|
ప్రధాన మంత్రి కార్యాలయం
ముంబయి నగరంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
08 OCT 2025 6:32PM by PIB Hyderabad
మహారాష్ట్ర గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్, ప్రజాదరణ గల ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ రాందాస్ అథవాలే, శ్రీ కె.ఆర్.నాయుడు, శ్రీ మురళీధర్ మొహోల్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ ఏక్‌నాథ్ షిండే, శ్రీ అజిత్ పవార్, ఇతర మంత్రులు, భారత్‌లో జపాన్ రాయబారి శ్రీ కెయిచీ ఓనో, ఇతర ప్రముఖ అతిథులు, సోదరీసోదరులారా!
విజయదశమి పర్వదినంతోపాటు కోజగిరి పౌర్ణమి వేడుకలు ఇటీవలే ముగిశాయి. మరో పది రోజుల్లో దీపావళి సంబరాలు నిర్వహించుకోబోతున్నాం. ఈ నేపథ్యంలో మీకందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
మిత్రులారా!
ముంబయి సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ ఈ రోజు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. ఈ ప్రాంతాన్ని ఆసియాలోనే అతిపెద్ద అనుసంధాన కూడలిగా రూపు దిద్దడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. మరోవైపు పూర్తి భూగర్భ మెట్రో సౌకర్యం కూడా సమకూరింది కాబట్టి, నగరంలో ప్రయాణ సౌలభ్యం ఇనుమడించడమే కాకుండా ప్రజలకు ఎంతో సమయం ఆదా అవుతుంది. భారత్ శరవేగ పురోమనాన్ని ఈ భూగర్భ మెట్రో ప్రతిబింబిస్తుంది. ముంబయి వంటి రద్దీగల నగరంలో ఇక్కడి చారిత్రక కట్టడాల భద్రతకు భరోసా ఇస్తూ భూగర్భంలో మెట్రో మార్గం నిర్మితమైంది. ఈ అద్భుత నిర్మాణంలో భాగస్వాములైన కార్మికులు, ఇంజనీర్లు తదితరులందరికీ నా అభినందనలు.
మిత్రులారా!
దేశ యువతరానికి ఇది అపార అవకాశాలు అందివచ్చే తరుణం. దేశవ్యాప్తంగా గల అనేక పారిశ్రామిక శిక్షణ సంస్థల (ఐటీఐ)ను పరిశ్రమల రంగంతో అనుసంధానించే రూ.60,000 కోట్ల విలువైన ‘ప్రధానమంత్రి సేతు’ పథకాన్ని కొన్ని రోజుల కిందటే ప్రారంభించాం. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ్టి నుంచి వందలాది ఐటీఐలు, సాంకేతిక శిక్షణ పాఠశాలల్లో కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. వీటి ద్వారా విద్యార్థులకు ఇకపై డ్రోన్లు, రోబోటిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సౌరశక్తి, గ్రీన్ హైడ్రోజన్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల్లో శిక్షణ లభిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోబోయే మహారాష్ట్ర యువతకు నా శుభాకాంక్షలు.
మిత్రులారా!
మహారాష్ట్ర ప్రియపుత్రుడు, ప్రజానాయకుడైన కీర్తిశేషులు శ్రీ డి.బి.పాటిల్‌ను ఇటువంటి కీలక సందర్భంలో నేను స్మరించుకుంటున్నాను. సమాజం... ముఖ్యంగా రైతు సంక్షేమంపై ఆయన అంకితభావం, చేసిన సేవలు మనందరికీ స్ఫూర్తిదాయకం. సామాజిక హితం లక్ష్యంగా తమ వంతు కృషి చేసేవారికి ఆయన జీవితం సదా ఉత్తేజమిస్తూనే ఉంటుంది.
మిత్రులారా!
వికసిత భారత్ సంకల్ప సాకారానికి యావద్దేశం నేడు అంకితమైంది. వికసిత భారత్ అంటే- ‘గతి’ (వేగం), ‘ప్రగతి’ (అభివృద్ధి) రెండూ కలగలసిన దేశం. ప్రజా సంక్షేమమే ప్రాథమ్యంగా, ప్రభుత్వ పథకాల సంపూర్ణ అమలు ద్వారా జనజీవన సౌలభ్యం కల్పించే దేశం. గడచిన 11 ఏళ్లలో దేశం పయనించిన తీరును ఒకసారి అవలోకిస్తే, భారత్ నలుమూలలా ఇదే స్ఫూర్తితో వేగంగా పనులు సాగడం మీకు గుర్తుకొస్తుంది. “దేశవ్యాప్తంగా వందే భారత్ సెమీ హై-స్పీడ్ రైళ్లు పరుగు తీస్తుండటం, బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు వేగం పుంజుకోవడం, సువిశాల రహదారులు-‘ఎక్స్‌ప్రెస్ వే’లతో నగరాలను కలపడం, పర్వతాలను తొలచి పొడవైన సొరంగాలను నిర్మించడం, మహా సముద్రంపై వంతెనలతో రెండు తీరాలను జోడించడం” వంటివన్నీ భారత్ ‘గతి’, ‘ప్రగతి’ని మన కళ్లకు కడతాయి. యువతరం కలలకు కొత్త రెక్కలు తొడిగేది శరవేగంగా సాగుతున్న ఈ పురోగమనమే.
మిత్రులారా!
వికసిత భారత్ దిశగా పయనంలో నేటి కార్యక్రమం కూడా ఒక భాగం. ‘నవీ ముంబయి’ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్ట్ ఈ దార్శనికతకు వాస్తవిక ప్రతీక. ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మభూమిపై నిర్మితమైన దీని స్వరూపం ‘సంస్కృతి’, ‘సౌభాగ్యా’లకు చిహ్నమైన తామర పుష్పాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కొత్త విమానాశ్రయం ఐరోపా, మధ్యప్రాచ్యంలోని సూపర్ మార్కెట్లతో మహారాష్ట్ర రైతులను అనుసంధానిస్తుంది. పూలు, పండ్లు, కూరగాయలు, చేపలు వంటి నశ్వర వస్తువులు ప్రపంచ మార్కెట్లకు సత్వరం చేరగలవు. దీంతోపాటు విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లోని చిన్న-మధ్య తరహా పరిశ్రమల ఎగుమతి వ్యయం కూడా తగ్గుతుంది. తద్వారా ఈ ప్రాంతం మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తూ కొత్త పరిశ్రమలు, వ్యాపార సంస్థల ఏర్పాటుకు అనువుగా మారుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న విమానాశ్రయం సమకూరినందుకు రాష్ట్ర ప్రజలందరికీ... ముఖ్యంగా ముంబయి నగరవాసులకు నా హృదయపూర్వక అభినందనలు.
మిత్రులారా!
ఉజ్వల భవితపై కలల సాకారంతోపాటు వేగంగా సాధించే ప్రగతి ఫలాలు ప్రతి పౌరుడీకీ చేరాలనే దృఢ సంకల్పం ఉన్నపుడు, సహజంగానే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. మన విమానయాన రంగం, దానితో అనుసంధానితమయ్యే పరిశ్రమలే ఈ పురోగమనానికి తిరుగులేని నిదర్శనం. ప్రజలు మాకు 2014లో దేశానికి సేవ చేసే అవకాశం ఇచ్చినపుడు, మామూలు చెప్పులు ధరించే అతి సామాన్యులకూ విమానయానం అందుబాటులోకి రావాలన్నది నా స్వప్నంగా నేను చెప్పడాన్ని మీరిప్పుడు గుర్తుచేసుకోండి. ఈ కలను సాకారం చేయడంలో భాగంగా దేశమంతటా కొత్త విమానాశ్రయాల నిర్మాణం అవసరం కాబట్టి, మా ప్రభుత్వం ఈ లక్ష్యం కోసం ముమ్మర కృషికి ఆనాడే శ్రీకారం చుట్టింది. అప్పటి నుంచీ గత 11 సంవత్సరాల్లో ఒక్కొక్కటిగా సిద్ధమవుతూ 2014నాటికి 74 మాత్రమే ఉండగా, ఇవాళ 160కిపైగా విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చాయి.
మిత్రులారా!
చిన్న పట్టణాల్లోనూ విమానాశ్రయం ఏర్పడినప్పుడు అక్కడి ప్రజలకు విమాన ప్రయాణ అవకాశం కలుగుతుంది. దీనికి అనుగుణంగా ‘ఉడాన్’ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం ద్వారా సామాన్యులకు మేం చౌకగా విమానయాన సదుపాయం కల్పించాం. ఈ పథకం అమలుతో గత పదేళ్లలో లక్షలాదిగా సామాన్యులు తొలిసారి తమ విమాన ప్రయాణ కలను నెరవేర్చుకున్నారు.
మిత్రులారా!
దేశంలో కొత్త విమానాశ్రయాల నిర్మాణం, ఉడాన్ పథకం విజయంతో ప్రజలకు ఎంతో సౌలభ్యం కలగడమేగాక ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా భారత్ రూపొందింది. దీంతో నిరంతర విస్తరణలో భాగంగా భారత విమానయాన సంస్థలు దాదాపు 1,000 కొత్త విమానాల కోసం ఆర్డర్లు ఇవ్వడం ప్రపంచ ప్రజానీకాన్ని ఆశ్చర్యపరుస్తోంది. మరోవైపు ఈ విస్తరణ ఫలితంగా పైలట్లు, ఇంజినీర్లు, క్యాబిన్-క్షేత్రస్థాయి సిబ్బంది రూపంలో యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.
మిత్రులారా!
ఇక విమానాల సంఖ్య పెరిగే కొద్దీ వాటి నిర్వహణ, మరమ్మతులు వగైరాలకూ డిమాండ్ పెరుగుతుంది. అందుకే, నిర్వహణ-మరమ్మతు-ఓవర్‌హాల్ (ఎంఆర్‌ఓ) సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా ఈ దశాబ్దం ఆఖరుకల్లా నాటికి భారత్ ఒక ప్రధాన అంతర్జాతీయ ‘ఎంఆర్‌ఓ’ కూడలిగా మారాలన్నది మా లక్ష్యం. ఈ మార్గంలోనూ మన యువతకు అనేక ఉపాధి అవకాశాలు అందివస్తాయి.
మిత్రులారా!
ప్రపంచంలో అత్యధిక యువజన సంపన్న దేశం భారత్... ఉత్సాహం ఉరకలెత్తే ఈ యువతరమే మన వాస్తవ బలం. అందుకే, మా ప్రభుత్వ విధానాల్లో ప్రతి ఒక్కటీ యువతకు గరిష్ఠ ఉపాధి అవకాశాల సృష్టిపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులతో మరిన్ని ఉద్యోగ అవకాశాల కల్పనకు వీలుంటుంది. ఈ మేరకు రూ.76,000 కోట్లతో ‘వాడ్‌వణ్’ వంటి ఓడరేవు నిర్మాణంతో ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. వాణిజ్యం పెరిగి, రవాణా సదుపాయాల రంగం ఊపందుకున్నప్పుడు కూడా అపారంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
సోదరీసోదరులారా!
రాజకీయాలకు జాతీయ విధానాలే పునాదిగా ఉండాలన్నది ఆదినుంచీ మన నమ్మకం. అందువల్ల మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించే ప్రతి పైసా పౌర సౌలభ్యం, సామర్థ్యాన్ని పెంచే ఉపకరణమన్నది మా నిశ్చితాభిప్రాయం. అయితే, ప్రజా సంక్షేమం కన్నా తమ అధికారం, సౌలభ్యానికి మాత్రమే ప్రాధాన్యమిచ్చే రాజకీయ పక్షాలు కూడా దేశంలో ఉన్నాయి. అభివృద్ధి ప్రాజెక్టులకు అవరోధాలు సృష్టించే కొందరు అవినీతి, వంచనతో ప్రగతికి అడ్డుపడుతున్నారు. ఇలాంటి రాజకీయాల వల్ల దశాబ్దాలుగా మన దేశం ఎంతో నష్టపోయింది.
మిత్రులారా!
ఈ రోజు ప్రారంభించిన మెట్రో మార్గం కూడా ఒకనాటి అభివృద్ధి నిరోధకుల చర్యలను మనకు గుర్తుచేస్తుంది. ఎన్నో ఏళ్ల కిందట ఈ మార్గం నిర్మాణానికి శంకుస్థాపన చేసినపుడు నేను కూడా హాజరయ్యాను. ఈ ప్రాజెక్టుతో తమ దైనందిన ప్రయాణ కష్టాలు తీరుతాయనే ముంబయి నగర వాసుల ఆశ నాటినుంచీ తీరని కలగానే మిగిలింది. ఎందుకంటే- శంకుస్థాపన తర్వాత అధికారంలోకి వచ్చి, కొంతకాలం కొనసాగిన ప్రభుత్వం ఈ ప్రాజెక్టును స్తంభింపజేసింది. వారికి అధికారం దక్కింది కానీ, దేశం రూ.వేలాది కోట్లు నష్టపోవడమేగాక ప్రజలు ఏళ్ల తరబడి అసౌకర్యంతో సతమతం అయ్యారు. ఎట్టకేలకు ఈ మెట్రో మార్గం ప్రారంభంతో రెండు నుంచి రెండున్నర గంటలు పట్టే ప్రయాణం ఇకపై కేవలం 30-40 నిమిషాల్లో పూర్తవుతుంది. ముంబయి వంటి నగరంలో ప్రతి నిమిషం విలువైనదే కాబట్టి, మూడు నాలుగేళ్ల పాటు ఈ సౌకర్యం లేకుండా చేయడం ప్రజలకు తీరని అన్యాయం చేయడమే.
మిత్రులారా!
పౌర సదుపాయాల కల్పన, జనజీవన సౌలభ్యంపైనే గత 11 సంవత్సరాలుగా మేం దృష్టి సారించాం. తదనుగుణంగా రైలు మార్గాలు, రహదారులు, విమానాశ్రయాలు, మెట్రోల నిర్మాణం సహా ఎలక్ట్రిక్ బస్సుల వంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలలో మునుపెన్నడూ ఎరుగని రీతిలో పెట్టుబడులు పెట్టాం. అటల్ సేతు, తీరప్రాంత రహదారి వంటి అనేక ప్రాజెక్టులు కూడా నిర్మించాం.
మిత్రులారా!
మరోవైపు అన్ని రకాల రవాణా సదుపాయాల పరస్పర సంధానం దిశగానూ మేం కృషి చేస్తున్నాం. ఒక దాని నుంచి మరొక దానికి మారడంలో ప్రజలకు ఆటంకం కలగకుండా చూడటం కోసం “ఒకే దేశం- ఒకే చలనశీలత” దృక్కోణంతో ముందడుగు వేస్తున్నాం. ఇందులో భాగంగా ప్రస్తుతం ఇక్కడ ‘ముంబయి వన్’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చాం. కాబట్టి, నగరవాసులకు టికెట్ కోసం బారులు తీరే అవసరం ఉండదు. ఈ యాప్‌తో మీరు ఒకసారి టికెట్ కొనుగోలు చేస్తే- స్థానిక రైళ్లు, బస్సులు, మెట్రో లేదా టాక్సీలలో కూడా ఆటంకాలు లేకుండా ప్రయాణించవచ్చు.
మిత్రులారా!
ఈ నగరం దేశానికి ఆర్థిక రాజధాని మాత్రమే కాదు.. అత్యంత శక్తిమంతమైన మన నగరాల్లో ఒకటి. అందుకే, 2008లో ఉగ్రవాదులు అమానుష, విధ్వంస పూరిత దాడికి ముంబయిని ఎంచుకున్నారు. అయితే, ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు దాని బలహీనతను, ఉగ్రవాదానికి లొంగుబాటును సూచించే సందేశ వ్యాప్తికి దారితీశాయి. నాడు హోంశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు ఓ ఇంటర్వ్యూలో ఇటీవల కీలక అంశాలను వెల్లడించారు. దాని ప్రకారం- అప్పట్లో దేశ ప్రజానీకం యావత్తూ ఆకాంక్షిస్తున్న మేరకు పాకిస్థాన్‌పై దాడికి మన సాయుధ దళాలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. కానీ, మరొక దేశం ఒత్తిడి కారణంగా నాటి ప్రభుత్వం అంతటి సాహసం చేయలేకపోయింది. విదేశీ ఒత్తిడితో ఆ నిర్ణయం తీసుకున్నదెవరో, ముంబయి నగర.. దేశ ప్రజల మనోభావాలను ఎవరు దెబ్బతీశారో కాంగ్రెస్ ఇప్పుడైనా మనకు చెప్పాలి. ఆ సమాచారం తెలుసుకునే హక్కు దేశానికి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ బలహీనత వల్లనే జాతీయ భద్రత పలుచన కాగా, ఉగ్రవాదం మరింత బలపడింది. ఇందుకు మనం పలుమార్లు చెల్లించిన మూల్యమే పెద్ద సంఖ్యలో ప్రాణ, ఆస్తి నష్టాలు.
మిత్రులారా!
కానీ, దేశం, ప్రజల భద్రత కన్నా మాకు మరేదీ ప్రధానం కాదు... దేశంపై ఎలాంటి దాడి చేసినా నేటి భారత్ తగువిధంగా గుణపాఠం నేర్పుతుంది. శత్రువును వారి సొంత భూభాగంలోనే చావుదెబ్బ కొట్టగలదు. అందుకు నిదర్శనమే ఆపరేషన్ సిందూర్... ప్రపంచమంతా దీన్ని సగర్వంగా ఆమోదించింది.
మిత్రులారా!
పేదలు, నవ్య మధ్యతరగతి లేదా మధ్యతరగతి ప్రజలందరికీ సాధికారత కల్పనే నేటి జాతీయ ప్రాథమ్యం. ఈ కుటుంబాలన్నిటికీ సౌలభ్యం, గౌరవం లభిస్తే వారి సామర్థ్యం ఇనుమడించి, బలమైన పౌరులతో దేశం కూడా బలోపేతం కాగలదు. భావితరం జీఎస్‌టీ సంస్కరణలతో ధరల తగ్గుదల సహా ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. ఈ ఏడాది నవరాత్రి సందర్భంగా వస్తు విక్రయాల రికార్డులన్నీ బద్దలయ్యాయని మార్కెట్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజలు నేడు స్కూటర్లు, బైక్‌లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్‌ల వంటి గృహోపకరణాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు.
మిత్రులారా!
జనజీవనాన్ని మెరుగుపరిచే, దేశాన్ని బలోపేతం చేసే చర్యలను మా ప్రభుత్వం సదా కొనసాగిస్తుంది. అయితే, ఈ సందర్భంగా మీకందరికీ నాదొక విజ్ఞప్తి: స్థానిక ఉత్పత్తుల కొనుగోలుకు ప్రాధాన్యంతో “ఇది స్వదేశీ!” అని సగర్వంగా చాటండి. ఇది ప్రతి ఇంటి, ప్రతి మార్కెట్ మంత్రంగా మారాలి. పౌరులందరూ దేశంలో తయారైన దుస్తులు, పాదరక్షలు, ఇతరత్రా గృహోపకరణాలు కొనాలి. బహుమతులుగా ఇవ్వడానికి కూడా స్వదేశీ ఉత్పత్తులను ఎంచుకోవాలి... తద్వారా మన సొమ్ము మన దేశంలోనే ఉపయోగపడుతుంది. మన శ్రామికులకు పనితోపాటు యువతరానికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. యావద్దేశం స్వదేశీ మంత్రం పఠిస్తే, భారత్ ఎన్ని రెట్లు బలం పుంజుకోగలదో ఒకసారి ఊహించుకోండి!
మిత్రులారా!
దేశ ప్రగతికి సారథ్యంలో మహారాష్ట్ర ఎప్పుడూ ముందుంటుంది... రాష్ట్రంలోని ప్రతి నగరం, గ్రామం బలోపేతమయ్యేలా ఎన్‌డీఏ ద్వంద్వ సారథ్య ప్రభుత్వం అవిరళ కృషి చేస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇవాళ అనేక అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం కావడంపై మరోసారి మీకందరికీ హృదయపూర్వక అభినందనలు, ఉజ్వల భవిష్యత్తుపై శుభాకాంక్షలు తెలుపుతున్నాను. చివరగా- నాతో గళం కలిపి ‘భారత్ మాతా కీ జై!’ అంటూ నినదించండి... ఉత్సాహంతో రెండు చేతులూ పైకెత్తి ఈ విజయాన్ని ఆనందించండి!
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
అనేకానేక ధన్యవాదాలు.
***
(Release ID: 2176629)
|