ప్రధాన మంత్రి కార్యాలయం
ఐబీఎస్ఏ నాయకుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన
Posted On:
23 NOV 2025 2:29PM by PIB Hyderabad
గౌరవ అధ్యక్షుడు రామఫోసా,
గౌరవ అధ్యక్షుడు లూలా,
మిత్రులారా,
నమస్కారం!
చైతన్యవంతమైన, అందమైన జోహన్నెస్‌బర్గ్ నగరంలో జరుగుతున్న ఐబీఎస్ఏ నాయకుల సమావేశంలో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ చొరవ తీసుకున్నందుకు ఐబీఎస్ఏ ఛైర్ అయిన అధ్యక్షుడు లూలాకు, ఆతిథ్యం ఇచ్చిన అధ్యక్షుడు రామఫోసాకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఐబీఎస్ఏ కేవలం మూడు దేశాల వేదిక మాత్రమే కాదు. ఇది మూడు ఖండాలను, మూడు ప్రధాన ప్రజాస్వామ్య శక్తులను, మూడు ముఖ్యమైన ఆర్థిక వ్యవస్థలను కలిపే ఒక కీలకమైన వేదిక. ఇది మన వైవిధ్యం, భాగస్వామ్య విలువలు ఉమ్మడి ఆకాంక్షలలో పాతుకుపోయిన లోతయిన, శాశ్వతమైన భాగస్వామ్యం కూడా.
మిత్రులారా,
నేటి ఐబీఎస్ఏ నాయకుల సమావేశం చరిత్రాత్మకమైనది. సమయానుకూలమైనది కూడా. ఆఫ్రికా ఖండంలో జరుగుతున్న ఈ మొదటి జీ20 సదస్సు, గ్లోబల్ సౌత్ దేశాలు వరుసగా నాయకత్వం వహించిన నాలుగు జీ20 అధ్యక్ష హోదాల పరిసమాప్తిని సూచిస్తోంది. గత మూడు సంవత్సరాలుగా, మూడు ఐబీఎస్ఏ దేశాలు జీ20కి నాయకత్వం వహించాయి. ఈ మూడు సదస్సుల ద్వారా, మనం మానవ కేంద్రీకృత అభివృద్ధి, బహుళపక్ష సంస్కరణ, సుస్థిర అభివృద్ధి వంటి భాగస్వామ్య ప్రాధాన్యతలపై అనేక ముఖ్యమైన కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళాం. ఈ కార్యక్రమాలను బలోపేతం చేయడం, వాటి ప్రభావాన్ని పెంచడం అనేది ఇప్పుడు మన సమష్టి బాధ్యత. ఈ స్ఫూర్తితో, మన సహకారంపై నేను కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నాను.
మిత్రులారా,
మొదటగా... ప్రపంచ సంస్థలు 21వ శతాబ్దపు వాస్తవాలను ప్రతిబింబించడం లేదనే విషయాన్ని మనమంతా అంగీకరిస్తున్న్నాం. మనలో ఎవరికీ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేదు. ఇది ప్రపంచ సంస్థలు నేటి ప్రపంచానికి ఇకపై ప్రాతినిధ్యం వహించడం లేదని స్పష్టంగా రుజువు చేస్తోంది. అందువల్ల, ఐబీఎస్ఏ ప్రపంచానికి ఐక్య సందేశాన్ని పంపాలి. సంస్థాగత సంస్కరణ అనేది కేవలం ఒక ఎంపిక కాదు.. అది ఒక హక్కు.
అదేవిధంగా, ఉగ్రవాదంపై పోరాటంలో కూడా మనం సన్నిహిత సమన్వయంతో పనిచేయాలి. ఇంతటి తీవ్రమైన సమస్యపై ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదు. ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం ఒకే విధమైన, నిర్ణయాత్మకమైన చర్య అవసరం.
మూడు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల (ఎన్ఎస్ఏ) మొదటి సమావేశం 2021లో భారత్ ఐబీఎస్ఏ అధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడు జరిగింది. భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడానికి మనం దీనిని సంస్థాగతం చేయవచ్చు.
మిత్రులారా,
ప్రజా ప్రాధాన్య అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా డిజిటల్ మౌలిక సదుపాయాలు, కృత్రిమ మేధ వంటి రంగాలలో ఐబీఎస్ఏ ఒక ముఖ్యపాత్ర పోషించవచ్చు. ఈ విషయంలో మనం ‘ఐబీఎస్ఏ డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్‘ ఏర్పాటును పరిశీలించవచ్చు. దీని ద్వారా యూపీఐ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోవిన్ వంటి ఆరోగ్య వేదికలు, సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలు, మహిళల నేతృత్వంలోని సాంకేతిక కార్యక్రమాలను మన మూడు దేశాల మధ్య పంచుకోవచ్చు. ఇది మన డిజిటల్ ఆర్థిక వ్యవస్థల వృద్ధిని వేగవంతం చేస్తుంది. గ్లోబల్ సౌత్ కోసం పరిగణించదగిన పరిష్కారాలను సృష్టిస్తుంది. సురక్షితమైన, విశ్వసనీయమైన ప్రజా ప్రాధాన్య ఏఐ నిబంధనల రూపకల్పనకు మనం కలసి దోహదపడగలం. దీనిని వచ్చే ఏడాది భారత్ లో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ప్రారంభించవచ్చు.
మిత్రులారా,
సుస్థిరవృద్ధి కోసం, ఐబీఎస్ఏ పరస్పర అభివృద్ధి ప్రయత్నాలకు తోడ్పడటమే కాకుండా, ప్రపంచానికి ఒక ఉదాహరణగా కూడా నిలబడగలదు. చిరుధాన్యాలు, ప్రకృతి వ్యవసాయం, ప్రోత్సాహంలో అయినా, విపత్తుల ప్రతిఘటన, హరిత ఇంధనం విషయంలో అయినా, లేదా సంప్రదాయ వైద్యం, ఆరోగ్య భద్రతలో అయినా, ఈ రంగాలలో మన బలాలను ఏకీకృతం చేయడం ద్వారా, ప్రపంచ సంక్షేమానికి మనం అర్థవంతంగా దోహదపడగలం.
ఈ దృష్టికోణంతోనే ఐబీఎస్ఏ నిధిని ఏర్పాటు చేశాం. దాని మద్దతుతో, మనం 40 దేశాలలో దాదాపు 50 ప్రాజెక్టులను అమలు చేశాం. విద్య, ఆరోగ్యం నుంచి మహిళా సాధికారత, సౌరశక్తి వరకు విస్తరించిన ఈ కార్యక్రమాలు స్థానిక సమాజాల అవసరాల ఆధారంగా రూపు దిద్దుకున్నాయి. ఈ సహకార స్ఫూర్తిని మరింత బలోపేతం చేయడానికి మనం వాతావరణ పరిస్థితుల ఆధారిత వ్యవసాయం కోసం కూడా ఐబీఎస్ఏ నిధి ఏర్పాటును పరిశీలించవచ్చు.
మిత్రులారా,
నేటి ప్రపంచం అనేక రంగాలలో విచ్ఛిన్నంగా, విభజించినట్టుగా కనిపిస్తోంది. ఇటువంటి సమయంలో ఐబీఎస్ఏ ఐక్యత, సహకారం మానవత్వం సందేశాన్ని అందించగలదు. ఇది మూడు ప్రజాస్వామ్య దేశాలుగా మన బాధ్యత, మన బలం కూడా.
చాలా ధన్యవాదాలు.
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి సుమారు తెలుగు అనువాదం.
***
(Release ID: 2193286)
Visitor Counter : 2