ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బీహార్‌లో ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ను వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 26 SEP 2025 2:38PM by PIB Hyderabad

ప్రజలందరికీ శుభాకాంక్షలు!

ఈ నవరాత్రి పర్వదిన సమయాన ఇవాళ బీహార్ రాష్ట్ర నారీశక్తి ఆనందంలో పాలుపంచుకునే అదృష్టం నాకు దక్కింది. ఇక్కడ టీవీ తెరపై లక్షలాదిగా తల్లులు..చెల్లెమ్మలు నాకు కనిపిస్తున్నారు. ఈ పండుగ వేళ మీ ఆశీస్సులే మాకు ఎనలేని ఉత్సాహాన్నిస్తాయి. ఇందుకుగాను మీకందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నాను. రాష్ట్రంలో “ముఖ్యమంత్రి మహిళా ఉపాధి పథకం” నేటి నుంచి అమలులోకి వచ్చింది. నాకు లభించిన సమాచారం ప్రకారం... ఇప్పటికే 75 లక్షల మంది అక్కచెల్లెళ్లు ఈ పథకంలో చేరగా, ఇప్పుడు వారందరి బ్యాంకు ఖాతాలకు ఏకకాలంలో తలా రూ.10,000 వంతున నగదు జమ చేశారు.

మిత్రులారా!

ఈ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో నా ఆలోచన రెండు అంశాలపై కేంద్రీకృతమైంది. మొదటిది... శ్రీ నితీష్ నేతృత్వంలోని బీహార్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని అక్కచెల్లెళ్లకు ప్రయోజనం కల్పిస్తూ కీలక చర్యలు చేపట్టింది. ఒక సోదరి లేదా కుమార్తె ఉపాధి లేదా స్వయం ఉపాధి పొందినప్పుడు వారి కలలు కొత్త రెక్కలు తొడుక్కుంటాయి... సమాజంలో వారికి గౌరవం కూడా పెరుగుతుంది. ఇక రెండో అంశం... మీరు 11 ఏళ్ల కిందట నన్ను ‘ప్రధాన సేవకుడు’గా ఎంచుకున్నారు. అప్పుడు జన్‌ధన్‌ పథకంపై మేం ప్రతినబూని ఉండకపోతే... 30 కోట్ల మందికిపైగా అక్కచెల్లెళ్లు బ్యాంకు ఖాతాలు తెరిచి ఉండకపోతే.. ఈ ఖాతాలను మీ మొబైల్-ఆధార్‌తో అనుసంధానించి ఉండకపోతే, ఈ రోజున మీ ఖాతాలకు నేరుగా ఇంత డబ్బు పంపగలిగే వాళ్లం కాదు. కచ్చితంగా ఇది సాధ్యమయ్యేది కాదు! గతంలో ఒక పార్టీ పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా ఏలినపుడు ప్రజాధనం స్వాహా గురించి సాక్షాత్తూ ప్రధానమంత్రే వ్యాఖ్యానించారు. తాము ఢిల్లీ నుంచి ఒక రూపాయి విడుదల చేస్తే, ప్రజలకు చేరుతున్నది కేవలం 15 పైసలు మాత్రమేనని స్వయంగా వెల్లడించారు. మిగిలిన 85 పైసలు దళారుల ‘హస్త’గతం అయ్యేవని కూడా ఆయన చెప్పారు. కానీ, ఈ రోజున మేం పంపిన డబ్బు (రూ.10వేలు) పూర్తిగా మీ ఖాతాలో జమ అవుతుంది. ఎవరూ ఒక్క పైసా కూడా స్వాహా చేయలేరు... మరి ఇంతకుముందు దళారులు ఎంతగా దోచుకున్నారో... మీకెంతటి అన్యాయం చేశారో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.

మిత్రులారా!

ఒక సహోదరి ఆనందంగా, ఆరోగ్యంగా ఉండటం కోసం ఒక సోదరుడు శక్తివంచన లేకుండా శ్రమించగలడు. ఆమె కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటే ఎంతో సంతోషిస్తాడు. అయితే, ఇప్పుడు మీ సౌభాగ్యం, ఆత్మగౌరవం దిశగా మీ సేవలో ఇద్దరు సోదరులు... నరేంద్ర, నితీష్ కలసికట్టుగా కృషి చేస్తున్నారు. నేటి కార్యక్రమమే ఇందుకు తిరుగులేని నిదర్శనం.

అమ్మలు.. చెల్లెమ్మల్లారా!

ఈ పథకం గురించి విన్నపుడు, అందులోని దూరదృష్టి నన్నెంతో ఆకట్టుకుంది. ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళకు దీనిద్వారా కచ్చితంగా లబ్ధి చేకూరుతుంది. ఆరంభ సాయంగా అందే రూ.10,000 సొమ్మును స్వయం ఉపాధికి.. వీలైతే మరికొందరికి ఉపాధినిచ్చేందుకు సద్వినియోగం చేస్తే మరింత ప్రోత్సాహం లభిస్తుంది. అంటే- ఏదైనా వ్యాపారం ప్రారంభించడం లేదా తమ చేతివృత్తి పరిధిని విస్తరించడం వంటివి విజయవంతంగా కొనసాగిస్తే రూ.2 లక్షల దాకా అదనపు ఆర్థిక సహాయం అందుతుంది. ఇలా లభించే ఆర్థిక సహాయాన్ని కార్పొరేట్‌ ప్రపంచంలో ‘బీజ ధనం’ (సీడ్ మనీ) అంటారు. కాబట్టి, దీని గురించి మీరంతా బాగా ఆలోచించండి... ఇది మీకు అందుబాటులోకి రావడం ఎంత కీలక విజయమో గుర్తించండి. ఈ పథకం చేయూతతో బీహార్‌లోని అక్కచెల్లెళ్లు కిరాణా, వంట పాత్రలు, సౌందర్య సాధనాలు, బొమ్మలు, స్టేషనరీ వంటి చిన్న దుకాణాల రూపంలో సొంత వ్యాపారం ప్రారంభించగలరు. అంతేకాకుండా ఆవులు, గొర్రెలు, మేకలు, కోళ్లు, చేపల పెంపకం వంటి కార్యకలాపాలు చేపట్టవచ్చు. అయితే, ఇలాంటి అనేక వ్యాపారాలలో ముందంజ వేయాలంటే కొంత శిక్షణ కూడా అవసరం. ఈ నేపథ్యంలో మీకు డబ్బు మాత్రమే అందిందని, దీనితో ఇదంతా ఎలా చేయగలమని మీరు ఆందోళన పడవచ్చు. అయితే, మీరు ఏ పని.. ఎలా చేయాలో శిక్షణ కూడా ఇస్తారు. ఇందుకోసం ‘జీవిక’ స్వయం సహాయ సంఘం వంటి అద్భుత, సుస్థిర వ్యవస్థ కింద బీహార్‌లో ఇప్పటికే దాదాపు 11 లక్షల బృందాలు కృషి చేస్తున్నాయి. ఈ నెల మొదట్లోనే ‘జీవికా నిధి సఖ్ సహకారి సంఘ్’ (క్రెడిట్ కో-ఆపరేటివ్ యూనియన్)ను కూడా ప్రారంభించే అవకాశం నాకు లభించింది. ఇకపై ఈ వ్యవస్థ బలం ‘ముఖ్యమంతి మహిళా ఉపాధి పథకంతో ముడిపడి ఉంటుంది. అంటే- ఈ పథకం బీహార్ రాష్ట్రంలో నలుమూలలా, ప్రతి కుటుంబ స్థాయిలో ప్రభావశీల పాత్ర పోషిస్తుంది.

మిత్రులారా!

ఈ పథకం ‘లక్షాధికారి సోదరి’ (లఖ్‌పతి దీదీ) కార్యక్రమానికీ నవ్యోత్తేజమిచ్చింది. దేశంలో 3 కోట్ల మందిని ‘లక్షాధికారి సోదరి’గా తీర్చిదిద్దాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే 2 కోట్ల మందికి పైగా లక్షాధికారులయ్యారు. నేనిప్పుడు చెబుతున్నది గ్రామీణ మహిళల గురించే... వారి కృషితో కుటుంబాలు, గ్రామాలు సహా సమాజమే మారిపోయింది. ఈ విధంగా లక్షాధికారులైన మహిళలు బీహార్‌లోనూ ఎందరో ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని రెండు ఇంజిన్ల ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్న తీరు చూస్తే- దేశంలో ‘లక్షాధికారి సోదరి’ స్థాయి సాధించిన వారి సంఖ్య బీహార్‌లోనే ఎక్కువగా నమోదయ్యే రోజు ఎంతో దూరం లేదని నా గట్టి నమ్మకం.

మిత్రులారా!

మరోవైపు ఉపాధి, స్వయం ఉపాధిని పెంచే ‘ముద్ర’ యోజనతోపాటు ‘డ్రోన్ సోదరి, బీమా సోదరి, బ్యాంకు సోదరి’ వంటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు కూడా అమలులో ఉన్నాయి. మేమివాళ ఒకే ఒక లక్ష్యంతో ముందడుగు వేస్తున్నాం... అదేమిటంటే- మీ కలలు ఫలించేలా మీకు మరిన్ని అవకాశాలు అందిరావాలి... మీ కుటుంబం-పిల్లల ఉజ్వల భవిష్యత్తుపై మీ స్వప్నాలు సాకారం చేయగల గరిష్ఠ  అవకాశాలు లభించాలన్నదే!

మిత్రులారా!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషితో అక్కచెల్లెళ్లందరికీ ఇవాళ కొత్త రంగాల్లో అవకాశాలు లభిస్తున్నాయి. మన కుటుంబాల ఆడపిల్లలు సైన్యంలో, పోలీసు శాఖలో పెద్ద సంఖ్యలోనే చేరుతున్నారు. ఏకంగా కదనరంగంలో యుద్ధవిమానాలను కూడా వారు నడుపుతుండటం మనందరికీ గర్వకారణం.

అయితే, మిత్రులారా!

బీహార్‌లో ఆర్జేడీ లాంతరు బుడ్డీ ప్రభుత్వ పాలన కాలాన్ని మనం ఎన్నటికీ మరచిపోలేం. అప్పట్లో ఈ రాష్ట్రంలోని తల్లులు, అక్కచెల్లెళ్లు ఎంతటి అరాచకం, అవినీతిని భరించాల్సి వచ్చిందో నాకన్నా మీకే బాగా తెలుసు. రాష్ట్రంలోని ప్రధాన రహదారులు శిథిలావస్థలో ఉండేవి... నదులు, కాలువలపై వంతెనలు ఉండేవి కావు. వాటి వల్ల ఎక్కువగా బాధపడిందీ, ఇబ్బందులు తలెత్తినప్పుడు అగచాట్లు పడేదీ కూడా మన తల్లులు, అక్కచెల్లెళ్లేనన్నది మనందరికీ తెలిసిన నిజం. ఇక వరదల సమయంలో పరిస్థితులు ఎంత దిగజారాయో కూడా మనకు తెలుసు. గర్భిణులు సకాలంలో ఆస్పత్రికి చేరుకునే పరిస్థితి ఉండేది కాదు. ప్రాణాపాయ స్థితిలో వారికి సకాలంలో, సరైన చికిత్స లభించని రోజులవి. వారి నుంచి వారసత్వంగా వచ్చిన ఈ సంక్లిష్ట పరిస్థితులను సరిదిద్దడానికి మా ప్రభుత్వం రాత్రింబవళ్లు శ్రమించింది. ఇప్పటికీ పీడిస్తున్న ఆనాటి సమస్యల నుంచి మీరంతా విముక్తులు కావాలన్న ఆకాంక్ష మేరకు మేమెంతో కృషి చేశాం. ముఖ్యంగా రెండు ఇంజిన్ల ప్రభుత్వం వచ్చాక బీహార్‌లో రహదారుల నిర్మాణం మొదలు కావడం మీరు చూశారు. అనుసంధానం మెరుగుదలలో మేమెంతో కృషి చేశాం కాబట్టే, నేడు రాష్ట్ర మహిళలకు ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.

అమ్మలు..చెల్లెమ్మల్లారా!

బీహార్‌లో ఇప్పడు ఒక ప్రదర్శన నిర్వహిస్తున్నారు... దీన్ని కచ్చితంగా సందర్శించాలని 30 ఏళ్లలోపు యువతరానికి.. ముఖ్యంగా యువతులకు నేను సూచిస్తున్నాను. ఈ ప్రదర్శనలో భాగంగా రాష్ట్రంలో ఒకనాటి దుస్థితిపై పాత వార్తాపత్రికల పతాక శీర్షికలను ప్రదర్శిస్తున్నారు. వాటిని ఒకసారి చదివితే, అప్పట్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో యువతకు అర్థం కాకపోవచ్చుగానీ, వారికన్నా పెద్దవాళ్లకు ఆ బాధలు ఎలాంటివో తక్షణం గుర్తుకొస్తాయి. ఆర్జేడీ ప్రభుత్వ హయాంలో భయాందోళనలు ఎలా రాజ్యమేలాయో వారి మదిలో మెదలుతుంది. ఆనాడు ఒక్క కుటుంబానికీ భద్రత ఉండేది కాదు... నక్సలైట్ల బీభత్సానికి అంతు ఉండేది కాదు. ప్రధానంగా మహిళలు పడిన బాధలు అన్నీ ఇన్నీ కావు. పేదల నుంచి వైద్యులు.. ఐఏఎస్‌ అధికారుల దాకా ఆర్జేడీ నేతల దురాగతాలను ఆనాడు ఏ ఒక్కరూ తప్పించుకోలేకపోయారు.

మిత్రులారా!

శ్రీ నితీష్ కుమార్‌ నాయకత్వాన చట్టబద్ధ పాలన పునరుద్ధరణతో తల్లులు.. అక్కచెల్లెళ్లకు ఎంతో ఊరట లభించింది. బీహార్‌లో ఆడపిల్లలు ఇవాళ ఎలాంటి భయాందోళనలు లేకుండా వెళ్లి తమ పనులు చూసుకోగలుగుతున్నారు. ఈ మేరకు కొందరు లబ్ధిదారులతో ముచ్చటించిన సందర్భంగా నలుగురు చెల్లెళ్ల అనుభవాలను నేను విన్నాను. ఈ మేరకు రంజిత, రీటా దేవి, నూర్జహాన్ ఖాతూన్‌, పుతుల్ దేవి ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడారు. శ్రీ నితీష్ నేతృత్వంలోని ప్రభుత్వం రాకముందు పరిస్థితి ఇలా ఉండేది కాదు... రాత్రి వేళ ఆలస్యంగా ఇంటికి రావాల్సి వస్తే భయంతో వణికిపోయే దుస్థితి ఉండేది. అయితే, నేను బీహార్‌ వచ్చినప్పుడల్లా పెద్ద సంఖ్యలో మహిళా పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో కనిపించడం నాకెంతో సంతృప్తినిస్తోంది. కాబట్టి, బీహార్‌ మళ్లీ ఆనాటి అంధకార యుగంలోకి వెళ్లకుండా చూస్తామని ప్రతినబూనాల్సిన సమష్టి బాధ్యత మనదే. మన భావితరం భవిష్యత్తు విధ్వంసం పాలుకాకుండా చూసుకోగల మార్గం ఇదొక్కటేనని గ్రహించండి.

అమ్మలు..చెల్లెమ్మల్లారా!

ఏ ప్రభుత్వమైనా మహిళా ప్రాధాన్యంతో ఏదైనా విధానాన్ని రూపొందిస్తే, తద్వారా వారి కుటుంబం మాత్రమేగాక సమాజంలోని ప్రతి వర్గానికీ ప్రయోజనం కలుగుతుంది. ఉదాహరణకు॥ ఉజ్వల యోజనతో దేశంలో వచ్చిన పెనుమార్పును యావత్‌ ప్రపంచం చూస్తోంది. గ్రామాలకు వంట గ్యాస్‌ కనెక్షన్ ఒకనాడు గగనకుసుమం వంటిది. నగరాల్లోనూ అధికశాతం ఈ దుస్థితి ఉండేది. నిరుపేదలైన నా తల్లులు, చెల్లెళ్లు పొగచూరిన వంటగదిలో ఉక్కిరిబిక్కిరై అనారోగ్యం బారినపడేవారు. ఊపిరితిత్తుల వ్యాధులు సర్వసాధారణం కాగా, దృష్టి మందగించడం వల్ల కూడా బాధపడేవారు. వంటింటి పొగ రోజుకు 400 సిగరెట్ల పొగ పీల్చడంతో సమానమని కొందరు నిపుణులు చెబుతుండటం ఈ సందర్భంగా గమనార్హం. ఇప్పుడు చెప్పండి... ఇలాంటి దుస్థితి ఉన్నపుడు కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధి రాక ఏమవుతుంది? ఈ బాధలన్నిటి నుంచి మహిళల రక్షణ కోసమే మేం ఉజ్వల పథకాన్ని అమలులోకి తెచ్చి, ఇంటింటివీ గ్యాస్ సిలిండర్‌ పంపిణీ చేస్తున్నాం. దీంతో బీహార్‌లో కట్టెలమోతతో, కడబట్టిన మన అక్కచెల్లెళ్ల జీవితాల్లో ఇతరత్ర సమస్యలూ తక్కువేమీ కాదు. వర్షం పడితే నెమ్మెక్కిన కట్టెలు మండవు. వరదలొస్తే అవి తడవకుండా చూసుకోవడం ఒక ప్రళయం. పిల్లలు ఎన్నోసార్లు ఆకలితోనే నిద్రపోయేవారు లేదా వేయించిన బియ్యం నమిలి క్షుద్బాధ తీర్చుకునేవారు.

మిత్రులారా!

మహిళలు అనుభవించిన ఈ దురవస్థలు ఏదో కథల పుస్తకంలోనివి కావు. బీహార్‌లో దాదాపు ప్రతి ఒక్కరూ స్వయంగా అనుభవించిన కష్టనష్టాలివి. అయితే, కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలు కేంద్రకంగా విధానాలు, పథకాల రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. ఫలితంగా పరిస్థితుల్లో మార్పు మొదలైంది. ఇవాళ ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్‌ వచ్చింది... కోట్లాది అక్కచెల్లెళ్లు పొగ బెడద లేకుండా స్టవ్‌పై ప్రశాంతంగా వంట చేసుకుంటున్నారు. ఊపిరితిత్తుల వ్యాధి వంటి బాధలు తప్పాయి. పిల్లలు నిత్యం వేడివేడిగా భోజనం చేస్తారు. ఈ విధంగా బీహార్ వంటిళ్లలోనే కాకుండా మహిళల జీవితాల్లోనూ ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు వెలుగు తెచ్చాయి.

అమ్మలు..చెల్లెమ్మల్లారా!

మీ సమస్యలన్నిటి పరిష్కారం మా బాధ్యత. అందుకే, కరోనా మహమ్మారి కష్ట సమయంలో ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ పథకం ప్రారంభించాం. ఏ ఇంట్లోనూ... ఏ ఒక్క బిడ్డా కాలే కడుపుతో నిద్రకు దూరం కావాల్సిన దుస్థితి రాకుండా చూడాలి. ఈ లక్ష్యంతో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన. మీకు ఎంతగానో చేయూతనిచ్చింది. ఆ తర్వాత కూడా దీన్ని కొనసాగించాలని మేం  నిర్ణయించుకున్నాం. ఆ మేరకు నేటికీ ఈ పథకం అమలువుతుండగా, బీహార్‌లోని 8.5 కోట్ల మందికిపైగా పేదలు ఉచిత రేషన్ పొందుతున్నారు. ఈ పథకంతో మీకు లభించి ఉపశమనం గురించి ఒక ఉదాహరణ చెబుతాను. బీహార్‌లో అధికశాతం ఉప్పుడు బియ్యం వినియోగిస్తుండగా, గత  ప్రభుత్వాలు పచ్చి బియ్యం పంపిణీ చేస్తుండేవి. దీంతో ఆ బియ్యాన్ని మార్కెట్లో ఉప్పుడు బియ్యంతో మహిళలు మార్పిడి చేసుకోవాల్సి వచ్చేది. అయితే, ఎంతమాత్రం నిజాయితీలేని వ్యాపారులు 20 కిలోల పచ్చి బియ్యానికి 10 కిలోల ఉప్పుడు బియ్యం మాత్రమే ఇచ్చేవారు. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి, మేమిప్పుడు నేరుగా ఉప్పుడు బియ్యమే వారికి పంపిణీ చేస్తున్నాం.

అమ్మలు..చెల్లెమ్మల్లారా!

మన సమాజంలో మహిళల పేరిట ఆస్తి హక్కు సంప్రదాయం లేదు. ఇల్లు, దుకాణం, భూమి, కారు, స్కూటర్‌ సహా ఏదైనా పురుషుల పేరిటే ఉంటుంది. అయితే, ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’కు శ్రీకారం చుట్టిన సందర్భంగా తల్లులు.. చెల్లెమ్మలు ఆ ఇళ్లకు యజమానులయ్యేలా నేనొక నిబంధన విధించాను. ఈ క్రమంలో బీహార్‌లో నిర్మించిన 50 లక్షలకుపైగా ఇళ్లలో అధికశాతం యాజమాన్య హక్కు మహిళలకే కల్పించాం... మీ ఇంటికి మీరే నిజమైన యజమానులు!

మిత్రులారా!

ఒక సోదరి ఆరోగ్యం క్షీణిస్తే, మొత్తం కుటుంబంపై ఆ ప్రభావం పడుతుందని మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ, తమ అనారోగ్య సమస్యలను బయటపెట్టేవారు కాదు. జ్వరం, కడుపునొప్పి వంటి బాధ ఎలాంటిదైనా పట్టించుకోకుండా పనిచేస్తూనే ఉంటారు. ఎందుకంటారు? కుటుంబంపై ఆర్థిక భారం పడతుందనే భయంతోనే! అయితే, ‘ఆయుష్మాన్ భారత్ యోజన’ ద్వారా ఈ మీ కుమారుడు... మీ సోదరుడు మీ ఆందోళనకు ఊరటనిచ్చాడు. ఆ మేరకు బీహార్‌లో లక్షలాది మహిళలకు ఇప్పుడు ఏటా రూ.5 లక్షల విలువైన ఉచిత చికిత్స సదుపాయం లభిస్తోంది. ఇక గర్భిణులు కోసం అమలు చేస్తున్న ‘మాతృ వందన యోజన’ కింద ఆ తల్లుల ఖాతాకు నేరుగా డబ్బు వెళ్తోంది. దీంతో 9 నెలల కాలంలో ఆమెకు పోషకాహారం లభిస్తుంది.. తద్వారా గర్భస్థ శిశువు ఆరోగ్యం కూడా బాగుంటుంది. అంతేగాక ప్రసవ సమయంలో ఏ సమస్యా లేకుండా తల్లీబిడ్డలు క్షేమంగా ఉంటారు.

అమ్మలు..చెల్లెమ్మల్లారా!

మీ ఆరోగ్య పరిరక్షణే మాకు పరమావధి. అందుకే, ఈ నెల 17న విశ్వకర్మ జయంతి నాటినుంచీ “ఆరోగ్య మహిళ... సాధికార కుటుంబం’ (స్వస్థ్‌ నారీ.. సశక్త్ పరివార్) కార్యక్రమాన్ని ప్రారంభించాం. దీనికింద గ్రామాలు, పట్టణాల్లో 4.25 లక్షలకుపైగా ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. రక్తహీనత, రక్తపోటు, మధుమేహం, కేన్సర్ వంటి వ్యాధులకు సంబంధించి ఉచిత పరీక్షలు చేపడుతున్నారు. ఇప్పటిదాకా కోటి మందికిపైగా మహిళలు ఈ పరీక్షలు చేయించుకున్న నేపథ్యంలో బీహార్‌లోని మహిళలు కూడా ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. పరీక్షలు చేయించుకోవడంపై కొందరు సందిగ్ధంలో ఉన్నారు... కానీ, వ్యాధిని త్వరగా గుర్తించి, సకాలంలో చికిత్స చేయించుకోవడం వారికే కాకుండా కుటుంబం మొత్తానికీ ప్రయోజనకరం.

మిత్రులారా!

ఇది పండుగల సమయం... దసరా, దీపావళి, ఛత్ పూజ వంటివి వస్తున్నాయి. ఈ వరుస వేడుకల నేపథ్యంలో మన అక్కచెల్లెళ్లు డబ్బు పొదుపు గురించి నిరంతరం ఆలోచిస్తూంటారు. అందుకే, ఎన్‌డీఏ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుని, ఈ నెల 22న నవరాత్రి వేడుకల తొలి రోజునుంచీ వస్తుసేవల పన్నును తగ్గించింది. ఇప్పుడు పేస్టు, సబ్బు, షాంపూ, నెయ్యి, ఆహార పదార్థాలు వగైరా రోజువారీ వస్తువులన్నీ చౌకగా లభిస్తున్నాయి. పిల్లల చదువుకు ఉపయోగపడే రాత సామగ్రి సహా దుస్తులు, బూట్లు వంటి వస్తువుల ధరలు కూడా తగ్గాయి. కుటుంబ, వంటగది బడ్జెట్‌ నిర్వహణలో ఇది మహిళలకు ఎంతో ఊరటనిచ్చే అంశం. ఆర్థిక భారాన్ని తగ్గించి, ఉపశమనం ఇవ్వడం ద్వారా వారు ఆనందంతో కళకళలాడేలా చూడటం తన బాధ్యతగా మా రెండు ఇంజిన్ల ప్రభుత్వం భావించింది.

మిత్రులారా!

అవకాశం లభించిన ప్రతి సందర్భంలోనూ బీహార్ మహిళలు దృఢ సంకల్పంతో, ధైర్యం ప్రదర్శిస్తూ మార్పును తెస్తున్నారు. మహిళలు పురోగమిస్తే యావత్‌ సమాజం ముందడుగు వేస్తుందని మీరు నిరూపించారు. ఈ నేపథ్యంలో ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ ప్రయోజనం అందుకుంటున్న బీహార్ మహిళలకు నా అభినందనలు. మీకందరికీ నా శుభాకాంక్షలు... అనేకానేక ధన్యవాదాలు.

 

గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి స్వేచ్ఛానువాదం మాత్రమే.

 

***


(Release ID: 2172670) Visitor Counter : 5