ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్రీ కే వైకుంఠ్ శత జయంతిని పురస్కరించుకొని స్మారక తపాలా బిళ్ల విడుదల చేసిన ఇఫీ
హిందీ సినిమా దృశ్య భాషను కెమెరాతో అందంగా మలిచిన వ్యక్తి కే వైకుంఠ్: గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్
గోవాకు చెందిన ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ శ్రీ కే వైకుంఠ్ శత జయంతి ఉత్సవాలను భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) ఈ రోజు నిర్వహించింది. భారతీయ సినిమాకు ఆయన చేసిన అసాధారణ సేవలకు నివాళులు అర్పిస్తూ స్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది.
ఫిలిం విభాగం కోసం రూపొందించిన వాటితో సహా అనేక ఫీచర్ చిత్రాలు, డాక్యుమెంటరీలకు అద్భుతమైన సినిమాటోగ్రఫీని ఆయన అందించారు. దేశంలోని అత్యుత్తమ దృశ్య కథకుల్లో ఒకరిగా నిలిచిపోయిన శ్రీ వైకుంఠ్.. వివిధ తరాల చిత్ర రూపకర్తలకు స్ఫూర్తినిస్తూనే ఉంటారు.
గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ స్మారక తపాలా బిళ్లను అధికారికంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, ఆర్థిక సలహాదారు శ్రీ దీపక్ నారాయణ్, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ ప్రభాత్, మహారాష్ట్ర – గోవా ప్రధాన పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ అమితాబ్ సింగ్, శ్రీ కే వైకుంఠ్ కుమారుడు శ్రీ అమిత్ కున్కోలియంకర్, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ సావంత్ ప్రసంగిస్తూ.. సినిమాటోగ్రఫీ కళకు శ్రీ కే వైకుంఠ్ తన జీవితాన్ని అంకితం చేశారని ప్రశంసించారు. ‘‘హిందీ సినిమా భాషను తన కెమెరాతో అందంగా మలిచిన వ్యక్తి’’ అని వర్ణించారు.
గోవాలోని మారగోవా వీధుల నుంచి భారత్‌లో అత్యంత గౌరవనీయులైన సినిమాటోగ్రాఫర్లలో ఒకరిగా శ్రీ వైకుంఠ్ ఎదిగారని ఆయన అన్నారు. గుల్జార్, రమేష్ సిప్పీ లాంటి దర్శక నిర్మాతలతో కలసి పని చేశారని, సీత ఔర్ గీత, ఆంధీ లాంటి గొప్ప చిత్రాలకు సహకారం అందించారని తెలిపారు.
‘‘ఛాయాగ్రాహకుడిని మించిన వ్యక్తి వైకుంఠ్ బాబా. ఆయన భావోద్వేగాలు, మానసిక స్థితి, సన్నివేశాల సృష్టికర్త’’ అని డాక్టర్ సావంత్ చెప్పారు. భారీ సినిమా సన్నివేశాలను, సున్నితమైన భావోద్వేగాలను తన ప్రత్యేకమైన శైలిలో చిత్రీకరించేవారని వివరించారు.
భారతీయ సినిమాలో కొన్ని అత్యుత్తమ సన్నివేశాలను చిత్రీకరించినప్పటికీ.. శ్రీ వైకుంఠ్ ఎప్పుడూ వినయంగా ఉండేవారని, ఆయనకు తగినంత గుర్తింపు లభించలేదని ముఖ్యమంత్రి అన్నారు. ఆయన వారసత్వం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు.
భారతీయ సినిమాటోగ్రఫీలో నిష్ణాతుడు, దేశానికి గర్వకారణమైన శ్రీ కే వైకుంఠ్‌ను గౌరవించే అవకాశం లభించడం తన అదృష్టమని అదనపు కార్యదర్శి (ఐ అండ్ బీ) శ్రీ ప్రభాత్ అన్నారు. ఈ స్మారక తపాలా బిళ్ల.. కేవలం స్టాంపుగా తన పరిధిని పరిమితం చేసుకోకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న గృహాలు, కార్యాలయాలకు ఆయన జీవితాన్ని, గొప్పతనాన్ని తీసుకెళ్లే ఓ చిన్న ప్రజా చిహ్నంగా ఉంటుంది.
ఈ తపాలా బిళ్ల విడుదల చేయడం ద్వారా గణతంత్ర విజువల్ రికార్డుల్లో శ్రీ వైకుంఠ్ చేసిన సేవలు శాశ్వతంగా నిక్షిప్తమయ్యాయని ఆయన అన్నారు.
ఈ స్మారక పోస్టల్ స్టాంపు.. తపాలా రుసుముకు సంబంధించినది మాత్రమే కాదని, సుదూర ప్రాంతాలకు దేశ చరిత్రను, సంస్కృతిని తీసుకెళుతుందని మహారాష్ట్ర సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ అమితాబ్ సింగ్ తెలిపారు. ‘‘ఈ స్టాంపు ద్వారా రాబోయే తరాలకు కూడా శ్రీ వైకుంఠ్ జీవితం, సేవలు స్ఫూర్తిని అందించేలా మేం చూసుకుంటాం’’ అని భరోసా ఇచ్చారు.
శ్రీ వైకుంఠ్ కళాత్మక దృష్టి, సాంకేతిక నైపుణ్యం, గోవాపై అవ్యాజమైన ప్రేమను ప్రేక్షకులకు తెలియజేస్తూ.. ఆయన రూపొందించిన 17 నిమిషాల నిడివి ఉన్న ఆంగ్ల డాక్యుమెంటరీ ‘‘గోవా మార్చెస్ ఆన్’’ను ఈ ఉత్సవంలో ప్రదర్శించి కార్యక్రమాన్ని ముగించారు.
रिलीज़ आईडी:
2196722
| Visitor Counter:
3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
English
,
Gujarati
,
Urdu
,
हिन्दी
,
Konkani
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam