరిశ్రమ వంటి అంశాలకు కొత్త కోణాలను జోడిస్తుంది. 

భారత్, టాంజానియా ఇంధన రంగంలో కూడా సన్నిహిత సహకారాన్ని కలిగి ఉన్నాయి. భారత్ లో అభివృద్ధి చెందుతున్న స్వచ్ఛ ఇంధన పరిణామాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ కీలక రంగంలో సహకరించుకోవడానికి అంగీకరించాం. జీ20 శిఖరాగ్ర సమావేశంలో భారత్ ప్రారంభించిన గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ లో చేరాలని టాంజానియా నిర్ణయించినందుకు చాలా సంతోషం.
 

అంతేకాకుండా, అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ లో చేరాలనే టాంజానియా నిర్ణయం కూడా పెద్ద పులుల సంరక్షణ కోసం జరుగుతున్న అంతర్జాతీయ ప్రయత్నాలను మరింత మెరుగుపరుస్తుంది. 

ప్రజా సంక్షేమం కోసం అంతరిక్షాన్ని, అణు సాంకేతికతను ఉపయోగించడంపై మేం ప్రధానంగా దృష్టి పెట్టాం. ఈ ముఖ్యమైన రంగాలలో నిర్దిష్ట కార్యక్రమాలను గుర్తించి ముందుకు సాగాలని నిర్ణయించాం. 

మిత్రులారా,

ఈ రోజు అనేక  అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై కూడా మేం చర్చించాం. హిందూ మహాసముద్రం ద్వారా కలసిన దేశాలుగా, సముద్ర భద్రత, దోపిడీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా మొదలైన సవాళ్లను ఎదుర్కొనేందుకు పరస్పర సమన్వయాన్ని పెంచాల్సిన అవసరాన్ని గుర్తించాం. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని అన్ని ప్రయత్నాలలో టాంజానియాను ఒక ముఖ్యమైన భాగస్వామిగా చూస్తున్నాం.

మానవాళికి తీవ్రమైన భద్రతా ముప్పు ఉగ్రవాదమే అని భారత్, టాంజానియా ఏకగ్రీవంగా అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాద నిరోధక రంగంలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని మేం నిర్ణయించాం. 

మిత్రులారా,
మన సంబంధాలకు అత్యంత ముఖ్యమైన ముడి చిరస్థాయిగా, దృఢంగా ఉన్న మన ప్రజల స్థాయి సంబంధాలే. రెండు వేల సంవత్సరాల క్రితం, గుజరాత్‌లోని మాండ్వి పోర్టు, జాంజీబార్ మధ్య వాణిజ్యం అభివృద్ధి చెందింది. భారతదేశంలోని సిదీ జాతి మూలాలు తూర్పు ఆఫ్రికా లోని జాంజీతీరంలో ఉన్నాయి.

ఈ రోజుకీ, గణనీయ సంఖ్యలో భారతీయులు టాంజానియాను తమ రెండో ఇల్లుగా భావిస్తున్నారు. వారి సంక్షేమానికి మద్దతు ఇస్తున్నందుకు అధ్యక్షురాలు హస్సన్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.  

యోగాతో పాటు టాంజానియాలో కబడ్డీ,  క్రికెట్‌ కు ప్రజాదరణ పెరుగుతోంది.

ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సాన్నిహిత్యాన్ని పెంచడానికి ప్రయత్నాలను కొనసాగిస్తాం.

గౌరవ అధ్యక్షురాలికి 

మరోసారి మిమ్మల్ని,  మీ ప్రతినిధి బృందాన్ని భారతదేశానికి స్వాగతిస్తున్నాం.

చాలా ధన్యవాదాలు. 

గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీ ప్రకటనకు సుమారు తెలుగు అనువాదం.

 

***


(రిలీజ్ ఐడి: 2197360) సందర్శకుల సూచీ సంఖ్య : : 20