హృదయాన్ని హత్తుకునే విధంగా వందేమాతరం పాడిన దక్షిణ కొరియాకు చెందిన శ్రీమతి జేవాన్ కిమ్
నిల్చొని కరతాళ ధ్వనులతో ప్రశంసించిన వీక్షకులు
వందేమాతరం 150 ఏళ్ల వేడుకల సందర్భంగా జాతీయ గేయాన్ని అద్భుతంగా ఆలపించిన దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీ సభ్యురాలు
గోవాలో జరిగిన వేవ్స్ ఫిల్మ్ బజార్ ప్రారంభోత్సవంలో ఒక ప్రత్యేక ఘట్టం ఆవిష్కృతమైంది. గౌరవ అతిథి అయిన దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీ సభ్యురాలు శ్రీమతి జేవాన్ కిమ్ వేదికపైన హృదయాన్ని హత్తుకునే రీతిలో వందేమాతరం గేయాన్ని ఆలపించగా.. ప్రేక్షకులంతా నిల్చొని కరతాళ ధ్వనులతో ఆమెను ప్రశంసించారు.

జాతీయ గేయం 150వ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్న ప్రస్తుత సమయంలో ఆమె ఇచ్చిన హృదయపూర్వక ప్రదర్శన ప్రత్యేకతను సంతరించుకుంది. భారత సాంస్కృతిక వారసత్వాన్ని ఆమె గౌరవించిన తీరుకు ప్రేక్షకులందరూ చలించిపోయి లేచి నిలబడి చప్పట్లు కొట్టారు.
సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్. ఎల్. మురుగన్ శ్రీమతి కిమ్‌ను ప్రశంసించారు. కేవలం కొంత భాగమే కాకుండా పూర్తి గేయాన్ని పాడినందుకు ఆమెను అభినందించారు. వేవ్స్ ఫిల్మ్ బజార్ వంటి కార్యక్రమాలు పెంపొందించాలని ప్రయత్నిస్తున్న స్నేహం, సాంస్కృతిక సామరస్య స్ఫూర్తికి ప్రతీకగా శ్రీమతి కిమ్ గానం నిలిచింది. ఒక కొరియన్ పాటను కూడా ఆలపించిన ఆమె.. ఈ కార్యక్రమాన్ని ఒక మంచి సాంస్కృతిక సంగమంగా మార్చారు.

ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన చలనచిత్ర రూపకర్తలు, సృజనకర్తలు, ప్రతినిధులు, కథకులు హాజరైన ఈ సమావేశంలో శ్రీమతి కిమ్ ఇచ్చిన గాన ప్రదర్శన ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సరిహద్దులను దాటి కళలు, భావోద్వేగాలు ఎంత బాగా విస్తరిస్తున్నాయో చెప్పేందుకు ఇదొక మంచి ఉదాహరణగా నిలిచింది.
వేవ్స్ ఫిల్మ్ బజార్:
గతంలో ఫిల్మ్ బజార్‌గా పిలిచే ఈ కార్యక్రమాన్ని జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్‌డీసీ) 2007లో ప్రారంభించింది. దక్షిణాసియాలోనే అత్యంత ప్రభావవంతమైన చలన చిత్ర మార్కెట్‌గా ఇది ఎదిగింది.
ఈ రోజు ప్రారంభమైన ఈ బజార్, కథన రచయితలు, స్క్రీన్ రైటర్స్ ల్యాబ్, మార్కెట్ ప్రదర్శనలు, వ్యూయింగ్ రూమ్ లైబ్రరీ, సహ-నిర్మాణ మార్కెట్ వంటి ప్రత్యేక విభాగాల్లో 300 కంటే ఎక్కువ చలన చిత్ర ప్రాజెక్టులను ఒక చోటుకు చేర్చింది. సహ-నిర్మాణ మార్కెట్‌లో 22 పూర్తి నిడివి చిత్రాలు, 5 డాక్యుమెంటరీలను ప్రదర్శించనున్నారు. వేవ్స్ ఫిల్మ్ బజార్ రికమెండ్స్ విభాగంలో అన్ని ఫార్మాట్‌లలో కలిపి 22 అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. ఏడు దేశాలకు పైగా ప్రతినిధి బృందాలు, పదికి పైగా దేశంలోని రాష్ట్రాలకు చెందిన చలనచిత్ర ప్రోత్సాహకాల ప్రదర్శనలు ఈ వేదికను మరింత అద్భుతంగా మార్చనున్నాయి.
ఏఎఫ్ఎప్ఐ గురించి:
1952లో ప్రారంభమైన అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) దక్షిణాసియాలో అత్యంత ప్రాచుర్యం పొందిన అతిపెద్ద సినిమా వేడుకగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వంలోని సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ చలన చిత్ర అభివృద్ధి సంస్థ (నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్- ఎన్ఎఫ్‌డీసీ), గోవా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా (ఈఎస్‌జీ) సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. పునరుద్ధరించిన క్లాసిక్ సినిమాలు, ప్రయోగాత్మక చిత్రాలు ఒక వేదికపై నిలుస్తాయి. ప్రసిద్ధ దర్శక నిర్మాతలు, నిర్భయులైన తొలి దర్శకులతో వేదికను పంచుకుంటారు. ఇలా ఒక ప్రపంచ సినిమా కేంద్రంగా ఈ ఉత్సవం ఎదిగింది. ఆలోచనలు, ఒప్పందాలు, భాగస్వామ్యాలు వేగాన్ని పొందే ఉత్తేజభరిత వేవ్స్ ఫిల్మ్ బజార్, మాస్టర్‌క్లాసులు, సమర్పణ చిత్రాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, అంతర్జాతీయ పోటీలు లాంటి సమ్మేళనంతో ఐఎఫ్ఎప్ఐ ప్రత్యేకంగా మారుతోంది. నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలోని అద్భుతమైన తీరప్రాంతంలో నిర్వహిస్తున్న ఐఎఫ్ఎప్ఐ.. భాషలు, విభాగాలు, ఆవిష్కరణలు, శ్రవణాల అద్భుతమైన కలయికను వీక్షకులకు అందించనుంది. ఇది ప్రపంచ వేదికపై భారతదేశ సృజనాత్మక ప్రతిభను తెలియజేసే ఒక ప్రత్యేక వేదికగా ఉంది.
మరింత సమాచారం కోసం, ఈ క్రింది లింక్‌లను సందర్శించండి:
* ఐఎఫ్ఎప్ఐ వెబ్‌సైట్: https://www.iffigoa.org/
* పీఐబీకి సంబంధించి ఐఎఫ్ఎఫ్ఐ మైక్రోసైట్: https://www.pib.gov.in/iffi/56new/
* పీఐబీ ఐఎఫ్ఎఫ్ఐవుడ్ బ్రాడ్‌కాస్ట్ ఛానెల్: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
* ‘ఎక్స్’ హ్యాండిల్స్: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
***
Release ID:
2192373
| Visitor Counter:
8
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Konkani
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam