ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి అధ్యక్షతన 49వ ప్రగతి సమావేశం


గనులు, రైల్వేలు, నీటి వనరులు, పారిశ్రామిక కారిడార్లు, విద్యుత్ రంగాలకు చెందిన

ఎనిమిది కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ప్రధాని సమీక్ష

15 రాష్ట్రాలు, యూటీలకు చెందిన మొత్తం రూ.65,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులపై సమీక్ష

సమీక్షలో దృష్టి సారించిన అంశాలు: నిర్దుష్టమైన కాలపరిమితులు,

సమర్థమైన అంతర సంస్థల సహకారం, సమస్యలకు తగిన పరిష్కారం

పనుల్లో జాప్యం కారణంగా రెట్టింపవుతున్న వ్యయం - ప్రాజెక్టు వ్యయం పెరగడంతో పాటు పౌరులకు సకాలంలో సేవలు అందించడంలో ఆటంకం ఎదురవుతోందన్న ప్రధాని

ఫలితాధారిత విధానాన్ని అవలంబించాలని అధికారులకు పీఎం సూచన

Posted On: 24 SEP 2025 8:58PM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం సౌత్ ‌బ్లాక్‌లో జరిగిన ఐసీటీ ఆధారిత బహుళ విధ వేదిక ప్రో-యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ - ప్రగతి 49వ సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ప్రధాన ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి, ఇబ్బందులను పరిష్కరించేందుకు, సకాలంలో పనులు పూర్తి చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఈ వేదిక ఒక్క చోటకు చేరుస్తుంది.

ఈ సమావేశంలో, గనులు, రైల్వేలు, జల వనరులు, పారిశ్రామిక కారిడార్లు, విద్యుత్ తదితర రంగాలకు సంబంధించిన ఎనిమిది కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి సమీక్షించారు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టుల్లో మొత్తం రూ. 65,000 కోట్లకు పైగా పెట్టుబడులున్నాయి. ఆర్థిక వృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని ముందుకు నడిపించేవిగా గుర్తింపు పొందిన ఈ ప్రాజెక్టులకు సంబంధించి కాలపరిమితిని నిర్దేశింంచడం, ప్రభావవంతమైన అంతర సంస్థల సమన్వయాన్ని ఏర్పాటు చేయడం, సమస్యలకు కచ్చితమైన పరిష్కారమే ప్రధానంగా ఈ సమీక్ష నిర్వహించారు.

పనుల్లో జాప్యం కారణంగా రెట్టింపు వ్యయం అవుతోందని ప్రధానమంత్రి అన్నారు. దీనివల్ల తరచూ ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని, పౌరులకు సకాలంలో సేవలను, మౌలిక వసతులను అందించడంలో ఆటంకం ఏర్పడుతోందని తెలియజేశారు. ఫలితాధారిత విధానాన్ని స్వీకరించాలని, ప్రజల జీవన నాణ్యతను పెంపొందించేలా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో పౌరులకు జీవన సౌలభ్యం, సంస్థలకు వ్యాపార సౌలభ్యం కల్పించే లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

ప్రధాన ప్రాజెక్టులను సమీక్షించడానికి, పర్యవేక్షించడానికి, వాటిని సకాలంలో పూర్తి చేయడానికి, సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అన్ని రంగాల్లోనూ పోటీతత్వాన్ని పెంపొందించడం, సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా తీసుకోవాల్సిన సంస్కరణలపై దృష్టి సారించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ప్రధాని కోరారు. అలాగే ఈ సంస్కరణల ద్వారా నూతన అవకాశాలను వేగంగా ఒడిసిపట్టుకొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు.

 

***


(Release ID: 2171147) Visitor Counter : 22