ప్రధాన మంత్రి కార్యాలయం
అనువాదం: ఐఎన్ఎస్ విక్రాంత్‌లో సాయుధ దళాల మధ్య దీపావళి వేడుకలు చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
20 OCT 2025 1:46PM by PIB Hyderabad
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
ఈ రోజు అద్భుతమైనది… ఈ క్షణం మరపురానిది.. ఈ దృశ్యం అసాధారణమైనది. నాకు ఒకవైపు విశాలమైన అనంత సముద్రం ఉంది.. మరొక వైపు భారత మాత ధీర సైనికుల అపారమైన సామర్థ్యం ఉంది. నాకు ఒక దిక్కు అనంతమైన విశ్వం, అంతులేని ఆకాశం ఉన్నాయి.. మరో దిక్కు అనంతమైన శక్తిని కలిగి ఉన్న అద్భుత ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది. సముద్రపు నీటిపై పడ్డ సూర్యకాంతి మెరుపు.. ఒక విధంగా మన వీర సైనికులు వెలిగించే దీపావళి దీపాల మాదిరిగా ఉంది. మన దివ్యమైన వెలుగుల మాలికలు ఇవి. ఈసారి నేను మన నావికాదళ యోధుల మధ్య దీపావళి పండుగను చేసుకోవటం నాకు కలిగిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను.
మిత్రులారా,
నిన్న రాత్రి నేను ఐఎన్ఎస్ విక్రాంత్‌లో ఉన్న అనుభూతిని మాటల్లో చెప్పటం కష్టం. మీ అందరిలో నిండుగా ఉన్న ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నేను చూశాను. నిన్న మీరు సొంతంగా రచించిన పాటలను పాడడాన్ని నేను చూశాను. ఆ పాటలలో మీరు ఆపరేషన్ సిందూర్‌ను వర్ణించిన విధానాన్ని గమనించాను. బహుశా యుద్ధ క్షేత్రంలో ఉన్న సైనికుల భావాలను ఏ కవి కూడా వ్యక్తపరచలేడు. ఒక వైపు సైనిక సామర్థ్యాన్ని నేను నా కళ్ల ముందు పరిశీలించాను.
మిత్రులారా,
ఈ గొప్ప యుద్ధనౌకలు, గాలి కంటే వేగంగా ఎగిరే ఈ విమానాలు, ఈ జలాంతర్గాములు.. అన్నీ వాటి సొంత స్థానాన్ని కలిగి ఉన్నాయి. కానీ వాటికి ప్రాణం పోసేది మీ స్ఫూర్తి, ధీరత్వమే. ఈ నౌకలు ఇనుప లోహంతో తయారైనవే కావచ్చు కానీ, మీరు వాటిని నడిపిస్తున్నప్పుడు అవి సజీవమైన, నిర్భయమైన ధీరత్వంతో కూడిన శక్తులుగా మారుతాయి. నేను నిన్నటి నుంచి మీతోనే ఉన్నాను. ఇందులో ప్రతీ ఒక్క క్షణం నాకు కొత్త విషయాలను నేర్పించింది.. నాకు కొత్తదాన్ని చూపించింది. నేను ఢిల్లీ నుంచి బయటదేరినప్పుడు నా మనస్సు ఈ క్షణాన్ని అనుభూతి చెందాలని కోరుకుంది.
కానీ మిత్రులారా,
మీ కృషి, మీ అంకితభావం, మీ క్రమశిక్షణ, మీ దేశభక్తి.. ఇవన్నీ చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయి.. చాలా గొప్పగా శిఖర స్థాయిలో ఉన్నాయి. నేను ఆ స్థాయిలో పూర్తిగా అనుభూతి పొందలేకపోయాను. కానీ నేను ఖచ్చితంగా దీనిని అర్థం చేసుకోగలను. నేను ఈ అనుభూతిని తెలుసుకున్నాను. ఈ జీవితం ఎంత కష్టమో నేను ఊహించగలను. కానీ నేను మీకు దగ్గరగా ఉండి మీ ఊపిరి, మీ గుండె చప్పుడును తెలుసుకున్నప్పుడు.. నిన్న రాత్రి మీ కళ్లలో ఆ మెరుపును చూసిన తర్వాత నేను మామూలుగా కంటే కొంచెం త్వరగానే నిద్రపోయాను. రోజంతా మిమ్మల్ని చూసిన తర్వాత నాకు కలిగిన గాఢ సంతృప్తి భావనే నేను త్వరగా నిద్రపోవడానికి కారణం. అది కేవలం సాధారణ నిద్ర కాదు.. అంతర్గత సంతృప్తి నుంచి వచ్చిన ప్రశాంతమైన నిద్ర.
మిత్రులారా,
సముద్రం మీద గాఢ రాత్రి, ఈ ప్రభాత సూర్యోదయం.. నా దీపావళిని అనేక విధాలుగా చాలా ప్రత్యేకంగా మార్చాయి. మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ.. ఈ వీరోచిత యుద్ధ నావ ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి దేశంలోని ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మీ కుటుంబాలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
దీపావళి నాడు ప్రతి ఒక్కరూ కుటుంబంతో కలిసి పండుగ చేసుకోవాలని కోరుకుంటారు. నేను కూడా నా కుటుంబంతో దీపావళి చేసుకోవటం అలవాటు చేసుకున్నాను. మీరు నా కుటుంబం కాబట్టి నేను మీ మధ్య దీపాల పండుగను చేసుకునేందుకు ఇక్కడికి వచ్చాను. నేను ఈ దీపావళిని నా కుటుంబంతో చేసుకుంటున్నాను. అందుకే ఈ దీపావళి నాకు చాలా ప్రత్యేకమైనది.
మిత్రులారా,
ఐఎన్ఎస్ విక్రాంత్‌ను జాతికి అంకితం చేసినప్పుడు ‘విక్రాంత్ విశాలమైనది.. గొప్పది.. అద్భుతమైనది. విక్రాంత్ ప్రత్యేకమైనది.. అసాధారణమైనది. విక్రాంత్ కేవలం యుద్ధనౌక కాదు. ఇది 21వ శతాబ్దంలో భారత్ కృషి, ప్రతిభ, ప్రభావం, నిబద్ధతకు చిహ్నం’ అని నేను చెప్పాను. స్వదేశీ ఐఎన్ఎస్ విక్రాంత్‌ను భారత్ అందుకున్న రోజు మీకు గుర్తుండే ఉంటుంది. అదే రోజు మన నావికాదళం వలసవాదానికి సంబంధించిన ప్రధాన చిహ్నాన్ని కూడా వదులుకుంది.. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తితో కొత్త నావికాదళ జెండాను మన నావికాదళం స్వీకరించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై! ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై! ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై!
మిత్రులారా,
మన ఐఎన్ఎస్ విక్రాంత్ నేడు 'ఆత్మనిర్భర్ భారత్ (స్వావలంబన భారతదేశం)', 'భారత్‌లో తయారీ’కి శక్తిమంతమైన చిహ్నంగా ఉంది. సముద్రాలు దాటే స్వదేశీ ఐఎన్ఎస్ విక్రాంత్.. భారత సైనిక బలాన్ని తెలియజేస్తోంది. కొన్ని నెలల క్రితం కేవలం విక్రాంత్ పేరే పాకిస్తాన్ అంతటా వణుకు పుట్టించి, రాత్రుల్లో వారి నిద్రను చెడగొట్టటాన్ని మనం చూశాం. ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే అది.. శత్రువుల ధైర్యాన్ని చిదిమేయగల ఏకైక పేరు అది. అదే ఐఎన్ఎస్ విక్రాంత్! అదే ఐఎన్ఎస్ విక్రాంత్! అదే ఐఎన్ఎస్ విక్రాంత్!
మిత్రులారా,
ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా మన సాయుధ దళాలకు వందనం చేయాలనుకుంటున్నాను. భారత నావికాదళం సృష్టించిన భయం, భారత వైమానిక దళం చూపిన అసాధారణ నైపుణ్యం, భారత సైన్యం ధైర్యం.. మూడు దళాల అద్భుతమైన సమన్వయం ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌ను త్వరగా లొంగిపోయేలా చేశాయి. కాబట్టి మిత్రులారా మరోసారి ఈ పవిత్రమైన సేవా స్థలం నుంచి.. ఐఎన్ఎస్ విక్రాంత్‌లోని ఈ పరాక్రమ క్షేత్రం నుంచి నేను త్రివిధ దళాల వీర సైనికులకు వందనం చేస్తున్నాను.
మిత్రులారా,
శత్రువు కనుచూపు మేరలో ఉన్నప్పుడు, యుద్ధం తప్పనిసరి అయిననప్పుడు.. సొంతంగా పోరాడే సామర్థ్యం ఉన్న వారి స్థానం ఎప్పుడూ కూడా బలంగా ఉంటుంది. సాయుధ దళాలు బలంగా ఉండాలంటే స్వావలంబన కలిగి ఉండటం చాలా అవసరం. ధీరులైన సైనికులు ఈ మట్టిలోనే పుట్టి, ఈ మట్టిలోనే పెరిగారు. వారి జన్మనిచ్చిన తల్లి కూడా ఈ నేలలోనే పుట్టి పెరిగారు. అందుకే వారు ‘ఈ మాతృభూమి గౌరవం కోసం అన్నింటినీ, వారి జీవితాలను కూడా ఇచ్చేందుకు’ అంతర్గత ప్రేరణను కలిగి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బలమైన, భారీ శరీరం గల సైనికులను తీసుకొచ్చి ఉన్న డబ్బులు మొత్తం ఇచ్చినా.. వారు మీలాగే ప్రాణాలను త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉంటారా? వారు మీలాగే సర్వస్వాన్ని ఇస్తారా? భారతీయుడిగా ఉండటంతో పాటు ఈ మట్టితో మీకు ఉన్న గాఢ అనుబంధం వల్ల వచ్చే బలం మాదిరిగానే ప్రతి సాధనం, ప్రతి ఆయుధం, ప్రతి విడిభాగం స్వదేశీగా మారితే మన బలం అనేక రెట్లు పెరుగుతుంది. గత దశాబ్ద కాలంగా మన సాయుధ బలగాలు స్వావలంబన దిశగా వేగంగా ప్రయాణిస్తోన్న తీరు పట్ల మేం గర్వంగా ఉన్నాం. మన సాయుధ దళాలు వేలాది వస్తువుల జాబితాను తయారు చేసి.. వీటిని ఇకపై దిగుమతి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాయి. ఫలితంగా సాయుధ దళాలకు అవసరమైన పరికరాలలో ఎక్కువ భాగం ఇప్పుడు దేశీయంగానే ఉత్పత్తి అవుతున్నాయి. గత 11 సంవత్సరాలలో మన రక్షణ రంగ ఉత్పత్తి మూడు రెట్లు పెరిగింది. గత సంవత్సరం ఇది 1.5 లక్షల కోట్ల రూపాయల రికార్డును అధిగమించింది. నేను మరో ఉదాహణనను పంచుకోవాలనుకుంటున్నాను. 2014 నుంచి భారత నావికాదళం.. దేశంలోని ఓడల తయారీ కేంద్రాల నుంచి 40కి పైగా స్వదేశీ యుద్ధనౌకలు, జలాంతర్గాములను అందుకుంది. నా ప్రసంగాన్ని వింటున్న ప్రతి భారతీయలందరూ ఈ సంఖ్యను గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. మీరు దీన్ని తెలుసుకున్న తర్వాత మీ దీపావళి దీపాల వెలుగు మరింత పెరుగుతుందని నేను విశ్వాసంగా ఉన్నాను. ఈ రోజు మన సామర్థ్యం ఏంటి? సగటున ప్రతి 40 రోజులకు ఒక కొత్త స్వదేశీ యుద్ధనౌక లేదా జలాంతర్గామి నావికాదళానికి అందుతోంది. ప్రతి 40 రోజులకు!
మిత్రులారా,
బ్రహ్మోస్, ఆకాశ్ వంటి మన దేశీయ క్షిపణులు ఆపరేషన్ సిందూర్‌లో తమ సామర్థ్యాలను నిరూపించుకున్నాయి. బ్రహ్మోస్ పేరు వినగానే శతృవులకు భయం కలుగుతోంది. బ్రహ్మోస్ వస్తోందని విన్న వెంటనే చాలామంది ఆందోళన చెందుతున్నారు! ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ క్షిపణులను కొనుగోలు చేయాలనుకుంటున్నాయి. నేను ప్రపంచ నాయకులను కలిసినప్పుడల్లా... చాలామంది వాటిని కొనుగోలు చేయాలనే కోరికను వ్యక్తం చేస్తారు! భారత్ ఇప్పుడు త్రివిధ దళాలకూ ఆయుధాలు, రక్షణ పరికరాలను ఎగుమతి చేసే సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి రక్షణ ఎగుమతిదారుల్లో భారత్‌ను ఉంచడమే మా లక్ష్యం. గత దశాబ్ద కాలంలో మన రక్షణ ఎగుమతులు 30 రెట్లు పెరిగాయి! ఈ విజయం వెనుక మన రక్షణ రంగంలోని అంకురసంస్థలు, దేశీయ తయారీ విభాగాలు కీలక పాత్ర పోషించాయి. మన అంకురసంస్థలు ప్రస్తుతం గొప్ప బలాన్ని, ఆవిష్కరణలనూ ప్రదర్శిస్తున్నాయి!
మిత్రులారా,
శక్తి, సామర్థ్యాల విషయంలో భారత్ ఎల్లప్పుడూ ‘జ్ఞానాయ దానాయ చ రక్షణాయ!’ మంత్రాన్ని అనుసరిస్తోంది. అంటే.. జ్ఞానం, శ్రేయస్సు, బలం అన్నీ మానవాళి సేవ, రక్షణ కోసమే. పరస్పర అనుసంధానితమైన నేటి ప్రపంచంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, అభివృద్ధి... సముద్ర వాణిజ్య మార్గాలపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. అందుకే భారత నావికాదళం ప్రపంచ సుస్థిరతలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచ చమురు సరఫరాలో 66 శాతం, ప్రపంచ కంటైనర్ షిప్‌మెంట్‌లలో 50 శాతం హిందూ మహాసముద్రం గుండానే జరుగుతున్నాయి. ఈ మార్గాల భద్రత కోసం భారత నావికాదళం హిందూ మహాసముద్ర కాపలాదారుగా రక్షణ కల్పిస్తోంది. ఈ పనిని చేస్తున్నది మీరే. అంతేకాకుండా ఈ మొత్తం ప్రాంతంలో మిషన్-ఆధారిత విస్తరణలు, పైరసీ వ్యతిరేక గస్తీ, మానవతా సహాయ కార్యకలాపాలతో భారత నావికాదళం ప్రపంచ భద్రతా భాగస్వామిగా మారింది.
మిత్రులారా,
మన దీవుల భద్రత, సమగ్రతలను నిర్ధారించడంలో మన నావికాదళం ప్రధాన పాత్ర పోషిస్తోంది. కొంతకాలం కిందట గణతంత్ర దినోత్సవ సందర్భంగా దేశంలోని ప్రతి ద్వీపంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని మేం నిర్ణయించాం. ప్రతియేటా జనవరి 26న నావికాదళం ఈ తీర్మానాన్ని ఎంతో గర్వంగా, గౌరవంగా నెరవేరుస్తోంది. దానికి నేను నావికాదళాన్ని అభినందిస్తున్నాను! ఇప్పుడు భారత నావికాదళం దేశంలోని ప్రతి ద్వీపంలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తోంది.
మిత్రులారా,
భారత్ వేగంగా పురోగమిస్తున్న క్రమంలో గ్లోబల్ సౌత్‌లోని అన్ని దేశాలూ మనతో పాటు ముందుకు సాగేలా మేం కృషి చేస్తున్నాం. దీని కోసం "సాగర్ - మారిటైమ్ విజన్" పై వేగంగా పని చేస్తున్నాం. అనేక దేశాలకు అభివృద్ధి భాగస్వాములుగా మనం ఉన్నాం. ఆపత్కాలంలో ప్రపంచంలో ఎక్కడైనా మానవతా సహాయం అందించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఆఫ్రికా నుంచి ఆగ్నేయాసియా దాకా ప్రపంచమంతా ఇప్పుడు విపత్తు, సంక్షోభ సమయాల్లో భారత్‌ను నిజమైన ప్రపంచ నేస్తంగా చూస్తోంది. 2014లో మన పొరుగు దేశమైన మాల్దీవుల్లో తాగునీటి సంక్షోభం తలెత్తినప్పుడు ఆపరేషన్ నీర్‌ను మనం ప్రారంభించాం. మన నావికాదళం మంచినీటి సరఫరాతో వెంటనే అక్కడికి చేరుకుంది. 2017లో శ్రీలంక భారీ వరదలతో దెబ్బతిన్న సమయంలోనూ భారత్ మొదటగా ఆపన్నహస్తం అందించింది. 2018లో ఇండోనేషియా సునామీతో అతలాకుతలమైన సందర్భంలో రక్షణ, సహాయ చర్యల్లో అక్కడి ప్రజలతో భారత్ భుజం భుజం కలిపి నిలబడింది. అదేవిధంగా మయన్మార్‌లో భూకంపం... 2019లో మొజాంబిక్ సంక్షోభం... 2020లో మడగాస్కర్ సంక్షోభాల్లోనూ అక్కడికి చేరుకుని మన సేవా స్ఫూర్తి, కరుణను చాటుతూ చేపట్టిన సహాయక చర్యలతో అక్కడి ప్రజలకు భారత్ అండగా నిలిచింది.
మిత్రులారా,
సంక్షోభ సమయాల్లో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావడం కోసం మన సాయుధ దళాలు పలు సహాయక చర్యలు చేపట్టాయి. యెమెన్ నుంచి సూడాన్ దాకా అవసరమైన ప్రతిసారీ అండగా ఉంటూ... మీ ధైర్యం, శౌర్యంతో ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న భారతీయుల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేశారు. వేలాది మంది భారత పౌరులను రక్షించడమే కాకుండా, ఆయా దేశాల్లో చిక్కుకున్న ఇతర దేశాల పౌరులనూ మనం రక్షించి... సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చాం.
మిత్రులారా,
దేశపు భూభాగం, సముద్రం, గగనతల రక్షణ కోసం మన సైనిక దళాలు పూర్తి అంకితభావం, జవాబుదారీతనం, దేశభక్తితో సేవలందిస్తూనే ఉన్నాయి. సముద్రంలో మన నావికాదళం దేశ జల సరిహద్దులను, వాణిజ్య ప్రయోజనాలనూ కాపాడుతోంది. గగనతలంలో మన వైమానిక దళం ఎల్లప్పుడూ భారత భద్రతకు కట్టుబడి ఉంది. భూమిపైనా మన సైన్యం, బీఎస్ఎఫ్, ఐటీబీపీ సిబ్బంది మండుతున్న ఎడారుల నుంచి మంచుతో నిండిన హిమానీనదాల దాకా అన్ని రకాల పరిస్థితుల్లోనూ మన సరిహద్దులకు కాపలాగా ఉన్నారు. వివిధ విభాగాల్లో ఎస్ఎస్బీ, అస్సాం రైఫిల్స్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, నిఘా సంస్థల సిబ్బంది ఐక్యంగా భరతమాతకు సేవ చేస్తున్నారు. మన తీరప్రాంత రక్షణ కోసం రేయింబవళ్లూ నావికా దళంతో సంపూర్ణ సమన్వయం చేసుకుంటూ పనిచేసే ఇండియన్ కోస్ట్ గార్డ్‌నూ నేను అభినందిస్తున్నాను. దేశ రక్షణ అనే ఈ గొప్ప మిషన్‌లో వారి సహకారం నిజంగా అమూల్యమైనది.
మిత్రులారా,
భారత భద్రతా దళాల పరాక్రమం, ధీరత్వం కారణంగా వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించాలనే మన ప్రధాన లక్ష్య సాధనలో భారత్ దాదాపుగా విజయం సాధించింది. ఇప్పుడు నక్సలైట్లు, మావోయిస్టు తీవ్రవాదం నుంచి దేశం పూర్తిగా విముక్తి పొందడంలో విజయం అంచున నిలిచింది! 2014కి ముందు దేశంలోని దాదాపు 125 జిల్లాలు మావోయిస్టుల హింసాకాండకు గురయ్యాయి. గత 10 సంవత్సరాలుగా ఈ సంఖ్య 125 జిల్లాల నుంచి కేవలం 11 జిల్లాలకి తగ్గుతూ వచ్చింది. వీటిలో కూడా ప్రస్తుతం కేవలం 3 జిల్లాల్లో మాత్రమే వారి ప్రభావపు జాడలు కనిపిస్తున్నాయి. 125 జిల్లాలకు గానూ 3 మాత్రమే మిగిలి ఉన్నాయి! మొదటిసారిగా వందకు పైగా జిల్లాలు ఇప్పుడు మావోయిస్టు తీవ్రవాదం నుంచి పూర్తిగా విముక్తి పొందాయి. స్వచ్ఛమైన స్వేచ్ఛా గాలులని పీలుస్తూ ఆ జిల్లాల ప్రజలు నిజమైన ఆనందంతో దీపావళిని జరుపుకుంటున్నారు. తరతరాల భయం, హింస తర్వాత లక్షలాది మంది ప్రజలు ఇప్పుడు అభివృద్ధి మార్గంలోకి అడుగుపెడుతున్నారు. ఒకప్పుడు రహదారులు, పాఠశాలలు, ఆసుపత్రులను నిర్మించకుండా మావోయిస్టులు నిరోధించిన ప్రాంతాల్లో... పాఠశాలలను పేల్చివేసిన ప్రాంతాల్లో... వైద్యులను కాల్చి చంపిన ప్రాంతాల్లో... మొబైల్ టవర్ల ఏర్పాటుకూ అనుమతించని ప్రాంతాల్లో.. ప్రస్తుతం రహదారులు నిర్మితమవుతున్నాయి. కొత్త పరిశ్రమలు పుట్టుకొస్తున్నాయి. పాఠశాలలు, ఆసుపత్రులు పిల్లల భవిష్యత్తును రూపొందిస్తున్నాయి. ఈ విజయం ఘనత పూర్తిగా మన భద్రతా దళాల త్యాగం, అంకితభావం, ధైర్యానికే చెందుతుంది. ఈ సంవత్సరం ఈ ప్రాంతాల్లోని చాలా జిల్లాల ప్రజలు మొదటిసారిగా సగర్వంగా, ఆనందంతో దీపావళి జరుపుకుంటున్నారు. ఇది నాకు చాలా సంతోషంగా కలిగిస్తోంది.
మిత్రులారా,
ఈ రోజు నేను మన వీర సైనికుల మధ్య నిలబడి ఉన్నాను. మన నౌకాదళ సిబ్బంది ప్రాణాలొడ్డి నిర్భయంగా ముందుకు సాగే వీరులు. సహజంగానే మీరు ధైర్యంతో అపాయాలను ఎదుర్కొంటారు. కానీ ఒకసారి మన పోలీసు సిబ్బంది గురించి ఆలోచించండి. వారికి విధి నిర్వహణలో చేతిలో ఒక్క లాఠీ తప్ప మరేదీ ఉండదు. వారికి సైనికులంత వనరులు, శిక్షణ ఉండవు. వారి పని ప్రజల మధ్య శాంతి, సామరస్యాన్ని కాపాడటమే. అయినా కూడా, ఈ పోలీసు దళాలు - బీఎస్ఎఫ్ అయినా, సీఆర్పీఎఫ్ అయినా, ఇతర దళాలైనా - నక్సలైట్లను అసాధారణ ధైర్యంతో ఎదుర్కొన్నాయి. వారు చేసిన యుద్ధాలు అత్యున్నత ప్రశంసలకు అర్హమైనవి. ఈ పవిత్ర దీపావళి పండుగ సందర్భంగా, నా పోలీసు సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. కాళ్లను పోగొట్టుకున్నా మనోబలాన్ని కోల్పోని, చేతులు పోయినా ధైర్యాన్ని వదలని, చక్రాల కుర్చీ లేకుండా కదలలేకపోయినా హృదయాలు మాత్రం అచంచలంగా ఉన్న ఎంతోమంది ధైర్యవంతులైన పురుషులు, మహిళల గురించి నాకు తెలుసు. తీవ్రవాదుల చేతిలో హింసకు గురైన కుటుంబాలు గురించి కూడా నాకు తెలుసు. వారి అవయవాలు నరికివేశారు. వారి గ్రామాలను ధ్వంసం చేసి వాటిని నివసించడానికి వీలు లేకుండా చేశారు. ఈ లెక్కకు అందని వీరులందరూ శాంతిని నెలకొల్పడానికి, పౌరులు మెరుగైన జీవితాలు గడపడానికి, పిల్లలు చదువుకుని ఉజ్వల భవిష్యత్తు గురించి కలలు కనడానికి ఎన్నో బాధలు భరించి గొప్ప త్యాగాలు చేశారు. వారు దేశంలో శాంతి, అభివృద్ధి కోసం తమను తాము అంకితం చేసుకున్నారు.
మిత్రులారా,
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత బహుశా మొదటిసారిగా, మన పోలీసు బలగాలు ఇంత పెద్ద సవాలును ఎదుర్కొన్నాయి. కానీ గత 10 సంవత్సరాల్లో వారు దాదాపు 50 ఏళ్ల నాటి ఈ ముప్పును తొలగించడంలో విజయవంతమయ్యారని, సుమారు 90 శాతం కేసుల్లో వారు విజయం సాధించారని నేను నమ్మకంగా చెప్పగలను. మీకు యుద్ధం గురించి బాగా తెలుసు. కానీ, యుద్ధం మన స్వంత భూమిలోనే జరిగేటప్పుడు, అది ఎంతో సహనాన్ని, సంయమనాన్ని కోరుతుంది. ఎలాంటి అమాయక ప్రాణం కూడా పోకుండా చూసుకోవడం ఇందులో చాలా ముఖ్యం. ఇది ఒక అసాధారణ ప్రయత్నం. ఈ రకమైన అంతర్గత గెరిల్లా యుద్ధాన్ని నిర్వహించిన తీరుపై ఒక రోజు ఎన్నో పుస్తకాలు కూడా వస్తాయి. భారత సాహస బలగాలు తమ శౌర్యం, వ్యూహం ద్వారా మావోయిస్ట్ తీవ్రవాదాన్ని ఎలా నాశనం చేశాయో ప్రపంచం మొత్తం అధ్యయనం చేస్తుంది. ఇలాంటి వీరత్వానికి మూలాలు మన నేల పైనే కలిగి ఉండడం భారతీయులుగా మనకు గర్వకారణం.
మిత్రులారా,
ఒకప్పటి నక్సల్ ప్రభావిత జిల్లాల్లో ఈ రోజు జీఎస్టీ పొదుపు ఉత్సవాల సందర్భంగా రికార్డు స్థాయిలో అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఒకప్పుడు మావోయిస్టులు రాజ్యాంగం పేరు కూడా మాట్లాడనివ్వని, దాని ఉనికినే అనుమతించని ప్రాంతాల్లో, ఈ రోజు ప్రతి మూలలోనూ "స్వదేశీ" (స్వావలంబన) నినాదం ప్రతిధ్వనిస్తోంది. ఒకప్పుడు తప్పుదారి పట్టి 303 రైఫిళ్లు మోసిన యువత ఇప్పుడు రాజ్యాంగాన్ని హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నారు
మిత్రులారా,
ఈ రోజు భారతదేశం అద్భుతమైన వేగంతో ముందుకు సాగుతోంది. 140 కోట్ల మంది దేశ ప్రజల కలలను నెరవేరుస్తున్నాం. భూమి నుంచి నుండి ఆకాశం వరకు, ఒకప్పుడు ఊహించలేనిది ఏదైతే ఉందో, అది ఇప్పుడు మన కళ్ల ముందే నిజమవుతోంది. ఈ వేగం, అభివృద్ధి, మార్పు దేశ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి. ఆ విశ్వాసం నుంచే అభివృద్ధి మంత్రం ఉద్భవిస్తుంది. ఈ గొప్ప దేశ నిర్మాణ ప్రయాణంలో,మన సాయుధ బలగాల పాత్ర అత్యంత ప్రధానమైనది. మీరు కేవలం ప్రవాహంతో పాటు కొట్టుకుపోయే వారు కాదు. గంగ ‘గంగాదాస్‘ అంటుంది, యమున ‘యమునాదాస్‘ అంటుంది. అయితే ఎవరు ఏది చెబితే దానికి తల ఊపడం సైన్యం రక్తంలో లేదు.మీరు ప్రవాహంలో కొట్టుకుపోయేవారు కాదు. ప్రవాహానికి దిశానిర్దేశం చేసే శక్తి కలిగి ఉన్నారు, దాని మార్గాన్ని మార్చగలరు! మీరు సమయాన్ని నడిపించే ధైర్యం కలిగి ఉన్నారు. అసాధ్యాన్ని దాటే వీరత్వం కలిగి ఉన్నారు.ప్రతి అడ్డంకిని అధిగమించే స్ఫూర్తి మీలో ఉంది.
మన సైనికులు స్థిరంగా నిలబడిన పర్వత శిఖరాలు భారతదేశ విజయానికి చిహ్నాలుగా మారాయి. మన నౌకాదళం కాపలాగా నిలబడే సముద్రాలపై అలలు కూడా భారతదేశ విజయాన్ని జపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. "భారత్ మాతా కీ జై!" - కేవలం మీ గొంతు మాత్రమే కాదు, ప్రతి అల కూడా ఆ నినాదాన్ని ప్రతిధ్వనిస్తోంది. మీరు సముద్రపు అలలకే స్ఫూర్తినిచ్చారు - అవి కూడా “భారత్ మాతా కీ జై” అని గర్జించేలా చేశారు. సముద్రపు గర్జనలోనైనా, పర్వతాల నుంచి వీచే గాలుల్లోనైనా, ఎడారుల ధూళిలోనైనా మనసు, మనోభావం ఒకటిగా వినగలిగితే, ప్రతి మట్టి రేణువులోనూ, ప్రతి నీటి చుక్కలోనూ ఒక్కటే స్వరం ప్రతిధ్వనిస్తుంది. అది “భారత్ మాతాకీ జై! భారత్ మాతాకీ జై!” ఈ ఉత్సాహం, విశ్వాసం స్ఫూర్తితో, మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకు, దేశంలోని 140 కోట్ల మంది పౌరులందరికీ నేను మరోసారి నా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఎల్లప్పుడూ మీలో విజయం, విశ్వాసం సంకల్పాన్ని పెంపొందించుకోవాలి.మీ కలలు కొత్త శిఖరాలను చేరుకోవాలి.
ఇప్పుడు, మీరంతా నాతో కలిసి, బిగ్గరగా పలకండి:
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
వందే మాతరం!
అందరికీ చాలా ధన్యవాదాలు!
***
(Release ID: 2181159)
Visitor Counter : 8
Read this release in:
English
,
Gujarati
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Kannada
,
Malayalam