ప్రధాన మంత్రి కార్యాలయం
సంత్ గురు రవిదాస్ 647వ జయంతి సందర్భంగా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
Posted On:
23 FEB 2024 2:02PM by PIB Hyderabad
జై గురు రవిదాస్!
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గౌరవనీయులైన సాధువులు, భారత్ నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చిన భక్తులు, నా సోదరీసోదరులారా,
గురు రవిదాస్ జయంతి సందర్భంగా ఆయన జన్మస్థలానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఎంతో దూరం నుంచి గురు రవిదాస్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా పంజాబ్ నుంచి వచ్చిన సోదరీసోదరులతో వారణాసి ‘మినీ పంజాబ్’గా మారిపోయింది. ఇదంతా సంత్ రవిదాస్ కృప వల్లే సాధ్యమైంది. తన జన్మప్రదేశానికి రమ్మని రవిదాస్‌జీ నన్ను పదేపదే పిలుస్తున్నారు. ఇది ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లడానికి, ఆయన్ను అనుసరించే లక్షల మందికి సేవ చేయడానికి అవకాశం ఇచ్చింది. గురువు జన్మస్థలంలో ఆయన అనుచరులందరికీ సేవ చేయడమంటే అది నాకు ఆశీర్వాదమే.
నా సోదరీసోదరులారా,
ఈ నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యుడిగా, కాశీ ప్రజాప్రతినిధిగా అది నా ప్రత్యేక బాధ్యత. మీ అందరినీ బెనారస్‌కు స్వాగతించడం, మీకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం నా కర్తవ్యం. ఈ శుభదినాన నా బాధ్యతలను పూర్తి చేసే అవకాశం లభించినందుకు ఆనందిస్తున్నాను. బనారస్ అభివృద్ధికి తోడ్పడే వందల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఈ రోజు ప్రారంభం, శంకుస్థాపన చేసుకోబోతున్నాం. ఇవి ఇక్కడికి వచ్చే భక్తులకు ఈ ప్రదేశాన్ని మరింత సౌకర్యవంతంగా, ఆహ్లాదంగా మారుస్తాయి. వీటికి అదనంగా, సంత్ రవిదాస్ జన్మస్థలాన్ని అభివృద్ధి చేయడానికి సైతం ఎన్నో కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. ఆలయాలు, ఆలయ ప్రాంతాల అభివృద్ధి, గుడులకు రోడ్ల నిర్మాణం, ఇంటర్లాకింగ్, డ్రైనేజీల పనులు, సత్సంగాలు (ధార్మిక కార్యక్రమాలు), సాధన (ఆధ్యాత్మిక ఆచారం)కు హాజరయ్యే భక్తుల సౌకర్యార్థం వివిధ నిర్మాణాలు, ప్రసాదాన్ని స్వీకరించేందుకు ఏర్పాట్లు తదితర పనులన్నీ లక్షలాది ఉపాసకులకు మెరుగైన సదుపాయాలను అందిస్తాయి. మాఘ పూర్ణిమ సందర్భంగా ఇక్కడికి వచ్చే యాత్రికులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడమే కాకుండా.. ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. నూతనంగా ఏర్పాటు చేసిన సంత్ రవిదాస్ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం ఈ రోజు నాకు లభించింది. సంత్ రవిదాస్ మ్యూజియానికి సైతం ఈ రోజే శంకుస్థాపన చేశాం. ఈ అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దేశం తో పాటు ప్రపంచం నలుమూలల నుంచి సంత్ రవిదాస్ జయంతి, మాఘపూర్ణిమలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
స్నేహితులారా,
గొప్ప సాధువు, సామాజిక సంస్కర్త అయిన గాడ్గే బాబా జయంతి కూడా ఈ రోజే. సంత్ రవిదాస్ మాదిరిగానే గాడ్గే బాబా సైతం పాత ధోరణుల నుంచి సమాజాన్ని బయటకు తీసుకువచ్చేందుకు, అణగారిన, వెనకబడిన వర్గాల సంక్షేమానికి విస్తృతంగా కృషి చేశారు. గాడ్గే బాబాను బాబా సాహెబ్ అంబేద్కర్ ఆరాధించేవారు. బాబా సాహెబ్ నుంచి గాడ్గే బాబా స్ఫూర్తి పొందేవారు. ఈ రోజు గాడ్గే బాబా పాదాలకు వినమ్రంగా నమస్కరిస్తున్నాను.
స్నేహితులారా,
ఈ వేదిక వద్దకు రావడానికి ముందు సంత్ రవిదాస్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించేందుకు వెళ్లాను. ఆ సమయంలో ఆరాధనా భావం, కృతజ్ఞతతో నా మనసు నిండిపోయింది. కొన్నేళ్ల క్రితం, నేను రాజకీయాల్లోకి రాక ముందు, ఏ పదవీ లేనప్పుడు.. సంత్ రవిదాస్ బోధనల ద్వారా నాకు మార్గదర్శకత్వం లభించింది. సంత్ రవిదాస్‌కు సేవ చేయాలనే కోరిక నా హృదయంలో ఎప్పుడూ మెదులుతూ ఉండేది. సంత్ రవిదాస్‌తో ముడిపడిన సంకల్పాలు ఇప్పుడు కాశీలోనే కాకుండా దేశమంతా వాస్తవ రూపం దాలుస్తున్నాయి. రవిదాస్ బోధనలను ప్రచారం చేయడానికి నూతన కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. కొన్ని నెలల క్రితం.. మధ్యప్రదేశ్‌లోని సాగర్లో సంత్ రవిదాస్ స్మారక ఆర్ట్ గ్యాలరీకి భూమి పూజ చేసే సదవకాశం నాకు లభించింది. అభివృద్ధి అనే గంగానది కాశీలో ప్రవహిస్తోంది.
స్నేహితులారా,
అవసరం వచ్చిన ప్రతిసారి ఒక సాధువు, రుషి లేదా గొప్ప వ్యక్తి ఈ నేలపై జన్మించారని భారత చరిత్ర చెబుతోంది. బలహీనపడిన, విభజనకు గురైన భారత్‌కు నూతన శక్తిని అందించిన భక్తి ఉద్యమంలో పాల్గొన్న గొప్ప సాధువు సంత్ రవిదాస్. సమాజానికి స్వాతంత్ర్యం ప్రాధాన్యాన్ని వివరించి, సామాజిక అంతరాలను తొలగించేందుకు రవిదాస్ కృషి చేశారు. ఆ కాలంలో ఆధిపత్యం, వివక్ష, విభజనకు వ్యతిరేకంగా తన గళం వినిపించారు. ఏదైనా మతం, వర్గం, భావజాలానికి సంత్ రవిదాస్ పరిమితం కాలేదు. ఆయన అందరివాడు. అందరూ రవిదాస్‌కి చెందినవారే. జగద్గురు రామదాస్ శిష్యుడిగా వైష్ణవులు సైతం ఆయన్ను గురువుగా భావిస్తారు. సిక్కు సోదరీసోదరులు ఆయన పట్ల అత్యంత గౌరవాన్ని ప్రదర్శిస్తారు. ఆయన కాశీలో నివసించిన సందర్భంలో ఓ సూత్రాన్ని బోధించారు. అదే ‘మన్ చంగాతో కఠైౌతీ మే గంగా’ (మీ మనసు స్వచ్ఛంగా ఉంటే.. బకెట్లో కూడా మీకు గంగ కనిపిస్తుంది). కాబట్టి కాశీని గౌరవించేవారు, గంగా మాతపై విశ్వాసం ఉన్నవారు రవిదాస్ జీ నుంచి స్ఫూర్తిని పొందాలి. రవిదాస్ ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్లేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. అందరి కోసం బీజేపీ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోంది. 140 కోట్ల మంది భారతీయులను ఏకం చేసే మంత్రంగా ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్’ పని చేస్తోంది.
స్నేహితులారా,
సమానత్వం, సామరస్యం పాఠాలను రవిదాస్ జీ బోధించారు. దళితులు, అణగారిన వర్గాల పట్ల ఎల్లప్పుడూ ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు. సమాజంలో అణగారిన వర్గాల వారికి ప్రాధాన్యమివ్వడం ద్వారానే సమానత్వం వస్తుంది. అందుకే గత పదేళ్లుగా.. అభివృద్ధికి దూరంగా ఉన్నవారిపై దృష్టి కేంద్రీకరించాం. ఒకప్పుడు నిరుపేదలుగా, నిమ్నవర్గాలుగా పరిగణించిన వారి కోసం ఇప్పుడు భారీ ఎత్తున పథకాలు అమలవుతున్నాయి. ఇవి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రభుత్వ పథకాలుగా పేరు గాంచాయి. కరోనా పెద్ద సంక్షోభాన్ని తీసుకువచ్చింది. ఆ సమయంలో 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ అందించేందుకు మేం ఒక పథకాన్ని ప్రారంభించాం. కరోనా అనంతరం కూడా మేము దానిని ఆపలేదు. ఎందుకంటే.. తమ ప్రయాణాన్ని నిర్దేశించుకునేలా పేదలు మారాలని మేం భావించాం. వారిపై ఎలాంటి అదనపు భారం పడకూడదు. ఇలా భారీ స్థాయిలో అమలవుతున్న పథకం ప్రపంచంలోని మరే ఇతర దేశంలోనూ లేదు. స్వచ్ఛ భారత్ అభియాన్ చేపట్టాం. దేశంలోని ప్రతి గ్రామంలోనూ ప్రతి కుటుంబానికి ఉచితంగా టాయిలెట్లు నిర్మించాం. ఇది దళితులు, వెనకబడిన కుటుంబాలకు ముఖ్యంగా మన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ తల్లులు, అక్కాచెల్లెళ్లకు ప్రయోజనం చేకూర్చింది. గతంలో వారు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారు.
ప్రస్తుతం దేశంలోని ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగు నీరు అందించడమే లక్ష్యంగా జల్ జీవన్ మిషన్ కార్యక్రమం పనిచేస్తోంది. దాదాపు 11 కోట్లకు పైగా గృహాలకు అయిదేళ్ల వ్యవధిలోనే కుళాయి నీటి సౌకర్యం కల్పించాం. ఉచిత చికిత్స కోసం కోట్లాది పేదలు ఆయుష్మాన్ కార్డులు తీసుకున్నారు. ఏదైనా ఆరోగ్య సమస్య ఎదురైతే చికిత్సకు దూరమై జీవితం ముగిసిపోదనే నమ్మకం వారిలో మొదటిసారి ఏర్పడింది. అలాగే, జన్ ధన్ ఖాతాల ద్వారా బ్యాంకు సేవలను పొందే హక్కు పేదలకు లభించింది. ఈ ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా నగదు జమ చేస్తోంది. ఈ ఖాతాల ద్వారానే రైతులు కిసాన్ సమ్మాన్ నిధి పొందుతున్నారు. వారిలో దాదాపు 1.5 కోట్ల మంది దళిత రైతులు ఉన్నారు. ఫసల్ బీమా యోజన ద్వారా దళితులు, వెనకబడిన వర్గాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో ప్రయోజనం పొందుతున్నారు. 2014 ముందు కాలంతో పోలిస్తే.. ఇప్పుడు దళిత యువతకు రెట్టింపు ఉపకార వేతనాలను అందిస్తున్నాం. అలాగే.. పీఎం ఆవాస యోజన పథకం ద్వారా కోట్లాది మంది దళిత కుటుంబాల ఖాతాలకు 2022-23లో కోట్లాది రూపాయలు చేరాయి. తద్వారా వారికి సొంతవైన పక్కా ఇళ్లు చేకూరతాయి.
సోదరీసోదరులారా,
సమాజంలో దళితులు, అణగారిన, వెనకబడిన, పేద వర్గాలకు చెందిన వారి పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం వల్లే ఇలాంటి చరిత్రాత్మక పనులను భారత్ సాధించగలిగింది. మీ సాథ్ (సహకారం), విశ్వాస్ (నమ్మకం) మాకు ఉండటం వల్లే భారత్ వీటిని సాధించింది. సాధువుల మాటలు ప్రతి యుగంలోనూ మనకు మార్గనిర్దేశం చేస్తాయి, హెచ్చరిస్తాయి.
రవిదాస్ జీ ఇలా అనేవారు:
జాత్ పాత్ కే ఫేర్ మహి, ఉరఝి రహఈ సబ్ లోగ్।
మానుష్తా కుం ఖాత్ హయీ, రైదాస్ జాత్ కర్ రోగ్॥
దీనినే మరో మాటగా చెప్పాలంటే.. హానికారకమైన కుల, మత విభజన భావనల్లో చాలా మంది చిక్కుకుపోతున్నారు. కులతత్వమనే రోగం మానవత్వానికి నష్టం కలిగిస్తుంది. అంటే.. కులం, మతం ఆధారంగా ఇతరులపై వివక్ష చూపించి మానవజాతికి హాని చేస్తున్నారు. ఎవరైనా కులం పేరుతో ఇతరులను రెచ్చగొడితే వారు కూడా మానవత్వానికి చేటు చేస్తున్నారు.
కాబట్టి, సోదరీసోదరులారా,
ఇప్పుడు, దేశంలోని ప్రతి దళితుడూ, అణిచివేతకు గురైన ప్రతి వ్యక్తి ఓ విషయం గుర్తుంచుకోవాలి. కులం ఆధారిత విభజనలు, ఘర్షణలు రెచ్చగొట్టడం, దళితులు, అణగారిన వర్గాల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను వ్యతిరేకించడం పైనే ఇండీ కూటమికి చెందినవారు ఆధారపడ్డారు. కుల సంక్షేమం పేరుతో వీరు స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది.. పేదవారి కోసం టాయిలెట్ల నిర్మాణం ప్రారంభించినప్పుడు వారు ఎగతాళి చేశారు. జన్ ధన్ యోజనను గేలి చేశారు. డిజిటల్ ఇండియాను వ్యతిరేకించారు. అంతే కాదు.. దళిత లేదా గిరిజన వ్యక్తి తమను దాటి ముందుకు వెళ్లకూడదనుకోవడం.. ఈ కుటుంబ పార్టీలకున్న మరో లక్షణం. దళిత లేదా గిరిజన వ్యక్తి ఉన్నత పదవులను అలంకరిస్తే వారు సహించలేరు. దేశంలో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసిన తొలి గిరిజన మహిళ ద్రౌపదీ ముర్మును ఎవరు వ్యతిరేకించారు? ఆమెను ఓడించడానికి ఏ పార్టీలన్నీ ఏకమయ్యాయి? అవన్నీ ఎన్నికల సమయంలో దళితులను, వెనకబడిన వర్గాలను, గిరిజనులను తమ ఓటు బ్యాంకుగా చూసే ఈ కుటుంబ పార్టీలే. ఇలాంటి వ్యక్తులు, వారి మనస్తత్వాల పట్ల మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. మనం రవిదాస్ జీ సానుకూల బోధనలను అనుసరిస్తూ, కులతత్వమనే ప్రతికూల ధోరణిని విడనాడాలి.
స్నేహితులారా,
రవిదాస్ జీ ఇలా చెబుతూ ఉండేవారు:
సౌ బరస్ లౌం జగత్ మంహి జీవత్ రహి కరూ కామ్।
రైదాస్ కరమ్ హీ ధరమ్ హై కరమ్ కర్హూ నిహకామ్॥
అంటే.. కార్యమే ధర్మ సారాంశం కాబట్టి మనం వందేళ్లు జీవించినా.. చివరి వరకూ పనిచేస్తూనే ఉండాలి. నిస్వార్థ వైఖరితో మనం బాధ్యతలు నిర్వర్తించాలి. ప్రస్తుతం మన దేశానికి సంత్ రవిదాస్ జీ బోధనలు అవసరం. స్వాతంత్ర్య ‘అమృత కాలం’లోకి ఈ దేశం ప్రవేశించింది. ఈ అమృత కాలంలో ‘వికసిత్ భారత్’ అభివృద్ధికి అవసరమైన బలమైన పునాదిని ఇటీవలి సంవత్సరాల్లో వేశాం. వచ్చే అయిదేళ్లలో ఈ పునాదులపై అభివృద్ధికి అవసరమైన నిర్మాణాన్ని మెరుగుపరచాలి. పేదలు, అణగారిన వర్గాల వారి కోసం గత పదేళ్లుగా చేపడుతున్న ప్రచారాలు వచ్చే అయిదేళ్లలో మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ దేశంలోని 140 కోట్ల మంది పౌరుల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతాయి. అందుకే ఈ దేశంలోని ప్రతి పౌరుడూ.. తమ బాధ్యతలను నిర్వర్తించడం చాలా అవసరం. మనం దేశం గురించి ఆలోచించాలి. విభజనపూరిత ఆలోచనలకు దూరంగా ఉంటూ.. దేశ ఐక్యతను మనం బలోపేతం చేయాలి. సంత్ రవిదాస్ జీ కృపతో ఈ దేశ ప్రజల కలలు నెరవేరతాయని నేను విశ్వసిస్తున్నాను. మరోసారి సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ధన్యవాదాలు
సూచన: ఇది ప్రధాని హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం.
***
(Release ID: 2168970)
Visitor Counter : 5
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam