ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
తెలంగాణ... కర్ణాటక... బీహార్... అస్సాం రాష్ట్రాల కోసం 3 మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులు సహా గుజరాత్‌లోని కచ్‌లో దూర ప్రాంతాలను అనుసంధానించే ఒక రైలు మార్గానికి మంత్రిమండలి ఆమోదం
· ప్రయాణిక-వస్తు రవాణాకు తోడ్పడే నిర్ణయం; కచ్ కొత్త రైలు మార్గంతో రాన్ ఆఫ్ కచ్... ధోలావీరా... కోటేశ్వర్ ఆలయం... నారాయణ్ సరోవర్-లఖపత్ కోటను అనుసంధానించడం ద్వారా పర్యాటక రంగ ప్రగతికి ఉత్తేజం
· ఈ నిర్ణయంతో రైల్వే నెట్‌వర్క్‌కు 565 రూట్ కిలోమీటర్ల జోడింపు; బొగ్గు... సిమెంట్... క్లింకర్... ఫ్లైయాష్... స్టీల్... కంటైనర్లు... ఎరువులు... వ్యవసాయ సామగ్రి... పెట్రో ఉత్పత్తులు వగైరాల రవాణాకు ఊతం
Posted On:
27 AUG 2025 4:50PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ సమావేశమైన కేంద్ర మంత్రిమండలి తెలంగాణ సహా దేశంలోని 5 రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చే 4 రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. దాదాపు రూ.12,328 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుల వివరాలిలా ఉన్నాయి:
1. దేశల్పార్ - హాజీపీర్ - లూనా వాయోర్ - లఖపత్ కొత్త మార్గం
2. సికింద్రాబాద్ (సనత్ నగర్) - వాడి మార్గంలో 3వ, 4వ లైన్
3. భాగల్పూర్ - జమాల్పూర్ 3వ లైన్
4. ఫర్కేటింగ్ - న్యూ తీన్‌సుకియా డబ్లింగ్
ఈ ప్రాజెక్టులతో ప్రయాణిక-వస్తు రవాణా రెండింటి రవాణా సజావుగా, వేగంగా సాగుతుంది. అంతేగాక ప్రయాణ సౌలభ్యంతోపాటు అనుసంధానం కూడా మెరుగుపడుతుంది. మరోవైపు రవాణా సంబంధిత వ్యయం సహా చమురు దిగుమతులపై పరాధీనత కూడా తగ్గుతుంది. ముఖ్యంగా కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గడానికి ఈ ప్రాజెక్టులు దోహదం చేస్తాయి. మొత్తం మీద రైలు రవాణా కార్యకలాపాల సామర్థ్యం పెరగడంతోపాటు ఈ మార్గాల నిర్మాణంలో దాదాపు 2,51,00,000 లక్షల పనిదినాల మేర ఆయా ప్రాంతాల నివాసులకు ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది.
తెలంగాణ, కర్ణాటక, బీహార్, అస్సాం రాష్ట్రాల పరిధిలోని 3 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులతో ప్రధానంగా అనుసంధానం మెరుగుపడుతుంది. వీటిలో తెలంగాణ-కర్ణాటక (ఆకాంక్షాత్మక జిల్లా కలబురిగి సహా) రాష్ట్రాల పరిధిలోని సుమారు 3,108 గ్రామాల్లో దాదాపు 47.34 లక్షల జనాభాకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య 173 కిలోమీటర్ల పొడవైన సికింద్రాబాద్ (సనత్‌నగర్) - వాడి మార్గంలో 3వ, 4వ లైన్ల నిర్మాణానికి రూ.5012 కోట్లు వెచ్చిస్తారు. ఇది పూర్తి కావడానికి 5 సంవత్సరాలు పడుతుంది. ఇక బీహార్‌లో 53 కిలోమీటర్ల పొడవైన భాగల్పూర్ - జమాల్పూర్ 3వ లైన్ నిర్మాణానికి రూ.1156 కోట్లు వెచ్చిస్తారు. అస్సాం పరిధిలో రూ.3634 కోట్లతో చేపట్టే 194 కిలోమీటర్ల పొడవైన ఫర్కేటింగ్ - న్యూ తీన్‌సుకియా డబ్లింగ్ పనుల పూర్తికి నాలుగేళ్లు పడుతుంది.
గుజరాత్‌లోని కచ్ పరిధిలో ప్రతిపాదిత కొత్త మార్గంతో సుదూర ప్రాంతాలకు అనుసంధానం మెరుగవుతుంది. దీనిద్వారా రాష్ట్రంలోని ప్రస్తుత రైల్వే నెట్‌వర్క్‌కు 145 రూట్ కిలోమీటర్లు అదనంగా పెరగడంతోపాటు రూ.2,526 కోట్లతో 164 ట్రాక్ కిలోమీటర్ల మార్గం ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టు సుమారు 3 సంవత్సరాల్లో పూర్తి కానుండగా రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఉత్తేజం లభిస్తుంది. అలాగే ఉప్పు, సిమెంట్, బొగ్గు, క్లింకర్, బెంటోనైట్ రవాణా సదుపాయం కలుగుతుంది. వ్యూహాత్మక ప్రాముఖ్యంగల ఈ మార్గం ప్రధానంగా ‘రాన్ ఆఫ్ కచ్’ను అనుసంధానిస్తుంది. అలాగే హరప్పాలోని ధోలావీర, కోటేశ్వర్ ఆలయం, నారాయణ్ సరోవర్-లఖ్‌పత్ కోట తదితరాలు కూడా ఈ నెట్‌వర్క్ పరిధిలోకి వస్తాయి. కొత్తగా 13 రైల్వే స్టేషన్లు నిర్మితం కానుండగా, 866 గ్రామాల్లోని దాదాపు 16 లక్షల జనాభాకు ప్రయోజనం కలుగుతుంది.
రైలు మార్గాల సామర్థ్యం పెరగడం వల్ల రవాణా సదుపాయం గణనీయంగా పెరుగుతుంది. దీంతో భారత రైల్వేలకు మెరుగైన కార్యాచరణ సామర్థ్యం, సేవలపరంగా విశ్వసనీయత పెరుగుతాయి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవ భారత్ దృక్కోణానికి అనుగుణంగా ఈ ప్రతిపాదిత మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టుల వల్ల కార్యకలాపాల క్రమబద్ధీకరణ సహా రద్దీ కూడా తగ్గుతుంది. ఆయా ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధి ద్వారా ప్రజానీకం ఉపాధి/స్వయం ఉపాధి అవకాశాలు పెరుగతాయి.
పీఎం-గతి శక్తి జాతీయ బృహత్ ప్రణాళిక ప్రాతిపదికగా ఈ ప్రాజెక్టులను రూపొందించారు. సమీకృత వ్యూహం, భాగస్వామ్య సంస్థలతో సంప్రదింపుల ద్వారా సిద్ధం చేసిన ఈ ప్రణాళిక ప్రధానంగా బహుళ-రవాణా సాధన అనుసంధానం, రవాణా సంబంధిత సదుపాయాల సామర్థ్యం పెంపుపై దృష్టి సారించింది. మొత్తం మీద తెలంగాణ, కర్ణాటక, బీహార్, గుజరాత్, అస్సాం రాష్ట్రాల్లో 13 జిల్లాల పరిధిలో చేపట్టే ఈ 4 ప్రాజెక్టులు భారత రైల్వేల ప్రస్తుత నెట్‌వర్క్‌కు దాదాపు 565 రూట్ కిలోమీటర్ల మేర అదనంగా జోడిస్తాయి.
బొగ్గు, సిమెంట్, క్లింకర్, ఫ్లైయాష్, స్టీల్, కంటైనర్లు, ఎరువులు, వ్యవసాయ సామగ్రి, పెట్రో ఉత్పత్తులు వగైరాల రవాణాకు ఇవి ప్రధానంగా దోహదం చేస్తాయి. సామర్థ్యం పెంపు పనుల వల్ల ఏటా 68 మిలియన్ టన్నులు (ఎంటీపీఏ) మేర అదనంగా సరకు రవాణా అవుతుంది. రైలు మార్గాలు పర్యావరణ హితం, ఇంధన పొదుపు సామర్థ్యం గలవి కాబట్టి, వాతావరణ మార్పు లక్ష్యాల సాధనలో తోడ్పడతాయి. దీంతోపాటు రవాణా సంబంధిత వ్యయాల తగ్గింపు, చమురు దిగుమతి (56 కోట్ల లీటర్లు) తగ్గుదల, కర్బన ఉద్గారాల (360 కోట్ల కిలోల మేర) తగ్గింపులో సహాయపడుతుంది. ఇది 14 కోట్ల మొక్కల పెంపకానికి సమానం.
బొగ్గు, కంటైనర్లు, సిమెంట్, వ్యవసాయ సామగ్రి, ఆటోమొబైల్, పీఓఎల్, ఇనుము-ఉక్కు తదితర వస్తు రవాణాకు కీలక మార్గాల్లో సామర్థ్యం పెంపు ద్వారా రవాణా సదుపాయం మెరుగుపరచడం ప్రతిపాదిత ప్రాజెక్టుల లక్ష్యం. ఇవి సరఫరా శ్రేణిని గరిష్ఠంగా మెరుగుపరచి, ఆర్థిక వృద్ధి వేగం పెంచుతాయని అంచనా.
***
(Release ID: 2161350)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam