సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఐఎఫ్‌ఎఫ్‌ఐ గోవాలో నవంబర్ 20-24 వరకు జరిగే వేవ్స్ బజార్‌లో పాల్గొనేందుకు అంకుర సంస్థలకు యాక్సిలరేటర్ వేవ్ఎక్స్ 2025 ఆహ్వానం
ఐఎఫ్‌ఎఫ్‌ఐ గోవా 2025లో వేవ్‌ఎక్స్ ఆధ్వర్యంలో వేవ్స్ బజార్ కోసం బూత్ బుకింగ్‌లు ప్రారంభం
ఏవీజీసీ-ఎక్స్ఆర్, మీడియా టెక్ రంగాల్లో ఎదుగుతున్న అంకుర సంస్థలు వేవ్‌ఎక్స్ బూత్‌ల ద్వారా ఆవిష్కరణలు, ఉత్పత్తులు, సాంకేతికతల ప్రదర్శన. ఈ బూత్‌ల ద్వారా స్టార్టప్‌లకు ప్రపంచస్థాయి గుర్తింపు, నెట్‌వర్కింగ్ అవకాశాలు
Posted On:
06 NOV 2025 12:32PM by PIB Hyderabad
గోవాలోని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) 2025లో వేవ్స్ బజార్లోని ప్రత్యేకమైన అంకుర సంస్థల ప్రదర్శన వేదిక వేవ్ఎక్స్ బూత్‌ల కోసం బుకింగ్లను ప్రారంభించినట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఏవీజీసీ-ఎక్స్ఆర్ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీ) వినోద రంగాల్లో అభివృద్ధి చెందుతున్న అంకుర సంస్థలకు అంతర్జాతీయ వేదికను కల్పించడం ఈ కార్యక్రమ లక్ష్యం. దీని వల్ల స్టార్టప్‌లకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిశ్రమ నాయకులు, పెట్టుబడిదారులు, ప్రొడక్షన్ స్టూడియోలతో పరిచయం ఏర్పడి సహకారం పొందే అవకాశం లభిస్తుంది.
2025 నవంబర్ 20 నుంచి 24 వరకు జరగనున్న వేవ్స్ బజార్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్రనిర్మాతలు, నిర్మాతలు, మీడియా నిపుణులు చురుకుగా పాల్గొనేందుకు ప్రసిద్ధి చెందిన ఐఎఫ్‌ఎఫ్‌ఐ ప్రధాన నెట్వర్కింగ్ కేంద్రం అయిన ఫిల్మ్ బజార్ సమీపంలో ఉంటుంది.
ప్రతి బూత్ స్టాల్‌కు రూ. 30,000 నామమాత్రపు ధర అందుబాటులో ఉంటుంది. పాల్గొనే స్టార్టప్‌లకు ఈ క్రింది సౌకర్యాలు లభిస్తాయి:
· 2 ప్రతినిధుల పాస్‌లు
· భోజనం,హై టీ
· సాయంత్రం నెట్‌వర్కింగ్ అవకాశాలు
· ప్రపంచ స్థాయి ఫిల్మ్, మీడియా & టెక్ నిపుణుల మధ్య ప్రత్యక్ష ప్రదర్శన
ఆసక్తిగల స్టార్టప్‌లు wavex.wavesbazaar.comలో నమోదు చేసుకోవచ్చు. సందేహాల కోసం wavex-mib[at]gov[dot]inను సంప్రదించాలి. పరిమిత స్టాళ్లు అందుబాటులో ఉన్న నేపథ్యంలో మొదట వచ్చిన వారికి అవకాశం లభిస్తుంది.
ఐఎఫ్‌ఎఫ్‌ఐ గోవా గురించి..
భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌ఐ)ను 1952లో స్థాపించారు. ఇది ఆసియా ఖండంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చలన చిత్రోత్సవాలలో ఒకటి. ప్రపంచ సినిమాలోని నాణ్యతకు వేదిక. దర్శకులు, కళాకారులు, సినిమా ప్రేమికులందరినీ ఒకే వేదికపై కలుసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం గోవాలోని పణజిలో నిర్వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చలనచిత్ర భాగస్వాములు ఇందులో పాల్గొంటారు. ఇది సృజనాత్మక సహకారం, అవకాశాలకు వేదికగా నిలుస్తుంది. ఐఎఫ్‌ఎఫ్‌ఐ 56వ ఎడిషన్ నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలోని పణజిలో జరగనుంది.
వేవ్ఎక్స్ గురించి..
వేవ్ఎక్స్ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించిన జాతీయ స్థాయి అంకుర సంస్థల అభివృద్ధి, మద్దుతునిచ్చే కార్యక్రమం. ఇది ఏవీజీసీ-ఎక్స్ఆర్, మీడియా-టెక్ రంగాల్లో ఆవిష్కరణలు, పారిశ్రామిక వ్యవస్థాపకతకు ప్రోత్సాహం ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రముఖ విద్యా సంస్థలు, పరిశ్రమలు, ఇంక్యుబేషన్ నెట్‌వర్క్‌లతో కలసి పనిచేసే వేవ్ఎక్స్, సృజనాత్మకులు, అంకుర సంస్థలు వాటి ఆలోచనలను విస్తరించేందుకు, వ్యాపారాలను పెంపొందించేందుకు సహకరిస్తుంది. దేశంలో పెరుగుతున్న సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు దోహదం చేస్తుంది.
***
(Release ID: 2186997)
Visitor Counter : 4
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam