శాంతిని ప్రోత్సహించే అంతర్జాతీయ సినిమాకు ఇఫీ 2025 సత్కారం: ప్రతిష్ఠాత్మక ఐసీఎఫ్‌టీ-యునెస్కో గాంధీ పతకం కోసం పోటీ పడుతున్న పది చిత్రాలు
అంతర్జాతీయ ఫిలిం కౌన్సిల్, టెలివిజన్ అండ్ ఆడియో విజువల్ కమ్యూనికేషన్ (ఐసీఎఫ్‌టీ) సహకారంతో 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ 2025) వార్షిక ఐసీఎఫ్‌టీ -యునెస్కో గాంధీ పతకాన్ని అందజేస్తుంది. సహనం, సంస్కృతుల మధ్య చర్చలు, ప్రపంచశాంతి అనే యునెస్కో ఆదర్శాలను నిలబెట్టే చిత్రాలను గౌరవిస్తూ ఈ పతకాన్ని ప్రదానం చేస్తారు. కరుణ, సామరస్యం, సామాజిక బాధ్యతను ప్రోత్సహించే చిత్రాలను గౌరవిస్తూ 2016లో జరిగిన 46వ ఇఫీలో ఈ పురస్కారాన్ని ప్రారంభించారు. ఈ ఉత్సవంలో అందించే అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారాల్లో ఇది కూడా ఒకటి.
ప్రపంచవ్యాప్తంగా పది ఉత్తమ చిత్రాలు ఈ ప్రతిష్ఠాత్మక పతకం కోసం ఈ ఏడాది పోటీ పడుతున్నాయి. యూకే, నార్వే, కోసోవో, ఇరాక్, చిలీ, జపాన్ సహా మూడు భారతీయ చిత్రాలు ఈ విభాగంలో పోటీపడుతున్నాయి. ఇవి వైవిధ్యమైన కథనాలు, అంతర్జాతీయ ప్రాతినిధ్యం పట్ల ఇఫీ చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తున్నాయి. బ్రైడ్స్ (యూకే), హనా (కొసోవో), కే పాపర్(ఇరాన్), ది ప్రెసిడెంట్స్ కేక్ (యూఎస్ఏ-ఇరాక్-ఖతార్), సేఫ్ హౌస్ (నార్వే), తన్వి ది గ్రేట్(ఇండియా), ది వేవ్ (చిలీ), విముక్త్ (ఇండియా), వైట్ స్నో (ఇండియా), యకుషిమాస్ ఇల్యూషన్ (బెల్జియం-ఫ్రాన్స్-జపాన్-లగ్జెంబర్గ్) చిత్రాలు ఈ విభాగంలో పోటీపడుతున్నాయి.
ఇఫీ 2025లో ఐసీఎఫ్‌టీ-యునెస్కో గాంధీ మెడల్ జ్యూరీకి డాక్టర్ ప్రొఫెసర్ అహ్మద్ బెడ్జౌయ్ (అల్జీరియా) అధ్యక్షత వహిస్తున్నారు. షువాన్ హున్ (చైనా), సెర్జ్ మిషెల్ (ఫ్రాన్స్), టోబియాస్ బియాన్కోన్(స్విట్జర్లాండ్), జార్జ్స్ డుపాంట్ (లగ్జెంబర్గ్) సభ్యులుగా ఉన్నారు.
పీఐబీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రముఖ చిత్ర రూపకర్త, ఐసీఎఫ్‌టీ-యునెస్కో ప్యారిస్ గౌరవ ప్రతినిధి మనోజ్ కదమ్ మాట్లాడుతూ.. మానవతా విలువలను ప్రదర్శించే.. అహింస, మత సామరస్యం, సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించే సన్నివేశాలున్న చిత్రాలను ఈ పురస్కారం గుర్తిస్తుందని తెలిపారు. అర్థవంతమైన సినిమాలను ప్రోత్సహించాలనే ఉమ్మడి లక్ష్యంతో ఏర్పాటైన ఇఫీ-ఐసీఎఫ్‌టీ భాగస్వామ్యానికి 2025తో పదకొండేళ్లు పూర్తయ్యాయని ఆయన చెప్పారు.
చలనచిత్ర సాంకేతిక నిపుణుల కోసం 1956లో ఏర్పాటైన ఐసీఎఫ్‌టీ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన అంతర్జాతీయ సంస్థ అని, వైవిధ్యమైన ఆడియో విజువల్ ఇతివృత్తాలపై పని చేయడం కొనసాగిస్తుందని మనోజ్ కదమ్ అన్నారు. చిత్రనిర్మాణంలో ఏఐ అనే అంశం చుట్టూ జరుగుతున్న చర్చల గురించి మాట్లాడుతూ.. చిత్రీకరించడానికి కష్టంగా ఉన్న సన్నివేశాలను రూపొందించడానికి ఏఐ సహాయం చేస్తుందని తెలిపారు. ‘‘చలనచిత్రాల్లో మానవ కోణం ఉండాలి – ఎందుకంటే.. భావోద్వేగాలను కంప్యూటరైజ్ చేయలేం’’ అని చెప్పారు.
ఇఫీ రూపొందించిన మూడు పోటీల్లో ఐసీఎఫ్‌టీ-యునెస్కో గాంధీ పురస్కారం ఒకటని, శాంతిని, శ్రేయస్సును ప్రోత్సహించే సినిమా ద్వారా నాగరికతలను, సంస్కృతులను ఒక్క చోట చేర్చాలనే ప్రత్యేకమైన లక్ష్యంతో ముందుకు సాగుతుందని ఎన్ఎఫ్‌డీసీ, ఆర్టిస్టిక్ డైరెక్టర్ (ప్రోగ్రామింగ్) పంకజ్ సక్సేనా స్పష్టం చేశారు. ఈ ఉత్సవంలో మహిళా చిత్ర రూపకర్తల ప్రాతినిధ్యం, మహిళల స్వరాన్ని తెలియజెప్పే శక్తివంతమైన చిత్రాల సంఖ్య పెరుగుతోందని ఆయన తెలిపారు. ఏదో ఒక ప్రాంతం మాత్రమే ఆధిపత్యం ప్రదర్శించకుండా మొత్తం ప్రపంచాన్ని ప్రతిబింబించడమే ఇఫీ లక్ష్యమని పునరుద్ఘాటించారు.
సినిమా అభిరుచిని పెంచే, కళాత్మక సమగ్రతను గౌరవించే, మానవ పరిస్థితులను ప్రతిబింబించే కథలను చలనచిత్రోత్సవాలు ప్రోత్సహించాలని పంకజ్ సక్సేనా స్పష్టం చేశారు. హింస ప్రాథమిక స్వభావమని అంగీకరిస్తూనే.. దానిని వాణిజ్య సంచలనం కోసం కాకుండా బాధ్యతాయుతంగా చిత్రీకరించాల్సిన అవసరాన్ని తెలియజేశారు.
ఐసీఎఫ్‌టీ-యునెస్కో గాంధీ పతకం గురించి:
మహాత్మాగాంధీ సార్వత్రిక ఆదర్శాలను ప్రతిబింబిస్తూ.. శాంతిని, అహింసను, సంస్కృతుల మధ్య అవగాహనను తమలో ఇముడ్చుకున్న చిత్రాలను ఇఫీకి చెందిన ఐసీఎఫ్‌టీ-యునెస్కో విభాగం గౌరవిస్తుంది. కళాత్మక నైపుణ్యాన్ని అధిగమించి.. సమ్మిళిత్వాన్నీ, సామాజిక అవగాహననూ, నైతిక విలువలనూ ప్రతిబింబించే ఇతివృత్తాలను స్వీకరించే చిత్రాలను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం గుర్తిస్తుంది. గత కొన్నేళ్లుగా.. సంస్కృతుల మధ్య కరుణ, ఐక్యత, చర్చలను ప్రోత్సహించే కథనాలను రూపొందించే చిత్ర రూపకర్తలను గాంధీ పతకం సత్కరిస్తోంది. మానవత్వాన్ని పరిమళింపజేయడంలో, సమాజాల మధ్య వారధిని నిర్మించడంలో సినిమాకున్న పరివర్తనాత్మక శక్తిని తెలియజేస్తుంది.
పూర్తి విలేకరుల సమావేశాన్ని ఇక్కడ చూడండి:
ఇఫీ గురించి:
1952లో ప్రారంభమైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) దక్షిణాసియాలోనే పురాతనమైన, అతిపెద్ద సినిమా వేడుకగా నిలబడుతోంది. జాతీయ చలనచిత్రాభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్‌డీసీ), భారత సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, గోవా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని గోవా ఎంటర్‌టైన్మెంట్ సొసైటీ (ఈఎస్జీ) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అంతర్జాతీయ సినిమా శక్తి కేంద్రంగా ఎదిగింది. ఇక్కడ పునరుద్ధరించిన క్లాసిక్ సినిమాలు సాహసోపేతమైన ప్రయోగాలను చేరుకుంటాయి. దిగ్గజాలు.. తొలిసారి చిత్రాలను తెరకెక్కిస్తున్న కొత్త తరంతో వేదికను పంచుకుంటారు. అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్క్లాసులు, నీరాజనాలతో పాటుగా ఆలోచనలు, ఒప్పందాలు, భాగస్వామ్యాలు వృద్ధి చెందే వేవ్స్ ఫిలిం బజార్ కలగలిసి ఇఫీని శక్తివంతం చేస్తున్నాయి. సుందరమైన గోవా తీరప్రాంత నేపథ్యంలో నవంబర్ 20 నుంచి 28 వరకు జరిగే 56వ సంచిక భాషలు, శైలులు, ఆవిష్కరణలు, స్వరాల అద్భుతమైన ప్రపంచాన్ని అందిస్తుంది. అలాగే అంతర్జాతీయ వేదికపై భారతీయ సృజనాత్మక శక్తిని ప్రదర్శిస్తుంది.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి:
ఇఫీ వెబ్‌సైట్: https://www.iffigoa.org/
పీఐబీ నిర్వహిస్తోన్నఇఫీ మైక్రో సైట్: https://www.pib.gov.in/iffi/56/
పీఐబీ ఇఫీవుడ్ బ్రాడ్‌కాస్ట్ ఛానెల్: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
ఎక్స్ హ్యాండిళ్లు : @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
* * *
रिलीज़ आईडी:
2195672
| Visitor Counter:
11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Gujarati
,
Konkani
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam