ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఢిల్లీలోని యశోభూమి వేదికగా జరిగిన సెమీకాన్ ఇండియా-2025 సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 02 SEP 2025 12:55PM by PIB Hyderabad

కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు అశ్విని వైష్ణవ్ గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా గారు, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ గారు, కేంద్ర సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ గారు, ఎస్ఈఎమ్ఐ అధ్యక్షులు అజిత్ మనోచా గారు, దేశవిదేశాల నుంచి వచ్చిన సెమీ కండక్టర్ పరిశ్రమకు చెందిన సీఈవోలు, వారి సహచరులు, వివిధ దేశాల నుంచి హాజరైన మా అతిథులు, అంకురసంస్థలతో అనుబంధంగా ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నా యువ విద్యార్థి మిత్రులు, సోదరసోదరీమణులారా!

 

నిన్న రాత్రే నేను జపాన్, చైనా దేశాల పర్యటన నుంచి తిరిగి వచ్చాను. మీ చప్పట్లు నేను అక్కడికి వెళ్ళినందుకా? లేక అక్కడి నుంచి తిరిగి వచ్చినందుకా? ఈ రోజు నేను ఆకాంక్షలు, విశ్వాసంతో నిండిన యశోభూమిలో మీ మధ్య ఉన్నాను. మీ అందరికీ తెలిసినట్లుగా నాకు టెక్నాలజీ పట్ల సహజంగానే మక్కువ ఎక్కువ. ఇటీవలి నా జపాన్ పర్యటన సందర్భంగా జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా సాన్‌తో కలిసి టోక్యో ఎలక్ట్రాన్ ఫ్యాక్టరీని సందర్శించే అవకాశం నాకు లభించింది. వారి సీఈవో కూడా మోదీ సాబ్ వచ్చారని ఇప్పుడే చెబుతున్నారు.

 

మిత్రులారా, 

 

టెక్నాలజీ పట్ల నాకున్న ఈ ఆసక్తే నన్ను మీ మధ్యకు తీసుకువస్తుంది. ఈ కారణంగానే ఈ రోజు కూడా నేను మీ మధ్య ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది.

 

మిత్రులారా, 

 

ప్రపంచవ్యాప్త సెమీ కండక్టర్ల రంగానికి చెందిన నిపుణులు ఇక్కడ ఉన్నారు. 40-50 కి పైగా దేశాల నుంచి వచ్చిన వారు ఆయా దేశాల ప్రతినిధులుగా ఈ సదస్సులో పాలుపంచుకుంటున్నారు. భారత ఆవిష్కరణలు, యువ శక్తి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ప్రపంచం భారత్ పట్ల విశ్వాసంతో ఉంది.. ప్రపంచం భారత్‌ను నమ్ముతోంది.. అలాగే భారత్‌తో కలిసి సెమీ కండక్టర్ల రంగం భవిష్యత్తును నిర్మించేందుకు ప్రపంచం సిద్ధంగా ఉందన్న సందేశాన్ని ఈ కలయిక తెలియజేస్తుంది.

 

సెమికాన్ ఇండియా సదస్సుకు విచ్చేసిన మీ అందరినీ నేను స్వాగతిస్తున్నాను. అభివృద్ధి చెందిన భారత్.. స్వయం-సమృద్ధ భారత్ ప్రయాణంలో మీరంతా మాకు అత్యంత ముఖ్యమైన భాగస్వాములు.

 

మిత్రులారా, 

 

ఈ సంవత్సరం మొదటి త్రైమాసికానికి సంబంధించిన జీడీపీ గణాంకాలు కొద్ది రోజుల కిందటే విడుదలయ్యాయి. మరోసారి భారత్ ప్రతి ఆశ, ప్రతి ఆకాంక్ష, ప్రతి అంచనా కంటే మెరుగ్గా రాణించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల్లో అనిశ్చితి కొనసాగుతూ.. ఆర్థిక స్వార్థం కారణంగా సవాళ్లు ఎదురవుతున్న పరిస్థితుల నడుమ భారత్ 7.8 శాతం వృద్ధిని సాధించింది. ఈ వృద్ధి ఉత్సాహం తయారీ, సేవలు, వ్యవసాయం, నిర్మాణం సహా ప్రతి రంగంలో.. ప్రతిచోటా కనిపిస్తుంది. భారత్ అభివృద్ధి చెందుతున్న వేగం మనందరిలో, అన్ని రంగాల్లో, దేశంలోని ప్రతి పౌరుడిలో కొత్త శక్తిని నింపుతోంది. ఇది వృద్ధి దిశ.. ఇది భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశగా వేగంగా పురోగమిస్తోంది.

 

మిత్రులారా, 

 

చమురు నల్ల బంగారం అయితే చిప్స్ డిజిటల్ వజ్రాలు అనే సామెత సెమీ కండక్టర్ల రంగంలో వాడుకలో ఉంది. మన గత శతాబ్ద రూపకల్పన చమురు ద్వారానే జరిగింది. చమురు బావుల ద్వారానే ప్రపంచ విధి నిర్ణయం జరిగింది. ఈ చమురు బావుల నుంచి ఉత్పత్తి అయ్యే పెట్రోలియం పరిమాణం ఆధారంగానే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ హెచ్చుతగ్గులకు లోనయింది. కానీ 21వ శతాబ్దపు శక్తి కేవలం ఒక చిన్న చిప్‌లో ఉంది. ఈ చిప్స్ చిన్నవిగా ఉండవచ్చు.. కానీ అవి ప్రపంచ పురోగతికి అతిపెద్ద ప్రోత్సాహాన్నిచ్చే శక్తిని కలిగి ఉన్నాయి. అందుకే నేడు సెమీ కండక్టర్ల రంగం మార్కెట్ 600 బిలియన్ డాలర్లకు చేరుకుంటోంది. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే ఇది ట్రిలియన్ డాలర్లను దాటుతుంది. సెమీ కండక్టర్ల రంగంలో భారత్ పురోమిస్తున్న వేగంతో.. ఈ ట్రిలియన్ డాలర్ మార్కెట్లో గణనీయమైన వాటా భారత్ కలిగి ఉంటుందని నేను నమ్ముతున్నాను.

మిత్రులారా, 

 

భారత వేగం ఏమిటో కూడా నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. 2021 సంవత్సరంలో మేం సెమికాన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించాం. 2023 నాటికి దేశంలో మొట్టమొదటి సెమీ కండక్టర్ ప్లాంట్ ఆమోదం పొందింది. 2024 సంవత్సరంలో మేం మరికొన్ని ప్లాంట్లకు ఆమోదం తెలిపాం. ఈ 2025 సంవత్సరంలో మేం మరో 5 ప్రాజెక్టులను క్లియర్ చేశాం. మొత్తంమీద 10 సెమీ కండక్టర్ ప్రాజెక్టుల కోసం పద్దెనిమిది బిలియన్ డాలర్లు అంటే రూ. 1.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఇది ప్రపంచానికి భారత్ పట్ల పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనం.

 

మిత్రులారా, 

 

సెమీ కండక్టర్ల రంగంలో వేగమే ముఖ్యం. ఫైల్ నుంచి ఫ్యాక్టరీకి ఎంత తక్కువ సమయం, తక్కువ కాగితపు పని ఉంటే వేఫర్ పని అంత త్వరగా ప్రారంభమవుతుంది. మా ప్రభుత్వం ఇదే విధానంతో పనిచేస్తోంది. మేం జాతీయ స్థాయిలో సింగిల్ విండో వ్యవస్థను అమలు చేశాం. దీని ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులన్నీ ఒకే వేదికపై లభిస్తున్నాయి. ఇది మా పెట్టుబడిదారులకు కాగితపు పని శ్రమ నుంచి విముక్తి కల్పించింది. దేశవ్యాప్తంగా నేడు ప్లగ్ అండ్ ప్లే మౌలిక సదుపాయాల నమూనాపై సెమీ కండక్టర్ పార్కుల నిర్మాణం జరుగుతోంది. ఈ పార్కుల్లో స్థలం, విద్యుత్ సరఫరా, పోర్టులు, విమానాశ్రయాలు, నైపుణ్యం కలిగిన కార్మికుల వ్యవస్థతో పాటు వీటన్నింటికీ కనెక్టివిటీ వంటి సదుపాయాలూ అందుబాటులో ఉన్నాయి. వీటికి ప్రోత్సాహకాలు కూడా జోడిస్తే ఈ రంగం కచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. పీఎల్ఐ ప్రోత్సాహకాలైనా.. డిజైన్ లింక్డ్ గ్రాంట్లు అయినా.. భారత్ ఎండ్ టు ఎండ్ సామర్థ్యాలను అందిస్తోంది. అందుకే పెట్టుబడులు నిరంతరం వస్తూనే ఉన్నాయి. భారత్ ఇప్పుడు బ్యాకెండ్ నుంచి ఫుల్ స్టాక్ సెమీ కండక్టర్ నేషన్‌గా మారుతోంది. భారత్‌లో తయారైన అతి చిన్న చిప్ ప్రపంచంలోనే అతిపెద్ద మార్పును కలిగించే రోజు ఎంతో దూరంలో లేదు. నిజానికి మా ప్రయాణం ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ ఇప్పుడు మమ్మల్ని ఏదీ ఆపలేదు. సీజీ పవర్ పైలట్ ప్లాంట్ 4-5 రోజుల కిందట... అంటే గత నెల 28న ప్రారంభమైందని నాకు చెప్పారు. కేన్స్ పైలట్ ప్లాంట్‌లోనూ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. మైక్రాన్, టాటా టెస్ట్ చిప్‌ల ఉత్పత్తి ఇప్పటికే మొదలైంది. నేను ఇంతకుముందే చెప్పినట్లుగా ఈ సంవత్సరం నుంచే వాణిజ్య చిప్‌ల ఉత్పత్తి ప్రారంభమవుతుంది. సెమీ కండక్టర్ల రంగంలో భారత్ పురోగమిస్తున్న వేగానికి ఇది నిదర్శనం.

 

మిత్రులారా, 

 

దేశంలో సెమీ కండక్టర్ల విజయగాథ ఏదైనా ఒక వర్టికల్.. ఏదైనా ఒక సాంకేతికతకు మాత్రమే పరిమితం కాదు. మేం డిజైనింగ్, తయారీ, ప్యాకేజింగ్, హై-టెక్ పరికరాలు సహా ప్రతీదీ భారత్‌లోనే లభించే ఒక సంపూర్ణ వ్యవస్థను రూపొందిస్తున్నాం. మా సెమీ కండక్టర్ మిషన్ కేవలం ఒక ఫ్యాబ్.. ఒక చిప్ తయారీకి పరిమితం కాదు. భారత్‌ను స్వయం-సమృద్ధ దేశంగా, ప్రపంచంతో పోటీపడేలా మార్చే సెమీ కండక్టర్ల వ్యవస్థను మేం రూపొందిస్తున్నాం.

 

మిత్రులారా, 

 

భారత సెమీ కండక్టర్ మిషన్ మరో ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే అత్యంత అధునాతన సాంకేతికతలతో భారత్ ఈ రంగంలో ముందుకు సాగుతోంది. మా దేశంలో తయారైన చిప్‌ల నుంచి కొత్త శక్తిని పొందే సరికొత్త సాంకేతికతలపై మేం దృష్టి సారించాం. నోయిడా, బెంగళూరులో నిర్మిస్తున్న మా డిజైన్ కేంద్రాలు ప్రపంచంలోని అత్యంత అధునాతన చిప్‌లను తయారు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నాయి. ఇవి బిలియన్ల కొద్దీ ట్రాన్సిస్టర్‌లను నిల్వ చేస్తున్న చిప్‌లు. ఈ చిప్‌లు 21వ శతాబ్దపు సాంకేతికతలకు కొత్త శక్తినిస్తాయి.

 

మిత్రులారా, 

 

ప్రపంచ సెమీ కండక్టర్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై భారత్ నిరంతర కృషి చేస్తోంది. నేడు మన నగరాల్లో ఆకాశహర్మ్యాలు, అద్భుతమైన భౌతిక మౌలిక సదుపాయాలను చూస్తున్నాం. అటువంటి మౌలిక సదుపాయాలకు పునాది ఉక్కు. మా డిజిటల్ మౌలిక సదుపాయాలకు ఆధారం ప్రధాన ఖనిజాలు. అందుకే భారత్ నేడు నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్‌ పనిచేస్తోంది. మన దేశంలో అరుదైన ఖనిజాల కోసం గల డిమాండ్‌ను తీర్చడానికి మేం కృషి చేస్తున్నాం. గత నాలుగేళ్లుగా ప్రధాన ఖనిజాల ప్రాజెక్టులపై విస్తృతంగా కృషి జరుగుతోంది.

 

మిత్రులారా, 

 

సెమీ కండక్టర్ రంగం వృద్ధిలో అంకురసంస్థలు, ఎమ్ఎస్ఎమ్ఈల పాత్ర కీలకమని మా ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచంలోని సెమీ కండక్టర్ డిజైన్ ప్రతిభలో 20 శాతం వాటాను భారత్ కలిగి ఉంది. భారత యువత నైపుణ్యాలు, అనుభవం సెమీ కండక్టర్ రంగంలో అతిపెద్ద ఆస్తిగా ఉన్నాయి. నా యువ పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, అంకురసంస్థలు ముందుకు రావాలి.. ప్రభుత్వం మీకు దన్నుగా నిలుస్తుందని నేను ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, చిప్స్-టు-స్టార్టప్ ప్రోగ్రామ్ మీ కోసం ప్రారంభించినవే. డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌ను ప్రభుత్వం పునరుద్ధరించనుంది. ఈ రంగంలో భారతీయ మేధో సంపత్తి (ఐపీ)ని అభివృద్ధి చేయడం కోసమే మా ప్రయత్నం. ఇటీవల ప్రారంభించిన అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్‌తో అనుబంధం కూడా మీకు సహాయకరంగా ఉంటుంది.

 

మిత్రులారా, 

 

అనేక రాష్ట్రాలు ఈ సదస్సులో పాల్గొంటున్నాయి.. అనేక రాష్ట్రాలు సెమీ కండక్టర్ రంగం కోసం ప్రత్యేక విధానాలను రూపొందించాయి.. ఈ రాష్ట్రాలు ప్రత్యేక మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో సెమీ కండక్టర్ రంగాన్ని అభివృద్ధి చేయడం.. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించే విషయంలో ఇతర రాష్ట్రాలతో ఆరోగ్యకరమైన పోటీ కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను.

మిత్రులారా, 

 

"సంస్కరణ, పనితీరు, పరివర్తన" అనే మంత్రాన్ని అనుసరిస్తూ భారత్ ఈ స్థాయికి చేరుకుంది. రాబోయే కాలంలోనూ మేం తదుపరి తరం సంస్కరణల కొత్త దశను ప్రారంభించనున్నాం. మేం ఇండియా సెమీకండక్టర్ మిషన్ తదుపరి దశ కోసం కూడా పని చేస్తున్నాం. ఈ సదస్సుకు హాజరైన పెట్టుబడిదారులందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.. మిమ్మల్ని విశాల హృదయంతో స్వాగతించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మీ భాషలో చెప్పాలంటే.. డిజైన్ సిద్ధంగా ఉంది... వేఫర్ రూపొందించే నమూనా సిద్ధమైంది. ఇప్పుడు కచ్చితత్వంతో అమలు చేయడం, అనుకున్న స్థాయిలో ఉత్పత్తులను అందించే సమయం ఆసన్నమైంది. మా విధానాలు స్వల్పకాలిక సంకేతాలు కాదు.. అవి దీర్ఘకాలిక నిబద్ధతలు. మేం మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాం. భారత్ రూపొందించింది.. భారత్‌లో తయారైంది.. ప్రపంచమంతా విశ్వసిస్తుందని ప్రపంచమంతా చెప్పే రోజు ఎంతో దూరంలో లేదు. మా ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలి.. ప్రతి బైట్ ఆవిష్కరణతో నిండి ఉండాలి.. మా ప్రయాణం నిరంతరం దోషరహితంగా.. మెరుగైన పనితీరుతో కొనసాగాలి. ఈ భావనతో.. మీ అందరికీ శుభాకాంక్షలు!

 

ధన్యవాదాలు!

 

 ***


(Release ID: 2163213) Visitor Counter : 9