రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మొంథా తుఫాను నేపథ్యంలో రైల్వేల సంసిద్ధతపై కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ సమీక్ష


· విపత్తు ప్రతిస్పందన బృందాల మధ్య నిరంతర సంప్రదింపులు.. సకాలంలో సిబ్బంది మోహరింపుపై నిశితంగా దృష్టి సారించాలని అధికారులకు ఆదేశం

· తుఫాను ఉధృతి తగ్గిన అనంతరం రైలు సేవల సత్వర పునరుద్ధరణ దిశగా అన్ని రైల్వే జోన్లు అప్రమత్తంగా ఉండాలని స్పష్టీకరణ

· తుఫాను పరిస్థితులపై ప్రత్యక్ష ప్రతిస్పందన దిశగా ‘డివిజనల్ వార్ రూమ్‌’లను అప్రమత్తం చేసిన భారతీయ రైల్వేలు

· విజయవాడ.. విశాఖపట్నం.. గుంటూరు డివిజన్లలో అత్యవసర సామగ్రితో పాటు యంత్రాలు.. సిబ్బందిని సిద్ధంగా ఉంచిన రైల్వే అధికారులు

· ప్రయాణికుల భద్రత.. సౌకర్యాలపై భరోసా దిశగా కార్యకలాపాలపై రైల్వేల సునిశిత పర్యవేక్షణ

· “ఈసీఓఆర్‌, ఎస్‌సీఓఆర్‌, ఎస్‌సీఆర్‌” జోన్ల పరిధిలో అత్యవసర స్థితి సంసిద్ధత.. భద్రత చర్యల నిమిత్తం వనరులు సిద్ధం

Posted On: 28 OCT 2025 4:09PM by PIB Hyderabad

మొంథా తుఫాను నేపథ్యంలో రైల్వేల సంసిద్ధతపై కేంద్ర రైల్వే, సమాచార-ప్రసార, ఎలక్ట్రానిక్స్-సమాచార సాంకేతికత శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈ రోజు సమీక్షించారు. ఈ సమావేశంలో భాగంగా వీడియో మాధ్యమం ద్వారా తూర్పు తీరం వెంబడి రైల్వే నెట్‌వర్క్ సంసిద్ధతపై ఆయన నిశితంగా దృష్టి సారించారు.

ఈ మేరకు ప్రయాణికుల భద్రత, రైళ్ల రాకపోకల నియంత్రణ, పునరుద్ధరణ ప్రణాళిక, స్థానిక పాలన సంస్థలతోపాటు విపత్తు నిర్వహణ సంస్థలతో సమన్వయం తదితరాల దిశగా చేపట్టిన చర్యల గురించి లోతుగా వాకబు చేశారు. తుఫాను ప్రభావంపై ముందస్తు అంచనాలతో అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిందిగా రైల్వే అధికారులను ఆయన ఆదేశించారు. ముఖ్యంగా తూర్పు తీరంలోని ఆంద్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలతోపాటు తెలంగాణ పరిధిలో అత్యంత అప్రమత్తత అవసరమని స్పష్టం చేశారు.

విపత్తు ప్రతిస్పందన బృందాల మధ్య నిరంతర సంప్రదింపులు, సకాలంలో సిబ్బంది మోహరింపుపై అత్యంత శ్రద్ధ వహించాలని, దీంతోపాటు తుఫాను ఉధృతి తగ్గిన అనంతరం రైలు సేవల సత్వర పునరుద్ధరణ దిశగా అన్ని రైల్వే జోన్లు సదా అప్రమత్తంగా ఉండాలని మంత్రి స్పష్టీకరించారు.

మొంథా తుఫాను తీవ్రత దృష్ట్యా ప్రత్యక్ష ప్రతిస్పందన, సమన్వయం దిశగా భారతీయ రైల్వేలు ‘డివిజనల్ వార్ రూమ్’లను సంసిద్ధం చేశాయి. తదనుగుణంగా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు డివిజన్లలో అత్యవసర సామగ్రితో పాటు యంత్రాలను, సిబ్బందిని సిద్ధంగా ఉంచాయి.

ప్రయాణికులకు అసౌకర్యం నివారణలో భాగంగా రైళ్ల రాకపోకలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. ఈ మేరకు తూర్పుతీర రైల్వే (ఈసీఓఆర్), దక్షిణ తీర రైల్వే (ఎస్‌సీఓఆర్‌)తోపాటు దక్షిణమధ్య రైల్వే (ఎస్‌సీఆర్) జోన్ల పరిధిలో అత్యవసర స్థితి సంసిద్ధత, భద్రత చర్యల నిమిత్తం అవసరమైన వనరులన్నిటినీ సమీకరించి, సిద్ధంగా ఉంచాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.

ముఖ్యంగా వాల్తేర్‌, ఖుర్దా రోడ్ డివిజన్ల పరిధిలో ముప్పు బారినపడే విభాగాలలో ఇప్పటికే చేపట్టిన ముందు జాగ్రత్త చర్యల గురించి తూర్పు తీర రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ పరమేశ్వర్ ఫంక్వాల్ సహా  ప్రధాన విభాగాధిపతులు, డివిజనల్ రైల్వే మేనేజర్లు కేంద్ర మంత్రికి విశదీకరించారు.

 

***


(Release ID: 2183597) Visitor Counter : 6