ప్రధాన మంత్రి కార్యాలయం
హర్యానాలోని కురుక్షేత్రలో శ్రీ గురు తేజ్ బహదూర్ జీ 350వ షహీదీ దివస్‌లో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
శ్రీ గురు తేజ్ బహదూర్ జీ వంటి వ్యక్తులు చరిత్రలో చాలా అరుదు
గురు సాహిబ్ జీవితం, త్యాగం, వ్యక్తిత్వం స్ఫూర్తిదాయకం
మొఘల్ దండయాత్రల కాలంలో ధైర్యం, శౌర్యం అనే ఆదర్శాలను స్థాపించిన గురు సాహిబ్
మన గురువుల సంప్రదాయమే మన దేశ స్వభావానికి, సంస్కృతికి, మన ప్రధాన స్ఫూర్తికీ పునాది
కొంతకాలం కిందట గురు గ్రంథ్ సాహిబ్ మూడు మూల రూపాలు
ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్‌కు రావడం ప్రతి పౌరుడికి గర్వకారణం
కర్తార్‌పూర్ కారిడార్ పనులను పూర్తి చేయడం... హేమకుండ్ సాహిబ్‌లో రోప్‌వే ప్రాజెక్టును నిర్మించడం... ఆనంద్‌పూర్ సాహిబ్‌లోని విరాసత్-ఎ-ఖల్సా మ్యూజియం విస్తరణ ద్వారా గురువుల ప్రతి పవిత్ర స్థలాన్ని ఆధునిక భారత్ దార్శనికతతో అనుసంధానించేందుకు మా ప్రభుత్వం ప్రయత్నాలు
గురువుల అద్భుత సంప్రదాయ స్ఫూర్తితోనే ఈ ప్రయత్నాలన్నింటినీ సంపూర్ణ భక్తితో పూర్తి చేశాం
ధైర్యవంతులైన సాహిబ్‌జాదాల విషయంలోనూ మొఘలుల క్రూరత్వం
ఇటుకలతో కొట్టి హింసించినా వారు విధిని, విశ్వాస మార్గాన్ని వీడని సాహిబ్‌జాదాలు
వారి ఆదర్శాల గౌరవార్థంగానే మనం ప్రతియేటా డిసెంబర్ 26న వీర్ బల్ దివస్‌ను నిర్వహించుకుంటున్నాం
గత నెలలో గురు మహారాజ్ పూజ్య 'జోడా సాహిబ్' ను ఢిల్లీ నుంచి పాట్నా సాహిబ్‌కు తీసుకువెళ్లే సమయంలో
ఈ పవిత్ర పాదుకలకు నమస్కరించే భాగ్యం నాకు లభించింది
సేవ చేయడం, నన్ను నేను అంకితం చేసుకోవడం, ఈ పవిత్ర వారసత్వంతో అనుసంధానమయ్యే అవకాశం గురువుల ప్రత్యేక కృపగా నేను భావిస్తున్నా
మాదకద్రవ్య వ్యసనం మన యువతలో చాలా మంది కలలను లోతైన సవాళ్లలోకి నెట్టింది
ఈ సమస్యను దాని మూలాల నుంచి నిర్మూలించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది
ఇది సమాజం, బాధిత కుటుంబాల యుద్ధం కూడా: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
25 NOV 2025 7:06PM by PIB Hyderabad
హర్యానాలోని కురుక్షేత్రలో ఈ రోజు శ్రీ గురు తేజ్ బహదూర్ జీ 350వ షహీదీ దివస్‌ను పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ... ఈ రోజు భారత వారసత్వ అద్భుత సంగమ దినమని అని వ్యాఖ్యానించారు. ఉదయం తాను రామాయణ నగరమైన అయోధ్యలో ఉన్నాననీ... ఇప్పుడు తాను గీతా నగరమైన కురుక్షేత్రలో ఉన్నానని ఆయన పేర్కొన్నారు. శ్రీ గురు తేజ్ బహదూర్ జీ 350వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాధువులు, సంబంధిత సమాజం హాజరైనట్లు పేర్కొన్న ప్రధానమంత్రి... అందరికీ తన గౌరవప్రదమైన నమస్కారాలు తెలిపారు.
5-6 సంవత్సరాల కిందటే మరో అద్భుతమైన యాదృచ్చికం జరిగిందని గుర్తుచేసుకుంటూ... 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు రామమందిరం విషయంలో తీర్పు వెలువరించిన సమయంలో తాను డేరా బాబా నానక్‌లో కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవంలో ఉన్నానని శ్రీ మోదీ తెలిపారు. ఆ రోజు రామమందిర నిర్మాణ మార్గం సుగమం కావాలనీ, కోట్లాది మంది రామభక్తుల ఆకాంక్షలు నెరవేరాలని తాను ప్రార్థించినట్లు ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అదే రోజున రామమందిరానికి అనుకూలంగా తీర్పు వెలువడటంతో అందరి ప్రార్థనలకు ఫలితం లభించిందని ఆయన పేర్కొన్నారు. అయోధ్యలో ధర్మ ధ్వజ స్థాపన జరిగిన నేటి సందర్భంలో సిక్కు సంఘ్ నుంచీ ఆశీర్వాదం పొందే అవకాశం తనకు మరోసారి లభించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
కొద్దిసేపటి కిందటే కురుక్షేత్ర భూమిపై 'పాంచజన్య స్మారక చిహ్నం' ప్రారంభించినట్లు శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ నేలపైనే సత్యం, న్యాయాన్ని కాపాడటం అత్యున్నత కర్తవ్యంగా శ్రీ కృష్ణుడు ప్రకటించారని ఆయన తెలిపారు. కృష్ణుడి మాటలను పఠిస్తూ సత్య మార్గం కోసం, తన విధి నిర్వర్తించడం కోసం జీవితాన్ని అంకితం చేయడం అత్యున్నతమని శ్రీ మోదీ అన్నారు. శ్రీ గురు తేజ్ బహదూర్ జీ కూడా సత్యం, న్యాయం, విశ్వాసాన్ని రక్షించడమే తన ధర్మంగా భావించారనీ... ఆయన తన జీవితాన్ని త్యాగం చేయడం ద్వారా ఈ ధర్మాన్ని నిలబెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ చరిత్రాత్మక సందర్భంలో శ్రీ గురు తేజ్ బహదూర్ జీ పాదాల వద్ద ఒక స్మారక పోస్టల్ స్టాంపు, ప్రత్యేక నాణెంను విడుదల చేసే అవకాశం భారత ప్రభుత్వానికి లభించిందన్నారు. ప్రభుత్వం ఈ విధంగా గురు సంప్రదాయానికి సేవ చేయడం కొనసాగిస్తుందని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
కురుక్షేత్ర పవిత్ర భూమి సిక్కు సంప్రదాయానికి ప్రధాన కేంద్రమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. సిక్కు సంప్రదాయానికి చెందిన దాదాపు అందరు గురువులు తమ పవిత్ర యాత్రల్లో భాగంగా ఈ భూమిని సందర్శించారని ఆయన గుర్తు చేశారు. తొమ్మిదో గురువు శ్రీ గురు తేజ్ బహదూర్ జీ ఈ పవిత్ర నేలకు వచ్చినప్పుడు తన లోతైన ధ్యానం, అసమాన ధైర్యంతో చెరగని ముద్ర వేశారని ఆయన గుర్తు చేసుకున్నారు.
"శ్రీ గురు తేజ్ బహదూర్ జీ వంటి వ్యక్తులు చరిత్రలో చాలా అరుదు. ఆయన జీవితం, త్యాగం, వ్యక్తిత్వం స్ఫూర్తిదాయకం" అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. మొఘల్ దండయాత్రల కాలంలో గురు సాహిబ్ తన ధైర్యసాహసాలతో ఆదర్శంగా నిలిచారని ఆయన తెలిపారు. శ్రీ గురు తేజ్ బహదూర్ జీ బలిదానానికి ముందు... మొఘల్ దురాక్రమణదారులు కాశ్మీరీ హిందువులను బలవంతంగా ఇస్లాంలోకి మార్చారని ప్రధానమంత్రి తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో దురాక్రమణదారుల బృందం గురు సాహిబ్ మద్దతు కోరిందన్నారు. తాను స్వయంగా ఇస్లాంను స్వీకరించడం సాధ్యమైతే, మిగిలినవారు కొత్త మతాన్ని స్వీకరించే అవకాశం సాధ్యం అవుతుందంటూ ఔరంగజేబుకు స్పష్టంగా గురు సాహిబ్ సందేశం పంపినట్లు ప్రధానమంత్రి గుర్తు చేశారు.
శ్రీ గురు తేజ్ బహదూర్ జీ ధైర్యాన్ని ఈ మాటలు ప్రతిబింబిస్తున్నాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. భయపడినట్లే క్రూరుడైన ఔరంగజేబు గురు సాహిబ్‌ను ఖైదీగా తీసుకురమ్మని ఆదేశించారు. అయితే గురు సాహిబ్ స్వయంగా ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారన్నారు. మొఘల్ పాలకులు తనను ప్రలోభాలతో ఆకర్షించడానికి ప్రయత్నించినప్పటికీ శ్రీ గురు తేజ్ బహదూర్ దృఢంగా ఉండి తన విశ్వాసం, సూత్రాల విషయంలో రాజీ పడటానికి నిరాకరించారని ప్రధానమంత్రి తెలిపారు. తన దృఢ సంకల్పాన్ని విచ్ఛిన్నం చేయడానికి, తన మార్గం నుంచి తనను మళ్లించడానికి, మొఘలులు తన ముగ్గురు సహచరులైన భాయ్ దయాళ్ జీ, భాయ్ సతీ దాస్ జీ, భాయ్ మతి దాస్ జీ లను ఆయన కళ్ళ ముందే దారుణంగా ఉరితీశారని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ గురు సాహిబ్ అచంచలంగా, తన సంకల్పం విచ్ఛిన్నం కాకుండా ధృడంగా నిలిచారని ప్రధానమంత్రి అన్నారు. గురు సాహిబ్ ధర్మ మార్గాన్ని విడిచిపెట్టలేదనీ, తన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి లోతైన ధ్యాన స్థితిలో తన తలనూ త్యాగం చేశారని శ్రీ మోదీ వివరించారు.
గురు మహారాజ్ పవిత్ర శిరస్సును అవమానించడానికి మొఘలులు ప్రయత్నించినప్పటికీ... భాయ్ జైతా జీ తన పరాక్రమంతో గురువు తలను ఆనంద్‌పూర్ సాహిబ్‌కు మోసుకెళ్లారని ఆయన తెలిపారు. శ్రీ గురు గోవింద్ సింగ్ జీ మాటలను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. విశ్వాసపు పవిత్ర తిలకాన్ని రక్షించారు... ప్రజల విశ్వాసాల్ని కూడా రక్షించారు. దీని కోసం గురు సాహిబ్ అన్నింటినీ త్యాగం చేశారని చెప్పారు.
గురు సాహిబ్ త్యాగం జరిగిన ఈ భూమి నేడు ఢిల్లీ సిస్ గంజ్ గురుద్వారాగా, స్ఫూర్తిదాయకమైన ప్రదేశంగా ఉందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఆనంద్‌పూర్ సాహిబ్ తీర్థయాత్ర మన జాతీయ చైతన్యానికి శక్తి కేంద్రమని ఆయన వ్యాఖ్యానించారు. నేటికీ నిలిచి ఉన్న భారత స్వరూపం గురు సాహిబ్ వంటి యుగపురుషుల త్యాగం, అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ అత్యున్నత త్యాగం కారణంగానే శ్రీ గురు తేజ్ బహదూర్ సాహిబ్‌ను 'హింద్ ది చాదర్'గా గౌరవిస్తున్నారని ఆయన తెలిపారు.
"మన గురువుల సాంప్రదాయమే దేశ స్వభావం, సంస్కృతి, ప్రధాన స్ఫూర్తికి పునాది వేస్తుంది" అని శ్రీ మోదీ తెలిపారు. గత 11 సంవత్సరాల్లో ప్రభుత్వం ఈ పవిత్ర సంప్రదాయాలను, ప్రతి సిక్కు వేడుకను జాతీయ పండగలుగా ప్రకటించిందన్నారు. శ్రీ గురు నానక్ దేవ్ జీ 550వ ప్రకాష్ పర్వ్, శ్రీ గురు తేజ్ బహదూర్ సాహిబ్ జీ 400వ ప్రకాష్ పర్వ్, శ్రీ గురు గోవింద్ సింగ్ జీ 350వ ప్రకాష్ పర్వ్‌లను భారత ఐక్యత, సమగ్రతల పండగలుగా జరుపుకొనే అవకాశం తమ ప్రభుత్వానికి లభించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు తమ విశ్వాసాలు, సంప్రదాయాలు, నమ్మకాలకు అతీతంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు.
గురువులతో ముడిపడి ఉన్న పవిత్ర స్థలాలకు అత్యంత అద్భుతమైన, దివ్యమైన రూపాన్ని ఇచ్చే అదృష్టం తమ ప్రభుత్వానికి కలిగిందని స్పష్టం చేసిన శ్రీ మోదీ... గత దశాబ్దంలో గురు సంప్రదాయంతో ముడిపడి ఉన్న కార్యక్రమాల్లో తానూ స్వయంగా పాల్గొన్న సందర్భాలు చాలా ఉన్నాయని ఆయన తెలిపారు. కొంతకాలం కిందటే గురు గ్రంథ్ సాహిబ్ మూడు మూల రూపాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చిన సందర్భం ప్రతి పౌరుడికి గర్వకారణంగా మారిందని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు.
గురువుల ప్రతి తీర్థయాత్ర స్థలాన్ని ఆధునిక భారత దార్శనికతతో అనుసంధానించడానికి ప్రభుత్వం ప్రయత్నించిందని శ్రీ మోదీ తెలిపారు. కర్తార్‌పూర్ కారిడార్ పనులను పూర్తి చేయడం, హేమకుండ్ సాహిబ్‌లో రోప్‌వే ప్రాజెక్టును నిర్మించడం, ఆనంద్‌పూర్ సాహిబ్‌లోని విరాసత్-ఎ-ఖల్సా మ్యూజియంను విస్తరించడం వంటి పనులన్నింటినీ సంపూర్ణ భక్తి భావంతో చేపట్టామనీ, గురువుల అద్భుతమైన సంప్రదాయాన్ని మార్గదర్శక ఆదర్శంగా ఉంచుతున్నామని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ధైర్యవంతులైన సాహిబ్‌జాదాలతోనూ మొఘలులు అత్యంత క్రూరంగా వ్యవహరించిన విషయం అందరికీ తెలుసని ప్రధానమంత్రి తెలిపారు. ఇటుకలతో కొట్టినా వారి విధిని, విశ్వాస మార్గాన్ని సాహిబ్‌జాదాలు విడిచిపెట్టలేదని ఆయన పేర్కొన్నారు. ఈ ఆదర్శాల గౌరవార్థం ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న వీర్ బల్ దివస్‌ను పాటిస్తున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సేవ, ధైర్యం, సత్యంల ఆదర్శాలు కొత్త తరం ఆలోచనలకు పునాదిగా మారేలా ప్రభుత్వం సిక్కు సాంప్రదాయ చరిత్రను, గురువుల బోధనలను జాతీయ పాఠ్యాంశాల్లో చేర్చిందని ఆయన స్పష్టం చేశారు.
'జోడా సాహిబ్' పవిత్ర దర్శనాన్ని అందరూ తప్పకుండా పొంది ఉంటారని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. తన మంత్రివర్గ సహచరులు, కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురీ ఈ పవిత్ర పాదుకల గురించి తనతో మొదటిసారి చర్చించినప్పుడు... ఆయన కుటుంబం గురు గోవింద్ సింగ్ జీ, మాతా సాహిబ్ కౌర్ జీ పవిత్ర 'జోడా సాహిబ్'ను దాదాపు మూడు వందల సంవత్సరాలుగా సంరక్షిస్తూ వచ్చిందని ఆయన చెప్పినట్లు శ్రీ మోదీ తెలిపారు. ఈ పవిత్ర వారసత్వాన్ని ఇప్పుడు దేశవిదేశాల్లోని సిక్కు సమాజానికి అంకితం చేస్తున్నామని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత పవిత్ర 'జోడా సాహిబ్'ను పూర్తి గౌరవ మర్యాదలతో శాస్త్రీయంగా పరీక్షించినట్లు ఆయన వివరించారు. తద్వారా దానిని భవిష్యత్ తరాల కోసం పరిరక్షించవచ్చని శ్రీ మోదీ తెలిపారు. అన్ని వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని, పవిత్ర 'జోడా సాహిబ్'ను గురు మహారాజ్ తన బాల్యంలో ఎక్కువ సమయం గడిపిన తఖ్త్ శ్రీ పాట్నా సాహిబ్‌కు అంకితం చేయాలని సమష్టి నిర్ణయం తీసుకున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. గత నెలలో ఈ పవిత్ర ప్రయాణంలో భాగంగా పవిత్ర 'జోడా సాహిబ్'ను ఢిల్లీ నుంచి పాట్నా సాహిబ్‌కు తరలిస్తున్న సందర్భంలో తనకు ఆ దివ్య పాదుకల ముందు తల వంచి నమస్కరించే అవకాశం లభించిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ పవిత్ర వారసత్వంతో సేవ, అంకితభావం, అనుసంధానానికి అవకాశం లభించడం గురువుల ప్రత్యేక కృపగా ఆయన భావించారు.
శ్రీ గురు తేజ్ బహదూర్ సాహిబ్ జీ జ్ఞాపకాలు భారత సంస్కృతి ఎంత విశాలంగా, ఉదారంగా, మానవత్వ కేంద్రంగా ఉందో మనకు బోధిస్తున్నాయని శ్రీ మోదీ గుర్తుచేసుకున్నారు. గురు సాహిబ్ తన జీవితం ద్వారా సర్బత్ ద భలా మంత్రాన్ని ఉపదేశించారని ఆయన తెలిపారు. ఈ జ్ఞాపకాలను, పాఠాలను గౌరవించుకోవడానికి ఈ కార్యక్రమం ఒక సందర్భం మాత్రమే... కానీ మన వర్తమానం, భవిష్యత్తుకు ఒక ముఖ్యమైన ప్రేరణగా ఇది నిలుస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ దృఢంగా ఉండేవారే నిజమైన జ్ఞాని... నిజమైన అన్వేషకుడు అనే గురు సాహిబ్ బోధనను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ స్ఫూర్తితో మనం ప్రతి సవాలును అధిగమించి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనీ, దేశాన్ని అభివృద్ధి చేయాలనీ ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. గురు సాహిబ్ ఎవరినీ భయపెట్టకూడదనీ, ఎవరికీ భయపడకూడదని మనకు బోధించారని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్భయత సమాజాన్నీ, దేశాన్ని బలపరుస్తుందనీ, భారత్ ప్రస్తుతం ఈ సూత్రం ఆధారంగా ముందుకు సాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. భారత్ తన సరిహద్దులను కాపాడుకుంటూనే ప్రపంచానికి సోదరభావం గురించి బోధిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారత్ శాంతిని కోరుకుంటున్నప్పటికీ దేశ భద్రత విషయంలో ఎప్పుడూ రాజీపడదని, ఆపరేషన్ సిందూర్ దీనికి గొప్ప ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. నూతన భారత్ ఉగ్రవాదానికి భయపడదు, ఆగదు, తలవంచదు అనే విషయాన్ని ప్రపంచం మొత్తం చూసిందని శ్రీ మోదీ ధ్రువీకరించారు. భారత్ ప్రస్తుతం పూర్తి బలం, ధైర్యం, స్పష్టతతో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు.
ఈ ముఖ్యమైన సందర్భంలో తాను సమాజానికి, యువతకు సంబంధించిన ఒక అంశంపై మాట్లాడాలనుకుంటున్నానని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇది గురు సాహిబ్‌కు కూడా ఆందోళన కలిగించే విషయమేమనని... మాదకద్రవ్యాల వ్యసనం అనే సమస్య గురించే తాను చెబుతున్నానని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ వ్యసనం చాలా మంది యువకుల కలలను లోతైన సవాళ్లలోకి నెట్టివేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను దాని మూలాల నుంచి పూర్తిగా నిర్మూలించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. అయితే ఇది సమాజం, బాధిత కుటుంబాలూ చేయాల్సిన యుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి సమయంలో శ్రీ గురు తేజ్ బహదూర్ సాహిబ్ బోధనలు సానుకూల ప్రేరణగా, పరిష్కారంగా పనిచేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. గురు సాహిబ్ ఆనంద్‌పూర్ సాహిబ్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఆయన అనేక గ్రామాలను సంగత్‌తో అనుసంధానించారనీ... వారి భక్తి, విశ్వాసాన్ని విస్తరించారని... సమాజ ప్రవర్తననూ మార్చారని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. ఈ గ్రామాల ప్రజలు అన్ని రకాల మత్తు పదార్థాల సాగును విడిచిపెట్టి, తమ భవిష్యత్తును గురు సాహిబ్ పాదాలకు అంకితం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. గురు మహారాజ్ చూపిన మార్గాన్ని అనుసరించడం ద్వారా సమాజం, కుటుంబాలు, యువత ఐక్యంగా వ్యసనానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక యుద్ధం చేస్తే... ఈ సమస్యను దాని మూలాల నుంచి నిర్మూలించవచ్చని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
శ్రీ గురు తేజ్ బహదూర్ సాహిబ్ బోధనలు మన ప్రవర్తనలో శాంతికి, మన విధానాల్లో సమతుల్యతకు, మన సమాజంపై నమ్మకానికి పునాది కావాలని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఇదే ఈ సందర్భ సారాంశమన్నారు. శ్రీ గురు తేజ్ బహదూర్ బలిదాన దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న విధానం నేటికీ సమాజ స్పృహలో గురువుల బోధనలు ఎంత సజీవంగా ఉన్నదీ కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ స్ఫూర్తితోనే ఈ వేడుకలు యువత దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అర్థవంతమైన ప్రేరణగా పనిచేయాలని ప్రధానమంత్రి పేర్కొంటూ... అందరికీ మరోసారి తన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ ప్రొఫెసర్ అశిమ్ కుమార్ ఘోష్, హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సింగ్ సైని, కేంద్ర మంత్రులు శ్రీ మనోహర్ లాల్, శ్రీ రావు ఇంద్రజిత్ సింగ్, శ్రీ కృష్ణ పాల్ తదితరులు పాల్గొన్నారు.
నేపథ్యం
శ్రీకృష్ణుని పవిత్ర శంఖం గౌరవార్థం కొత్తగా నిర్మించిన ‘పాంచజన్య’ను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన మహాభారత అనుభవ కేంద్రాన్ని సందర్శించారు. ఇది మహాభారతంలోని ముఖ్యమైన ఘట్టాలను చిత్రీకరించే... దాని శాశ్వత సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను స్పష్టం చేసే అద్భుత అనుభవాలను అందించే కేంద్రం.
తొమ్మిదో సిక్కు గురువు శ్రీ గురు తేజ్ బహదూర్ జీ 350వ షహీదీ దివస్‌ను స్మరించుకునే ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పూజ్య గురువు 350వ షహీదీ దివస్‌ను పురస్కరించుకుని ఒక ప్రత్యేక నాణెం, స్మారక స్టాంపును ప్రధానమంత్రి విడుదల చేశారు. గురు తేజ్ బహదూర్ 350వ షహీదీ దివస్ గౌరవార్థం భారత ప్రభుత్వం ఏడాది పొడవునా స్మారక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
(रिलीज़ आईडी: 2194406)
आगंतुक पटल : 3