ప్రధాన మంత్రి కార్యాలయం
ఏడాది పాటు నిర్వహించనున్న “వందేమాతరం” జాతీయ గేయం 150 సంవత్సరాల స్మారకోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
07 NOV 2025 2:01PM by PIB Hyderabad
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
వందేమాతరం... ఒక మంత్రం, ఒక శక్తి, ఒక స్వప్నం, ఒక సంకల్పం. వందేమాతరం... దేశమాత ఆరాధన, సాధన. వందేమాతరం... మనందరినీ చరిత్రలోకి తీసుకెళ్తుంది... మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది... మన వర్తమానాన్నీ ఆత్మవిశ్వాసంతో నింపుతుంది... సాధించలేని సంకల్పం ఏదీ లేని మన భవిష్యత్తుకు సరికొత్త భరోసానిస్తుంది. భారతీయులుగా మనం సాధించలేని లక్ష్యం ఏదీ లేదు.
మిత్రులారా,
సామూహికంగా వందేమాతర గేయాన్ని ఆలపించే ఈ అద్భుతమైన అనుభవం నిజంగా మాటలతో వర్ణించలేనిది. అనేక గళాల్లో... ఒకే లయ, ఒకే స్వరం, ఒకే భావం, ఒకే ఉత్తేజం, ఒకే ప్రవాహంగా సాగే ఈ గేయాలాపన హృదయాన్ని స్పందింపజేస్తుంది. ఈ భావోద్వేగ భరితమైన వాతావరణంలో నేను నా ప్రసంగాన్ని కొనసాగిస్తున్నాను. వేదికపై ఉన్న నా మంత్రివర్గ సహచరులు శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ గారు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీ.కే. సక్సేనా గారు, ముఖ్యమంత్రి శ్రీమతి రేఖ గుప్తా గారు, ఇతర ప్రముఖులు, అలాగే ఈ వేడులకు హాజరైన నా సోదరీ సోదరులారా...
ఈ రోజు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు మనతో అనుసంధానమయ్యారు. నేను వారికి వందేమాతరంతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు... నవంబర్ 7 చాలా చరిత్రాత్మకమైనది. ఈ రోజు మనం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ శుభ సందర్భం మనకు కొత్త స్ఫూర్తినిస్తుంది. కోట్లాది మంది భారతీయుల్లో కొత్త శక్తిని నింపుతుంది. చరిత్రలో ఈ రోజును చిరస్మరణీయం చేస్తూ వందేమాతరం స్మారక స్టాంపు, ప్రత్యేక నాణెం విడుదల చేశాం. ఈ రోజు మన దేశంలోని గొప్ప వ్యక్తులు, వందేమాతరం మంత్రానికి తమ జీవితాలను అంకితం చేసిన భరతమాత ముద్దుబిడ్డలకు నా గౌరవపూర్వక నివాళులర్పిస్తున్నాను. దేశ పౌరులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వందేమాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
ప్రతి పాటకు, ప్రతి కవితకు ప్రధానమైన సొంత ఇతివృత్తం, సొంత సందేశం ఉంటాయి. వందేమాతరం ప్రధాన ఇతివృత్తం ఏమిటి? వందేమాతరం ప్రధాన ఇతివృత్తం భారత్, భరతమాత. భారతదేశపు అద్భుత భావన. మానవత్వం ప్రారంభం నుంచే తనను తాను మలచుకున్న భావన. యుగాలను అధ్యాయాలుగా చదివిన భావన. వివిధ యుగాల్లో వివిధ దేశాల ఆవిర్భావం... వివిధ శక్తుల ఆవిర్భావం... సరికొత్త నాగరికతల అభివృద్ధి... శూన్యం నుంచి శిఖరాగ్రానికి వాటి ప్రయాణం...శిఖరాగ్రం నుంచి తిరిగి శూన్యంలోకి అవి విలీనం కావడం... మారుతున్న చరిత్ర, ప్రపంచ భౌగోళిక స్వరూపం... ఇవన్నీ భారత్ చూసింది. మనిషి అంతులేని ఈ ప్రయాణం నుంచి మనం ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకున్నాం... అలవాటు చేసుకున్నాం... వాటి ఆధారంగా మన నాగరికత విలువలు, ఆదర్శాలను రూపొందించుకున్నాం. మనం, మన పూర్వీకులు, రుషులు, సాధువులు, గురువులు, దేవుళ్ళు, మన దేశ ప్రజలు కలిసి మన సొంత సాంస్కృతిక గుర్తింపును సృష్టించుకున్నాం. బలం, నైతికత మధ్య సమతుల్యతను మనం అర్థం చేసుకున్నాం. అప్పుడే ఒక దేశంగా భారత్ గతంలోని ప్రతి దెబ్బను భరించి బంగారు రత్నంగా ఆవిర్భవించింది... దాని ద్వారా అమరత్వాన్ని పొందింది.
సోదరీ సోదరులారా,
భారత్ అనే ఈ భావన వెనుక ఉన్న గొప్ప సైద్ధాంతిక శక్తి ఉంది. ఒకరి స్వతంత్ర ఉనికి గురించిన అవగాహనగా... హెచ్చుతగ్గుల ప్రపంచానికి భిన్నంగా... మనం సాధించే విజయంగా... లయబద్ధంగా రాసి, మరింత లయబద్ధంగా మార్చి... హృదయపు లోతు నుంచి, అనుభవాల సారం నుంచి, అనంతమైన భావోద్వేగాలను పొందిన తర్వాత... వందేమాతరం వంటి గొప్ప కూర్పు లభించింది. ఆ బానిసత్వ కాలంలో వందేమాతరం మన సంకల్ప ప్రకటనగా మారింది. ఆ ప్రకటనే భారత స్వాతంత్య్రాన్ని అందించింది. భరతమాత బానిస సంకెళ్లు తొలగిపోయి... భరతమాత బిడ్డలంతా వారి భవితను సొంతంగా నిర్మించుకునే స్వేచ్ఛ లభించింది.
మిత్రులారా,
గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఒకసారి ఇలా అన్నారు - “బంకిమ్ చంద్ర రాసిన ఆనందమఠం కేవలం నవల మాత్రమే కాదు... అది స్వతంత్ర భారత స్వప్నం”. ఆనందమఠంలో వందేమాతర సందర్భం, వందేమాతరంలోని ప్రతి పంక్తి, బంకిమ్ బాబు రాసిన ప్రతి పదం, అతని భావాలు... వాటి సొంత లోతైన అర్థాలను కలిగి ఉన్నాయి. ఈ గేయం ఖచ్చితంగా బానిసత్వ కాలంలో కూర్చబడిందే, కానీ దానిలోని పదాలు కొన్ని సంవత్సరాల బానిసత్వ నీడకు ఎప్పుడూ పరిమితం కాలేదు. అవి బానిసత్వ జ్ఞాపకాల నుంచి విముక్తి పొందాలని సూచించాయి. అందుకే వందేమాతరం ప్రతి యుగంలో, ప్రతి కాలంలో ఆలాపన ద్వారా అమరత్వాన్ని సాధించింది. వందేమాతరం గేయంలోని మొదటి పంక్తి - “సుజలాం సుఫలాం మలయజ శీతలాం, సస్యశ్యామలాం మాతరం.” అంటే, ప్రకృతి దేవత ఆశీర్వాదాలతో అలంకరించి ఉన్న మన సుజలాం సుఫలాం మాతృభూమికి వందనం.
మిత్రులారా,
వేల సంవత్సరాలుగా భారత్ గుర్తింపు ఇదే. ఇక్కడి నదులు, పర్వతాలు, అడవులు, చెట్లు, సారవంతమైన నేలలతో ఈ భూమి ఎల్లప్పుడూ బంగారం పండించే శక్తిని కలిగి ఉంది. శతాబ్దాలుగా ప్రపంచమంతా భారత్ శ్రేయస్సు గురించిన కథలు వింటూనే ఉంది. కేవలం కొన్ని శతాబ్దాల కిందటే భారత్ ప్రపంచ జీడీపీలో దాదాపు పావు వంతు వాటాను కలిగి ఉంది.
కానీ సోదరీ సోదరులారా,
బంకిమ్ బాబు వందేమాతరం రచించే సమయానికి భారత్ తన స్వర్ణయుగం నుంచి చాలా దూరం వెళ్ళిపోయింది. విదేశీ దండయాత్రలు, వారి దాడులు, దోపిడీలు, బ్రిటిష్ వారి దోపిడీ విధానాలతో ఆ సమయంలో మన దేశం పేదరికం, ఆకలి గుప్పిట్లో విలపిస్తోంది. అయినప్పటికీ ఆ విపత్కర పరిస్థితుల్లో, చుట్టూ బాధ, విధ్వంసం, విషాదం ఉన్నప్పటికీ... ప్రతిదీ మునిగి పోతున్నట్లు అనిపించిన విపత్కర పరిస్థితిల్లోనూ... మన బంకిమ్ బాబు సంపన్న భారత్ కోసం పిలుపునిచ్చారు. పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా భారత్ తన స్వర్ణయుగాన్ని పునరుద్ధరించగలదని ఆయన నమ్మారు. అందుకే ఆయన వందేమాతరం అని పిలుపునిచ్చారు.
మిత్రులారా,
బానిసత్వ కాలంలో బ్రిటీషు వారు భారతదేశాన్ని హీనమైనదిగా, వెనకబడినదిగా చిత్రీకరించి తమ పాలనను సమర్థించుకోవడానికి ఉపయోగించిన ప్రచారాన్ని ఈ మొదటి పంక్తి పూర్తిగా నిర్వీర్యం చేసింది. అందుకే వందేమాతరం స్వాతంత్య్ర గేయంగా మారడమే కాకుండా... స్వతంత్ర భారత్ ఎలా ఉంటుందో 'సుజలాం సుఫలాం స్వప్నం' ద్వారా కోట్లాది మంది దేశ ప్రజలకు ప్రదర్శించింది.
మిత్రులారా,
వందేమాతర అసాధారణ ప్రయాణం, ప్రభావాన్ని తెలుసుకోవడానికి ఈ రోజు మనకు అవకాశం ఇస్తుంది. 1875లో బంకిమ్ బాబు బంగదర్శన్‌లో “వందేమాతరం” ప్రచురించినప్పుడు... కొంతమంది దానిని కేవలం ఒక పాటగా భావించారు. కానీ కొద్దికాలంలోనే వందేమాతరం భారత స్వాతంత్య్ర పోరాటంలో లక్షలాది మంది ప్రజల గళంగా మారింది. ప్రతి విప్లవకారుడి పెదవులపై ఉండే స్వరంగా, ప్రతి భారతీయుడి మనోభావాలను వ్యక్తపరిచే గళంగా ఇది మారింది. మీరు చూడండి... వందేమాతరంతో సంబంధం లేని అధ్యాయం స్వాతంత్య్ర పోరాటంలో ఏదీ లేదు. 1896లో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ కలకత్తా సమావేశంలో వందేమాతర గేయాన్ని ఆలపించారు. 1905లో బెంగాల్ విభజన జరిగింది. ఇది దేశాన్ని విభజించడానికి బ్రిటిష్ వారు చేసిన ప్రమాదకరమైన ప్రయోగం. అయితే, వందేమాతరం ఆ ప్రణాళికలకు వ్యతిరేకంగా శిలగా అడ్డు నిలిచింది. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వీధుల్లో ఒకే ఒక్క స్వరం వినిపించింది- వందేమాతరం.
మిత్రులారా,
బరిసల్ సమావేశంలో నిరసనకారులపై తూటాలు కాల్చినప్పుడు కూడా వారి పెదవులపై అదే మంత్రం, అవే పదం - వందేమాతరం- ఉన్నాయి. భారతదేశం వెలుపల నివసిస్తూ స్వాతంత్ర్యం కోసం పని చేసిన వీర్ సావర్కర్ వంటి స్వాతంత్ర్య సమరయోధులు ఒకరినొకరు కలిసినప్పుడల్లా - వందేమాతరం - అంటూ పలకరించుకునేవారు. చాలా మంది విప్లవకారులు ఉరికొయ్యపై నిలబడినప్పుడు కూడా 'వందేమాతరం' అని నినదించారు. చరిత్రలో అలాంటి సంఘటనలు, తేదీలు ఎన్నో ఉన్నాయి. ఇంత పెద్ద దేశం, వేర్వేరు రాష్ట్రాలు, ప్రాంతాలు, వేర్వేరు భాషలు మాట్లాడే ప్రజలు, వారు చేసిన ఉద్యమాలు - కానీ ప్రతి నోటా ఒకటే నినాదం, ప్రతి నోటా ఒకటే గీతం - వందేమాతరం.
సోదరీ సోదరులారా,
మహాత్మా గాంధీ 1927లో "వందేమాతరం మన ముందు విభజించలేని సమగ్ర భారతదేశ దృశ్యాన్ని ఉంచుతుంది" అని అన్నారు. శ్రీ అరవిందులు 'వందేమాతరం'ను ఒక పాట కంటే ఎక్కువ, ఒక మంత్రం అని అభివర్ణించారు. "ఇది ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలిపే ఒక మంత్రం" అని ఆయన అన్నారు. భికైజీ కామా రూపొందించిన భారత జెండా మధ్యలో కూడా ‘వందేమాతరం‘ అని రాశారు.
మిత్రులారా,
మన జాతీయ జెండా కాలక్రమేణా చాలా మార్పులకు లోనైంది. అయితే అప్పటి నుంచి ఈ రోజు వరకు జాతీయ పతాకం ఎగురవేసిన ప్రతి సందర్భంలోనూ మనం అప్రయత్నంగానే “భారత్ మాతా కి జై! వందేమాతరం!” అని నినదిస్తాం. అందుకే, ఈరోజు మనం ఆ జాతీయ గేయం 150 సంవత్సరాలను జరుపుకుంటున్న సందర్భం మన దేశ మహానాయకులకు అర్పించే నివాళి. అలాగే, వందేమాతరం అని నినదిస్తూ ఉరికొయ్యపై ప్రాణాలు వదిలిన లక్షలాది అమర వీరులకు, వందేమాతరం అంటూ కొరడా దెబ్బలను భరించినవారికి, మంచు కొండలపై వందేమాతరం అంటూ ధైర్యంగా నిలబడిన సైనికులకు కూడా ఇది మన గౌరవప్రదమైన వందనం.
మిత్రులారా,
ఈ రోజు, మన 140 కోట్ల భారతీయులం - దేశం కోసం జీవించిన, మరణించిన ప్రముఖులకు, పేర్లు తెలియని, వెలుగులోకి రాని వీరులకు నివాళులు అర్పిస్తున్నాం. వందేమాతరం అని నినదిస్తూ దేశం కోసం తమ ప్రాణాలను అర్పించినా చరిత్ర పుటలలో పేర్లు నమోదుకాని వారికి కూడా ఈ నివాళి.
మిత్రులారా,
మన వేదాలు మనకు ఇలా నేర్పాయి - "మాతా భూమిః, పుత్రోఽహం పృథివ్యాః"॥ అంటే, ఈ భూమి మన తల్లి. ఈ దేశం మన తల్లి. మనం ఆమె సంతానం. వేదకాలం నుంచే, భారత ప్రజలు దేశాన్ని ఈ రూపంలోనే ఊహించి, ఈ రూపంలోనే పూజించారు. ఆ వేదస్ఫూర్తి నుంచే ‘వందేమాతరం‘ స్వాతంత్ర్య పోరాటానికి కొత్త చైతన్యాన్ని అందించింది.
మిత్రులారా
దేశాన్ని ఒక భౌగోళిక రాజకీయ సంస్థగా భావించేవారు దేశాన్ని తల్లిగా పరిగణించే ఆలోచనను అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ భారతదేశం భిన్నమైనది. ఇక్కడ తల్లి అనేది కేవలం జన్మనిచ్చే తల్లే కాదు. పోషించే, రక్షించే తల్లి కూడా. పిల్లవాడు ఎలాంటి కష్టాన్ని ఎదుర్కొన్నా, ఆమె రక్షకురాలిగానే కాకుండా అందుకు అవసరమైతే వినాశకారిణీగానూ మారగలదు. అందుకే “వందేమాతరం” ఇలా చెప్పింది - “అబలా కేన మా ఏత బలే, బహుబలధారిణీం నమామి తారిణీం రిపుదలవారిణీం మాతరమ్॥” వందేమాతరం, అంటే భారతమాత అపారమైన శక్తిని కలిగి ఉంది. ఆమె మన కష్టాలను అధిగమించడంలో సహాయపడుతుంది. అలాగే మన శత్రువులను నాశనం చేయగలదు. దేశాన్ని తల్లిగా, తల్లిని శక్తి స్వరూపిణిగా భావించే ఈ ఆలోచన వల్ల ఒక గొప్ప ప్రభావం ఏర్పడింది. మన స్వాతంత్ర్య పోరాటం మహిళా, పురుషులందరి సమాన భాగస్వామ్య సంకల్పంగా మారింది. దేశ నిర్మాణంలో మహిళా శక్తి ముందంజలో ఉండే భారతదేశాన్ని మనం మరోసారి ఊహించగలుగుతున్నాం.
మిత్రులారా,
“వందేమాతరం” కేవలం స్వాతంత్ర్య గీతమే కాదు, మన స్వాతంత్ర పరిరక్షణకు కూడా స్ఫూర్తినిస్తుంది. బంకిమ్ బాబు రచించిన అసలు పాటలోని పంక్తులు ఇలా ఉన్నాయి - “త్వం హి దుర్గా దశప్రహణధారిణీ, కమలా కమల దళ విహారిణీ, వాణీ విద్యాదాయినీ, నమామి త్వాం, నమామి కమలాం అమ్లాన అతులాన్ సుజలాన్ సుఫలామ్ మాతరం, వందేమాతరం!" అంటే, భారతమాత జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతి. సంపదను ఇచ్చే లక్ష్మి. ఆయుధాలు, వేదశాస్త్రాలను ధరించిన దుర్గ రూపాలుగా ఉందని అర్థం. జ్ఞానం, విజ్ఞానం, సాంకేతికతలో అగ్రస్థానంలో ఉన్న, జ్ఞాన, విజ్ఞాన సంపదలో అగ్రస్థానంలో ఉన్న, జాతీయ భద్రత కోసం స్వావలంబన కలిగిన దేశాన్ని మనం నిర్మించాలి.
మిత్రులారా,
ఇలా రూపుదిద్దుకుంటున్న భారతదేశాన్ని గత కొన్నేళ్లుగా ప్రపంచం చూస్తోంది. శాస్త్ర, సాంకేతికత రంగంలో మనం అపూర్వమైన పురోగతిని సాధించాం. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం ఆవిర్భవించాం. నూతన భారతదేశం మానవతా సేవలో కమల - విమల స్వరూపమైతే, శత్రువు ఉగ్రవాదం ద్వారా భారతదేశ భద్రత, గౌరవంపై దాడికి సాహసించినప్పుడు ఉగ్రవాదాన్ని నశింపజేయడానికి ‘దశ‑ప్రహరణ‑ధారిణీ దుర్గ’ గా ఎలా మారిందో ప్రపంచం మొత్తం చూసింది.
మిత్రులారా,
వందేమాతరం గేయానికి సంబంధించిన మరో అంశం ఉంది, దీని గురించి కూడా చర్చించడం అవసరం. స్వాతంత్ర్య పోరాట సమయంలో వందేమాతరం స్ఫూర్తి దేశం మొత్తాన్ని వెలిగించింది. కానీ 1937 లో, దాని ప్రాణం లాంటి భాగంలో కొన్ని కీలకమైన పద పంక్తులను తొలగించడం దురదృష్టకరం. వందేమాతరం విచ్ఛిన్నమైంది, అది ముక్కలు ముక్కలైంది. వందేమాతరం విభజన దేశ విభజనకు కూడా బీజాలు వేసింది. దేశ నిర్మాణానికి అత్యంత మహత్తరమైన ఈ మంత్రానికి ఇలా అన్యాయం ఎందుకు జరిగింది? అదే విభజనాత్మక ఆలోచన ఇప్పటికీ దేశానికి ఒక సవాల్‌గా ఉన్నందున ఇది నేటి తరం ఆలోచించవలసిన చాలా ముఖ్యమైన విషయం.
మిత్రులారా,
మనం ఈ శతాబ్దాన్ని భారతదేశ శతాబ్దంగా మార్చాలి. ఈ శక్తి భారతదేశంలో ఉంది; ఈ శక్తి భారత దేశంలోని 140 కోట్లమంది ప్రజలలోనూ ఉంది. దీనిని సాధించడానికి మనకు మనపై నమ్మకం ఉండాలి. ఈ సంకల్పాల ప్రయాణంలో, మనల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించే వారు మనకు ఎదురవుతారు. ప్రతికూల ఆలోచన ఉన్నవారు మన మనస్సుల్లో సందేహాలను సృష్టించడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు మనం ఆనంద్‌మఠ్ లోని సంఘటనను గుర్తు చేసుకోవాలి. ఆనంద్‌మఠ్‌లో, సంతాన్ భవనానంద 'వందేమాతరం' పాడినప్పుడు, మరొక పాత్ర వాదిస్తుంది. ఒంటరిగా నువ్వు ఏమి చేయగలవు? అని అతడు అడుగుతాడు. అప్పుడే మనకు వందేమాతరం నుంచి స్ఫూర్తి లభిస్తుంది. కోట్లాదిమంది కొడుకులు, కూతుళ్లు, కోట్లాది చేతులు ఉన్న తల్లి ఎలా బలహీనంగా ఉంటుంది? ఈ రోజు భారతమాతకు 140 కోట్ల మంది పిల్లలు ఉన్నారు. ఆమెకు 280 కోట్ల చేతులు ఉన్నాయి. ఇందులో 60 శాతానికి పైగా యువతే. ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా సంబంధ ప్రయోజనం మనకుంది. ఈ శక్తి ఈ దేశానిది. ఇది భారతమాత శక్తి. ఈ రోజు మనకు అసాధ్యమైనది ఏముంది? వందేమాతరం మూల స్వప్నాన్ని నెరవేర్చకుండా మనల్ని ఆపగలిగేది ఏముంది?
మిత్రులారా,
నేడు, స్వావలంబన భారత్ లక్ష్యం విజయం సాధించడంతో, మేక్ ఇన్ ఇండియా సంకల్పం, అలాగే, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యం వైపు మన ప్రయాణం సాగుతున్న వేళ, దేశం కొత్త విజయాలను సాధించే అపూర్వ సందర్భాల్లో , ప్రతి పౌరుని నినాదం - వందేమాతరం! నేడు, భారతదేశం చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న మొదటి దేశంగా మారినప్పుడు, అంతరిక్షంలోని సుదూర మూలల్లో నవభారతం శబ్దం వినిపించినప్పుడు, ప్రతి పౌరుని నినాదం - వందేమాతరం! నేడు, మన ఆడబిడ్డలు అంతరిక్ష సాంకేతికత నుంచి క్రీడల వరకు ప్రతి విషయంలోనూ అగ్రస్థానానికి చేరుకోవడం చూసినప్పుడు, నేడు మన ఆడబిడ్డలు ఫైటర్ జెట్‌లను నడపడం చూసినప్పుడు, గర్వంతో నిండిన ప్రతి భారతీయుడి నినాదం ఇదే – వందేమాతరం!
మిత్రులారా,
మన సైనిక సిబ్బందికి వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) అమలు చేసి నేటికీ 11 సంవత్సరాలు పూర్తయింది. శత్రువుల దుష్ట పన్నాగాన్ని అణచివేసినప్పుడు, ఉగ్రవాదం, నక్సలిజం, మావోయిస్టుల భయానక దాడులను భగ్నం చేసినప్పుడు మన భద్రతా దళాలు కేవలం ఒక మంత్రం ద్వారానే స్ఫూర్తి పొందుతాయి. ఆ మంత్రమే - వందేమాతరం!
మిత్రులారా,
భారతమాతను ఆరాధించే ఈ స్ఫూర్తి మనలను అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యం వైపు నడిపిస్తుంది. మన ఈ అమృత యాత్రలో, వందేమాతరం అనే మంత్రం భారత మాత కోట్లాదిమంది బిడ్డలను నిరంతరం శక్తిమంతులను చేస్తుందని, స్ఫూర్తిని ఇస్తుందని నేను నమ్ముతున్నాను. వందేమాతరం గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, నా దేశ ప్రజలందరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందనలు. దేశం నలుమూలల నుంచి నాతో అనుసంధానమై, నాతో నిలబడి, పూర్తి శక్తితో, మీ చేతులు పైకెత్తి వందేమాతరం అంటూ గొంతు కలిపిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
వందేమాతరం! వందేమాతరం!
వందేమాతరం! వందేమాతరం!
వందేమాతరం! వందేమాతరం!
వందేమాతరం! వందేమాతరం!
వందేమాతరం! వందేమాతరం!
చాలా ధన్యవాదాలు!
***
(Release ID: 2187673)
Visitor Counter : 8