ప్రధాన మంత్రి కార్యాలయం
సెప్టెంబరు 17న మధ్యప్రదేశ్‌లో ప్రధాని పర్యటన
‘స్వస్థ నారీ సశక్త్ పరివార్’, ‘8వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవా’లను ప్రారంభించనున్న ప్రధాని
మహిళలు, పిల్లల ఆరోగ్యం కోసం దేశంలో అతిపెద్ద కార్యక్రమం
సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 2 వరకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో లక్షకు పైగా శిబిరాలు
మధ్యప్రదేశ్‌లో ఆది సేవా పర్వ్‌ను ప్రారంభించనున్న ప్రధాని: గిరిజన ప్రాంతాల్లో వరుసగా సేవా కార్యక్రమాలు
మధ్యప్రదేశ్‌లో సికిల్‌సెల్ పరీక్ష, కౌన్సెలింగ్ కార్డుల పంపిణీ
ధార్‌లో పీఎం మిత్ర పార్కును ప్రారంభించనున్న ప్రధాని
Posted On:
16 SEP 2025 2:49PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ధార్‌లో ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్’, ‘8వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవ’ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. పలు ఇతర కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడంతోపాటు ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగిస్తారు.
ఆరోగ్యం, పోషణ, దారుఢ్యం, స్వస్థ - సశక్త భారత్ పట్ల ప్రధానమంత్రికి ఉన్న నిబద్దతకు అనుగుణంగా... ‘స్వస్థ్ నారీ సశక్త పరివార్’, రాష్ట్రీయ పోషణ మాస’ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రులు, ఇతర ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 2 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా లక్షకుపైగా ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తారు. మహిళలు, పిల్లల ఆరోగ్యానికి సంబంధించి దేశంలో అతిపెద్ద ఆరోగ్య కార్యక్రమంగా ఇది నిలవనుంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో రోజూ ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తారు.
దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమం.. మహిళలు కేంద్రంగా సమాజంలో అనారోగ్య ముందస్తు నివారణ, ఆరోగ్య ప్రోత్సాహక, వ్యాధి నిర్మూలక వైద్య సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అసాంక్రమిక వ్యాధులు, రక్తహీనత, క్షయ, సికిల్‌సెల్ వ్యాధుల పరీక్ష, ముందస్తు గుర్తింపు, చికిత్స సంబంధిత అంశాలను ఇది బలోపేతం చేస్తుంది. అలాగే ప్రసవానంతర సంరక్షణ, రోగ నిరోధకత, పోషకాహారం, నెలసరి సమయంలో పరిశుభ్రత, జీవన శైలి, మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాల ద్వారా.. మాతా శిశు, కౌమార ఆరోగ్య రక్షణనూ ప్రోత్సహిస్తుంది. వైద్య కళాశాలలు, జిల్లా ఆసుపత్రులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా.. గైనకాలజీ, శిశు వైద్యం, కంటి, నేత్ర, ఈఎన్టీ, దంత, చర్మవ్యాధుల చికిత్స, మానసిక వైద్యం వంటి సేవలను సమీకరించాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా రక్తదాన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. దాతలు ఇ- రక్తకోశ్ పోర్టలులో నమోదు చేసుకుంటారు. మైగవ్ ద్వారా ప్రతిజ్ఞా ప్రచారాలను నిర్వహిస్తారు. పీఎంజేఏవై, ఆయుష్మాన్ వయోవందన, ఏబీహెచ్ఏ కింద లబ్ధిదారులు నమోదు చేసుకుంటారు. కార్డు ధ్రువీకరణ, ఫిర్యాదుల పరిష్కారం కోసం ఆరోగ్య శిబిరాల్లో సహాయక డెస్కులను ఏర్పాటు చేస్తారు. మహిళల్లో, కుటుంబాల్లో సంపూర్ణ ఆరోగ్యం, సంరక్షణ పద్ధతులను ప్రోత్సహించడం లక్ష్యంగా యోగా సదస్సులు, ఆయుర్వేద సంప్రదింపులు, ఇతర ఆయుష్ సేవలను కూడా అందిస్తారు. ఊబకాయ నివారణ, మెరుగైన పోషకాహారం, స్వచ్ఛంద రక్తదానంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ.. ఆరోగ్యకరమైన జీవనశైలి పద్ధతుల దిశగా ప్రజా సమూహాలను ఈ కార్యక్రమం సమీకరిస్తుంది. ఏకోన్ముఖ సమాజ దృక్పథంతో... పోషకాహారం, కౌన్సెలింగ్, సంరక్షణ ద్వారా టీబీ వ్యాధిగ్రస్తులకు చేయూతనివ్వడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక www.nikshay.inలో ‘నిక్షయ మిత్ర’లుగా నమోదు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహిస్తారు.
ఒక్క క్లిక్‌తో ప్రధానమంత్రి మాతృవందన యోజన నిధులను దేశవ్యాప్తంగా అర్హులైన మహిళల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేస్తారు. దేశంలో దాదాపు పది లక్షల మంది మహిళలు దీని ద్వారా లబ్ధి పొందుతారు.
మాతాశిశు ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి ఉద్దేశించిన సుమన్ సఖి చాట్‌బాట్‌ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ చాట్‌బాట్ గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులకు సకాలంలో కచ్చితమైన సమాచారాన్ని అందిస్తూ, అవసరమైన ఆరోగ్య సేవలను పొందేలా చూస్తుంది.
సికిల్‌సెల్ రక్తహీనత నిర్మూలన కోసం దేశ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా.. రాష్ట్రానికి కోటి సికిల్ సెల్ పరీక్ష, కౌన్సెలింగ్ కార్డులను ప్రధానమంత్రి పంపిణీ చేస్తారు.
ఆది కర్మయోగి అభియాన్‌లో భాగంగా.. మధ్యప్రదేశ్‌లో ‘ఆది సేవా పర్వ్’ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. గిరిజనుల స్వాభిమానమూ దేశ వికాసాల సమ్మేళనాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. ఇందులో భాగంగా ఆరోగ్యం, విద్య, పోషకాహారం, నైపుణ్యాబివృద్ధి, జీవనోపాధిని మెరుగుపరచుకోవడం, పారిశుద్ధ్యం, నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తూ.. గిరిజన ప్రాంతాల్లో వరుస సేవా కార్యక్రమాలు చేపడతారు. ప్రతి గ్రామానికీ దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయడం లక్ష్యంగా.. ట్రైబల్ విలేజ్ యాక్షన్ ప్లాన్, ట్రైబల్ విలేజ్ విజన్-2030పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు.
పొలం నుంచి ఫైబర్ వరకు (ఫాం టు ఫైబర్), ఫైబర్ నుంచి ఫ్యాక్టరీ వరకు (ఫైబర్ టు ఫ్యాక్టరీ), ఫ్యాక్టరీ నుంచి ఫ్యాషన్ వరకు (ఫ్యాక్టరీ టు ఫ్యాషన్), ఫ్యాషన్ నుంచి దేశాంతరాలకు (ఫ్యాషన్ టు ఫారిన్)- ఈ 5F దృక్పథానికి అనుగుణంగా... ధార్‌లో పీఎం మిత్ర పార్కును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.
2,150 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ పార్కు.. ఉమ్మడి మురుగునీటి శుద్ధి కర్మాగారం, సౌర విద్యుత్ ప్లాంటు, ఆధునిక రోడ్లు సహా ప్రపంచ స్థాయి సదుపాయాలతో ఆదర్శవంతమైన పారిశ్రామిక టౌన్‌షిప్‌గా నిలవనుంది. ఉత్పత్తులకు మెరుగైన విలువను అందించి, రైతుల ఆదాయాన్ని పెంచడం ద్వారా ఈ ప్రాంత పత్తి రైతులకు ఇది విశేష ప్రయోజనం చేకూరుస్తుంది.
వివిధ వస్త్ర కంపెనీలు రూ.23,140 కోట్లకు పైగా పెట్టుబడి ప్రతిపాదనలు సమర్పించడం ద్వారా కొత్త పరిశ్రమలకు, భారీగా ఉపాధి కల్పనకు మార్గం సుగమమైంది. ఇది ఎగుమతులను విశేషంగా పెంచడంతోపాటు దాదాపు 3 లక్షల ఉద్యోగావకాశాలను అందిస్తుంది.
పర్యావరణ పరిరక్షణ, మహిళల ఆర్థిక సాధికారతకు కట్టుబడి ఉన్న ప్రధానమంత్రి.. రాష్ట్రంలో చేపట్టిన ‘ఏక్ బాగియా మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా మహిళా స్వయం సహాయక బృందంలోని ఒక లబ్ధిదారుకు ఓ మొక్కను బహూకరిస్తారు. మధ్యప్రదేశ్‌లో 10,000 మందికి పైగా మహిళలు ‘మా కీ బాగియా’ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు. మొక్కల సంరక్షణ కోసం కావాల్సిన అన్ని వనరులనూ మహిళా సంఘాలకు అందిస్తున్నారు.
(Release ID: 2167359)
Visitor Counter : 18
Read this release in:
Assamese
,
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam