సహజసిద్ధమైన అద్భుతం: తన చతురత, వివేకం, సినీ అద్భుతంతో ఇఫికి నూతన శోభను తీసుకువచ్చిన విధు వినోద్ చోప్రా వీక్షకుల నవ్వులు, చప్పట్లతో ధారాళంగా సాగిన ఆసక్తికర కథనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కామ్నా చంద్ర జీవిత ప్రయాణం
"అన్ స్క్రిప్టెడ్ - సినిమా రూపకల్పనకు కళ, భావోద్వేగం" అనే శీర్షికతో ఇఫిలో జరిగిన ముఖాముఖి కార్యక్రమం ఇవాళ కళా అకాడమీని ఒక సినిమా సెట్‌లా మార్చింది. ప్రఖ్యాత సినీ దర్శకుడు, నిర్మాత విధు వినోద్ చోప్రా, సుప్రసిద్ధ స్క్రీన్‌రైటర్ అభిజాత్ జోషి కలిసి జరిపిన సంభాషణతో అద్భుతం ఆవిష్కృతమైంది. సాధారణంగా శుక్రవారం రోజున విడుదలయ్యే భారీ సినిమాకు ఉండే ఉత్సాహానికి సమానంగా ఈ సంభాషణ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
సన్మాన కార్యక్రమంతో ప్రారంభమైన ఈ సమావేశంలో సంయుక్త కార్యదర్శి (ఫిలిం) డాక్టర్ అజయ్ నాగభూషణ్ ఎంఎన్.. చోప్రా, జోషిలను సన్మానించగా, వారికి ప్రఖ్యాత సినీ నిర్మాత శ్రీ రవి కొట్టారక్కర శాలువాలు కప్పి గౌరవించారు. తనదైన శైలిలో నిజాయితీతో యువ చిత్ర నిర్మాతలకు చోప్రా మార్గనిర్దేశం చేయటాన్ని కొనసాగిస్తారని డాక్టర్ అజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. చోప్రా తీసిన 'పరిందా' చిత్రం "సరికొత్త ఒరవడిని సృష్టించి", భారత సినిమా చరిత్రను తిరగరాసిందని నిర్మాత రవి కొనియాడారు.
వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా చిత్రాలు తీసే సినీరూపకర్త
సంభాషణ ప్రారంభంలో విధు వినోద్ చోప్రాను అభిజాత్ జోషి మొదటిసారి కలిసిన రోజును గుర్తుచేసుకున్నారు. ఆ రోజు నవంబర్ నెలలోనే ఉందని, ఆ పరిచయమే 'లగే రహో మున్నాభాయ్’, '౩ ఇడియట్స్' వంటి సినిమాల రూపకల్పనకు దారితీసిందన్నారు. 'పరిందా' నుంచి ‘12th ఫెయిల్' వరకు సినిమా తీసే పద్ధతి ఏమైనా మారిందా అని చోప్రాను జోషి అడిగారు. చాలా స్పష్టంగా, ఎలాంటి దాపరికాలు లేకుండా చోప్రా సమాధానమిచ్చారు.

"ఆయా సమయాల్లో నా మనస్తత్వం ఎలా ఉంటుందో, ప్రతి సినిమాలో ఆ వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. 'పరిందా' సమయంలో కోపంగా ఉండేవాడిని. ఆ సినిమాలో మీరు హింసను చూడవచ్చు. కానీ ఇవాళ నేను శాంతంగా ఉన్నాను" అని చెప్పారు.
తన చుట్టూ ఉన్న అవినీతిని చూసి ‘12th ఫెయిల్' సినిమా తీసినట్లు ఆయన తెలిపారు. "మార్పు కోసం మనం నిజాయితీగా ఉందామని తెలియజేయటానికి నేను ఎంచుకున్న మార్గం. దీనిద్వారా అధికార వ్యవస్థలో 1% మార్పు తీసుకురాగలిగినా చాలు" అని ఆయన అన్నారు. 8k వెర్షన్‌లో పునరుద్ధరించిన ‘1942: ఎ లవ్ స్టోరీ' చిత్రాన్ని చూసి భావోద్వేగానికి గురైనట్లు చెప్పారు. అయితే, ఆ సినిమాను తాను ఈరోజుల్లో తీయలేనని, ఎందుకంటే తాను అప్పటి వ్యక్తిని కాదని తెలిపారు.
అంకితభావంతో కూడిన సినిమా

చోప్రాకున్న గొప్ప లక్షణం ఆయకున్న అచంచలమైన విశ్వాసమేనని జోషి అన్నారు. "వాణిజ్య పరంగా సినిమా విజయం సాధించటాన్ని ఆయన ఎప్పుడూ పట్టించుకోరు. దాని కళాత్మక గమ్యాన్ని మాత్రమే విలువైనదిగా భావిస్తారు" అని తెలిపారు. ఆ తరవాత 'పరిందా’, ‘12th ఫెయిల్' సినిమాల సృజనాత్మక ప్రక్రియ వైపు సంభాషణను మళ్లించారు.
సన్నాహం, ముందుచూపు, సహజ అనుకరణ గురించి చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘1942: ఎ లవ్ స్టోరీ' చిత్రంలోని ఒక ప్రసిద్ధ షాట్ గురించి వివరిస్తూ, ప్రేక్షకులు హర్షధ్వానాలు చేస్తుండగా మనస్ఫూర్తిగా ఒక పాటను కూడా పాడారు. నిజమైన పక్షులు పర్వత శిఖరం మీదుగా ఎగురుతున్న షాట్ కోసం ఆయన ఎంత పట్టుబట్టారో చెబుతూ, దాని చిత్రీకరణకు తమ సిబ్పంది పక్షులకు దాణా చల్లిన తీరును వివరించారు. ఆ సన్నివేశాన్ని నిన్న 8k రిజల్యూషన్‌లో చూసినప్పుడు చాలా "ఆనందాన్ని ఇచ్చింది" అని తెలిపారు.
సభను నవ్వులతో నింపిన కథనాలు

తరువాత నవ్వులు పూయించే, హృదయానికి హత్తుకునే జ్ఞాపకాలు వరుసగా కొనసాగాయి. 'ఖామోష్' సినిమా స్క్రిప్ట్ రాసేటప్పుడు అపార్టుమెంటులోని ఒక చిన్న గదిలో ఉండేవాడినని, పైకప్పుపై డైలాగ్స్ చెబుతూ ్స్ చెబుతూ చె "కట్, కట్!" అని కేకలు వేస్తూ, ఇరుగుపొరుగు వారిని భయపెట్టేవాడినని చోప్రా గుర్తు చేసుకున్నారు. "ఒక సినిమాను ఊహించుకునేటప్పుడు విధు చిన్నపిల్లవాడిలా ఉత్సాహంగా ఉంటాడు" అని జోషి తెలిపారు.
ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న మరో కథను గుర్తు చేసుకుంటూ, రిహార్సల్స్ సమయంలో నటుడు జాకీ ష్రాఫ్ పొరపాటున వేరే అపార్ట్‌మెంటులోకి వెళ్లటం, అక్కడ అకస్మాత్తుగా మేల్కొన్న ఒక మహిళ కంగారు పడడం చూసి, ఆమెకు పూలు ఇవ్వటం గురించి చెప్పారు. "జాకీ ష్రాఫ్ తనని చూడటానికి వచ్చినట్టు కల వచ్చిందని ఆమె అందరికీ చెప్పింది" అంటూ చోప్రా నవ్వులు పంచారు.
సంగీతం, పారవశ్యం, అద్భుతం
‘1942: ఎ లవ్ స్టోరీ' గురించి మాట్లాడిన చోప్రా.. ఆర్.డి. బర్మన్ కాలం ముగిసిపోయిందని అందరూ అనుకుంటున్న సమయంలో, ఆయనతో కలిసి పనిచేయాలనుకున్నట్లు చెప్పారు. బర్మన్ మొదట ట్యూన్లను సమర్పించినప్పుడు చోప్రా వాటిని తిరస్కరించారు. "అదంతా వేస్ట్. నాకు ఎస్.డి. బర్మన్ శైలి కావాలి" అని అడిగినట్లు చెప్పారు. కొన్ని వారాల తర్వాత “కుచ్ నా కహో” పాట వచ్చింది. ఆ మెలోడీని చోప్రా వేదికపై పాడగా, ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో సందడి చేశారు. "నేను ఆ మాట అనటం వల్లే ఈ పాట రూపొందింది" అని ఆయన చమత్కరించారు.
జాతీయ అవార్డు అందుకున్న క్షణాలను చోప్రా గుర్తుచేసుకున్నారు. అవార్డుతో పాటు తనకు రూ.4,000 నగదు వస్తుందని ఆశించినా, బదులుగా ఎనిమిదేళ్ల పోస్టల్ బాండ్‌ను మాత్రమే అందుకున్నట్లు వివరించారు. ఈ విషయంపై ఎల్.కె. అద్వాణీతో తాను చేసిన వాదనను హస్యపూరితంగా నటించి, చూపటంతో సభ అంతా నవ్వులతో దద్దరిల్లింది. ఆ తర్వాత అద్వాణీ తనకు అందించిన సాయం, ముఖ్యంగా ఆస్కార్స్ వేడుకకు వెళ్లేందుకు చేసిన సహకారాన్ని చోప్రా గుర్తు చేసుకున్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న చారిత్రక చిత్రాల నేపథ్య గాయకులు
‘1942: ఎ లవ్ స్టోరీ' రచయిత్రి, చోప్రా అత్తగారు అయిన 92 ఏళ్ల కామ్నా చంద్ర, నిర్మాత యోగేష్ ఈశ్వర్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సినిమాలోని ప్రతీ డైలాగ్ కోసం తాను శ్రమించిన తీరు, పునరుద్ధరించిన చిత్రాన్ని చూసినప్పుడు భావోద్వేగానికి గురైన సందర్భాన్ని కామ్నా వివరించారు. "జీవితంలో నేను ఏదో సాధించానని అనిపించింది" అని అన్నారు.
ఇటలీలో జరిగిన 8k పునరుద్ధరణ పనులను యోగేష్ వివరించారు. ఇందులోని ఒక్కొక్క ఫ్రేమ్‌ను జాగ్రత్తగా శుద్ధి చేసి, శబ్ధాన్ని మెరుగుపరిచినట్లు చెప్పారు. "పునరుద్ధరించిన వెర్షన్, తాను ఊహించినట్లే ఉంది" అని చోప్రా తెలిపారు.
ఉల్లాసభరితమైన ప్రశ్నోత్తరాలతో ఈ సమావేశం ముగిసింది. కానీ అప్పటికే అసలైన అద్భుతం ఆవిష్కృతమైంది. దశాబ్దాల సినీ ప్రయాణాన్ని ప్రేక్షకులు వీక్షించారు. సినిమా తీయటంలో ఉండే సంతోషాలు, వింత అనుభవాలను తెలుసుకున్నారు. భారత్ లో అత్యంత ఆదరణ పొందిన కొన్ని చిత్రాలను రూపొందించిన విధు, అభిజాత్ల సృజనాత్మక భాగస్వామ్యాన్ని చూశారు.
ఐఎఫ్ఎఫ్ఐ గురించి
దక్షిణాసియాలో అత్యంత పురాతనమైన, అతిపెద్ద సినిమా వేడుకగా నిలిచిన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) 1952లో ప్రారంభమైంది. దీన్ని భారత ప్రభుత్వ జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీసీ), సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, గోవా రాష్ట్ర ప్రభుత్వ గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ (ఈఎస్జీ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రపంచ సినిమా రంగంలో గొప్ప శక్తికేంద్రంగా ఎదిగిన ఈ ఉత్సవంలో పునరుద్ధరించిన క్లాసిక్ చిత్రాలు.. సాహసోపేతమైన ప్రయోగ చిత్రాలు ఒకే వేదికపై నిలుస్తాయి. పౌరాణిక సినీ దిగ్గజాలు, తొలిసారి దర్శక రంగంలోకి అడుగుపెట్టిన వారు కలిసే వేదిక ఇది. ఐఎఫ్ఎఫ్ఐకి ఇంత ఆదరణ పెరగటానికి కారణం దానిలోని ఉద్వేగభరిమైన సమ్మేళనం. అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్ తరగతులు, కీర్తిప్రశంసలు, అత్యంత శక్తిమంతమైన వేవ్స్ ఫిల్మ్ బజార్ లో ఆలోచనలు, ఒప్పందాలు, సహకారాలు ప్రారంభమై, వృద్ధిలోకి వస్తాయి. గోవాలోని తీర ప్రాంతంలో నవంబర్ 20 నుంచి 28 వరకు జరిగే 56వ చలనచిత్ర ఉత్సవం.. అనేక భాషలు, తరాలు, ఆవిష్కరణలు, సంగీత ప్రదర్శనల ద్వారా భారతదేశ సృజనాత్మక ప్రతిభను ప్రపంచస్థాయిలో చాటిచెబుతుంది.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
ఐఎఫ్ఎఫ్ఐ వైబ్‌సైట్: https://www.iffigoa.org/
ఐఎఫ్ఎఫ్ఐ పీఐబీ మైక్రోసైట్: https://www.pib.gov.in/iffi/56new/
పీఐబీ ఐఎఫ్ఎఫ్ఐవుడ్ ప్రసార ఛానెల్: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
ఎక్స్ హ్యాండిల్స్: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
***
Release ID:
2193014
| Visitor Counter:
4