‘వదులుకోవడం ఒక ఎంపిక కాదు’... ఎందుకో మాస్టర్ క్లాస్‌లో వివరించిన అనుపమ్ ఖేర్
“వైఫల్యం ఒక ఘటన మాత్రమే.. ఎప్పటికీ వ్యక్తిత్వానికి సూచిక కాదు”’: ఖేర్
గోవాలోని పనాజీలో కళా మందిర్ వేదికగా ఈ రోజు జరిగిన మొదటి మాస్టర్‌క్లాస్‌లో ప్రఖ్యాత నటుడు అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ... 'వదులుకోవడం ఒక ఎంపిక కాదు' అనే ఇతివృత్తంతో జరిగిన సమావేశంలో తనదైన నైపుణ్యం, విజ్ఞానంతో కూడిన సంభాషణలతో వందలాది మందిలో స్ఫూర్తిని నింపారు.
సారాంశ్ చిత్రం చిత్రీకరణ సమయంలో కొన్ని రోజులకు తన ప్రధాన పాత్రను కోల్పోయి, తరువాత దానిని తిరిగి పొందిన తన కథను చెబుతూ అనుపమ్ ఖేర్ ఈ సమావేశాన్ని ప్రారంభించారు. ఆరు నెలల పాటు ఆ పాత్రను తన మనసులో పూర్తిగా నింపుకున్న తరువాత... అకస్మాత్తుగా ఆ పాత్ర నుంచి తనను తొలగించడంతో ఆయన చాలా కుంగిపోయారు. నిరాశలో ముంబయి నగరానికి శాశ్వతంగా వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకుని... చివరిసారిగా ఆ చిత్ర దర్శకుడు మహేష్ భట్‌ను కలవడానికి వెళ్ళారు. అనుపమ్ ఖేర్ ప్రతిస్పందనను అర్థం చేసుకున్న భట్... ఆ పాత్రను తిరిగి ఆయనకే అప్పగించారు. ఈ చిత్రం ఖేర్ కెరీర్‌లో ముఖ్యమైన చిత్రంగా నిలిచింది. ఆ అనుభవాన్ని ప్రతిబింబిస్తూ... జీవితంలో దేనినీ వదులుకోకూడదనే పాఠాన్ని సారాంశ్ చిత్రం తనకు నేర్పిందని ఖేర్ వివరించారు. ఆ ఎదురుదెబ్బను తన ఎదుగుదలకు ప్రారంభంగా ఆయన భావించారు.
"నా స్ఫూర్తిదాయక ప్రసంగాలన్నీ నా జీవిత అనుభవాలే"
తన సొంత జీవిత అనుభవాలు ఎన్నింటినో ఈ సమావేశంలో అనుపమ్ ఖేర్ పంచుకున్నారు. 14 మంది కుటుంబ సభ్యులు ఒకే ఇరుకైన, దిగువ మధ్య తరగతి ఇంట్లో నివసిస్తున్నప్పటికీ... తన తాతగారు నిశ్చితంగా జీవించడం, జీవితం పట్ల ప్రత్యేక దృక్పథాన్ని కలిగి ఉండే విషయంలో తనకు ఎంతో స్ఫూర్తినిచ్చారని ఆయన తెలిపారు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ సంతోషంగా గడిపిన తన బాల్యాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. చిన్న విషయాల్లోనే ఆనందాన్ని కనుగొనాలని తన తాత చెప్పిన మాటలనూ అనుపమ్ ఖేర్ పంచుకున్నారు.
“వైఫల్యం ఒక ఘటన మాత్రమే, అది ఎన్నటికీ వ్యక్తిత్వానికి సూచిక కాదు.”
తన చిన్నతనానికి సంబంధించి హృదయానికి హత్తుకునే ఓ జ్ఞాపకాన్ని ఈ సందర్భంగా అనుపమ్ ఖేర్ పంచుకున్నారు. అటవీ శాఖలో గుమస్తాగా పనిచేసే తన తండ్రి తాను ప్రపంచాన్ని ఎలా చూడాలో నేర్పిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. 60 మంది విద్యార్థులు ఉన్న తరగతిలో తాను 58వ స్థానంలో ఉన్నట్టు తన రిపోర్ట్ కార్డు ద్వారా తండ్రికి తెలిసినప్పుడు జరిగిన సంఘటనను ఖేర్ వివరించారు. ఫలితం గురించి బాధపడకుండా అతని తండ్రి చాలా సేపు మౌనంగా ఉండి, తరువాత ఖేర్‌తో ఇలా చెప్పారు... "తన తరగతిలోగానీ, క్రీడల్లో గానీ మొదటి స్థానంలో ఉండే వ్యక్తిపై ఎల్లప్పుడూ ఆ ట్రాక్ రికార్డును నిలబెట్టుకోవాలనే ఒత్తిడిని ఉంటుంది. ఎందుకంటే టాప్ గ్రేడ్ కంటే తక్కువ ఉండేది ఏదైనా వారికి వైఫల్యంలానే కనిపిస్తుంది. కానీ 58వ స్థానంలో ఉన్న వ్యక్తికి తన స్థానాన్ని మెరుగుపరుచుకోవడానికి అనేక అవకాశాలు ఉంటాయి. కాబట్టి నాకు ఒక సహాయం చేయు, తదుపరి పరీక్షలో 48వ స్థానం సాధించడం లక్ష్యంగా చేసుకో."
“నీ జీవిత చరిత్రలో ప్రధాన పాత్ర నీదే కావాలి”
ఈ సమావేశంలో తన జీవితంలోని అనేక సంఘటనలు, ఉదాహరణలను వివరించిన అనుపమ్ ఖేర్... తమ దృక్కోణాన్ని మెరుగుపరుచుకోవాలని ప్రేక్షకులను ప్రోత్సహించారు. నిజానికి వ్యక్తిత్వం అంటే నిజమైన మిమ్మల్ని మీరు అంగీకరించడం మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. తమను తాము నమ్ముతూ, తమ జీవిత చరిత్రలో ప్రధాన పాత్ర తమదై ఉండేలా జీవించాలని ఆయన పునరుద్ఘాటించారు. "జీవితం ఎందుకు సులభంగానో, సరళంగానో ఉండాలి? జీవితంలో ఎందుకు సమస్యలు ఉండకూడదు? నిజానికి మీ సమస్యలే మీ జీవిత చరిత్రను గొప్ప జీవితచరిత్ర గా మారుస్తాయి" అని వివరించారు.
ప్రశ్నోత్తరాల సెషన్‌లో ఉత్సాహభరితమైన ఆయన వన్-మ్యాన్ షో అందరి దృష్టినీ ఆకర్షించింది. తన ముగింపు సమాధానంలో ఆయన ఇలా అన్నారు... ‘వదులుకోవడం ఒక ఎంపిక కాదు’ అనేది వట్టి పదబంధం మాత్రమే కాదు... ఇది నమ్మశక్యం కాని కఠిన శ్రమ. మీరు ఏదైనా కోరుకుంటే... దాని కోసం మీరు త్యాగం చేయాలి, పట్టుదలతో దానిని సాధించడానికి మిమ్మల్ని మీరు ఒప్పించుకోవాలి... దాని కోసం మీరు నిరాశలనూ భరించాల్సి ఉంటుంది అని నేను నమ్ముతాను. మిత్రమా, మీరు దానిని వదులుకుంటే... అక్కడితోనే మీ కథ ముగిసిపోతుంది.”
ఐఎఫ్ఎఫ్ఐ గురించి
1952లో ప్రారంభమైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం దక్షిణాసియాలోనే పురాతనమైన, అతిపెద్ద సినిమా వేడుకగా నిలుస్తుంది. నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్... భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ... గోవా రాష్ట్ర ప్రభుత్వం... గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవం ప్రపంచ సినిమాకు ప్రధాన కేంద్రంగా ఎదిగింది. ఇక్కడ అలనాటి అపురూప చిత్రాలు, సాహసోపేతమైన ప్రయోగాత్మక చిత్రాలు, లెజెండరీ మాస్ట్రోలు, నిర్భయంగా రూపొందించిన తొలి సినిమాలు ఒకే చోట కలిసి ఈ వేడుకలకు హాజరైన ప్రేక్షకులను అలరిస్తాయి. అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్‌క్లాస్‌లు, ఘన నివాళులతో పాటు... ఆలోచనలు, ఒప్పందాలు, సహకారాలకు అపార అవకాశాలను అందించే శక్తిమంతమైన వేవ్స్ ఫిల్మ్ బజార్ వంటి కార్యక్రమాలు ఐఎఫ్ఎఫ్ఐని మరింత అద్భుత వేదికగా మార్చుతున్నాయి. నవంబర్ 20–28 వరకు అందమైన గోవా తీరప్రాంతంలో ప్రదర్శితమయ్యే 56వ ఎడిషన్.... ప్రపంచ వేదికపై భారత సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించే ఒక అద్భుతమైన వేడుకగా... భాషలు, శైలులు, ఆవిష్కరణలు, స్వరాల అద్భుత సంగమంగా నిలుస్తుంది.
మరింత సమాచారం కోసం, దీనిపై క్లిక్ చేయండి:
Release ID:
2193884
| Visitor Counter:
4
Read this release in:
Assamese
,
Konkani
,
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Malayalam