ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ఛాంపియన్లతో ప్రధానమంత్రి సంభాషణ


అద్భుతమైన ఆటతీరుతో ట్రోఫీని గెలిచిన జట్టుకు ప్రధానమంత్రి అభినందనలు

తమ విజయగాథను పంచుకోవడం ద్వారా ఇతరులకు స్ఫూర్తినివ్వాలని ప్రధానమంత్రి పిలుపు: ప్రతి క్రీడాకారిణీ ఏడాదిలో మూడు పాఠశాలలను సందర్శించాలని సూచన

ఊబకాయాన్ని ఎదుర్కొనే ఫిట్ ఇండియా ఉద్యమం గురించి వివరించిన ప్రధాని: ఇది అందరికీ, ముఖ్యంగా దేశంలో అమ్మాయిలకు ప్రయోజనం చేకూరేలా ప్రచారం చేయాలని క్రీడాకారిణులకు విజ్ఞప్తి

Posted On: 06 NOV 2025 1:28PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని లోకకల్యాణ్ మార్గ్, 7లో ఐసీసీ మహిళా ప్రపంచ కప్ 2025 ఛాంపియన్లతో నిన్న ముచ్చటించారు. 2025 నవంబర్ 2, ఆదివారం జరిగిన తుదిపోరులో దక్షిణాఫ్రికాపై భారత జట్టు విజయం సాధించింది. దేవ దీపావళి, గురు పర్వ్ రెండింటినీ నిర్వహించుకొనే ఈ రోజు చాలా ముఖ్యమైనదంటూ.. ఈ కార్యక్రమానికి హాజరైన వారికి ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. ఆయన్ను కలుసుకోవడం గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నానని జట్టు కోచ్ శ్రీ అమోల్ మజుందార్ అన్నారు. దేశ కుమార్తెలు నాయకత్వం వహించిన ఉద్యమంగా క్రీడాకారిణులు చేసిన కృషిని వర్ణిస్తూ.. రెండేళ్లుగా వారు కనబరిచిన అసాధారణ అంకితభావాన్ని ప్రశంసించారు. ప్రతి ప్రాక్టీస్ సెషన్లోనూ అమ్మాయిలు అద్భుతమైన ఉత్సాహంతో, శక్తితో ఆడారని, వారు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందన్నారు.
ట్రోఫీ గెలవకపోయినప్పటికీ 2017లో ప్రధానమంత్రితో జరిగిన సమావేశాన్ని కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ గుర్తు చేసుకున్నారు. ఏళ్లుగా తాము కష్టపడి గెలుచుకున్న ట్రోఫీని ఇప్పుడు ఆయనకు అందించడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. తమ ఆనందాన్ని ప్రధానమంత్రి రెట్టింపు చేశారని, ఇది తమకు గర్వకారణమన్నారు. భవిష్యత్తులోనూ ప్రధానితో సమావేశమవడం, గ్రూపు ఫొటోలు తీసుకోవడాన్ని కొనసాగించడమే తమ లక్ష్యమని ఆమె చెప్పారు.
వారు సాధించిన విజయం నిజంగా గొప్పదని శ్రీ మోదీ ప్రశంసించారు. భారత్‌లో క్రికెట్  ఒక ఆటగా మాత్రమే పరిమితం కాలేదని, అది ప్రజల జీవితాల్లో భాగమైందన్నారు. క్రికెట్ బాగా ఆడుతున్నప్పుడు.. దేశం ఉత్సాహంగా ఉంటుందని, చిన్న ఎదురుదెబ్బ తగిలినా దేశమంతా కుంగిపోతుందన్నారు. వరుసగా మూడు మ్యాచుల్లో పరాజయం చవి చూసిన తర్వాత ఈ జట్టు విమర్శలు ఎలా ఎదుర్కోవాల్సి వచ్చిందో వివరించారు.
2017లో ఫైనల్లో ఓడిపోయిన తర్వాత తాము ప్రధానమంత్రిని కలుసుకున్నామని.. తర్వాత లభించే అవకాశంలో ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలని ఆ సమయంలో తమను ప్రోత్సహించారని హర్మన్ ప్రీత్ కౌర్ గుర్తు చేసుకున్నారు. ట్రోఫీని గెలుచుకొని మళ్లీ ప్రధానితో మాట్లాడుతున్నందుకు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
తన ఆలోచనలను పంచుకోవాల్సిందిగా ప్రధానమంత్రి స్మృతి మంధానను ప్రధానమంత్రి ఆహ్వానించారు. 2017లో ట్రోఫీని జట్టు గెలవలేకపోయిందని, కానీ ఆ సమయంలో అంచనాలను ఎలా అధిగమించాలనే ప్రశ్నను ప్రధానిని అడిగినట్లు గుర్తు చేసుకున్నారు. అప్పుడు ఆయనిచ్చిన సమాధానం తనకు గుర్తుండిపోయిందని, తర్వాత ఆరేడేళ్ల పాటు ప్రపంచకప్‌లో అనేక పరాజయాలు మూటకట్టుకున్నప్పటికీ జట్టుకు ఎంతో తోడ్పడిందని తెలిపారు. ప్రపంచ కప్‌‌ను మొదటిసారి భారత్ గెలుచుకోవడం, దానిని ఇక్కడే నిర్వహించడం విధి నిర్ణయంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రధానమంత్రి తనకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలిచారని, ముఖ్యంగా ఇస్రో ప్రయోగాల నుంచి దేశం సాధించిన ఇతర విజయాల వరకు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారని తెలిపారు. ఇది స్ఫూర్తిదాయకంగా నిలిచిందని, మరింత మెరుగైన ప్రదర్శన చేసేలా, తోటి అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచే సాధికారత ఇచ్చిందని వివరించారు. దీన్ని దేశం మొత్తం చూసి గర్విస్తోందన్న శ్రీ మోదీ.. వారి అనుభవాలను మనస్ఫూర్తిగా వినాలనుకుంటున్నానని చెప్పారు. ఈ విజయంలో ఎవరి సహకారం తక్కువ కాదని.. ప్రతి క్రీడాకారిణి ఇంటికి వెళ్లి తన కథను పంచుకోగలడమే తనకు నచ్చిన అంశమని స్మృతి మంథాన అన్నారు. అంచనాలకు తగినట్లుగా ఎలా ఉండాలో గతంలో ప్రధానమంత్రి ఇచ్చిన సూచన తనకు గుర్తుందని, ఆయన ప్రశాంతమైన, గంభీరమైన ప్రవర్తన కూడా స్ఫూర్తిని కలిగిస్తాయన్నారు.
జట్టు ప్రయాణాన్ని జెమీమా రోడ్రిగ్స్ వివరించారు. తాము వరుసగా మూడు మ్యాచులు ఓడిపోయామని, ఎన్నిసార్లు ఓటమిని ఎదుర్కొన్నామన్నది జట్టును నిర్వచించదని, పడిన తర్వాత తిరిగి ఎలా పుంజుకున్నామన్నదే తెలియజేస్తుందన్నారు. జట్టు అంతా ఉత్తమ ప్రదర్శన చేసిందని అందుకే తాము విజేతగా నిలిచామని తెలియజేశారు. జట్టులో ఉన్న ఐక్యతే తాను చూసిన ఉత్తమమైన అంశమని వెల్లడించారు. ఏ క్రీడాకారిణి అయినా ఉత్తమ ప్రదర్శన చేసినప్పుడు.. మిగిలిన వారు తామే పరుగులు చేసినట్లు లేదా వికెట్లు తీసినట్లు సంబరపడ్డారని తెలిపారు. ఎవరి ప్రదర్శనైనా బాగా లేకపోతే.. భుజంపై చేయి వేసి ‘‘మరేం ఫర్వాలేదు. తర్వాతి మ్యాచులో నువ్వు దాన్ని సాధిస్తావు’’ అనే సభ్యురాలు ఉన్నారని తెలిపారు. ఈ తోడ్పాటు, బృందస్ఫూర్తే తమ జట్టును నిర్వచిస్తుందన్నారు.
జెమీమా రోడ్రిగ్స్ అభిప్రాయంతో స్నేహ్ రాణా ఏకీభవించారు. విజయం సాధించిన క్షణాల్లో అందరూ కలసి ఎలా ఉన్నామో.. ఓడిపోయిన సందర్భంలోనూ ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవడం అవసరమన్నారు. ఒక జట్టుగా, ఒక యూనిట్‌గా ఏం జరిగినా ఒకరి చేయి ఒకరు విడవకూడదని, ఒకరికొకరు చేయూత అందించుకోవాలని తాము నిర్ణయించుకున్నామని తెలిపారు. ఇదే తమ జట్టులోని అత్యుత్తమ లక్షణమన్నారు.
అందరూ నవ్వుతూ ఉండేలా హర్మన్‌ప్రీత్ కౌర్ తమను ప్రోత్సహించారని క్రాంతి గౌడ్ తెలిపారు. ఎవరైనా కాస్త అధైర్యంగా ఉన్నప్పటికీ.. ఒకరినొకరు నవ్వుతూ చూడటం వల్ల జట్టులోని ప్రతి సభ్యురాలు ఉత్సాహంగా, విశ్వాసంగా ఉండేలా చేయడమే జట్టు విధానమన్నారు. బృందంలో ఎవరైనా అందరినీ నవ్విస్తూ ఉంటారా అని ప్రధాని ప్రశ్నించారు. జెమీమా రోడ్రిగ్స్ ఆ పని చేస్తారంటూ క్రాంతి బదులిచ్చారు. జట్టును సమష్టిగా ఉంచడంలో హర్లీన్ కౌర్ డియోల్ ముఖ్యమైన పాత్ర పోషించారని జెమీమా వెల్లడించారు.
ప్రతి జట్టులోనూ వాతావరణాన్ని తేలిక పరిచే వ్యక్తి ఉండాలని తాను భావిస్తానని హర్లీన్ కౌర్ డియోల్ తెలిపారు. ఎవరైనా ఒంటరిగా ఉన్నట్లు చూసినా లేదా తనకు ఖాళీ సమయం దొరికినా.. ఇతరులతో ముచ్చటించేందుకు తాను ప్రయత్నిస్తానన్నారు. తన చుట్టూ ఉన్న వారు ఆనందంగా ఉంటే తాను కూడా ఉత్సాహంగా ఉంటానని చెప్పారు.
తిరిగి వచ్చినప్పటి నుంచి జట్టు ఏమైనా చేసిందా అని ప్రధానమంత్రి అడిగారు. తాను చాలా గట్టిగా మాట్లాడుతున్నానని, మౌనంగా ఉండమని ఇతరులు చెప్పారని హర్లీన్ కౌర్ సరదాగా చెప్పారు. ప్రధానమంత్రి మెరిసిపోతున్నారంటూ.. రోజూ ఆయన అనుసరించే స్కిన్ కేర్ రొటీన్ గురించి చెప్పమని ఆమె అడిగారు. ఆ విషయం గురించి ఎప్పుడూ ఆలోచించలేదని ప్రధానమంత్రి సమాధానమిచ్చారు. కోట్లాది మంది భారతీయుల ప్రేమ ఆయనను మెరిసేలా చేస్తోందంటూ ఓ క్రీడాకారిణి చమత్కరించారు. దానికి ప్రధాన మంత్రి ఏకీభవిస్తూ, సమాజం చూపించే ఆత్మీయతే గొప్ప బలాన్ని ఇస్తుందన్నారు. తాను ప్రభుత్వాధినేతగా ఉండటంతో సహా ప్రభుత్వంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నానని, ఇంత సుదీర్ఘ కాలం అనంతరం తనకు ఇలాంటి ఆశీర్వాదాలు రావడం మంచి ప్రభావాన్ని చూపిస్తుందన్నారు.
జట్టులో అడిగే వివిధ ప్రశ్నలు, భిన్నమైన వ్యక్తిత్వాల గురించి కోచ్ వ్యాఖ్యానించారు. రెండేళ్లుగా జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉంటున్నానని ఆయన తెలిపారు. జూన్‌లో ఇంగ్లాండ్‌లో కింగ్ ఛార్లెస్‌ను కలిసినప్పడు తమకు ఎదురైన అనుభవం గురించి ఆయన వివరించారు. ప్రోటోకాల్ నిబంధనల కారణంగా కేవలం 20 మందికి మాత్రమే అనుమతించారని, దానివల్ల సహాయ సిబ్బంది హాజరు కాలేకపోయారని తెలిపారు.
అందరు క్రీడాకారులు, నిపుణులైన ముగ్గురు కోచ్‌లు హాజరయ్యారు. ప్రొటోకాల్ ప్రకారం 20 మందిని మాత్రమే అనుమతించటం వల్ల సహాయక సిబ్బంది హాజరుకాలేపోవటం బాధగా ఉందని కోచ్ అన్నారు. దీనిపై స్పందించిన సహాయక సిబ్బంది.. ఆ ఫొటోతో తమకు అవసరం లేదని, నవంబర్ 4, 5 తేదీల్లో ప్రధానమంత్రి మోదీతో ఒక ఫొటో దిగాలని ఉందని చెప్పినట్లు కోచ్ వివరించారు. ఈ రోజు వారి కోరిక నెరవేరిందన్నారు.
తమకు మాత్రమే ఎదురుదెబ్బలు తగులుతున్నాయని భావించిన క్షణాలున్నాయని, కానీ ఆ కష్టాలు తమని మానసికంగా, శారీరకంగా దృఢంగా మార్చాయని హర్మన్ ప్రీత్ కౌర్ తెలిపారు. ఈ విషయాన్ని పంచుకున్నప్పుడు ఎలాంటి భావోద్వేగానికి గురయ్యారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్మన్ ప్రీత్ ను అడిగిన సమయంలో, ఇది చాలా స్ఫూర్తిదాయకమని గుర్తించినట్లు చెప్పారు. ప్రధానమంత్రి ప్రశ్నకు ఆ క్రీడాకారిణి స్పందిస్తూ, ఏదో ఒకరోజు తాము తప్పకుండా ట్రోఫీని గెలుస్తామనే నమ్మకం ఉండేదని, మొదటినుంచి జట్టు సభ్యుల్లో ప్రత్యేక అనుభూతి ఉందని తెలిపారు. వారు ఎదుర్కొన్న సవాళ్లను, ప్రతికూల పరిస్థితుల్లో ప్రదర్శించిన ధైర్యం, ఇతరుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన తీరుని ప్రధానమంత్రి ప్రశంసించారు. తన ఆత్మ విశ్వాసాన్ని, ప్రతీ టోర్నమెంట్‌లో జట్టు సభ్యుల ఆటతీరు మెరుగవటాన్ని ప్రధానంగా ప్రస్తావించిన హర్మన్ ప్రీత్.. జట్టు సభ్యులందరికీ ఘనతను పంచారు. గతంలో జరిగిన వాటిని మార్చలేమని, వాటిని అంగీకరిస్తూ మానసికంగా దృఢంగా మారేందుకు రెండేళ్లుగా తాము కృషి చేసినట్లు వెల్లడించారు. దీనికి స్పందించిన ప్రధానమంత్రి.. ఈ ప్రయాణం వారికి వర్తమానంలో జీవించటం నేర్పిందన్నారు. ఈ కారణంగానే తన జట్టు సభ్యులను ప్రోత్సహించేందుకు అదనంగా ఏమి చేస్తారోనని ప్రధానమంత్రిని అడిగినట్లు చెప్పారు. తమ విశ్వాసాన్ని బలపరచుకోవటానికి ప్రధానమంత్రి, తమ కోచ్‌ల మార్గదర్శకాలు సరైన మార్గంలో నడిపించాయని ఆమె స్పష్టం చేశారు.
ప్రధాన మంత్రి దీప్తి శర్మతో మాట్లాడుతూ, పగటిపూట ఆమె పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ (డీఎస్పీ) పాత్ర గురించి అడిగారు. ఆమె అన్నింటినీ నియంత్రిస్తుండాలంటూ ప్రధానమంత్రి చమత్కరించారు. దీనికి ఆమె బదులిస్తూ, తాము కేవలం ఆ క్షణాలని ఆస్వాదిస్తూ, ఆయన్ని కలిసే సమయం కోసం వేచి చూశామని చెప్పారు. వైఫల్యం నుంచి నేర్చుకుని, ముందుకు సాగటం తెలుసుకున్న వారే నిజమైన క్రీడాకారులని 2017లో ప్రధానమంత్రి చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. మోదీ మాటలు ఎల్లప్పుడూ స్ఫూర్తిని కలిగించాయని, క్రమం తప్పకుండా ఆయన ప్రసంగాలు వింటానని తెలిపారు. ఎన్నో సవాళ్లున్నప్పటికీ ఆయన.. శాంతంగా, నిలకడగా పరిస్థితులు ఎదుర్కొనే విధానం ఆటలోనూ, వ్యక్తిగతంగా ఎంతగానో సహకరిస్తుందని స్పష్టం చేశారు.
దీప్తి శర్మ చేతిపై ఉన్న హనుమాన్ టాటూ గురించి, అది ఆమెకు ఎలా సహయపడుతుందని శ్రీ మోదీ అడిగారు. దానికి ఆమె బదులిస్తూ.. తన మీద కంటే, హనుమాన్ జీ పైనే నమ్మకం ఎక్కువని, ఆయన పేరు తలచుకుంటే కష్టాలను అధిగమించే బలం వస్తుందని చెప్పారు. ఆమె ఇన్ స్టాగ్రామ్ ఖాతాలోనూ "జై శ్రీరామ్" అని రాస్తారని ప్రధానమంత్రి ప్రస్తావించగా, అవునని తెలిపారు. జీవితంలో విశ్వాసమనేది కీలక పాత్ర పోషిస్తుందని ఉన్నతమైన శక్తికి మనల్ని అప్పగించుకునే ధైర్యాన్నిస్తుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. మైదానంలో ఆమె చూపే ఆత్మవిశ్వాసం, ఆధిపత్య ధోరణి గురించి ప్రశ్నించారు. ఆధిపత్యం కాదు కానీ, తను బంతి విసిరే వేగం విషయంలో భయం ఉందనేది మాత్రం నిజమని, అందుకే 'కొంచెం నెమ్మదిగా వేయమ్మా' అంటూ తోటి క్రీడాకారులు సరదాగా అంటారని ఆమె తెలిపారు. తన టాటూ, ఇన్ స్టాగ్రామ్ ట్యాగ్ లైన్ గురించి ప్రధానమంత్రి వ్యక్తిగతంగా అడగటం పట్ల దీప్తి సంతోషం వ్యక్తం చేశారు.
టోర్నీ విజయం తర్వాత హర్మన్ ప్రీత్ జేబులో బంతి దాచుకోవటం గురించి ప్రధానమంత్రి అడిగారు. అది ప్రణాళికలో భాగమా లేదా ఎవరైనా మార్గనిర్దేశం చేశారా అని ప్రశ్నించారు. అందుకు హర్మన్ ప్రీత్ బదులిస్తూ.. అది ఒక దైవ నిర్ణయం, చివరి బాల్, క్యాచ్ తన వద్దకు వస్తాయని అసలు ఊహించలేదని.. అయితే బాల్ తన వద్దకు వచ్చినప్పుడు, అది ఏళ్ల నాటి కృషి, నిరీక్షణల ఫలితమనిపించిందని, అందుకే దాన్ని దాచుకోవాలనుకున్నట్లు వివరించారు. ఇప్పటికీ ఆ బంతి తన బ్యాగులో ఉందని చెప్పారు.
రెజ్లర్లకు ప్రసిద్ధి పొందిన ప్రాంతం రోహ్‌తక్ నుంచి వచ్చిన షెఫాలీ వర్మతో ప్రధానమంత్రి మాట్లాడుతూ.. క్రికెట్ వైపు ఎలా వచ్చారని అడిగారు. రెజ్లింగ్, కబడ్డీ రోహ్‌తక్‌లో ప్రధాన క్రీడలైనప్పటికీ, క్రికెట్ ప్రయాణంలో తన తండ్రి కీలక పాత్ర పోషించారని షెఫాలీ బదులిచ్చారు. సాంప్రదాయ అఖాడా క్రీడలు ఆడారా అని ప్రధానమంత్రి ప్రశ్నించగా, ఆడలేదని ఆమె చెప్పారు. క్రికెటర్ కావాలని తన తండ్రి ఆశించినా, ఆ కలను నెరవేర్చుకోలేకపోయారని, ఆయన కోరిక పిల్లల ఆశయంగా మారిందని చెప్పారు. షెఫాలీ, తన సోదరుడు కలిసి మ్యాచ్‌లు చూసేవారని, అలా క్రికెట్‌పై ఆసక్తి పెరిగి, క్రికెటర్‌గా మారినట్లు తెలిపారు.
క్యాచ్ పట్టటానికి ముందు హర్మన్ ప్రీత్ నవ్వటాన్ని తాను చూశానని, దానికి గల కారణమేంటని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అడిగారు. దానికి ఆమె బదులిస్తూ.. ఆ బంతి తన వద్దకే రావాలని మానసికంగా సంకల్పించుకున్నట్లు, బాల్ తన వద్దకి వచ్చినప్పుడు తెలియకుండానే నవ్వు ఆపుకోలేకపోయినట్లు చెప్పారు. ఆ బంతి మరెక్కడికీ వెళ్లదని ఆమె చాలా నమ్మకంగా ఉన్నట్లనిపించిందని ప్రధానమంత్రి అన్నారు. ఒకవేళ బంతి వేరే చోటుకి వెళ్లినా, ఎలాగైనా పట్టుకునేదాన్ని అని హర్మన్ ప్రీత్ తెలిపారు.
జెమీమా రోడ్రిగ్స్ భావోద్వేగాన్ని వివరించమని అడిగినప్పుడు.. తమ జట్టు తరచుగా ఆస్ట్రేలియా చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయేదన్నారు. సెమీ-ఫైనల్స్ మ్యాచ్ గెలవటం, చివరి వరకు ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఆటను మలుపు తిప్పటానికి మంచి భాగస్వామ్యం అవసరమని, టీమ్ సభ్యులందరూ అదే నమ్మకంతో ఒక్కటిగా కృషి చేసినట్లు తెలిపారు. తాను సెంచరీ కొట్టినా, ఈ గెలుపునకు హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి, రిచా, అమన్ జోత్ సహకారం ప్రధాన కారణమన్నారు. వారి అత్యుత్తమ ఇన్నింగ్స్ వల్లనే ఈ విజయం సాధ్యమైందని చెప్పారు. గెలవగలమని అందరూ నమ్మారు - గెలిచామని ఆమె స్పష్టం చేశారు.
ప్రపంచ కప్ గెలిచిన అనుభవం ఎలా ఉంది? మూడు మ్యాచ్‌లు ఓడిపోయిన తర్వాత ఎలా అనిపించింది? తిరిగి ఎలా పుంజుకున్నారనే విషయాలు తెలుసుకునేందుకు ప్రధానమంత్రి ఆసక్తి చూపారని జెమీమా తెలిపారు.
ప్రపంచ కప్ గెలవటం తనకు వ్యక్తిగతంగానే కాక, తన గ్రామంలోని ప్రజలకు కూడా ఎంతో గర్వకారణమని క్రాంతి గౌడ్ తెలిపారు. బౌలింగ్ చేసినప్పుడల్లా, మొదటి వికెట్ తీసేది క్రాంతి అని హర్మన్ ప్రీత్ చెప్పేదని, అలా అన్నప్పుడు తాను మెరుగైన బౌలింగ్ చేసేందుకు మరింత ఉత్సాహంగా ఉండేదని తెలిపారు. క్రాంతి పెద్దన్నయ్యకు క్రికెట్‌పై ఉన్న ప్రేమ, ప్రధానమంత్రిపై ఉన్న అభిమానం గురించి మాట్లాడారు. వాళ్ల నాన్న ఉద్యోగం కోల్పోవటం వల్ల, తన అన్నయ్య అకాడమీలో చేరలేకపోయాడని, అనధికారికంగా ఆటను మాత్రం కొనసాగించినట్లు చెప్పారు. అన్నయ్య నుంచి ప్రేరణ పొందిన క్రాంతి.. టెన్నిస్ బాల్స్‌తో అబ్బాయిలతో ఆడటం ప్రారంభించినట్లు తెలిపారు. అధికారికంగా ఆమె క్రికెట్ ప్రయాణం ఒక స్థానిక లెదర్ బాల్ టోర్నమెంట్- ది ఎమ్మెల్యే ట్రోఫీతో ప్రారంభమైనట్లు వెల్లడించారు. అందులో ఓ క్రీడాకారిణికి అనారోగ్యం కారణంగా ఆమె స్థానంలో ఆడమని క్రాంతిని అడిగినట్లు చెప్పారు. ఆమెకి పొడవైన జుట్టు ఉన్నప్పటికీ, ఆడేందుకు ఆహ్వానం లభించిందన్నారు. తన మొదటి మ్యాచ్‌లోనే రెండు వికెట్లు తీసి, 25 పరుగులు చేసి, 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును గెలుచుకున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి ఆమె క్రికెట్ కెరీర్ మొదలైందన్నారు.
షెఫాలీ వర్మకు చివరి రెండు ఆటల్లో పాలుపంచుకునే అవకాశం దక్కిందని ప్రధానమంత్రి శ్రీ  మోదీ అన్నారు. అవునని షెఫాలీ చెప్తూ, తనకు పిలుపు వచ్చే ముందు దేశవాళీ క్రికెట్ ఆడానన్నారు. ప్రతీక విషయంలో జరిగిన ఘటన దురదృష్టకరమైందనీ, మరే క్రీడాకారిణి విషయంలోనూ ఇలా జరగకూడదనే అంతా కోరుకుంటారనీ షెఫాలీ అన్నారు. ఏమైనా, తనను పిలిచినప్పుడు, తాను ఆత్మవిశ్వాసాన్ని చాటడంతో జట్టు సభ్యులంతా తనను నమ్మారని ఆమె అన్నారు. తనతో ఏ అవసరం పడినా జట్టు గెలుపునకు సాయపడాలనే తాను సంకల్పించుకున్నట్లు ఆమె చెప్పారు.      
ప్రతీకా రావల్ మాట్లాడుతూ, తాను గాయపడిన తరువాత జట్టు సభ్యుల్లో అనేక మంది ప్రతీక కోసం ప్రపంచ కప్ గెలవాలని ఉందని తమ మనోభీష్టాన్ని వెల్లడించారన్నారు. తాను అధికారికంగా జట్టులో లేననీ, 16వ క్రీడాకారిణిననీ అయినప్పటికీ చక్రాల కుర్చీలో తనను స్టేజీ పైకి రప్పించి తన పట్ల పూర్తి గౌరవాదరణలను వ్యక్తం చేశారనీ ప్రతీక తెలిపారు. జట్టు ఒక కుటుంబమని, జట్టులో ప్రతి క్రీడాకారిణినీ సమానంగా చూశారని, అలా అందరూ కలిసికట్టుగా ఆడారంటే వారిని ఓడించడం చాలా కష్టమని  ఆమె చెప్పారు. ఫైనల్లో గెలుపునకు జట్టు పూర్తిగా అర్హమైందేనని ఆమె స్పష్టం చేశారు. ఈ మాటలతో ప్రధానమంత్రి ఏకీభవిస్తూ, జట్టు భావన కీలకం.. ఒక్క ఆట మైదానంలోనే కాదు, ఆట మైదానం బయట కూడానని స్పష్టం చేశారు. కలిసి ఉంటే బంధం బలపడుతుందని, అందరి బలాలూ బలహీనతలూ తెలియడం వల్ల లోటుపాట్లను భర్తీ చేసుకుంటూ ఒకరికి  మరొకరు అండదండలను అందించుకోవచ్చని ఆయన అన్నారు.    

ఒక క్యాచ్ చాలా ప్రసిద్ధిని పొందిందని శ్రీ మోదీ అన్నారు. అమన్‌జోత్ కౌర్ మాట్లాడుతూ, ఇంతకు ముందు వరకూ అనేక సార్లు తాను చక్కటి క్యాచ్‌లను అందుకున్నప్పటికీ, వాటిలో వేటికీ ఇంతటి పేరు ప్రఖ్యాతులు దక్కలేదనీ, తాను మొదట తడబడ్డా చివరకు బంతిని చేజిక్కించుకున్నందుకు సంతోషం కలిగిందనీ తెలిపారు. ఆ క్యాచే కీలకమైన మలుపుగా మారింది అని ప్రధానమంత్రి చెప్తూ, ఆ క్యాచ్‌ పట్టుకున్న తర్వాత ట్రోఫీ కళ్ల ముందే కదలాడుతున్నట్లు తోచి ఉండి ఉండవచ్చు కదూ అన్నారు. అమన్‌జోత్ జవాబిస్తూ, నిజానికి ఆ క్యాచ్ తీసుకున్నాక ట్రోఫీనే అందుకున్నట్టుగా తనకు అనిపించిందనీ, ఆ సంబరంలో చాలా మంది తనను చుట్టుముట్టి హత్తుకోవడంతో తాను ఉబ్బితబ్బిబ్బు అయిపోయానన్నారు.
ఇదివరకు ఇలాంటి ఓ క్యాచ్‌నే సూర్యకుమార్ యాదవ్ కూడా ఒడిసిపట్టుకున్నారని ప్రధానమంత్రి ప్రస్తావించారు. క్రీడాకారుల్లో ఒకరి క్యాచ్ తనకు భలేగా అనిపించడంతో, ఆ సన్నివేశాన్ని రీట్వీట్ చేసిన సంగతిని ఆయన గుర్తు చేశారు.
ఇంగ్లండ్‌లో జరిగిన ఒక విషయం గురించి హర్‌లీన్ కౌర్ దేవల్ చెబుతూ, అక్కడ అలాంటి క్యాచుల్ని చాలా కాలం  తాము ప్రాక్టీస్ చేసినట్లు ఆమె చెప్పారు. ఫీల్డింగ్‌లో ఒక క్యాచును పట్టుకోలేకపోతే హర్‌మన్‌ప్రీత్ కౌర్ తనను చీవాట్లు పెట్టారనీ, మంచి ఫీల్డర్లు అలాంటి క్యాచుల్నివదలివేయకూడదని తనతో అన్నారనీ హర్లీన్ తెలిపారు. అప్పుడు పక్కనే నిలుచున్న జెమీమా పర్వాలేదు, నువ్వు ఆ క్యాచ్ పట్టుకునే అవకాశం ఉందని   భరోసా ఇచ్చారన్నారు. తరువాతి రెండు ఓవర్లలో మంచి క్యాచ్ పడతా అని తాను వాగ్దానం చేసిన కొద్ది సేపటికే బంతి తన దాకా వచ్చినప్పుడు ఇచ్చిన మాటను తాను నిలబెట్టుకున్నట్లు దేవల్ చెప్పారు. అప్పుడు శ్రీ మోదీ, అయితే సవాలు చేయడం కలిసొచ్చిందన్నమాట ఛలోక్తిగా అన్నారు.      
రిచా ఘోష్ ఎక్కడ ఆడినా గెలుస్తూనే ఉంటారనిపిస్తుంది అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. దీనికి ఆమె జవాబిస్తూ, అది తనకు కచ్చితంగా తెలియని, కానీ ఆమె అండర్-19, సీనియర్-లెవెల్, డబ్ల్యూపీఎల్ టోర్నమెంట్లలో ట్రోఫీలను గెలించానని చెప్పారు. తాను బ్యాటింగ్ చేసేటప్పుడు, ముఖ్యంగా సిక్సులు కొడుతున్న సమయంలో, హర్‌మన్‌ప్రీత్ కౌర్, స్మృతీ మందాన వంటి జట్టు సభ్యులు తనకు కొండంత మద్దతునిచ్చినట్లుగా తాను భావించానని రిచా తెలిపారు. ఒత్తిడి ఎక్కువగా ఉన్న సందర్బాల్లోను... చేయాల్సిన పరుగులు ఎక్కువగా, బంతులు తక్కువగా ఉన్న స్థితుల్లో.. తాను సాధించి తీరతానని జట్టు నమ్మిందని ఆమె చెప్పారు. ఆ  నమ్మకమే తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందనీ, ప్రతి మ్యాచ్‌లో తాను ఆట ఆడిన తీరులో అది ప్రతిబింబించిందనీ రిచా అన్నారు.
మరో క్రీడాకారిణి రాధా యాదవ్ మాట్లాడుతూ, మూడు మ్యాచులను ఓడిపోయినప్పటికీ ఓటమిలో కూడా తామంతా ఐకమత్యంగా ఉండడం ఎంతో బాగా అనిపించిన విషయమన్నారు. ప్రతి ఒక్కరూ ఇతర ప్లేయర్లకు వెన్నంటి నిలబడ్డారని, మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో మద్దతిచ్చారని వివరించారు. ఈ ఉమ్మడి స్ఫూర్తే తమకు ట్రోఫీని ప్రసాదించిందని తాను నమ్ముతున్నానని ఆమె అన్నారు. అప్పుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పందిస్తూ, కష్టపడి ఆడటమే విజయాన్ని సంపాదించి పెట్టిందని అన్నారు. ఆ విధంగా ఆడటానికి మీరు ఎలాంటి సన్నాహాలు చేసుకున్నారో చెప్పండని ఆయన అడిగారు. జట్టు జట్టంతా ఎంతో కాలం నుంచీ నాణ్యమైన ఆటనే ఆడుతూ వచ్చిందనీ, ఎలాంటి స్థితినైనా  ఎదుర్కోవడానికి.. అది ఫిట్‌నెస్ కావచ్చు, ఫీల్డింగ్ కావచ్చు, లేదా నైపుణ్యాలు కావచ్చు.. జట్టు అలవాటు పడిందనీ రాధ బదులిచ్చారు. అందరూ కలిసి ఉండటంతో విషయాలను గ్రహించగలగడం సులువైందని, ఒక్కరుగా ఉంటూ ప్రయత్నిస్తే అది కష్టంగా తోచేదని ఆమె అన్నారు. ప్రధాన మంత్రి స్పందిస్తూ, ఆమె తన మొదటి బహుమతి సొమ్మును తండ్రికి సాయపడటానికి ఖర్చుపెట్టిన సంగతి తనకు తెలిసిందని  ప్రస్తావించారు. అది నిజమని రాధ చెబుతూ, తన కుటుంబం సవాళ్లను ఎదుర్కొందనీ, అయితే తన తల్లితండ్రులు ఆ కష్టాల ప్రభావం తనపై ఎన్నటికీ పడనివ్వ లేదని ఆమె వెల్లడించారు.
స్నేహ్ రాణా మాట్లాడుతూ తాను ఏళ్ల తరబడి శ్రమించి, ఆటలో పలు రకాల వ్యూహాల్ని బౌలింగ్ కోచ్‌ ఆవిష్కార్ సాల్వీతో చర్చించేదాన్నని వివరించారు. ఆ వ్యూహాల గురించి కెప్టెన్, వైస్-కెప్టెన్, ప్రధాన కోచ్‌లకు చెప్పి సమన్వయం చేసుకొని, మైదానంలో అమలుపరిచే వాళ్లమన్నారు. ప్రతి మ్యాచ్ అనుకున్నట్లు సాగేది కాదనీ, అయినప్పటికీ తరువాతి మ్యాచ్‌లో మెరుగులు దిద్దుకోవడానికి తాము స్ఫూర్తిని పొందేవాళ్లమనీ స్నేహ్ రాణా చెప్పారు.
ప్రధానమంత్రి సమక్షంలో మాట్లాడాలనే సరికి ఎంతో ఉద్వేగానికి గురయినట్టు ఉమా ఛెత్రీ అన్నారు. అప్పుడు ప్రధానమంత్రి మీకు ఏమి మాట్లాడాలని అనిపిస్తే, అదే మాట్లాడ వచ్చు.. అంటూ ఆమెను ప్రోత్సహించారు. దాంతో, ఆమె తన మొదటి మ్యాచ్‌ను ప్రపంచ కప్ పోటీల్లో ఆడాననీ, అంతవరకూ తాను ఆడిన ప్రతి సారీ లాగానే ఆ రోజు కూడా వర్షం పడిందనీ ఉమ వెల్లడించారు. తాను కేవలం వికెట్‌ కీపింగే చేసినా, ప్రపంచ కప్ మ్యాచ్‌లో భారత్ పక్షాన మొదటిసారిగా ఆడడం ఎంతో గొప్పగా అనిపించిందని వివరించారు. దేశం తరఫున ఆడుతున్నందుకు తాను ఎంతో ఉత్తేజితమైనట్టు చెబుతూ, భారత్ గెలుపునకు తన వంతుగా అత్యుత్తమ ప్రదర్శనను కనబరచాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.  యావత్తు జట్టు తనను నమ్మి అడుగడుగునా మార్గదర్శకత్వాన్నందిస్తూ తనను ఉత్సాహపరిచినందుకు తన మనసు కృత‌జ్ఞత‌తో నిండిపోయిందని ఆమె తెలిపారు. ఈశాన్య భారతం నుంచి ఇండియా పక్షాన ఆడుతున్న మొదటి అమ్మాయి ఉమ అని కోచ్ తెలపగా, ప్రధానమంత్రి శ్రీ  నరేంద్ర మోదీ ‘అవును. ఆమె అస్సాం ప్రతినిధి’ అన్నారు.    
రేణుకా సింగ్ ఠాకుర్‌తో ప్రధానమంత్రి మాట్లాడుతూ, వచ్చే వేళ నెమళ్లనేమైనా చూశారా అని అడిగారు. మరో నెమలిని నేను చూశాను అని రేణుక జవాబిస్తూ, ఒక్క నెమలి బొమ్మను మాత్రమే తాను గీయగలిగాననీ, ఆ చిత్రపటాన్ని తన వద్దే అట్టిపెట్టుకున్నానన్నారు. వేరే ఏదీ తాను గీయలేకపోయాననీ, ఏ పక్షి చిత్రాన్నయినా గీయాలని ప్రయత్నిస్తే నిరాశే మిగులుతుందని కూడా ఆమె చెప్పారు. ఆమె తల్లిగారంటే తనకు అమిత గౌరవం ఉందని ప్రధానమంత్రి తెలియజేశారు. రేణుకను పెంచి పెద్ద చేయడానికి వాళ్ల అమ్మగారు ఒక్కరే తల్లీ తండ్రీ తానే అయ్యి ఎంతో చేశారనీ, కఠిన జీవనాన్ని అధిగమించి వృద్ధిలోకి రావడానికి తోడ్పడ్డారని అన్నారు. రేణుక మాతృమూర్తికి తన శుభాకాంక్షల్ని అందజేయాల్సిందిగా ప్రధాని ఆమెను కోరారు.
ప్రధానమంత్రితో అరుంధతీ రెడ్డి మాట్లాడుతూ, తన తల్లిగారు ప్రధానమంత్రికి ఒక సందేశాన్ని పంపించారన్నారు. ఆ సందేశంలో ఆమె, ప్రధానమంత్రిని తన హీరోగా పేర్కొన్నారని అరుంధతి తెలిపారు. తన తల్లిగారు తనకు నాలుగైదు సార్లు ఫోన్ చేసి, తన హీరోని ఎప్పుడు కలుసుకుంటావని అడిగారని అరుంధతి చెప్పారు.
మైదానంలో క్రీడాకారిణులు విజయాన్ని సాధించిన తరువాత  దేశం వారిపై ఏమేం ఆశలు పెట్టుకుందో మీకు తెలుసా అని ప్రధానమంత్రి అడిగారు. స్మృతి జవాబిస్తూ, ప్రపంచ కప్‌ పోటీల కోసం వారు సన్నద్ధమవుతున్నప్పుడల్లా, ఆ కప్‌ను గెల్చుకొంటే అది ఒక్క మహిళా క్రికెట్ పైనే కాక భారత్‌లోని మహిళా క్రీడలన్నింటా చాలా గొప్ప ప్రభావాన్ని కలగజేస్తుందని తాము నమ్ముతూవచ్చామన్నారు. అది ఒక విప్లవాన్ని తీసుకువస్తుందనీ, అలాంటి మార్పును తీసుకువచ్చే సత్తా జట్టులో ఉందనీ ఆమె చెప్పారు.
వారు సాధించిన విజయం వారిలో గొప్ప స్ఫూర్తిని రగిలిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. వారు ఇళ్లకు తిరిగి వెళ్లాక, వారు చదువుకున్న పాఠశాలను సందర్శించాలనీ, ఒక రోజంతా విద్యార్థుల మధ్య ఉండాలనీ ఆయన సూచించారు. బాలలు ఎన్నో ప్రశ్నలు వేస్తారు, మిమ్మల్ని జీవన పర్యంతం గుర్తు పెట్టుకుంటారు, ఈ అనుభూతి క్రీడాకారులకూ స్ఫూర్తిని అందిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. మూడు స్కూళ్లను ఎంపిక చేసుకొని, ఏటా ఒక స్కూలుకు వెళ్లాలని, ఇది క్రీడాకారులతో పాటు విద్యార్థులకు కూడా స్ఫూర్తినిస్తుందని శ్రీ మోదీ అన్నారు.
ఫిట్ ఇండియా ఉద్యమానికి, మరీ ముఖ్యంగా స్థూల కాయం సమస్యను పరిష్కరించడానికి తోడ్పాటును అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.  నూనె వాడకాన్ని.. కొనుగోలు చేసేటప్పుడే.. 10 శాతం మేరకు తగ్గించుకోవాలంటూ ఆయన సలహానిచ్చారు. క్రీడాకారులు ఇలాంటి సందేశాలిస్తే, ఆ సందేశాలు చాలా ప్రభావాన్ని కలగజేస్తాయని ఆయన అన్నారు. ఫిట్ ఇండియాకు మద్దతివ్వాలనీ, ప్రత్యేకించి కుమార్తెలను దృష్టిలో పెట్టుకొని ఈ విషయంలో చురుకుగా తోడ్పాటును అందించాలనీ క్రీడాకారిణులను ప్రధానమంత్రి ప్రోత్సహించారు.
క్రీడాకారిణులతో మాట్లాడే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని శ్రీ మోదీ అన్నారు. కొంతమంది క్రీడాకారిణులతో ఇది వరకు కూడా తాను భేటీ అయ్యాననీ, చాలా మంది క్రీడాకారిణులు మొదటిసారి తనతో భేటీ అవుతున్నారనీ ఆయన గుర్తు చేసుకున్నారు. వారితో సమావేశం కావడానికి తాను ఎప్పుడూ ఉత్సుకతతో ఉంటాననీ, వారు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలని తాను కోరుకుంటున్నాననీ ప్రధానమంత్రి అన్నారు.
ప్రధానమంత్రి చెప్పిన మాటలను తాము తప్పక గుర్తుపెట్టుకుంటామనీ, అవకాశం లభించినప్పుడల్లా ఈ  సందేశాన్ని ఇతరులకు అందజేస్తామనీ స్మృతి మందాన అన్నారు. ఇలాంటి సందేశాలకు ఆచరణరూపాన్ని ఇవ్వడానికి జట్టు సభ్యులందరూ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారనీ, తమను పిలిపించిన ప్రతి సారీ తరలి వస్తామనీ ఆమె అన్నారు.
మనమందరమూ  కలిసి, దేశాన్ని తప్పక ప్రగతిపథంలోకి తీసుకుపోదామని ప్రధానమంత్రి చెప్తూ అందరికీ తన శుభాకాంక్షలు తెలియజేశారు.

 

***


(Release ID: 2187108) Visitor Counter : 4