ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరాఖండ్ రాష్ట్ర అవతరణ రజతోత్సవాన్ని పురస్కరించుకుని డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
రూ. 8,140 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన ప్రధాని
నేడు ఉత్తరాఖండ్ అధిరోహించిన పురోగతి శిఖరాలను చూస్తుంటే
అప్పట్లో ఈ అందమైన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు పోరాడిన ప్రతి వ్యక్తీ సంతోషించడం ఖాయం: ప్రధాని
ఇది నిజంగా ఉత్తరాఖండ్ ఉన్నతి, పురోగతిని నిర్వచించే యుగం: ప్రధాని
దేవభూమి ఉత్తరాఖండ్ భారతదేశ ఆధ్యాత్మిక జీవనానికి గుండె చప్పుడు: ప్రధాని
ఉత్తరాఖండ్ నిజమైన గుర్తింపు దాని ఆధ్యాత్మిక శక్తిలోనే ఉంది: ప్రధాని
Posted On:
09 NOV 2025 2:54PM by PIB Hyderabad
ఉత్తరాఖండ్ రాష్ట్ర అవతరణ రజతోత్సవాన్ని పుస్కరించుకొని డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆయన రూ. 8,140 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. దేవభూమి ఉత్తరాఖండ్ ప్రజలకు శుభాకాంక్షలు, హృదయపూర్వక వందనాలు తెలియజేశారు.
అంకితభావంతో కూడిన సుదీర్ఘ పోరాట ఫలితమే నవంబర్ 9 అన్న ప్రధాని.. ఈ రోజు మనందరిలో ప్రగాఢమైన ఉత్తేజాన్ని నింపుతుందని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లోని దైవసమానులైన ప్రజలు చాలా కాలంగా ఒక కలను కన్నారని.. అది 25 సంవత్సరాల కిందట శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి గారి ప్రభుత్వం హయాంలో నెరవేరిందని అన్నారు. గత 25 ఏళ్ల ప్రయాణాన్ని ప్రస్తావించిన ఆయన.. ఉత్తరాఖండ్ నేడు అధిరోహించిన పురోగతి శిఖరాలను చూస్తుంటే ఒకప్పుడు ఈ అందమైన రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాడిన ప్రతి వ్యక్తీ సంతోషించడం సహజమని అభిప్రాయపడ్డారు. పర్వతాలను ప్రేమించేవారు, ఉత్తరాఖండ్ సంస్కృతి- దాని సహజ సౌందర్యాన్ని ఆదరించే వారు, దేవభూమి ప్రజలపై అభిమానం ఉన్నవారు నేడు సంతోషంగా ఉన్నారని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర భాజపా ప్రభుత్వాలు ఉత్తరాఖండ్ సామర్థ్యాన్ని కొత్త శిఖరాలకు చేర్చే విషయంలో నిబద్ధతతో ఉన్నాయని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఉత్తరాఖండ్ రజతోత్సవం సందర్భంగా అందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రాణాలను అర్పించిన అమరవీరులకు ఈ సందర్భంగా ఆయన నివాళులు అర్పించారు. ఆనాటి ఉద్యమకారులందరికీ వందనం చేస్తున్నట్లు తెలిపారు.
ఉత్తరాఖండ్‌తో ఉన్న లోతైన భావోద్వేగ అనుబంధం గురించి మాట్లాడిన ప్రధానమంత్రి.. ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక యాత్రలు చేపట్టినప్పుడు... పర్వతాలలో నివసించే సోదరీసోదరుల కష్టాలు, శ్రమ, సంకల్పం ఎల్లప్పుడూ ప్రేరణనిస్తున్నాయన్నారు. ఉత్తరాఖండ్‌లో గడిపిన రోజులు రాష్ట్ర అపారమైన సామర్థ్యం గురించి ప్రత్యక్ష అనుభవాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు. ఈ బలమైన నమ్మకమే కేదార్ బాబాను సందర్శించిన తర్వాత ఈ దశాబ్దం ఉత్తరాఖండ్‌దే అని ప్రకటించేలా ప్రేరణనిచ్చినట్లు తెలిపారు. రాష్ట్రం 25 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్న ఆయన.. "ఇది నిజంగా ఉత్తరాఖండ్ ఉన్నతి, పురోగతిని నిర్వచించే యుగం" అని వ్యాఖ్యానించారు.
25 సంవత్సరాల కిందట ఉత్తరాఖండ్ కొత్తగా ఏర్పడినప్పుడు చాలా సవాళ్లు ఎదురయ్యాయని గుర్తుచేసిన శ్రీ నరేంద్ర మోదీ.. ఆ కాలంలో వనరులు పరిమితంగా ఉండేవని, రాష్ట్ర బడ్జెట్ తక్కువగా ఉండేదన్నారు. అప్పుడు ఆదాయ మార్గాలు అరుదుగా ఉండేవని.. చాలా అవసరాలు కేంద్ర సహాయం ద్వారానే తీరేవని పేర్కొన్నారు. అయితే ఈ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి రాకముందు రజతోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన అద్భుతమైన ప్రదర్శనను వీక్షించారు. ఇది గత 25 ఏళ్లలో ఉత్తరాఖండ్ చేసిన ప్రయాణాన్ని తెలియజేస్తోందనీ, మౌలిక సదుపాయాలు, విద్య, పరిశ్రమలు, పర్యాటకం, ఆరోగ్యం, విద్యుత్, గ్రామీణాభివృద్ధి వంటి రంగాలలో విజయ గాథలు నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని ప్రధాని అన్నారు. 25 సంవత్సరాల కిందట ఉత్తరాఖండ్ బడ్జెట్ కేవలం రూ. 4,000 కోట్లుగా ఉండేదని.. అది ఇప్పుడు రూ. 1 లక్ష కోట్లను దాటిందని ఆయన తెలిపారు. ఈ కాలంలో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి నాలుగు రెట్లు పెరిగిందని, రోడ్ల పొడవు రెట్టింపు అయిందని పేర్కొన్నారు. గతంలో ఆరు నెలలకు కేవలం 4,000 మంది మాత్రమే విమాన ప్రయాణికులు ఇక్కడికి వచ్చేవారని.. ప్రస్తుతం ఒక్క రోజులోనే 4,000 మందికి పైగా ప్రయాణికులు విమానంలో ఇక్కడికి వస్తున్నారని అన్నారు.
గత 25 సంవత్సరాలలో ఉత్తరాఖండ్‌లో ఇంజినీరింగ్ కళాశాలల సంఖ్య పది రెట్లు పెరిగిందని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. గతంలో ఒక్క మెడికల్ కళాశాల మాత్రమే ఉండేదన్న ఆయన.. నేడు పది మెడికల్ కళాశాలలు ఉన్నాయని తెలిపారు. 25 సంవత్సరాల కిందట టీకాలు అందే జనాభా 25 శాతం కంటే తక్కువగా ఉండేదని.. కానీ ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోని దాదాపు ప్రతి గ్రామానికి టీకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. జీవితంలోని అన్ని కోణాల్లోనూ ఉత్తరాఖండ్ గణనీయమైన ప్రగతిని సాధించిందని ప్రధాని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణం అద్భుతంగా ఉందన్న ఆయన.. ఈ పరివర్తనకు సమ్మిళిత వృద్ధి విధానంతో పాటు ఉత్తరాఖండ్‌లోని ప్రతి ఒక్కరి సామూహిక సంకల్పం కారణమని వ్యాఖ్యానించారు. గతంలో పర్వతవాలు అభివృద్ధి మార్గానికి అడ్డు తగిలేవని, కానీ ఇప్పుడు కొత్త మార్గాలు తెరచుకోవడం ప్రారంభమైందని ఆయన అన్నారు.
ఉత్తరాఖండ్‌లోని యువత, వ్యవస్థాపకులతో ఇంతకుముందు చేపట్టిన సంభాషణ గురించి ప్రధాని మాట్లాడారు. వారు రాష్ట్ర వృద్ధి పట్ల అత్యంత ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. నేడు ఉత్తరాఖండ్ ప్రజల మనోభావాలను "2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరినప్పుడు.. నా ఉత్తరాఖండ్, నా దేవభూమి పూర్తిగా సిద్ధంగా ఉంటుంది" అని గఢ్వాలీ భాషలో చెప్పారు.
ఉత్తరాఖండ్ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఇవాళ అనేక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసినట్లు తెలిపిన ప్రధానమంత్రి.. విద్య, ఆరోగ్యం, పర్యాటకం, క్రీడలకు సంబంధించిన ఈ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని అన్నారు. డెహ్రాడూన్, హల్ద్వానీ ప్రాంతాలలో తాగునీటి సమస్యలను పరిష్కరించడంలో జమ్రానీ, సోంగ్ నీటి ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ పథకాలపై రూ. 8,000 కోట్లకు పైగా వెచ్చిస్తున్నట్లు తెలిపిన ప్రధాని.. వీటికి సంబంధించి రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపారు.
ఆపిల్, కివి సాగుచేసే రైతులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం డిజిటల్ కరెన్సీ రూపంలో రాయితీల బదిలీని ప్రారంభించిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. తద్వారా ప్రభుత్వ సహాయం అసలైన లబ్ధిదారులకు మాత్రమే చేరేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షించడం ఇకపై సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ‘ఆర్‌బీఐ’ సహా ఇతర భాగస్వామ్య సంస్థలను ప్రధానమంత్రి అభినందించారు.
“ఉత్తరాఖండ్ రాష్ట్రం భారత ఆధ్యాత్మిక జీవనాడి” అని అభివర్ణిస్తూ- ‘గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్, జగేశ్వర్, ఆది కైలాస్’ వంటివి మన భక్తివిశ్వాసాలకు ప్రతీకలైన పవిత్ర తీర్థయాత్రా ప్రదేశాలని శ్రీ మోదీ సందదర్భంగా పేర్కొన్నారు. ఏటా లక్షలాదిగా భక్తులు ఈ పుణ్యక్షేత్రాలకు యాత్రగా వస్తుంటారని, ఇవి భక్తి మార్గానికి బాటలు వేయడమేగాక ఉత్తరాఖండ్ ఆర్థిక వ్యవస్థలో నవ్యోత్తేజం నింపుతాయని పేర్కొన్నారు.
ఉత్తరాఖండ్ అభివృద్ధితో అనుసంధానం ఎంతగానో ముడిపడి ఉందంటూ, రాష్ట్రంలో ప్రస్తుతం ₹2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు పురోగమనంలో ఉన్నాయని ప్రధానమంత్రి చెప్పారు. రిషీకేశ్-కర్ణప్రయాగ్ రైలు మార్గం పనులు సాగుతుండగా, ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ వే దాదాపు పూర్తి కావస్తున్నదని తెలిపారు. అలాగే గౌరీకుండ్-కేదార్‌నాథ్, గోవింద్‌ఘాట్-హేమకుండ్ సాహిబ్ రోప్‌వే పనులకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టులతో ఉత్తరాఖండ్‌లో ప్రగతి వేగం పుంజుకుంటోందని శ్రీ మోదీ అన్నారు.
గడచిన పాతికేళ్లలో ఉత్తరాఖండ్ సుదీర్ఘ ప్రగతి ప్రయాణం చేసిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో రాబోయే 25 ఏళ్లలో ఎంత ఎత్తులో ఉండాలో ఒకసారి అంచనా వేద్దామా? అని ఆయన ప్రేక్షకులనుద్దేశించి ప్రశ్నించారు. “మనసుంటే మార్గం ఉంటుంది” అనే సామెతను ఉటంకిస్తూ- మన లక్ష్యాలేమిటో మొదట గ్రహిస్తే, వాటిని సాధించే ప్రణాళిక సత్వరం రూపొందగలదని ఆయన వ్యాఖ్యానించారు. కాబట్టి, భవిష్యత్ లక్ష్యాలపై చర్చలకు శ్రీకారం చుట్టడానికి నవంబరు 9ని మించిన మంచి రోజు మరొకటి ఉండదన్నారు.
ఉత్తరాఖండ్ వాస్తవ ప్రతిష్ఠ దాని ఆధ్యాత్మిక బలంలోనే ఉందని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. ఆ దిశగా భవిష్యత్తులో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తే ఈ రాష్ట్రం “ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని”గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలదని శ్రీ మోదీ అభిప్రాయపడ్డారు. ఉత్తరాఖండ్‌లోని ఆలయాలు, ఆశ్రమాలు, ధ్యాన-యోగా కేంద్రాలను ప్రపంచ నెట్‌వర్కుతో అనుసంధానం చేయవచ్చునని ఆయన స్పష్టం చేశారు.
ఆరోగ్య శ్రేయస్సును ఆకాంక్షిస్తూ దేశవిదేశాల ప్రజలు ఉత్తరాఖండ్‌కు వస్తుండటంతో ఇక్కడి వన మూలికలు, ఆయుర్వేద ఔషధాలకు డిమాండ్ వేగంగా విస్తరిస్తున్నదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గడచిన పాతికేళ్లుగా సుగంధ మొక్కలు, ఆయుర్వేద మూలికలు, యోగా, ఆరోగ్య శ్రేయో పర్యాటకంలో అద్భుత ప్రగతి సాధించిందని ఆయన అన్నారు. దీనికి అనుగుణంగా రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో యోగా, ఆయుర్వేద కేంద్రాలు, ప్రకృతి వైద్య సంస్థల సంపూర్ణ ప్యాకేజీ సౌలభ్యం ఉండాలని ప్రతిపాదిస్తూ- తద్వారా విదేశీ పర్యాటకులను మరింతగా ఆకట్టుకునే వీలుందని ఆయన సలహా ఇచ్చారు.
‘సాధికార గ్రామాల కార్యక్రమం’ కింద దేశ సరిహద్దుల్లోని గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ప్రధానమంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ఉత్తరాఖండ్ పరిధిలోని ప్రతి సాధికార గ్రామం ఒక చిన్న పర్యాటక కేంద్రంగా రూపొందడంతోపాటు ఆతిథ్య గృహాలు (హోమ్‌స్టే), స్థానిక వంటకాల సంస్కృతికి ప్రోత్సాహం లభించాలన్నది తన దృక్కోణమని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతాలను సందర్శించే పర్యాటకులు ఇక్కడి ‘డబ్కే, చుడ్కానీ, రోట్-అర్సా, రస్-భాత్, ఝంగోర్ కి ఖీర్’ వంటి సంప్రదాయ వంటకాలను ఆస్వాదిస్తూ, గృహ వాతావరణాన్ని అనుభూతి చెందాలని శ్రీ మోదీ అన్నారు. ఇలాంటి ఆనందదాయక అనుభూతులు పదేపదే మదిలో మెదిలి, పర్యాటలను మళ్లీమళ్లీ ఉత్తరాఖండ్‌కు తీసుకువస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.
ఉత్తరాఖండ్‌లో నిబిడీకృత సామర్థ్యాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవడండపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు ‘హరేలా, ఫూల్ దేయి, భిటౌలి’ వంటి పండుగ వేడుకలలో పాల్గొనేలా చేస్తే పర్యాటకులపై హృదయాలపై అవి చెరగని ముద్ర వేస్తాయన్నారు. అదే తరహాలో ‘నందా దేవి మేళా, జౌల్జీవి మేళా, బాగేశ్వర్ ఉత్తరాయణి మేళా, దేవిధుర మేళా, శ్రావణి మేళా, బటర్ ఫెస్టివల్’ వంటి స్థానిక ఉత్సవానందాన్ని కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ వేడుకలన్నీ ఉత్తరాఖండ్ ఆత్మను కళ్లకు కడతాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. స్థానిక పండుగలు, సంప్రదాయాలను ప్రపంచ పటంలోకి తేవడం లక్ష్యంగా “ఒక జిల్లా - ఒక పండుగ” వంటి కార్యక్రమం చేపట్టడంపై యోచించాల్సిందిగా సూచించారు.
ఉత్తరాఖండ్‌లోని పర్వతప్రాంత జిల్లాలన్నీ పండ్ల సాగుకు అనువైనవని, వాటిని ఉద్యాన పంటల కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ప్రధానమంత్రి కోరారు. ‘బ్లూబెర్రీ, కివి, మూలికా-ఔషధ మొక్కల సాగును భవిష్యత్ వ్యవసాయంగా ఆయన అభివర్ణించారు. ఆహార తయారీ, హస్తకళలు, సేంద్రియ ఉత్పత్తులు తదితర రంగాల్లో ‘ఎంఎస్‌ఎంఈ’లకు సాధికారత కల్పించాల్సిన అవసరం ఎంతయినా ఉందని స్పష్టం చేశారు.
“ఉత్తరాఖండ్‌కు నిరంతర పర్యాటక ఆకర్షణ సామర్థ్యం ఉంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అనుసంధానం మెరుగుతో అన్ని సీజన్లలో పర్యాటక రంగాన్ని సరికొత్తగా రూపుదిద్దాలని ఇంతకుముందు కూడా ఆయన సూచించారు. తదనుగుణంగా రాష్ట్రం ఇప్పుడు శీతాకాల పర్యాటకానికి కొత్త కోణాన్ని జోడిస్తున్నదని హర్షం వెలిబుచ్చారు. దీనికి సంబంధించి తాజా అభివృద్ధి కార్యకలాపాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయన్నారు. ఆ మేరకు శీతాకాల పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని శ్రీ మోదీ అన్నారు. పిథోడ్గఢ్లో 14,000 అడుగులకు పైగా ఎత్తున మారథాన్‌ను విజయవంతంగా నిర్వహించడాన్ని ఆయన గుర్తుచేశారు. అదేవిధంగా ఆది కైలాస్ పరిక్రమ పరుగు దేశానికి స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. మూడేళ్ల కిందట ఆది కైలాస్ యాత్రలో 2,000కన్నా తక్కువ మంది యాత్రికులు పాల్గొనగా, ఆ సంఖ్య ఇప్పుడు 30,000 దాటిందని సంతోషం వ్యక్తం చేశారు. శీతాకాల విపరీత వాతావరణం వల్ల కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలను ఇటీవల మూసివేసే నాటికి ఈ ఏడాది మొత్తం మీద దాదాపు 17 లక్షల మంది భక్తులు దైవదర్శనం చేసుకున్నారని ఆయన గుర్తుచేశారు. తీర్థయాత్రా ప్రాముఖ్యం, నిరంతర పర్యాటకం ఉత్తరాఖండ్ ప్రత్యేకతలని, రాష్ట్ర ప్రగతిని సమున్నత శిఖరాలకు చేర్చగల సామర్థ్యం వీటికి ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అలాగే పర్యావరణ, సాహస పర్యాటకానికి గల అవకాశాలు దేశ యువతను ఆకర్షించే వినూత్న మార్గాలని ఆయన అన్నారు.
‘‘చలనచిత్రాలకు గమ్యస్థానంగా ఉత్తరాఖండ్ మారుతోంది. రాష్ట్ర కొత్త చలనచిత్ర విధానం చిత్రీకరణను సులభతరం చేసింది’’ అని ప్రధానమంత్రి అన్నారు. అలాగే వివాహ గమ్యస్థానంగా సైతం ఉత్తరాఖండ్ ప్రాచుర్యం పొందుతోందని తెలిపారు. ‘వెడ్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కోసం పెద్ద స్థాయిలో సౌకర్యాలను ఉత్తరాఖండ్‌లో కల్పించాలని, దీనికోసం 5 నుంచి 7 ప్రధాన గమ్యస్థానాలను గుర్తించి అభివృద్ధి చేయాలని సూచించారు.
వోకల్ ఫర్ లోకల్ నినాదమే స్వావలంబనకు మార్గమంటూ.. ఆత్మనిర్భర భారత్ కోసం జాతీయ సంకల్పాన్ని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. ఈ దార్శనికతను ఉత్తరాఖండ్ ఎల్లప్పుడూ అవలంబించిందని, స్థానిక ఉత్పత్తుల పట్ల, వాటి వినియోగం పట్ల అభిమానం కలిగి ఉండటం, దైనందిన జీవితంలో వాటిని భాగం చేసుకోవడం ఈ రాష్ట్ర సంప్రదాయంలో అంతర్భాగమన్నారు. వోకల్ ఫర్ లోకల్ ప్రచారాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం వేగంగా అమలు చేసిందని, ఫలితంగా రాష్ట్రంలో 15 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు జీఐ ట్యాగులు లభించాయని సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవలే బేడు ఫలం, బద్రి ఆవు నెయ్యికి జీఐ ట్యాగు గుర్తింపు రావడం గర్వించాల్సిన అంశమన్నారు. పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రతి కుటుంబానికి బద్రి ఆవు నెయ్యి గర్వకారణమని వర్ణిస్తూ.. ఇప్పుడు గ్రామాలను దాటి మార్కెట్లకు బేడు చేరుకుంటోందన్నారు. వీటితో తయారుచేసిన ఉత్పత్తులు ఇప్పుడు జీఐ ట్యాగుని, ఉత్తరాఖండ్ ఖ్యాతి తమతో తీసుకెళ్తాయి. ఇలాంటి జీఐ ట్యాగు ఉత్పత్తులను దేశవ్యాప్తంగా అన్ని గృహాలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందని శ్రీ మోదీ తెలిపారు.
ఉత్తరాఖండ్ ప్రాంతీయ గుర్తింపును ఒకే వేదిక మీదకు తీసుకొచ్చిన ‘‘హౌస్ ఆఫ్ హిమాలయాస్’’ ఓ బ్రాండుగా ఎదుగుతోందని ప్రధానమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. ఈ బ్రాండు ద్వారా రాష్ట్రానికి చెందిన వివిధ రకాల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో పోటీ పడేందుకు వీలుగా ఒకే గుర్తింపు లభించిందని అన్నారు. ప్రస్తుతం ఈ ఉత్పత్తులు వినియోగదారులకు నేరుగా డిజిటల్ వేదికల్లో లభ్యమవుతున్నాయని, రైతులకు, చేతివృత్తుల వారికి, చిన్న వ్యాపారవేత్తలకు కొత్త మార్కెట్ అవకాశాలను అందిస్తున్నాయని వివరించారు. బ్రాండింగ్ ప్రయత్నాల్లో కొత్త శక్తి నింపాలని శ్రీ మోదీ కోరారు. ఈ బ్రాండెడ్ ఉత్పత్తుల పంపిణీ వ్యవస్థలను నిరంతరం మెరుగుపరుచుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు.
అభివృద్ధి ప్రయత్నాల్లో ఉత్తరాఖండ్ అనేక ఇబ్బందులు ఎదుర్కొందని, తమ సమర్థవంతమైన ప్రభుత్వం ఈ సవాళ్లను అధిగమించిందని, నిరంతరాయంగా పురోగతి కొనసాగుతోందని శ్రీ మోదీ తెలియజేశారు. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తున్న పుష్కర్ సింగ్ ధామీ ప్రభుత్వం.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని అభినందించారు. మత మార్పిడి నిరోధక చట్టం, అల్లర్ల నియంత్రణ చట్టం లాంటి జాతీయ ప్రాధాన్యమున్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సాహసోపేతమైన విధానాలను ప్రశంసించారు. భూ ఆక్రమణలు, జనాభా మార్పులకు సంబంధించిన సున్నితమైన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న దృఢమైన చర్యలను సైతం ప్రధామంత్రి గుర్తించారు. విపత్తు నిర్వహణ రంగంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీసుకొంటున్న వేగవంతమైన, సున్నితమైన స్పందనను, సాధ్యమైన అన్ని విధాలుగా ప్రజలకు సాయాన్ని అందించడంలో చేపడుతున్న ప్రయత్నాలను ప్రశంసించారు.
రాష్ట్ర అవతరణ రజతోత్సవాన్ని నిర్వహించుకుంటున్న సందర్భంగా భవిష్యత్తులో నూతన అభివృద్ధి శిఖరాలకు ఉత్తరాఖండ్ చేరుకుంటుందని, తన సంస్కృతిని, గుర్తింపును గర్వంగా ముందుకు తీసుకెళుతుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే 25 ఏళ్ల కోసం ఉత్తరాఖండ్ అభివృద్ధికి ప్రజలు తమ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని, పురోగతి మార్గంలో దృఢ సంకల్పంతో నడవాలని సూచించారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అడుగడుగునా.. సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి పౌరునికీ ఆనందం, శ్రేయస్సు, ఉజ్వలమైన భవిష్యత్తు లభించాలని ఆకాంక్షిస్తూ.. ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మీత్ సింగ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర మంత్రి శ్రీ అజయ్ టమ్టా, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
ఉత్తరాఖండ్ అవతరణ రజతోత్సవాల సందర్భంగా ఆ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్మారక తపాలా బిళ్లను విడుదల చేశారు. సభకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో రూ.8140 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. వాటిలో రూ.930 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టులను ప్రారంభించగా, రూ.7210 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు భూమి పూజ చేశారు. తాగు నీరు, నీటి పారుదల, సాంకేతిక విద్య, ఇంధనం, పట్టణాభివృద్ధి, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి తదితర కీలకమైన రంగాల్లో ఈ ప్రాజెక్టులున్నాయి.
పీఎం ఫసల్ బీమా యోజన ద్వారా నేరుగా 28,000 మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.62 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రధానమంత్రి విడుదల చేశారు.
ప్రధానమంత్రి ప్రారంభించిన వాటిలో అమృత్ పథకం ద్వారా డెహ్రాడూన్లో 23 జోన్లకు నీటి సరఫరా, పిథోర్‌గఢ్ జిల్లాలో విద్యుత్ ఉపకేంద్రం, ప్రభుత్వ కార్యాలయాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు, నైనిటాల్లోని హల్ద్వానీ స్టేడియలో ఆస్ట్రో టర్ఫ్ హాకీ మైదానం తదితరమైనవి ఉన్నాయి.
జలరంగానికి చెందిన రెండు ముఖ్యమైన ప్రాజెక్టులు - డెహ్రాడూన్‌కు 150 ఎంఎల్‌డీ (రోజుకి మిలియన్ లీటర్లు) సరఫరా చేసే సాంగ్ డ్యామ్ తాగునీటి ప్రాజెక్టు, తాగునీటిని అందించే, నీటిపారుదల, విద్యుత్ ఉత్పత్తికి సహకరించే నైనిటాల్లోని జమారానీ డ్యాం బహుళార్థ సాధక ప్రాజెక్టు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. విద్యుత్ సబ్ స్టేషన్లు, చంపావత్‌లో మహిళల క్రీడా కళాశాల, నైనిటాల్లో అత్యాధునిక వసతులతో నిర్మించనున్న డెయిరీ ప్లాంట్, తదితరమైనవి ప్రధానమంత్రి భూమిపూజ చేసిన వాటిలో ఉన్నాయి.
***
(Release ID: 2188157)
Visitor Counter : 3