ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌లో ₹7,300 కోట్లకుపైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన


· “మణిపూర్‌ రాష్ట్రానికి రైల్వేల అనుసంధానం వేగంగా సాగుతోంది”

· “రాష్ట్రంలో పేదల అభ్యున్నతికి ఉద్దేశించిన అభివృద్ధి కార్యక్రమాలను మేం కొనసాగిస్తున్నాం”

· “మణిపూర్‌లో ఇక ఆశా... విశ్వాసాల నవోదయం తథ్యం”

· “ఈ రాష్ట్రాన్ని శాంతి.. సౌభాగ్యం.. ప్రగతికి చిహ్నంగా మార్చడం మా లక్ష్యం”

Posted On: 13 SEP 2025 2:17PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌లో ₹7,300 కోట్లకుపైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- ధైర్యం, దృఢ దీక్షకు మణిపూర్‌ ప్రసిద్ధమని, ఇక్కడి పర్వతాలు ప్రకృతి రాష్ట్రానికి ప్రసాదించిన అమూల్య కానుకలని అభివర్ణించారు. ప్రజల నిరంతర కృషికి ఇవి ప్రతీకలని కూడా ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల స్ఫూర్తికి అభివందనం చేస్తూ- తాను పాల్గొంటున్న కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినందుకు శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. వారు తనపై కురిపిస్తున్న ప్రేమాదరాలకు ధన్యవాదాలు అర్పించారు.

ఈ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలు, వైవిధ్యం, జన చైతన్యం దేశానికి ప్రధాన బలమని పేర్కొన్నారు. “మణిపూర్” అనే పదంలోనే “మణి” ఉన్నదని, భవిష్యత్తులో ఈశాన్య ప్రాంతం మొత్తాన్నీ ప్రకాశింపజేయగల రత్నానికి ఈ రాష్ట్రం చిహ్నమని వ్యాఖ్యానించారు. మణిపూర్ ప్రగతి ప్రయాణాన్ని వేగిరపరచేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని ప్రధానమంత్రి తెలిపారు. ఈ స్ఫూర్తితోనే ఇప్పుడు మణిపూర్ ప్రజల వద్దకు వచ్చానన్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రగతికి ఉద్దేశించిన దాదాపు ₹7,000 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించానని శ్రీ మోదీ చెప్పారు. ఈ ప్రాజెక్టులు మణిపూర్ జన జీవనాన్ని... ముఖ్యంగా కొండ ప్రాంతంలో నివసించే గిరిజనుల బతుకులు బాగుచేస్తాయని తెలిపారు. అలాగే ఈ ప్రాంతానికి ఆరోగ్య, విద్యా రంగాల్లో కొత్త సదుపాయాలను సృష్టిస్తాయని వివరించారు. నేటి ఈ ప్రాజెక్టుల శంకుస్థాపన నేపథ్యంలో మణిపూర్ రాష్ట్ర, చురచంద్‌పూర్ ప్రాంత ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

దేశ సరిహద్దులోని మణిపూర్ రాష్ట్రానికి అనుసంధానం సదా ఒక సమస్యగానే ఉందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ముఖ్యంగా మంచి రహదారులు లేనందువల్ల ప్రజలు పడుతున్న  ఇబ్బందులను, వారి ఆందోళనను తాను అర్థం చేసుకోగలనని చెప్పారు. అందుకే 2014 నుంచీ ఈ రాష్ట్రంలో అనుసంధానం మెరుగుపై నిశితంగా దృష్టి సారించానని తెలిపారు. దీనికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం రెండంచెలలో పని చేసిందని వెల్లడించారు. మొదటగా... మణిపూర్‌లో రైలు-రోడ్డు మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌ కేటాయింపులను అనేక రెట్లు పెంచామని తెలిపారు. రెండో అంచెలో- నగరాలకు మాత్రమేగాక గ్రామాలకూ రహదారి సంధానానికి కృషి మొదలు పెట్టామని చెప్పారు.

ప్రభుత్వ ప్రణాళికల మేరకు ఇటీవలి కాలంలో ఈ ప్రాంత జాతీయ రహదారుల కోసం ఇప్పటికే ₹3,700 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. మరో ₹8,700 కోట్ల విలువైన కొత్త హైవే ప్రాజెక్టులు వేగంగా సాగుతున్నాయని శ్రీ మోదీ వివరించారు. ఒకనాడు ఈ ప్రాంత గ్రామాలకు వెళ్లడం చాలా కష్టమని- ఇది ప్రజలందరికీ బాగా తెలిసిన వాస్తవమేనని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఇప్పుడు వందలాది గ్రామాలకు రహదారి సంధానం విస్తరించిందని ప్రధానమంత్రి  గుర్తుచేశారు. ఈ రహదారులతో కొండ గ్రామాలకు, గిరిజన ప్రజానీకానికి ఎంతో ప్రయోజనం చేకూరిందని చెప్పారు.

“మా ప్రభుత్వ హయాంలో మణిపూర్‌ రైలు మార్గాలతో సంధానమవుతోంది. ఇందులో భాగంగా జిరిబామ్-ఇంఫాల్ రైలు మార్గం త్వరలో రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌ను జాతీయ రైల్వే నెట్‌వర్కుతో జోడిస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ₹22,000 కోట్లు వెచ్చిస్తున్నదని, మరోవైపు ₹400 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇంఫాల్ కొత్త విమానాశ్రయం ద్వారా ఈ ప్రాంతానికి విమానయాన సంధానం కూడా ఇనుమడించిందని చెప్పారు. దీంతోపాటు ఈ విమానాశ్రయం నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు హెలికాప్టర్ సేవలను కూడా ప్రారంభించామని ఆయన వివరించారు. ఈ బహుముఖ అనుసంధానంతో మణిపూర్ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు సమకూరడమేగాక యువతకు కొత్త ఉపాధి అవకాశాలు కూడా అందివస్తున్నాయని శ్రీ మోదీ పేర్కొన్నారు.

“భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ఈ ప్రగతి ఫలితాలను దేశం నలుమూలలకూ చేరువ చేయడానికి మేం నిరంతరం కృషి చేస్తున్నాం” అని శ్రీ మోదీ తెలిపారు. ఒకనాడు ఢిల్లీలో ప్రకటించే హామీలు మణిపూర్ వంటి ప్రాంతాలకు చేరాలంటూ దశాబ్దాలు పట్టే దుస్థితి ఉండేదని గుర్తుచేశారు. అయితే, నేడు మణిపూర్‌ సహా చురచంద్‌పూర్ వంటి ప్రాంతాలు దేశంలోని మిగిలిన ప్రాంతాలతో సమానంగా పురోగమిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. పేదల కోసం పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ పథకం కింద మణిపూర్‌ రాష్ట్రంలోని వేలాది కుటుంబాలు కూడా ప్రయోజనం పొందాయన్నారు. ఈ మేరకు దాదాపు 60,000 ఇళ్లు పూర్తికాగా, లబ్ధిదారులకు అప్పగించామని వెల్లడించారు. లోగడ ఈ ప్రాంతం తీవ్ర విద్యుత్ కొరతతతో సతమతం అయ్యేదని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ కష్టాల నుంచి ప్రజలకు విముక్తి కల్పించే లక్ష్యం ఫలితంగా రాష్ట్రంలోని లక్షకుపైగా కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్‌ లభించిందని ఆయన చెప్పారు.

మణిపూర్‌లోని అమ్మలు.. చెల్లెమ్మలు చిరకాలం నుంచీ నీటి కోసం అష్టకష్టాలూ పడుతున్నారని ప్రధానమంత్రి అన్నారు. వారి అగచాట్లను తీర్చే దిశగా ప్రభుత్వం ‘ఇంటింటికీ కొళాయి నీరు’ పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఈ పథకం కింద కొన్నేళ్లుగా దేశంలోని 15 కోట్ల మందికిపైగా పౌరుల ఇళ్లకు కొళాయి కనెక్షన్లు ఇచ్చారని ఆయన వెల్లడించారు. మణిపూర్‌లో 7-8 ఏళ్ల కిందట 25 వేల నుంచి 30 వేల కుటుంబాలకు మాత్రమే పైపులైన్ల ద్వారా నీరు అందుతుండేదని శ్రీ మోదీ గుర్తుచేశారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 3.5 లక్షలకుపైగా ఇళ్లకు కొళాయి కనెక్షన్లు ఉన్నాయని పేర్కొన్నారు. అతి త్వరలోనే ప్రతి ఇంటికీ కొళాయి నీరు అందుతుందని హామీ ఇచ్చారు.

సామాజిక మౌలిక సదుపాయాల గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ- పర్వత, గిరిజన ప్రాంతాల్లో మంచి పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు ఒకప్పుడు గగన కుసుమాలేనని వ్యాఖ్యానించారు. ఎవరైనా తీవ్ర అనారోగ్యం పాలైతే ఆస్పత్రికి వెళ్లడానికి ఎంతో సమయం పట్టేదని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ కృషితో ఇప్పుడీ దుస్థితి తప్పిందని, చురచంద్‌పూర్‌లో వైద్య కళాశాల ఏర్పాటైందని శ్రీ మోదీ వివరించారు. ప్రస్తుతం అందులో వైద్యులు సిద్ధమవుతున్నారని, ఆరోగ్య సేవలు కూడా మెరుగవుతున్నాయని పేర్కొన్నారు. స్వాతంత్ర్యానంతరం దశాబ్దాలుగా మణిపూర్ పర్వత ప్రాంతాలకు వైద్య కళాశాల కలగానే మిగిలిందనే వాస్తవాన్ని గుర్తు తెచ్చుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రజల స్వప్నాన్ని ప్రస్తుత ప్రభుత్వం సాకారం చేసిందని చెప్పారు. ‘పీఎం-డివైన్‌’ పథకం కింద ఐదు పర్వత జిల్లాల్లో ఆధునిక ఆరోగ్య సేవలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదని తెలిపారు. ఇక ఆయుష్మాన్ భారత్ పథకం కింద పేద కుటుంబాలకు ₹5 లక్షలదాకా ఏటా ఉచిత చికిత్స సౌకర్యం లభిస్తున్నదని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా మణిపూర్‌లో దాదాపు 2.5 లక్షల మంది లబ్ధి పొందారని వివరించారు. ఈ రక్షణ లేకపోతే, రాష్ట్రంలోని పేదలు కనీసం ₹350 కోట్లు సొంతంగా ఖర్చు చేయాల్సి వచ్చేదని ఆయన వ్యాఖ్యానించారు. కానీ, ఈ ఖర్చు మొత్తాన్నీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే భరించిందని ప్రధానమంత్రి వెల్లడించారు. ప్రతి పేద పౌరుడి సమస్య పరిష్కారమే ప్రభుత్వ అగ్ర ప్రాథమ్యమని అని ఆయన అన్నారు.

“ఈశాన్య ప్రాంతం మణిపూర్ నేల ఆశలు.. ఆకాంక్షల నిలయాలు” అని ప్రధానమంత్రి అభివర్ణించారు. ఇంతటి అద్భుత ప్రాంతాన్ని దురదృష్టవశాత్తూ హింస పట్టి పీడించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సహాయ శిబిరాల్లో ఉంటున్న నిరాశ్రయులను కొద్దిసేపటి కిందట కలిశానని ప్రధాని చెప్పారు. వారితో తన సౌహార్ద సంభాషణ అనంతరం మణిపూర్‌లో ఆశా.. విశ్వాసాల నవోదయం కాగలదన్న నమ్మకం వారిలో వ్యక్తమైందని తెలిపారు.

“ఏ ప్రాంతమైనా ప్రగతి పథంలో పయనించాలంటే శాంతి స్థాపన అవశ్యం. ఆ మేరకు గడచిన 11 సంవత్సరాలుగా ఈశాన్యంలో అనేక దీర్ఘకాలిక ఘర్షణలు, వివాదాలను పరిష్కరించాం” అని ప్రధానమంత్రి వివరించారు. తదనుగుణంగా ప్రజానీకం కూడా శాంతి మార్గాన్ని ఎంచుకుని, అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చిందని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే ఇటీవల పర్వత, లోయ ప్రాంతాల సమూహాలతో చర్చలు సాగడం ఎంతో సంతృప్తినిచ్చిందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. శాంతి స్థాపనకు గౌరవం, పరస్పర అవగాహన, చర్చలు మార్గమన్నది కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగమని ఆయన పేర్కొన్నారు. శాంతి మార్గంలో ముందుకు సాగాలని ప్రజలను కోరుతూ,  వారి ఆకాంక్షలు నెరవేర్చాల్సిందిగా ప్రధానమంత్రి అన్ని వ్యవస్థలకూ విజ్ఞప్తి చేశారు. తాను సదా ప్రజల పక్షమేనని, కేంద్ర ప్రభుత్వం మణిపూర్‌ రాష్ట్రానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

మణిపూర్‌ రాష్ట్ర జనజీవనాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తున్నదని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా నిరాశ్రయులైన కుటుంబాలకు 7,000 కొత్త ఇళ్ల నిర్మాణం కోసం దాదాపు ₹3,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ఇటీవల ఆమోదించామని ప్రధానమంత్రి ప్రకటించారు. అలాగే నిరాశ్రయులకు సాయం కోసం ప్రత్యేకంగా ₹500 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

మణిపూర్‌ గిరిజన యువత కలలు, సంఘర్షణల గురించి తనకు బాగా తెలుసునని, వారి సమస్యల పరిష్కారానికి అనేక చర్యలు చేపడుతున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. స్థానిక పాలన సంస్థల బలోపేతానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తున్నదని, వాటి అభివృద్ధికి తగుమేర నిధులు సమకూర్చుతున్నదని ఆయన వెల్లడించారు.

“ప్రతి గిరిజన సమాజాభివృద్ధి జాతీయ ప్రాథమ్యం” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అందుకే దేశంలో తొలిసారి గిరిజన ప్రాంతాల ప్రగతి కోసం ‘ధరతి ఆబా జన్‌జాతియా గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్‌’ను ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమం కింద మణిపూర్ రాష్ట్రంలోని 500కుపైగా గ్రామాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలల సంఖ్యను పెంచుతున్నామని, ఇందులో భాగంగా మణిపూర్‌కు 18 పాఠశాలలు కేటాయించామని శ్రీ మోదీ పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల ఆధునికీకరణతో పర్వతప్రాంత జిల్లాల్లో విద్యా సౌకర్యాలు గణనీయంగా పెరుగుతాయని ఆయన చెప్పారు.

మణిపూర్ సంస్కృతి సదా మహిళా సాధికారతను ప్రోత్సహిస్తుందని, తదనుగుణంగా ప్రభుత్వం కూడా చురుగ్గా పనిచేస్తున్నదని శ్రీ మోదీ తెలిపారు. మణిపూర్ పుత్రికలకు అండగా ప్రభుత్వం ఉద్యోగినుల కోసం వసతి గృహాలను నిర్మిస్తున్నదని చెప్పారు.

“మణిపూర్‌ రాష్ట్రాన్ని శాంతి, సౌభాగ్యం, పురోగమనానికి చిహ్నంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మేం  కృషి చేస్తున్నాం” అని ప్రధానమంత్రి ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధి, నిర్వాసిత కుటుంబాల పునరావాసం, శాంతి స్థాపన దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రతి అంశంలోనూ సాధ్యమైనంత మేర రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తుందని ప్రజలకు హామీ ఇస్తూ ఆయన తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ శ్రీ అజయ్‌కుమార్‌ భల్లాతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

నేపథ్యం

మణిపూర్‌లో ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులలో- ₹3,600 కోట్లకుపైగా విలువైన పట్టణ రహదారులు, డ్రైనేజీ, ఆస్తుల మెరుగైన నిర్వహణ సంబంధిత పనులున్నాయి. అలాగే ₹2,500 కోట్లకుపైగా విలువైన 5 జాతీయ రహదారి ప్రాజెక్టులు, మణిపూర్ ఇన్ఫోటెక్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్, 9 ప్రదేశాల్లో ఉద్యోగినులకు వసతి గృహాల నిర్మాణం తదితర పనులు చేపడతారు.

 

***


(Release ID: 2166443) Visitor Counter : 2