ప్రధాన మంత్రి కార్యాలయం
అస్సాంలోని గోలాఘాట్ లో పాలీప్రొపిలీన్ సంస్థ శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
14 SEP 2025 5:16PM by PIB Hyderabad
భారత్ మాతా కీ జై! ప్రజాదరణ పొందిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు సర్బానంద సోనోవాల్, హర్దీప్ సింగ్ పూరి, అస్సాం ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన నా సోదరీసోదరులారా!
అస్సాం ప్రజలందరికీ ముందస్తుగా దుర్గాపూజ శుభాకాంక్షలు. మహాపురుషుడు శ్రీమంత శంకర దేవ్ జయంతి సందర్భంగా, ఆ మహనీయుని స్మరించుకుంటూ వారికి భక్తిపూర్వక శ్రద్ధాంజలి సమర్పిస్తున్నాను.
మిత్రులారా,
నేను గత రెండు రోజులుగా ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్నాను. నేను ఈశాన్య రాష్ట్రాలకు వచ్చినప్పుడల్లా, నాకు అపూర్వమైన ప్రేమ, ఆశీర్వాదాలు లభిస్తాయి. ముఖ్యంగా అస్సాంలోని ఈ ప్రాంతంలో నాకు లభించే ప్రేమ, ఆప్యాయత అద్భుతమైనది. మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
మిత్రులారా,
అభివృద్ధి చెందిన అస్సాం, అభివృద్ధి చెందిన భారతదేశ అద్భుతమైన ప్రయాణానికి నేడు చాలా ముఖ్యమైన రోజు. నేడు అస్సాంకు దాదాపు రూ.18 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు వచ్చాయి. నేను కొద్దిసేపటి కిందట దరంగ్ లో ఉన్నాను. అక్కడ కనెక్టివిటీ, ఆరోగ్యానికి సంబంధించిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసే అవకాశం నాకు లభించింది. ఇప్పుడు ఇక్కడ ఇంధన భద్రతకు సంబంధించిన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. ఈ ప్రయత్నాలు అభివృద్ధి చెందిన అస్సాం మార్గాన్ని మరింత బలోపేతం చేస్తాయి.
మిత్రులారా,
అస్సాం భారతదేశ ఇంధన సామర్థ్యాన్ని పెంచే భూమి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే పెట్రోలియం ఉత్పత్తులు దేశాభివృద్ధిని వేగవంతం చేస్తాయి. అస్సాంలోని ఈ సామర్ధ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ వేదిక వద్దకు రావడానికి ముందు నేను సమీపంలో మరో కార్యక్రమానికి వెళ్లాను. అక్కడ వెదురు నుంచి బయో ఇథనాల్ ఉత్పత్తి చేసే ఆధునిక ప్లాంటును ప్రారంభించాను. ఇది అస్సాంకు ఎంతో గర్వకారణం. ఇథనాల్ ప్లాంట్ ప్రారంభోత్సవంతో పాటు పాలీ ప్రొపిలీన్ ప్లాంటుకు కూడా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన జరిగింది. ఈ ప్లాంట్లు అస్సాంలోని పరిశ్రమలకు ఊతం ఇస్తాయి. అస్సాం అభివృద్ధిని వేగవంతం చేస్తాయి. అవి రైతులకు, యువతకు, ప్రతి ఒక్కరికీ కొత్త అవకాశాలను సృష్టిస్తాయి. ఇన్ని ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా మీ అందరికీ అభినందనలు.
మిత్రులారా,
భారతదేశం నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. భారతదేశం అభివృద్ధి చెందుతున్న కొద్దీ, విద్యుత్తు, గ్యాస్, ఇంధనం కోసం మన అవసరాలు కూడా పెరుగుతున్నాయి. వీటి కోసం మనం విదేశాలపై ఆధారపడుతున్నాం. విదేశాల నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురును, గ్యాస్ ను దిగుమతి చేసుకుంటున్నాం. ఇందుకోసం భారతదేశం ప్రతి సంవత్సరం ఇతర దేశాలకు కోట్లాది రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. మన డబ్బు విదేశాలలో ఉద్యోగాలను సృష్టిస్తోంది. అక్కడి అక్కడి ప్రజల ఆదాయాన్ని పెంచుతోంది. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉంది. అందుకే భారతదేశం తన ఇంధన అవసరాల కోసం స్వావలంబన బాట పట్టింది.
మిత్రులారా,
ఒకవైపు దేశంలో కొత్తగా ముడి చమురు, గ్యాస్ నిక్షేపాలను కనుగొంటూనే, మరోవైపు మన హరిత ఇంధన సామర్థ్యాలను కూడా పెంచుతున్నాం. ఈసారి నేను ఎర్రకోట నుంచి ‘సముద్ర మంథన్‘ ప్రకటించిన విషయం మీకు తెలుసు. మన సముద్రాలలో కూడా భారీగా చమురు, సహజ వాయువు నిల్వలు ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ వనరులను దేశానికి ఉపయోగకరంగా మార్చేందుకు వాటిని అన్వేషించడానికి మేం ‘నేషనల్ డీప్ వాటర్ ఎక్స్ ప్లొరేషన్ మిషన్’ ను ప్రారంభించబోతున్నాం.
మిత్రులారా,
హరిత ఇంధన ఉత్పత్తిలో కూడా భారతదేశం వేగంగా అడుగులు వేస్తోంది. ఒక దశాబ్దం క్రితం, భారత్ సౌర విద్యుత్తు లో చాలా వెనుకబడి ఉండేది. కానీ నేడు సౌర విద్యుత్ రంగంలో భారత్ ప్రపంచంలోని మొదటి ఐదు దేశాలలో ఒకటిగా నిలిచింది.
మిత్రులారా,
మారుతున్న ప్రస్తుత కాలంలో, భారత్ కు చమురు, గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా మరిన్ని ఇంధనాలు అవసరం. అటువంటి ప్రత్యామ్నాయం ఇథనాల్. ఈ రోజు ఇక్కడ వెదురుతో ఇథనాల్ తయారు చేసే ప్లాంట్ ప్రారంభం అయింది. ఇది అస్సాం రైతులకు, నా గిరిజన సోదరులు, సోదరీమణులకు, వారి కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.
మిత్రులారా,
బయో ఇథనాల్ ప్లాంటును నడపడానికి అవసరమైన వెదురు కోసం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడి రైతులకు వెదురు సాగు చేయడానికి ప్రభుత్వం సహాయం చేస్తోంది. వెదురును కూడా కొనుగోలు చేస్తుంది. వెదురు చిప్పింగ్ కు సంబంధించిన చిన్న యూనిట్లను ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఏటా ఈ రంగంలో సుమారు రూ.200 కోట్లు ఖర్చు చేస్తాం. ఈ ఒక్క ప్లాంట్ ద్వారా ఇక్కడి వేలాది మంది ప్రజలు ప్రయోజనం పొందుతారు.
మిత్రులారా,
ఈ రోజు మనం వెదురు నుంచి ఇథనాల్ తయారు చేయబోతున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వెదురు కోసినందుకు ప్రజలను జైలులో పెట్టిన రోజులను మీరు మర్చిపోకూడదు. మన గిరిజనుల దైనందిన జీవితంలో భాగమైన వెదురును కోయడంపై నిషేధం ఉండేది. మా ప్రభుత్వం వెదురు కోతపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ రోజు ఈ నిర్ణయం ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తోంది.
మిత్రులారా,
మీరందరూ మీ దైనందిన జీవితంలో ప్లాస్టిక్ తో తయారు చేసిన వస్తువులను చాలా ఉపయోగిస్తారు. ప్లాస్టిక్ బకెట్లు, కప్పులు, బంతులు, కుర్చీలు, టేబుల్స్, ప్యాకేజింగ్ మెటీరియల్ మొదలైనవి ప్రతిరోజూ చాలా అవసరం. మీకు తెలుసు. ఇవన్నీ తయారు చేయడానికి అవసరమైన పదార్థం పాలీ ప్రొపిలీన్. పాలీ ప్రొపిలీన్ లేకుండా నేటి జీవనాన్ని ఊహించడం కష్టం. తివాచీలు, తాళ్లు, సంచులు, ఫైబర్లు, మాస్కులు, మెడికల్ కిట్లు, వస్త్రాలు, అనేక ఇతర వస్తువులు దీని నుంచే తయారవుతాయి. వాహనాలలోనూ, వైద్య పరికరాలు, వ్యవసాయ పరికరాల తయారీలో కూడా దీనిని వాడతారు. ఈ రోజు, అస్సాంకు ఈ ఆధునిక పాలీ ప్రొపిలీన్ ప్లాంట్ అనే ఒక వరం లభించింది.ఈ ప్లాంట్ ద్వారా మేక్ ఇన్ అస్సాం, మేక్ ఇన్ ఇండియా పునాది బలోపేతం కానుంది. దీనితో ఇక్కడ ఇతర తయారీ పరిశ్రమలు కూడా ఊపందుకుంటాయి.
మిత్రులారా,
అస్సాం ఇప్పటికే గోమోషా, ఎరి, ముగా సిల్క్ కు ప్రసిద్ధి చెందినట్లే, పాలీ ప్రొపిలీన్ తయారీ వస్త్రాలకు కూడా గుర్తింపు తెచ్చుకుంటుంది.
మిత్రులారా,
స్వావలంబన భారత్ దిశగా జరుగుతున్న ప్రయత్నాలు నేడు తారస్థాయికి చేరుతున్నాయి. ఈ ప్రచారంలో అస్సాం ప్రధాన కేంద్రాలలో ఒకటిగా ఉంది. అస్సాం సామర్థ్యంపై నాకు గొప్ప విశ్వాసం ఉంది. అందుకే ఒక చాలా పెద్ద మిషన్ కోసం మేం అస్సాంను ఎంచుకున్నాం. ఈ మిషన్ సెమీకండక్టర్ మిషన్. అస్సాంపై నాకున్న నమ్మకానికి గల కారణం కూడా అంతే పెద్దది. బానిసత్వ కాలంలో అస్సాం టీ అంతగా ప్రాచుర్యంలో లేదు. కానీ అతి తక్కువ సమయంలోనే, అస్సాం నేల, అస్సాం ప్రజలు అస్సాం టీని ప్రపంచ బ్రాండ్‌గా మార్చారు. ఇప్పుడు కొత్త శకం వచ్చింది. స్వావలంబన సాధించడానికి భారత్ కు రెండు విషయాలు అవసరం. ఒకటి శక్తి. మరొకటి సెమీకండక్టర్. వీటిలో అస్సాం చాలా పెద్ద పాత్ర పోషిస్తోంది.
మిత్రులారా,
నేడు, బ్యాంక్ కార్డుల నుంచి మొబైల్ ఫోన్లు, కార్లు, విమానాలు, అంతరిక్ష మిషన్ల వరకు ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువు ఆత్మ ఒక చిన్న ఎలక్ట్రానిక్ చిప్ లోనే ఉంది. ఈ వస్తువులన్నింటినీ మనం భారతదేశంలో తయారు చేయాలంటే, ఆ చిప్స్ మనవే కావాలి. అందుకే భారత్ సెమీకండక్టర్ మిషన్ ను ప్రారంభించి అస్సాంను ప్రధాన కేంద్రంగా మార్చింది. మోరిగావ్ లో సెమీకండక్టర్ ఫ్యాక్టరీ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇందుకోసం 27 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఇది అస్సాంకు గర్వకారణం.
మిత్రులారా,
కాంగ్రెస్ దేశాన్ని చాలా కాలం పాలించింది. ఇక్కడ అస్సాంలో కూడా కాంగ్రెస్ అనేక దశాబ్దాల పాటు ప్రభుత్వాన్ని నడిపింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నంతకాలం అభివృద్ధి వేగం మందగించింది. వారసత్వం కూడా సంక్షోభంలోనే నిలిచిపోయింది. అయితే బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అస్సాం పాత గుర్తింపును బలోపేతం చేస్తోంది. అస్సాంను ఆధునిక గుర్తింపుతో కూడా కలుపుతోంది. అస్సాంకు, ఈశాన్య రాష్ట్రాలకు కాంగ్రెస్ వేర్పాటు, హింస, వివాదాలనే ఇచ్చింది. కానీ బీజేపీ అస్సాంను అభివృద్ధి, వారసత్వంలో సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతోంది. అస్సామీ భాషకు శాస్త్రీయ భాష హోదాను ఇచ్చింది మా ప్రభుత్వమే. అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం కూడా కొత్త జాతీయ విద్యా విధానాన్ని వేగంగా అమలు చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఇక్కడ స్థానిక భాషల్లో విద్యను ప్రోత్సహిస్తున్నారు.
మిత్రులారా,
ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు గానీ, అస్సాంకు చెందిన ప్రముఖులకు గానీ కాంగ్రెస్ ఎన్నడూ తగిన గౌరవం ఇవ్వలేదు. వీర్ లసిత్ బోర్ఫుకాన్ వంటి వీర యోధులు ఈ గడ్డపై ఉన్నారు. కానీ కాంగ్రెస్ వారికి తగిన గౌరవాన్ని ఇవ్వలేదు. మా ప్రభుత్వం లసిత్ బోర్ఫుకాన్ వారసత్వాన్ని గౌరవించింది. ఆయన 400వ జయంతిని జాతీయ స్థాయిలో జరుపుకున్నాం. ఆయన జీవిత చరిత్రను 23 భాషల్లో ప్రచురించాం. ఇక్కడ జోర్హాట్ లో ఆయన భారీ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం కూడా నాకు లభించింది. కాంగ్రెస్ విస్మరించినదాన్ని మేం తెరపైకి తెస్తున్నాం.
మిత్రులారా,
శివసాగర్ లోని చారిత్రాత్మక రంగఘర్ నిర్లక్ష్యానికి గురైంది. మా ప్రభుత్వం దానిని పునరుద్ధరించింది. శ్రీమంత శంకర్ దేవ్ జన్మస్థలమైన బాటాద్రవను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్ కాంప్లెక్సును నిర్మించినట్లే, ఉజ్జయినిలో మహాకాళ మహాలోక్ నిర్మించినట్లే, అస్సాంలో కామాఖ్య మాత కారిడార్ ను కూడా మా ప్రభుత్వం నిర్మిస్తోంది.
మిత్రులారా,
అస్సాం సంస్కృతి, చరిత్రకు సంబంధించిన ఇలాంటి చిహ్నాలు చాలా ఉన్నాయి. వాటిని బీజేపీ ప్రభుత్వం కొత్త తరం కోసం భద్రపరుస్తోంది. ఇది అస్సాం వారసత్వానికి ప్రయోజనం చేకూర్చడమే కాకుండా, అస్సాంలో పర్యాటక పరిధి పెరిగేందుకు కూడా దోహదపడు తోంది. అస్సాంలో పర్యాటకం ఎంత పెరిగితే మన యువతకు అంత ఎక్కువ ఉపాధి లభిస్తుంది.
మిత్రులారా,
ఈ అభివృద్ధి ప్రయత్నాల మధ్య, అస్సాంకు ఒక సవాల్ కూడా మరింత తీవ్రంగా మారుతోంది. ఈ సవాల్ చొరబాటు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు చొరబాటుదారులకు భూములు ఇచ్చి అక్రమ ఆక్రమణలకు రక్షణ కల్పించింది. ఓటు బ్యాంకు దురాశతో కాంగ్రెస్ అస్సాంలో జనాభా సమతుల్యతను దెబ్బతీసింది. ఇప్పుడు అస్సాం ప్రజలతో పాటు బీజేపీ ప్రభుత్వం కూడా ఈ సవాల్ ను ఎదుర్కొంటోంది. చొరబాటుదారుల నుంచి మీ భూములను విముక్తి చేస్తున్నాం. భూమి లేని, అవసరమైన గిరిజన కుటుంబాలకు మా ప్రభుత్వం భూమి లీజులు ఇస్తోంది. ‘మిషన్ వసుంధర‘ ను చేపట్టిన కోసం అస్సాం ప్రభుత్వానికి అభినందనలు. దీని కింద లక్షలాది కుటుంబాలకు భూమి లీజులు ఇచ్చారు. కొన్ని గిరిజన ప్రాంతాల్లో అహోం, కోచ్ రాజ్బోంగ్షి, గూర్ఖా వర్గాల భూమి హక్కులను గుర్తించారు. వాటిని రక్షిత తరగతుల జాబితాలో చేర్చారు. గిరిజన సమాజానికి జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దడానికి బీజేపీ పూర్తిగా కట్టుబడి ఉంది.
మిత్రులారా,
బీజేపీ ప్రభుత్వానికి అభివృద్ధి కోసం ఒకే ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం- నాగరిక్ దేవో భవ, నాగరిక్ దేవో భవ. అంటే, దేశ పౌరులు ఎటువంటి అసౌకర్యాన్ని ఎదుర్కోకూడదు. వారు చిన్న చిన్న అవసరాల కోసం అటూ ఇటూ తిరగాల్సిన అవసరం రాకూడదు. కాంగ్రెస్ పాలనలో చాలా కాలం పాటు పేదలు బాధలు పడ్డారు. తిరస్కరణకు గురయ్యారు. ఒక వర్గాన్ని మెప్పించడం ద్వారా కాంగ్రెసు తన పబ్బం గడుపుకుంది. అలా అధికారం సాధించేది. కానీ బీజేపీ ఎవరినో మెప్పించడం కాకుండా ప్రజలకు పూర్తి సంతృప్తి ఇవ్వడంపై దృష్టి పెట్టింది. ఏ ఒక్క పేదవాడు గానీ, ఏ ఒక్క ప్రాంతం గానీ వెనుకబడకూడదనే ఉద్దేశ్యంతో మేం పని చేస్తున్నాం. ఈ రోజు అస్సాంలో, పేదల కోసం కాంక్రీటు ఇళ్ళ నిర్మాణం కూడా వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ అస్సాంలో పేదలకు 20 లక్షల పైగా కాంక్రీటు ఇళ్లు అందించాం. ప్రతి ఇంటికి కుళాయి నీటిని అందించే పనులు కూడా అస్సాంలో వేగంగా కొనసాగుతున్నాయి.
మిత్రులారా,
ఇక్కడి తేయాకు తోటల్లో పనిచేస్తున్న నా సోదరీసోదరులు కూడా బీజేపీ ప్రభుత్వ పేద సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. తేయాకు కార్మికుల సంక్షేమమే మా ప్రాధాన్యత. తేయాకు తోటల్లో పనిచేసే మహిళలు, పిల్లలకు ప్రభుత్వం సహాయం అందిస్తోంది. మహిళల ఆరోగ్యానికి, పిల్లల విద్యకు మేం అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇక్కడ ప్రభుత్వం ప్రసూతి మరణాలు, శిశు మరణాల రేటును తగ్గించడానికి పథకాలను కూడా అమలు చేస్తోంది. కాంగ్రెస్ హయాంలో తేయాకు తోటల కార్మికులను తేయాకు కంపెనీల యాజమాన్యాల దయాదాక్షిణ్యాలకు వదిలేశారు. కానీ బీజేపీ ప్రభుత్వం వారికి ఇళ్లు, వారి ఇళ్లలో విద్యుత్ కనెక్షన్, మంచినీటి సౌకర్యంతో పాటు వారి ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటోంది. ఈ పథకాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది.
మిత్రులారా,
అస్సాం అభివృద్ధి ప్రయాణంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. వాణిజ్యం, పర్యాటకానికి అస్సాం ప్రధాన కేంద్రంగా మారుతుంది. మనందరం కలిసి అభివృద్ధి చెందిన అస్సాంను, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మిద్దాం. అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. నాతో పాటు చెప్పండి - భారత్ మాతా కీ జై! చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి - భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! ధన్యవాదాలు!
***
(Release ID: 2166907)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam