ప్రధాన మంత్రి కార్యాలయం
రాజస్థాన్‌లోని బాన్స్‌వారాలో రూ.1,22,100 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవం
ప్రజా ఉద్యమంగా స్వచ్ఛ ఇంధన కార్యక్రమం: పీఎం
సమాజంలో అన్ని వర్గాల సంక్షేమానికి సేవలు అందించాలనే స్ఫూర్తితో మేం పనిచేస్తున్నాం: పీఎం
గిరిజన తెగలు దర్జాగా, ఆత్మగౌరవంతో జీవించేలా చేయడమే మా సంకల్పం: పీఎం
Posted On:
25 SEP 2025 4:40PM by PIB Hyderabad
రాజస్థాన్లోని బాన్స్‌వారాలో రూ. 1,22,100 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజున బాన్స్‌వారలోని మాతా త్రిపుర సుందరి ఆలయాన్ని దర్శించే అవకాశం తనకు లభించిందని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. కాంఠల్, వాగడ్‌లో గంగగా పూజలందుకొనే మాతా మాహీని చూసే అవకాశం కూడా తనకు లభించిందన్నారు. భారతీయ గిరిజన తెగల స్థైర్యానికీ, పోరాటతత్వానికీ మాహీ జలాలు ప్రతీక అని ప్రధానమంత్రి వర్ణించారు. మహాయోగి గోవింద్ గురు స్ఫూర్తిదాయక నాయకత్వం గురించి వివరిస్తూ... ఆయన గొప్పతనం ఎప్పటికీ నిలిచి ఉంటుందని, ఆ గొప్ప గాథకు మాహీ జలాలు సాక్ష్యంగా నిలుస్తాయని తెలిపారు. మాతా త్రిపుర సుందరి, మాత మాహీలకు, శ్రీ మోదీ నమస్సులు అర్పించారు. భక్తి, ధైర్యం నిండిన ఈ నేల నుంచి మహారాణా ప్రతాప్, రాజా బాంసియా బీల్‌కు ఆయన నివాళులు అర్పించారు.
నవరాత్రి సమయంలో శక్తిని తొమ్మిది రూపాల్లో దేశ ప్రజలు ఆరాధిస్తారని శ్రీ మోదీ అన్నారు. ఈ రోజు బాన్స్‌వారాలో జరిగే ప్రధాన కార్యక్రమం ఊర్జా శక్తి - విద్యుదుత్పత్తికి అంకితం చేశామని తెలిపారు. భారతీయ విద్యుత్ రంగంలో సరికొత్త అధ్యాయానికి రాజస్థాన్ భూమి శ్రీకారం చుట్టిందన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లో రూ.90,000 కోట్లకు పైగా విలువైన విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. ఏకకాలంలో ఈ తరహా భారీ స్థాయి ప్రాజెక్టులు ప్రారంభించడం.. విద్యుత్ రంగంలో వేగవంతమవుతున్న భారత్ ప్రగతిని సూచిస్తుందని, దీనికి దేశంలోని ప్రతి ప్రాంతం నుంచి చురుకైన సహకారం లభిస్తోందనీ, అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యమిస్తామనీ ఆయన స్పష్టం చేశారు. స్వచ్ఛ విద్యుత్ ప్రాజెక్టులు, ట్రాన్స్‌మిషన్ లైన్లకు రాజస్థాన్లో శంకుస్థాపన చేశారు. అలాగే సౌర విద్యుత్ ప్రాజెక్టులను కూడా శ్రీ మోదీ ప్రారంభించారు. వీటితో పాటుగా.. బాన్స్‌వారాలో రాజస్థాన్ అణు విద్యుత్ ప్రాజెక్ట్ ప్రారంభమైనట్లు ప్రకటించారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాల్లో సౌరశక్తి నుంచి అణుశక్తి వరకు భారత్ కొత్త శిఖరాలను చేరుకుంటోందని ఆయన స్పష్టం చేశారు.
‘‘నేటి సాంకేతికత, పరిశ్రమల యుగంలో.. విద్యుత్ శక్తి ద్వారా అభివృద్ధి ముందుకెళుతుంది. వెలుగునీ, వేగాన్నీ, వృద్ధినీ, అనుసంధానాన్నీ, అంతర్జాతీయ అవకాశాలను విద్యుత్ తీసుకువస్తుంది’’ అని ప్రధానమంత్రి అన్నారు. గత ప్రభుత్వాలు విద్యుత్తుకున్న ప్రాధాన్యానాన్ని విస్మరించాయన్నారు. 2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి, 2.5 కోట్ల కుటుంబాలకు విద్యుత్ సదుపాయం లేదని, స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల తర్వాత సైతం 18,000 గ్రామాల్లో కనీసం ఒక్క విద్యుత్ స్థంభమైనా లేదన్నారు. అంతేకాకుండా.. నగరాల్లో సైతం గంటల తరబడి విద్యుత్ కోతలుండేవనీ, గ్రామాల్లో 4-5 గంటల పాటు కరెంటు ఉంటే దాన్ని గొప్పగా భావించేవారనీ తెలిపారు. విద్యుత్ సౌకర్యం లేకపోవడం వల్ల కర్మాగారాల్లో కార్యకలాపాలకు, కొత్త పరిశ్రమలు ఏర్పాటుకు ఆటంకం కలిగేదని, ఈ పరిస్థితి రాజస్థాన్ సహా మొత్తం దేశంపై ప్రతికూల ప్రభావం చూపిందన్నారు. ఈ పరిస్థితిని మార్చాలని 2014లో తన ప్రభుత్వం సంకల్పించుకుందని, తద్వారా ప్రతి గ్రామానికీ విద్యుత్ సదుపాయం ఏర్పడిందనీ, 2.5 కోట్ల కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు అందినట్లు వెల్లడించారు. విద్యుత్ లైన్లు ఎక్కడి వరకు చేరుకున్నాయో.. అక్కడికి కరెంట్ కూడా వచ్చిందన్నారు. ఫలితంగా జీవన సౌలభ్యం ఏర్పడి, కొత్త పరిశ్రమల వృద్ధికి వీలు కలుగుతోందని అన్నారు.
ఏ దేశమైనా 21 వ శతాబ్దంలో వేగంగా అభివృద్ధి చెందాలంటే.. ఆ దేశం కచ్చితంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాలని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలన్నీ స్వచ్ఛ విద్యుత్తులో అగ్రస్థానంలో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. పీఎం సూర్య ఘర్ మఫ్త్ బిజిలీ యోజన ప్రారంభాన్ని ప్రకటిస్తూ.. ‘‘మా ప్రభుత్వం స్వచ్ఛ ఇంధన కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మారుస్తోంది’’ అని శ్రీ మోదీ తెలియజేశారు. ఈ పథకం కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటి కప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తున్నారు. రైతులకు విద్యుత్ చౌకగా అందించేందుకు పీఎం-కుసుమ్ పథకం ద్వారా వ్యవసాయ క్షేత్రాల్లో సోలార్ పంపులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు వివిధ రాష్ట్రాల్లో ప్రారంభించిన పథకాలు నేరుగా లక్షల మంది రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం అందిస్తాయని ప్రధాని అన్నారు. పీఎం సూర్య ఘర్ పథకం గృహాలకు, పీఎం-కుసుమ్ పథకం సాగుభూములకు ఉచిత విద్యుత్ అందిస్తాయన్నారు. పీఎం-కుసుమ్ లబ్ధిదారులతో అంతకు ముందు జరిగిన సంభాషణను గుర్తు చేసుకుంటూ.. ఉచిత సోలార్ విద్యుత్ తమ జీవితాలకు గొప్ప వరంగా మారిందని వారు తనతో చెప్పారన్నారు.
‘‘అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి భారత్ అత్యంత వేగంగా పనిచేస్తోంది. ఈ ప్రయాణంలో రాజస్థాన్ కీలకపాత్ర పోషిస్తుంది’’ అని శ్రీ మోదీ అన్నారు. రాజస్థాన్ ప్రజల కోసం నీరు, విద్యుత్, ఆరోగ్య సేవలను మెరుగుపరచడమే లక్ష్యంగా రూ. 30,000 కోట్ల అదనపు ప్రాజెక్టుల ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. వందే భారత్ సహా మూడు కొత్త రైళ్లను ప్రధానమంత్రి ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా నూతన ఉపాధి అవకాశాలను కల్పించే జాతీయ కార్యక్రమం గురించి వివరిస్తూ.. దీని ద్వారా రాజస్థాన్లోని 15,000 మంది యువత, ప్రభుత్వ ఉద్యోగాలకు నియామక పత్రాలను ఈ రోజు అందుకున్నారని తెలిపారు. తమ జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న వారందరికీ శ్రీ మోదీ అభినందనలు తెలియజేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం నేపథ్యంలో రాజస్థాన్ ప్రజలకు శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
రాజస్థాన్లోని తమ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి పట్ల పూర్తి చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి, దోపిడీకి పాల్పడటం వల్ల రాజస్థాన్‌కు అయిన గాయాలకు ప్రస్తుత ప్రభుత్వం చికిత్స చేస్తోందన్నారు. గత పాలనా కాలంలో రాజస్థాన్ పేపర్ లీకులకు కేంద్రంగా మారిందని, అవినీతి కారణంగా జల్ జీవన్ మిషన్ కుంటుపడిందని విమర్శించారు. మహిళలపై అఘాయిత్యాలు తారస్థాయికి చేరుకున్నాయని, నేరాలకు పాల్పడిన వారికి రక్షణ కల్పించారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో బాన్స్వారా, డుంగార్ పూర్, ప్రతాప్ ఘర్ ప్రాంతాల్లో నేరాలు, అక్రమ మద్యం వ్యాపారం పెరిగిపోయాయని తెలిపారు. తమకు ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత శాంతిభద్రతలు బలోపేతమయ్యాయని, అభివృద్ధి వేగం పుంజుకుందని ప్రధానమంత్రి చెప్పారు. రాజస్థాన్ వ్యాప్తంగా పెరుగుతున్న హైవేలు, ఎక్స్‌ప్రెస్ వేలతో ప్రధాన ప్రాజెక్టులు ఇప్పుడు అమలు అవుతున్నాయన్నారు. రాజస్థాన్‌ను ముఖ్యంగా దక్షిణ రాజస్థాన్‌ను అభివృద్ధి పథంలో తమ ప్రభుత్వం వేగంగా ముందుకు తీసుకెళుతుందని తెలియజేశారు.
సమాజంలో చివరి వ్యక్తికి సైతం అభ్యుదయ ఫలాలను అందించే అంత్యోదయ సూత్రాన్ని దేశానికి అందించిన పండిత్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ జయంతి ఈ రోజే అని గుర్తు చేస్తూ.. ఆయన లక్ష్యమే ప్రస్తుతం తమ ప్రభుత్వ ధ్యేయంగా మారిందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. పేదలు, దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజన తెగల సంక్షేమం కోసం సేవా భావంతో పరిపాలన వ్యవస్థ పని చేస్తోందన్నారు.
గిరిజన సమాజాన్ని ప్రతిపక్షం ఎల్లప్పుడూ నిర్లక్ష్యం చేస్తోందని, వారి అవసరాలను అర్థం చేసుకోవడంలో విఫలమవుతోందని ప్రధానమంత్రి విమర్శించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి హయాంలో మొదటిసారిగా గిరిజన వ్యవహారాల కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి గిరిజన సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రతిపక్షం అధికారంలో ఉన్న సమయంలో.. గిరిజన ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులంటే అది ఊహించని విషయంగా ఉండేదని వ్యాఖ్యానించారు. వీటికి తమ ప్రభుత్వం వాస్తవ రూపం ఇస్తోందని తెలియజేశారు. మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో గిరిజన రైతులకు గణనీయమైన ప్రయోజనాలను అందించే పీఎం మిత్ర పార్కు ప్రారంభాన్ని ప్రకటించారు.
తమ పార్టీ ప్రయత్నాల కారణంగానే పేద గిరిజన కుటుంబానికి చెందిన శ్రీమతి ద్రౌపదీ ముర్ము ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యారని ప్రస్తావిస్తూ.. అత్యంత వెనకబడిన గిరిజన వర్గాల సమస్య గురించి రాష్ట్రపతి స్వయంగా తెలియజేశారని, అదే పీఎం జన్మన్ యోజన ప్రారంభానికి దారి తీసిందని తెలియజేశారు. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన ప్రాంతాల్లో అత్యంత వెనకబడిన వారికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ధర్తీ ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ ద్వారా గిరిజన గ్రామాలను ఆధునికీకరిస్తున్నామని, తద్వారా అయిదు కోట్ల మందికి పైగా గిరిజనులకు లబ్ది చేకూరుతోందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో ఏకలవ్య ఆదర్శ గురుకులు పాఠశాలలు ప్రారంభించామని ఆయన చెప్పారు. అడవుల్లో నివసించే వారు, షెడ్యూలు తెగల అటవీహక్కులను ప్రభుత్వం గుర్తించిందని ప్రధానమంత్రి తెలియజేశారు.
‘‘వేల ఏళ్లుగా అటవీ వనరులను భారతీయ గిరిజన తెగలు ఉపయోగించుకుంటున్నాయి’’ అని శ్రీ మోదీ అన్నారు. ఈ వనరులు వారి ప్రగతికి తోడ్పడేలా ప్రభుత్వం వన్ ధన్ యోజనను ప్రారంభించింది.. అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర పెరిగిందని, గిరిజన ఉత్పత్తులను మార్కెట్‌కు అనుసంధానించామని తెలిపారు. ఫలితంగా.. దేశవ్యాప్తంగా అటవీ ఉత్పత్తుల్లో భారత్ గణనీయమైన వృద్ధి నమోదు చేసిందని వెల్లడించారు.
గిరిజన తెగలు గౌరవంతో జీవించేలా చేయడానికి ప్రభుత్వ నిబద్ధతను స్పష్టం చేస్తూ.. వారి నమ్మకం, ఆత్మ గౌరవం, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడమే తమ సంకల్పమని ప్రధాని పేర్కొన్నారు. సాధారణ పౌరుని జీవితం సులభతరమైనప్పుడు దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తారని వివరించారు. 11 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వ పాలనలో నెలకొన్న దారుణ పరిస్థితులను గుర్తు చేసుకుంటూ.. వారు పౌరులను వ్యవస్థీకృతంగా దోచుకున్నారని విమర్శించారు. ఆ సమయంలో పన్నులు, ద్రవ్యోల్బణం అధికంగా ఉండేవని గుర్తు చేశారు. తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన తర్వాత ఈ తరహా దోపిడీ విధానాలకు చరమగీతం పాడినట్లు తెలిపారు.
2017లో జీఎస్టీ అమలులోకి రావడంతో పన్నులు, టోల్ వసూళ్ల సంక్లిష్టతల నుంచి దేశం విముక్తి పొందిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ సంవత్సరం నవరాత్రి మొదటి రోజున అమలులోకి తెచ్చిన ప్రధాన జీఎస్టీ సంస్కరణ ఫలితంగా దేశమంతటా జీఎస్టీ పొదుపు ఉత్సవం జరుపుకుంటున్నారని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అనేక రోజువారీ అవసర వస్తువుల ధరలు బాగా తగ్గాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ఇంటి, వంటగది ఖర్చులు తగ్గడంతో దేశవ్యాప్తంగా తల్లులు, అక్కాచెల్లెళ్లకు ఎంతో ఉపశమనం లభించిందని అన్నారు.
2014కు ముందు ప్రతిపక్ష ప్రభుత్వ హయాంలో సబ్బు, షాంపూ, టూత్‌పేస్ట్, టూత్ పౌడర్ వంటి రోజువారీ నిత్యావసర వస్తువులపై రూ. 100 ఖర్చు చేస్తే, అధిక పన్నుల కారణంగా దాని మొత్తం ఖర్చు రూ. 131 అయ్యేదని శ్రీ మోదీ పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రతి 100 రూపాయల కొనుగోలుపై 31 రూపాయల పన్ను విధించాయన్నారు. 2017లో తమ ప్రభుత్వం జీఎస్టీని అమలు చేసిన తర్వాత, అదే రూ.100 విలువైన కొనుగోలుపై పన్ను 18 రూపాయలకు తగ్గిందని, దీనివల్ల వినియోగదారులకు 13 రూపాయలు ఆదా అవుతోందని ఆయన తెలిపారు. ఇప్పుడు సెప్టెంబర్ 22న ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణల తరువాత పన్ను మరింత తగ్గి రూ. 105 కి చేరిందని, ఫలితంగా ఇంతకుముందుతో పోలిస్తే మొత్తం 26 రూపాయలు ఆదా అవుతుందని వివరించారు. తల్లులు, ఆడపడుచులు ఇంటి ఖర్చులను ఎంతో జాగ్రత్తగా నిర్వహిస్తారని, ఇప్పుడు కొత్త పన్ను విధానంలో కుటుంబాలు ప్రతినెలా వందల రూపాయలు ఆదా చేయగలుగుతాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
పాదరక్షలు అందరికీ ప్రాథమిక అవసరమని, గత ప్రభుత్వ హయాంలో, 500 రూపాయల విలువైన పాదరక్షలను కొనుగోలు చేస్తే, 75 రూపాయల పన్ను భారం పడి, దాని ధర రూ. 575 అయ్యేదని, జీఎస్టీ అమలులోకి వచ్చాక, ఈ పన్ను 15 రూపాయలు తగ్గితే, ఇప్పుడు, తాజా జీఎస్టీ సంస్కరణల తర్వాత, రూ. 50 ఆదా అవుతోందని అన్నారు. గతంలో రూ.500 కంటే ఎక్కువ ధర ఉన్న పాదరక్షలపై మరింత ఎక్కువ పన్నులు పడేవని, ఇప్పుడు రూ.2,500 వరకు ధర ఉన్న పాదరక్షలపై పన్ను రేట్లను ప్రభుత్వం గణనీయంగా తగ్గించిందని, ఇది సాధారణ పౌరులకు మరింత తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చిందని చెప్పారు.
స్కూటర్ లేదా మోటార్ సైకిల్ కలిగివుండాలనేది ప్రతి ఇంటికి ఒక సాధారణ ఆకాంక్ష అని, అయితే ప్రతిపక్ష పాలనలో ఇది కూడా అందుబాటులో లేదని శ్రీ మోదీ పేర్కొన్నారు. 60,000 మోటార్ సైకిల్ పై ప్రతిపక్షాలు 19,000 రూపాయలకు పైగా పన్ను విధించాయని ఆయన గుర్తుచేశారు. 2017 లో జీఎస్టీ ప్రవేశపెట్టడంతో, ఈ పన్ను రూ. 2,500 తగ్గింది. ఈ సెప్టెంబర్ 22 న అమలులోకి వచ్చిన సవరించిన రేట్లతో అదే మోటార్ సైకిల్ పై ఇప్పుడు పన్ను రూ. 10,000 మాత్రమే. ఫలితంగా 2014 తో పోలిస్తే రూ. 9,000 ప్రయోజనం లభిస్తుంది.
గత ప్రభుత్వ హయాంలో ఇల్లు కట్టుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. రూ.300 విలువైన సిమెంట్ బస్తాపై రూ. 90కి పైగా పన్నులు ఉండేవని, 2017లో జీఎస్టీని ప్రవేశపెట్టడంతో ఈ పన్ను సుమారు రూ. 10 తగ్గిందని అన్నారు. తాజా జీఎస్టీ సంస్కరణలతో అదే సిమెంట్ బస్తాపై ఇప్పుడు పన్ను రూ.50 మాత్రమేనని, ఫలితంగా 2014 తో పోలిస్తే 40 రూపాయలు ఆదా అవుతుందని వివరించారు. ప్రతిపక్ష పార్టీ పాలనలో అధిక పన్నుల భారం ఉంటే, తమ ప్రభుత్వం సామాన్య పౌరులకు పొదుపు శకాన్ని ప్రారంభించిందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
జీఎస్టీ పొదుపు పండుగ మధ్య, స్వావలంబన భారత్ లక్ష్యాన్ని మనం మర్చిపోకూడదని శ్రీ మోదీ అన్నారు. స్వదేశీ మంత్రాన్ని విస్మరించకూడదని, మనం అమ్మేది, కొనేది కూడా స్వదేశీ అయి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. “ఇది స్వదేశీ” అని గర్వంగా చెప్పుకోవాలని అన్నారు. ప్రజలు స్వదేశీ ఉత్పత్తులను కొన్నప్పుడు, ఆ డబ్బు దేశంలోనే ఉంటుందని, స్థానిక చేతివృత్తులవారికి, కార్మికులకు, వ్యాపారులకు చేరుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ డబ్బు విదేశాలకు వెళ్లకుండా నేరుగా దేశాభివృద్ధికి దోహదం చేస్తుంది, కొత్త రహదారులు, రోడ్లను నిర్మించడంలో ఉపయోగపడుతుంది. స్వదేశీని జాతీయ గర్వానికి చిహ్నంగా మార్చాలని ఆయన ప్రతి ఒక్కరికీ పిలుపునిచ్చారు. పండుగ సీజన్లో స్వదేశీ వస్తువులను మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రతిజ్ఞ చేయాలని ప్రధానమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి, ఉపాధి ఆధారిత ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా ప్రజలకు మరోసారి అభినందనలు తెలిపారు.
రాజస్థాన్ గవర్నర్ శ్రీ హరిభావ్ కిశన్ రావ్ బగాడే, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ, కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
అందరికీ అందుబాటులో, విశ్వసనీయంగా, నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను అందించే విధంగా భారత విద్యుత్ రంగాన్ని మార్చాలనే తన నిబద్ధతకు అనుగుణంగా, ప్రధానమంత్రి మహి బనస్వారా రాజస్థాన్ అణు విద్యుత్ ప్రాజెక్టు (4X700 మెగావాట్లు) కు శంకుస్థాపన చేశారు. అణుశక్తి విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (అశ్విని) రూ. .42,000 కోట్లతో ఈ విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఇది విశ్వసనీయమైన బేస్ లోడ్ విద్యుత్ ను సరఫరా చేసే దేశంలోని అతిపెద్ద అణు ప్లాంట్లలో ఒకటిగా ఉంటుంది. పర్యావరణ నిర్వహణలో, అభివృద్ధి చెందుతున్న అణు శక్తి రంగంలో భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకువెళుతూ, మహి బన్స్వారా రాజస్థాన్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్ నాలుగు స్వదేశీ 700 మెగావాట్ల ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లను కలిగి ఉంది. వీటిని ఎన్పీసీఐఎల్ స్వీయ డిజైనుతో అభివృద్ధి చేసింది. ఇది భారతదేశం చేపట్టిన విస్తృతమైన “ఫ్లీట్ మోడ్” కార్యక్రమంలో భాగం. ఈ ప్రణాళిక కింద దేశవ్యాప్తంగా ఒకే రూపకల్పన, ఒకే విధమైన కొనుగోలు విధానాలతో పది సమానమైన 700 మెగావాట్ల రియాక్టర్లను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వ్యయ సామర్ధ్యం, వేగవంతమైన నిర్మాణం, ఏకీకృత నిర్వహణ నైపుణ్యం లభిస్తాయి.
భారతదేశ స్వచ్ఛ ఇంధన మౌలిక సదుపాయాలకు పెద్ద ఊపునిస్తూ, రాజస్థాన్లో సుమారు 19,210 కోట్ల రూపాయల విలువైన హరిత ఇంధన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఫలోడి, జైసల్మేర్, జలోర్, సికర్ మొదలైన ప్రాంతాల్లో నిర్మించే సౌరశక్తి ప్రాజెక్టులను ప్రారంభించారు. బికనీర్‌లో సౌరశక్తి ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని రామగిరిలో సోలార్ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులు భారతదేశ స్వచ్ఛ ఇంధన సామర్థ్యాన్ని పెంచడంలో గణనీయంగా దోహదం చేస్తాయి. మిలియన్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నివారిస్తూ, గణనీయమైన మొత్తంలో హరిత విద్యుత్ ను ఉత్పత్తి చేస్తాయి.
భారత ప్రభుత్వ పునరుత్పాదక ఇంధన జోన్ (ఆర్ఈజెడ్) కింద 13,180 కోట్ల రూపాయల పైగా విలువైన మూడు విద్యుత్ ప్రసార ప్రాజెక్టులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఇది 2030 నాటికి ఎనిమిది రాష్ట్రాలలో 181.5 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పునరుత్పాదక విద్యుత్తును లోడ్ సెంటర్లకు సమర్ధవంతంగా పంపిణీ చేయడానికి, గ్రిడ్ స్థిరత్వాన్ని పెంచడానికి రాజస్థాన్ ఆర్ఈజెడ్ కోసం పవర్‌గ్రిడ్ కీలకమైన ప్రసార వ్యవస్థలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రాజస్థాన్‌లోని బీవార్ నుంచి మధ్యప్రదేశ్‌లోని మాండ్సర్ వరకు 765 కేవీ ట్రాన్స్‌మిషన్ లైన్లు, వాటి అనుబంధ సబ్‌స్టేషన్ల విస్తరణ, రాజస్థాన్లోని సీరోహీ నుంచి మాండసౌర్, మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా వరకు ట్రాన్స్‌మిషన్ లైన్లు, సీరోహీ సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మేషన్ సామర్థ్యాన్ని పెంచడం, మాండసౌర్, ఖండ్వా సబ్‌స్టేషన్ల విస్తరణ, రాజస్థాన్లోని బికనేర్ నుంచి హర్యానాలోని సివానీ, ఫతేహాబాద్ వరకు, అక్కడి నుంచి పంజాబ్‌లోని పత్రాన్ వరకు 765 కేవీ, 400 కెవీ ట్రాన్స్‌మిషన్ లైన్లు, బికనేర్‌లో కొత్త సబ్‌స్టేషన్ ఏర్పాటు, సివానీ సబ్‌స్టేషన్ విస్తరణ ఉన్నాయి. మొత్తంగా, ఈ ప్రాజెక్టులు రాజస్థాన్‌లోని హరిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అవసరమైన ప్రాంతాలకు 15.5 గిగావాట్ల స్వచ్ఛ ఇంధనాన్ని నిరాటంకంగా సరఫరా చేయడానికి సహాయపడతాయి.
జైసల్మేర్, బికనేర్‌లలో 220 కేవీ సామర్థ్యం గల మూడు గ్రిడ్ సబ్‌స్టేషన్ల (జీఎస్ఎస్) కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. బార్మేర్ జిల్లాలోని శివ్ వద్ద 220 కే వీ జీఎస్ఎస్ ను ప్రారంభించారు. రూ.490 కోట్లకుపైగా విలువ కలిగిన ఈ ప్రాజెక్టులు, ఆ ప్రాంతంలో ఇంధన భద్రతను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.
రైతులకు సాధికారత కల్పించాలన్న సంకల్పానికి అనుగుణంగా, పీఎం-కుసుమ్ (ప్రధాన్ మంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్తాన్ మహాభియాన్) పథకం (కాంపోనెంట్- సీ) కింద 3,517 మెగావాట్ల సామర్థ్యం గల ఫీడర్ లెవల్ సోలరైజేషన్ ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు. రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేసే ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ రూ.16,050 కోట్లకు పైగా ఉంది. వ్యవసాయ ఫీడర్లను సోలరైజ్ చేయడం ద్వారా రైతులకు తక్కువ ఖర్చుతో, నమ్మదగిన, స్థిరమైన విద్యుత్‌ను అందించడం దీని లక్ష్యం. ఇందువల్ల విద్యుత్ బిల్లులు, సాగు ఖర్చులు తగ్గుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంధన స్వయం సమృద్ధి పెరుగుతుంది. ఈ ప్రయోజనాలు లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
రామ్‌జల్ సేతు లింక్ ప్రాజెక్ట్‌కు పెద్ద ఊపునిస్తూ, నీటి భద్రతపై తన దార్శనికతను ముందుకు తీసుకువెళుతూ, రాజస్థాన్లో 20,830 కోట్ల రూపాయలకు పైగా విలువైన బహుళ నీటి వనరుల ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఇసార్డా నుంచి వివిధ ఫీడర్ల నిర్మాణానికి, అజ్మీర్ జిల్లాలో మోర్ సాగర్ కృత్రిమ జలాశయ నిర్మాణానికి, దానికి అనుసంధానమైన చిత్తౌర్గఢ్ నుండి వచ్చే ఫీడర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇతర పనుల్లో బిసల్పూర్ ఆనకట్ట వద్ద ఇన్‌టేక్ పంప్ హౌస్ నిర్మాణం, ఖారీ ఫీడర్ పునరుద్ధరణ, అలాగే పలు ఫీడర్ కాలువ నిర్మాణం ఉన్నాయి. ఇసార్డా డ్యామ్, ధోల్పూర్ లిఫ్ట్ ప్రాజెక్ట్, టక్లీ ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు.
ప్రతి ఒక్కరికి సురక్షితమైన, శుభ్రమైన తాగునీటిని అందించాలన్న తన సంకల్పానికి అనుగుణంగా, అటల్ మిషన్ ఫర్ రీజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్) 2.0 కింద బంస్వారా, డుంగర్పూర్, ఉదయపూర్, సవాయి మాధోపూర్, చురు, అజ్మీర్, భిల్వారా జిల్లాల్లో సుమారు రూ.5,880 కోట్ల విలువైన ప్రధాన తాగునీటి సరఫరా ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.
రోడ్ల మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ, భరత్పూర్ నగరంలో ఫ్లైవోవర్లు, బానాస్ నది మీద వంతెన, 116 అటల్ ప్రగతి పథ్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. బార్మేర్, అజ్మీర్, డుంగర్పూర్ జిల్లాలు, ఇతర ప్రాంతాల్లోని జాతీయ, రాష్ట్ర హైవేలకు సంబంధించిన అనేక రోడ్డు ప్రాజెక్టులను ప్రారంభించి, దేశానికి అంకితం చేశారు. రూ.2,630 కోట్లకు పైగా విలువ కలిగిన ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ రోడ్డు అనుసంధానాన్ని మెరుగుపరచడంతో పాటు ట్రాఫిక్ సౌలభ్యాన్ని, రోడ్డు భద్రతను పెంచుతాయి.
భరత్‌పూర్‌లో 250 పడకల ఆర్బీఎం హాస్పిటల్, జైపూర్‌లో ఐటి డెవలప్‌మెంట్, ఇ-గవర్నెన్స్ సెంటర్, మకరానా నగరంలో ట్రీట్మెంట్ ప్లాంట్లు, పంప్ స్టేషన్లతో కూడిన మురుగునీటి నిర్వహణ వ్యవస్థ, మండావా, జుంజూను జిల్లాల్లో డ్రైనేజ్, తాగునీటి సరఫరా ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు.
రైల్వే అనుసంధానాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి, ప్రధానమంత్రి మూడు రైళ్లను ప్రారంభించారు. ప్రధాని ప్రారంభించిన బికనేర్ - ఢిల్లీ కంటోన్మెంట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, జోధ్‌పూర్–ఢిల్లీ కంటోన్మెంట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, ఉదయపూర్ సిటీ - చండీగఢ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాజస్థాన్, ఇతర ఉత్తర రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తాయి.
ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశాలను అందించాలన్న లక్ష్యానికి అనుగుణంగా రాజస్థాన్‌లోని ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా ఎంపికైన యువతకు 15,000 పైగా నియామక పత్రాలను ప్రధానమంత్రి అందచేశారు. వీటిలో 5,770 పైగా పశు వైద్య సహాయకులు, 4,190 జూనియర్ అసిస్టెంట్లు, 1,800 జూనియర్ ఇన్‌స్ట్రక్చర్లు, 1,460 జూనియర్ ఇంజనీర్లు, 1,200 మూడో గ్రేడ్ లెవల్-2 ఉపాధ్యాయులు ఇతరులు ఉన్నారు.
(Release ID: 2171982)
Visitor Counter : 9
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada