ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కౌశల్ దీక్షాంత్ సమరోహ్ సందర్భంగా యువతనుద్దేశించిన అబివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 04 OCT 2025 2:24PM by PIB Hyderabad

గౌరవనీయులు, జనాదరణ గల బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్ గారు, నా మంత్రివర్గ సహచరులు శ్రీ జుయెల్ ఓరం గారు, శ్రీ రాజీవ్ రంజన్ గారు, శ్రీ జయంత్ చౌదరి గారు, శ్రీ సుకాంత మజుందార్ గారు, బీహార్ ఉప ముఖ్యమంత్రి శ్రీ సామ్రాట్ చౌదరి గారు, శ్రీ విజయ్ కుమార్ సిన్హా గారు, బీహార్ ప్రభుత్వ మంత్రులు, నా పార్లమెంటరీ సహచరులు శ్రీ సంజయ్ ఝా గారు, ఇతర ప్రజా ప్రతినిధులు, దేశవ్యాప్త పారిశ్రామిక శిక్షణా సంస్థలకు చెందిన లక్షలాది మంది విద్యార్థులు, బీహార్‌లోని విద్యార్థులు, ఉపాధ్యాయులూ, సోదరీ సోదరులారా!
కొద్ది సంవత్సరాల కిందటే మా ప్రభుత్వం ఐటీఐ విద్యార్థుల కోసం పెద్ద ఎత్తున స్నాతకోత్సవ వేడుకలు నిర్వహించే కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించింది. ఈ గర్వించదగ్గ సంప్రదాయంలో ఈ రోజు మనం మరో అధ్యాయాన్ని చూస్తున్నాం. దేశంలోని ప్రతి మూల నుంచి మాతో అనుసంధానమైన యువ ఐటీఐ శిక్షణార్థులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.


నా మిత్రులారా,


నైపుణ్యానికి నవ భారత్ ఇచ్చే ప్రాధాన్యాన్ని నేటి వేడుక సూచిస్తుంది. ఈ ముఖ్యమైన సందర్భంలో మన దేశ యువత విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం కొత్తగా రెండు కీలక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ స్నాతకోత్సవాన్ని నిర్వహించడం వెనక ఉన్న ఆలోచన ఏమిటంటే.. మనం శ్రమకు గౌరవం ఇవ్వకపోతే, నైపుణ్యం-సామర్థ్యంతో పనిచేసే వారికి ప్రజా జీవితంలో నిజంగా దక్కాల్సిన గౌరవం ఎప్పటికీ లభించదు. ఆ గౌరవం లేకుండా వారు బలహీనపడినట్లు భావించవచ్చు.. అందుకే దానిని మార్చడానికి ప్రయత్నిస్తున్నాం.
ఇది మన సమష్టి తత్వాన్ని మరింత సానుకూల శక్తిగా మార్చే లక్ష్యంతో చేపట్టిన ఉద్యమం. మనం 'శ్రమయేవ జయతే'.. 'శ్రమయేవ పూజ్యతే' అని గర్వంగా చెప్పుకుంటాం. ఈ స్ఫూర్తితోనే దేశవ్యాప్త ఐటీఐ శిక్షణార్థుల్లో విశ్వాసాన్ని కలిగించాలని మేం కోరుకుంటున్నాం. వారు వేరే ఎంపికలు లేకపోవడం వల్ల ఇక్కడకు రాలేదు.. ఇది వారి ఉజ్వల భవిష్యత్తుకు మార్గమని భావించడం వల్లే వచ్చారు. జాతి నిర్మాణంలో నైపుణ్యం కీలక పాత్ర పోషిస్తుంది. ఐటీఐ కుటుంబానికి సంబంధించిన అందరినీ నేను అత్యంత గౌరవంతో అభినందిస్తున్నాను.
ఈ రోజు మరో రెండు ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి సేతు పథకం కింద రూ. 60,000 కోట్ల కేటాయింపులతో మన ఐటీఐలు ఇప్పుడు పరిశ్రమలతో ప్రత్యక్షంగా, మరింత బలంగా అనుసంధానమవుతాయి. దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాలు, ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో 1,200 నైపుణ్య ప్రయోగశాలలూ ఈ రోజు ప్రారంభమయ్యాయి.


మిత్రులారా


ఈ కార్యక్రమం గురించి మొదట అనుకున్న దాని ప్రకారం.. ఈ స్నాతకోత్సవ వేడుకను ఇక్కడ విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించాలనేది అసలు ప్రణాళిక. అయితే 'సోనే పే సుహాగ' లేదా 'ఐసింగ్ ఆన్ ది కేక్' అనే సామెతల్లో చెప్పినట్లుగా ఇప్పుడు మరింత శుభప్రదమైన విషయం జరిగింది. శ్రీ నితీష్ కుమార్ జీ నాయకత్వంలో ఈ వేడుకను ఒక గొప్ప పండగలా మార్చాలనే ఆలోచన వచ్చింది. భారత ప్రభుత్వం నిర్వహించిన ఐటీఐ స్నాతకోత్సవం.. బీహార్‌లోని అనేక అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల సంగమంగా ఈ కార్యక్రమం మారింది.
ఈ వేదిక నుంచే బీహార్ యువతకు అనేక కొత్త పథకాలు, ప్రాజెక్టులు అంకితం చేశాం. బీహార్‌లో కొత్త స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో సౌకర్యాల విస్తరణ, యువత సాధికారత కోసం యువజన కమిషన్ ఏర్పాటు, ప్రభుత్వ ఉద్యోగాలను పొందిన వేలాది మంది యువతకు నియామక లేఖల పంపిణీ వంటి కార్యక్రమాలు ఇందులో భాగంగా ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ బీహార్ యువత కోసం ఉజ్వలమైన, మరింత సంపన్నమైన భవిష్యత్తుకు భరోసానిస్తున్నాయి.


మిత్రులారా,


కొద్ది రోజుల కిందటే బీహార్ మహిళల ఉపాధి, సాధికారత లక్ష్యంగా నిర్వహించిన ఒక గొప్ప కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నాకు లభించింది. ఆ కార్యక్రమంలో లక్షలాది మంది సోదరీమణులు పాల్గొన్నారు. నేటి సందర్భం బీహార్ యువత సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక మెగా కార్యక్రమం. ఈ రెండు కార్యక్రమాలు బీహార్ యువత, మహిళల అభివృద్ధీ, సాధికారతకు ఎన్‌డీఏ ప్రభుత్వం ఇస్తున్న అత్యంత ప్రాధాన్యాన్ని తెలియజేస్తాయి.


మిత్రులారా


భారత్ జ్ఞానం-నైపుణ్యాలకు నిలయం. ఈ మేధో బలమే మన గొప్ప ఆస్తి. జ్ఞానం-నైపుణ్యం దేశ అవసరాలకు అనుగుణంగా ఉన్నప్పుడు.. దేశ అవసరాలను తీర్చడం కోసం అంకితమైనప్పుడు.. వాటి శక్తి అనేక రెట్లు పెరుగుతుంది. ఇరవై ఒకటో శతాబ్దం దేశ అవసరాలకు అనుగుణంగా స్థానిక ప్రతిభ.. స్థానిక వనరులు.. స్థానిక నైపుణ్యాలు.. స్థానిక జ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ ప్రక్రియలో వేలాది ఐటీఐలు కీలక పాత్ర పోషిస్తాయి.
ప్రస్తుతం ఈ ఐటీఐలలో దాదాపు 170 ట్రేడ్‌లలో శిక్షణనిస్తున్నారు. గత పదకొండు సంవత్సరాల్లో వివిధ రంగాల సాంకేతిక అర్హతలతో అనుసంధానిస్తూ 1.5 కోట్లకు పైగా యువతీ యువకులకు ఈ ట్రేడ్‌లలో శిక్షణ అందించారు. అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే.. ఈ నైపుణ్యాలను యువతకు వారి స్థానిక భాషల్లో నేర్పిస్తున్నారు.. తద్వారా అభ్యాసం సులభంగా, సంబంధితంగా ఉంటోంది. ఈ సంవత్సరం కూడా పది లక్షలకు పైగా విద్యార్థులు ఆల్-ఇండియా ట్రేడ్ టెస్ట్‌కు హాజరయ్యారు. ఈ రోజు వారిలో 45 మందికి పైగా టాపర్లను సత్కరించే భాగ్యమూ నాకు లభించింది.


మిత్రులారా

ఈ విజయవంతమైన శిక్షణార్థుల్లో చాలా మంది మన దేశంలోని మారుమూల ప్రాంతాలు, గ్రామీణ భారతం నుంచి వచ్చిన వారే కావడం నాకు చాలా గర్వకారణం. వారిని చూస్తుంటే మన ముందు ఒక చిన్న భారతం కూర్చున్నట్లు అనిపిస్తుంది. వారిలో మన కుమార్తెలు, దివ్యాంగులైన సహచరులు ఉన్నారు.. వీరంతా తమ సంపూర్ణ కృషి, దృఢ సంకల్పం ద్వారానే ఈ విజయం సాధించారు.


మిత్రులారా


మన ఐటీఐలు పారిశ్రామిక విద్యకు అద్భుతమైన సంస్థలు మాత్రమే కాదు.. ఆత్మనిర్భర్ భారత్ సాకారం కోసం కార్యస్థలాలు కూడా. అందువల్లే వాటి సంఖ్యను పెంచడంపై దృష్టి సారించడంతో పాటుగా వాటి నాణ్యతనూ నిరంతరం మెరుగుపరచడానికీ మేం కట్టుబడి ఉన్నాం. 2014 వరకు భారత్‌లో దాదాపు 10,000 ఐటీఐలు ఉన్నాయి. గత దశాబ్దంలోనే దేశవ్యాప్తంగా దాదాపు 5,000 కొత్త ఐటీఐలు ఏర్పాటయ్యాయి. మరో మాటలో చెప్పాలంటే స్వాతంత్య్రానంతరం ఆరు దశాబ్ధాల్లో 10,000ల ఐటీఐలు ఏర్పాటైతే.. గత పదేళ్లలోనే మా ప్రభుత్వం కొత్తగా మరో 5,000ల ఐటీఐలను ఏర్పాటు చేసింది. పరిశ్రమల ప్రస్తుత-భవిష్యత్ నైపుణ్య డిమాండ్లను తీర్చడానికి మన పారిశ్రామిక శిక్షణా సంస్థల నెట్‌వర్క సిద్ధమవుతోంది. పరిశ్రమకు నేడు ఎలాంటి నైపుణ్యాలు అవసరం.. పదేళ్ల తర్వాత ఏమి అవసరం.. అనే ప్రశ్నలు మా ప్రణాళికకు మార్గనిర్దేశం చేస్తున్నాయి. అందుకే పరిశ్రమలు-ఐటీఐల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసేందుకు కృషి జరుగుతోంది.
ఈ దిశలో ప్రధానమంత్రి సేతు పథకాన్ని ప్రారంభించడం ద్వారా మనం ఈ రోజు మరో కీలక ముందడుగు వేశాం. దేశవ్యాప్తంగా 1,000కి పైగా ఐటీఐ సంస్థలు దీని ద్వారా ప్రయోజనం పొందుతాయి. ఈ పథకం ద్వారా ఐటీఐలు కొత్త, ఆధునిక యంత్రాలతో అప్‌గ్రేడ్ అవుతాయి. వివిధ పరిశ్రమలకు చెందిన శిక్షణ నిపుణులు ఈ సంస్థలకు వస్తారు. ప్రస్తుత-భవిష్యత్ మార్కెట్ డిమాండ్లకు అనుగుణంగా పాఠ్యాంశాలను నవీకరిస్తున్నాం. ఒక విధంగా ప్రధానమంత్రి సేతు పథకం భారత యువతను ప్రపంచ నైపుణ్య డిమాండ్లతో అనుసంధానించే వారధిగా పనిచేస్తుంది.


నా యువ మిత్రులారా,


ఇటీవలి కాలంలో భారత్ వివిధ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్న సందర్భాల్లో.. వారు ఆశించే సహకారంలో ప్రధాన అవసరం మన దేశానికి చెందిన నైపుణ్యం గల సిబ్బంది అనే విషయం మీరు గమనించే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు మన యువతరం ప్రతిభనూ, నైపుణ్యాన్ని గుర్తిస్తుండటంతోనే భారత యువతకు కొత్తగా అనేక ప్రపంచస్థాయి అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి.


మిత్రులారా


బీహార్ నుంచీ వేలాది మంది యువత ఈ కార్యక్రమం ద్వారా మాతో అనుసంధానమయ్యారు. రెండూ-రెండున్నర దశాబ్దాల కిందట బీహార్ విద్యావ్యవస్థ స్థితి ఈ తరానికి పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు. పాఠశాలలు అరుదుగా తెరిచేవారు.. ఉపాధ్యాయుల నియామకం ఊసే లేదు. తమ పిల్లలు తమ సొంత రాష్ట్రంలో చదువుకుని అభివృద్ధి చెందాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు? అయినప్పటికీ నాటి పరిస్థితుల కారణంగా లక్షలాది మంది పిల్లలు విద్య కోసం బీహార్‌ను వదిలి బనారస్, ఢిల్లీ, ముంబయి వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చింది. అదే బీహార్ యువత వలసలకు నిజమైన ప్రారంభంగా మారింది.


మిత్రులారా


ఒక చెట్టు వేర్లకు తెగులు సోకినప్పుడు దానికి తిరిగి జీవం పోయడానికి అపారమైన కృషి అవసరం. ఆర్జేడీ ప్రభుత్వ దుష్ప్రవర్తన బీహార్‌ను సరిగ్గా అలాంటి స్థితిలోకి నెట్టింది. అదృష్టవశాత్తూ బీహార్ ప్రజలు శ్రీ నితీష్ కుమార్ జీకి పాలనా బాధ్యతను అప్పగించారు. రాష్ట్రంలో పట్టాలు తప్పిన వ్యవస్థలను తిరిగి గాడినపెట్టడానికి మొత్తం ఎన్‌డీఏ బృందం ఐక్యంగా కృషి చేసిన తీరు మనమంతా చూశాం. నేటి కార్యక్రమం ఆ పరివర్తన గురించిన అవలోకనాన్ని అందిస్తుంది.


మిత్రులారా


ఈ నైపుణ్య స్నాతకోత్సవ సందర్భంలో బీహార్ కొత్త స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటనే దీవెనను పొందడం నాకు చాలా ఆనందంగా ఉంది. శ్రీ నితీష్ కుమార్ జీ నాయకత్వంలో బీహార్ ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయానికి భారతరత్న, జన్ నాయక్ కర్పూరి ఠాకూర్ జీ పేరు పెట్టింది. ట్రోలింగ్‌లో నిమగ్నమైన ఏ సోషల్ మీడియా బృందం కూడా కర్పూరి ఠాకూర్ గారికి జన జన్ నాయక్, పీపుల్స్ లీడర్ వంటి బిరుదును ఇవ్వలేదు. ఆయన సేవ, త్యాగమయ జీవితాన్ని చూసిన బీహార్‌లోని ప్రతి పౌరుడి ప్రేమాభిమానాల ద్వారానే ఆయన ఈ గౌరవాన్ని పొందారు. దయచేసి అప్రమత్తంగా ఉండండి అని బీహార్ ప్రజలకు నేను చెప్పాలనుకుంటున్నాను. జన్ నాయక్ అనే బిరుదు కర్పూరి ఠాకూర్ గారికి చెందినది. అయితే ఈ రోజుల్లో కొందరు ఆ గౌరవాన్నీ సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజలు ఆయనకిచ్చిన ఈ గుర్తింపును ఎవరూ దొంగిలించకుండా చూసుకోవాలని నేను బీహార్ ప్రజలను కోరుతున్నాను. భారతరత్న కర్పూరి ఠాకూర్ జీ తన జీవితాన్ని సమాజ సేవకు, విద్యా వ్యాప్తికి అంకితం చేశారు. సమాజంలోని అత్యంత బలహీనమైన వ్యక్తి కూడా పురోగతి సాధించడానికి వీలు కల్పించాలని ఆయన నిరంతరం చెబుతుండేవారు. ఆయన గౌరవార్థం పెట్టిన పేరుతో ఈ స్కిల్ యూనివర్సిటీ ఆ కలను సాకారం చేసుకోవడానికి ఒక శక్తిమంతమైన మాధ్యమంగా మారుతుంది.

 

మిత్రులారా


బీహార్ విద్యా సంస్థలను ఆధునికీకరించడానికి ఎన్‌డీఏ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఐఐటీ పాట్నాలో మౌలిక సదుపాయాల విస్తరణ ఇప్పటికే ప్రారంభమైంది. బీహార్ అంతటా అనేక ప్రధాన విద్యా సంస్థల ఆధునికీకరణ ప్రక్రియను ఈ రోజు ప్రారంభించుకున్నాం. ఎన్ఐటీ పాట్నా బిహ్తా క్యాంపస్ ఇప్పుడు మన ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం అందుబాటులో ఉంది. పాట్నా విశ్వవిద్యాలయం, భూపేంద్ర మండల్ విశ్వవిద్యాలయం, చాప్రాలోని జై ప్రకాష్ విశ్వవిద్యాలయం, నలంద ఓపెన్ విశ్వవిద్యాలయంలోనూ కొత్త విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రారంభమైంది.


మిత్రులారా


మంచి సంస్థలను అభివృద్ధి చేయడంతో పాటుగా శ్రీ నితీష్ కుమార్ జీ నేతృత్వంలోని ప్రభుత్వం బీహార్ యువతపై విద్యాపరమైన ఆర్థిక భారాన్ని కూడా తగ్గిస్తోంది. ఉన్నత విద్యకు ఫీజు చెల్లించడంలో విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ పథకం ద్వారా బీహార్ ప్రభుత్వం విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి సహాయం చేస్తోంది. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ పథకం కింద అందించే విద్యా రుణాలను వడ్డీ లేకుండా అందించాలని మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు అందించే స్కాలర్‌షిప్‌లనూ రూ. 1,800 నుంచి రూ. 3,600కి పెంచారు.


మిత్రులారా


ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా గల దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది.. బీహార్ కూడా జనాభాలో అత్యధిక యువత నిష్పత్తి కలిగిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. అందుకే బీహార్ యువత సామర్థ్యం పెరిగినప్పుడు అది సహజంగానే మొత్తం దేశం బలాన్నీ పెంచుతుంది. బీహార్ యువతరం సామర్థ్యాలను మరింత పెంచడానికి ఎన్‌డీఏ ప్రభుత్వం పూర్తి అంకితభావంతో పనిచేస్తోంది. ఆర్జేడీ-కాంగ్రెస్ పాలన కాలంతో పోలిస్తే ప్రస్తుత బీహార్ విద్యా బడ్జెట్ చాలా రెట్లు పెరిగింది. బీహార్‌లోని దాదాపు ప్రతి గ్రామం, కుగ్రామంలోనూ ఇప్పుడు పాఠశాల ఉంది. ఇంజనీరింగ్, వైద్య కళాశాలల సంఖ్య కూడా అనేక రెట్లు పెరిగింది. ఇటీవలే బీహార్‌లోని 19 జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒకప్పుడు బీహార్‌లో క్రీడలకు అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులో లేని కాలం ఉండేది. ప్రస్తుతం బీహార్‌లోనే జాతీయ, అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


మిత్రులారా


గత రెండు దశాబ్దాలుగా బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలో 50 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించింది. గడిచిన కొన్ని సంవత్సరాల్లోనే బీహార్ యువతలో దాదాపు పది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. ఉదాహరణకు విద్యా శాఖను తీసుకుంటే.. ఉపాధ్యాయుల నియామకం అపూర్వమైన స్థాయిలో జరిగింది. గత రెండు సంవత్సరాల్లోనే బీహార్‌లో రెండున్నర లక్షలకు పైగా ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి. ఇది యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా రాష్ట్ర విద్యా వ్యవస్థ నాణ్యతనూ పెంచింది.


మిత్రులారా


బీహార్ ప్రభుత్వం ఇప్పుడు మరింత గొప్ప లక్ష్యాల కోసం కృషి చేస్తోంది. శ్రీ నితీష్ కుమార్ జీ తన ప్రసంగంలో చెప్పినట్లుగా.. గత ఇరవై సంవత్సరాల్లో అందించిన ఉద్యోగాల కంటే రాబోయే ఐదు సంవత్సరాల్లో రెట్టింపు ఉద్యోగాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బీహార్ యువత బీహార్‌లోనే ఉపాధిని పొందాలనీ.. వారి మాతృభూమిలోనే వారికి ఉపాధి, పురోగతికి అవకాశాలు అందుబాటులో ఉండాలని బలంగా కోరుకుంటున్నారు.


మిత్రులారా


ఇది బీహార్ యువతకు డబుల్ బోనస్ సమయం కూడా. ప్రస్తుతం దేశం మొత్తం జీఎస్టీ పొదుపు పండగను జరుపుకుంటోంది. మోటార్ సైకిళ్ళు, స్కూటర్లపై జీఎస్టీ తగ్గించడం బీహార్ యువతకు ఎంతో ఆనందం కలిగించిందని ఎవరో నాతో చెప్పారు. ఈ ధంతేరాస్ సందర్భంగా చాలా మంది వాటిని కొనుగోలు చేయాలనీ ప్లాన్ చేసుకున్నారు. బీహార్ యువతకూ, మొత్తం దేశానికీ అవసరమైన చాలా వస్తువులపై జీఎస్టీ తగ్గింపు సందర్భంలో నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.


మిత్రులారా


నైపుణ్యాలు అభివృద్ధి చెందినప్పుడు దేశం స్వయం-సమృద్ధి సాధిస్తుంది.. ఎగుమతులూ పెరుగుతాయి.. ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయి. 2014కి ముందు వృద్ధి నెమ్మదిగా.. ఉపాధి కల్పన బలహీనంగా ఉండడంతో భారత్ ఫ్రాగైల్ ఫైవ్ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉండిపోయింది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోని టాప్ 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచే దిశగా పురోగమిస్తోంది. ఇది తయారీ, ఉపాధి కల్పనలో వృద్ధిని సూచిస్తుంది. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, రక్షణ రంగ పరికరాల తయారీ, ఎగుమతుల్లో అపూర్వమైన వృద్ధి ఉంది. పెద్ద పరిశ్రమల నుంచి మన ఎమ్ఎస్ఎమ్ఈల వరకు అన్ని రంగాల్లో అద్భుతమైన ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. మన యువతకు, ముఖ్యంగా ఐటీఐల నుంచి నైపుణ్యంతో కూడిన శిక్షణ పొందినవారికి ఈ పరిణామాలన్నీ ఎంతో ప్రయోజనం చేకూర్చాయి. ముద్రా పథకం కూడా కోట్లాది మంది యువత తమ సొంత సంస్థలను ప్రారంభించడానికి సాధికారత కల్పించింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల కేటాయింపులతో పీఎమ్ వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజనను ప్రారంభించింది. సుమారు 3.5 కోట్ల మంది భారత యువత ప్రైవేట్ రంగంలో ఉపాధిని పొందడంలో ఈ కార్యక్రమం సహాయపడుతుంది.


మిత్రులారా,


దేశంలోని యువతకు ఇది అవకాశాలతో నిండిన సమయం. జీవితంలో అనేక విషయాలకు ప్రత్యామ్నాయాలు ఉండవచ్చు కానీ నైపుణ్యం, ఆవిష్కరణ, కృషికి ప్రత్యామ్నాయం లేదు. ఈ లక్షణాలన్నీ భారత యువతలో కనిపిస్తాయి. మీ సమష్టి బలమే వికసిత్ భారత్‌కు చోదక శక్తిగా మారుతుంది. ఈ దృఢ నమ్మకంతో.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఐటీఐ శిక్షణార్థులు ఈ రోజు నాతో అనుసంధానమై ఉన్న సందర్భంలో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన అనేక కొత్త కానుకలు, కార్యక్రమాల కోసం బీహార్ యువతకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు..

ధన్యవాదాలు....

 

****


(Release ID: 2175010) Visitor Counter : 5