ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి భూటాన్ అధికారిక పర్యటనపై సంయుక్త పత్రికా ప్రకటన
Posted On:
12 NOV 2025 9:59AM by PIB Hyderabad
భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యేల్ వాంగ్‌చుక్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ దేశంలో 2025 నవంబర్ 11, 12 తేదీల్లో రెండు రోజుల అధికారిక పర్యటన చేపడుతున్నారు.
పర్యటనలో భాగంగా నవంబర్ 11న చాంగ్లిమిథాంగ్‌లో భూటాన్ నాలుగో రాజు 70వ జన్మదిన వేడుకలకు గౌరవ అతిథిగా ప్రధానమంత్రి మోదీ హాజరయ్యారు. అలాగే థింపులో జరుగుతున్న అంతర్జాతీయ శాంతి ప్రార్థన ఉత్సవంలో కూడా ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రజలు పూజలర్పించడానికి భారత్ నుంచి బుద్ధ భగవానుని పవిత్ర పిప్రాహ్వా అవశేషాలను ఈ ఉత్సవంలో ఉంచడాన్ని భూటాన్ రాజు అభినందించారు.
భూటాన్ రాజు, నాలుగో రాజుతో కలసి ప్రధానమంత్రి ప్రజలను కలుసుకున్నారు. అలాగే భూటాన్ ప్రధాని దాషో షెరింగ్ తోబ్గేతో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సహకారం, ఉమ్మడిగా ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలు, ఇతర కీలకాంశాలపై నాయకులు చర్చించారు.
నవంబర్ 10న ఢిల్లీలో జరిగిన పేలుడులో జరిగిన ప్రాణనష్టం పట్ల భూటాన్ రాజ ప్రభుత్వం, ప్రజల తరఫున ఆ దేశ రాజు సంతాపాన్ని వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మద్దతు తెలియజేస్తూ భూటాన్ అందించిన సందేశాన్ని, సంఘీభావాన్ని భారత్ ప్రశంసించింది.
ఆర్థిక ప్రోత్సాహక కార్యక్రమంతో సహా భూటాన్ 13వ పంచవర్ష ప్రణాళికకు దృఢమైన సహకారాన్ని భారత్ అందిస్తుందని ప్రధానమంత్రి మోదీ పునరుద్ఘాటించారు. అలాగే ప్రధాన అభివృద్ధి ప్రాధాన్యాలను సాధించడంలో, వివిధ రంగాల్లో సుస్థిరాభివృద్ధిని ముందుకు నడిపించడంలో భూటాన్‌కు అవసరమైన సాయాన్ని అందించడంలో భారత్ నిబద్ధతను స్పష్టం చేశారు. 13వ పంచవర్ష ప్రణాళిక కాలంలో తమ దేశ వ్యాప్తంగా అమలవుతున్న వివిధ ప్రాజెక్టులకు భారత్ అందిస్తున్న సాయాన్ని, అభివృద్ధికి అందిస్తున్న సహకారాన్ని భూటాన్ పక్షం ప్రశంసించింది.
గెలెఫు మైండ్‌ఫుల్‌నెస్ సిటీ విషయంలో భూటాన్ రాజు లక్ష్యాన్ని సాకారం చేసేందుకు భారత్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. గెలెఫు నగరానికి పెట్టుబడిదారులు, పర్యాటకులు సులభంగా వచ్చేందుకు వీలుగా అస్సాంలోని హాతిసర్‌లో ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టు ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. గ్యాల్సంగ్ అకాడమీల నిర్మాణానికి భారత్ అందిస్తున్న మద్ధతును భూటాన్ రాజు అభినందించారు.
1020 మెగావాట్ల సామర్థ్యమున్న పునత్షంగ్చు- 2 జల విద్యుత్ కేంద్రాన్ని నవంబర్ 11న ప్రధానమంత్రి మోదీ, భూటాన్ రాజు సంయుక్తంగా ప్రారంభించారు. బుద్ధ భగవానుని పవిత్ర పిప్రాహ్వా అవశేషాల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. జల విద్యుత్ రంగంలో భూటాన్, భారత్ మధ్య ఉన్న స్నేహానికి, ఆదర్శప్రాయమైన సహకారానికి ఈ ప్రాజెక్టు నిదర్శనంగా నిలుస్తుంది. పునత్షంగ్చు- 2 నుంచి భారత్‌కు విద్యుత్ ఎగుమతి ప్రారంభాన్ని వారు స్వాగతించారు. ఉమ్మడి లక్ష్యమైన ఇంధన భాగస్వామ్యం మార్చి 2024 అమలుపై ఇరు పక్షాలు సంతృప్తి వ్యక్తం చేశాయి.
1200 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పునత్షంగ్చు-1 జలవిద్యుత్ కేంద్ర ప్రధాన ఆనకట్ట నిర్మాణ పనులను పున:ప్రారంభించే ఒప్పందాన్ని నాయకులు స్వాగతించారు. అలాగే ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు అంగీకరించారు. ఇది పూర్తయితే.. రెండు ప్రభుత్వాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన అతి పెద్ద జలవిద్యుత్ కేంద్రంగా పునత్షంగ్చు - 1 నిలుస్తుంది.
భూటాన్లో జల విద్యుత్ ప్రాజెక్టుల్లో భారత కంపెనీల చురుకైన భాగస్వామ్యాన్ని వారు స్వాగతించారు. భూటాన్‌లోని ఇంధన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయడం కోసం.40 బిలియన్ల రుణ రాయితీని భారత్ ప్రకటించడాన్ని భూటాన్ పక్షం ప్రశంసించింది.
రెండు దేశాల మధ్య రవాణా అనుసంధానాన్ని మెరుగుపరచాల్సిన, సమీకృత చెక్‌పోస్టులతో సహా సరిహద్దుల వద్ద మౌలిక వసతులను విస్తరించాల్సిన ప్రాధాన్యాన్ని ఉభయ పక్షాలు గుర్తించాయి. 2024 నవంబర్లో దర్రాంగా వద్ద ఏర్పాటు చేసిన ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టు, 2025 మార్చిలో జోగిగోఫా వద్ద ప్రారంభించిన అంతర్గత జల రవాణా టెర్మినల్, బహుళవిధ లాజిస్టిక్స్ పార్కు కార్యకలాపాలను వారు స్వాగతించారు. 2025 సెప్టెంబర్లో రెండు దేశాల మధ్య రైలు సౌకర్యాన్ని (గెలెఫు-కోక్రాఝర్, సంత్సే-బనార్హత్) ఏర్పాటు చేయడానికి కుదిరిన అవగాహనా ఒప్పందాన్ని, ప్రాజెక్టు అమలు కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీని ఉభయ పక్షాలు స్వాగతించాయి.
భూటాన్‌కు అవసరమైన వస్తువులు, ఎరువులను నిరంతరాయంగా అందించేందుకు అవసరమైన ఏర్పాట్లను సంస్థాగతీకరించేందుకు భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను భూటాన్ పక్షం ప్రశంసించింది. కొత్తగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ద్వారా భారత్ నుంచి తొలిసారి చేపట్టిన ఎరువుల సరఫరాను రెండు పక్షాలు స్వాగతించాయి.
స్టెమ్, ఫిన్‌టెక్, అంతరిక్షం లాంటి కొత్త రంగాల్లో పెరుగుతున్న సహకారం పట్ల రెండు పక్షాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. కొనసాగుతున్న యూపీఐ రెండో దశ అభివృద్ధిని వారు స్వాగతించారు. ఇది భారత్‌ను సందర్శించే భూటాన్ పర్యాటకులకు క్యూఆర్ కోడ్‌ను మొబైల్ అప్లికేషన్ల ద్వారా స్కానింగ్ చేయడం ద్వారా చెల్లింపులు చేసేందుకు వీలు కల్పిస్తుంది. అంతరిక్ష రంగ సహకారంపై ఉమ్మడి కార్యాచరణ అమలుపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. భూటాన్లో స్టెమ్ విద్య, ఆరోగ్య సేవలను విస్తరించేందుకు కృషి చేస్తున్న భారతీయ ఉపాధ్యాయులు, నర్సుల విలువైన సహకారాన్ని వారు గుర్తించారు.
రాజ్‌గిర్‌లో రాయల్ భూటాన్ ఆలయ ప్రతిష్ఠను, వారణాసిలో భూటాన్ ఆలయం, అతిథి గృహాన్ని నిర్మించేందుకు అవసరమైన భూమిని అందించాలని భారత ప్రభుత్వం నిర్ణయాన్ని నాయకులిద్దరూ స్వాగతించారు.
పర్యటనలో భాగంగా దిగువ పేర్కొన్న అవగాహన ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేశాయి.
-
పునరుత్పాదక ఇంధన రంగంలో సహకారానికి భూటాన్ రాజ ప్రభుత్వ (ఆర్జీవోబీ) ఇంధనం, సహజ వనరుల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
-
ఆరోగ్యం, వైద్య రంగాల్లో సహకారానికి ఆర్జీవోబీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మధ్య ఒప్పందం కుదిరింది.
-
సంస్థాగత అనుసంధానాన్ని ఏర్పాటు చేసేందుకు పెమా సెక్రటేరియట్, భారత ప్రభుత్వ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ మధ్య అవగాహన ఒప్పందం.
అన్ని స్థాయుల్లోనూ బలమైన నమ్మకం, హృదయపూర్వక స్నేహం, పరస్పర నమ్మకం, అవగాహనపై ఆధారపడి భూటాన్-ఇండియా భాగస్వామ్యం నిర్మితమైంది. బలమైన ప్రజా సంబంధాలు, సన్నిహిత ఆర్థిక అభివృద్ధి భాగస్వామ్యంతో ఇది మరింత బలోపేతమవుతోంది. రెండు దేశాల మధ్య తరచూ ఉన్నత స్థాయి చర్చలు జరిగే సంప్రదాయాన్ని ఈ పర్యటన పునరుద్ఘాటించింది. భవిష్యత్తులో దీనిని కొనసాగించేందుకు రెండు పక్షాలు అంగీకరించాయి.
***
(Release ID: 2189159)
Visitor Counter : 5
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam