ప్రారంభమైన ఐఎఫ్ఎఫ్ఐ : చారిత్రక కవాతుతో 56వ ఎడిషన్ ప్రారంభం
ప్రపంచవ్యాప్త ఆలోచనలు, కథలు, సృజనాత్మక మేధస్సుల సంగమమే ఐఎఫ్ఎఫ్ఐ: గోవా గవర్నర్ శ్రీ పూసపాటి అశోక గజపతి రాజు
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ శిఖరాలను చేరుతున్న భారతీయ సినిమా: గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్
మన రాష్ట్రాల విభిన్న సంప్రదాయాలను ప్రదర్శించే సాంస్కృతిక మహోత్సవం: డాక్టర్ ఎల్. మురుగన్
50 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న దిగ్గజ నటుడు నందమూరి బాలకృష్ణకు ఘన సత్కారం
ఐఎఫ్ఎఫ్ఐ-2025లో సినీ ప్రియులను అలరించిన ప్రారంభ చిత్రం ‘ది బ్లూ ట్రయల్’
వీధుల్లోకి అడుగు పెట్టండి. సంగీత హోరును అనుభూతి చెందండి. కథలు విప్పి చూడండి. గోవాను ఒక సజీవమైన, శ్వాసించే అద్భుత రీల్‌గా ఐఎఫ్ఎఫ్ఐ మారుస్తోంది! తన విశిష్ట ప్రయాణంలో మొదటిసారిగా భారతదేశపు అంతర్జాతీయ చలన చిత్రోత్సవం సాంప్రదాయిక గోడలను దాటి శక్తిమంతమైన గోవా హృదయంలోకి అడుగుపెట్టింది. రాష్ట్ర ప్రజలను, వీధులను, స్ఫూర్తినీ మునుపెన్నడూ లేని విధంగా వేడుకలతో ముంచెత్తింది.
ఈ రోజు జరిగిన ఐఎఫ్ఎఫ్ఐ-2025 గొప్ప ప్రారంభోత్సవం ఉత్సవాల వైభవాన్ని పునఃసృష్టిస్తూ... నగరాన్ని ఒక విశాలమైన, సజీవ చిత్రంగా మార్చింది. సాంస్కృతిక విశిష్టత, కథ చెప్పే నైపుణ్యాల మాయాజాలం కలగలిసిన సినిమాటిక్ వైభవం గోవా వీధుల్లో ఉత్సాహంగా నృత్యం చేసింది. కళాకారులు, ప్రదర్శనకారులు, సినీప్రియులు గోవా వీధులను శక్తి, వినోదంతో నింపిన సమయంలో... గోవా సృజనాత్మక కేంద్రంగా మారిపోయింది. ఇది ఉత్సవ ప్రారంభంగా మాత్రమే కాకుండా... ఐఎఫ్ఎఫ్ఐ వారసత్వంలో ఒక సాహసోపేతమైన నూతన అధ్యాయానికి నాంది పలికింది.

గోవా గవర్నర్ శ్రీ పూసపాటి అశోక గజపతి రాజు ఈ వేడుకలను ప్రారంభిస్తూ... పెరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఐ ప్రపంచ స్థాయిని ప్రశంసించారు. "సృజనాత్మకతను పంచుకోవడం, సరికొత్త సహకారాలు, సినిమా గొప్పతనపు వేడుకలకు ఒక అర్థవంతమైన వేదికగా ఐఎఫ్ఎఫ్ఐ నిలిచింది. గోవా నగరానికి గల విశ్వనగర లక్షణం, సాంస్కృతిక వైభవం, ప్రపంచంతో కనెక్టివిటీ వల్ల పెద్ద సంఖ్యలో సినీ ప్రియులు ఈ నగరానికి విచ్చేయడం సహజమే" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఐఎఫ్ఎఫ్ఐ ఎప్పటికప్పుడు సాంప్రదాయిక చలనచిత్రోత్సవ హద్దులను అధిగమిస్తూనే ఉందన్నారు. ప్రపంచవ్యాప్త ఆలోచనలు, కథలు, సృజనాత్మక మేధస్సుల సంగమంగా పనిచేస్తూ... యువ చిత్రనిర్మాతలకు ఊతమిస్తూ... సినిమాటిక్ ప్రతిభను గౌరవిస్తూ... చలనచిత్ర, సృజనాత్మక పరిశ్రమలకు ప్రపంచ కేంద్రంగా భారత్ స్థానాన్ని ఐఎఫ్ఎఫ్ఐ బలోపేతం చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ తన మాట్లాడుతూ... అంతర్జాతీయ చిత్రనిర్మాణ గమ్యస్థానంగా గోవా ఎదుగుదలను ప్రధానంగా ప్రస్తావించారు. "గోవా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో సిద్ధంగా ఉంది. అందుకే ఐఎఫ్ఎఫ్ఐ వేడుకల కోసం శాశ్వత నిలయంగా మారింది. మన ప్రాంతపు అద్భుత సౌందర్యం చిత్రనిర్మాతలను ఆకర్షిస్తుంది. అయితే మన బలమైన విధాన సంస్కరణలే వారిని తిరిగి వచ్చేలా చేస్తాయి" అని ఆయన వ్యాఖ్యానించారు. "సృజనాత్మకత, సాంకేతికతల అపూర్వ సంగమం" అనే థీమ్‌ను ఐఎఫ్ఎఫ్ఐ-2025 చాటుతుందన్నారు. ఇది ప్రపంచ సృజనాత్మక విప్లవంలో భారత్ నాయకత్వాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు. "ఐఎఫ్ఎఫ్ఐ భారతీయ ప్రతిభకు, ప్రపంచస్థాయి అవకాశాలకు మధ్య వారధిగా పని చేస్తుంది. గోవాను భారత సృజనాత్మక రాజధానిగా మార్చడమే మా కల. గోవాకు రండి... మీ కథలు చెప్పండి... మీ చిత్రాలను చిత్రీకరించండి." అని వ్యాఖ్యానించారు. భారత సినిమాను అపూర్వ అంతర్జాతీయ ప్రాముఖ్యత దిశగా నడిపించడంలో... కథల ప్రపంచంలో భారత్ స్థాయిని మెరుగుపరచడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత అత్యంత కీలకమని గోవా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ మాట్లాడుతూ... ప్రతి ఎడిషన్‌తో ఐఎఫ్‌ఎఫ్‌ఐ మరింత అభివృద్ధి చెందుతూనే ఉందన్నారు. “సాంప్రదాయికంగా ఈ ఉత్సవం శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో ప్రారంభమయ్యేది. ఈ సంవత్సరం ఇది ఒక గొప్ప సాంస్కృతిక కార్నివాల్‌గా ప్రారంభమవుతోంది. ఇది మన రాష్ట్రాల విభిన్న సంప్రదాయాలను ప్రదర్శిస్తుంది.” అని వ్యాఖ్యానించారు. కంటెంట్, సృజనాత్మకత, సంస్కృతి ఆధారితమైన భారత ఆరెంజ్ ఆర్థిక వ్యవస్థ మెరుగుదలకు కారణమైన ప్రధానమంత్రి దార్శనికతను ఆయన గుర్తు చేసుకున్నారు. ముంబయిలో జరిగిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్) వంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఉద్భవిస్తున్న సృజనాత్మక ప్రతిభను మరింత శక్తిమంతం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. గోవాను ఐఎఫ్‌ఎఫ్‌ఐ కోసం శాశ్వత నిలయంగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన దివంగత శ్రీ మనోహర్ పారికర్‌కు ఆయన నివాళులర్పించారు.

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు ఈ సంవత్సరం ఎడిషన్ ప్రత్యేకతలను ప్రధానంగా ప్రస్తావించారు. “మొదటిసారిగా ఐఎఫ్ఎఫ్ఐ భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించిన గొప్ప కార్నివాల్‌తో ప్రారంభమవుతోంది. ఈ ఎడిషన్‌లో అనేక అంతర్జాతీయ, ప్రపంచ ప్రీమియర్‌లతో పాటు దాదాపు 80 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ చిత్రాలను ప్రదర్శిస్తుంది.” అని ఆయన తెలిపారు. సృజనాత్మకత, సాంకేతికత, పరిశ్రమ ఆవిష్కరణల్లో ఐఎఫ్ఎఫ్ఐని ముందంజలో నిలిపే ఏఐ ఫిల్మ్ హ్యాకథాన్, అతిపెద్ద వేవ్స్ ఫిల్మ్ బజార్ వంటి కొత్త ఆకర్షణలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
50 సంవత్సరాల సినీ జీవితంలో తన అద్భుతమైన సేవలకు, తెలుగు సినిమాను సుసంపన్నం చేయడంలో విశేష కృషికి గానూ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణను ఘనంగా సత్కరించారు.
చరిత్రాత్మక గ్రాండ్ పరేడ్
గోవా ప్రభుత్వం సమర్పించిన 12 ప్రదర్శనలు సహా రెండు డజన్లకు పైగా ప్రదర్శనలు భారత సినిమా వారసత్వాన్ని, యానిమేషన్ ప్రపంచాన్ని, ప్రాంతీయ సంస్కృతుల గొప్ప వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణలు... సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, ఎన్ఎఫ్‌డీసీ 50 సంవత్సరాల శకటం ప్రదర్శించిన గొప్ప జానపద నిర్మాణం భారత్ ఏక్ సూర్.... దేశవ్యాప్తంగా ఐదు దశాబ్దాలుగా చిత్రనిర్మాతలను పోషించి, సినిమా ఆవిష్కరణలను పెంపొందించిన వారిని సత్కరించడం. 100 మందికి పైగా కళాకారుల సాంప్రదాయ నృత్యాలతో కూడిన ఈ ప్రదర్శన దాని స్థాయి, శక్తితో ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది.

చోటా భీమ్, మోటూ పత్లూ, బిట్టూ బహనేబాజ్ వంటి అందిరకీ ప్రియమైన యానిమేటెడ్ పాత్రలు కనిపించడం ఉత్సాహాన్ని మరింత పెంచింది... వారి ఉల్లాసభరితమైన ఇంటరాక్షన్స్ ప్రేక్షకుల నుంచి ఉత్సాహభరితమైన హర్షధ్వానాలను రాబట్టాయి. ఈ కవాతు రాబోయే సినిమా వేడుకలకు ఉత్సాహాన్ని, పండగ స్ఫూర్తినీ జోడించింది.
ప్రారంభ చిత్రం
గాబ్రియేల్ మస్కారో రాసిన డిస్టోపియన్ కథ 'ది బ్లూ ట్రయల్'... దానిని స్థానిక పోర్చుగీస్ భాషలో 'ఓ అల్టిమో అజుల్' అని పిలుస్తారు. ఈ రోజు 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మొదటి మెరుపుగా ఉత్సాహాన్ని రగిలించింది. గోవా తీర ప్రాంతంలో ఆ వెలుగు ఆవిష్కృతమైంది. ప్రారంభ చిత్రం విస్తృత ప్రశంసలను పొందడంతో పాటు ప్రేక్షకులకు ఆశ్చర్యానుభూతులను పంచింది.
ఐఎఫ్ఎఫ్ఐ గురించి
1952లో ప్రారంభమైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం దక్షిణాసియాలోనే పురాతనమైన, అతిపెద్ద సినిమా వేడుకగా నిలుస్తుంది. నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్... భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ... గోవా రాష్ట్ర ప్రభుత్వం... గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవం ప్రపంచ సినిమాకు ప్రధాన కేంద్రంగా ఎదిగింది. ఇక్కడ అలనాటి అపురూప చిత్రాలు, సాహసోపేతమైన ప్రయోగాత్మక చిత్రాలు, లెజెండరీ మాస్ట్రోలు, నిర్భయంగా రూపొందించిన తొలి సినిమాలు ఒకే చోట కలిసి వేడుకల్లో ప్రేక్షకులను అలరిస్తాయి. అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్‌క్లాస్‌లు, ఘన నివాళులతో పాటు... ఆలోచనలు, ఒప్పందాలు, సహకారాలకు అపార అవకాశాలను అందించే శక్తిమంతమైన వేవ్స్ ఫిల్మ్ బజార్ వంటి కార్యక్రమాలు ఐఎఫ్ఎఫ్ఐని అద్భుత వేదికగా మార్చుతున్నాయి. నవంబర్ 20–28 వరకు అద్భుతమైన గోవా తీరప్రాంతంలో ప్రదర్శితమయ్యే 56వ ఎడిషన్.... ప్రపంచ వేదికపై భారత్ సృజనాత్మక ప్రతిభకు ఒక అద్భుతమైన వేడుక. భాషలు, శైలులు, ఆవిష్కరణలు, స్వరాల అద్భుత సంగమంగా ఇది నిలుస్తుంది.
మరింత సమాచారం కోసం, ఇక్కడ క్లిక్ చేయండి:
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2191742
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2190381
IFFI Website: https://www.iffigoa.org/
PIB’s IFFI Microsite: https://www.pib.gov.in/iffi/56new/
PIB IFFIWood Broadcast Channel: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
X Handles: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
***
Release ID:
2192375
| Visitor Counter:
7
Read this release in:
Bengali
,
English
,
Manipuri
,
Urdu
,
Marathi
,
Konkani
,
हिन्दी
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam