ప్రధాన మంత్రి కార్యాలయం
అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
నేడు యావత్ దేశం, ప్రపంచమంతా శ్రీరాముడి స్పూర్తితో నిండిపోయింది: ప్రధానమంత్రి
ధర్మ ధ్వజం కేవలం జెండా మాత్రమే కాదు.. ఇది భారత నాగరికత పునరుజ్జీవన పతాకం: ప్రధానమంత్రి
ఆదర్శాలు వ్యక్తిత్వంగా రూపాంతరం చెందే భూమి అయోధ్య: ప్రధానమంత్రి
రామమందిరం దివ్య ప్రాంగణం దేశ సమష్టి శక్తికి చైతన్య స్థలంగా మారుతోంది: ప్రధానమంత్రి
మన రాముడు విభేదాల ద్వారా కాదు.. భావోద్వేగాల ద్వారా దగ్గరవుతాడు: ప్రధానమంత్రి
మనది శక్తిమంతమైన సమాజం... రాబోయే దశాబ్దాలు, శతాబ్దాలను దృష్టిలో ఉంచుకుని మనం దీర్ఘదృష్టితో పని చేయాలి: ప్రధానమంత్రి
రాముడు ఆదర్శాలకు, క్రమశిక్షణకు, జీవితంలోని అత్యున్నత స్వభావానికి ప్రతీక: ప్రధానమంత్రి
రాముడు కేవలం వ్యక్తి మాత్రమే కాదు, ఒక విలువ, క్రమశిక్షణ, మార్గం: ప్రధానమంత్రి.
2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే, సమాజం సాధికారత సాధించాలంటే, మనలో ‘రామ్’ అనే భావాన్ని మేల్కొల్పాలి: ప్రధానమంత్రి
దేశం ముందుకు సాగాలంటే, తన వారసత్వంపై గర్వించాలి: ప్రధానమంత్రి
వచ్చే పదేళ్లలో భారత్‌ను బానిసత్వపు మనస్తత్వం నుంచి విముక్తి చేయడమే లక్ష్యం: ప్రధానమంత్రి
ప్రజాస్వామ్యానికి భారత్ పుట్టినిల్లు, ప్రజాస్వామ్యం మన రక్తంలోనే ఉంది: ప్రధానమంత్రి
వికసిత్ భారత్ వైపు ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి మనకు ఒక రథం అవసరం. ఆ రథానికి ధైర్యం, సహనం చక్రాలుగా.. దాని పతాకం సత్యం, అత్యున్నత ఆచరణగా ఉండాలి. రథం గుర్రాలు శక్తి, జ్ఞానం, సంయమనం, దాతృత్వంగా.. దాని పగ్గాలు క్షమ, దయ సమతుల్యంగా ఉండాలి: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
25 NOV 2025 2:18PM by PIB Hyderabad
దేశ సామాజిక- సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాల్లో ఓ చిరస్మరణీయ సందర్భాన్ని గుర్తుచేస్తూ.. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో పవిత్రమైన శ్రీరామ జన్మభూమి ఆలయ శిఖరంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ఎగురవేశారు. ఈ ధ్వజారోహణోత్సవం ఆలయ నిర్మాణం పూర్తవ్వడాన్ని సూచిస్తుంది. అలాగే భారత సాంస్కృతిక వేడుకలకు, జాతీయ ఐక్యతకు కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లు తెలుపుతుంది. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రధాని మాట్లాడుతూ.. ‘‘నేడు యావత్ భారత్, ప్రపంచం శ్రీరాముడి స్ఫూర్తితో నిండిపోయిందని వ్యాఖ్యానించారు. ప్రతి రామ భక్తుడి హృదయంలో ఒక ప్రత్యేక సంతృప్తి, అపారమైన కృతజ్ఞత, అనంతమైన ఆనందం ఉన్నాయని ఆయన అన్నారు. శతాబ్దాల నాటి గాయాలు మానిపోతున్నాయని, శతాబ్దాల బాధ ముగిసిపోతోందని, శతాబ్దాల సంకల్పాలు నేడు నెరవేరుతున్నాయని తెలిపారు. ఇది 500 సంవత్సరాలుగా జ్వలిస్తూనే ఉన్న యజ్ఞానికి ముగింపు ఇది అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. విశ్వాసంలో ఎప్పుడూ చలించని, నమ్మకంలో ఒక్క క్షణం కూడా విచ్ఛిన్నం కాని యజ్ఞం ఇది అని అన్నారు. నేడు శ్రీరాముడి గర్భగుడిలోని అనంతమైన శక్తి, శ్రీరాముడి కుటుంబ దివ్య వైభవం ఈ ధర్మ ధ్వజం రూపంలో అత్యంత దివ్యమైన, గొప్ప ఆలయంలో ప్రతిష్ఠించినట్లు స్పష్టం చేశారు.
‘‘ఈ ధర్మ ధ్వజం కేవలం ఒక జెండా మాత్రమే కాదు, భారతీయ నాగరికత పునరుజ్జీవన పతాకం’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు. జెండాలోని కాషాయ రంగు, దానిపై చెక్కిన సూర్య వంశపు వైభవం, పవిత్రమైన ఓం చిత్రం, చెక్కిన కోవిదార వృక్షం (మందార చెట్టు) రామరాజ్యం గొప్పతనాన్ని సూచిస్తాయని వివరించారు. ‘‘ఈ జెండా ఒక సంకల్పం, ఈ జెండా ఒక విజయం, ఈ జెండా పోరాటం ద్వారా జరిగిన సృష్టి గాథ, ఈ జెండా శతాబ్దాలుగా మోసుకెళ్లిన కలలకు నిదర్శనం.ఈ జెండా సాధువుల తపస్సు, సమాజ భాగస్వామ్యానికి సార్థకమైన ముగింపు’’ అని తెలిపారు.
రాబోయే శతాబ్దాలు, వేల సంవత్సరాలకు ఈ ధర్మ ధ్వజం శ్రీరాముడి ఆదర్శాలు, సిద్ధాంతాలను ప్రపంచానికి తెలియజేస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ వెల్లడించారు. విజయం సత్యానికే చెందుతుంది.. అబద్దానికి కాదనే విషయాన్ని సూచిస్తుందన్నారు. సత్యమే బ్రహ్మ స్వరూపం, సత్యంలోనే ధర్మం స్థాపితమై ఉంటుందని తెలియజేస్తుందని చెప్పారు. ఇచ్చిన మాటను నెరవేర్చాలనే సంకల్పాన్ని ఈ ధర్మ ధ్వజం ప్రేరేపిస్తుందని, ప్రపంచంలో కర్మ, విధికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనే సందేశాన్ని అందిస్తుందని తెలిపారు. బేదాభిప్రాయాలు, వివక్ష, బాధల నుంచి విముక్తి, సమాజంలో శాంతి, సంతోషం ఉండాలనే ఆకాంక్షను ఇది వ్యక్తపరుస్తుందన్నారు. పేదరికం లేని, ఎవరూ బాధపడని, నిస్సహాయంగా లేని సమాజాన్ని నిర్మించాలనే సంకల్పానికి ఈ ధర్మ ధ్వజం మనల్ని కట్టుబడి ఉండేలా చేస్తుందని స్పష్టం చేశారు.
మన గ్రంథాలను గుర్తుచేసుకుంటూ.. ఏ కారణం వల్లనైనా ఆలయానికి రాలేని వారు.. ధ్వజారోహణానికి నమస్కరించినా కూడా వారికి సమానమైన పుణ్యం లభిస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ధర్మ ధ్వజం ఆలయం ఉద్దేశ్యానికి ప్రతీక అని, యుగయుగాలుగా శ్రీరాముడి ఆజ్ఞలు, స్పూర్తిని మానవాళికి అందిస్తూ.. దూరం నుంచే శ్రీరాముడి జన్మస్థల దర్శనాన్ని అందిస్తుందని ఆయన చెప్పారు. ఈ మరపురాని, ప్రత్యేక సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రామ భక్తులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భక్తులందరికీ నమస్కరించి, రామ మందిర నిర్మాణానికి సహకరించిన ప్రతి దాతకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ నిర్మాణంతో సంబంధం ఉన్న ప్రతి కార్మికుడికి, ప్రతి కళాకారుడికి, ప్రతి ప్లానర్‌కు, ప్రతి వాస్తుశిల్పికి ప్రధానమంత్రి వందనం చేశారు.
“ఆదర్శాలు ఆచరణగా మారే భూమి అయోధ్య” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇదే నగరం నుంచి శ్రీరాముడు తన జీవిత ప్రయాణాన్ని ప్రారంభించాడని గుర్తుచేశారు. సమాజ శక్తి, విలువల ద్వారా ఒక వ్యక్తి ఎలా పురుషోత్తముడిగా మారతాడో అయోధ్యనే ప్రపంచానికి చూపించిందని ఆయన అన్నారు. శ్రీరాముడు అయోధ్యను విడిచి అరణ్యవాసానికి వెళ్లినప్పుడు యువరాజుగా ఉన్నాడని, కానీ తిరిగి వచ్చినప్పుడు ‘మర్యాద పురుషోత్తముడిగా’ వచ్చాడని ప్రధానమంత్రి ప్రస్తావించారు. శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడిగా అవతరించడంలో మహర్షి వశిష్ఠుడి జ్ఞానం, మహర్షి విశ్వామిత్రుడి ఉపదేశం, మహర్షి అగస్త్యుడి మార్గదర్శనం, నిషాద రాజు స్నేహం, మాత శబరి ఆప్యాయత, హనుమంతుడి భక్తి అన్నీ కీలకపాత్ర పోషించాయని ప్రధానమంత్రి వివరించారు.
అభివృద్ధి చెందిన భారత్ ను నిర్మించేందుకు సమాజ సమష్టి శక్తి అత్యంత అవసరమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. రామ మందిర దివ్య ప్రాంగణం దేశ సామూహిక శక్తికి చైతన్య స్థలంగా మారుతున్నందుకు మోదీ హర్షం వ్యక్తం చేశారు. గిరిజనుల ప్రేమ, ఆతిథ్య సంప్రదాయాలకు ప్రతీక అయిన మాత శబరి దేవాలయం సహా మొత్తం ఏడు దేవాలయాలు ఇక్కడ నిర్మించినట్లు తెలిపారు. నిషాదరాజు ఆలయం స్నేహానికి సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. స్నేహం విలువ దాని ప్రయోజనాల్లో కాదు... ప్రేమలో, నమ్మకంలో, గౌరవంలో ఉంటుందని, నిషాదరాజు ఆలయం ఈ భావాన్ని గుర్తు చేస్తుందని అన్నారు.
ఒకే ప్రాంగణంలో మాత అహల్య, మహర్షి వాల్మీకి, మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య, సంత్ తులసీదాస్ విగ్రహాలు రామ మందిర పరిసరాల్లో ఉండంటతో భక్తులు వారందరి దర్శనం ఒకే చోట పొందగలుగుతున్నారని ప్రధానమంత్రి తెలిపారు. గొప్ప సంకల్పాలను సాధించడంలో చిన్న సహాయాలు కూడా ఎంత విలువైనవో తెలిపే జటాయువు, ఉడుత విగ్రహాలను ఆయన ప్రస్తావించారు. రామ మందిరాన్ని సందర్శించినప్పుడల్లా, తప్పకుండా ఈ ఏడు ఆలయాలను కూడా సందర్శించాలని ప్రధానమంత్రి కోరారు. ఈ ఆలయాలు మన విశ్వాసాన్ని బలోపేతం చేయడంతో పాటు, స్నేహం, కర్తవ్యం, సామాజిక సామరస్యం వంటి విలువలను కూడా శక్తిమంతం చేస్తాయని చెప్పారు.
“మన రాముడు విభేదాల ద్వారా కాకుండా, భావోద్వేగాల మనల్ని కలుపుతాడు” అని శ్రీ మోదీ అన్నారు. శ్రీరాముడికి వంశం కంటే వ్యక్తి భక్తి ముఖ్యమని, వారసత్వం కంటే విలువలు గొప్పవని, శక్తి కంటే సహకారం గొప్పదని పేర్కొన్నారు. నేడు మనం కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామని వ్యాఖ్యానించారు. గత 11 సంవత్సరాల్లో మహిళలు, దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులు, పేదలు, రైతులు, కార్మికులు, యువత.. ఇలా సమాజంలోని ప్రతి వర్గాన్నిఅభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లీమని చెప్పారు. దేశంలోని ప్రతి వ్యక్తి, ప్రతి వర్గం, ప్రతి ప్రాంతం శక్తిమంతమైనప్పుడు ప్రతి ఒక్కరి కృషి సంకల్ప సాధనకు దోహదం చేస్తుందన్నారు. ఈ సామూహిక కృషి వల్లే 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ నిర్మితమవుతుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరిగిన చరిత్రాత్మక సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ప్రధానమంత్రి దేశ సంకల్పాన్ని రాముడితో అనుసంధానించడం గురించి ప్రస్తావించారు. రాబోయే వెయ్యి సంవత్సరాల వరకు భారత పునాదులను బలోపేతం చేయాలని గుర్తు చేశారు. వర్తమానం గురించి మాత్రమే ఆలోచించేవారు భవిష్యత్ తరాలకు అన్యాయం చేస్తారనీ... మనం ఈ రోజు గురించి మాత్రమే కాకుండా రాబోయే తరాల గురించి కూడా ఆలోచించాలని ఆయన సూచించారు. దేశం మనకు ముందూ ఉంది... మన తర్వాత కూడా అది కొనసాగుతుంది. ఒక శక్తిమంతమైన సమాజంగా మనం రాబోయే దశాబ్దాలు, శతాబ్దాలను దృష్టిలో ఉంచుకుని దూరదృష్టితో పని చేయాలన్నారు. దీని కోసం మనం రాముడి నుంచి ఎంతో నేర్చుకోవాలి... ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలి... ఆయన ప్రవర్తనను స్వీకరించాలి... రాముని ఆదర్శాలను, క్రమశిక్షణను, ఆయన జీవితంలోని అత్యున్నత స్వభావాన్ని మనం అలవర్చుకోవాలని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. రాముడు సత్యం, శౌర్యాల సంగమం... ధర్మ మార్గంలో నడిచే దైవ స్వరూపం... అన్నింటికంటే ప్రజల ఆనందానికి అత్యంత ప్రాధాన్యమిచ్చే గొప్ప వ్యక్తిత్వం... సహనం, క్షమా గుణాల సముద్రం... జ్ఞానం, విజ్ఞానాల మహోన్నత శిఖరం... సౌమ్యత మూర్తీభవించిన దృఢత్వం... కృతజ్ఞతకు నిలువెత్తు నిదర్శనం... మంచి సహవాసాన్ని ఎంచుకున్న నైపుణ్యం... గొప్ప బలంలోనూ వినయం, సత్యాలను ఆచరించే అచంచల సంకల్పం.... అప్రమత్తత, క్రమశిక్షణ, నిజాయతీ నిండిన హృదయం.... రాముడి ఈ లక్షణాలు బలమైన, దార్శనికమైన, శాశ్వతమైన దేశాన్ని నిర్మించడంలో మనకు మార్గనిర్దేశం చేయాలని ప్రధానమంత్రి అన్నారు.
"రాముడు కేవలం ఒక వ్యక్తి కాదు... ఒక విలువ, ఒక క్రమశిక్షణ, ఒక దిశ" అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే, సమాజం సాధికారత పొందాలంటే... మనలో ప్రతి ఒక్కరిలో రాముడు మేల్కొనాలి... మన హృదయాలన్నీ పవిత్రం కావాలి అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అటువంటి సంకల్పం తీసుకోవడానికి ఈ రోజు కంటే మంచి రోజు మరొకటి ఉండదని ఆయన స్పష్టం చేశారు. నవంబర్ 25 మన వారసత్వంలో మరొక అసాధారణ సందర్భంగా నిలుస్తుందన్నారు. ధర్మ ధ్వజంపై చెక్కిన కోవిదార్ వృక్షం దీనిని సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. మన మూలాల నుంచి మనల్ని మనం వేరు చేసుకుంటే... మన కీర్తి చరిత్ర పుటల్లో ఖననం అవుతుందని మనకు కోవిదార్ వృక్షం గుర్తుచేస్తుందని ఆయన వివరించారు.
భరతుడు తన సైన్యంతో చిత్రకూట్ చేరుకున్న సందర్భంలో దూరం నుంచే లక్ష్మణుడు అయోధ్య సేనను గుర్తించిన ఘట్టాన్ని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. ఒక గొప్ప వృక్షాన్ని పోలిన ప్రకాశవంతమైన, అత్యంత ఎత్తయిన పతాకం అయోధ్యదేననీ... కోవిదార్ వృక్ష శుభ చిహ్నంతో వారిని గుర్తించాననీ లక్ష్మణుడు రాముడితో చెప్పినట్లు వాల్మీకి రాసిన వర్ణనను శ్రీ మోదీ ప్రస్తావించారు. రామమందిరం ప్రాంగణంలో ఈ రోజు మరోసారి కోవిదార్ వృక్షాన్ని ప్రతిష్ఠిస్తున్న సందర్భం... కేవలం ఒక వృక్షం తిరిగి రావడం మాత్రమే కాదు... మన జ్ఞాపకాలు తిరిగి రావడం... గుర్తింపు పునరుజ్జీవనం పొందడం... గర్వించదగిన నాగరికతను పునరుద్ధరించడం గురించిన ప్రకటన అవుతుందని ఆయన స్పష్టం చేశారు. మన గుర్తింపును మనం మరచిపోయినప్పుడు, మనల్ని మనం కోల్పోతాం... గుర్తింపు తిరిగి వచ్చినప్పుడు, దేశం ఆత్మవిశ్వాసం కూడా తిరిగి వస్తుందనే గొప్ప సత్యాన్ని కోవిదార్ మనకు గుర్తు చేస్తుందని శ్రీ మోదీ తెలిపారు. దేశం ముందుకు సాగాలంటే... దాని వారసత్వాన్ని గర్వంగా భావించాలని చెబుతూ ఆయన పేర్కొన్నారు.
మన వారసత్వం పట్ల గర్వంతో పాటు... బానిసత్వ మనస్తత్వం నుంచి పూర్తిగా విముక్తి పొందడమూ అంతే ముఖ్యమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. 190 సంవత్సరాల కిందట అంటే 1835లో మెకాలే అనే ఆంగ్ల పార్లమెంటేరియన్ భారతదేశాన్ని దాని మూలాల నుండి పెకిలించి, మనలో మానసిక బానిసత్వానికి పునాది వేశారని ప్రధానమంత్రి గుర్తు చేశారు. 2035 నాటికి ఆ ఘటన జరిగి రెండు వందల సంవత్సరాలు పూర్తవుతాయని ఆయన పేర్కొన్నారు. రాబోయే పదేళ్ళు దేశాన్ని బానిస మనస్తత్వం నుంచి పూర్తిగా విముక్తి చేయడానికి అంకితం చేయాలని కోరారు. మెకాలే ఆలోచనలు విస్తృత ప్రభావాన్ని చూపడం అత్యంత దురదృష్టకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. భారతదేశం స్వాతంత్ర్యం పొందింది... కానీ న్యూనతా భావాల నుంచి విముక్తి పొందలేదని ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ప్రభావం చూపాయని ప్రధానమంత్రి తెలిపారు. విదేశీయులకు చెందిన ప్రతి విషయాన్ని గొప్పదిగా భావిస్తూ... మన దేశ సాంప్రదాయాలు, వ్యవస్థల్లో తప్పులను చూసేలా ఆ మాటలు అందరినీ ప్రభావితం చేశాయన్నారు.
భారత్ ప్రజాస్వామ్యాన్ని విదేశాల నుంచి స్వీకరించిందనే భావనను... మన రాజ్యాంగం కూడా విదేశీ ప్రేరణతో రూపొందించారనే భావనను బానిసత్వ మనస్తత్వం మరింత బలోపేతం చేస్తోందని శ్రీ మోదీ పేర్కొన్నారు. నిజానికి భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి వంటిది... ప్రజాస్వామ్యం మన డీఎన్ఏలోనే ఉంది. ఉత్తర తమిళనాడులోని ఉత్తిరమేరూర్ గ్రామంలో వెయ్యి సంవత్సరాల పురాతన శాసనం మన పాలన ప్రజాస్వామ్యబద్ధంగా సాగిన తీరునూ, ఆ యుగంలో కూడా ప్రజలు తమ పాలకులను ఎన్నుకున్న విధానాన్ని తెలియజేస్తుందని ఆయన స్పష్టం చేశారు. మాగ్నా కార్టాకు విస్తృత ప్రశంసలు లభించగా... మన భగవాన్ బసవన్న అనుభవ మంటప జ్ఞానాన్ని మరుగునపడేలా చేశారని ఆయన పేర్కొన్నారు. సామాజిక, మతపరమైన, ఆర్థిక అంశాలను బహిరంగంగా చర్చించే... సమష్టిగా ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకునే వేదిక అనుభవ మంటపం అని ఆయన వివరించారు. బానిసత్వ మనస్తత్వం కారణంగా దేశంలోని తరతరాలు తమ సొంత ప్రజాస్వామ్య సంప్రదాయాల గురించిన ఈ జ్ఞానాన్ని తెలుసుకోలేకపోయాయని ఆయన విచారం వ్యక్తం చేశారు.
మన వ్యవస్థలోని ప్రతి మూలలోనూ బానిసత్వ మనస్తత్వం పాతుకుపోయిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. శతాబ్దాలుగా భారత నావికాదళ పతాకంలో భారత నాగరికత బలం, వారసత్వంతో సంబంధం లేని చిహ్నాలను కలిగి ఉండేదని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు నావికాదళ పతాకం నుంచి బానిసత్వానికి సంబంధించిన ప్రతి చిహ్నాన్ని తొలగించామనీ... ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసత్వాన్ని స్థాపించామని ఆయన స్పష్టం చేశారు. ఇది కేవలం డిజైన్‌లో మార్పు కాదనీ... మనస్తత్వంలో పరివర్తన తెచ్చే క్షణం అన్నారు. భారత్ ఇకపై తన బలాన్ని ఇతరుల వారసత్వం ద్వారా కాకుండా దాని సొంత చిహ్నాల ద్వారానే నిర్వచిస్తుందని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
అయోధ్యలో నేడు అదే పరివర్తన కనిపిస్తోందని శ్రీ మోదీ అన్నారు. చాలా సంవత్సరాలుగా రామతత్వ సారాన్ని తిరస్కరించింది బానిసత్వ మనస్తత్వమేనని ఆయన స్పష్టం చేశారు. ఓర్చా రాజా రాముడి నుంచి రామేశ్వరం భక్త రాముడి వరకు... శబరి ప్రభు రాముడి నుంచి మిథిలా నగర పహునా రామ్ జీ వరకు శ్రీరాముడు తనలో తాను సంపూర్ణ విలువల వ్యవస్థ అని శ్రీ మోదీ తెలిపారు. ప్రతి ఇంట్లో, ప్రతి భారతీయ హృదయంలో, దేశంలోని ప్రతి కణంలో రాముడు నివసిస్తున్నాడు. బానిసత్వ మనస్తత్వం ఎంతగా ప్రబలిందంటే... రాముడిని కూడా ఊహాజనిత పాత్రగా వారు ప్రకటించే పరిస్థితి వచ్చిందని ఆయన విచారం వ్యక్తం చేశారు.
రాబోయే పదేళ్లలో బానిసత్వ మనస్తత్వం నుంచి పూర్తిగా విముక్తి పొందాలని మనం సంకల్పించుకుంటే... 2047 నాటికి వికసిత్ భారత్ కల సాకారాన్ని ఏ శక్తీ ఆపలేనంత ఆత్మవిశ్వాస జ్వాల రగులుతుందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. మెకాలే మానసిక బానిసత్వ ప్రాజెక్టును వచ్చే దశాబ్దంలోగా పూర్తిగా నిర్మూలించినప్పుడే రాబోయే వెయ్యి సంవత్సరాల వరకు భారత పునాది బలంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయోధ్యలోని రామ్ లల్లా ఆలయ సముదాయం మరింత అద్భుతంగా మారుతోందనీ... అయోధ్యను అందంగా తీర్చిదిద్దే పని వేగంగా కొనసాగుతోందనీ ఆయన తెలిపారు. అయోధ్య మరోసారి ప్రపంచానికి ఉదాహరణగా నిలిచే నగరంగా మారుతోందని ఆయన ప్రకటించారు. త్రేతా యుగంలో అయోధ్య మానవాళికి ప్రవర్తనా నియమావళిని అందించిందనీ... 21వ శతాబ్దంలోనూ అయోధ్య మానవాళికి కొత్త అభివృద్ధి నమూనాను అందిస్తోందని శ్రీ మోదీ వివరించారు. అప్పట్లో అయోధ్య క్రమశిక్షణకు కేంద్రంగా ఉండేదనీ... ఇప్పుడు అయోధ్య అభివృద్ధి చెందిన భారతదేశానికి వెన్నెముకగా ఎదుగుతోందని ఆయన అన్నారు.
భవిష్యత్తులో సాంప్రదాయం, ఆధునికతల సంగమంగా అయోధ్య ఉంటుందనీ, అక్కడ సరయూ నది పవిత్ర ప్రవాహంతో పాటు అభివృద్ధి ప్రవాహం కలిసి నడుస్తాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అయోధ్య ఆధ్యాత్మికత, కృత్రిమ మేధస్సుల మధ్య సామరస్యాన్ని ప్రదర్శిస్తుందని ఆయన తెలిపారు. రామ పథం, భక్తి పథం, జన్మభూమి పథం కలిసి కొత్త అయోధ్య దార్శనికతను ప్రదర్శిస్తాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. అయోధ్యను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానించే వందే భారత్, అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు గొప్ప విమానాశ్రయం, అద్భుతమైన రైల్వే స్టేషన్‌ను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. అయోధ్య ప్రజలకు సౌకర్యాలు కల్పించడానికి, వారి జీవితాల్లో శ్రేయస్సు తీసుకురావడానికి నిరంతర కృషి జరుగుతోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత దాదాపు 45 కోట్ల మంది భక్తులు దర్శనం కోసం రామాలయాన్ని సందర్శించారనీ... ఇది అయోధ్య, పరిసర ప్రాంతాల ప్రజల ఆదాయాన్నీ పెంచిందన్నారు. ఒకప్పుడు అయోధ్య అభివృద్ధి పారామితులలో వెనకబడి ఉందనీ... అది ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ నగరాల్లో ఒకటిగా అభివృద్ధి చెందుతోందని ఆయన పేర్కొన్నారు.
21వ శతాబ్దంలో రాబోయే కాలం చాలా ముఖ్యమైనదన్న శ్రీ మోదీ...స్వాతంత్య్రం వచ్చిన 70 సంవత్సరాల్లో భారత్ ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగా... గత 11 సంవత్సరాల్లోనే ఏకంగా 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని స్పష్టం చేశారు. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచే రోజు ఎంతో దూరంలో లేదని ఆయన పేర్కొన్నారు. రాబోయే సమయం కొత్త అవకాశాలు, విజయాలతో కూడుకున్నదనీ... ఈ కీలక సమయంలో రాముడి ఆలోచనలు దేశానికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఆయన తెలిపారు. రావణుడిపై విజయం సాధించాలనే గొప్ప సవాలును శ్రీరాముడు ఎదుర్కొన్నప్పుడు ఆయన రథానికి... శౌర్యం, సహనం చక్రాలుగా... సత్యం, సత్ప్రవర్తనలు పతాకంగా... బలం, జ్ఞానం, నిగ్రహం, దయాగుణాలు నాలుగు అశ్వాలుగా... క్షమ, కరుణ, సమానత్వాలు పగ్గాలుగా మారి ఆయన రథాన్ని సరైన దిశలో కదిలించాయని ప్రధానమంత్రి వివరించారు.
అభివృద్ధి చెందిన భారత్ దిశగా ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి శౌర్యం, సహనం అనే చక్రాలు కలిగిన రథం అవసరమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అంటే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం, ఫలితాలు సాధించే వరకు స్థిరంగా ఉండే పట్టుదల అవసరమన్నారు. ఈ రథానికి సత్యం, సత్ప్రవర్తనలు పతాకంగా అవసరమని ఆయన పేర్కొన్నారు. అంటే విధానం, ఉద్దేశం, నైతికత విషయంలో ఎప్పుడూ రాజీ పడకూడదని ఇది సూచిస్తుందన్నారు. రథానికి నాలుగు అశ్వాలుగా బలం, జ్ఞానం, క్రమశిక్షణ, దయాగుణం అంటే శక్తి, తెలివి, సంయమనం, ఇతరులకు సేవ చేసే స్ఫూర్తి అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ రథానికి పగ్గాలు క్షమ, కరుణ, సమానత్వం అనీ... అంటే విజయంలో అహంకారం ఉండకూడదనీ, వైఫల్యంలోనూ ఇతరుల పట్ల గౌరవం ఉండాలని ఇది సూచిస్తుందని శ్రీ మోదీ తెలిపారు. ఈ సమయం భుజం భుజం కలిపి నిలబడటం... వేగాన్ని పెంచడం... రామరాజ్యం స్ఫూర్తిగా దేశాన్ని నిర్మించే సమయం అని శ్రీ మోదీ భక్తితో అన్నారు. సొంత ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనం అత్యున్నతంగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందని చెబుతూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. మరోసారి అందరికీ తన హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
నేపథ్యం
ఈ కార్యక్రమం మార్గశీర్ష మాస శుక్ల పక్ష శుభ పంచమి తిథి... శ్రీరాముడు, సీతాదేవీల వివాహ ముహూర్తమైన అభిజిత్ ముహూర్తంల కలయికలో జరిగింది. ఇది దైవిక కలయికను సూచిస్తుంది. ఈ తేదీ తొమ్మిదవ సిక్కు గురువు గురు తేగ్ బహదూర్ జీ బలిదానం చేసిన రోజునూ సూచిస్తుంది. ఆయన 17వ శతాబ్దంలో అయోధ్యలో 48 గంటలు నిరంతరాయంగా ధ్యానం చేశారు. ఈ విశిష్టత ఈ రోజు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది.
పది అడుగుల ఎత్తు, ఇరవై అడుగుల పొడవు గల లంబకోణ త్రిభుజాకార పతాకం... భగవాన్ శ్రీరాముని తేజస్సు, పరాక్రమాన్ని సూచించే ప్రకాశవంతమైన సూర్యుని ప్రతిమను కలిగి ఉంది... దానిపై కోవిదార్ వృక్షపు చిత్రంతో పాటు 'ఓం' రాసి ఉంది. ఈ పవిత్రమైన కాషాయ జెండా రామరాజ్య ఆదర్శాలను ప్రతిబింబించే గౌరవం, ఐక్యత, సాంస్కృతిక కొనసాగింపుల సందేశాన్ని తెలియజేస్తుంది.
సాంప్రదాయ ఉత్తర భారత నగర నిర్మాణ శైలిలో నిర్మించిన శిఖరం పైన పతాకం ఎగురుతుంది. దక్షిణ భారత నిర్మాణ సాంప్రదాయంలో ఆలయం చుట్టూ నిర్మించిన 800 మీటర్ల పార్కోటా ఈ ఆలయ నిర్మాణ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది.
ఈ ఆలయ సముదాయంలో ప్రధాన ఆలయ బయటి గోడలపై వాల్మీకి రామాయణం ఆధారంగా భగవాన్ శ్రీరాముడి జీవితం నుంచి 87 ఘట్టాలు చక్కని రాతి శిల్పాలుగా చెక్కారు... ఆవరణ గోడల వెంట భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే 79 కాంస్య శిల్పాలను మలిచారు. ఈ అంశాలన్నీ కలిసి సందర్శకులందరికీ అర్థవంతమైన, అవగాహనాయుత అనుభవాన్ని అందిస్తాయి. భగవాన్ శ్రీరాముడి జీవితం, భారత సాంస్కృతిక వారసత్వం గురించి లోతైన అవగాహనను అందిస్తాయి.
(रिलीज़ आईडी: 2194360)
आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam