ప్రధాన మంత్రి కార్యాలయం
ముంబయిలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఉత్సవం ఆరో ఎడిషన్‌లో ప్రధాని ప్రసంగం
Posted On:
09 OCT 2025 5:52PM by PIB Hyderabad
గౌరవ బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్, ఆవిష్కర్తలు, నాయకులు, ఫిన్‌టెక్ రంగ పెట్టుబడిదారులు, సోదరీ సోదరులారా! మీ అందరికీ ముంబయికి హృదయపూర్వక స్వాగతం!
మిత్రులారా,
చివరిసారిగా నేనీ కార్యక్రమానికి హాజరైన సమయానికి 2024 ఎన్నికలు ఇంకా జరగలేదు. వచ్చే ఎడిషన్‌కు మళ్లీ వస్తానని ఆ రోజే నేను చెప్పాను. నాడు మీరు కరతాళధ్వనులతో అభినందించారు. అప్పటికే ఇక్కడున్న రాజకీయ నిపుణులు ‘‘మోదీ మళ్లీ రాబోతున్నాడు’’ అని తేల్చేశారు.
మిత్రులారా,
ముంబయి అంటే శక్తి, ముంబయి అంటే వాణిజ్యం.. అపరిమితమైన అవకాశాలున్న నగరం ముంబయి. నా మిత్రుడు, బ్రిటన్ ప్రధానమంత్రి స్టార్మర్‌కు ఈ నగరానికి స్వాగతం పలుకుతున్నాను. విలువైన తన సమయాన్ని వెచ్చించి గ్లోబల్ ఫిన్‌టెక్ ఉత్సవానికి హాజరైన ఆయనకు నా కృతజ్ఞతలు.
మిత్రులారా,
అయిదేళ్ల కిందట ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఉత్సవం’ మొదలయ్యేనాటికి.. అంతర్జాతీయ విపత్తుతో ప్రపంచం పోరాడుతోంది. మరి నేడు.. ఆర్థిక ఆవిష్కరణలకు, సహకారానికి ఈ ఉత్సవం అంతర్జాతీయ వేదికగా నిలుస్తోంది. ఈ ఏడాది బ్రిటన్ భాగస్వామ్య దేశంగా చేరింది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య ఈ భాగస్వామ్యం అంతర్జాతీయ ఆర్థిక రంగాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇక్కడ కనిపించే వాతావరణం, శక్తి, చైతన్యం... నిజంగా అత్యద్భుతం. భారత ఆర్థిక వ్యవస్థ, భారత వృద్ధిపై అంతర్జాతీయ విశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. ఈ బృహత్తర కార్యక్రమం సందర్భంగా క్రిస్ గోపాలకృష్ణన్ గారికి, ఆర్బీఐ గవర్నరు సంజయ్ మల్హోత్రా గారికి, నిర్వాహకులకు, భాగస్వాములైన వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
మిత్రులారా,
భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి. ప్రజాస్వామ్యమంటే ఎన్నికలకో లేదా విధాన రూపకల్పనకో పరిమితం కాదు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాలనకు మూలాధారంగా భారత్ నిలిపింది. సాంకేతికత దీనికి మంచి ఉదాహరణ. సాంకేతిక అంతరాల గురించి చాలా కాలంగా ప్రపంచం మాట్లాడింది. ఆ చర్చల్లో వాస్తవాన్ని మనం కాదనలేము. ఆ సమయంలో భారత్ కూడా ఈ అంశాన్ని స్పృశించలేదు. అయితే, గత దశాబ్ద కాలంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ ప్రజాస్వామ్యీకరించింది. నేడు భారత్ ప్రపంచంలో అత్యంత సాంకేతిక సమ్మిళిత సమాజాల్లో ఒకటిగా ఉంది.
మిత్రులారా,
డిజిటల్ సాంకేతికతను కూడా మేం ప్రజాస్వామ్యీకరించాం. దేశంలోని ప్రతి పౌరుడికీ ప్రతి ప్రాంతానికీ దానిని అందుబాటులోకి తెచ్చాం. నేడు అది భారత సుపరిపాలన నమూనాకు చిహ్నంగా మారింది. ఈ నమూనాలో ప్రజా ప్రయోజనార్థం ప్రభుత్వం డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుంది. అనంతరం ఆ వేదికపై ప్రైవేటు రంగం కొత్త, వినూత్న ఉత్పత్తులను రూపొందిస్తుంది. సాంకేతికత అన్నది సౌలభ్య సాధనం మాత్రమే కాదని, సమానత్వ సాధనం కూడా అని భారత్ నిరూపించింది.
మిత్రులారా,
ఈ సమ్మిళిత విధానం మన బ్యాంకింగ్ వ్యవస్థలోనూ సానుకూల మార్పులు తెచ్చింది. ఇంతకుముందు బ్యాకింగ్ అంటే ఓ విశేషంగా ఉండేది. కానీ, సాంకేతికత వల్ల అది సాధికారతా సాధనంగా మారింది. నేడు భారత్‌లో డిజిటల్ చెల్లింపులు రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. దీనికి ప్రధాన ఘనత జేఏఎం త్రయానికే (జన్‌ధన్, ఆధార్, మొబైల్) దక్కుతుంది. యూపీఐ లావాదేవీలనే చూడండి! ప్రతి నెలా దాదాపు 20 బిలియన్ లావాదేవీలు జరుగుతున్నాయి. వాటి మొత్తం విలువ 25 ట్రిలియన్ రూపాయలు, అంటే రూ. 25 లక్షల కోట్లకు పైమాటే. నేడు ప్రపంచంలోని ప్రతీ 100 రియల్ టైమ్ డిజిటల్ లావాదేవీల్లో 50 ఒక్క భారత్‌లోనే జరుగుతున్నాయి.
మిత్రులారా,
ఈ ఏడాది గ్లోబల్ ఫిన్‌టెక్ ఉత్సవ ఇతివృత్తం కూడా ఈ భారత ప్రజాస్వామ్య స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లి, బలోపేతం చేస్తుంది.
మిత్రులారా,
భారత డిజిటల్ శక్తి గురించి నేడు ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. భారత ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ (యూపీఐ), ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ, భారత్ బిల్లు చెల్లింపు వ్యవస్థ, భారత్ క్యూఆర్, డిజిలాకర్, డిజియాత్ర, ప్రభుత్వ ఇ- మార్కెట్ ప్లేస్ (జీఈఎం)... ఇవన్నీ భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. భారత డిజిటల్ శక్తి సరికొత్త సార్వత్రిక సానుకూల వ్యవస్థల ఏర్పాటు సంతోషాన్నిస్తోంది. మీలో చాలా మందికి దీని గురించి తెలియకపోవచ్చు.. ఓఎన్డీసీ.. అంటే డిజిటల్ వాణిజ్య సార్వత్రిక నెట్వర్క్ చిన్న దుకాణదారులకు, ఎంఎస్ఎంఈలకు వరంగా మారుతోంది. దేశవ్యాప్త మార్కెట్లకు చేరుకోవడంలో ఇది వారికి సహాయపడుతోంది. అదేవిధంగా ఓసీఈఎన్ (సార్వత్రిక రుణ సదుపాయ నెట్వర్క్) చిన్న పారిశ్రామికవేత్తలకు రుణ లభ్యతను సులభతరం చేస్తోంది. ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న రుణ కొరత సమస్యను పరిష్కరించడంలో ఈ వ్యవస్థ సహాయపడుతోంది. ఆర్‌బీఐ అనుసరిస్తున్న డిజిటల్ కరెన్సీ కార్యక్రమాలు ఈ అంశాలను మరింత మెరుగుపరుస్తాయని నేను విశ్వసిస్తున్నాను. నిరుపయోగంగా ఉన్న భారత సామర్థ్యాన్ని మన వృద్ధికి కీలక చోదక శక్తిగా నిలపడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు.
మిత్రులారా,
భారత శక్తి (ఇండియా స్టాక్) దేశ విజయగాథ మాత్రమే కాదు. నేను మళ్లీ ఈ కార్యక్రమానికి హాజరవుతానని గత సందర్శన సందర్భంగా చెప్పాను. నేనది చెప్పినప్పుడెలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నాను. ఈ రోజు భారత్ చేస్తున్నది అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆశాకిరణం. భారత్ తన డిజిటల్ ఆవిష్కరణల ద్వారా ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ సహకారాన్ని, డిజిటల్ భాగస్వామ్యాన్ని మెరుగుపరచాలని కాంక్షిస్తోంది. అందుకే మనం అనుభవాన్ని, ఓపెన్ సోర్స్ వేదికలను ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా ప్రపంచంతో పంచుకుంటున్నాం. భారత్‌లో రూపొందించిన మోసిప్ (మాడ్యులర్ ఓపెన్ సోర్స్ ఐడెంటిటీ ప్లాట్ఫాం) దీనికి మంచి ఉదాహరణ. నేడు 25కు పైగా దేశాలు తమ సొంత అధికారిక డిజిటల్ గుర్తింపు వ్యవస్థల అభివృద్ధి కోసం దీనిని అనుసరిస్తున్నాయి. మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం మాత్రమే కాదు, దాని అభివృద్ధి కోసం ఇతర దేశాలకూ చేయూతనిస్తున్నాం. మనం సాయమందిస్తున్నామని కొందరు చెప్పొచ్చు.. అయితే, ఇది డిజిటల్ సాయం కాదు. అర్థం చేసుకునేవారికి నా ఉద్దేశమేమిటో బాగా తెలుస్తుంది. ఇది సాయం కాదు, డిజిటల్ సాధికారత.
మిత్రులారా,
భారత్‌లోని ఫిన్‌టెక్ సంస్థల కృషి వల్ల మన స్వదేశీ సాధనాలు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యాన్ని పొందాయి. పరస్పర వినిమయానుకూల క్యూఆర్ నెట్వర్కులు, ఓపెన్ కామర్స్, ఓపెన్ ఫైనాన్స్ ఫ్రేమ్ వర్కులు... ఏవైనా కావచ్చు, మన అంకుర సంస్థల వృద్ధిని ప్రపంచం నిశితంగా గమనిస్తోంది. నిజానికి ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే ప్రపంచంలో అత్యధికంగా నిధులు సమకూర్చే మొదటి మూడు ఫిన్‌టెక్ వ్యవస్థల్లో ఒకటిగా భారత్ నిలిచింది. మీ అందరి వల్లే ఈ విజయం సాధ్యమైందని నేనంటున్నాను.
మిత్రులారా,
భారత్ బలం కేవలం పరిమాణాత్మకం మాత్రమే కాదు. సమ్మిళితత్వం, క్రియాశీలత, సుస్థిరతలతో దీనిని మిళితం చేస్తున్నాం. ఏఐ పాత్ర ఇక్కడే మొదలవుతుంది. ఏఐ ఔచిత్య రాహిత్యాన్ని తగ్గించగలదు, అవకతవకలను ఎప్పటికప్పుడు గుర్తించగలదు, ఇతర సేవల్లో నాణ్యతనూ మెరుగుపరుస్తుంది. ఈ అపారమైన సామర్థ్యాన్ని వినియోగించుకోవడం కోసం.. డేటా, నైపుణ్యాలు, నిర్వహణలో మనం సమష్టిగా పెట్టుబడి పెట్టాలి.
మిత్రులారా,
ఏఐ పట్ల భారత విధానానికి మూడు కీలక ప్రాతిపదికలున్నాయి – అందరికీ సమాన లభ్యత, ప్రజల్లో నైపుణ్య స్థాయి, బాధ్యతాయుత వినియోగం. ఇండియా-ఏఐ మిషన్ ద్వారా అత్యున్నత కంప్యూటింగ్ సామర్థ్యాన్ని మేం నిర్మిస్తున్నాం. తద్వారా ప్రతీ ఆవిష్కర్తకు, అంకుర సంస్థకు అందుబాటు వ్యయంలో, సులభంగా ఏఐ వనరులు లభిస్తాయి. దేశంలోని ప్రతి జిల్లాకు, ప్రతి భాషకు ఏఐ ప్రయోజనాలు చేరేలా చూడడం మా లక్ష్యం. మన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సులు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, దేశీయ ఏఐ నమూనాలు దీనిని సాకారం చేస్తున్నాయి.
మిత్రులారా,
ఏఐ నైతిక వినియోగానికి సంబంధించి అంతర్జాతీయ మార్గదర్శకాలను రూపొందించాలని భారత్ ఎప్పుడూ వాదిస్తోంది. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలతో మన అనుభవాలు, మన అభ్యసన అనుభవాలు ప్రపంచానికి ఎంతగానో ఉపయోగపడతాయి. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను అమలు చేసిన స్థాయిలోనే.. ఏఐలోనూ ఇప్పుడు వాటిని సాధించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. మా దృష్టిలో ఏఐ విశిష్టమైనది. మా దృష్టిలో ఏఐ అంటే ఆల్ ఇంక్లూజివ్ (అందరినీ కలుపుకొని పోవడం).
మిత్రులారా,
ఏఐకి సంబంధించి విశ్వాసం, భద్రత నియమాలపై నేడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కానీ, భారత్ ఇప్పటికే ఇందుకోసం ‘భద్రతా మార్గదర్శకాల’ను రూపొందించింది. డేటా, గోప్యతాపరమైన ఆందోళనలు రెండింటినీ పరిష్కరించగల సామర్థ్యం ఇండియా ఏఐ మిషన్‌కు ఉంది. ఆవిష్కర్తలు సమ్మిళిత అనువర్తనాలను రూపొందించే అవకాశం ఉన్న ఏఐ వేదికలను అభివృద్ధి చేయాలని మేం భావిస్తున్నాం. చెల్లింపులకు సంబంధించి వేగం, భరోసా మా ప్రాధాన్యాలు. రుణాల విషయానికొస్తే.. ఆమోదం, భరించగలిగే సామర్థ్యం మా లక్ష్యాలు. బీమా విషయంలో.. మెరుగైన విధానాలు, సకాలంలో క్లెయిమ్‌లు మా లక్ష్యం. ఇక పెట్టుబడుల్లో.. లభ్యత, పారదర్శకత అంశాల్లో విజయవంతం కావాలని కాంక్షిస్తున్నాం. ఈ మార్పు దిశగా ఏఐ కీలక చోదక శక్తిగా నిలుస్తుంది. అయితే, ప్రజలే కేంద్రంగా ఏఐ అనువర్తనాలు రూపొందితేనే అది సాధ్యమవుతుంది. ఏ లోపాలున్నా త్వరగా పరిష్కారమవుతాయన్న నమ్మకం మొదటిసారి డిజిటల్ ఫైనాన్స్ ఉపయోగిస్తున్న వ్యక్తికి కూడా ఉండాలి. ఈ విశ్వాసమే డిజిటల్ సమ్మిళితత్వం, ఆర్థిక సేవలపై విశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది.
మిత్రులారా,
కొన్నేళ్ల కిందట బ్రిటన్‌లో ఏఐ భద్రతా సదస్సు ప్రారంభమైంది. వచ్చే ఏడాది భారత్‌లో ఏఐ ప్రభావ సదస్సు (ఇంపాక్ట్ సమ్మిట్) జరుగుతుంది. అంటే భద్రతపై చర్చ బ్రిటన్‌లో మొదలైంది. ప్రభావంపై చర్చ భారత్లో జరుగనుంది. అంతర్జాతీయ వాణిజ్యం - భాగస్వామ్యంలో.. ఇరు పక్షాలకు లాభదాయకమైన మార్గాన్ని భారత్, బ్రిటన్ ఇప్పటికే ప్రపంచానికి చూపాయి. కృత్రిమ మేధ, ఫిన్‌టెక్‌లలో మన సహకారం ఈ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుంది. బ్రిటన్ పరిశోధన శక్తి, అంతర్జాతీయ ఆర్థిక నైపుణ్యానికి భారత ప్రతిభ, మానవ వనరులు తోడైతే.. ప్రపంచం మొత్తానికి కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. నేడు అంకుర సంస్థలు, సంస్థలు, ఆవిష్కరణ నిలయాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయాలని మేం సంకల్పించాం. కొత్త అంకుర సంస్థలకు మార్గనిర్దేశం చేయడంలో, అవి వృద్ధి చెందడంలో బ్రిటన్- భారత్ ఫిన్‌టెక్ కారిడార్ సరికొత్త అవకాశాలను అందిస్తుంది. అలాగే, లండన్ స్టాక్ ఎక్స్ఛేంజి, గిఫ్ట్ సిటీ మధ్య సహకారానికి కొత్త మార్గాలను కూడా ఇది తెరుస్తుంది. మన రెండు దేశాల మధ్య ఈ ఆర్థిక అనుసంధానం వల్ల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని మన కంపెనీలు సద్వినియోగం చేసుకునే అవకాశం కలుగుతుంది.
మిత్రులారా,
ఓ గొప్ప బాధ్యత మనందరిపైనా ఉంది. భారత్తో చేతులు కలపాల్సిందిగా.. బ్రిటన్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భాగస్వామికీ ఈ వేదిక నుంచి నేను ఆహ్వానం పలుకుతున్నాను. భారత్తోపాటు ఎదగాల్సిందిగా ప్రతి పెట్టుబడిదారునూ నేను ఆహ్వానిస్తున్నాను. ప్రజలతోపాటు పర్యావరణాన్నీ సుసంపన్నం చేసేలా సాంకేతికత, వృద్ధి మాత్రమే కాకుండా నైతికత కూడా లక్ష్యంగా ఉన్న ఆవిష్కరణలు, సంఖ్యలకు మాత్రమే పరిమితం కాకుండా మానవ పురోగతిపై దృష్టి సారించే ఆర్థిక ఏర్పాట్లు ఉన్న ఫిన్‌టెక్ ప్రపంచాన్ని మనం నిర్మించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ దిశగా పిలుపునిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆర్బీఐకి హృదయపూర్వక అభినందనలు.
ధన్యవాదాలు!
***
(Release ID: 2179027)
Visitor Counter : 6
Read this release in:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam